జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-49

4
10

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

[dropcap]“T[/dropcap]here were two things which Mir Saiyid Ali Hamadani wanted to flourish in Kashmir: 1. Wahadat i.e., Unity of God. 2. Saadat, meaning leading one’s life to salvation. This is not possible without Akh-I-Halal, i.e., earning one’s living through sanctioned and legal ways. Keeping this in view Mir Saiyid Ali Hamadani placed great emphasis on Insan-I-Kamil, the perfect man.” (Shah-I-Hamadan’s contribution to learning and society, Professor H. N. Rafiabadi)

హమదానీ తండ్రీ కొడుకులు కశ్మీరును సంపూర్ణంగా రూపాంతరమొందించారు. ఇంతవరకూ మనం రాజకీయ, ధార్మిక అంశాలను గురించి చర్చించాం. ఇప్పుడు  అత్యంత ప్రధానమైన ఆర్థిక, సామాజిక వ్యవస్థ రూపాంతరం వైపు దృష్టి సారించాల్సి ఉంటుంది. ఇస్లామీయులు అడుగుపెట్టడం కన్నా ముందే కశ్మీరులో కొన్ని వేల సంవత్సరాల నుంచీ స్థిరమైన వ్యవస్థ నెలకొని ఉంది. రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులను కశ్మీరం ఎదుర్కున్నా సామాజిక వ్యవస్థపై దాని దుష్ట ప్రభావం అధికంగా పడలేదు. అయితే దుల్చా దాడి, అటు మంగోలుల దాడి కశ్మీరు వ్యవస్థని ఛిన్నాభిన్నం చేశాయి. ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రజలు పరుగులు తీశారు. జోనరాజు వర్ణన ప్రకారం ‘సృష్టి ఆరంభ స్థితికి చేరుకుంది కశ్మీరు’. అంతగా నష్టపోయింది కశ్మీరు. ఇంతలో కశ్మీరును ఇస్లాంమయం చేయటం ఉద్దేశంగా ఇరాన్ నుంచి సూఫీలు కశ్మీరంలో పెద్ద ఎత్తున అడుగుపెట్టారు. హమదానీ తండ్రీ కొడుకులు ఒక పద్ధతి ప్రకారం కశ్మీరును అన్ని రంగాలలోనూ రూపాంతరం చెందించారు.

సయ్యద్ హమదానీ దృష్టిలో ఎవ్వరూ ఎవ్వరి మీదా ఆధారపడకుండా జీవనం కొనసాగించాలి. ముఖ్యంగా తమ జీవితాన్ని దైవానికి అంకితం చేసిన సూఫీలు తమ జీవికను తామే సంపాదించుకోవాలి అన్న హమదానీ సిద్ధాంతం కశ్మీరు జీవన విధానంపై తీవ్రమైన ప్రభావం చూపింది.

“Shah-Hamadan was quite aware of the benefits of the trade, commerce and other means of earning livelihood. So he introduced the pattern prevailing in the central Asia. Mir Saiyid Ali Hamadani’s keen interest inspired the sultan Qutub-ud-din to introduce the modes of life befitting the Muslim court and society.” (Socio economic history of Kashmir, P.N.K Bamzai)

ఇస్లాం ప్రవేశంతో కశ్మీరు సమాజం కూడా రూపాంతరం చెందింది. సాంప్రదాయిక వ్యవస్థలు ఛిన్నాభిన్నమయ్యాయి. అంతవరకూ రెండు రకాల ఆర్థిక వ్యవస్థలు సమాంతరంగా నడిచేవి.  రాజు ఆధారంగా నడిచే ఆర్థిక వ్యవస్థ ఒకటయితే, మందిరం ఆధారంగా ఎదిగే ఆర్థిక వ్యవస్థ మరొకటి ఉండేది. రాజు మందిర ఆర్థిక వ్యవస్థలలో జోక్యం చేసుకునేవాడు కాదు. కానీ అవసరమైనప్పుడు రాజుకు మందిర ఆర్థిక వ్యవస్థ సహాయం చేసేది. అంటే రాజుపై ఆధారపడిన వ్యవస్థ మందిర ఆర్థిక వ్యవస్థపై, మందిర ఆర్థిక వ్యవస్థ రాజుపై ఆధారపడి సమాజానికి ఆర్థిక పటిష్టతను ఆపాదించేవి అన్నమాట. ఈ రకమైన పరస్పర సహకారం కేంద్రంగా ఒకరిపై ఒకరు ఆధారపడటం సామాజిక జీవనంలోనూ కనిపించేది.

