జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-60

5
10

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

రంధ్రైరధోగతిం ప్రాప్తా కుల్యేవోద్ధృత్య భూభుజా।
విద్యా ప్రవాహితా తేన గుణినా గుణరాగిణా॥
(జోనరాజ రాజతరంగిణి 772)

[dropcap]క్రీ.శ. [/dropcap]1420లో సింహాసనం చేపట్టినప్పుడు సుల్తాన్ జైనులాబిదీన్ వయసు 19 ఏళ్ళు. జైనులాబిదీన్ తల్లి అతడికి బాల్యం నుంచి స్నేహం, సహనం, న్యాయ భావనలను నేర్పింది. ఆ కాలంలో గొప్ప పండితుడిగా, పరమత సహనం కలవాడిగా పేరుపొందిన మౌలానా కబీర్ వద్ద శిష్యరికం చేశాడు జైనులాబిదీన్. సూఫీ షేక్ నూరుద్దీన్ ఋషి ప్రభావం జైనులాబిదీన్‌పై అమితంగా ఉంది. బాల్యం నుంచీ జైనులాబిదీన్ తన తండ్రి సికందర్ క్రౌర్యం పట్ల, ఇతర మతాల పట్ల ఆయన ప్రదర్శిస్తున్న అసహనం పట్ల వ్యతిరేకతను ప్రదర్శించేవాడు. తన సోదరుడు ‘అలీ షాహ’ పాలనా కాలంలో సూహభట్టు మకుటం లేని మహారాజులా ప్రవర్తించటం పట్ల వ్యతిరేకత ప్రదర్శించి, అతడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు.

జైనులాబిదీన్ రాజ్యభారం స్వీకరించిన సమయం కశ్మీరు అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్న సమయం. అతని కన్నా ముందు పాలకుల క్రూరమైన పాలన వల్ల కశ్మీరులో ప్రజల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇస్లామేతరులు దేశం వదిలి పారిపోవటమో, ఆత్మహత్యలు చేసుకుని మరణించటమో చేయటం వల్ల జనసంఖ్య తగ్గిపోయింది. ఇస్లామేతరులు కేవలం పదకొండు పండిత కుటుంబాలకు మాత్రమే పరిమితమయ్యారు. అధికారం కోసం ‘ధన్నా’ వద్ద అలీ షాకూ, సోదరుడికీ నడుమ జరిగిన పోరు వల్ల జరిగిన ఆస్తి నష్టం, జన నష్టం కూడా కశ్మీరును దెబ్బతీసింది. ప్రజలు నిరాశానిస్పృహలకి లోనయి ఉన్నారు. వారికి భవిష్యత్తు భయంకరంగా, అంధకార బంధురంగా తోస్తోంది. ఇలాంటి పరిస్థితులలో అధికారం చేపట్టిన జైనులాబిదీన్ ముందుగా కశ్మీరంలో శాంతి భద్రతలు ఏర్పాటు చేయటంపై దృష్టి పెట్టాడు. ప్రజల లోని అవిశ్వాసాన్ని, భయాందోళలను తొలగించి, భద్రతా, విశ్వాసాలను కలిగించాలని ప్రయత్నించాడు.

ఇస్లామేతరులపై జరిగే హింసను నిరోధించాడు. బలవంతపు మతాంతీకరణలను అడ్డుకున్నాడు. పండితులను హింసించే వారినీ, బెదిరించే వారినీ నిర్దయగా శిక్షించాడు. వారెంతటి ఉన్నతస్థాయిలో ఉన్నవారయినా ఎలాంటి జాలి, దయ లేకుండా శిక్షించాడు. దాంతో ఇస్లామేతరులు కశ్మీరులో భయం లేకుండా జీవించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ వెంటనే ప్రాణాలు అరచేత పట్టుకుని దేశం వదిలి పారిపోయిన పండితులను కశ్మీరుకు ఆహ్వానించాడు. వారికి భద్రత కలిగించాడు. దీన్ని జోనరాజు అత్యంత సుందరంగా వర్ణించాడు.

