జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-67

4
13

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

దేవీ దర్శన విచ్ఛేది తస్య నాసీద్ధి కించన్।
దయా సత్యం వివేకశ్య తమేవాశయత్ తదా॥
(జోనరాజ రాజతరంగిణి 1071)

[dropcap]జై[/dropcap]నులాబిదీన్ తనకు స్వప్నంలో దేవి దర్శనం ఇవ్వాలని కోరాడు. మందిరంలో రాత్రి నిద్రించాడు. కానీ అతడు మ్లేచ్ఛ సంపర్కుడవటంతో దేవి దర్శనం ఇవ్వలేదు. కోపంతో రాజు శారదా దేవి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు. రాజు మంచివాడయినా, అతని సేవకుల దోషాల ప్రభావం నుంచి రాజు తప్పించుకోలేడు. కాబట్టి దేవి అతనికి దర్శనం ఇవ్వలేదని కవి – రాజుకు స్వప్నంలో దేవత దర్శనం ఇవ్వకపోవటాన్ని సమర్థిస్తాడు. అయితే ఈ వ్యర్థమైన తీర్థయాత్రానుభవం రాజు దయ, సత్యం, వివేకం వంటి లక్షణాలకు భంగం కలిగించలేదు. అంటే, ఇంతకు ముందులాగే పరమత సహనం పాటిస్తూ ఇస్లామేతరులను ఆదరిస్తూ రక్షణ కల్పిస్తున్నాడన్న మాట జైనులాబిదీన్.

వ్యావృత్త్య యవనానాం స వనానామివ వారిదః।
హర్షోత్కర్ష వశో కార్షిన్ మహత్ కనక వర్షాణామ్॥
(జోనరాజ రాజతరంగిణి 1072)

తీర్థయాత్ర నుంచి తిరిగి వచ్చిన రాజు, మేఘం అడవుల్లో దట్టంగా వర్షించినట్టు, యవనులపై కనక వర్షం కురిపించాడు. బహుశా, ఇది ఇస్లామీయుల లోని ఛాందసవాదులను సంతృప్తి పరిచే చర్య అయి ఉంటుంది. ఎందుకంటే, సుల్తాన్, పరాయి మతానికి చెందిన మందిరానికి వెళ్ళాడు. భక్తులతో కలిసి పరాయి దేవతను ప్రార్థించాడు. విగ్రహాన్ని  బద్దలు కొట్టాడన్నది వేరే విషయం. ఆ విషయన్ని పక్కనబెట్టి ఆలోచిస్తే, మందిరానికి వెళ్ళి విగ్రహాన్ని  ప్రార్ధించటం  ఇస్లామ్ విరుద్ధమైన చర్య. ఈ పని వల్ల ఇస్లామీయులకు ఆగ్రహం కలిగితీరుతుందని సుల్తానుకు తెలుసు. అందుకని తాను ఇతర మతస్తుల మాయాజాలంలో చిక్కుకోలేదని నిరూపిస్తూ దేవి విగ్రహాన్ని చూర్ణం చేశాడు. ఇంకా శాంతించని వారిపై కనకవర్షం కురిపించాడు. దాంతో సుల్తాన్ పట్ల ఉన్న వ్యతిరేకత సమసిపోయి ఉంటుంది. ఇస్లామీయులపై కనకవర్షం కురిపించటం వెనుక మరో కారణం కూడా ఉండి ఉంటుంది. శీర్యభట్టు వైద్యంతో సుల్తాన్ వ్యాధి నయం అయింది. కాబట్టి శీర్యభట్టుకు కూడా బహుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. శీర్యభట్టుపై కరుణ వర్షాన్ని కురిపించటం కూడా ఇస్లామీయులలో ఆగ్రహం కలిగిస్తుంది. అందుకని ముందుగా ఇస్లామీయులపై కనకవర్షం కురిపించి ఆపై శీర్యభట్టుతో సహా ఇతర పండితులపై కరుణ వృష్టి కురిపించి ఉంటాడు సుల్తాన్.

