జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-69

0
9

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

భూపతేః పరదారేషు నిష్కౌతుతమ యం వ్రతమ్।
అభజ్యత పరం తస్య పరశ్రీ పరిరంభణే॥
(జోనరాజ రాజతరంగిణి 822)

[dropcap]శీ[/dropcap]ర్యభట్టు వల్ల చికిత్స పొంది ఆరోగ్యవంతుడయిన తరువాత జైనులాబిదీన్ ప్రవర్తన మారిపోయింది. ఆయన శీర్యభట్టుకు బోలెడంత ధనం ఇవ్వబోతే ఆ ధనాన్ని శీర్యభట్టు తిరస్కరించి అందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు. తాను చికిత్స చేసినందుకు ప్రతిఫలంగా కశ్మీరులోకి తిరిగి పండితులను రప్పించమని అడిగాడు. పండితులు మళ్ళీ కశ్మీరులో సుఖంగా, భద్రంగా నివసించే వసతులు కల్పించమని కోరాడు. శీర్యభట్టు కోరికలోని నిస్వార్థాన్ని గ్రహించాడు సుల్తాను. విజ్ఞానవంతులు, పలు శాస్త్రాలలో నిష్ణాతులు, పాలనానుభవం కలవారు, దక్షులు అయిన పండితులను తిరిగి కశ్మీరు రప్పించటం వల్ల ఒనగూడే లాభాలను సుల్తాను అర్థం చేసుకున్నాడు. ఫలితంగా శీర్యభట్టుకు దాదాపుగా పాలనాపగ్గాలు అప్పగించినంత పని చేశాడు. అయితే, శీర్యభట్టు తెలివైనవాడు. నిజానిజాలు తెలిసినవాడు. అందుకే తాను ప్రత్యక్షంగా పాలనా వ్యవహారాలలో కనబడకుండా, సుల్తాను ద్వారా సర్వ వ్యవహారాలు నడిపించాడు. గతంలో మతం మారిన సూహభట్టు కశ్మీరును నాశనం వైపు పరుగులెత్తించాడు. ఇప్పుడు, శీర్యభట్టు తాను వెనుకన ఉండి కశ్మీరును అభివృద్ధి వైపు, విజ్ఞానం వైపు, సహనం వైపు, మత సామరస్యం వైపు నడిపించాడు. అందుకు ఖ్యాతిని, పేరును, ప్రసిద్ధిని సుల్తానుకు అర్పించాడు.

చరిత్ర రచనల్లో శ్రీకృష్ణదేవరాయలు, అప్పాజీ; చాణక్యుడు, చంద్రగుప్తుడు వంటి పేర్లు మనకు తెలుసు. కానీ జైనులాబిదీన్, శీర్యభట్టుల గురించి తెలియదు. నిజానికి కశ్మీరు గురించి రాసిన పుస్తకాలలోనూ శీర్యబట్టు ప్రస్తావన కనిపించదు. కానీ జైనులాబిదీన్‍కు శీర్యభట్టు పరిచయం కాకముందు ప్రవర్తనను, పరిచయం అయిన తరువాత ప్రవర్తనను పోల్చి చూస్తే, జైనులాబిదీన్ గొప్పతనానికి, పరమత సహనానికి, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, ధార్మికంగా జైనులాబిదీన్ పాలనా కాలంలో కశ్మీరు సాధించిన అభివృద్ధికి ప్రధాన కారణం శీర్యభట్టు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. శీర్యభట్టు ప్రస్తావన లేకపోవటం, జైనులాబిదీన్ గురించి కశ్మీరేతర ప్రాంతాలలో అంతగా తెలియకపోవటం ఒక విషాదం!

కశ్మీరుకు సుపరిపాలన అందించటంలో భాగంగా జైనులాబిదీన్ చేపట్టిన మరొక చర్య – పరుల భార్యల వైపు దృష్టి సారించకూడదన్న నియమం విధించి దాన్ని పాటించటం. పరస్త్రీని చెడు దృష్టితో చూసినవారు నశిస్తారని భారతీయ ధర్మం చెప్తుంది. కశ్మీరు చరిత్రలో కూడా పరస్త్రీ పై కన్నేసిన నరుడితో పాటు కశ్మీరం సర్వనాశనమైన ఉదంతం ఉంది. ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ సుల్తాన్ పరస్త్రీ పై కన్నేయనని ప్రతిజ్ఞ పట్టాడు. కానీ ఆయన అదృష్ట దేవతను చేపట్టి ఈ నియమాన్ని భంగం చేశాడని చమత్కరిస్తున్నాడు జోనరాజు.

