జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-5

0
11

[box type=’note’ fontsize=’16’] జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

త్రిం శబ్దే ఫాల్గుణే కృష్ణ ద్వాదశ్యాం భూమి వల్లభః।
స్వ సౌభాగ్యేన దివ్య స్త్రీ హషమ ప్రీణయత్తరామ్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 37)

[dropcap]జ[/dropcap]యసింహుడు మరణించాడు. ఫల్గుణ మాసంలో, కృష్ణ పక్షం 12వ రోజున లౌకికాబ్దం 30వ సంవత్సరంలో జయసింహుడు మరణించాడు. అతని ఆగమనం ఆకాశంలోని దివ్య స్త్రీలకు సంతోషదాయక మయింది – అంటాడు జోనరాజు.

క్రీ.శ. 1128 నుండి 1155 వరకూ జయసింహుడు కశ్మీరాన్ని పాలించాడు. సింహాసనం అధిష్టించినప్పటి నుంచీ ఎన్నో ప్రతిఘటనలను ఎదుర్కొన్నాడు. కుట్రలు, కుతంత్రాలతో అన్నిటినీ విజయవంతంగా  ఎదుర్కొన్నాడు. వీరోచితంగా పోరాడేడు. చివరిదశలో, శత్రువులందరినీ నిర్జించిన తరువాత, అత్యంత శాంతి సౌఖ్యాలను అనుభవించాడు. కశ్మీర ప్రజలకు శాంతి, సౌభాగ్యాలతో పాటు వారు దాదాపుగా మరిచిపోయిన భద్రతను ఇచ్చాడు. అందుకే పలువురు చరిత్ర రచయితలు జయసింహుడిని కశ్మీరును పాలించిన చివరి ‘గొప్పరాజు’గా అభివర్ణిస్తారు. ముఖ్యంగా, ఆయన రాజ్యం చేస్తున్న చివరి దశలో దాడి చేసిన తురుష్కరాజును ఓడించి, కశ్మీరాన్ని తురుష్కుల పరంగా కాకుండా కాపాడిన రాజుగా అయనను స్తుతిస్తారు. జయసింహుడు తురుష్కులను ఓడించి తరిమి వేశాడు. తురుష్క రాజు, తన తలపాగాను కశ్మీర రాజు పాదాల వద్ద ఉంచి, తన వద్ద  ఉన్న ధనాన్ని కశ్మీర రాజును సమర్పించి, ఓటమిని అంగీకరించి వెళ్ళిపోయాడు. ఇక్కడే దేశంలోని ఇతర భారతీయ రాజులు చేసిన పొరపాటునే, కశ్మీర రాజు జయసింహుడు కూడా చేశాడు. నిద్రిస్తూ చిక్కిన తురుష్క రాజును కానీ, సైన్యాన్ని కానీ ‘ధర్మవిరుద్ధం’ అని చంపకుండా వదిలేడు. తల వంచి ఓటమిని ఒప్పుకున్న శత్రురాజును పెద్ద మనసుతో క్షమించి వదిలాడు. తలను శరీరాన్ని వేరు చేయలేదు. కనీసం “నీ మతం వదిలి మా ధర్మం స్వీకరించు” అనలేదు. క్షమించి వదిలేసి ధర్మాన్ని పాటించానని గర్వించాడు.

