జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-48

1
10

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

[dropcap]“I[/dropcap]n bringing the light of the true religion to the region, Hamadani becomes responsible for bringing civilization in the more concrete sense.”

– A Second Ali – The Making of Sayyid ‘Ali Hamadiini in Popular Imagination, by Jamal J. Elias

కశ్మీరు, బాల్టిస్తాన్, తజకిస్తాన్, పాకిస్తాన్ లలో అత్యంత ప్రాచుర్యం పొందిన హమదానీ గురించి ముస్లిం పండితులు లోతైన పరిశోధనలు చేశారు. కొందరు ఆయనను రెండవ ‘అలీ’గా నిరూపించాలని ప్రయత్నించారు. అయితే, హమదానీ గురించి పరిశోధనలు ఎంత లోతుగా సాగుతున్నా, అతని అభిమానుల సంఖ్య ఎంతగా పెరుగుతున్నా, ఇతర సూఫీలకు లభించినంత ఆదరణ, గౌరవాలు హమదానీలకు లభించకపోవటం ఆయన అభిమానులకు తీవ్రమైన నిరాశను కలిగిస్తోంది. అందుకు వారు గుర్తించిన కారణం “I believe the main reason for the lack of devotion around a shrine or khanqah of Hamadani is because he is not venerated for Sufi saintly activities or for charisma. Rather, he is revered as the bringer of Islam to a place – Kashmir – and so is not seen like other Sufis for whom conversion of Hindu and Buddhist population of South Asia was only one important activity.”

ఇతర సూఫీల లాగా హమదానీ సమాధి పవిత్ర పర్యాటకుల స్థలం, భక్తుల గమ్యం కాకపోవటానికి కారణం, ఇతర సూఫీలలాగా, హమదానీ కశ్మీరుకు చెందిన హిందువులను, బౌద్ధులను మతం మార్చటంపై దృష్టి కేంద్రీకరించపోవటం. ఆయన కశ్మీరును ఇస్లాంమయం చేసినవాడిలా మాత్రమే గౌరవం పొందుతున్నాడు. అంతే తప్ప, ఇతర సూఫీల్లా ప్రార్థనలు అందుకోవటం లేదు అని తీర్మానించారు. అంటే, మతం మార్చేవారు అందుకునే ప్రార్థనలు, ఇస్లాంను ప్రచారం చేసిన వారికి లభించదన్న మాట! అంతేకాదు, ఆయన గురించి వ్యాఖ్యానించేవారు, ఆయన కశ్మీరు వంటి ప్రాంతాలకు నాగరికతను తీసుకువచ్చాడు అని అభిప్రాయపడుతున్నారు. ఇస్లామీయులు అలాగే అంటున్నారు. మన దేశానికి వచ్చిన బ్రిటీష్ వారూ అలాగే అంటున్నారు. మనగురించి మనమూ అలాగే మనం అనాగరికులం అని అనుకుంటున్నాము. బానిసత్వం తరతరాల మనస్తత్వాలను ఎలా ప్రభావితం చేస్తుందో పరిశీలించేవారికి మనం చక్కని సబ్జెక్ట్. ఒకవైపు ఆద్యంతాలు లేనినాగరికత మనది, అందరికన్నా గొప్ప నాగరికత మనదీ అంటాం. మరోవైపు ఇక్కడికి వచ్చిన ప్రతివాడూ అనాగరికులయిన మనల్ని ఉద్ధరించినవాడే. అయినా మనం ఇతరులతో పోల్చుకుని ఇంకా అనాగరికులమే అని నమ్ముతున్నాం.

