[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
భూమి విక్రయ భూర్జాది కృత చిహ్నం మహీభుజా।
నిహ్నవ ప్రాగ భావాయా ధర్మాధికారణం కృతమ్॥
(జోనరాజ రాజతరంగిణి 872)
నీటి పారుదల వసతులను కల్పించి సంవత్సరం పొడుగునా ఏదో ఓ పంట పండే ఏర్పాట్లు చేసిన జైనులాబిదీన్ తన దృష్టిని భూమి అమ్మకాలు, కొనుగోళ్ల వైపు మళ్లించాడు. కశ్మీరులో డబ్బుల లావాదేవీలు ఉండేవి కావు. తిండి గింజలు, ధాన్యాలు, విలువైన వస్తువుల మారకాలే ఉండేవి తప్ప డబ్బుతో విలువ నిర్ణయించటం అన్నది లేదు. దాంతో జమీందార్లు, మధ్యవర్తులు వస్తువుల ధరలు నిర్ణయించేవారు. ప్రజలను మోసం చేసి వేధించేవారు. ముఖ్యంగా కరువు సమయాల్లో ఈ మోసాలు మరింత అధికంగా, విచ్చలవిడిగా సాగేవి. జైనులాబిదీన్, శీర్యభట్టు సహాయంతో ఈ మోసాలకు అడ్డుకట్ట వేయాలని నడుం కట్టాడు. ఆ ప్రయత్నాన్ని వివరిస్తుందీ శ్లోకం.
భూముల అమ్మకాలు జరిగే స్థలాలలో రాజు అధికార కార్యశాలలను ఆరంభించాడు. అమ్మకాల వివరాలను భూర్జర పత్రాలపై లిఖించటం వీరి పని. ఈ రకంగా ఒకసారి ఒకరికి అమ్మిన భూమిని, మరొకరికి అమ్మడాన్ని నిరోధించాడు. అంతేకాదు, మొదటి వాడికి అమ్మినట్టు నిరాకరించే వీలుండదు ఇలా భూర్జర పత్రాలపై అమ్మకం వివరాలు రాయటం వల్ల. జైనులాబిదీన్ కశ్మీర సమాజంలో పలు రంగాలలో నెలకొల్పిక నూతన పద్ధతులు అనేకం ఉన్నాయి. జోనరాజు ఈ విషయాన్ని ప్రధానంగా చెప్పాడు. మిగతా విషయాలు శ్రీవరుడు రచించిన రాజతరంగిణిలో ఉన్నాయి. శ్రీవరుడి రాజతరంగిణి అనువాదం సమయంలో ఆ విషయాలు కూలంకషంగా చర్చించుకుందాం. ప్రస్తుతం జోనరాజ రాజతరంగిణిలో చెప్పిన విషయాలకే పరిమితమవటం శ్రేయస్కరం.
నాగుల సహాయంతో జయాపీడుడు, రాగి కొండను కనుగొన్నాడు. ఆ కొండ జయాపీడుడు ఎప్పుడు కోరినా రాగిని అందించిది. అలానే ఇప్పుడు, జైనులాబిదీన్ పాలనా కాలంలో భూమి, ఎప్పుడు కోరితే అప్పుడు అరుదైన అమూల్యమైన మణులను అందిస్తోంది.
మణీన్ ఖానిభ్యశ్చాలభ్యాంస్తద్రాజ్యే భూరజీజనత్।
యే జైనమణయః ఖ్యాతాః పద్వారాగమదచ్ఛిదః॥
(జోనరాజ రాజతరంగిణి 874)
కశ్మీరు భూమి అందిస్తున్న విలువైన మణులు చాలా అరుదైనవి. వాటి అందం, విలువలు చూసి కెంపుల బుగ్గలు ఎరుపెక్కాయి సిగ్గుతో. ఇలా దొరికే విలుమైన మణులను ప్రజలు ‘జైనమణి’ అనటం ఆరంభించారు, రాజు జైనులాబిదీన్ పేరు లోని మొదటి అక్షరాల ఆధారంగా.
సరితాం సైకతే పీతసికతాభ్రమదం తదా।
కాంచనం కాభ్చన చ్ఛాయామ్ బిభ్రల్లో కైరచీయత్॥
(జోనరాజ రాజతరంగిణి 875)
ఇది ఆసక్తికరమైన సమాచారాన్ని ఇచ్చే శ్లోకం.
