జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-56

0
10

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

శ్రీ జైనోల్లాభదనాఖ్యః సురత్రాణో భవన్ భవాన్।
చిరం రాజ్యం క్రియాదేవం రాజాస్సాశిష మభ్యదాత్॥
(జోనరాజ రాజతరంగిణి 707)

[dropcap]సూ[/dropcap]హభట్టు మరణంతో అంతవరకూ కశ్మీరులో అధికారంపై  ఆశలు అణచిపెట్టుకున్న వారంతా విజృంభించారు. సూహభట్టుకు భయపడి లద్దరాజు కశ్మీరు వదిలి పారిపోయాడు. హంస భట్టు , గౌరభట్టులు అతడిని బంధించారు. బందిఖానాలో ఉంచారు. సూహభట్టు మరణం వీరిద్దరిలో అధికార దాహాన్ని రగిలించింది. దాంతో అంత వరకూ మిత్రులుగా ఉన్న హంసభట్టు, గౌరభట్టులు అధికారం కోసం ఆత్రపడి శత్రువులయ్యారు. ఆవు కోసం కొట్లాడే ఎద్దుల్లా వారిద్దరూ పోరాడేరు. ఇద్దరూ కొమ్ములు విరగ్గొట్టుకున్నారు.

యుద్ధంలో సహాయం కోసం హంసభట్టు లద్దరాజును ఖైదు నుండి  విడుదల చేశాడు. ఆ సమయంలో యుద్ధంలో గౌరభట్టు మరణించాడు. స్వర్గంలో మహిళలకు ఆనందం కలిగించాడు. దారి తప్పిన మహిళ మరో దారి లేక ముసలి మొగుడినే ఆశ్రయించినట్టు, రాజ్యభారం వహించేందుకు అర్హత కల వ్యక్తి కనబడక అదృష్ట దేవత హంసభట్టునే వరించింది.

కానీ రాజ్యానికి అసలైన అర్హత గల ‘శాహిఖానా’ యువకుడయినా జరుగుతున్న పరిణామాలను చూస్తూ మౌనంగా ఉండలేకపోయాడు. సుల్తాన్ అల్లీషా బలహీనుడు, దుర్బలుడు మాత్రమే కాదు, రాజ్య పాలన గురించి ఏమీ అవగాహన లేని వాడు. అందుకే సూహభట్టు ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు. సూహభట్టు మరణంతో అల్లీషాకు ఏం చేయాలో తోచలేదు. ఇది గ్రహించిన వారు అధికారం కోసం తమలో తాము పోరాడుకోసాగారు. దాంతో ఇంకా ఉపేక్షిస్తే సామ్రాజ్యాధికారం చేయి దాటి పోతుందని అర్థం చేసుకున్న శాహిఖానా పగ్గాలను తన చేతిలోకి తీసుకున్నాడు. పరిస్థితి అదుపులోకి తేవటంతో ప్రజలు శాహిఖానాపై ప్రేమ కురిపించారు. రాజ్యపాలనకు అతడు సమర్థుడని వారు భావించారు.

శాహిఖానా ఠక్కురాల సహాయంతో హంసభట్టుపై యుద్ధానికి వెళ్ళాడు. హంసభట్టు సూహభట్టు సోదరుడు. సోదరుడు సూహభట్టు మాలిక్ సైఫుద్దీన్ అయితే ఈయన మాలిక్ యూసుఫ్. కానీ జోనరాజు మతం మారిన వారిని వారి పూర్వనామం తోటే వ్యవహరించాడు. యుద్ధంలో హంసభట్టు లద్దరాజును హతమార్చాడు. హంసభట్టును శాహిఖానా సంహరించాడు. దాంతో పరిస్థిని చక్కబెట్టిన శాహిఖానా పై ప్రజలు అభిమానం ప్రదర్శించారు. నల్లటి తేనెటీగలు కుంద మల్లెలను వదిలి మామిడిపూల వైపు పరుగు పెట్టినట్టు అదృష్ట దేవత శాహిఖానా వైపు పరుగులు పెట్టింది. అయితే శాహిఖానా రాజు అయ్యే సమయం ఇంకా రాకపోవటంతో అదృష్టం అటూ ఇటూ కాకుండా మిగిలిపోయింది.