కానీ తరచి చూస్తే హమదానీ తండ్రీ కొడుకులు ఇద్దరూ, తమ వెంట వచ్చిన అనుచరులతో కశ్మీరును సంపూర్ణంగా రూపాంతర మొందించారన్నది కాదనలేని సత్యం. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, భారతదేశంలో ఇతర సూఫీలకు ఇస్లామేతరులను ఇస్లాం లోకి మార్చటంలో సుల్తానుల అండదండలు పుష్కలంగా లభించాయి. పలు సందర్భాలలో రాజులను దండయాత్రలకు ప్రేరేపించి సైన్యంతో పాటుగా గ్రామాలలో ప్రవేశించి పరాజితులను మతం మార్చటంలో సూఫీలు ప్రధాన పాత్ర పోషించారు. రాజుల అండదండలు ఉండడం, యుద్ధాలలో ఓడినవారు గెలిచినవారి పట్ల చూపే వినయ విధేయతలు, భక్తి ప్రపత్తుల వల్ల కూడా ఈ సూఫీల చుట్టూ పలు మహత్తరమైన గాథలు ఏర్పడ్డాయి. వారు పూజలు అందుకునే స్థాయికి చేరుకున్నారు. కానీ కశ్మీరులో హమదానీల పరిస్థితి ఇందుకు భిన్నం.

కశ్మీరులో సుల్తానుల పాలన ఉన్నా, ప్రజలు అధికులు ఇస్లామేతరులు. రాజ్యం భారతీయుల నుండి సుల్తానుల చేతుల్లోకి వెళ్ళినా, రాజ్యంలో కీలకమైన పదవులలో ఉన్నది భారతీయులే. దాంతో హమదానీలకు తమ మత ప్రచారానికి సుల్తానుల నుంచి అంతగా సహాయ సహకారాలు లభించలేదు. అందుకే మీర్ సయ్యద్ హమదానీ కశ్మీరు సుల్తాన్ సహాయ సహకారాలు  అందించడం లేదన్న ఆగ్రహంతో కశ్మీరును విడిచి వెళ్ళాడు.

సయ్యద్ హమదానీ కొడుకు మహమ్మద్ హమదానీ కశ్మీరుకు వచ్చేసరికి పరిస్థితులు మారుతున్నాయి. తండ్రి హమదానీ వెంట వచ్చిన అనుచరులు కశ్మీరు నలుమూలలా విస్తరించి చేస్తున్న ప్రచార ప్రభావం వల్ల కశ్మీరులోని ఇస్లామీయులలో తాము పాలకులు అన్న భావన పెరుగుతోంది. రాజు తమ మతస్తుడు కాబట్టి తమకు ప్రత్యేకమైన హక్కులుండాలన్న ఆలోచన బలపడుతోంది. ఈ సమయంలోనే సికందర్, బాలుడు, అధికారానికి వచ్చాడు. అతడు అధారంగా ఇస్లామీయులు తమ ప్రాబల్యం పెంచుకోవాలని; భారతీయులు ఇస్లామీయుల అధికారం తగ్గించాలని పోటీ పడ్డారు. ఈ పోరాటంలో సికిందర్ తన మతం వారి వల్లనే తనకు రక్ష అని భావించాడు. ఈ సమయంలో మహమ్మద్ హమదానీ సికిందర్‍కు చేరువయ్యాడు. సికందర్‍కు గురువయ్యాడు. రాజు మహమ్మద్ హమదానీకి దాదాపు బానిస అవటంతో, కశ్మీరులో హమదానీ ప్రాధాన్యం పెరిగింది. అతని మెప్పు పొందడం కోసం, ప్రతి ఒక్కరూ ప్రయత్నించటం స్వాభావికం. హమదానీ మెప్పు పొంది, సుల్తాన్ కరుణకు పాత్రులయ్యేందుకు, రాజు కొలువులో ఉన్న వారంతా ఇస్లామ్‌ను స్వీకరించటం ప్రారంభించారు. ఇస్లామ్‍ను స్వీకరించటంతో ఆగకుండా, ఇంకా ఇస్లాం స్వీకరించని వారిపై ఒత్తిడి తెచ్చారు. మతం మారని వారిని హింసించటం ప్రారంభించారు. ఈ రకంగా తన తండ్రి ఆరంభించి అసంపూర్ణంగా వదిలిన కార్యం, కశ్మీరును ఇస్లాంమయం చేయటం, అతని కొడుకు మహమ్మద్ హమదానీ పూర్తి చేశాడు.