సమ్యగ్దశ బలేనాథ సర్వజ్ఞేన మహీభుజా।
సౌగతస్తిలకాచార్యో మహత్తమ పదే కృతః॥
(జోనరాజ రాజతరంగిణి 823)

ఈనాడు చరిత్రను సమాజంలో భేదభావాలు పెంచే రీతిలో అధ్యయనం చేస్తూ ప్రకటిస్తున్న చరిత్ర రచయితలంతా జాగ్రత్తగా పఠించి అర్థం చేసుకోవాల్సిన శ్లోకం ఇది. సుల్తాన్ జైనులాబిదీన్ వెనుక ఉండి నడిపిస్తున్నది శీర్యభట్టు. పండితుడు. కానీ మహత్తమ పదవిలో ఉంచింది తిలకాచార్యుడనే బౌద్ధ భిక్షువును! అంటే, చరిత్ర రచయితలు చెప్తూ వస్తున్నట్టు బౌద్ధులకు, సనాతన ధర్మానుయాయులకు నడుమ ఘర్షణామయ వాతావరణం, కనీసం కశ్మీరు చరిత్ర చూస్తే, ఎక్కడా ఉన్నట్టు కనబడదు. విగ్రహాలను ధనం కోసం ధ్వంసం చేసే రాజు దృష్టి పెద్ద వెండి బౌద్ధ విగ్రహంపై పడ్డప్పుడు, అడ్డుపడి, ఆ విగ్రహాన్ని కాపాడినవాడు కల్హణుడి తండ్రి. దేవాలయాల ధ్వంసానికి అడ్డుపడనివాడు, బౌద్ధ విగ్రహాన్ని కాపాడేడు. గతంలోనూ బౌద్ధ ఆరామాలను పునర్నిర్మించి బంగారు పూత పూశాడు జలౌకస  మహారాజు. ఇలాంటి సంఘటనలు అనేకం కనిపిస్తాయి కశ్మీరు చరిత్రలో. అలాగని కశ్మీరు బౌద్ధ ధర్మాన్ని సంపూర్ణంగా ఎన్నడూ స్వీకరించలేదు. నాగుల ప్రాధాన్యాన్ని నీలమత పురాణం చెప్తుంది. శైవ, వైష్ణవ ధర్మాల అభివృద్ధి జరిగింది. నాగులు, శైవం, వైష్ణవం, బౌద్ధం, సామరస్యంగా సహజీవనం చేసిన దృష్టాంతాలు అనేకం ఉన్నాయి. ఘర్షణ వాతావరణం కనబడదు. కానీ, చరిత్ర రచయితలు హైందవం, బౌద్ధాన్ని దెబ్బతీసిందని, కుటిల బ్రాహ్మణులు బౌద్ధాన్ని తన్ని తరిమివేశారని తమ  ఊహలను నిజాలుగా భ్రమించి, సమాజాన్ని భ్రమింప చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వారు ఈ సంఘటనను, దాని వెనుక ఉన్న భారతీయ ధార్మిక విశ్వాసాన్ని,  అందరినీ తమలో కలుపుకుని సహజీవనం సాగించగల పరమ ఔన్నత్యాన్ని గ్రహించాలి.