వ్యక్తి ఉద్యోగం, జీవిక కోసం చేసే పనితో సంబంధం లేకుండా ఒకరిపై ఒకరు ఆధారపడి, ఒకరినొకరు గౌరవించుకుంటూ, పరస్పర సహకారంతో సామాజిక జీవనం సాగేది. కల్హణ రాజతరంగిణిలో పలు సందర్భాలలో వ్యక్తి పుట్టుక, వృత్తి, విద్యార్హత వంటి విషయాలతో సంబంధం లేకుండా వ్యక్తిని గౌరవించిన సందర్భాలు అనేకం కనబడతాయి. బ్రాహ్మణుడు అన్నవాడికి అతని ప్రవర్తన వల్ల, విజ్ఞానం వల్ల గౌరవం లభించటం కనిపిస్తుంది. అయితే, కశ్మీరులో రాజకీయ వ్యవస్థలో కలుగుతున్న మార్పులు ఆర్థిక, సామాజిక వ్యవస్థలపై, వ్యక్తుల నడుమ సంబంధాలపై అంతగా ప్రభావం చూపిన దాఖలాలు కనబడవు.  కానీ మంగోలుల దాడుల వల్ల సమాజం అస్తవ్యస్తం అవటం కనిపిస్తుంది. ఆ దాడుల నుంచి తట్టుకునేందుకు రాజులు ప్రజలపై విచక్షణారహితంగా పన్నుల భారం మోపటం కనిపిస్తుంది. అంతవరకూ కనీ వినీ ఎరుగని రీతిలో కశ్మీరీయులను చెరబట్టి బానిసలుగా అమ్మేయటం కనిపిస్తుంది. దీన్నుంచి తట్టుకుని, కశ్మీరీయులు తేరుకునేలోగా, సుల్తానుల పాలన, ఇస్లామీ వ్యవస్థల అమలు ఆరంబించటంతో తిరుగులేని రీతిలో కశ్మీరు రూపాంతరం చెందింది. ఈ విషయాన్నే మరో రకంగా చెప్పారు చరిత్ర విశ్లేషకులు.

“Mir Saiyid Ali Hamadani’s impact is quite clear on the economy and society of the valley because the economy was declining due to the failed political policies, wrong taxation policies, feudal system, reduced participation in agriculture and degradation in morals.” (Influence of Mir Saiyid Ali Hamadani on Vocational Education in Kashmir – Mehraj Din Dar, Dr. Nighat Basu)