“Just after his arrival in Kashmir Mir Muhammad Hamadani adopted the methodology of his father and the Islamization of Kashmir became his prime focus during his stay in Kashmir.” [Mir Muhammad Hamadani and his Contribution towards Islamisation of Kashmir, Muhammad Shafi Bhat]

కశ్మీరును ఇస్లాంమయం చేసేందుకు తన వెంట వచ్చిన మూడు వందలకై పైగా సూఫీ ప్రచారకులను కశ్మీరు నలుమూలలకు పంపాడు. తాను రాజు ఆస్థానంలో ఉండి రాజును, ప్రముఖులను, శక్తిమంతులను ప్రభావితం చేశాడు. మదరాసాలు, ఇస్లాం న్యాయ పాఠశాలలు, ఫత్వాలు జారి చేసే సంస్థలు, మసీదులు, ‘ఖన్‌కాహ్’ లను కశ్మీరు నలుమూలలా స్థాపించాడు. దాంతో కొన్నాళ్ళలోనే ధార్మికంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా కశ్మీరులో గణనీయమైన మార్పు వచ్చింది. కశ్మీరులోని ప్రథమ ‘ఖన్‌కాహ్’ – ‘Khanqah-i-Mullah’ నిర్మాణాన్ని హమదానీ స్వయంగా పర్యవేక్షించాడు. కశ్మీరులో హమదానీ తండ్రి మతపరమైన పవచనాలు చెప్పిన స్థలంలో 1396లో ఈ నిర్మాణం జరిగింది. ‘Khanqah-i-Mullah’ నిర్మాణంతో హమదానీ సంతృప్తి పడలేదు. కశ్మీరు అడుగడుగునా ప్రజలకు ఇస్లాం బోధించి, వారిని ప్రభావితం చేసి, జనులకు విద్యా బోధన, నైతిక విలువల బోధన గావించే ‘ఖన్‌కాహ్’ లను నిర్మించాడు. ‘వాచి’లో ‘ఖన్‌కాహ్-ఇ-వాలా’, మట్టన్ వద్ద ‘ఖన్‌కాహ్-ఇ-కుబ్రవియా’, సోపోర్  వద్ద ఖన్‌కాహ్, త్రాల్ వద్ద ‘ఖన్‌కాహ్-ఇ-పనాహ్’, మొంఘావాలో ‘ఖన్‌కాహ్-ఇ-అమీరియా’, పుల్వామాలో ‘ఖన్‌కాహ్-ఫైజ్-ఇ-అమీర్’, లేహ్ వద్ద ఖన్‌కాహ్, దూరూ షహబాద్‍లో ‘ఖన్‌కాహ్-ఇ-ఆలా’ లు నిర్మించాడు హమదానీ. ఈ ఖన్‌కాహ్‌లలో మత ప్రచారం, మత విద్య, నైతిక విలువలు బోధించటమే కాదు, సూఫీ మత ప్రచారం చేస్తూ దేశం తిరిగే ప్రయాణికులకు విశ్రాంతి గృహాలుగా కూడా ఇవి పనిచేసేవి. వీటిని నడిపేందుకు ఆస్తులను, ఒక పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేశాడు హమదానీ. కశ్మీరును ఇస్లాంమయం చేయటంలో హమదానీ నిర్మించిన ‘ఖన్‌కాహ్‍లు’ ప్రధాన పాత్ర పోషించాయి.