ఇస్లామీయుల పాలనలోకి వచ్చిన కశ్మీరులో కాఫిర్లకు స్థానం లభించలేదు. వారికి మతం మారటమో, ప్రాణాలు కోల్పోవటమో, ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోవటమో తప్ప మరో గత్యంతరం లేదు. అలాంటి పరిస్థితులలో ఒక సుల్తాను ఒక పండితుడిని కశ్మీరు పిలిపిస్తే, ఆయన చేయాల్సిన చికిత్స ఏదో చేసి, అందినంత ధనం పుచ్చుకుని వెళ్ళిపోలేదు. ధనం వద్దు పండితులకు తిరిగి కశ్మీరులో నివాసం ఏర్పాటు చేయమని కోరాడు. జిజియా పన్ను ఎత్తి వేయించాడు. అత్యుత్తమ పదవి బౌద్ధ ఆచార్యుడికి అందించాడు. ఇదీ సనాతన ధర్మం. ఇదీ భారతీయ ధర్మం. నిజానికి శీర్యభట్టు తానే ఆ పదవిని వరించవచ్చు. సర్వజ్ఞాని అయిన ఆ పదవి చేపట్టే అన్ని అర్హతలున్నవాడు బౌద్ధుడు అయినా అతనికి ఆ పదవి అందేట్టు సుల్తానును ఒప్పించాడు. ఈ సంఘటనలు చరిత్ర రచయితలకు కనిపించవు! వీటిని ప్రస్తావించరు.

కశ్మీరు అధికంగా భారతీయ ధర్మానుయాయులైన రాజుల పాలనలో ఉంది. అయినా బౌద్ధులు ఉన్నత స్థానాలను అలంకరించారు. కశ్మీరులోని బౌద్ధ భిక్షువుల గురించి టిబెటన్ బౌద్ధుల రచనల ద్వారా తెలుస్తుంది. టిబెటన్ బౌద్ధ రచయిత జోన్ న్యు పాల్ (gZhon-nu-dpa) ప్రకారం ‘సుమనశ్రీ’ అనే బౌద్ధ పండితుడు బ్యు స్టన్ (Bu-ston) అనే టిబెట్ బౌద్ధుడికి పద్మజాలా వృత్తాన్ని బోధించాడు. ‘భూమిశ్రీ’ అనే బౌద్ధ భిక్షువు ‘యార్ లంగ్స్ లో బాలా గ్రాన్స్ ఫా ర్గ్యాల్ షాన్’ అనే టిబెటన్‍కు బౌద్ధం బోధించాడు. ‘ప్రతిమా లక్షణం’ గ్రంథాన్ని అనువదించటంలో ‘లోబా లా’ కు ధర్మధారుడనే బౌద్ధ పండితుడు తోడ్పడ్డాడు. లలితాదిత్యుడి కాలంలో (క్రీ.శ. 724-760) ‘చరికూన’ అనే బౌద్ధుడు అతడి సైన్యాన్ని ఆధునికీకరించాడు. కశ్మీరంలో బౌద్ధులు, భారతీయ ధర్మానుయాయులు ఎలాంటి ఘర్షణ లేకుండా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, పరస్పర సహకారంతో సహజీవనం చేశారని తెలుస్తోంది. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, అవకాశం లభించగానే శీర్యభట్టు తిలకాచార్యుడనే బౌద్ధుడికి మహత్తమ పదం అందేట్టు చూశాడు. తమ నమ్మకాలను, ఊహలను చరిత్రగా నమ్మింపచూసేవారు, వారిని గుడ్డిగా అనుసరించేవారి వల్ల సమాజానికి ఎంత నష్టం కలుగుతుందో బౌద్ధంతో భారతీయ ధర్మ ఘర్షణ ఆలోచన దుష్ప్రభావాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది.

స శీర్యభట్ట స్తిలకః స సింహ గణనాపతిః।
సోపానాన్య భవన్నుచ్ఛ పదారోహే ద్విజన్మనామ్॥
(జోనరాజ రాజతరంగిణి 824)

శీర్యభట్టు, తిలక, సింహ అనే ముగ్గురి ఆధారంగా కశ్మీరులో బ్రాహ్మణులు ఉన్నత పదవులను చేపట్టారు. వీరిలో సింహ అనేవాడు ‘గణనాధిపతి’ అని తెలుస్తుంది. అంటే ప్రస్తుత భాషలో ‘auditor’ అనుకోవచ్చు. ‘Accountant’ అనుకోవచ్చు. కానీ, మొత్తానికి కశ్మీరు సుల్తానుల పాలనలో ఉన్నా, జైనులాబిదీన్ విశ్వాసం చూరగొనటం వల్ల, తమ నిస్వార్థం వల్ల, ధనాశ లేమి వల్ల, పండితులు తిరిగి రాజాస్థానంలో ఉన్నత స్థానాలను పొందగలిగారు.