ప్రతి ఒక్కరిలో దైవాన్ని దర్శించటం, ప్రతి ఒక్కరికీ జీవించే హక్కు ఉందని, తనకు ఇష్టమైన మార్గాన్ని అనుసరించే హక్కు ఉందని భారతీయులు నమ్ముతారు. శత్రువు ఎంత ధర్మ విరుద్ధంగా ప్రవర్తించినా, ఎంతటి క్రూరుడు, నీచుడు, కర్కోటకుడు అయినా వాడి లోని మానవత్వాన్ని చూసి, క్షమించి వదిలేసే సహృదయ దౌర్బల్యం భారతీయులందరికీ ప్రత్యేక లక్షణం. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ ఈ లక్షణం ప్రస్ఫుటంగా ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఆధునిక పరిభాషలో దీన్ని Killer Instinct అంటారు.  ఇది భారతీయ రాజులలోనే కాదు, ప్రజలలోనూ   కనిపించదు. అందుకే ఎదుటివాడు ఎంత  క్రౌర్యం ప్రదర్శించినా, ఎంతటి నైచ్యం ఒలకపోసినా, వాడికి వ్యతిరేకంగా ‘హింస’ జరిగిందంటే, అంతటి నీచుడిపై కూడా సానుభూతి ప్రదర్శిస్తారు. ఇతరుల జీవించే హక్కును గౌరవించని వాడి జీవించే హక్కు కోసం పోరాడుతారు. అందుకే జయసింహుడు, తన సింహాసనం నిలుపుకోవటం కోసం, తిరుగుబాటుదార్లను, కుట్రదారులను నిర్దాక్షిణ్యంగా మోసంతో చంపించినా, శత్రురాజుగా దాడికి వచ్చిన తురుష్కుడిని క్షమించి వదిలివేసాడు. అయితే, తన రాజ్యం నిలుపుకోవటం కోసం సామదానభేద దండోపాయాలను, మాయ మంత్రాలను ప్రదర్శించిన జయసింహుడిని చరిత్ర రచయితలు – “Jayasimha is the last known Hindu ruler of Kashmir, who actually possessed considerable political acumen,  unscrupulous intrigue and cunning diplomacy.” [A History of Muslim Rule in Kashmir, 1320 -1819 By R. K. Parmu] అని అభివర్ణించారు. ఇంత unscrupulous intrigue and cunning diplomacy ప్రదర్శించినా జయసింహుడు తాను ఓడించిన తురుష్క సుల్తానును క్షమించి వదిలాడు, భవిష్యత్తులో కాటేసే విష నాగుపై జాలిపడి వదిలినట్టు!

జయసింహుడి  మరణం తరువాత ప్రజలు అతడి కొడుకు, రాజ్యానికి వారసుడు అయిన పరమాణకుడిని రాజుగా సింహాసనంపై నిలిపారు. పరమాణకుడు అతి బద్ధకస్తుడు. జోనరాజు భాషలో ‘జడుడు’. ‘జడుడు’ ఎందుకంటే పరమాణకుడికి ప్రజలను రక్షించటంపై ఆసక్తి లేదు. శత్రువులను అదుపులో పెట్టి శత్రు రాజ్యాలను జయించాలన్న ఆసక్తి లేదు. పరమాణుకుడి ఆసక్తి అంతా ఐశ్వర్య సంపాదన పైనే. ఎంత ఐశ్వర్యం సంపాదించాలనుకున్నాడంటే, అనంత కాలం తరగనంత.

మహారాజు సంపాదించే సంపద వేదాలను అనుసరించే బ్రాహ్మణుడి  సంపద లాంటిది అంటాడు జోనరాజు. వేద విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకుని, పాటించే బ్రాహ్మణుడికి సంపదతో పని లేదు. అంతా దానధర్మాలలో ఖర్చయిపోతుంది. ఎందుకంటే, బ్రాహ్మణుడికి ఐశ్వర్యంపై ఆసక్తి ఉండదు. అతడి  ఆసక్తి విజ్ఞానార్జన పైనే. విజ్ఞానార్జన అంటే, ప్రపంచంలో ఏ సత్యం తెలుసుకున్న తరువాత, ఇక తెలుసుకోవాల్సినదేమీ మిగలదో అలాంటి సత్యాన్వేషణ. అలాంటి విజ్ఞానార్జన! అలాంటి వారికి ధనంతో ఏమీ పని ఉండదు. ఎంత ధనం లభించినా, దాన్ని సమాజ అభ్యున్నతికి అందజేస్తారే తప్ప తాము ఐశ్వర్యంలో తులతూగాలన్న స్పృహ కూడా వారికి ఉండదు. అంటే వేదాల్ని నమ్మే బ్రాహ్మణులకు ఐశ్వర్యంతో పని లేదు. వారికి అందిన ఐశ్వర్యం వారు అనుభవించరు. అందిన  ఐశ్వర్యం  వారిది కాదు. అంటే ఐశ్వర్యం వారు అనుభవించలేరు. దాచలేరు. రాజులు సంపాదించే ధనం కూడా రాజులకు ఎందుకూ పనికిరాదని అంటున్నాడు జోనరాజు. ఇక్కడ రాజుల సంపాదనను వేదాన్ని పాటించే బ్రాహ్మణుల ఐశ్వర్యంతో పోల్చటం వెనుక మరో అర్థం ఉంది.

