జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-54

0
12

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

తురుష్కదర్శనే భక్త్యా నతు ద్వేషేణ స ద్విజాన్।
వ్యప్లావ్యదతక్ష్యాస్మిన్ హత్యా న ప్రజగల్భిరే॥
(జోనరాజ రాజతరంగిణి 670)

[dropcap]సూ[/dropcap]హభట్టు కశ్మీరులో బ్రాహ్మణుడన్న వాడిని బ్రతకనీయకూడదన్న కక్షతో ప్రవర్తిస్తున్నట్లు తోస్తుంది. తన చేతికి చిక్కకుండా ఎవరైనా తప్పించుకుంటే ఎంతో బాధపడేవాడు సూహభట్టు. అయితే, కశ్మీరులో సూహభట్టు అకృత్యాలకు గురవుతున్నవారు కూడా మౌనంగా సహిస్తున్నారు. లేకపోతే, దేశం వదిలి పారిపోతున్నారు తప్ప, ఎదురు నిలిచి పోరాడటం లేదు. సూహభట్టును దూషించటం లేదు. శపించటం లేదు. మౌనంగా భరిస్తున్నారు. మౌనంగా పారిపోతున్నారు. మౌనంగా ప్రాణాలు వదులుతున్నారు. దీనికి కారణం కూడా జోనరాజు సూహభట్టు అనుచరుల   ద్వారా చెప్పిస్తున్నాడు.

సూహభట్టు బ్రాహ్మణులను హింసించటం, మతం మారమని బాధలు పెట్టడం లేకపోతే చంపటం ఎందుకంటే అది బ్రాహ్మణుల పట్ల ద్వేషం వల్ల కాదు. సూహభట్టు చేసే చర్యలన్నీ తురుష్క మతం పట్ల భక్తి వల్ల. అతి గొప్ప వివరణ! ఆనాడు తురుష్క సుల్తానుల ప్రాబల్యంలో ఉంటూ తన ప్రాణాలు కాపాడుకోవటం కోసం అతి  నర్మగర్భితంగా చేదు నిజాన్ని తేనె పూసి ప్రదర్శించాడు జోనరాజు. ఆ పద్ధతి ఈనాటికీ కొనసాగటం విశేషం.

సూహభట్టు ‘న ద్వేషేణ స ద్విజాన్’. ద్విజులంటే ఎలాంటి ద్వేషం లేదు. వారిని హింసించటం వారి పట్ల ద్వేషం కాదు. ‘తురుష్కదర్శనే’ – ‘తురుష్క మతం పట్ల భక్తి’ వల్ల అంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నాడు తప్ప బ్రాహ్మణుల పట్ల ద్వేషం కాదు అని అతని అనుచరులు వివరించారు. ఎవరయినా ఇంటికి నిప్పు పెట్టి “అతను నీ మీద కోపంతో నీ ఇంటిని తగులబెట్టలేదు. కేవలం ఆనందం కోసం తగులబెట్టాడు” అంటే ఎలా ఉంటుందో, అలా ఉందీ వివరణ.

ఆనాడు సంతోషంగా ఆమోదించారు. ఇప్పుడూ సంతోషంగా స్వీకరిస్తున్నాము. నిజానిజాలు ఉన్నదున్నట్లు ఆనాడు మాట్లాడే వీలు లేదు. ఎందుకంటే రాజ్యం సుల్తానులది. ఈనాడు ఉన్నదున్నట్లు ఏమీ అనకూడదు. ఎందుకంటే లౌకిక రాజ్యం కాబట్టి. లౌక్యంగా ఉండాలి కాబట్టి.

సూహభట్టు అనుచరుల వివరణతో సంతుష్టులయిన బ్రాహ్మణులు ఎవరూ ఎలాంటి హింసాత్మక ప్రతీకార చర్యలు చేపట్టలేదు.

ఇత్యాఖ్యానే స ఏవైషాం మతస్య పరిహారదః।
ద్వేషద్యోతక శక్తానాం కార్యాణామేవ దర్శనాత్॥
(జోనరాజ రాజతరంగిణి 671)

సూహభట్టు అనుచరుల వివరణలో బ్రాహ్మణులు సంతృప్తి పడి ఉండవచ్చు. కానీ సూహభట్టు తన ద్వేషపూరిత చర్యల ద్వారా తన అనుచరుల వివరణను తానే ఖండించాడు. ఆ కాలంలో సూహభట్టును వ్యతిరేకించేవాడు లేడు. ఇదేమని అడిగేవాడు లేడు.

