జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-75

4
9

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

తతః ప్రత్యాగతో రాజా వృద్ధానాబద్ధకౌతుకః।
అభ్యాగాచ్ఛరణం తత్ర తె చైనం నృపమభ్యుదుః॥
(జోనరాజ రాజతరంగిణి 920)

[dropcap]మ[/dropcap]హాపద్మ సరస్సు నడుమ కృత్రిమంగా ద్వీపాన్ని ఏర్పాటు చేసి, ఆ ద్వీపంపై ఓ గొప్ప భవనం నిర్మించాలని నిశ్చయించుకున్న సుల్తాన్ సరస్సును పర్యవేక్షించేందుకు సరస్సు నడుమకు పడవలో ప్రయాణించాడు. ఆ ప్రయాణంలో అతనికో ఆలోచన వచ్చింది. పెద్ద పెద్ద బండలను తీసుకొచ్చి వాటిని సరస్సులో ఒకదానిపై ఒకటిగా పారవేయటం వల్ల సరస్సు నడుమ ద్వీపాన్ని ఏర్పాటు చేయవచ్చనిపించింది.

శిలాపూర్ణప్రవాహణైరూపర్యుపరి పాతితైః।
శైలశృంగేరి వాంభోధిమేవదాపురయామ్యహమ్॥
(జోనరాజ రాజతరంగిణి 919)

పెద్ద పెద్ద శిలలను, పటిష్టమైన బళ్లలో తీసుకు వచ్చి వాటిని సరస్సు మధ్యలో ఒకదానిపై ఒకటి పారవేయించాలి. ఎలాగైతే సముద్ర మధ్యంలో పర్వతశిఖరాలు నిలుస్తాయో, అలా ఈ సరస్సులో రాళ్లలో భూమిని ఏర్పాటు చేయాలి అనుకున్నాడు సుల్తాన్. అలా అనుకున్నదే తడవుగా, వెనక్కు వచ్చిన తరువాత నిర్మాణం విషయంలో అనుభవం కల వారందరినీ పిలిచాడు. ఎంతో కుతూహలంతో వారిని ప్రశ్నించాడు. వారంతా సుల్తానుకు మహాపద్మ పౌరాణిక గాథను వినిపించారు.

ద్వారికేవ శుభా తస్య పురీ సంధిమతీ కిల।
సుదర్శనేన చక్రేణ మనుజానాం సమాశ్రితా॥
(జోనరాజ రాజతరంగిణి 921)

ఇప్పుడు సరస్సు ఉన్న స్థలంలో ద్వారక అంత పవిత్రమైన నగరం సంధిమతి ఒకప్పుడు ఉండేది. ద్వారకలో సుదర్శన చక్రం లాగా ఇక్కడ ప్రజలు ఉండేవారు. ఈ నగర అధిష్ఠాన దేవత, నాగరాజు మహాపద్ముడు. ఆయన చతుర్వర్ణాల ప్రజలను మీ లాగే తన సంతానం లాగా చూసుకునేవాడు.

కలికాల బలాత్తత్ర దురాచార నిషేవిణః।
జనాస్తద్దేశవాస్తవ్యాః ప్రాపుర్వృద్ధి దినాద్దినమ్॥
(జోనరాజ రాజతరంగిణి 923)

కలికాల ప్రభావం వల్ల ఈ ప్రాంతంలో ప్రజలు ధర్మాన్ని వదిలి దుష్ట పద్ధతులను అమలు పరిచారు. అలా స్వధర్మాన్ని వదలి దుష్ట పద్ధతులను పాటించే వారి సంఖ్య దిన దిన ప్రవర్ధమానమవుతూ వచ్చింది. ఆత్మాభిమానం కలవాడిని అవమానం ఎంతగా ఆవేశపరుస్తుందో,  విలువలను ప్రజలు వదలి వేయటం అంతగా  మహాపద్ముడికి ఆగ్రహం కలిగించింది. ఆచారవ్యవహారాలను వదలి, సత్ప్రవర్తనను, సచ్చీలతను విస్మరించి, ఎలాంటి విలువలు లేకుండా వ్యవహరిస్తున్న ప్రజల నడుమ ధర్మాన్ని విడవకుండా పాటిస్తున్నది ఒక కుండలు తయారు చేసే కుమ్మరి. మహాపద్ముడు అతడి కలలో కనిపించాడు. ప్రజల దురాచారాల పాలన  తనకు ఆగ్రహం కలిగిస్తోందని, తానిక భరించలేనని, అందరినీ ముంచెత్తుతానని అతడికి కలలో చెప్పాడు మహాపద్ముడు. దురాచారానికి దాసులయిన వారి స్పర్శను తాను భరించలేక పోతున్నానని, అందరినీ శిక్షిస్తానని స్పష్టం చేశాడు.

