జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-61

0
9

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

దోషచ్ఛేదకరో రాజా క్రమాద్విషగివానలమ్।
కశ్మీరేషు సదాచారమదీపయదుపక్రమైః॥
(జోనరాజ రాజతరంగిణి 773)

[dropcap]ఎ[/dropcap]లాగయితే వైద్యుడు, శరీరంలోని రోగ కారక శక్తులనొకటొకటిగా నిర్మూలిస్తాడో, అలాగే, రాజు కశ్మీరంలో దుష్టులను అణచి, ఒకటొకటిగా కశ్మీరు సదాచారాలను సంరక్షించాడు.

“In estimating Zain-ul-abidin’s behaviour Jonaraja tells us that it was an amalgam of kindness and harshness. As he was a court chronicler, his narrative presents only the bright side of the picture.” (Rajatarangini of Jonaraja, Srikanth Kaul)

జోనరాజు జైనులాబిదీన్‍ను అకాశానికి ఎత్తేయటం, గుక్క తిప్పుకోకుండా పొగడటం మన విశ్లేషకులకు నచ్చలేదు. జైనులాబిదీన్ ఆశ్రయంలో ఉన్నాడు కాబట్టి, ఆస్థాన పండితుడు కాబట్టి జైనులాబిదీన్‍ను పొగడటం తప్ప అతనిలోని లోపాలను జోనరాజు ప్రదర్శించలేదని చరిత్ర విశ్లేషకులు అభిప్రాయపడతారు. జోనరాజు రాజతరంగిణి ‘One-sided History’ అని అంటారు.

చరిత్ర విశ్లేషకులు ఎదురుగా ఉన్నది మాత్రమే చూడగలరు. ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి ప్రాతిపదిక quantifiabality. ప్రతి దాన్ని గణాంకాలలో కుదించి చెప్పగలిగితేనే అది ఆధునిక విజ్ఞాన శాస్త్రం పరిధిలోకి వస్తుంది. లేకపోతే అది విజ్ఞాన శాస్త్రం పరిధిలోకి రాదు. అంటే, ప్రతీది, పరిశోధనకు, పరిశీలనకూ లొంగి ఆ ఫలితాలను అంకెలలో ప్రతిబింబించగలగాలన్న మాట. కాబట్టి, జోనరాజు జైనులాబిదీన్‍ను పొగడటం మాత్రమే కనిపిస్తుంది. పైగా, భారతదేశంలో బ్రాహ్మణులు రాజాస్థానంలో ఉంటూ రాజులను పొగుడుతూ, వారి ప్రేయసిల మెల్లకన్నులపై కవిత్వాలు రాస్తూ పబ్బం గడుపుకున్నారని ఓ పద్ధతి ప్రకారం ప్రచారం జరిగింది. దాంతో మన కవులు రాసిన కావ్యాలను విశ్లేషించటం, వారి రచనలను చూసి అర్థం చేసుకునే దృష్టి సర్వం మారిపోయాయి. అందుకే జైనులాబిదీన్ లోని మంచి మాత్రమే అంటే ఒక పార్శ్వాన్ని మాత్రమే జోనరాజు ప్రదర్శించాడనిపిస్తుంది. కానీ జోనరాజు నాటి పరిస్థితులను, ఆ కాలంలో కశ్మీరులో పండితుల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే జైనులాబిదీన్ మామూలు మనిషిలా, సుల్తాన్‍లా కాదు ఒక అవతార పురుషుడిలా, దైవానికి ప్రతిరూపంలా అనిపించటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. జోనరాజు రాసిన దానిలో అనవసర పొగడ్త కానీ, అతిశయోక్తి కానీ ఏమీ లేదనిపిస్తుంది.

ఈ సుల్తాన్ జైనులాబిదీన్ గురించి పర్షియన్ భాషలో రచించిన ‘బహరిస్తాన్-ఇ-షాహ’లో సుల్తాన్ జైనులాబిదీన్ ‘patronized crowds of infidels and tribes of polytheists’ (సనాదీద్ కుఫ్రా వా తవైఫ్  ముష్రికాన్) అని చులకనగా దూషిస్తున్నట్లుగా రాయటం గమనిస్తే, ఎందుకని జోనరాజుకు   జైనులాబిదీన్ ఒక్క పనిలో కూడా దోషం కనబడలేదో, కనబడదో అర్థమవుతుంది.