రాజు స్వయంగా ప్రతిభ కలవాడు కాబట్టి ఇతరులలో ప్రతిభను గుర్తించి గౌరవించాడు. ఆనకట్ట తెగటం వల్ల నీరు చెల్లాచెదురయినట్టు, రంధ్రం ఏర్పడటం వల్ల నీరు కారిపోయినట్టు, కశ్మీరు వదిలి వెళ్ళిన విజ్ఞాన స్రవంతిని మళ్ళీ కశ్మీరులో ప్రవహింపజేశాడు.

కశ్మీరు నుండి బయటకు ప్రవహించిన విజ్ఞాన స్రవంతిని మళ్ళీ కశ్మీరులో ప్రవహింపజేశాడు జైనులాబిదీన్ అంటాడు జోనరాజు. కశ్మీరు నుండి విజ్ఞాన స్రవంతి వెడలడం అన్నది ప్రతీక.

జైనులాబిదీన్ కన్నా ముందరి సుల్తానులు అవలంబించిన దుష్ట వ్యవహారం వల్ల అంతవరకూ కశ్మీరులో వ్యవస్థను స్థిరపరిచి, నడిపిస్తున్న పండితులు కశ్మీరు వదిలి పారిపోవాల్సి వచ్చింది. పారిపోలేని వారు పరాయి మతం స్వీకరించాల్సి వచ్చింది. పరమతం స్వీకరించిన తరువాత వారు గతంలోలా వ్యవహరించే వీలు లేదు. పైగా, మతాంతరీకరణ వల్ల మతం మారినా, వారిని అప్పటికే ఇస్లామీయులుగా ఉన్నవారు తమతో సమానంగా చూడలేదు. మతం మారినా కులం పోలేదు. కానీ కులవృత్తులు పోయాయి. ఎందుకంటే ‘షరియా’ ఆమోదించిన వృత్తులనే స్వీకరించాలని ‘హమదానీ’ నియమం విధించాడు. దాంతో కొత్తగా మతం మారిన వారు, కొత్త వృత్తులను స్వీకరించాల్సి వచ్చింది. అంటే, ఒక సువ్యవస్థితమై ఉన్న సమాజాన్ని సంపూర్ణంగా తొలగించి, ఆ స్థానంలో ఒక కొత్త వ్యవస్థ, సంపూర్ణంగా భిన్నమైన వ్యవస్థను ప్రతిష్ఠించారన్న మాట కశ్మీరంలో. ఇది కశ్మీరాన్ని అల్లకల్లోలం చేసింది.

పాలనలో అనుభవం ఉన్నవాడు తనకు అలవాటు లేని మరో వృత్తిని చేపట్టాల్సి వచ్చింది. ఆధిక్యం తమది కాబట్టి, అధికారం తమదే అని అధికార పదవులను చేపట్టిన వారికి పాలనానుభవం లేకపోవటం, పాలనపై వారికి దృష్టి లేకపోవటంతో సర్వత్ర అరాచకం చోటు చేసుకుంది. ఎంతసేపూ మతాంతీకరణలు చేయటం, దోచుకోవటం, ఆస్తులు కాజేయటం వంటి వాటి పట్ల దృష్టి తప్ప పాలన పట్ల, వ్యవస్థ నిర్మాణం పట్ల దృష్టి లేకపోవటంతో కశ్మీరు అస్తవ్యస్తమైంది. ఈ పరిస్థితిని చక్కబెట్టటం ప్రారంభించాడు సుల్తాన్ జైనులాబిదీన్.

ఆయన కశ్మీరు దుస్థితికి, అస్తవ్యస్తతకు కారణం గ్రహించాడు. పాలనానుభవం లేనివారు, పాలన కన్నా దోచుకోవటంపై ఆసక్తి కలవారు నిర్ణయాత్మక స్థానాలలో ఉండడం వల్ల కశ్మీరం అల్లకల్లోలమవుతోందని గ్రహించాడు. అందుకని అర్హత లేని వారందరిని ఉన్నత స్థానాల నుంచి తొలగించాడు. దీన్ని జోనరాజు, ఆయన అవలంబించిన పద్ధతులు చెరకు లోని తీపి లాగా, పూర్వ రాజుల పాలన కోసం తపిస్తున్న ప్రజల దాహం తీర్చిందని అభివర్ణించాడు. చలికి నాశనమైన మొక్కలను, వసంతం చిగురింపజేసినట్టు పూర్వ రాజులు అమలుపరిచిన విధానాలను విస్మరించి రాజు గతంలోని మంచి రాజుల పాలనను తిరిగి నిలిపాడు అన్నాడు. అణచివేయటం వీలు లేని శత్రువులను అణచివేశాడు అన్నాడు. ఈ వర్ణనలన్నీ జోనరాజు స్పష్టంగా చెప్పలేని అనేక విషయాలను మార్మికంగా చెప్తాయి.