తనకు అవసరం లేని దాన్ని సాధించటం పట్ల వ్యక్తికి ఎలాంటి ఆసక్తి ఉండదు. ఆసక్తి లేని దాన్ని అక్రమ మార్గంలో సంపాదించటం అన్న ఆలోచన కూడా అనౌచిత్యం. కాబట్టి రాజులు కూడా న్యాయబద్ధంగా సంపాదించాలనీ, ఆ సంపాదించింది కూడా ప్రజల కోసమే తప్ప రాజులు అనుభవించేందుకు కాదన్న సత్యాన్ని అత్యంత సూక్షంగా చెప్తున్నాడు జోనరాజు. ఇంత గూఢంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే జోనరాజు సుల్తానుల పాలనలో ఉన్నాడు. అప్పటికే కశ్మీరు వ్యవస్థలలో పండితుల నడుమ విభేదాలు, చీలికలు పొడచూపాయి.

కశ్మీరులో అంతులేకుండా కొనసాగుతున్న  అశాంతి, అల్లకల్లోలాల వల్ల సామాజిక జీవనం చిన్నాభిన్నమయింది. విజ్ఞానార్జన కన్నా ప్రాణాలను కాపాడుకోవటం ప్రధాన విషయం అయింది. ప్రజలకు, గతంలోలా పండుగలు, పబ్బాలు, దీర్ఘకాల పూజలు చేసే ఓపికా, తీరికలు లేకపోవడం, రాజులు ధనార్జన కోసం మందిరాల ఐశ్వర్యంపై ఆధారపడడం కూడా కూడా సామాజిక అల్లకల్లోలానికి తోడ్పడింది. దీనికి తోడు డామరులు ఆధిక్యం సంపాదించి, సైన్యం ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వటంతో ‘విజ్ఞానార్జన’ వెనుకబడింది. పండితులు వ్యవసాయం చేశారు. కత్తి పట్టి యుద్ధాలు చేశారు. పలు రకాల వ్యాపారాలు పొట్టకూటి కోసం చేశారు. కొందరు మాత్రం విజ్ఞానార్జనకు పరిమితమయ్యారు. సికందర్ బుత్‌షికన్ భయంకర పాలనలో కశ్మీరులో కేవలం 11 పండిత కుటుంబాలు మిగిలాయి. మళ్ళీ జైనులాబిదీన్ పాలనా కాలంలో పండిత కుటుంబాలు కశ్మీరు వచ్చి చేరాయి. అయితే వారికి ఓ సమస్య ఎదురయింది.

పండితులకు జైనులాబిదీన్ తన వద్ద ఉద్యోగాలు ఇచ్చాడు. కానీ సుల్తాను వద్ద ఉద్యోగం చేయాలంటే రాజభాష ‘పర్షియన్’ నేర్చుకోవాలి. అప్పటికే సంస్కృతాన్ని తొలగించి ‘పర్షియన్’ని రాజభాష చేశారు సుల్తానులు. ఇది పండిత కుటుంబాలలో కలవరం కలిగించింది. సంస్కృతం మాతృభాష. దేవభాష. సంస్కృతం భారతీయ ధర్మానికి పూలమాలలో దారం వంటింది. దేశంలోని భిన్న ప్రాంతాలలోని భిన్న భాషలు మాట్లాడే వారందరినీ కలిపి వారి ధర్మం, వారి సంస్కృతి, వారి దైవం ‘ఒకటే’ అని నిరూపించేది సంస్కృత భాష. అలాంటి సంస్కృతాన్ని వదిలి ‘పర్షియన్’ నేర్చుకోవటం అంటే, తమ మూలాలకు దూరం వెళ్ళటం. తమను తాము మరచి మరొకలా మారేందుకు నాందీ ప్రస్తావన. ఇది ఆనాటి కశ్మీరీ పండితులు గ్రహించారు. ఈ పరిస్థితిని తట్టుకుని తమ అస్తిత్వాన్ని నిలుపుకుంటూ జీవిక కొనసాగించేందుకు పండితులంతా కలసి కూర్చుని చర్చించి ఒక ఒప్పందానికి వచ్చారు.