ప్రస్తుత ప్రపంచంలో స్వదేశంలోనే కాందిశీకులుగా దుర్భర జీవితం గడుపుతున్న కశ్మీరీ పండితులను, కశ్మీరం రప్పించి, వారు గతంలోలా స్వేచ్ఛగా, భద్రంగా జీవించేటట్టు ఎవరయినా చేస్తే, పండితుల దృష్టిలో ఆ వ్యక్తి దైవ సమానమవటంలో ఆశ్చర్యం ఏమైనా ఉందా? పైగా, చుట్టూ తమని ద్వేషిస్తూ, దూషిస్తూ, అవకాశం లభిస్తే చాలు చీల్చి చెండాడడానికి సిద్ధంగా ఉన్న మానవ సమూహం నడుమ తమని రక్షిస్తున్న వ్యక్తి ‘దైవం’ కావటంలో ఆశ్చర్యం ఏమైనా ఉందా? ఆధునిక ప్రజాస్వామ్య దేశంలో, మీడియా అత్యంత అభివృద్ధి చెందిన కాలంలో ప్రజాభిమానం కల నాయకులు సాధించలేనిది; మధ్యయుగంలో, కాఫిర్‍లను ఖతం చేసేందుకు ఉవ్విళ్ళూరుతూ అసూయాద్వేషాలు నిండి ఎగసి పడుతున్న పచ్చ సముద్రానికి అడ్డుపడి మరీ ఈ పండితులకు రక్షణ నివ్వడం మామూలు విషయం కాదు. అత్యంత గౌరవించదగ్గ భారతీయ రాజులలో శ్రీకృష్ణదేవరాయల వంటి మహానుభావుడి సరసన నిలబడగల సుల్తాన్ జైనులాబిదీన్.

నిజానికి జోనరాజు జైనులాబిదీన్‍ను పొగుడుతున్నట్టు అనిపించినా, ఆయన వాడిన ఒకో  పదం, ప్రదర్శించిన భావం, వర్ణనలు సర్వం పైకి కనిపించే ఒక  నిజం మాటున దాగిన వంద  చేదు నిజాలను పొందుపరచుకున్నవి, ప్రతి దాన్లో భావాన్ని చూసే వారికి అందవు. సృజనాత్మకాభినివేశంతో , అక్షరాలలో పొందుపరిచిన కవి హృదయావేశాన్ని గ్రహించగలిగినప్పుడే, అసలు సత్యాన్ని అందుకునే వీలవుతుంది. అలా కానప్పుడు శబ్దాలు, అర్థాలు మిగులుతాయి, శబ్దాల ప్రాణాలు అందవు. ‘కశ్మీరేషు సదాచారమదీపయదుపక్రమైః’ అన్న శ్లోకంలో ముందుగా ‘దోషాలను వైద్యుడు ఎలా తొలగిస్తాడో’ అన్నది కీలకమైన భావం. తరువాత శ్లోకాలలో ఒకటొకటిగా దోషాలను చెప్తూ, వాటిని జైనులాబిదీన్ ఎలా సవరించాడో చెప్తాడు జోనరాజు.

దీనికన్నా ముందరి శ్లోకంలో విజ్ఞాన స్రవంతిని కశ్మీరంలో మళ్ళీ ప్రవహింప చేశాడన్నాడు. ఇప్పుడు సదాచారాన్ని కాపాడాడంటున్నాడు. అదీ శరీరంలోని దోషాలను వైద్యుడు తొలగించినట్టు దురాచారాలను తొలగించి సదాచారాన్ని నిలిపాడు అంటున్నాడు.

