జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-64

2
11

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

చికిత్సాయం విదగ్ధః స మ్లేచ్ఛభీత్యా వ్యలంబత।
స్ఫులింగదగ్ధః పురుషః స్పృశత్యపి మణిం చిరాత్॥
(జోనరాజ రాజతరంగిణి 813)

[dropcap]ప్ర[/dropcap]జలు అభిమానించే జైనులాబిదీన్ చేతిపై వ్రణం మొలిచింది. చికిత్స చేసే సరైన వైద్యుడు కశ్మీరంలో లభించలేదు. దాంతో వైద్యుడిని వెతుకుతూ రాజభటులు నలు దిశలా ప్రయాణించారు. వారికి ‘శీర్యభట్టు’ అనే వైద్యుడు లభించాడు. ఎలాగయితే ఎడారిలో ప్రయాణించేవారికి నీటి ఊట లభిస్తుందో, అలా భటులకు ‘శీర్యభట్టు’ దొరికాడని అంటాడు జోనరాజు. ఇక్కడ మరో ప్రధానమైన శ్లోకాన్ని రచించాడు జోనరాజు.

సాధారణంగా, చరిత్ర గ్రంథాలను చరిత్ర పరిశోధకులు విశ్లేషిస్తారు. వారి దృష్టి ఎంత సేపూ చారిత్రక అంశాల పైన ఉంటుంది కానీ కవి హృదయాన్ని గ్రహించటంపై ఉండదు. అలాగే ఒక కావ్యాన్ని అకడమీషియన్లు, పండితులు విమర్శించి, విశ్లేషించే సమయంలో వారి దృష్టి పదాల వాడకం, వ్యాకరణం, సామాజిక పరిస్థితులు వంటి విషయాలపై ఉంటుంది కానీ కవి హృదయాన్ని గ్రహించటం, కవి ప్రదర్శించిన అంశాల వెనుక ఒదిగిన అసలైన విషయాల గ్రహింపుపై ఉండదు. జోనరాజ రాజతరంగిణిపై వ్యాఖ్యాలను చదివితే, జరుగుతున్న పరిశోధనలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. పైకి చెప్పిన అంశాల కన్నా, స్పష్టంగా చెప్పిన అంశాలలో ఒదిగి ఉన్న అంశాలలోనే కవి హృదయం దాగి ఉంటుంది. కనపడినవి మాత్రమే చూడగలిగేవారు, కనబడకుండా ఒదిగిన వాటిని గ్రహించలేరు.

జైనులాబిదీన్ చికిత్స కోసం వైద్యులను వెతుకుంటే, ఎడారిలోని వారికి నీటి గుంట కనిపించినట్టు ‘శీర్యభట్టు’ లభించాడు. వారు శీర్యభట్టును కశ్మీరుకు వచ్చి జైనులాబిదీన్‍కు చికిత్స చేయమని ఆహ్వానించినట్టు జోనరాజు చెప్పలేదు. కానీ మనం ఊహించవచ్చు. అలా వారు కశ్మీరానికి ఆహ్వానిస్తే, ‘శీర్యభట్టు’ వెంటనే కశ్మీరుకు రాలేదు. భయపడ్డాడు. ఎందుకని అంటే ‘మ్లేచ్ఛభీత్యా వ్యలంబత’. మ్లేచ్ఛులకు భయపడి కశ్మీరం వచ్చేందుకు శీర్యభట్టు తాత్సారం చేశాడు. ఆలస్యం చేశాడు. అంటే, కశ్మీరు రాజు రమ్మని పిలుస్తున్నా, కశ్మీరం వచ్చేందుకు శీర్యభట్టు ఇష్టపడలేదన్న మాట. సరిగ్గా ప్రస్తుతం కశ్మీరులో నెలకొని ఉన్న పరిస్థితి గుర్తుకు వస్తోంది. ప్రభుత్వం హామీ ఇస్తోంది, రక్షణ నిస్తోంది. కానీ కశ్మీరంలో తిరిగి నివసించేందుకు పండితులు వెనుకాడుతున్నారు. ఒక్క దాడి జరగగానే బెదిరి కశ్మీరం వదిలి పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. అయినా అంతగా భయపడుతున్నారంటే, ఆ కాలంలో ఇంకా ఎంత భయపడి ఉంటాడో ఊహించవచ్చు. ముఖ్యంగా, ఇప్పుడు దాడి చేస్తున్నవారు పొరుగు దేశం నుంచి వచ్చిన తీవ్రవాదులు. అప్పుడు దాడులు చేసేవారు కశ్మీరులో నివసించే ప్రజలు. జోనరాజు ‘మ్లేచ్ఛులు’ అన్నాడు. మ్లేచ్ఛుల భయం ఏమిటో, ఎందుకో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే సుల్తాను  ఎంత నచ్చచెప్పినా, ఎన్ని వాగ్దానాలు చేసినా ‘శీర్యభట్టు’ కశ్మీరం వచ్చేందుకు జంకాడు. శీర్యభట్టుకు అన్ని రకాల విషాలకు విరుగుడు తెలుసు. ఆయన పలు రకాల జపతపాలు, యజ్ఞ యాగాలు చేస్తాడు. అందుకే  అతని వైద్యానికి అంత శక్తి.