రత్నాకరం యామాశ్రిత్య బ్రాహ్మణ జగతీభృతః।
పక్ష రక్షాం వ్యధుః సోభూత్ క్షుద్ర భట్టోస్య వల్లభః॥
(జోనరాజ రాజతరంగిణి 672)

ప్రపంచాన్ని రక్షించే బ్రాహ్మణులు తమవారిని రక్షించుకునేందుకు సముద్రుడిని ఆశ్రయించారు. అయితే, సూహభట్టుతో వ్యాధి స్నేహం ఆరంభించింది.

మలానోదీర్ననామానం యవనాంనా పరం గురూమ్।
వైదగ్ధ్యాచ్ఛంకమానః స ద్రోహీతీ తమబంధయత్॥
(జోనరాజ రాజతరంగిణి 673)

జోనరాజు ‘మలానోదీర్’ అన్నాడు. ఇతడిని షేక్ నూరుద్దీన్, ముల్లా నూరుద్దీన్‍గా గుర్తించారు. ఈయన పరమ గురువు. ఈయన తనను వ్యతిరేకిస్తాడు, విప్లవం లేవదీస్తాడు అన్న భయంతో సూహభట్టు అతడిని బంధించాడు అంటుంది శ్లోకం. కశ్మీరు యూనివెర్సిటీకు చెందిన అలంగీర్ చైర్ కు సంబంధించినవారు, జోనరాజు ప్రస్తావించిన మలనోదీర్ వేరు, ముల్లా నూరుద్దీన్ వేరు అని భావిస్తారు. జోనరాజు ప్రస్తావించింది బహారిస్తాన్-ఇ-షాహిలో ప్రస్తావన వున్న  ముల్లా పర్సి ఒకరే అని కొందరు భావిస్తారు.   పలువురు కశ్మీరీ చరిత్ర నిపుణులు జోనరాజు ప్రస్తావించిన మలనోదీర్ ముల్లా నూరుద్దీన్ అనే భావిస్తారు. ఒకవేళ జోనరాజు ప్రస్తావించిన నూరుద్దీన్ నంద ఋషి గా పేరుపొందిన నూరుద్దీన్ ఒకరే అయినా వేర్వేరయినా నందఋషిగా ప్రసిధ్ధుడయిన నూరుద్దీన్ గురించి, అతని ధార్మిక, రాజకీయ కార్యకలాపాలగురించి తెలుసుకోవాల్సివుంటుంది.

కశ్మీరు చరిత్రలో హమదానీల తరువాత సాంస్కృతిక, ధార్మిక, సాహిత్య, చరిత్రలో అంతగా ప్రాధాన్యం వహిస్తాడు షేక్ నూరుద్దీన్. ఈ శ్లోకం వెనుక దాగి ఉన్న సంపూర్ణమైన అర్థాన్ని గ్రహించాలంటే ఆ కాలం నాటి కశ్మీరు ధార్మిక, సాంస్కృతిక, రాజకీయ చరిత్రలో షేక్ లేక ముల్లా నూరుద్దీన్ పోషించిన ప్రధాన పాత్ర గురించి కొంచెం సుదీర్ఘంగా చర్చించుకోవాల్సి ఉంటుంది. కశ్మీరులోని ఇస్లాం,  దేశంలోని ఇతర ఇస్లాం వ్యవస్థలకు భిన్నంగా ‘ఋషి’ వ్యవస్థ వైపుమళ్ళటంలో ప్రధాన పాత్ర పోషించినవాడు షేక్ నూరుద్దీన్. కశ్మీరు హిందూ సమాజాన్ని జాగృత పరిచేందుకు కర్నాటక ప్రాంతంలో అక్క మహాదేవిలా, వాక్యాలు వెదజల్లుతూ కశ్మీరమంతా తిరుగుతూ ఉత్తేజితం చేసిన లాల్‍దేద్‌కు సమకాలికుడు షేక్ నూరుద్దీన్. తన జీవిత కాలంలో ‘నంద ఋషి’గా ప్రసిద్ధి పొందాడు షేక్ నూరుద్దీన్. ఈయన 1377 నుండి 1438 వరకూ జీవించాడు. అంటే,  ఖుతుబ్-ఉద్-ద్దీన్ పాలన  కాలం నుంచి  సికందర్ ‘బుత్‍షికన్’ పాలన  కాలం ద్వారా  జైనులాబిదీన్ పాలన  కాలం వరకూ జీవించాడన్న మాట ఈయన.