శాహిఖానా పట్ల ప్రజలు ప్రదర్శిస్తున్న అభిమానం, శాహిఖానా తెలివి తేటలు, శౌర్యం, ధైర్యాలు, అల్లీషాకు భయం కలిగించినట్లున్నాయి. తప్పనిసరి పరిస్థితులలో అతడిని తన మంత్రిగా నియమించాడు. రాజ్య వ్యవహారాలన్నీ అతడికి అప్పగించాడు.

దుష్టుడు, ‘మీర్ కంసార్’ అనే తురుష్కుడు, పిచ్చి పట్టిన ఏనుగుకు శూలం ఎలా దారి చూపిస్తోందో, అలా రాజు మనసును పాడు చేశాడు. ఎలాగయితే నల్లటి మేఘాలు మానస సరోవరాన్ని కలుషితం చేయలేవో, అలా దుష్టులు అధిక కాలం రాజుపై ప్రభావం చూపలేరు. త్వరలోనే అల్లీషా నిజానిజాలు గ్రహించాడు. తన సోదరుడు శాహిఖానాపై ప్రేమ కురిపించాడు. తనను ఆశ్రయించిన వారిని ఆదరించాడు. కానీ ఎంతైనా దుష్టుల ప్రభావం అల్లీషాకు ఇబ్బంది కలిగించింది.

జోనరాజు రచించిన ఈ శ్లోకాల మాటున సోదరుల నడుమ చెలరేగిన ఉద్విగ్నతల స్వరూపం అణిగి ఉంది. అల్లీషా అసమర్థుడు. శాహిఖానా అత్యంత సమర్థుడు. అసమర్థుడైన సుల్తాన్, సమర్థుడైన సోదరుడిని చూసి భయపడటం సర్వసాధారణం. పైగా ఆ సోదరుడు వీరుడు, ధీరుడు. ప్రజల అభిమానాన్ని చూరగొన్నవాడు అవటమే కాదు, సుల్తాన్‍కు వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీసిన వారిని అణచివేసిన శౌర్యవంతుడు అయితే,  సుల్తాన్ అలాంటి సోదరుడిని చూసి భయపడటంలో ఆశ్చర్యం లేదు. పైగా సుల్తాన్‍ను భయపెట్టి, సోదరుడికి వ్యతిరేకం చేసేందుకు ‘మీర్ కంసార్’ అనే దుష్ట తురుష్కుడు ఉన్నాడంటే సోదరుల నడుమ ఉద్విగ్నతలు చెలరేగటంలో ఆశ్చర్యం లేదు. కానీ జోనరాజు ఈ విషయాల గురించి సత్యం చెప్పలేడు. ఎందుకంటే సుల్తాన్ జైనులాబిదీన్‍కు ( సుల్తాన్ కాకముందు అతనిపేరు శాహిఖాన)  తన అన్న అంటే అమితమైన గౌరవం. అందుకని దుష్ట తురుష్కుడు రాజు మనసు పాడు చేశాడని చెప్పి, మానస సరోవరం నల్ల మేఘాలతో కలుషితం కాదని చెప్పి, సుల్తాన్ తనకు విధేయుడైన సోదరుడిపై ప్రేమ కురిపించాడని చెప్పడం. కానీ ‘అతి ప్రేరణాయ తేషాం రాజ్యేప్యుద్విగ్నతా మగత’ అని చెప్పటంలో అసలు విషయం సూచనప్రాయంగా చెప్పాడు జోనరాజు. దుష్టుల నిరంతర ప్రభావం వల్ల సుల్తాన్ ఉద్విగ్న మనస్కుడయ్యాడు. దాన్ని బట్టి సోదరుల నడుమ ఉద్విగ్నతలున్నాయని అర్థం చేసుకోవచ్చు. తరువాత జరిగిన సంఘటనలు ఈ ఉద్విగ్నతలను నిరూపిస్తాయి.