ఒక పద్ధతిలో లాభం పొందుతున్నవాడు, ఆ పద్ధతిని వదులుకోవటానికి ఇష్టపడడు. అలా ఒక సమూహం ఆ పద్ధతి వల్ల లాభం పొందుతుంటే, ఆ పద్ధతి మారటానికి ఆ సమూహం ఆమోదించదు. ఇది సర్వసాధారణం. జైనులాబిదీన్ అధికారం స్వీకరించి, మతమార్పిళ్ళ వల్ల, దోచుకోవటం వల్ల, పన్నులు వసూలు చేస్తూ వ్యక్తులను హింసిస్తూ ఉండడం వల్ల లాభాలు పొందుతూ అధికారం అనుభవిస్తున్న వారందరి ఆట కట్టించాడు. ఇస్లామేతరులపై హింసను ఆపాడు. మతాంతరీకరణను నిలిపివేశాడు. దాంతో ముని ఆశ్రమంలో ఇతర జంతువులపై దాడులు చేయని సింహాల్లా, గతంలో క్రూరంగా వ్యవహరించిన వారంతా బుద్ధిగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తరువాత, అంటే, కశ్మీరంలో ఇస్లామేతరులపై దాడులు జరగవని, వారి ఆస్తులు దోచుకోరనీ, హింసించి బలవంతంగా మతం మార్చరనీ, అనవసరంగా అధిక పన్నులు విధించి వసూలు చేయరనీ నమ్మకం కలిగించాకా, జైనులాబిదీన్, ఇతర దేశాలకు పారిపోయిన కశ్మీరీ పండితులను తిరిగి కశ్మీరుకు ఆహ్వానించాడు.

ఇస్లామీయుల పాలన ఆరంభమయిన తరువాత కశ్మీరులో విజ్ఞానార్జన స్తంభించిపోయింది. అత్యద్భుతమైన సాహిత్యానికి, విజ్ఞానానికి కశ్మీరు పెట్టింది పేరు. అలాంటి కశ్మీరులో ఇస్లాం ఆమోదించిన విజ్ఞానం తప్ప మరో విజ్ఞానాన్ని ఆమోదించని వ్యవస్థ వల్ల ప్రాణాలు రక్షించుకోవటంపై తప్ప, విజ్ఞానార్జన పట్ల ఎవరూ దృష్టి పెట్టలేని పరిస్థితి నెలకొంది. అలాంటి పరిస్థితిని చక్కబరుస్తూ జైనులాబిదీన్, పండితులను కశ్మీరుకు ఆహ్వానించాడు. వారి ప్రతిభను బట్టి, వారి పూర్వ ఉద్యోగాలను అనుసరించి వారికి కశ్మీరులో వసతులు కల్పించాడు. దాంతో మళ్ళీ కశ్మీరులో ఒక వ్యవస్థ అంటూ ఏర్పడడం ప్రారంభించింది. అందుకే జోనరాజు – రాజు అందరినీ సమానంగా చూశాడనీ, ఎలాగయితే వ్యాపారుల త్రాసు సమతౌల్యం తప్పదో, అలాగే సుల్తాన్ అందరినీ సమంగా చూశాడనీ రాశాడు. కానీ ఆ సమానంగా చూడటం ఏమిటో, అణచివేయలేని దుష్టులు ఎవరో స్పష్టంగా రాయలేదు. ఇందుకు కారణం ఊహించటం కష్టం కాదు.