మదిన్యాఖండలస్యా అసీత పికస్యేవ రసశ్రియా।
అఖండం రస పాండిత్యం బ్రహ్మకుండల సేవయా॥
(జోనరాజ రాజతరంగిణి 825)

మధుర ఫలాల రస సేవనం వల్ల కోకిల రసాస్వాదన లాలస ద్విగుణీకృతమైనట్టు, పండిత బ్రాహ్మణులకు సేవ చేయటం వల్ల వారి సాంగత్యం వల్ల సుల్తాన్‍కు ‘అఖండ రస పాండిత్యం’ అలవడిందట. ఒకసారి రసాస్వాదన రుచి తెలిసినవాడు సున్నిత మనస్కుడవుతాడు. ఉత్తమ మానవుడిగా ఎదుగుతాడు. మామూలు మనుషులకు అర్థం కాని సున్నిత భావాలకు స్పందిస్తాడు. కశ్మీరులోకి తిరిగి వచ్చిన బ్రాహ్మణ పండితుల సాంగత్యంలో సుల్తాన్ సున్నిత మనస్కుడిగా, ఉత్తమ మానవుడిగా ఎదిగాడు.

ఇక్కడ ఒక్క నిమిషం ఆగి ఆలోచించాల్సి ఉంటుంది. భారతీయ సాహిత్యం ‘రసో వై సః’ అన్న భావన కేంద్రంగా ఎదిగింది. తైత్తరీయోపనిషత్తు లోని ఈ వాక్యం ‘రసమే భగవంతుడు’ అంటుంది. భారతీయ సాహిత్యం సర్వం రసోత్పత్తి లక్ష్యంగా ఎదిగింది. ఈ ‘రసం’ మనిషిని సున్నితుడిని చేస్తుంది. ఉత్తముడిని చేస్తుంది. బ్రహ్మానందానుభవాన్ని కలిగించి భగవద్భావనకు చేరువ చేస్తుంది. ఎప్పుడయితే సాహిత్యంలో ‘రసం’ కన్నా ఇతరాలకు ప్రాధాన్యం లభించిందో, జీవితంలోంచి ‘రసం’ ఎగిరిపోయింది. రసవిహీనమైన మనిషి సున్నిత భావాలు  లేని కఠినమైన జడపదార్థం లాంటివాడు. రసహీనమైన ప్రస్తుత సమాజాన్ని చూస్తే ఇది మరింత స్పష్టంగా బోధపడుతుంది. రసవిహీనమైన కశ్మీర సమాజంలోకి పండితులు రసరంజితమైన పాండిత్యాన్ని తిరిగి సజీవంగా నిలిపారు. రస స్రవంతిలో స్నానమాడిన జైనులాబిదీన్ ధన్యుడయ్యాడు. ఎంతగా రసం పీల్చుకుంటే అంతగా రసాస్వాదన తృష్ణ పెరిగేట్టు సుల్తానులోనూ రసాస్వాదన తృష్ణ పెరుగుతూ వచ్చింది.

కర్పూరభట్టో నిర్దర్పః ప్రాణరక్షో మహీభుజః।
గణినాం శరణం చక్రే స్వగుణైః సురభిం సభామ్॥
(జోనరాజ రాజతరంగిణి 826)

సుల్తాన్ ఆశ్రయంలోని వైద్యుడు కర్పూరభట్టు, శ్రేష్ఠులైన పండితులను సుల్తాను సభకు ఆకర్షించాడు. ‘సురభి’ అంటే కామధేను. కోరికలను తీర్చేది. కర్పూరభట్టు తన పాండిత్యంతో గొప్ప గొప్ప పండితులను సుల్తాన్ సభకు ఆహ్వానించాడు. కృష్ణదేవరాయల భువవవిజయం లాంటి దిగ్గజ పండితుల మయం అయిందన్న మాట సుల్తాన్ సభ.