పండితులలో కొందరు పర్షియన్ నేర్చుకొని రాజాస్థానంలో ఉద్యోగాలు చేయాలి. అందువల్ల వారు సంస్కృతం అంతగా నేర్చినా, నేర్వకున్నా పరవాలేదు. మరి కొందరు సంస్కృతం నేర్చుకుని సంప్రదాయాన్ని పాటించాలి. వీరు పర్షియన్ నేర్వకున్నా పరవాలేదు. సంప్రదాయాన్ని పాటించటం వల్ల, అటు ప్రాచీన సంప్రదాయం నిలుస్తుంది. ఇటు జీవిక కొనసాగుతుంది. ఇలా విభజన చేసుకోవటం వల్ల వారిలో వారు పోటీపడటం ఉండదు. పర్షియన్ నేర్చుకొని రాజోద్యోగం చేసే వారిని ‘కర్కున్’ లన్నారు. సంస్కృతం నేర్చుకుని సంప్రదాయాన్ని నిలిపేవారిని ‘భాషభట్టు’ లన్నారు. ప్రతి కుటుంబంలో కూతురి కొడుకు ‘భాషభట్టు’ అవ్వాలన్న నియమం విధించారు. ఇలా జీవిక  కొనసాగటానికి, సంప్రదాయాన్ని సజీవంగా నిలుపుకోవటానికి నడుమ ఆనాటి కశ్మీరీ పండితులు సమతౌల్యం సాధించారు.

ఇక్కడ కాస్సేపు ఆగి ఆలోచించాల్సి ఉంటుంది.

భారతీయ సమాజం గురించి ఎవరికి వారు తోచినట్టు వ్యాఖ్యానించేస్తున్నారు. తీర్మానాలు చేస్తున్నారు. భారతీయ సమాజం ‘ఆలా ఉండేది’, ‘ఇలా ఉండేది’ అని చెప్తున్నారు. కానీ ‘సమాజం’ అన్న పదం నిర్జీవం కాదు. సమాజం ఒక సమూహాన్ని సూచిస్తుంది. ‘సమూహం’ అంటే వ్యక్తుల సముదాయం. వ్యక్తులు నిర్జీవమైన అంకెలు కారు. జీవంతో తొణికిసలాడుతూ, ఆలోచనలు, ఆవేశాలు, ఆవేదనలు, ఆశలు, నిరాశలతో ఉన్న ఒక్కో వ్యక్తి ఎవరికి వారు ప్రత్యేకం. అలాంటి ప్రత్యేక వ్యక్తిత్వం కల వ్యక్తులంతా కలసికట్టుగా ‘సమూహం’, ‘సమాజం’గా గుర్తింపు పొందుతున్నారు. ఇలా గుర్తింపు పొండడం వల్ల, విశ్లేషించేవారు వ్యక్తిత్వాలను పట్టించుకోకుండా ఏదైనా సమూహానికి ఆపాదించేస్తున్నారు, తీర్మానిస్తున్నారు. కానీ భారతీయ చరిత్ర రచయితలు సమాజాన్ని జీవం, వ్యక్తిత్వం లేని ముద్దగా భావించలేదు. సమాజంలోని వ్యక్తుల వ్యక్తిత్వాలను ప్రదర్శిస్తూ సమష్టి వ్యక్తిత్వాన్ని తెలుపుతూ జీవంతో తొణికిసలాడే చైతన్యవంతమైన సమాజ చిత్రణ చేశారు.