పండితులను ఆహ్వానించి వారికి నిర్ణయాత్మక స్థానాలు కట్టబెట్టటం ఆయా స్థానాలను అనుభవిస్తున్నవారు మెచ్చరు. కొత్తగా వచ్చిన వారిపై మాత్సర్యం పెంచుకోవటం, అవకాశం దొరికితే వారి దోషాలు సుల్తానుకు ఎత్తి చూపించి, శిక్షింప చేయాలనుకోవటం సహజం. ఇలాంటి పరిస్థితులలో సుల్తాన్ ఆశ్రయంలో ఉంటూ, సుల్తాన్ మతస్థులకు ఆగ్రహం కలిగించకుండా, ఎవరికీ కోపం రాకుండా చూసుకుంటూ, అనుక్షణం పాము పడగ నీడన నివసిస్తున్నట్లు నివసించాల్సి వస్తున్న తరుణంలో జోనరాజు రాజతరంగిణిని ఎంత జాగ్రత్తగా, తెలివిగా రాయాల్సి ఉంటుందో ఊహించటం కష్టం కాదు. అందుకే జోనరాజు ఎప్పుడూ ఏ సుల్తానునీ తప్పుపట్టలేదు. ఎవరినీ తిన్నగా విమర్శించలేదు. ఏ విషయాన్నీ సూటిగా చెప్పలేదు. తాను చెప్పదలచుకున్నది గుంభనగా చెప్పాడు. దాన్ని అర్థం చేసుకునే బాధ్యత భావి తరాల విజ్ఞతకు వదిలివేశాడు.

కశ్మీర వ్యవస్థను సరైన దారిలో పెట్టాలని తలచిన జైనులాబిదీన్ ముందుగా పాలనా వ్యవస్థను సంస్కరించటం ఆరంభించాడు. మతం మారినందువల్లో, మత పెద్దలకు సన్నిహితులవటం వల్లనో, తీవ్రమైన మతోన్మాదం ప్రదర్శించటం వల్లనో ఉన్నత పదవులను పొందిన వారందరినీ తొలగించి, అర్హత కలవారికి తగిన బాధ్యతలను అప్పజెప్పాడు. ఇందుకోసం కశ్మీరు వదిలి వెళ్ళిన అనుభవజ్ఞులైన పండితులందరినీ వెనక్కు రప్పించి, వారికి తగిన భద్రతను కల్పించాడు. వారి అర్హతకు, ప్రతిభకు తగ్గ పదవీ బాధ్యతలను అప్పగించాడు. దాంతో కశ్మీరు వదిలివెళ్ళిన విజ్ఞాన స్రవంతిని మళ్ళీ వెనక్కు రప్పించాడు. జోనరాజు ప్రస్తావించినది ఈ ‘విద్యా ప్రవాహితా తేన గుణినా గుణరాగిణా’ గురించే.

పాండిత్యం విషయంలో, శాస్త్రీయ విజ్ఞానం విషయంలో, సాహిత్యంలో భారతదేశానికి తలమానికం అనదగ్గది కశ్మీరం. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతికి ఒక ప్రత్యేక గుర్తింపు రావటంలో కశ్మీరు ప్రధాన పాత్ర వహించింది.

“Kashmir (Bharat) has enriched the global code of conduct with its conviction of Dharma, virtue of peaceful co-existence, and belief in the theory of Karma.” (John Mackenzie, ‘Hindu Ethics’).

క్రీ.శ. 631, 751 లలో కశ్మీరు పర్యటించిన యువాన్‍త్సాంగ్, జౌనాంగ్ వంటి చైనా యాత్రికుల రచనల ప్రకారం, దేశంలో ఎవరైనా పండితుడిగా గుర్తింపు పొందాలంటే, వారు కశ్మీరు పండితులతో చర్చించటం తప్పనిసరి.

“People of Kashmir are culturally acclaimed as well as lovers of Education. For centuries, Education and Knowledge have been a matter of reverence and honor.” అని రాశాడు యువాన్‍త్సాంగ్.

శ్రీ.శ. 1102లో మహమ్మద్ గజనీతో పాటుగా భారత్ ప్రవేశించిన అల్బెరునీ కశ్మీరులోని విద్యను, పాండిత్యాన్ని చూసి ముగ్ధుడయిపోయాడు. “Kashmir has been the most significant Education center of Hindu scholars. Knowledge seekers from far and wide, visit Kashmir to learn Sanskrit and many of them get attracted to the panoramic beauty and scenic landscape surrounding and settle here.” అని రాశాడు అల్బెరూనీ.