మరుసటి ఉదయం ఆ కుమ్మరి నగరంలోని ప్రజలందరికీ మహాపద్ముడి ఆగ్రహం, బెదిరింపుల విషయం చెప్పాడు. కానీ ప్రజలందరూ అతడిని హేళన చేశారు. అతడిని తెలివి లేని గాడిద అన్నారు.

ఇక్కడ ఒక శ్లోకాన్ని జోనరాజు రాసినదిగా పరిగణించరు. కానీ ఆ శ్లోకం కథను ముందుకు నడిపిస్తున్నది.

సంప్రదాయాన్ని, ధర్మాన్ని పాటించే ఆ కుమ్మరి, అందరూ తనని హేళన చేయటం, తన మాటను ఎవరూ నమ్మకపోవటంతో ఆ నగరం వదలి వెళ్ళిపోయాడు. అతను నగరం వదలి వెళ్ళగానే సరస్సు నీళ్ళు వరద నగరంలోకి ప్రవేశించాయి. భయభ్రాంతులైన ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని లేళ్లలా పారిపోతుంటే, అడవిని దహించే కార్చిచ్చులా నీళ్లు నగరమంతా అతివేగంగా విస్తరించి ముంచెత్తాయి.

ఈ శ్లోకం తరువాత ఆ ప్రాంతాన్ని నీళ్లు ఎలా ముంచెత్తాయో, నాగరాజు ఆగ్రహం ఎంతటి తీవ్రమైనదో జోనరాజు అద్భుతంగా వర్ణించాడు.

ఫణాశతోల్లాసద్దారిధారాశబ్దభయంకరః।
నాగారాజ్యో నగరీం వైరీవావేష్టయజ్వలైః॥
(జోనరాజ రాజతరంగిణి 927)

ధర్మాన్ని అనుష్ఠించే కుమ్మరి నగరం వదలి వెళ్లగానే తన వందల కొద్దీ ఫణులతో నాగరాజు సరస్సు నీటిని అల్లకల్లోలం చేశాడు. శత్రువులు నగరాన్ని చుట్టుముట్టినప్పుడు, వారు చేసే ధ్వనులను పోలి ఉన్నాయి అల్లకల్లోలమవుతున్న నీటి అలల శబ్దాలు.

ఇక్కడ ధర్మాన్ని పాటించే కుమ్మరిని తమ స్వీయ ధర్మాన్ని వదలకుండా పాటిస్తున్న వారికి ప్రతీకగా, పరధర్మాన్ని స్వీకరించిన వారిని దురాచారాన్ని పాటించే వారికి ప్రతీకగా తీసున్నాడు జోనరాజు అనిపిస్తుంది. కొందరు మతం మారకున్నా స్వధర్మం కన్నా పరధర్మాన్ని పాటించడానికే మొగ్గు చూపుతారు. వారిని కూడా ప్రదర్శించాడు జోనరాజు తన రాజతరంగిణిలో. ఈ విషయం తరువాత శ్లోకం సృష్టం చేస్తుంది.

మంత్రాన్ పఠత్సు విప్రేషు జనేషు ప్రణమత్స్వథ।
రుదత్స్యాపి చ బాలేషు నాస్యా భూత్యమవద్దరః॥
(జోనరాజ రాజతరంగిణి 928)

బ్రాహ్మణులు మంత్రాలు చదవటం ప్రారంభించారు. ప్రజలు నాగులకు ప్రణమిల్లారు. పిల్లలు భయంతో ఏడవటం మొదలు పెట్టారు. ఎవరేం చేసినా యమధర్మరాజుకు జాలి కలగనట్టే.. నాగరాజు కూడా జాలి దయలను ప్రదర్శించలేదు.