ఓ వైపు రాజ్యం కోసం జరిగే కుట్రలు, పోరాటాలు; మరో వైపు శత్రువుల దాడులు, ఇంకోవైపు విదేశీ శక్తుల దాడులు, వీటన్నిటి నడుమ సామాన్య జనజీవితం నలిగిపోతూ వస్తోందన్న మాట. పంటలను తగులబెట్టడం, యువకులను, పని చేయగల శక్తి కలవారిని బానిసలుగా అమ్మేయటం, కశ్మీరం వదిలి పారిపోవటం వంటి అనేకానేక సంఘటనల వల్ల కశ్మీరు వ్యవస్థ అల్లకల్లోలంగా ఉంది. ప్రజలు తమ సాంప్రదాయిక జీవన విధానాన్ని కోల్పోయి కొత్త కొత్త జీవన విధానాలు వెతుక్కుంటున్నారు. ఈ పరిస్థితిలో కశ్మీరులో అడుగుపెట్టిన హమదానీ రాజును ప్రభావితం చేశాడు. కశ్మీరీయులను ఇస్లాం వైపు ఆకర్షిస్తూ, ఇస్లామీ జీవన పద్ధతులను, వృత్తులను కశ్మీరులో – అంతవరకూ నెలకొని ఉన్న సాంప్రదాయ జీవన విధానాల  స్థానంలో ప్రత్యామ్నాయంగా ప్రవేశపెట్టాడు. ఈ నూతన ఆర్థిక వ్యవస్థ ఇస్లాం మతం ఆమోదించిన వృత్తుల ఆధారంగా ఏర్పడిన ఆర్థిక వ్యవస్థ. అంటే ఇస్లామీ దేశాలలో ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఏర్పడి ఉందో, దాన్ని ఇక్కడ కశ్మీరులో ఉన్న ఆర్థిక వ్యవస్థను తొలగించి, ఆ స్థానంలో ప్రతిష్ఠించాడన్న మాట.

భారతీయ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరిణామ క్రమాన్ని విశ్లేషించే అధికులు ఈ అంశాన్ని చూసీ చూడనట్టు వదిలేస్తారు.

హమదానీ కశ్మీరులో ప్రవేశపెట్టిన “modeling was based primarily on introduction of arts and crafts, a technique in central Asia and secondarily on the mineral resources and renovated irrigation system meant to improve the lots of masses.” (Socio Economic History of Kashmir, P.N.K Bamzai)

ఈ పద్ధతికి ఎవరిపై ఆధారపడకుండా డబ్బులు సంపాదించుకోవాలనే సూఫీ సిద్ధాంతాన్ని జోడించటంతో, రాజుపై ఆధారపడి ఎదిగిన వ్యవస్థ సంపూర్ణంగా దెబ్బతిన్నది. మందిరాలను ధ్వంసం చేయటం, పూజలు, సంబరాలను నిషేధించటం వంటి చర్యలు మందిరాల ఆధారంగా ఎదిగిన వ్యవస్థను దెబ్బతీసింది. ఇలా పరస్పర సహకారంతో సమాంతరంగా నడుస్తూ వచ్చిన వ్యవస్థలు రెండూ సంపూర్ణంగా దెబ్బ తినడంతో ఎవరి జీవిక కోసం వారు పోరాడాల్సి వచ్చింది. ఇది అంతవరకూ సమాజంలో వ్యక్తుల నడుమ ఉన్న సమతౌల్యాన్ని, పరస్పర సహకార భావనలను దెబ్బతీసింది. భారతీయ సామాజిక, ఆర్థిక, ధార్మిక, మానసిక వ్యవస్థలలో ‘మందిరం’ ప్రధాన పాత్ర పోషిస్తుంది. మందిరం ఆధారంగా నగరాలు వెలిశాయి. నగరాల్లో ప్రజల జీవన విధానాలు ఏర్పడ్డాయి. అలాంటి ఒక మందిరం ధ్వంసం అవటం అంటే, ఒక నగర జీవన వ్యవస్థ ఛిన్నాభిన్నం అవటం అన్నమాట. ఆశ్రయమున్న వృక్షం కూలితే దానిపై నివాసమున్న పక్షులు చెల్లాచెదురయినట్లు, మందిరంపై ఆధారపడిన వారంతా చెల్లాచెదురవుతారు. ‘మందిరం’ ధ్వంసం అవటం వల్ల ‘బ్రాహ్మణులకే కష్టం’ అన్న అభిప్రాయాన్ని ఒక పద్ధతి ప్రకారం సమాజంలో ప్రవేశపెట్టారు. కానీ మందిరం దెబ్బతింటే కేవలం బ్రాహ్మణులే కాదు దెబ్బతినేది, దానిపై ఆధారపడిన సమస్త సమాజం దెబ్బతింటుంది – సామాజికంగా, ఆర్థికంగా, ధార్మికంగా, మానసికంగా!