పరమ గురువయిన ముల్లా నూరుద్దీన్‍ను తనకు వ్యతిరేకంగా విప్లవం లేవదీస్తాడేమో, ద్రోహం చేస్తాడేమో నన్న భయంతో బంధింపజేశాడు సూహభట్టు. జోనరాజు ప్రస్తావించలేదు కానీ సికిందర్ బు‍త్‌షికన్ కూడా తనకు వ్యతిరేకంగా విప్లవం లేవదీస్తాడేమోనన్న భయంతో ఈయనను ఓసారి బంధించాడు. అలాగే ప్రతి సుల్తాన్ ముల్లా నూరుద్దీన్‍ను ప్రమాదకరమైన వాడిగా భావించటం కనిపిస్తుంది. షేక్-ఉల్-ఆలమ్ (ప్రపంచానికి వెలుగు), అలమ్-దార్-ఎ-కశ్మీర్ (కశ్మీరుకు ప్రతినిధి) అన్న బిరుదులున్న షేక్ నూర్-ఉద్-దీన్ నూరానీని ఒక సూఫీ ప్రవక్తను, ముల్లాను సుల్తానులు దేశద్రోహ చర్యలకు పాల్పడుతాడని పదే పదే బంధించటం గమనించాల్సిన విషయం.

క్రీ.శ. 1377లో కుల్గామ్ జిల్లాలో ‘ఖజోగిపారా’ వద్ద జన్మించాడు నూరుద్దీన్. ఈయన తండ్రి సాలర్ సాంజ్. తల్లి సద్ర. ఈయన జన్మ గురించి పలు గాథలు ప్రచారంలో ఉన్నాయి.

పెళ్ళయిన చాలాకాలం వరకూ సాలార్, సద్రలకు పిల్లలు లేరు. దాంతో వాళ్ళు ఎంతో వేదనకు గురయ్యారు. ఒకరోజు సాలార్ తన ఉద్యోగానికి బయలుదేరాడు. పడవల కాపలా అతని ఉద్యోగం. ఆయన వెళ్తుంటే ఓ బ్రాహ్మణ జ్యోతిష్యుడు తన భార్యతో చెప్తున్న విషయం విన్నాడు. అదేమిటంటే, ఉదయం బ్రాహ్మీముహూర్తంలో ఒక నక్షత్రం కనిపిస్తుందనీ, ఆ నక్షత్రాన్ని దర్శించి దగ్గరలోని సరస్సులో స్నానం చేసిన మహిళకు అతి గొప్ప పుత్రుడు జన్మిస్తాడనీ చెప్తాడు. అది విన్న సాలార్ ఇంటికి పరుగు పరుగున వెళ్ళి భార్యకు ఈ విషయం చెప్తాడు. ఇద్దరూ రాత్రంతా మేలుకుని ఉండి, తెల్లారే నక్షత్ర దర్శనం చేసుకుని ఆ జ్యోతిష్యుడు చెప్పినట్టు చేశారు. ఫలితంగా నూరుద్దీన్ జన్మించాడు.

మరో గాథ ప్రకారం, షేక్ సాలార్ బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు లేని ఓ బ్రాహ్మణ జ్యోతిష్యుడు తన భార్యతో చెప్పటం విన్నాడు. ఆ రాత్రి గోతమ్ నాగ్, పర్గణ మార్తాండ సరస్సులలో ఒక ప్రత్యేకమైన చెట్టుకు, సరోవరానికి ఒకటి చొప్పున  మూడు ప్రత్యేకమైన పూలు పూస్తాయనీ, వీటిల్లో ఏదో ఒక పూవు వాసనను ప్రథమంగా చూసిన పిల్లలు లేని స్త్రీకి పిల్లలు పుడతారని చెప్తాడు. అది విన్న సాలార్, అతని భార్య ఆత్రంగా సరస్సులో వెతుకుతారు. పూవు పూయగానే వాసన చూస్తారు. వారికి షేక్ నూరుద్దీన్ పుడతాడు. మరో పూవు వాసన చూసిన దంపతులకు లల్లేశ్వరి (లాల్‌దేద్) పుట్టింది. ఇదొక కథనం.