భయాద్బాలేషు పుత్రేషు కంఠలగ్నేషు యోషితః।
బాష్పముక్తాఫలైశ్చక్రుః పూజా ఫణిపతేరివ॥
(జోనరాజ రాజతరంగిణి 929)

భయంతో పిల్లలు వారి తల్లలను కౌగలించుకున్నారు ఏడుస్తూ. మహిళలు కార్చే కన్నీళ్లు వారు ముత్యాలతో నాగదేవతను పూజిస్తున్నట్టుందట.

భయంతో మహిళలు కార్చే కన్నీటిని, వారి ముత్యాలతో ఫణిరాజును అభిషేకిస్తున్నట్టుంది అనటం అనౌచిత్యం అనిపిస్తుంది. ఇక్కడ మహిళలు ప్రాణ భయంతో కన్నీళ్లు కారుస్తున్నారు. తమ ప్రాణాలు కాపాడమని వేడుకుంటూ కన్నీళ్ళు కారుస్తున్నారు. అలాంటి వారి కన్నీళ్ళను మ్యుత్యాలతో పోల్చడం అంతగా నప్పదు. ఒక కవితను కానీ, శ్లోకాన్ని కానీ రచించే సందర్భంలో కవి హృదయంలో చెలరేగే  స్పందనలు, ఆలోచనలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, కవి హృదయం బోధపడటమే కాదు, కవి ఉద్దేశం కూడా గ్రహించే వీలుంటుంది.

జోనరాజు తన రచనలో వర్ణిస్తున్నది ప్రాణ భయంతో జాలిగా రోదిస్తున్న అమాయక ప్రజలను కాదు,  స్వధర్మాన్ని మరచి దురాచారాలను స్వీకరించి, వాటి పాలనను, గొప్పగా, గర్వంగా భావిస్తున్న ప్రజల గురించి. వారికి తమ దోషం తెలిసి వచ్చేసరికి సమయం దాటిపోయింది. ఇది ఎలా ఉంటుందంటే, రెండవ ప్రపంచయుద్ధ కాలంలో, జర్మనీలో సామాన్య ప్రజలు కూడా నాజీల దుశ్చర్యలను సమర్థించారు. ఉత్సహంగా పాల్గొన్నారు. యూదులను ఏరివేయటంలో, వారి గుట్టుమట్లు నాజీలకు చేరవేయటంలో జర్మనీలోనే కాదు, పలు యూరప్ దేశాల్లో సామాన్యులు సైతం జాలి దయ లేకుండా ప్రవర్తించారు. యుద్ధంలో ఓడిపోయిన తరువాత ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారందరినీ వెతికి వెతికి శిక్షించారు. వారు సామాన్యులు, ఆ క్షణంలో ప్రాణ భయం వల్లనో, ప్రభోభాలకు లొంగో వారు అనుచితంగా ప్రవర్తించారని ఎవరూ వారిపై జాలి దయలు చూపలేదు. ప్రాణ భయంలో కన్నీళ్లు కారుస్తున్న మహిళల కన్నీళ్లు నాగరాజును ముత్యాలతో  అభిషేకిస్తున్నట్టు ఉందని జోనరాజు అనటం ఇలా అర్థం చేసుకోవచ్చు.

నాజీల దాకా ఎందుకు, కొద్ది కాలం క్రితం వరకూ కశ్మీరులో ఒక భారత సైనికుడు ఒంటరిగా చిక్కితే స్థానికులు అతడిని కొట్టి కొట్టి చంపే పరిస్థితులు నెలకొని ఉండేవి. రాళ్ళు రువ్వి సైనికుల ప్రాణాలు తీయటం కోసం సామాన్యులు తహతహలాడిన సంఘటనలు చూశాం. ఇంటి సందర్భాలలో సామాన్యులని వదిలేస్తే ఒక సమస్య, వారిని శిక్షిస్తే  ఇంకో సమస్య. ఎందుకంటే వారు ఏదో ఆవేశానికో, ప్రలోభానికో గురయిన వారని భావించి వారిని సమర్థించే వీలుంటుంది. కానీ తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే. తప్పుకు శిక్ష పడాల్సిందే అన్న భావన జోనరాజు వర్ణనల్లో కనిపిస్తుంది.