జైనులాబిదీన్ కాలంలో నదుల ఒడ్డున ఉండే ఇసుక నుంచి ప్రజలు బంగారాన్ని ఏరుకునేవారు. ఈ బంగారం పసుపు రంగుతో తళతళలాడుతుండేది. జోనరాజు వర్ణించిన ఇసుకలో దొరికే బంగారాన్ని ‘placer gold deposits’ అంటారు. అంటే, ఎక్కడో బంగారం రాళ్ళలో ఒదిగి ఉంటుంది. ప్రవహించే నదులు ఆ రాళ్లను ముక్కలు ముక్కలు చేసి, ప్రవాహంతో పాటు తీసుకు వస్తాయి. దారిలో ప్రవాహంలో జల్లెడ పట్టినట్టయి చిన్న చిన్న బంగారు రేణువులు ఇతర పదార్థాల నుంచి వేరుపడతాయి. ఇసుకతో పాటు నది ఒడ్డున నిక్షిప్తమవుతాయి. అలా వచ్చిన బంగారాన్ని ఇసుక నుంచి వేరు చేస్తారు. కశ్మీరు నదుల ఒడ్డున ఉన్న ఇసుకలో ప్రజలకు బంగారం లభిస్తున్నదంటే అర్థం, నదులు ఎక్కడి నుండో బంగారాన్ని రాళ్ళ నుంచి విరిచి, తెచ్చి ఇక్కడ నిక్షిప్తం చేస్తున్నాయని. నిజానికి కశ్మీరంలో అధికంగా దొరికే విలువైన వజ్రాలు నీలమణులు, కెంపులు. నీలమణి భారత కశ్మీరులో లభిస్తుంది. కెంపులు పాక్ అక్రమిత కశ్మీరు ప్రాంతంలో లభిస్తాయి. ఈ కెంపులు చాలా విలువైనవి. ప్రపంచవ్యాప్తంగా వీటి విలువ ప్రత్యేకం. ఈ రెండు తప్ప కశ్మీరులో బంగారం లభించినట్టు వివరాలు లేవు. జోనరాజ రాజతరంగిణి లోనే Gold placer deposits ప్రస్తావన ఉంది. కానీ ఇటీవలె, ఫిబ్రవరి 2023లో భారత ప్రభుత్వం కశ్మీరంలో బంగారం, లిథియం డిపాజిట్లు కనుగొన్నట్టు ప్రకటించింది. అందరి దృష్టి లిథియం వైపు అధికంగా కేంద్రీకృతమయింది. కానీ బంగారం నిలువలు ఉన్నట్టు కనుగొనటం వల్ల జోనరాజు రాజతరంగిణిలో చెప్పి విషయాలకు సమర్థన లభించినట్లు అయింది. పలువురు వ్యాఖ్యాతలు బంగారం లభించిందని జోనరాజు రాయటాన్ని కొట్టివేశారు. ఇన్నాళ్ళకు జోనరాజు వ్రాసినది సత్యమన్న ఆధారం లభించింది. నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు.
అయితే, బంగారం ప్రజలలో ఆశ కలిగిస్తుంది. బంగారం లభిస్తుందనగానే ప్రజల నుంచి పన్నులు వసూలు చేసేవారు వస్తారు. కాబట్టి ప్రజలు పట్టుబట్టి రాజులతో రాగి రేకులపై ఓ శాసనం రాయించారు. అదేమిటంటే, భవిష్యత్తులో రాజులు ఇక్కడి నది తెచ్చిన ఇసుక నుంచి లభించే బంగారంలో ఆరవ వంతు మాత్రమే తీసుకోవాలి. మిగతా అంతా ప్రజలకు వదిలేయాలి. ప్రజల కోరిక మన్నించి రాజు రాగి రేకుపై అలానే శాసనం రాయించాడు. ఆనాటి కశ్మీరు ప్రజలు పట్టుబట్టి రాజుతో శాసనం రాయించున్నారు. ఆధునిక సమాజంలో కూడా ప్రజలు పండుగలప్పుడు బస్సు రైలు, విమాన టికెట్ల ధరలు పెరగకుండా, గుళ్లల్లో దర్శనం టిక్కెట్ల ఖరీదు పెరగకుండా, యాత్రాస్థలాల్లో హోటళ్ల రేట్లు పెరగకుండా అధికారులపై ఒత్తిడి తేగలిగితే బాగుంటుంది. కానీ రాచరికం అమలులో ఉన్న ఆ కాలంలో రాజు ఒకడు దయార్ద హృదయుడయితే సరిపోయేది. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరూ దయార్ద్ర హృదయులయినా లాభం లేదు. లాభాల ఆశ అటువంటిది. లాభాల ఆశ దైవాన్ని, దైవారాధనను కూడా డబ్బుతో కొలిచేట్టు చేస్తుంది.