సుల్తాన్ ‘తీర్థానుసరణ కాంక్షి’ అయ్యాడంటాడు జోనరాజు. సుల్తాన్ తీర్థయాత్రలకు వెళ్లాలని నిశ్చయించాడు. బహరిస్తాన్, తారిఖ్-ఇ-హైదర్ మాలిక్, తారిఖ్-ఇ-నారాయణ కౌల్, తారిఖ్-ఇ-అజామ్ వంటి రచనలలో ప్రపంచాన్ని దర్శించాలన్న కోరికతో సుల్తాన్ తీర్థయాత్రలు చేయాలని సంకల్పించాడని ఉంది. తీర్థయాత్రలంటే మక్కా పర్యటన. తీర్థయాత్రలకు వెళ్లాలని నిశ్చయించుకున్న సుల్తాన్, తన తరువాత రాజ్యాధికారం కల సోదరుడితో, ఇతర సేవకులతో ఇలా అన్నాడు:

అనర్థి తర్పణం విత్తం చిత్తమధ్యాన దర్పణం।
అతీర్థ సర్పణం దేహం, పర్యన్తే శోచ్యతాం వ్రజేత్॥
(జోనరాజ రాజతరంగిణి 696)

ఒక సృజనాత్మక రచయిత అవసరమైతే ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని గొప్పగా చూపించగలడు. అనుకుంటే, ఆ గొప్పతనాన్ని నీచంగా తోచేట్టు చిత్రించగలడు. జోనరాజు రాజతరంగిణి రచనలో తన ఈ ప్రతిభను సంపూర్ణంగా వినియోగించాల్సి వచ్చింది. జైనులాబిదీన్ తండ్రి, సోదరుల పాత్రలను చిత్రించే సమయంలో – సికందర్ బుత్‌షికన్ దోషమంతా సూహభట్టుపై నెట్టేశాడు. అల్లీషా చేతకానితనాన్ని, సూహభట్టు శౌర్యం సాకుతో దాచాడు. ఆ వెంటనే అతడి సోదరుడితో చెలరేగిన ఉద్విగ్నతలను మరో దుష్ట తురుష్కుడి ప్రభావంపై నెట్టేశాడు. ఇప్పుడు తీర్థయాత్రల నెపం మీద ప్రాణాలు అరచేత పట్టుకుని రాజ్యభారం వదిలి పారిపోతున్న సుల్తాన్‍ను గొప్పవాడిని చేసేందుకు, అతడు రాజ్యం వదిలి వెళ్తున్నది భయంతో కాదు, స్వచ్ఛందంగా తీర్థయాత్రల కోసం అని నిరూపించేందుకు అతని నోట గొప్ప వాక్యాలు పలికించాడు జోనరాజు.

సంతృప్తినివ్వని ఐశ్వర్యం, ధ్యానం చేయని చిత్తం, తీర్థయాత్రలు చేయని దేహం వంటివి వ్యర్థం అనిపించాడు సుల్తాన్ అల్లీషాతో. ఇవి జోనరాజు మాటలు అని సులభంగా గ్రహించవచ్చు. ఈ విషయంలో ఎవరికైనా ఎటువంటి సందేహాలైనా ఉంటే తరువాతి మాటలు ఈ సందేహాన్ని పటాపంచలు చేస్తాయి.

దిగ్గజేష్యివ యుష్మాసు భూభారం న్యస్తవానహమ్।
పురుషోత్తమ సేవయై యతే శేష ఇవాపరః॥
(జోనరాజ రాజతరంగిణి 697)