“He (Saiyid Hamadani) was a great propounder of earning one’s own livelihood and rejected the traditional means of patronage and support open to religious men. This has evidence when he rejected the idea of charity for religious men or orders because he hated the concept of parasitology and himself earned his living by cap making and encouraged his followers to do the same.” (Sahib-I-Mawadatul Qurba – Hakim, S. M. Kamaludin Hussain)

అంటే, ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా మత ప్రచారకులు కానీ, ధార్మికులు కానీ తమ జీవికను తామే సంపాదించుకోవాలన్న మాట. హమదానీ తనకు కావల్సిన ధనాన్ని టోపీలు కుట్టి సంపాదించుకున్నాడు. ఇతరులు కూడా దయాదాక్షిణ్యాలు, దాన ధర్మాలపై ఆధారపడకుండా తమ జీవికకు అవసరమైన ధనాన్ని తామే సంపాదించుకోవాలి అన్నాడు.

భారతీయ ధార్మిక వ్యవస్థలో దానధర్మాలు ఒక విడదీయరాని బాగం. ఎప్పుడయితే దానధర్మాలు ‘కూడని’ పని అయిందో, వాటిపై ఆధారపడి జీవించే వారంతా ‘కూడని’ రీతిలో జీవికను సంపాదిస్తున్న వారయ్యారు. అలాంటి వారిలో ప్రప్రథమంగా రాజుపై, ప్రజలపై, మందిరంపై, దైవంపై, విశ్వాసంపై  ఆధారపడి జీవించే బ్రాహ్మణ వ్యవస్థ నిలుస్తుంది. అందుకే ఈనాడు ఉత్పత్తి కులాలు, తేరగా కూర్చుని తినే కులాల విభజనలో కూడా బ్రాహ్మణులే నేరస్థులుగా, దోషులుగా కనబడతారు. దూషణలను అనుభవిస్తారు. భారతీయ వ్యవస్థ గురించి అధ్యయనం, అవగాహన లేని వారు చేసి, ప్రచారం చేసే  ఆరోపణలు అవి.

హమదానీ టోపీలు కుట్టి జీవికను సాగించేవాడు. టోపీలు కుట్టడం భారతీయ వ్యవస్థకు పరిచయం లేని వృత్తి. అలాగే, ఇస్లామీయులు, , ఇతరుల నుంచి వేరుగా గుర్తించేట్టుండేందుకు ఇస్లామీయులు ప్రత్యేక దుస్తులను ధరించాలన్నాడు. ఆ దుస్తులను తయారు చేయటం ప్రత్యేక వృత్తిగా ఎదిగింది. ఇలా ఒకటొకటిగా భారతీయ వ్యవస్థకు పరిచయం లేని కొత్త కొత్త వృత్తులు కశ్మీరీ సమాజంలో అడుగుపెట్టాయి. సుల్తానులు ఈ వ్యవస్థలకు మద్దతునివ్వటంతో, ఆయా వృత్తులు భారతీయ సమాజంలో స్థిరపడటం ప్రారంభించాయి. అయితే ఇవి మాత్రమే కాదు, ఇంకా అనేక నూతన వృత్తులు సమాజంలో ప్రవేశించాల్సి వచ్చింది.