ఎంతో తాత్సారం చేసి కశ్మీరానికి వచ్చాడు శీర్యభట్టు. అతడికి ఏమేమి హామీ ఇచ్చారో, ఏమేమి వాగ్దానాలు చేశారో, ఎలాంటి రక్షణ కల్పించారో జోనరాజు చెప్పలేదు. పర్షియన్ రచయితలు ఈ విషయాన్ని సూటిగా ప్రస్తావించలేదు కానీ సుల్తాన్ దుష్టుల ప్రభావంలో పడి అదైవికమైన వైద్య విధానాలను, పద్ధతులను అవలంబిస్తున్నాడని మాత్రం రాశారు. అంతే తప్ప, అతని అనారోగ్యాన్ని ప్రస్తావించలేదు. ఆ అనారోగ్యాన్ని ‘శీర్యభట్టు’ అనే కశ్మీరీ పండితుడు నయం చేసాడని ప్రస్తావించలేదు. అందుకే జోనరాజు రాసిన శ్లోకాలు అత్యంత ప్రాధాన్యం వహిస్తాయి.

శీర్యభట్టు కశ్మీరం వచ్చాడు. ‘రాజు అతనికి అభయం ఇచ్చాడు’ అని రాశాడు జోనరాజు.

స్వయం దత్తాభయో రాజ్ఞా ప్రాప్తస్తముదమూలయత్।
శీర్యబట్టో విషస్ఫోటం కరీవ విషపాదపమ్॥
(జోనరాజ రాజతరంగిణి 814)

రాజు అభయం ఇవ్వటంతో శీర్యభట్టు రాజుకు వైద్యం చేశాడు. అచిర కాలంలోనే రాజు చేయిపై విషవ్రణం ప్రేలిపోయింది. అదృశ్యమయిపోయింది. ఎలాగయితే ఏనుగు విషవృక్షాన్ని పెకిలించి వేస్తుందో, అలాగే, రాజు చేతిపై విషపు వ్రణాన్ని శీర్యబట్టు తొలగించాడు.

అంటే, జైనులాబిదీన్ వ్యాధిని శీర్యభట్టు నయం చేశాడన్న మాట. ఆ తరువాత జరిగింది అద్భుతం. ఇలాంటి వ్యక్తిత్వాలు భారతదేశానికే ప్రత్యేకం. ఇలాంటి సంఘటనలు భారతీయ సమాజంలోనే సంభవిస్తాయి.

రాజుకు నయం కాగానే ప్రజలు సంతోషించారు. శీర్యభట్టు కీర్తి దశదిశల వ్యాపించింది. ప్రజలందరూ శీర్యభట్టు దగ్గర వైద్యం చేయించుకోవాలని తహతహలాడారు.

తుష్టేన భూభుజా దత్తాం యథేష్టమపి సంపదమ్।
నైశిష్ట శీర్యభట్టః స యతాత్మేవ వరాంగనామ్॥
(జోనరాజ రాజతరంగిణి 816)

తనకు నయమవటంతో రాజు శీర్యభట్టు తన ఇష్టం వచ్చినంత సంపద ఇచ్చాడట. అంటే పెద్ద ఎత్తున ఐశ్వర్యాన్ని శీర్యభట్టుకు ధారపోశాడు రాజు. కానీ శీర్యభట్టు ఆ ధనం వైపు చూడలేదు. ఎలాగయితే సంపూర్ణ జ్ఞానం పొందిన త్యాగి స్త్రీ వైపు చూడడో, అలా, రాజు ఇస్తున్న ఐశ్వర్యం వైపు కన్నెత్తి కూడా చూడలేదు శీర్యభట్టు.

ఆ తరువాత ఏం జరిగిందో జోనరాజు చెప్పలేదు కానీ సంభవించిన పరిణామాలను బట్టి ఏం జరిగిందో ఊహించే వీలు లభిస్తుంది.

గాలి మనకు కనబడదు. కానీ కదిలే అలలను బట్టి గాలి వీస్తున్నట్లు తెలుస్తుంది. అలానే రాజు ఇచ్చిన ఐశ్వర్యాన్ని శీర్యభట్టు పట్టించుకోలేదు. తిరస్కరించాడని జోనరాజు చెప్పాడు. తరువాత ఏం జరిగిందో చెప్పలేదు. కానీ రాజు ప్రయాణీకుల కోసం పలు విశ్రాంతి గృహాలు నిర్మించాడు. గ్రామం చివరలో నివాస గృహాలు నిర్మించాడు. అరణ్యాలలో రక్షణ గృహాలు నిర్మించాడు.