ప్రపంచ భారం మోసే గజాల్లాంటి వారు మీరు. మీపై నేను రాజ్యపాలన భారం వదిలి వెళ్తున్నాను. ఎలాగయితే శేషనాగు పురుషోత్తముడి సేవకు వెళ్తుందో, అలా నేను వెళ్తున్నాను. పురుషోత్తముడు అంటే మహమ్మద్ ప్రవక్త అని వాల్టర్ సెల్జీ వ్యాఖ్యానించాడు. శేషనాగు మహమ్మద్ ప్రవక్త సేవకు వెళ్లటం అన్నది కుదరదు. శేషనాగు పురుషోత్తముడి సేవకు వెళ్ళినట్టు  నేను మహమ్మద్ ప్రవక్త సేవకు వెళ్తున్నానని సుల్తాన్ అనటమూ కుదరదు. శేషనాగు పోలిక తేవటంతో ఈ మాటలు సుల్తాన్‍వి కావు, సుల్తాన్‌కు గొప్పతనం ఆపాదించేందుకు జోనరాజు ఆయన నోట పలికించిన మాటలు అని గ్రహించవచ్చు. ఇలాంటి వాక్యాలు సుల్తాన్‍తో పలికించటం వల్ల భావితరాల ముందు జైనులాబిదీన్‍ను ఉత్తముడిగా నిలబెడుతున్నాడు. సుల్తాన్ తీర్థయాత్రలకు వెళ్తూ, రాజ్యభారం సోదరుడికి అప్పజెప్పాడు. అలా జైనులాబిదీన్ సుల్తాన్ అయ్యాడు తప్ప, సోదరుడిని తరిమి రాజ్యం ఆక్రమించలేదని నిరూపించటం – జైనులాబిదీన్‍కు భవిష్యత్తులో సోదరుడిని తరిమివేశాడన్న అపకీర్తి రాకుండా ఉండేందుకు. ఇది జైనులాబిదీన్‌కూ లాభకరం. కాబట్టి అబద్ధమైనా ఆయన ఈ కల్పనను ఆమోదిస్తాడు, ఆనందిస్తాడు.

ఈ సన్నివేశాన్ని మరింత నాటకీయం చేశాడు జోనరాజు.

సుల్తాన్ మాటలకు మందర పర్వతం చిలుకుతున్న సముద్రంలా అల్లకల్లోలమవుతున్న మనసుతో శాహిఖానా, చంద్రుడిలా తీయటి మాటలతో సమాధానం ఇచ్చాడు:

“తీర్థయాత్రలకు వెళ్ళాలన్న మీ సందేహాస్పద ఫలితాలున్న ఆలోచనను  వదిలేయాలని మిమ్మల్ని  కోరుకుంటున్నాను. రాజ్యపాలన చేసి ప్రజల మెప్పు పొందండి. శాశ్వత కీర్తి సంపాదించండి. చాలా కాలం పాలన చేసిన తరువాత వీరులైన మీరు ఇలా రాజ్యాన్ని వదిలేసి వెళ్ళటం భావ్యం కాదు. మీకు సేవ చేయటమే కర్తవ్యంగా కల మేము, మీరు తీర్థయాత్రలకు వెళ్తే ఎవరి సేవ చేయాలి? మాకు పనేముంది? కాబట్టి మీరు తీర్థయాత్ర ఆలోచన వదిలిపెట్టండి” అన్నాడు.

అంతటితో ఆగలేదు శాహిఖానా. సుల్తాన్‍కు ఆగ్రహం తెప్పించాలని ప్రయత్నించాడు.

“నువ్వు శూరుడివి. నువ్విలా రాజ్యం వదిలి పోవటం వల్ల రాజ్య పాలన చేతకాక పారిపొయావని అనుకుంటారు” (నిజాన్ని ఎంతో వంకరగా చెప్తాడు జోనరాజు).

శాహిఖానా మాటలకు సుల్తాన్ అల్లీషా సమాధానం మరీ గొప్పగా ఉంటుంది.

“ప్రజలను పాలించటం వల్ల లభించే పుణ్యం రసాయన పదార్థం లాంటిది. అనేక రసాయనాలు కలిసి ఉంటాయి. నువ్వు నా భుజం లాంటి వాడివి. నా శరీరంతో కలిసి లేకున్నా నువ్వు నా భుజం. నువ్వు నా భుజం అయినప్పుడు నాకు పాలన చేతకాదని ఎవరంటారు? నువ్వు నా ఆజ్ఞా పాలన చేయకపోతే, నీపై నేనుంచుకున్న ఆశలు నిరాశలవుతాయి.”

రామాయణాన్ని గుర్తుకు తెస్తుందీ సంభాషణ. సోదరుడు తీర్థయాత్రలకు వెళ్తూంటే, సోదరుడు ఇక రాజ్యం వదిలి వెళ్ళిపోతున్నట్టు, వెళ్లద్దని బ్రతిమిలాడటంలోనే అసలు కథ దాగుంది. తీర్థయాత్రలకు వెళ్లేవాడు తిరిగి వస్తాడు. రాజ్యం వదిలి పారిపోయేవాడు తిరిగి రాడు. అదీ గాక, మక్కా దర్శనార్థం వెళ్తానన్న వాడిని వెళ్ళవద్దని ఎవ్వరూ బ్రతిమిలాడరు. అదీ రాజ్యపాలన కోసం పవిత్ర మక్కా దర్శనం వదులుకోమని కోరటం అనౌచిత్యం, అసందర్భం, అనూహ్యం!