ఒకసారి మనం ఆ కాలం నాటి మనుషులు వ్యక్తిగతంగా, మానసికంగా ఎలాంటి ఆందోళనలు, సందిగ్ధాలు, సంక్షోభాలు అనుభవించారోనని ఆలోచిస్తే గుండె ఆగిపోతుంది. కడుపు తరుక్కుపోతుంది. తమ దైవం, తమ సంస్కృతి సంప్రదాయం, తమ జీవన విధానం సర్వం ప్రమాదంలో ఉన్నాయి. పాము పడగ నీడలో, కత్తి మెడపై ఉండగా జీవికను కొనసాగించవలసి వస్తోంది. అయినా వారు ధర్మాన్ని వదలలేదు. దైవాన్ని వదలలేదు. సంస్కృతి సంప్రదాయాలను వదలలేదు. తమ జీవికను కొనసాగిస్తూ, సంస్కృతి సంప్రదాయాలను సజీవంగా నిలుపుకుంటూ జీవికను సాగించేందుకు సమకాలీన పరిస్థితులతో రాజీపడ్డారు. ప్రవహించే నదికి కొండ అడ్డు వచ్చినప్పుడు, ఆ కొండ పక్కనుండి మలుపు తిరిగి ప్రవహించే సజీవ లక్షణం భారతీయ ధర్మం ప్రదర్శించింది. భారతీయ సమాజం పరిస్థితులతో రాజీ పడుతూ కూడా తన అస్తిత్వాన్ని నిలుపుకునే పథకం వేసింది. ఒక సజీవ నది లక్షణం ప్రదర్శించింది. భారతీయ సమాజాన్ని విశ్లేషించి వ్యాఖ్యానించేవారు ఈ విషయం విస్మరించకూడదు. ఇలా రాజీ పడేందుకు ఎంత సంఘర్షణను వారు అనుభవించారో ఊహకందదు. ఈరోజు ప్రతి చిన్న మార్పునూ జీవన్మరణ సమస్యగా భావిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. ఆనాడు, జీవికనే సమస్య అయిన కాలంలో బ్రతికేందుకేకాదు, తాము, తమ ధర్మం, తమ సంస్కృతి సజీవంగా నిలచేందుకు వారు ఎంత శ్రమపడ్డారో, ఎన్నెన్ని ఆలోచనలు చేశారో, ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారో ఆలోచిస్తేనే బాధతో మనసు వణకుతుంది. గర్వంతో హృదయం ఉప్పొంగుతుంది.

పర్షియన్ నేర్చుకుని రాజోద్యోగం చేసే ‘కర్కున్’ పండితులు, సంస్కృతం నేర్చుకుని సంప్రదాయాన్ని సజీవంగా నిలిపే ‘భాషభట్టు’ల నడుమ ఆరంభంలో ఎలాంటి తేడాలు లేవు. పొరపొచ్చాలు, హెచ్చుతగ్గులు లేవు. సంస్కృతిని సజీవంగా నిలుపుతున్నందుకు ‘భాషభట్టు’లు గర్వంగా భావించుకునేవారు. అయితే, అహంకారం, వ్యక్తికి నీడ లాంటిది. ‘దానాలు’ తీసుకుని జీవికను సాగించే ‘భాషభట్టు’లను రాజోద్యోగం చేస్తూ ధనం సంపాదించే ‘కర్కున్’లు తక్కువగా చూడడం ప్రారంభించారు. ఇదంతా భవిష్యత్తులో జరిగిన కథ. మనకు ఇతర రాజతరంగిణిల ద్వారా తెలుస్తుంది.

జోనరాజు కాలానికి ఈ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తున్నది. ‘కర్కున్’ పండితులు, ‘భాషభట్టు’ల నడుమ పరస్పర గౌరవం, అనుబంధం గట్టిగా ఉన్నాయి. అందుకే జోనరాజు, రాజులు సంపాదించే ఐశ్వర్యం వేదాన్ని అనుసరించే బ్రాహ్మణుల ధనం లాంటిది అన్న పోలికను చూపించాడు. ‘భాషభట్టు’లకు ధనం ‘దానం’ ద్వారా మాత్రమే లభిస్తుంది. ఆ ధనం కూడా సంస్కృతి, సంప్రదాయాలను సజీవంగా నిలిపేందుకు సమాజం కోసం వ్యయమవుతుంది. కాబట్టి రాజు సంపాదించే ఐశ్వర్యం కుడా సమాజం కోసం, ప్రజల అభ్యున్నతి కోసం వ్యయమవ్వాలి. ఎలాగయితే వేద బ్రాహ్మణుల ధనం వారి కోసం కాదో, అలా రాజు సంపాదించే ఐశ్వర్యం కూడా రాజు కోసం కాదు. ఈ స్పృహ లేని పరమాణకుడు అక్రమ మార్గాల ద్వారా ఐశ్వర్యాన్ని ఆర్జించి ఖజానాను నింపాడు. అక్రమంగా సంపాదించింది అక్రమంగానే పోతుంది. రాజు నింపిన ఖజానాను ప్రయాగ, జనక అనే ఇద్దరు మోసగాళ్ళు కాజేశారు. వీళ్ళు రాజు బలహీనతను తమ కనువుగా వాడుకున్నారు. వీళ్లు పరమాణకుడి లోని పాపభీతిని అర్థం చేసుకున్నారు. తమ సేవకులకు రాక్షసుడి వేషాలు వేయించి, వారితో రాత్రిళ్ళు రాజును భయపెట్టేవారు. రాజు మీద ప్రేమను నటిస్తూ, రాజు ప్రాణాలకు రాక్షసుల వల్ల ప్రమాదం ఉందనీ, వారి నుండి రాజు తనను తాను కాపాడుకునేందుకు రాజుతో డబ్బులు ఖర్చు పెట్టించేవారు.