యత్ర దండ్యా న దండ్యన్తే దుర్బలాస్తర కరమ్ వినా।
భూపతే ప్రాడ్వివాకత్వమ్ స ప్రాపద్ భట్టశీర్యకాః॥
(జోనరాజ రాజతరంగిణి 1073)

సుల్తాన్ శీర్యభట్టుకు న్యాయమూర్తి పదవినిచ్చి గౌరవించాడు. శీర్యభట్టు ఆ పదవిని విచక్షణతో, కారుణ్యంతో నిర్వహించాడు. దండార్హులైనా బలహీనులపై కరుణ చూపాడు. కానీ చోరులపై కనికరం చూపలేదు.

 భారతీయ శాస్త్రంలో పలువురు ‘ప్రాడ్వివాక్’ అన్న పదాన్ని పలు రకాలుగా వర్ణించారు. పురాణాల ప్రకారం ‘ప్రాడ్వివాక్’ అన్న పదానికి ‘న్యాయమూర్తి’ అన్న అర్థం వస్తుంది. ‘అర్థశాస్త్రం’ ప్రకారం ధర్మాలు, తత్వశాస్త్రాలు తెలిసిన వాడిని రాజు ప్రాడ్వివాకుడిగా నియమించాలి. ‘ప్రాడ్’ అంటే ప్రశ్నలు అడిగేవాడు. వివాదాలను ప్రశ్నల ద్వారా పరిష్కరించేవాడు. అందుకని ‘వివాక్’ అయ్యాడు. గతంలో జోనరాజు ఒక శ్లోకం రాశాడు. వివాదంలో ఉన్నవారి నుంది ధనం తీసుకుని తీర్పులు చెప్పేవారిని జైనులాబిదీన్ తొలగించి వ్యవస్థను ప్రక్షాళనం చేశాడు అని. ఆ శ్లోకానికి ఈ శ్లోకం అన్వయించుకుంటే, అవినీతిపరులైన ఇస్లామీయులను తొలగించి, వారి స్థానంలో ధనంపై ఆశలేని శీర్యభట్టును న్యాయమూర్తిగా నియమించాడని అర్థమవుతుంది. తన రోగాన్ని నయం చేసినందుకు సుల్తాన్ ధనాన్నిస్తే శీర్య భట్టు ఆ బహుమతిని నిరాకరించాడు.

ప్రతిజానంస్తదా కోశధన సంభవనే సతి।
స్వగలచ్ఛేదనం భట్టో మిధ్యావక్తుశ్చ విప్లవమ్॥
(జోనరాజ రాజతరంగిణి 1074)

శీర్యభట్టు సత్కార్యాలు సాగించేందుకు  తగిన ధనం రాజ కోశాగారం నుండి అందేది. ఎవరికైనా ధన సహాయ వాగ్దానం చేసి వారికి సహాయం చేయలేని పరిస్థితి వస్తే తన మెడను తానే కోసుకుంటానని ప్రకటించాడు శీర్యభట్టు.

శాఖాభంగ సముద్భూత శబ్దవ్యాప్త చతుర్దిశామ్।
సముదీరయతాం నూనమ బ్రాహ్మణ్యం పదే పదే॥
(జోనరాజ రాజతరంగిణి 1075)

ఈ శ్లోకం అన్వయించటం కఠినతరమైనది. చెట్ల కొమ్మలు విరిచిన శబ్దాలు నలువైపులా వినిపిస్తున్నాయి అంటుంది మొదటి పాదం. రెండవ పాదంలో ఉద్ధరించిన బ్రాహ్మణ్యానికి పదే పదే నమస్కారం చేయాల్సి ఉంటుందంటుంది. ‘సమ ఉదీరయతాం’ అన్న పదం వికాస శీలం, ప్రగతి శీలం అన్న అర్థాలతో పాటు ఉన్నతి శీలం, ఉద్భవిస్తున్న అన్న అర్థాలను ఇస్తుంది. దీన్ని అర్థం చేసుకోవటం భారతీయ సంస్కృతి సంప్రదాయలతో పరిచయం లేని విదేశీయ అనువాదకులకు కష్టం అయింది. Walter Slaje అనే విదేశీ వ్యాఖ్యాత ఈ శ్లోకాన్ని తరువాతి శ్లోకంతో కలిపి “He successfully protected the people bent down with merits by cutting trees for fuel, [which] were bent down with fruit, [thereby] filling all four corners [of the earth] with the sound of branches being broken, telling everywhere of [this] violation of Brahmanical law.” గా అనువదించాడు.