పాదా దంగం తతః కంఠం తతః స్కంధం తతః శిరః।
ప్రాణా ఇవ సుతా జగ్ముర్మాతృణాం భయ విహ్వలాః॥
(జోనరాజ రాజతరంగిణి 930)

ఈ వర్ణన ఒక సినిమా స్క్రిప్టులా ఉంటుంది. దృశ్యాన్ని కళ్ల ముందు నిలుపుతుంది. పదాలతో చిత్రపటాన్ని రూపొందించటానికి చక్కని ఉదాహరణ ఈ శ్లోకం. ఈ శ్లోకం చదువుతుంటే దృశ్యం కళ్ల ముందు నిలబడుతుంది.

నగరంలో నీటి మట్టం పెరుగుతున్న కొద్దీ తల్లుల కాళ్ల దగ్గర ఉన్న పిల్లలు, తల్లుల ఒళ్ళో చేరారు. ఆ తరువాత వారి భుజాలపైకి చేరారు. కంఠం దాటారు. చివరికి వారి తలలపైకి ఎక్కారు. చివరికి శరీరాన్ని ప్రాణం వదలి పోవటంతో వారికి దూరమయ్యారు. నీటి మట్టం ఎలా పెరుగుతోందో, దాని నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ఎలా ప్రయత్నించారో కళ్ల ముందు నిలుపుతుందీ శ్లోకం. నీరు ఓ ప్రేమికుడిలా మహిళలను చుట్టు ముంచేసిందట.

సర్వాణ్యాంగాని నారీణాం శృంగారీవానురాగవాన్।
కంపమానాని లోలః స జలపూరః సమస్పృశత్॥
(జోనరాజ రాజతరంగిణి 931)

నీరు ప్రేమికుడిలా – కంపిస్తున్న మహిళల సర్వాంగాలను  అనురాగంతో ముంచెత్తినట్టు ముంచెత్తింది. ఇలా అన్నిటినీ ముంచేస్తున్న నీరు చిన్నవి, పెద్దవి, గొప్పవి, బలమైనవి – దేనినీ వదలలేదు. అన్నిటినీ ముంచెత్తి అంతటా చీకటిని వ్యాపింప చేసింది. ఇలా అన్నిటినీ ముంచెత్తే సమయంలో కూడా దురాచారపరుల స్పర్శను తట్టుకోలేకపోయాడు నాగరాజు. అందుకని అతడు ఈ సరస్సు గర్భం లోపల నివాసం ఏర్పరుచుకున్నాడు. కాళీయుడి పడగలపై శ్రీకృష్ణుడు నాట్యమాడటం వల్ల అతని పడగలపై పద్మం వంటి పాదాల ముద్రలు ఏర్పడ్డాయి. అప్పటి నుంచీ ఇతడు పద్మపాదుడయ్యాడు.

నష్టాన్ యోజయితుం భూయః కశ్మీరునిచ్ఛతో హరేః।
అవతార స్త్యమేతత్తే సిధ్యత్యేవ చికీర్షితమ్॥
(జోనరాజ రాజతరంగిణి 935)

ఈ కథను పెద్దల ద్వారా విన్న సుల్తాన్‍కు ఆ రాత్రి కలలో ఎవరో కనిపించి చెప్పారు – ‘నష్టాల పాలయి ధ్వంసమైన కశ్మీరును పునర్నిర్మించి పునరుద్ధరించేందుకు జన్మించిన నారాయణుడి అవతారం నువ్వు. నీ అభీష్టం నెరవేరుతుంది’ అని.

ఈ శ్లోకం భారతీయుల మనస్తత్వంలోని ప్రతి ఒక్కరినీ తమలో కలుపుకునిపోయి, తమలో ఒకడిగా చేసుకునే లక్షణాన్ని ప్రదర్శిస్తుంది.