చైత్రమాసంలో పౌర్ణమి రోజు ఈ దుష్టులు ఒక సేవకుడిని రాక్షసుడిలా తయారు చేశారు. ఆ రాక్షసుడు ఒళ్ళంతా ఆభరణాలు ధరించి, గడ్డిని చుట్టుకుని ఉన్నాడు. రాజు వణుకుతూ వాడికి నమస్కారం చేస్తే, వాడు రాజును ఆశీర్వదించి, ఆభరణాలను, ధనాన్ని తీసుకుని అడవికి వెళ్ళిపోయాడు. ‘రాక్షసుడు నీ ధనాన్ని స్వీకరించి, నిన్ను, కశ్మీర రాజ్యాన్ని దీవించాడు. ఇక నీ ప్రాణానికి, రాజ్యానికి ఎలాంటి ప్రమాదం లేద’ని రాజుని నమ్మించారు ఈ ఇద్దరు దుష్టులు. ఈ రకంగా రాజును భయపెట్టి, భయం తీర్చేందుకు రాజు నుంచి ధనం వసూలు చేసేవారిద్దరూ. ఈ రకంగా రాజు ధనాన్నంతా కొల్లగొట్టారిద్దరూ. ఇలా తొమ్మిదేళ్ళ ఆరు నెలల పది రోజులు రాజ్యం చేసి భాద్రపదం శుక్ల పక్షం ఎనిమిదవ రోజున పరమాణకుడు మరణించాడు. ఇప్పటి లెక్కల్లో చెప్పాలంటే పరమాణకుడు  క్రీ.శ. 1155 నుంచి 1164 వరకూ పాలించాడు.

పరమాణకుడి తరువాత అతడి కొడుకు వన్తిదేవుడు రాజయ్యాడు. ఆయన లౌకికాబ్దం 47వ సంవత్సరం భాద్రపద శుక్ల పక్షం పదవ రోజున మరణించాడు.   వన్తిదేవుడు క్రీ.శ. 1164 నుండి 1171 వరకూ రాజ్యం చేశాడన్న మాట. ఇతడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమీ లేదు.

వన్తిదేవుడికి వారసుడు లేడు. దాంతో కశ్మీర ప్రజలు వోపదేవుడిని రాజుగా ఎన్నుకున్నారు.

వోపదేవాభిధః పౌరైర్యోగ్యా లాభాన్నృపః కృతః।
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 40)

ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, గతంలోలా రాజ్యాధికారం కోసం పోరాటాలు జరగలేదు. కుట్రలు, కుతంత్రాలు లేవు. ప్రజలంతా కలసి ఎవడు రాజుగా అయితే, తమకు లాభం కలుగుతుందో, ఎవడికి అర్హత ఉందో అతడిని సింహాసనంపై కూర్చుండబెట్టారు. అంటే, అంతటి దిగజారుడు కాలంలో కూడా ఇంకా అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు కశ్మీరంలో జరిగేవన్న మాట. అయితే, ప్రజలు ఎన్నుకున్న రాజు గడ్డి చుట్టుకున్న రాక్షసుడిలా ఉన్నాడు. అయినా రాజు కాబట్టి ప్రజలు అతడికి నీరాజనాలు అర్పించారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here