ద్రుమాణాం ఫలనమ్రాణం జనానాం నమతాం గుణైః।
ఛేదాద్రక్షా మకార్షీత్సం జిష్ణురింధన హేతునా॥
(జోనరాజ రాజతరంగిణి 1076)

ప్రతిపదార్థం తీసుకుని భావాన్ని పరిశీలించకపోతే శ్లోకాల అర్థాలు మారిపోతాయి. ‘శాఖాభంగం’ అనగానే కొమ్మలు విరగటంగా భావిస్తే నలుదిక్కులు కొమ్మలు విరిగిన శబ్దంతో నిండిపోయాయి అని అర్థం వస్తుంది. దానికి ‘జిష్ణురింధన హేతునా’ లో ‘ఇంధనం’ అన్న పదం వల్ల  – ఇంధనం కోసం విరిచిన చెట్ల కొమ్మల శబ్దాలతో నాలుగు దిక్కులు నిండిపోయాయి అన్న అర్థం స్థిరపడుతుంది. ఫలాల బరువుతో ఉన్న వృక్షాలలా జనులు గుణాలకు ముగ్ధులై వంగి నమస్కరిస్తున్నారన్న అర్థం తోస్తోంది. రెంటినీ కలుపుకుని శీర్యభట్టు తెలివైన వారిని రక్షించాడు. ఎలాగంటే ఇంధనం కోసం చెట్లని నరకగా – శాఖలు విరుగుతున్న శబ్దాలతో దిక్కులు నిండిపోయాయి. ఇది బ్రాహ్మణుల నియమాలకు విరుద్ధం గానే అర్థమవుతుంది. అస్సలు అర్థం లేని శ్లోకాలుగా కనిపిస్తాయి ఈ రెండు శ్లోకాలు. కానీ పండిత ప్రపంచం Walter Slaje అనువాదాన్ని ప్రామాణికంగా భావిస్తున్నది. జోనరాజ రాజతరంగిణికి ఆయన అనువాదాన్ని ప్రామాణికంగా గుర్తిస్తోంది. కానీ ఏ మాత్రం భారతీయ పద్ధతులతో, పదాల వాడకంతో పరిచయం ఉన్న వారికైనా ఈ రెండు శ్లోకాల అర్థం Walter Slaje అనువాదానికి సరిపోలదని స్పష్టంగా తెలుస్తునే ఉంటుంది. చెట్ల కొమ్మలు నరకటం బ్రాహ్మణుల పద్ధతికి విరుద్ధమో అర్ధం కాదు.

‘శాఖలు’ అంటే కొమ్మలు అన్నది సామాన్య అర్థం. కానీ బ్రాహ్మణులలో శాఖలు ఉండటం మనకు తెలుసు. ‘శాఖాభంగం’ అంటే ఇప్పుడు అర్థం మారుతుంది. కశ్మీరు ఇస్లామీయుల మయం కాక ముందరి పరిస్థితి వేరు. ఇప్పుడు పండితుల జీవిక ప్రశ్నార్థకంలో పడింది. ప్రాణాలు అరచేత పట్టుకుని కశ్మీరు వదిలి పారిపోయినవారు మళ్ళీ భయం భయంగా కశ్మీరులో అడుగుపెడుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వారు మారాల్సి ఉంటుంది. గతంలో లాగా శాఖాభేదాలు, వృత్తిభేదాలు పాటించాలంటే కుదరదు. కాబట్టి కశ్మీరులో నిలుదిక్కులా బ్రాహ్మణులు ‘re-orient’ అవటం సంభవిస్తోందన్న మాట.