జైనులాబిదీన్ ధార్మిక కార్యకలాపాలతో పాటు, నిర్మాణ కార్యక్రమాల వల్ల – అధికారంలో ఉన్న ఇతరులలోనూ మంచి పనులు చేయాలన్న ఆలోచన ప్రదర్శితమయింది. ‘పోచ’ అనే డామరుడు, నగరాధికారి; ఒక క్రోసు నిడివి కల ఒక రాతి వంతెనను నిర్మించాడు. నగరంలో నడకకు వీలులేనంత కఠినతరమైన దారి పై ఈ వంతెన నిర్మించాడు. ఈ వంతెన నిర్మాణం వల్ల బురదలో నడిచే బాధ ప్రజలకు తప్పింది. శీర్యభట్టు పలు మటాలను నిర్మింప చేశాడు. రాజు, ఇతర మంత్రులు కూడా పలు ధర్మశాలలు నిర్మింప చేశారు.
విషయే విషయే చక్రే శిర్యభట్టో మటాన్ పృథూన్।
అన్యేపి సచివా రాజ్ఞో ధర్మశాలా బహుర్వ్యధుః॥
(జోనరాజ రాజతరంగిణి 879)
రాజు సత్కార్యాలు చేస్తే అతని మంత్రులు, అనుచరులు కూడా సత్కార్యాలు చేస్తారు. ప్రజలు సైతం ఉత్తమ నడవడిని ప్రదర్శిస్తారు. కశ్మీరులో అదే జరిగింది. సికందర్ బుత్‌షికన్ వంటి వారు మతాంతరీకరణలకు పెద్ద పీట వేసి, మందిరాలను విగ్రహాలను ధ్వంసం చేయటమే పనిగా ప్రవర్తించటంతో సామాన్య ప్రజలు కూడా అలాగే ప్రవర్తించారు.
ఎప్పుడయితే సుల్తాన్ గత కాలం రాజులకు భిన్నంగా పరుమత సహనం ప్రదర్శిస్తూ, సత్కార్యాలకు తెర తీశాడో, ఇతరులు కూడా అతని మార్గాన్ని అనసరించటం ఆరంభించారు. కశ్మీరును సుఖశాంతుల మయం, సుభిక్షం చేయటంలో తమ వంతు పాత్ర పోషించారు. ఇక్కడ ‘మటం’ నిర్మించాడంటే, ఇప్పుడు మనం అనుకుంటునట్టు మతానికి సంబంధించిన ‘మఠం’ కాదు. కశ్మీరులో ‘మటం’ అంటే పాఠశాలల నిర్మాణం. ఆ కాలంలో విద్య మత ధర్మాలనడుమ అవినాభావ సంబంధం వుండేది. రెంటిని వేరుగా చూసే వీలులేదు. కాబట్టి విద్యాలయాన్ని కూడా ‘మఠం’ అన్నారు. రాను రాను ధర్మం నుంచి విద్య వేరయిన తరువాత విద్యాలయాలు వేరు, మఠాలు వేరు అయ్యయి.
ఇక్కడ జోనరాజు హఠాత్తుగా రాజతరంగిణిలో ప్రస్తుతం తాను చెప్తున్న కథతో సంబంధం లేని ఒక విషయాన్ని ప్రస్తావిస్తాడు.
రెండు శక్తివంతమైన ఏనుగులు, మద గర్వంతో ఒకదానితో ఒకటి తలపడి నది నీటిని చెల్లాచెదురు చేస్తాయి. ఆ పోరాటంలో సర్వం మరచి తొండాలతో యుద్ధం చేస్తాయి. కానీ కాసేపటికి రెండూ మరణిస్తాయి. సుల్తాన్ కుటుంబానికి చెందిన మసూద్, షనారా లిద్దరూ ఒకరిపై ఒకరు అసూయతో ఒకరినొకరు దెబ్బ తీయాలని ప్రయత్నించారు. అయితే, వారి నడుమ ఉన్న ద్వేషాసూయ భావనలను తగ్గించి స్నేహభావనలను పెంచాలని సుల్తాన్ ప్రయత్నించాడు. కొన్నాళ్లు శాంతించినా తరువాత మళ్ళీ వారి నడుమ గొడవలు ప్రారంభమయ్యాయి. వారు పోరుకు సిద్ధమయ్యారు. ఒకరోజు షనారా, సుల్తాన్ సమక్షంలోనే మసూద్‌ను విపరీతంగా దుర్భాషలాడేడు. ఆయుధాల కన్నా తీవ్రంగా మాటలతో అతనిని గాయపరిచాడు. ఒక రాత్రి మసూద్ తన అనుచరులతో నిరాయుధుడై వెళ్తుంటే చూసి షనరా అతడిని చంపేశాడు. మసూద్ సోదరుడు విన్నా కోపం పట్టలేకపోయాడు. షనారాను చంపేందుకు సుల్తాన్ అనుమతి కోరాడు. సుల్తాన్ ఆనుమతి లభించటంతో షనారాను, అతని అనుచరులతో సహా చంపేశాడు. దాంతో ధక్కురాలంతా శాంతించారు. విన్నా వీరత్వం గురించి ప్రజలు చర్చించుకున్నారు.