శ్రీనగర్ లోని నౌహట్టా వద్ద జామియా మసీద్‍ను నిర్మింపజేసింది మహమ్మద్ హమదానీయే. కశ్మీరులో ఇస్లాంకు ప్రతీకగా ఎదిగింది ఈ మసీదు. కశ్మీరులో ముస్లింల రాజకీయ, సాంఘిక, ఆర్థిక సవాళ్ళను, అభిప్రాయలను వ్యక్తపరిచే వేదికగా కశ్మీరు చరిత్రలో నిలుస్తుందీ మసీదు. 1394లో సికందర్ సలహా మేరకు నిర్మితమైన ఈ మసీదును ఈనాటికీ బాయెద్ మసీదు, Grand Mosque of Kashmir గా పిలుస్తారు. ఈ మసీదులో సలాహ్ (ప్రార్థన) కోసం 33333 మంది భక్తులు సమావేశమవచ్చు. ఈ జామియాలో రమజాన్ సమయంలో లక్షకు పైగా భక్తులు జమాహ్  సలాహ్ ప్రార్థనలు చేస్తారు. కశ్మీరు సాంఘిక, ధార్మిక, రాజకీయ అభివృద్ధి కోసం ఈ మసీదు ప్రవక్తలు ‘మీర్వాయిజ్-ఇ-కశ్మీరు’లు చరిత్ర కాలం నుంచి ఈనాటి వరకూ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. జామియా మసీదు వద్దే ఆస్పత్రి ‘షిఫా-ఖానా’ మహమ్మద్ హమదానీ సలహాతో నిర్మితమైంది. దాని పక్కనే జామియా కళాశాల నిర్మితమైంది. మధ్య ఆసియా నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ కళాశాలలో తత్త్వం, గణితం, తర్కం, ఆధాత్మికత వంటి ధార్మిక విషయాలు అధ్యాయనం చేసేందుకు కశ్మీరు వస్తారు. ఇలా కశ్మీరంలో అడుగడుగునా మసీదులు, వాటి వెంటనే ఆసుపత్రులు, కళాశాలలు నిర్మింపజేశాడు హమదానీ. కశ్మీరులో ఈద్ ప్రార్థనల కోసం ఈద్గా మైదానాన్ని నిర్మింప చేసింది హమదానీయే. ముస్లింల శవాలను పాతిపెట్టే శ్మశానం ‘మాల్ల్-ఖాహ్’ను శ్రీనగర్‍లో నిర్మించింది కూడా హమదానీయే.

హమదానీలు నిర్మించిన ‘ఖన్‌కాహ్’ల గురించి, మసీదుల గురించి షమ్స్ అల్-దిన్-ఇరానీ విపులంగా వర్ణించాడు ‘తుహ్‍ఫత్-అల్-అహబాబ్’ అనే గ్రంథంలో. హమదానీలు నిర్మించిన మసీదును మరో ‘కాబా’గా వర్ణించారు. అయితే, హమదానీ ఈ ‘ఖన్‌కాహ్’లలో, మసీదులలో ప్రవేశపెట్టిన ప్రార్థనా పద్ధతులు కశ్మీరు ఇస్లాంను కాలక్రమేణా చీల్చాయి. అది ప్రస్తుతానికి అప్రస్తుతం కాబట్టి, ఆ విషయాన్ని వదిలి, కశ్మీరు సాంఘిక జీవన విధనంలో హమదానీ ప్రవేశపెట్టిన తిరుగులేని మార్పులు, వాటి ఫలితాలు, పరిణామాల వైపు దృష్టి సారించాల్సి ఉంటుంది. ఆనాడు హమదానీలు కశ్మీరులో ప్రవేశపెట్టిన పద్ధతుల వలన కశ్మీరు సాంఘిక, సాంస్కృతిక జీవనం ఎంతగా ప్రభావితమై, సంపూర్ణంగా రూపాంతరం చెందిందంటే, మహమ్మద్ ఇక్బాల్ తన కవితలలో కశ్మీరును ‘ఇరాన్-ఇ-సఘీర్’ గా పలుమార్లు అభివర్ణించాడు. ‘ఇరాన్-ఇ-సఘీర్’ అంటే ‘చిన్న ఇరాన్’ అని అర్థం. అంటే భారతీయ కశ్మీరు క్రీ.శ. 13-14  దశాబ్దాల  నడుమ ‘చిన్న ఇరాన్’గా మారిందన్న మాట. ఇప్పుడు ఆ ‘చిన్న ఇరాన్’ తమది అని పాకిస్తాన్ తీవ్రవాదుల ద్వారా ప్రచ్ఛన్న యుద్ధం సాగిస్తోందన్న మాట.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here