పూర్వాబ్ద గ్రహ సంచారాద్ ఉత్తరాబ్ద గ్రహస్థితిమ్।
రుయ్యభట్టో విదన్నాసీద్ వినైవ గణితశ్రమమ్॥
(జోనరాజ రాజతరంగిణి 827)

రుయ్యభట్టు అనే ఖగోళ శాస్త్రవేత్త గ్రహ స్థితిగతులను పరిశీలించి  రాబోయే కాలంలో వాటి  స్థితిగతులను శ్రమ లేకుండా, సులభంగా చెప్పగలిగేవాడు. దీన్ని బట్టి జైనులాబిదీన్‍కు జ్యోతిష శాస్త్రంపై కూడా నమ్మకం కలిగిందని భావించే వీలుంది. భారతీయ రాజుల ఆస్థానాలలో ఆస్థాన జ్యోతిష్కుడు ఉండటం ఆనవాయితీ. అలాగే సుల్తాన్ ఆస్థానంలో రుయ్యభట్టు అనే జ్యోతిష శాస్త్రవేత్త, ఖగోళ పరిశీలకుడు ఉన్నాడన్న మాట.

‘జ్యోతిష శాస్త్రం’ అనగానే ముఖం చిట్లించే వారున్నారు. కానీ అదొక శాస్త్రమని, ఆ శాస్త్రాన్ని సన్నిహితంగా పరిశీలించిన వారికి అర్థం అవుతుంది. విజ్ఞానశాస్త్రంలో ఒక సిద్ధాంతాన్ని నిరూపించే అంశం ఏమిటంటే, విభిన్న ప్రాంతాలలో, విభిన్న కాలాలలో చేసిన ప్రయోగాలు ఒకే ఫలితాన్ని ఇవ్వటం. జ్యోతిష శాస్త్రంలో గణన, గ్రహగతుల నిర్ణయం విషయంలో దేశమంతా ఒకే ఫలితం వస్తుంది. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఈ విషయంలో ఎలాంటి వాదవివాదాలు చెలరేగవు. దీన్ని బట్టి మౌలికంగా జ్యోతిష శాస్త్ర సిద్ధాంతం వైజ్ఞానిక శాస్త్ర సూత్రానుసారమే ఉంటుందని  నిరూపితమవుతోంది. ఇక దాని ఉపయోగాల విషయంలో భేదాభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు. కానీ జ్యోతిష శాస్త్రం విజ్ఞానశాస్త్రమే అన్న విషయంలో ఎలాంటి సందేహం ఉండనవసరం లేదు. అందుకే ఇస్లామీయుడైనా జైనులాబిదీన్ జ్యోతిషాన్ని శాస్త్రంగా నమ్మేడు. ఆస్థాన జ్యోతిష్కుడిని నియమించుకున్నాడు.

శ్రీరామనంద పాదానం భాష్య వ్యాఖ్యా క్షణేక్షణే।
వీక్షితే శారదాక్షోణీమేవ సంభ్రాంత మానసా॥
(జోనరాజ రాజతరంగిణి 828)

శ్రీ రామానంద పాదుడనే పండితుడు మహాభాష్యానికి వ్యాఖ్యానం వినిపిస్తూండేవాడు. అది వింటూ సంభ్రాంత మానస అయిన శారదాదేవి కశ్మీరు భూమినే చూస్తుండేది. అంత గొప్పగా వ్యాఖ్యానం చేసేవాడన్న మాట శ్రీ రామానంద పాదుడు. అంటే, అతని వ్యాఖ్య శారదాదేవిని కూడా మెప్పించి, కశ్మీరు నేల పైనే ఆమె దృష్టి నిలిపేట్టు చేసిందన్న మాట. అంటే, దురాచారాలను, దుర్మార్గాలను భరించలేక కశ్మీరు వదిలి వెళ్ళిపోయిన శారదాదేవి, ఇప్పుడు కశ్మీరు లోని పండితుల భాష్యాలు వినేందుకు కశ్మీరు తప్ప మరో వైపు దృష్టిని మరల్చలేకపోతోందన్న మాట. అంటే, మళ్ళీ కశ్మీరుపై శారదాదేవి కరుణా రసార్ద్ర దృష్టి ప్రసరిస్తున్నదన్న మాట.

అయితే జోనరాజు తన రచనలో ఒక పార్శ్వాన్ని మాత్రమే చూపించగలడు. మరో పార్శ్వం తెలుసుకోవాలంటే పర్షియన్ రచయితల రచనలను పరిశీలించాల్సి ఉంటుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here