ఈ కథ చెప్పిన తరువాత జోనరాజు మళ్లీ సుల్తాన్ గొప్పతనానికి సంబంధించిన విషయాలు చెప్పటం ఆరంభిస్తాడు.
తథా స యోగినాం మానమదాద్ భూలోకవాసవః।
తేషమగ్రే యథా మద్రాజాద్యై ర్లడితం శృవత॥
(జోనరాజ రాజతరంగిణి 897)
జైనులాబిదిదీన్ యోగులను ఎంతో గౌరవించేవాడు. ఆయన యోగులను గౌరవించటం చూసి మాద్రిరాజు (జైనులాబిదీన్‍కు పిల్లనిచ్చిన మామ) కూడా నాలికలు వ్రేలాడేసుకుని వారి ముందు నుంచునేవాడు.
స దదోద్యోగినాం భోగం యోగం తేభ్యోగ్రహీనృపః।
భయం దదదరాతిభ్యో దధావభయమప్యహో॥
(జోనరాజ రాజతరంగిణి 898)
సుల్తాను యోగులను ఎంతో గౌరవించేవాడు. వారి నుంచి విజ్ఞానాన్ని గ్రహించేవాడు. వారికి విలువైన బహుమతులు ఇచ్చేవాడు. జ్ఞానం గ్రహించే సమయంలో ఆ యోగి సామాన్యమైన యోగియా పరిణతి సాధించిన యోగియా అన్న విషయం పట్టించుకునేవాడు కాదు. వారికి జూకాలు, బంగారు పాత్రలు, దుస్తులు బహుకరించేవాడు.
ఇంద్రుడికి ఎంత ఖ్యాతి సంపాదించినా సరిపోదు. పర్వతాల రెక్కలు కత్తిరించాడు. సూర్యుని వెలుగును దోచిన సర్పాన్ని సంహరించాడు. వందల కొద్దీ యజ్జాలు చేశాడు. అయినా అతనికి సంతృప్తి కలగలేదు. మేఘాలలోని ఇంద్రధనుస్సులో పలు విభిన్నమైన వర్ణాలను పొదిగాడు. అయితే మేఘాలు పొగ, నీటి ఆవిరి, గాలి కలవగా ఏర్పడ్డాయి. కానీ వాటినీ రంగులతో నింపాడు.
అలాగే సుల్తానుకు కూడా తాను ఎంత సాధించినా, తన కీర్తి విశ్వంలో ఎంత దూరం ప్రాకినా సంతృప్తి కలగటం లేదు. ఇంకా గొప్ప ఖ్యాతిని ఆర్జించాలని తపన పడుతూనే ఉన్నాడు. గతంలోని రాజులు సాధించలేని, భవిష్యత్తులో రాజులూ సాధించలేనిదీ అయిన గొప్ప కార్యాన్ని సాధించాలని రాజు తపించాడు. కానీ కాలం అనంతమయినది. ఈ విశ్వం విశాలమైనది. కాబట్టి, భవిష్యత్తులో ఎక్కడో, ఎవరో రాజు తాను సాధించిన దానిని సైతం సాధ్యమని తలచి దాన్ని సాధిస్తాడేమోనని రాజు చింతించేవాడు. భవిష్యత్తులో ఎవ్వరూ చేయలేని పనిని చేయాలని ఆలోచించాడు. మానవులకు సాధ్యం కాని పర్వతాలలో, సరస్సులలో పలు ప్రాచీన రాజులు సాధించిన ఘనకార్యాలు వినేందుకు కూడా రాజు ఇష్టపడేవాడు కాదు. ఎలాగయితే, కవులు శబ్దాన్ని బట్టి పదాన్ని ఎంచుకుంటారో, అలాగే జైనులాబిదీన్ అనంతమైన ఐశ్వర్య సాధన కోసం వ్యాపారుల మాటలు విన్నాడు. వ్యాపారులతో చర్చించాడు. పలు వీరోచిత గాథలు విన్నాడు. పూర్వ రాజుల కథలు తెలుసుకున్నాడు. నీలమత పురాణంతో సహా పలు ప్రాచీన పురాణాలు, గాథలు పండితుల నుండి విన్నాడు. యజ్ఞాలు చేయాలనుకున్నాడు.