మరొక కథనం ప్రకారం ఒకసారి షేక్ సాలార్, సద్రలు యస్మన్ ఋషి అనారోగ్యంగా ఉంటే అతడిని పరామర్శించేందుకు వెళ్ళారు. వీళ్లు వెళ్ళేసరికి ఆయన ఓ సరోవరం ఒడ్డున కూర్చుని ఉన్నాడు. వీళ్ళూ ఆయనతో మాట్లాడుతున్న సమయంలో, తలపై పూలబుట్టతో లాల్‌దేద్ అక్కడికి వచ్చింది. యస్మన్ ఋషి ఆమె నుంచి ఒక పూవు తీసుకుని సద్రకు ఇచ్చాడు. ఆ పూల గుత్తిని తలపై ఉంచుకోమని, ఆమెకు ఋషుల విజ్ఞానాన్ని పుణికి పుచ్చుకున్న సంతానం కలుగుతుందని చెప్తాడు. అలాగే జరిగింది.

షేక్ నూరుద్దీన్ జన్మించటానికి సంబంధించిన ఈ కథలు అనేక విషయాలను చెప్పకనే చెప్తాయి. ఈ కథలలో నిజానిజాల ప్రశ్నను వదిలితే, షేక్ నూరుద్దీన్ నందఋషిగా మారేందుకు దైవాశీస్సులు ఉన్నాయన్న ఆలోచనలను ప్రచారం చేయటం ద్వారా కశ్మీరులో ఇంకా మతం మారేందుకు అయిష్టంగా ఉన్న వారి మనసు మార్చవచ్చు. షేక్ నూరుద్దీన్ తల్లీ తండ్రీ సరస్సుల్లో స్నానాలు చేయటం, బ్రాహ్మణ జ్యోతిష్యుడి మాటలు నమ్మటం వంటివి, ఎంత ప్రయత్నించినా ప్రజల మనసులలోంచి తొలగని, తాము విసర్జించిన ధర్మం తాలూకూ నమ్మకాలు, విశ్వాసాలు. మరో వైపు ఎలాగయినా నందఋషికి దైవత్వాన్ని ఆపాదించి లాల్‌దేద్‌కూ అతడికీ నడుమ స్నేహ సంబంధాలున్నాయని ఓ రకమైన ప్రామాణికతకు ఆమోదముద్రను సాధించటం కూడా కనిపిస్తుంది.

ఇక్కడే మన చరిత్ర విశ్లేషకులు, వ్యాఖ్యాతల ద్వంద్వ ప్రవృత్తిని గమనించవచ్చు. ఇది ఏ భారతీయ గురువు గురించిన గాథలో అయితే పుక్కిటి గాథలు, కల్పిత కథలు అని కొట్టిపారేసి వెక్కిరిస్తారు. కానీ ముల్లా నూరుద్దీన్ నందఋషికి సంబంధించిన కథ కాబట్టి “True, these tales and traditions do not stand exclusively qualified to land them on a historical plane but at the same time, guided by the latest principles of historical analysis, such traditions offer penetrating insights into collective mental make-up of the people, the society and the region in which these traditions rooted” (Shaik Nuruddin Rishi: A Study in Tales & Traditions by Farooq Fayaz, Alamgir, Vol II,2008, Shaikul- alam chair, University of Kashmir) అని వ్యాఖ్యానిస్తూ ఓ రకమైన ఆమోదాన్ని సాధించాలని ప్రయత్నిస్తారు. అంతే కాదు, వారు చేసే సామాజిక సామూహిక మనస్తత్వ విశ్లేషణలో భారతీయ ధర్మాన్ని, సమాజాన్ని వీలయినంత తక్కువ చేసి చూపుతారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here