మందిర నిర్మాణం, గోడలపై శిల్పాలు చెక్కటం, మందిరంలో మూర్తులను తయారు చేయటం, మందిరంలో పూజలకు అవసరమైన వస్తువులు అమ్మేవారూ, ఆలయంలో రకరకాల పూజలలో తమవంతు పాత్రలు పోషించటమే జీవికగా కలవారు, ఇలా అనేకానేకులు    వృత్తులు దెబ్బతిన్నాయి. ఉన్న మందిరాలే ధ్వంసం అవుతున్నప్పుడు వీరి అవసరం సమాజానికి తీరిపోయింది. దాంతో వారి జీవిక ప్రశ్నార్థకంలో పడింది. మతం మారినా వారి జీవిక ప్రశ్నార్థకమే. అందుకని ఇస్లామీయుల వృత్తి నైపుణ్యాలు, కళలు, కశ్మీరులో  ప్రవేశించాయి. ఇలా ప్రమాదంలో పడ్డ, నశించిన అనేక వృత్తుల స్థానే నూతన వృత్తులు, ఇస్లామీ ధర్మం ఆమోదం పొందిన వృత్తులు కశ్మీరంలో అడుగుపెట్టాయి, స్థిరపడ్డాయి. కశ్మీరీ వ్యవస్థను సంపూర్ణంగా మార్చివేశాయి. అందుకే హమదానీని ‘Father of Kashmiri Arts and Crafts’ అని అంటారు. ఈయన వెంట వచ్చిన 700 పైగా అనుచరులు, ఒక్కొక్కరూ ఒక్కో వృత్తిలో నిష్ణాతులు, కశ్మీరు నలుమూలలా విస్తరించారు. నూతన జీవన విధానాన్ని ప్రవేశపెట్టారు. ‘Religious emancipation is incomplete without economic emancipation’ అన్నది హమదానీ సూత్రం.

“By encouraging the spirit of new arts and crafts he unleashed what one writer calls ‘an industrial revolution’ which slowly freed the masses from the exploitation of the Brahmins. further the positive worth that the shah placed on manual labour was in marked contrast to the contempt with which the Brahmins looked down upon workers and artisans, but Saiyid Ali Hamadani, by popularizing various new crafts and making the economically oppressed sections of the society, helped to build their self-confidence and self-respect and pride in their work.” (Influence of Mir Saiyid Ali Hamadani on Vocational Education in Kashmir – Mehraj Din Dar, Dr. Nighat Basu)

ఇదీ ఆధునిక చరిత్ర విశ్లేషకులు భారతీయ చరిత్రను అందిస్తున్న విధానం.  కశ్మీరీ ప్రజల జీవిక అల్లకల్లోలమై, ప్రాణాలు అరచేత పట్టుకొని, ధర్మాన్ని కాపాడుకోవటం కోసం కశ్మీరు వదిలి పారిపోతుంటే, మతం మారమని తీవ్రమైన హింసకు, ఒత్తిడికి గురిచేస్తుంటే  కూడా ఆ హింసను, ఒత్తిడిని తట్టుకుని ధర్మాన్ని కాపాడుకునే పోరాటాన్ని ప్రజలు జరుపుతుంటే, దాన్ని విస్మరించి, బ్రాహ్మణుల అకృత్యాలు, అన్యాయాల నుంచి అట్టడుగు వర్గాల వారిని ఉద్ధరించేందుకు హమదానీ నూతన వృత్తులను ప్రవేశపెట్టి రక్షించాడని చరిత్ర రచయితలు తీర్మానించి సమాజానికి అదే నిజం అన్నట్లు చెప్తున్నారు. అంతకు ముందు భారతదేశంలో సుస్థిరమైన సామాజిక వ్యవస్థ ఉందని, కొన్ని వేల ఏళ్లుగా, విదేశీ దురాక్రమణలను ఎదిరించి సజీవంగా నిలిచి ఉందన్న సత్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ఒకే దృష్టితో చరిత్రను విశ్లేషించటం ఇది. నిజానికి ఇలాంటి విశ్లేషణలు అసలు నిజాన్ని మరుగుపరచి, జరిగిన  సంఘటనలకు లేని రంగులు హంగులు ఆపాదించి  వక్రసత్యాన్ని సక్రమమైన సత్యంగా ప్రచారానికి తెస్తారు. సమాజాన్ని తప్పుదారి పట్టిస్తారు.