జైనులాబిదీన్ తొలగించిన దురాచారాలేమిటి? అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానాలలో పరమత ద్వేషం, ప్రధానంగా వినిపిస్తుంది. ఈ పరమత ద్వేషం ఫలితంగా, కశ్మీరు సంపూర్ణంగా ఇస్లాంమయం అయింది. కేవలం 11 పండిత కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ కశ్మీరంలో ఉన్నాయి. విజ్ఞాన స్రవంతి కశ్మీరును వదిలి వెళ్ళిపోయింది. దాన్ని వెనక్కు రప్పించాడు జైనులాబిదీన్. తరువాత పరమత ద్వేషాన్ని అదుపులో పెట్టాడు. మందిరాల ధ్వంసాన్ని ఆపాడు. ఇవన్నీ చేయటం వల్ల పండితులకు జైనులాబిదీన్ దేవుడయ్యాడు. కానీ ఇస్లామీయులకు అతను కాఫిర్ లకు ప్రాధాన్యమిచ్చే ‘దోషి’ అయ్యాడు. ‘ఇస్లాం ప్రమాదంలో పడింది’ అన్న భావన సమస్త ఇస్లాం సమాజాన్ని ఒకటి చేస్తుంది. తమ మత రక్షణ కోసం సర్వం త్యాగం చేసేట్టు చేస్తుంది. అలాంటి తీవ్రమైన ఉన్మత్తత కల మతాభిమానులను అదుపులో పెట్టి, వారి ఆవేశానికి అడ్డుకట్ట వేసి, కశ్మీరు నుండి వెళ్ళిపోయిన పండితులను రప్పించి, వారికి ఉన్నత పదవులు కట్టబెట్టి, గౌరవించి, స్వేచ్ఛను, భద్రతను ఇవ్వటం ఎంత పొగిడినా తక్కువే. అందుకని వ్యాధిగ్రస్థమైన శరీరంలోని దోషాలను తొలగించి స్వస్థత నిచ్చినట్టు, ఒక వైద్యుడిలా కశ్మీరును పట్టి పీడిస్తున్న దురాచారాల రుగ్మతలను తొలగించి, సదాచారాలను నిలిపాడు జైనులాబిదీన్ అంటున్నాడు జోనరాజు. ఇందులో అతిశయోక్తులు, అనవసరంగా పొగడటాలు ఏమీ లేవు.

అహంకారాగదంకారో రాజా ప్రకృతి వృద్ధయే।
దర్శనానాం స ధాతూనామివోల్బణ మశీషమత్॥
(జోనరాజ రాజతరంగిణి 774)

అందరి అహంకారాలను అణచివేస్తూ, రాజ్యాన్ని శక్తిమంతం చేసేందుకు, శరీరంలో అధికంగా ఉన్న ధాతువులను అదుపులో పెట్టినట్టు, దేశంలో చలామణీలో ఉన్న పలు తాత్విక సిద్ధాంతాలను అదుపులో పెట్టాడు.

పై శ్లోకం సంపూర్ణార్థం గ్రహించాలంటే ఆ కాలం నాటి పరిస్థితులను పరామర్శించాల్సి ఉంటుంది. కశ్మీరులో ఇస్లామీయులలో అనేక విభేదాలుండేవి. హమదానీల ప్రభావం ఓ వైపు, షేక్ నూరుద్దీన్ ప్రభావం ఇంకో వైపు, మరో వైపు షేక్ బహాఉద్దీన్ గంజ్ బక్ష్ ప్రభావం, ఇంకో వైపు సయ్యద్ మహమ్మద్ మదాని వంటి వారి ప్రభావాలు కశ్మీరీ ఇస్లామీయులలో పలు భేదాలకు కారణమయ్యాయి. ఒకరొకరిది ఒకో తత్త్వం. అందుకే జోనరాజు పలు విభిన్నమైన దర్శనాలను (తాత్విక సిద్ధాంతాలు) అదుపులో పెట్టాడు అన్నాడు. సుల్తాన్ నిజాముద్దీన్ బక్ష్‌ను గౌరవించినా షేక్ బహా-ఉద్-దీన్ గంజ భక్ష్‍కు భక్తుడు.