సుల్తాను జైనులాబిదీన్ నారాయణుడి అవతారం. ఈ అవతారం విచ్ఛిన్నమైన, ధ్వంసమైన కశ్మీరును పునర్నిర్మించి పునరుద్ధరించేందుకు. ఇలా పొగడ్తలు అందుకుంటున్న వ్యక్తి ఏదో ఓ క్షణంలో తాను నిజంగా అవతార పురుషుడనని నమ్ముతాడు. తన ప్రమేయం లేకుండానే భారతీయ ధర్మంలో భాగమై పోతాడు. దీనికన్నా ముందు పద్మపాదుడు ధర్మాన్ని పాలించాడు, ధర్మచ్యుతి అయితే ఆగ్రహించాడన్న కథ చెప్పాడు జోనరాజు. దాంతో జైనులాబిదీన్‍కు తాను ధర్మపాలన చేయాలన్నా, దేవతల ఆగ్రహానికి గురికాకూడదన్నా ఏం చేయాలో తెలిసింది. బలవంతపెట్టి, బెదిరించి, మనిషిని మార్చటం సులభం. కానీ ఇలా పద్ధతి ప్రకారం, స్వచ్ఛందంగా వ్యక్తి రూపాంతరం చెందేటట్టు చేయటం, ఎలాంటి సంఘర్షణా, ద్వేష భావనలు లేకుండా దీన్ని సాధ్యం చేయటం ఇతర ఏ నాగరికత లోను లేదు. నీటి లక్షణం ఇది. ప్రతీదాన్ని తనలో కరిగించుకుంటుంది. వెంట తీసుకెళ్తుంది. అడ్డు నిలిచినదాన్ని దాటుకుని ప్రయాణిస్తూ, నిరంతర పరిశ్రమ వల్ల దాన్ని తనలో కలిపేసుకుంటుంది. కలవనిదాన్ని కూడా వెంట తీసుకువెళుతుంది. నూనె నీటిలో కలవదు. కానీ నీటి ప్రవాహంలో అదీ ప్రయాణిస్తుంది. ఎక్కడా ఘర్షణ లేదు, ద్వేషం లేదు, ఆవేశం లేదు. అందుకేనేమో, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ సంస్కృతికి ప్రతీకలు నదులు. నదులు పవిత్రమైనవి. నదులు మాతలు. మాత అన్నిటినీ సహిస్తుంది, క్షమిస్తుంది. కానీ ధర్మభంగాన్ని భరించదు. ఇదీ భారతీయ ధర్మ స్వరూపం.

కలలో పద్మపాదుడి మాటలు సుల్తాన్‌ పై  ప్రభావం చూపించాయి. ‘తన నగర ప్రజలు దురాచారాలు పాటిస్తూ, ధర్మభంగం చేస్తే భరించలేక పోయాడు నాగరాజు. ఒక సామాన్యుడు కూడా తనకు అయిష్టమైనదాన్ని భరించలేడు. అలాంటిది సుల్తాన్‌ను, నారాయణుడి అవతారం లాంటి వాడిని నేను ఎట్టి పరిస్థితులలోనూ ఈ సరస్సు మధ్యలో నాగరాజు స్థాయికి, వైభవానికి తగిన మహాద్భుతమైన భవనం నిర్మించి తీరతాను’ అనుకున్నాడు. తాను నిర్మించే భవనం తన ఖ్యాతిని చిరకాలం చిరంజీవిగా నిలుపుతుందని భావించాడు.

నాగరాజో చితచ్ఛత్ర సగోత్ర మహామత్ర తు।
స్థలమాత్రం యశోరత్న ఘటికా రమ్యమారంభే॥
(జోనరాజ రాజతరంగిణి 938)

ఇలా ఆలోచించిన సుల్తాన్ సరస్సు మధ్య ద్వీపాన్ని ఏర్పాటు చేసి, ఆ ద్వీపంలో తరతరాలు తనను స్మరించే రీతిలో భవనం నిర్మించటం ఆరంభించాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here