ఆ కాలంలో కాశీ, కశ్మీరాలు భారతీయ విద్య, విజ్ఞానాలకు రెండు ప్రధాన కేంద్రాలు. చరిత్ర రచయితలు ‘నలంద’కు ఇచ్చిన ప్రాధాన్యం  కాశీ, కశ్మీరాలకు విజ్ఞాన కేంద్రాలుగా ఇవ్వరు. కానీ ఆనాడు పండితుడిగా గుర్తింపు పొందాలంటే కాశీలో విద్య పూర్తి చేసుకుని కశ్మీరులో పండితుల వద్ద శిష్యరికం చేయటం తప్పనిసరి. ఈనాటికీ ‘కాశీ’లో విద్యాభ్యాసం పూర్తయిన తరువాత విద్యార్థులు కశ్మీరు   ప్రయాణిస్తున్నట్లు కశ్మీరు దిశలో ఏడడుగులు వేస్తారు. అప్పుడే వారి విద్యార్జన సంపూర్ణమైనట్టు.

ఒకప్పుడు కశ్మీరు లోయలో ఒక పెద్ద కళాశాల ఉండేది. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు ఇక్కడకు వచ్చి ఉచితంగా చదువుకునేవారు. పధ్నాలుగవ శతాబ్దం వరకూ కళాశాల విజ్ఞాన విస్తరణ చేసేది. పధ్నాలుగవ శతాబ్దంలో పండిత పురుషోత్తం కౌల్ జీ ఈ మహా విద్యాలయానికి అధినేత. గురు నానక్ దేవ్ తనయుడు శ్రీ చంద్ ఈ మహావిద్యాలయంలోనే చదువుకున్నాడు. తరువాతి కాలంలో మొఘల్ రాకుమారుడు ‘దారా షికోవ్’ కూడా ఇక్కడే సంస్కృతం నేర్చుకున్నాడు. శారదాపీఠం కశ్మీరు నుదుట కుంకుమబొట్టు లాంటిది. అలాంటి కశ్మీరంలో ఇస్లాం ఆధిక్యం సాధించటంతో అనూహ్యమైన మార్పులు సంభవించాయి. ‘విజ్ఞానం’ స్వరూపం మారిపోయింది. ‘విద్య’ అనే పదం అర్థం మారిపోయింది. కశ్మీరులో విజ్ఞానానికి, పాండిత్యానికి పర్యాయపదాలుగా నిలిచిన వారంతా కశ్మీరు వదిలి పారిపోయారు. జీవిక కోసం జరిగిన పోరాటంలో విజ్ఞానం వలసపోయింది.

అలా వలస వెళ్ళిన విజ్ఞానాన్ని తిరిగి కశ్మీరులో సజీవంగా నిలపాలని ప్రయత్నించాడు జైనులాబిదీన్. సంస్కృతం, పర్షియన్ భాషల నడుమ వంతెన నిర్మించాలని ప్రయత్నించాడు. జైనులాబిదీన్ ఈ ప్రయత్నాల ఫలితంగానే, కశ్మీరు సంపూర్ణంగా మొఘలుల అధికారంలోకి వచ్చేంత వరకూ కశ్మీరులో సంస్కృత భాషలో సృజన జరిగే వీలు చిక్కింది. సంస్కృత కావ్యాలు పర్షియన్ భాషలోకి, పర్షియన్ కావ్యాలు సంస్కృతంలోకి అనువాదమయ్యాయి. ఫలితంగా అక్బర్ రాజతరంగిణి గురించి విని, దాన్ని పర్షియన్ భాషలోకి అనువదింపజేశాడు. అలా ‘రాజతరంగిణి’ సజీవంగా నిలిచే వీలు చిక్కింది. బ్రిటీష్ వారు దేశంపై పట్టు సాధించిన తరువాత రాజతరంగిణిని ఆంగ్లంలోకి అనువదించి, పరిశోధించటంతో కశ్మీరు ప్రాచీన చరిత్ర సజీవంగా ఈనాటికీ అందరికీ తెలిసే వీలు చిక్కింది. కానీ విద్య విషయంలో ఒకప్పటి వైభవం కశ్మీరు తిరిగి పొందలేకపోయింది. ఆ వైభవాన్ని తిరిగి కశ్మీరుకు రప్పించాలని 15వ శతాబ్దంలో జైనులాబిదీన్ చేసిన ప్రయత్నాన్ని జోనరాజు అభినందిస్తూ, ప్రస్తావించాడు రాజతరంగిణిలో.