బహాఉద్దీన్ కశ్మీరుకు ఖాలిల్లాన్ (పర్షియా) నుండి వచ్చాడు. కశ్మీరీ సూఫీలతో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నాడు. వారి నుండి ఎంతో నేర్చుకున్నాడు. షేక్ మార్-ఉద్-దీన్ వల్ల ప్రభావితుడయ్యాడు. నేల మీద పడి దొరికిన ధాన్యపు గింజలను ఏరుకుని, వండుకుని తినేవాడు తప్ప ఎవరినీ ఏమీ యాచించేవాడు కాదు. చివరిని సుల్తానిచ్చిన బహుమతులను కూడా స్వీకరించేవాడు కాదు. అయితే ఆ కాలంలో ఇస్లాంలోనే పలు విభాగాలు, తత్త్వాల నడుమ జరిగే పోరుల ఫలితంగా ఓ రోజు ఎవరో అతడిని హత్య చేశారు. హరిపర్బత్ దగ్గర ఉన్న బచీదర్వాజా వద్ద అతడి సమాధివుంది.  జైనులాబిదీన్ బేగమ్, తన ఆభరణాలు అమ్మి అతడి సమాధి కట్టించింది.

ఇలా తాత్విక విభేదాలే కాక, బయటి నుంచి వచ్చిన ఇస్లామీయులు, మతం మారిన ఇస్లామీయుల  నడుమ భేదాలుండేవి. కశ్మీరులో బలవంతంగా మతం మారిన వారి నడుమ కులం ఆధారంగా భేదాలుండేవి. ఇవి సరిపోవన్నట్టు, కశ్మీరుకు తిరిగి వచ్చిన పండితులు, కశ్మీరంలో ఉన్న పండితుల నడుమ కూడా తేడాలుండేవి. బయట నుంచి జైనులాబిదీన్ ఆహ్వానాన్ని పురస్కరించుకుని కశ్మీరు తిరిగి వచ్చిన బ్రాహ్మణులను ‘బనమాసీలు’ అనేవారు. కశ్మీరు వదలకుండా ఉన్నవారిని ‘మలమాసీలు’ అనేవారు. మళ్ళీ వీరిలోనే పర్షియన్ భాష నేర్చుకుని రాజశ్రయం పొందిన వారిని ‘కార్కున్‍లు’ అనేవారు. అలాకాక, యజ్ఞ యగాదులు, పూజా కార్యక్రమాలను నిర్వహించే వారిని ‘బచిభట్టు’ లనేవారు.

ఇక్కడి కర్కూన్‍లే భారతదేశంలో ఇతర ప్రాంతాలలో కాయస్థులుగా గుర్తింపు పొందారు. కశ్మీరులో వీరు బ్రాహ్మణులు. కానీ కశ్మీరు బయట వీరిని  బ్రాహ్మణులుగా పరిగణించలేదు. ఎందుకంటే వీరు రాజు దగ్గర వ్రాతగాళ్ళుగానో, ధనం వసూలు చేసే రెవెన్యూ అధికారులుగానో, గణాంక వివరాల వ్రాయసగాండ్లు గానో వ్యవహరించేవారు. కశ్మీరంలో బ్రాహ్మణులుగా పరిగణనకు గురయినా, కశ్మీరు దాటితే కాయస్థులయ్యేవారు. కాలక్రమేణా వీరు కశ్మీరులో ‘కర్కూన్’లుగానే గుర్తింపు పొందారు. బయట కాయస్థులుగానే మిగిలారు. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం మన సమాజంలో ప్రచారం జరుగుతున్నట్లు భారతదేశంలో కుల వ్యవస్థ వేదకాలం నుంచీ తటస్థంగా లేదని, ఇది అత్యంత చైతన్యశీలి అని అర్థమవుతుంది. ఎవరైనా వేదకాలం నుంచీ మేము అణచివేతకు గురయ్యాం అంటే వారికి  భారతీయ సమాజం అంటే ఏమిటో తెలియదని నిర్ధారించుకోవచ్చు.