కశ్మీరులో జరిగింది వేరు. సుల్తాను మతప్రచారోత్సాహం వల్ల మారణకాండ సంభవించింది. జన జీవితం అల్లకల్లోలమైంది.  ఈ అల్లకల్లోలంలో అంతవరకూ నిలచివున్న సామాజిక భవనం కూలిపోయింది. ఆ సమయంలో, జీవిక కోల్పోయినవారికి, మతం మారటం వల్ల జీవించే వీలు లభిస్తుందన్న నమ్మకం కలిగించేందుకు, తాము  భవనం కూల్చటం వల్ల  కలిగిన  ఖాళీని పూడ్చేందుకు ఆ స్థానంలో ఇస్లామ్ ఆమోదించిన వృత్తులను ప్రవేశపెట్టారు. కశ్మీరీయులకు పరిచయం లేని వృత్తులవి. జరిగింది ఇది. కానీ, చరిత్ర రచయితలు ఇలా జరిగిందని చెప్పటంలేదు. హమదానీ నూతన వృత్తులను కశ్మీరులో ప్రవేశపెట్టటంవల్ల అల్పవర్ణాల వారిని, సామాన్యప్రజలను బ్రాహ్మణుల కరాళదంష్ట్రల బారి నుంచి తప్పించారని చెప్తున్నారు. బ్రాహ్మణులు శారీరక శ్రమను చులకన చేసేవారని, ఇందుకు భిన్నంగా సుల్తాను శారీరక శ్రమకు ప్రాధాన్యం ఇచ్చి అలాంటి వృత్తులను నేర్పటం ద్వారా, సామాన్యుల ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్నీ ఇనుమడింపచేశారని తీర్మానిస్తున్నారు. జరిగిందేమిటి? చెప్తున్నదేమిటి? మళ్ళీ మనం హమదానీని వదలి జోనరాజ రాజతరంగిణి వైపు దృష్టి సారించినప్పుడు, బ్రాహ్మణులపై జరిగిన దమనకాండ తెలుస్తుంది. ఏ రకంగా ధర్మచ్యుతులు కాకూడదని ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారో తెలుస్తుంది. కశ్మీరులో ఏ రకంగా సాంప్రదాయ వృత్తులు, జీవనవిధానాలు, మానవ సంబంధాలు అదృశ్యమై, నూతన సమాజం ఆ స్థానంలో వెలిసిందో తెలుస్తుంది.  ఇది మామూలుగా సంభవించే సామాజిక పరిణామక్రమంలో భాగంకాక, హఠాత్తుగా వున్నదాన్ని పెకిలించి ఆ స్థానంలో బలవంతంగా మరోదాన్ని అంటుకట్టటంవల్ల వచ్చిన మార్పు ఇది.  కానీ, దీన్నంతా వదలి, ఇస్లామీ జీవన విధానం బ్రాహ్మణుల అణచివేతనుంచి సామాన్యులను రక్షించిందని, అసలు నిజాన్ని వదలి  అసత్యాన్ని సత్యంగా ప్రకటిస్తున్నారు. ఆధునిక సామాజికవాదులు దీన్ని ఆధారం చేసుకుని బ్రాహ్మణ సమాజాన్ని భారతీయ సమాజానికి ప్రతీకను చేసి, అన్ని అణచివేతలకు భారతీయధర్మం, అంటే బ్రాహ్మణులే కారణమని పద్ధతి ప్రకారం ప్రచారం చేస్తున్నారు. ప్రజలను నమ్మిస్తున్నారు. సమాజంలో చీలికలు తేవాలని విద్వేషాల విషాలు వెదజల్లుతున్నారు.  కానీ, జరిగింది  ఏమిటో రాజతరంగిణి స్పష్టంగా చెప్తున్నది. గుడ్డివాడికి చేయిపట్టి దారి చూపించవచ్చు. కళ్ళున్నవాడికి దారి చెప్తే సరిపోతుంది. కళ్ళున్ నగుడ్డివాడికి ఏమి చెప్పీ లాభంలేదు. వాడేమి చూడాలనుకుంటున్నాడో దాన్నే చూస్తాడు. వాడికి సత్యంతో పనిలేదు. ఇదీ ప్రస్తుత పరిస్థితి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here