ఈ సందర్భంగా ఒక విషయాన్ని ప్రస్తావించుకోవాల్సివుంటుంది. ప్రపంచంలో ఇతర నాగరికతలు సరయిన వ్యవస్థను ఏర్పరచుకోకముందే భారతదేశం సువ్యవస్థితమై వుంది. శాస్త్రీయ విజ్ఞాన పరిశోధనలు పలు విభిన్నమైన దిశలలో ఎంతో లోతుగా సాగాయి. సాహిత్యమే కాదు, కళలే కాదు, వైజ్ఞానిక విషయాలే కాదు, మానవ జీవితానికి, విశ్వ ఆవిర్భావానికి, విశ్వ రచనాప్రణాళికతో సహా విశ్వంలోని ప్రతి అంశం గురించి, కనిపించేవీ, కనిపించనివితో సహా అనంతమయిన అంశాలగురించి అత్యంత సూక్షంగా, ఎంతొ లోతుగా పరిశోధనలు జరిగాయి. కానీ, ఈ విజ్ఞానం, ఈ అభివృధ్ది సర్వం ఎన్నెన్నో విదేశీయుల దాడులను ఎదుర్కుని నిలిచినా, ఇస్లామీయుల దాడితో తీవ్రంగా దెబ్బతిన్నది. భారతీయ వైజ్ఞానిక అభివృధ్ధి అనూహ్యమైన పరిస్థితుల్లో హఠాత్తుగా స్థంభించిపోయినట్టయింది. వెయ్యిప్రభలతో వెలుగుతున్న దీపం హఠాత్తుగా అదృశ్యమై నలువైపులా అంధకారం చుట్టుముట్టినట్టయింది. ఇలాంటి పరిస్థితిని ఒక్క శ్లోకంలో వివరించాడు జోనరాజు. ఇదే సమయానికి యూరపు దేశాల్లో సాంస్కృతిక పునరుజ్జీవనం ఆరంభమయింది. విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి వేగవంతమయింది. ఈనాడు మనల్ని మనం తక్కువ చేసి మాట్లాడుతూ, యూరోపియన్ దేశాలతో పోల్చి తీసిపారేసేప్పుడూ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సివుంటుంది. ఓటి కుండలోంచి నీరు కారిపోయినట్టు విజ్ఞానం సర్వం కశ్మీరు వదలి పోయింది. ఆ విజ్ఞాన స్రవంతిని కశ్మీరులో తాత్కాలికంగానయినా తిరిగి ప్రవహింపచేశాడు జైనులాబిదీన్. కశ్మీరం అదృష్టం కొన్నాళ్ళయినా అలాంటి సుల్తాన్ లభించాడు. కానీ, దేశం అంతటా, బయటకు ప్రవహించిన విజ్ఞాన స్రవంతి బయటనుంచి ఎటు పోయిందో ఎవరికీ తెలియదు. అది వెనక్కు తిరిగి రాలేదు. అందుకే,  ఇస్లామీయిలు భారతదేశంలో అడుగుపెట్టిన తరువాత భారతదేశంలో అంధకారయుగం ఆరంభమయిందనుకోవచ్చు. శాస్త్రీయ వైజ్ఞానిక పరిశోధనలకన్నా, ప్రాణాలు కాపాడుకోవటంకోసం, ధర్మాన్ని పరిరక్షించి, తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ సజీవంగా నిలుపుకోవటం కోసం జరిపే పోరాటయుగం ఆరంభమయిందనుకోవచ్చు. భారతీయ సామాజిక, మానసిక, ధార్మిక పరిణామక్రమం గురించి ఎలాంటి తీర్మానాలు చేయాలన్నా  అనాటి సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకతప్పదు. ఆ పరిస్థితులను సూక్ష్మంలో ప్రదర్శిస్తుంది జోనరాజ రాజతరంగిణి. ఇస్లామ్ పెను తుఫాను తాకిడికి అల్లల్లాడిపోయిన భారతీయ మహా వృక్షం పరిస్థితిలో ఒక ఆకు స్థితిని వర్ణించిన  ప్రత్యక్ష సాక్షి జోనరాజ రాజతరంగిణి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here