కశ్మీరుకు తిరిగి వచ్చిన తరువాత  పండితులలో కొందరు  సంప్రదాయనికి పరిమితమయ్యారు. మరికొందరు పర్షియన్ భాష నేర్చుకుని సుల్తాన్ కొలువులో చేరారు. వీరిద్దరి నడుమ సంఘర్షణలుండేవి. సంప్రదాయాన్ని పాటించేవారు సుల్తాన్ కొలువులో చేరినవారి పట్ల తూష్ణీంభావం వహించేవారు. సుల్తాన్ కొలువులో చేరినవారికి అధికారం ఉండడంతో వారు సంప్రదాయాన్ని పాటించేవారిని చులకనగా చూసేవారు. కానీ వీరంతా కలిసి మళ్ళీ కశ్మీరంలో పాండిత్యాన్ని, విజ్ఞానాన్ని ఉద్ధరించి, పరిమళాన్ని వెదజల్లటం ప్రారంభించారు. శ్రియభట్టు వీరందరినీ ఏకం చేయాలని ప్రయత్నించాడు.  ఫలితంగా వీరి పాండిత్యాన్ని ప్రజలు వేనోళ్ళ పొగడటం  ప్రారంభించారు. ‘జిష్ణురింధనం’ అంటే చెట్లను కొట్టి ఇంధనంగా వాడుకోవడం కాదు. జిష్ణు అన్న పదానికి పలు అర్థాలున్నాయి.

‘జిష్ణు’ అంటే ‘విష్ణువు’ అన్న అర్థం వస్తుంది. విజయం పొందినవాడు, అర్జునుడు, సూర్యుడు, ఇంద్రుడు, వసువు అన్న అర్థాలు వస్తాయి. విష్ణుసహస్రనామాలలో ఒక నామం జిష్ణు. కాబట్టి ‘జిష్ణురింధనం’ అంటే చెట్లు కొట్టి సాధించే ఇంధనం కాదు. ‘వృక్షం’ అంటే ‘కల్పవృక్షం’ అన్న అర్థం కూడా వస్తుంది. కశ్మీరుకి తిరిగి వచ్చిన పండితులు కశ్మీరులో ధర్మాన్ని నిలిపి సుపరిపాలనకు హేతువులుగా నిలిచారు. వారికి ప్రజలు వందనాలు అర్పిస్తున్నారు అన్న అర్థం కూడా వస్తుంది (ఈ రెండు శ్లోకాలను అర్థం చేసుకోవటంలో తోడ్పడిన వేదాంతం శ్రీపతిశర్మకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు).

జైనులాబిదీన్ పాలనను విశ్లేషిస్తూ పలువురు చరిత్ర రచయితలు, జైనులాబిదీన్ పండితులను వెనక్కి రప్పించటం వెనుక, ఆయనకు వ్యాధి నయం చేశారన్న కృతజ్ఞతా భావంతో పాటు పాలనను మెరుగుపర్చాలన్న ఉద్దేశం కూడా ఉన్నదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో జైనులాబిదీన్ పరమత సహనం ప్రదర్శిస్తూ, కశ్మీరుకు మళ్ళీ పురావైభవాన్ని సాధించటంలో శీర్యభట్టు పోషించిన పాత్రను కూడా ప్రస్తావించారు. పై రెండు శ్లోకాల అర్థం సంపూర్ణంగా అవగతమవ్వాలంటే ఈ అంశలను వివరంగా చర్చించాల్సి ఉంటుంది.

“Shri Bhat has, through his revolutionary reforms, organised a classless (శాఖాభంగం) and one class society not only in the history of Kashmir but for the entire Hindu society of India, on the scientific lines, while looking a thousand years ahead” [Maharshi Shri Bhat by Dr. Triloknath Gunjoo]

“In the golden history of Kashmir, the glory of Zainulab Din, would have not been there had not Shri Bhat come in contact with him.” [Aain-e-Akbar by Abul Fazal]

“He (Shri Bhat) carried great influence on the king and his people. He earned this influence through resettlement of his people.” [Shabab-e-Kashmir by Mohd. Din Fak]

ఈ వ్యాఖ్యలు జైనులాబిదీన్ పై శీర్యభట్టు ప్రభావాన్ని స్పష్టంగా తెలుపుతాయి. ఇక శీర్యభట్టు ప్రభావంతో జైనులాబిదీన్, పండితులను కశ్మీరుకు రప్పించటం వెనుక ఉన్న సుపరిపాలన ఉద్దేశాన్ని Culture and Political History of Kashmir అన్న పుస్తకంలో (Vol 2) P.N.K. Bamzai వివరిస్తాడు:

“Imbued with high ideals of kingship, Zain-ul-abidin set himself to improving the material prosperity of the country by energetic and sustained efforts. As can well be imagined he found great frustration among the people and the whole administrative machinery broken down due to the ill-advised policy of Sikandar and the subsequent war of succession. The first requisite, therefore, was to bring some order out of the chaotic conditions prevailing in the country. For this purpose he encouraged the old class of official, the Pandits to return to Kashmir giving them every facility and completely guaranteeing them religious and civil liberties.”