హాసాః శ్మశాన దేవీనాం సూహభట్టు ప్రతీవ తమ్।
ప్రతిస్థానం విమానాని ప్రేతానామద్భుతం స్తదా॥
(జోనరాజ రాజతరంగిణి 819)

సూహభట్టు దౌష్ట్యానికి గురయి  మరణించిన మహిళలు సూహభట్టును చూసి నవ్వుతున్నారు అంటాడు జోనరాజు.

అంటే సూహభట్టు దుశ్చర్యల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి సమాధులు కట్టారు. సూహభట్టు వల్ల బెదిరి కశ్మీరు వదిలిపోయిన పండితులు ఇప్పుడు తిరిగి కశ్మీరులో స్థిరపడుతున్నారు. సూహభట్టు ఇంత మారణకాండ జరిపీ సాధించినదేమీ లేదని, కశ్మీరులో పండితులు లేకుండా చేస్తానని సూహభట్టు పట్టిన ప్రతిజ్ఞ విఫలమైందని , హేళనగా,  మరణించిన మహిళలు అతడిని ఎద్దేవా చేస్తున్నట్టు నవ్వుతున్నారన్న మాట.    ఎంత కసితో జోనరాజు ఈ శ్లోకం రాసి ఉంటాడో ఊహించవచ్చు. అంత కసిలో కూడా జాగ్రత్త పడ్డాడు జోనరాజు. సూహభట్టును చూసి నవ్వుతున్నారన్నాడు. సూహభట్టు మతం మారేడని, ఇప్పుడతడి పేరు సూహభట్టు కాదన్న విషయాన్ని వదిలిపెట్టాడు.

మ్లేచ్ఛైరుపదృత్తాం క్షోణీమక్షీణకరూణో నృపః।
ఉదహార్షీత్క్రమాదేవం దానవైరివ కేశవః॥
(జోనరాజ రాజతరంగిణి 820)

దానవుల బారిన పడిన ప్రపంచాన్ని నారాయణుడు రక్షించినట్టు, రాజు అంతులేని దయతో మ్లేచ్ఛుల నుంచి ప్రపంచాన్ని రక్షించాడు.

కసి తీరింది!

తిట్టవలసింది, తిట్టాలనుకున్నది, జరిగిన అన్యాయాల పట్ల కలిగిన కసి – అన్నిటినీ తన శ్లోకాల ద్వారా జోనరాజు తీర్చుకోవటం స్పష్టంగా తెలుస్తుంది. పురాణాలలో భూమిని చాపలా  చుట్టిన దానవుల నుంచి విష్ణువు భూమిని రక్షించాడు. ఇప్పుడు కశ్మీరాన్ని మ్లేచ్ఛుల నుంచి జైనులాబిదీన్ రక్షించాడు. జైనులాబిదీన్‍ను విష్ణుమూర్తితో పోల్చాడన్న మాట జోనరాజు. విష్ణుమూర్తి ప్రపంచ పాలకుడు. జైనులాబిదీన్ కశ్మీరు పాలకుడు. అయితే, ఈ నడుమ కొన్ని శ్లోకాల విషయంలో వివాదం ఉంది. కొన్ని ప్రతులలో అదనంగా 30 శ్లోకాలున్నాయి. కొన్ని ప్రతులలో శీర్యభట్టు ఐశ్వర్యాన్ని తిరస్కరించాడన్న శ్లోకం తరువాత – సుల్తాన్ యాత్రికులకు వసతి గృహాలు నిర్మించటం శ్లోకం ఉంటుంది. ఇంకొన్ని ప్రతులలో శీర్యభట్టు ఐశ్వర్యాన్ని తిరస్కరించిన తరువాతి నుంచి అదనంగా 30 శ్లోకాలున్నాయి. కొన్ని సందర్భాలలో జోనరాజ రాజతరంగిణి లోని 816 వ శ్లోకం తరువాత నుంచీ ఉంటాయి. అయితే ఇవి జోనరాజు రచించినవా, లేక ఎవరో రచించి జోడించినవా అన్న విషయంలో ఏకాభిప్రాయం కుదరటం లేదు. ఈ 30 శ్లోకాలు, శీర్యభట్టు ఐశ్వర్యాన్ని తిరస్కరించిన తరువాత నుంచి, సుల్తాన్ యాత్రిక వసతి గృహాలను కట్టడం వరకు జరిగిన విషయాలను చెప్తాయి. అంటే, ఖాళీని పూర్తి చేస్తాయి అన్నమాట. ఇవి జోనరాజ రాజతరంగిణిలో భాగమా? కాదా? అన్నది ఇంకా నిర్ణయించలేదు నిర్ధారణగా. అందుకే ఈ శ్లోకాలు ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సివుంటుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here