రాజా నీలపురాణాదీన్ పండితేభ్యస్తాతోశృణేత్।
చింతాంతరాణి సంత్యజ్య సాహసైకసముత్సుకః॥
(జోనరాజ రాజతరంగిణి 907)
నీల పురాణంతో సహా ఇతర పురాణాలు జైనులాబిదీన్‍పై ప్రభావం చూపాయి. సాహస కృత్యాలు చేయాలనుకున్నాడు. యజ్ఞయాగాదులు చేయాలనుకున్నాడు.
కదాచిద్ ధరణీపాలశ్విరమేవమసింతయత్।
దేహస్యేవ త్రిలోకస్య ముఖవత్ క్షితిమండలమ్॥
(జోనరాజ రాజతరంగిణి 908)
ఇవన్నీ విన్న తరువాత రాజు ఎంతో ఆలోచించాడు. మనిషి శరీరానికి ముఖం ఎలాంటిదో విశ్వానికి ఈ ప్రపంచం అలాంటిది అనుకున్నాడు. ఈ ప్రపంచం అంటే ముల్లోకాలు అని అర్థం. ఇక ముఖానికి కళ్లు ఎంతటి ప్రాధాన్యమో, అలాగే ఈ భూమి పై కశ్మీరు అంతటి ప్రాధాన్యం కలది అనున్నాడు. హిమాలయ పర్వతాలు కనురెప్పల్లాంటివి.
ప్రధానం తత్ర కశ్మీర మండలం నయనం యథా।
శైలరాజశిఖాః పక్ష్మతులాం యత్ర వహాన్తి తాః॥
(జోనరాజ రాజతరంగిణి 909)
‘శైలరాజశిఖాః పక్ష్మతులాం’. ‘పక్ష్మతులాం’ అంటే కనురెప్పల్లాంటిది. అంటే కశ్మీరులో ఉన్న పర్వతశ్రేణులు కనురెప్పల్లాంటివి అన్నమాట. ‘గోపక్ష్మ’ అనే పదం ఉంది. గోవుల వంటి కనురెప్పలు కలిగి ఉండటం అన్న అర్థం. బౌద్ధంలో గోపక్ష్మ నేత్రం అని వాడటం కనిపిస్తుంది. ఎంతో పుణ్యం చేసుకుంటే సమచిత్తం లభిస్తుంది. వారి వల్ల ‘అభినీల నేత్ర’ (నీలికళ్లు) ప్రశాంతంగా ఉండే నీలికళ్ళ స్థితి లభిస్తుంది. వారి కనురెప్పలు గోవుల రాజు కనురెప్పల్లా ఉంటాయి అంటుంది బౌద్ధంలో ‘మహాప్రజ్ఞా పారమితశాస్త్రం’.
ఇక్కడ జోనరాజు ‘శైలరాజశిఖాః పక్ష్మతులాం యత్ర వహాన్తి తాః’ అంటూ, కశ్మీరు ముఖానికి కళ్ళు ఎలాగో, ముల్లోకాలకు ముఖంలో కళ్ళలాంటి ప్రాధాన్యం కశ్మీరుది అని చెప్తున్నాడు.
జోనరాజు ఈ ఆలోచనలను భారతీయులంతా పదే పదే చదివి జీర్ణించుకుని కశ్మీరు ప్రాధాన్యాన్ని గ్రహించాలి. కశ్మీరు మామూలు భూభాగంలా కాక విశ్వానికి ముఖమయిన భూమికి కళ్ళలాంటిది అని గ్రహించాలి. కశ్మీరు మనది. కశ్మీరు మనదే అని ఎలుగెత్తి చాటాలి. కశ్మీరును మామూలు భూభాగంలా భావించకూడదు. ఒక మతంవారు అధికంగా వున్నంత మాత్రాన, ఆ మతానుయాయులు అధిక సంఖ్యలో వున్న దేశానిదయిపోదు ఆ భూభాగం.
(ఇంకా ఉంది)