కశ్మీరు ఇస్లామీయుల పాలనలోకి వెళ్ళిన తరువాత మతోన్మాదం విజృంభించి మతాంతరీకరణలపై దృష్టి మళ్ళింది. మందిరాలను ధ్వంసం చేయటం, దోచుకోవటం, అవినీతి, అక్రమాలపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు తప్ప పాలనపై దృష్టి పెట్టలేదు. దాంతో పాలనా యంత్రాంగం అరాచకంగా ఉండేది. దేశం అల్లకల్లోలంగా ఉండేది. నీతి, న్యాయం, చట్టం వంటివి మృగ్యమయ్యాయి. ఈ స్థితిని మెరుగుపరచటానికి, పరిస్థితిని చక్కదిద్ది పాలనా వ్యవస్థను సక్రమ రీతిలో ఏర్పాటు చేసి, ప్రజలకు సరైన పాలనను అందించేందుకు, గతంలో పాలనానుభవం ఉండి, కీలకమైన పదవులను సమర్థవంతంగా నిర్వహించిన పండితులను కశ్మీరుకు రప్పించి వారికి పదవులను కట్టబెట్టాడన్న మాట జైనులాబిదీన్. తద్వార కశ్మీరులో మళ్ళీ పాలన పట్టాలెక్కింది. అవినీతిపరులు, మత ఛాందసులు, అధికార దాహం కలవారందరినీ పక్కకు తప్పించి పండితులకు ఆ పదవులను ఇచ్చాడన్నమాట జైనులాబిదీన్. ఇప్పుడు ఆ రెండు శ్లోకాలను చదివితే చెట్ల కొమ్మలు విరిగే శబ్దాలు, ఇంధనం కోసం కొమ్మలు నరికే శబ్దాలు, బ్రాహ్మణులు శాఖాభంగం చేయటం కనబడవు. సుపరిపాలనను అందించటం ద్వారా ప్రజల మన్ననలను అందుకుంటున్న పండితులు కనిపిస్తారు. కల్పవృక్షంలా ప్రజల బాగోగులు చూస్తున్న పాలనావ్యవస్థ కనిపిస్తుంది.

ప్రతివర్షం రౌప్యపలద్వయమాత్రసుదుగ్రహః।
జాతి రక్షార్థి మాసీద్యశ్చండో దండ ద్విజన్మనామ్॥
(జోనరాజ రాజతరంగిణి 1077)

జోనరాజు రాసినట్టుగా, ప్రామాణికంగా భావిస్తున్న రాజతరంగిణిలోనూ ఇలాంటి శ్లోకం కనిపిస్తుంది. అయితే ఆ శ్లోకం మొదటి పాదం లోని పదాలు తెలియవు.

… … … త్రయదండం నివార్య సః।
ద్విజానాం జాతి రక్షార్థం రౌప్యమాషమ కల్పయత్॥
(జోనరాజ రాజతరంగిణి 817)

బ్రాహ్మణులు తమ ధర్మాన్ని నిలుపుకునేందుకు అవసరమైన బంగారం, వెండిలను ఆయన చెల్లించాడు అన్న అర్థం వస్తుందీ అసంపూర్ణ శ్లోకానికి. దీనికి పాఠ్యాంతరం ఉంది. ఆ శ్లోకం అర్థం ఏమిటంటే, గత సుల్తానులు విధించిన జీజియా పన్నును ఒక ‘మాస’కు తగ్గించటం వల్ల బ్రాహ్మణులు తమ ధర్మాన్ని కాపాడుకునే వీలు లభించింది అని.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here