తరచి చూస్తే జైనులాబిదీన్ పాలనా కాలం కశ్మీరు చరిత్రలో అత్యంత ప్రాధాన్యం వహిస్తుందని స్పష్టమవుతుంది. ఎలాగయితే కశ్మీరులో రింఛనుడు మతం మారటంతో ఇస్లామీయుల పాలన ఆరంభమై కశ్మీరు చరిత్ర మలుపు తిరిగిందో, అలాగే జైనులాబిదీన్ కాలం కశ్మీరు చరిత్ర గతిపై తిరుగులేని ప్రభావం చూపింది. ఇది జోనరాజు రాజతరంగిణితో పాటు శ్రీవరుడు కొనసాగించిన రాజతరంగిణి చదివితే విస్పష్టమవుతుంది (అందుకే ఈ చర్చని ఇక్కడితో ఆపి ముందుకు సాగాల్సి ఉంటుంది.  లేకపోతే శ్రీవరుడి రాజతరంగిణి, జోనరాజ రాజతరంగిణిలోకి అడుగుపెడుతుంది).

అష్టదిక్పాలకుల శక్తి కల రాజు అన్యాయంగా ప్రవర్తించిన వారికి మరణశిక్ష విధించేవాడు. అతని శత్రువులు, దోషులు పంచభూతాలలో కలిసిపోయేవారు. రాజు తనలోని అంతరంగ  శత్రువును జయించినట్టు కశ్మీరులోని శత్రువులపై విజయం సాధించాడు.

స సూహభట్ట సంస్పర్శ దుష్టయాః శుద్ధయే భుః।
ప్రతాపాగ్నిం ధృవం దీప్తమహాకాశ మజి జ్వలత్॥
(జోనరాజ రాజతరంగిణి 776)

సూహభట్టు స్పర్శతో మలినమైన కశ్మీరాన్ని శుద్ధం చేసేందుకు రాజు తన ప్రతాపాగ్నిని దిగంతాల వరకూ విస్తరింప చేశాడు.

జోనరాజు రచన పద్ధతి గురించి ఎవరికయినా ఎలాంటి అనుమానాలైనా ఉంటే వాటిని పటాపంచలు చేయగల శ్లోకం ఇది.

సూహభట్టు స్పర్శతో కశ్మీరం కలుషితమయింది. దాన్ని తన ప్రతాపాగ్నితో శుద్ధి చేశాడు జైనులాబిదీన్. జోనరాజు ఎందుకని సూహభట్టు మతం మారక ముందరి పేరునే వాడుతూ ఇస్లామీ నామాన్ని కావాలని రాజతరంగిణిలో వాడలేదో స్పష్టం చేస్తుందీ శ్లోకం. సూహభట్టు బదులు ‘సైఫుద్దీన్ స్పర్శతో’ అని ఉంటే ఆనాడే కాదు, ఈనాడూ భయంకరమైన గోల సంభవిస్తుంది. ‘అంటరానితనము అనాదిగా మీ జాతికి మూలధనము’ అని దూషణకు గురవుతున్న బ్రాహ్మణులు ‘సైఫుద్దీన్ స్పర్శతో కశ్మీరం మలినమయినది’ అనటం ఈనాడు కూడా అనరాని మాట అయినప్పుడు, ఇస్లామీయుల దయాదాక్షిణ్యాలపై ప్రాణాలు కాపాడుకుంటున్న జోనరాజు ఆనాడు అలా అనటం, అని బ్రతికి బట్టకట్టటం, అలా రాసిన గ్రంథం బూడిద అవ్వకుండా బ్రతికి భావితరాలకు అందటం అసంభవమైన విషయం. అందుకని తెలివిగా జోనరాజు ‘సూహభట్టు’ అన్న పేరునే వాడేడు. సూహభట్టు సైఫుద్దీన్ అయినా సూహభట్టు అనే తిట్టాడు.