ఇలా శాహిఖానాను సమాధాన పరిచి అల్లీషా తీర్థయాత్రలకు వెళ్లాడు. బయలుదేరేముందు రాజ్యభారం సోదరుడికి అప్పగించి, అతడిని దీవించి, “ఇక నుంచి నీ పేరు శ్రీ జైనులాబిదీన్” అన్నాడు.

అంటే, రాజ్యభారం స్వీకరించిన శాహిఖానా, జైనులాబిదీన్ అయ్యాడన్న మాట. సోదరుడిని రాజ్యం నుంచి తరిమేసి, రాజ్యాధికారం హాస్తగతం చేసుకున్నాడన్న అపప్రధ జైనులాబిదీన్‍కు రాకూడదని జోనరాజు కల్పించిన కట్టుకథగా, సృష్టించిన ఉత్తమమైన సన్నివేశంగా భావించవచ్చు.  జోనరాజు చెప్పిన ఇతర విషయాలను విస్మరించిన చరిత్ర రచయితలు ఈ విషయాన్ని మాత్రం నమ్మారు.

తీర్థయాత్రలకు ప్రయాణమై అల్లీషా వెళ్లిపోయాడు. కానీ అతని సోదరుడు జైనులాబిదీన్ హృదయం లోంచి మాత్రం అతడు వెళ్లిపోలేదు. విలువైన వజ్రాలను, అమూల్యమైన ఆభరణాలను, అందమైన గుర్రాలను ఇచ్చేస్తూ, రెండు రాత్రుళ్ళు సోదరుడి వెంటనే వెళ్లాడు.

మళ్ళీ రామయాణంలో రాముడి వెంట కాస్త దూరం వెళ్ళిన భరతుడు గుర్తుకొస్తాడు. ఖజానా నుంచి అమూల్యమైన ఆభరణాలను, వజ్రాలను, గుర్రాలను ఇవ్వాల్సిన అవసరం ఏముందో, జోనరాజు రాయలేదు.  కానీ తీర్థయాత్రలకు వెళ్తున్న సోదరుడి వెంట రెండు రాత్రుళ్ళు వెళ్ళాడని రాశాడు. కానీ, రెండు రాత్రుళ్ళు సోదరుడిని వెంబడించాడని ఊహించటం అనౌచిత్యం కాదనిపిస్తుంది. ఈ వెంటనే జోనరాజు రాసిన శ్లోకాలు జోనరాజు దాచిపెట్టిన విషయాలను చెప్పకనే చెప్తాయి. అంటే, జోనరాజు రాజతరంగిణి రచనలో తాను  స్పష్టంగా చెప్పలేని విషయాలను సూచనప్రాయంగా, ప్రదర్శించాడన్న మాట.

మార్గే క్లేశం ప్రయత్నేన సిద్ధిం తీర్థఫలాల్పతామ్।
ఉత్తవా మార్గే ఖలా రాజ్ఞాస్తీర్త్య శ్రధ్ధామఖండయన్॥
(జోనరాజ రాజతరంగిణి 710)

మళ్ళీ దుష్టులు రాజు మనసును పాడు చేశారు. తీర్థయాత్రల వల్ల శ్రమ తప్ప మరేమి ఉండదని నమ్మించారు. శ్రమ అథికం, ఫలితం స్వల్పం అని బోధించారు. మార్గంలో కష్టాలను వివరించారు. తీర్థయాత్రల నుంచి సుల్తాన్‍ను విముఖుడిని చేశారు. మళ్ళీ దుష్టుల ప్రభావంలోకి వచ్చాడు అల్లీషా. ఆ తరువాత జరిగింది ఇంతవరకూ జోనరాజు కల్పించిన కట్టుకథ అసలు రూపాన్ని బహిర్గతం చేస్తుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here