జోనరాజ రాజతరంగిణిని విశ్లేషించినవారు – సూహభట్టు పరమతాన్ని స్వీకరించటాన్ని జోనరాజు ఆమోదించలేదు కాబట్టి, బ్రాహ్మణుడై ఉండి, బ్రాహ్మణుడిపై, భారతీయుడై ఉండి భారతీయులపై అత్యాచారాలు చేసిన విషయం ఎత్తి చూపించటానికి సూహభట్టు అని వాడేడని వ్యాఖ్యానించారు. కానీ జోనరాజు సూహభట్టు గురించి రాసినది అంతా ‘సైఫుద్దీన్’ అని మార్చి చదివితే, కలిగే ఆగ్రహ జ్వాలలు ఈనాటికీ కశ్మీరీ పండితులందరినీ దహించి వేస్తుండేది. బహుశా ఆ కాలంలోనే పండితుల పని అయిపోయి ఉండేది. ఆ ఆగ్రహ జ్వాలలను జైనులాబిదీన్ నియంత్రించగలిగి ఉండేవాడు కాదేమో!

ఇంతగా వైజ్ఞానికంగా అభివృద్ధి చెందిన కాలంలోనే, ఓ మహిళ ఓ టీవీ డిబేట్‍లో ఏం అన్నదో, దాన్లో దోషం ఏముందో కూడా తెలియకుండానే దేశమంతా ఆమె  ‘సర్ తన్ సే జుదా’ కోరింది. ఆమెను సమర్ధించినవారి సర్ తన్సే జుదా అయింది.   ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం దేశాలు ఆందోళన చెందాయి. మానవ హక్కుల పోరాటవీరులు, వాక్స్వాతంత్ర పరిరక్షకులు చురుకుగా పనిచేసే ఈ కాలంలోనే తమ అభిప్రాయాన్ని స్వేచ్చగా వెల్లడించే వీలులేనప్పుడు ఆ కాలంలో ,  మధ్యయుగంలో సుల్తాన్ అధికారంలో ఉన్న కాలంలో, అంత వరకూ రక్తం రుచి మరిగిన పులుల్లా, మతాంతరీకరణతో ఉత్తేజితులయినవారు ఇస్లామీయుడి పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేసినవాడిని వదిలిపెట్టటం ఊహకి అందనిది. ఇంత ఆధునిక వైజ్ఞానిక యుగంలోనే ఇరాన్‍లో 14 ఫిబ్రవరి 1989 న ఓ రచయితకు వ్యతిరేకంగా ఫత్వా జారీ అయితే, దాదాపుగా 33 ఏళ్ళ తరువాత 12 ఆగస్టు 2023న అవకాశం చిక్కగానే, అమెరికాలో ఆ రచయితపై దాడి జరిగింది. రచయిత చావు తప్పి కన్ను లొట్టబోయి బ్రతికాడన్నది వేరే విషయం. కానీ మతపరమైన ఎలాంటి వ్యాఖ్యలను సహించని ప్రతిక్రియ ఈ కాలంలోనే ఇంత తీవ్రంగా ఉంటే, మధ్య యుగంలో, జైనులాబిదీన్ కాలంలో, ఇస్లామీయులకు అధికారం ఉన్న కాలంలో ఎలా ఉంటుందో ఊహించవచ్చు. జోనరాజు ఎలాంటి పరిస్థితులలో, ఎంత జాగ్రత్తగా రాజతరంగిణిని రచించాల్సి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.  సూహభట్టు స్పర్శతో మలినమైన కశ్మీరాన్ని తన ప్రతాపాగ్నితో జైనులాబిదీన్ శుద్ధిపరచాడని తెలివిగా అసలు నిజాన్ని చెప్పకనే చెప్పటాన్ని అభినందించవచ్చు. ఆకాలంలో ప్రదర్శితమయిన పరమత ద్వేషం, అసహనం, ఇస్లామేతరులపై అత్యాచారాలు, మందిరాల విధ్వంసాలు, బలవంతపు మతాంతరీకరణలన్నిటికీ సూహభాట్టును ప్రతీకగా చేసి అతని స్పర్శతో మలినమైన కశ్మీరాన్ని శుధ్ధిచేశాడనటం వెనుక ఉన్న కవి హృదయాన్ని అర్ధం చేసుకోవచ్చు.  ఎందుకంటే, ఇలాంటి ప్రవర్తన సూహభట్టుకు కూడదు. సైఫుద్దీన్ అలా ప్రవర్తించకపోతే కూడదు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here