జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-9

0
5

[box type=’note’ fontsize=’16’] జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

రాజ్యమా సంతేర్భావి కశ్మీరేషు తవేతి సః।
స్వమే వాక్యుదయా తత్ర మహాదేవ్యా భ్యషిచ్యతి॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 139)

[dropcap]సిం[/dropcap]హదేవుడి మరణం తరువాత అతడి సోదరుడు సూహదేవుడు రాజయ్యాడు. సూహదేవుడు అంత చురుకుగా వ్యవహరించేవాడు కాదు. జోనరాజు వర్ణన ప్రకారం ‘జడుడు’ . కానీ కామసూహుడి సహాయంతో అతను కశ్మీరమంతటినీ వశం చేసుకున్నాడు. ‘జడోపి సకలామేవ కశ్మీరాక్ష్మం వశో వ్యధాత్!’ అంటాడు జోనరాజు. జోనరాజు చెప్పిన ఈ ఒక్క వాక్యం ఎంతో చరిత్రను తనలో ఇముడ్చుకుని ఉంది.

సూహదేవుడు రాజ్యానికి వచ్చే నాటికి కశ్మీరం పలు రాజ్యాలుగా విభాజితమై ఉంది. స్థానికంగా శక్తిమంతులు ప్రత్యేక రాజ్యంగా వ్యవహరిస్తూ, కశ్మీర రాజు అధికారానికి తల వంచటం లేదు. కజ్జలుడి వల్ల కూడా కశ్మీరాధిపతి ఆధిక్యం తరిగిపోయింది. ఇలాంటి పరిస్థితులలో రాజ్యానికి వచ్చిన సూహదేవుడు ‘సకలామేవ కశ్మీరం’ అంటే సమస్త కశ్మీరాన్ని తన వశం చేసుకున్నాడంటే, అర్థం ఏమిటంటే, ‘ఎవరికి వారే యమునా తీరే’ లా ఉన్న చిన్న చిన్న సంస్థానాలను, రాజ్యాలను అందరినీ ఓడించి కశ్మీరంలో కలిపేయటం ద్వారా, కుంచించుకుపోయిన కశ్మీర సామ్రాజ్యాన్ని మళ్ళీ గతంలోని విశాల అవిభక్త కశ్మీరం స్థాయికి తెచ్చాడని. ఇందుకోసం జరిపిన పోరాటాల్లో భాగంగా, తురుష్క పాలిత ప్రాంతాలను జయించి ఉంటాడు. ఒకప్పుడు కశ్మీర సామ్రాజ్యంలో భాగాలయిన వాటిని మళ్ళీ కశ్మీర సామ్రాజ్యంలో అంతర్భాగాలు చేసి ఉంటాడు. రాజతరంగిణి రచనలో జోనరాజు అనుక్షణం స్ఫురణలో ఉంచుకున్న అంశం ఏమిటంటే, తాను సుల్తానుల ఏలుబడిలో ఉండి సుల్తానును ఆనందపరచటం కోసం రాజతరంగిణిని రచిస్తున్నాడు. తురుష్కుల పరాజయాల ప్రస్తావన సుల్తానులకు నచ్చదు. ఎందుకంటే, తమ దైవాన్ని నమ్మితే పరాజయం ఉండదని వారి నమ్మిక. అందుకు భిన్నమైనదాన్ని ప్రదర్శించకూడదు. కాబట్టి సమస్త కశ్మీరాన్ని వశం చేసుకున్నాడని చెప్పి, మిగతా విషయాలను ఊహకు వదిలాడు జోనరాజు. జోనరాజు రాజతరంగిణిని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఈ విషయాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. భారతీయ రాజుల విషయాల గురించి ముక్తసరిగా చెప్పి దాట వేయటం అధికంగా కనిపిస్తుంది. గమనిస్తే, పర్షియన్ చరిత్ర రచయితలు కూడా ఇదే పద్ధతిని అనుసరించారు. తురుష్కులు సాధించిన విజయాల గురించి పేజీలుపేజీలు వర్ణించి, భారతీయ రాజుల విజయాలను ఒక్క ముక్కలో తేల్చి పారేశారు. జోనరాజు కూడా అదే పద్ధతిని పాటించాడు.

సూహదేవుడు, కామసూహుడి సహాయంతో కశ్మీరాన్ని తన అదుపులోకి తెచ్చుకున్నాడు. ఎలాగయితే, పూల చుట్టూ తుమ్మెదలు వాలతాయో, అలాగ దేశం నలుమూలల నుంచి ప్రజలు ఉద్యోగార్థం రాజు దగ్గరకు వచ్చి చేరారు. సూహదేవుడిని రెండవ అర్జునుడు అంటాడు జోనరాజు. అర్జునుడితో పోల్చటం వల్ల సూహదేవుడు ఎంతటి వీరుడో అర్థం చేసుకోవచ్చు. రెండవ అర్జునుడిలా తన సామ్రాజ్యాన్ని ‘పంచగహ్వర’ సరిహద్దుల వరకు విస్తరింపజేశాడు. కొందరు చరిత్ర రచయితలు ఈ ‘పంచగహ్వర’ అంటే ఆధునిక ‘పంజాబ్’గా భావిస్తారు. కానీ అధికులు ఈ ఆలోచనను ఆమోదించరు. సూహదేవుడి కొడుకు ‘బభ్రువాహనుడు’ – ‘గర్భారపుర’ అనే నగరాన్ని నిర్మించాడు.

ఈ సమయంలో, దేశంలోని పలు ప్రాంతాల లోంచే కాదు, ఇస్లామీ దేశాల నుంచి కూడా ఇస్లామీయులు అధిక సంఖ్యలో కశ్మీరు వచ్చి చేరారు. ఈ కాలాన్ని వర్ణిస్తూ, జోనరాజు శ్రీవరుల ‘రాజతరంగిణి’లపై వ్యాఖ్యలతో పొందుపరిచిన ‘The History of Medieval Kashmir’ అన్న పుస్తకంలో గుల్షన్ మజీద్ – సూహదేవుడి కాలానికి కశ్మీరు భవిష్యత్తును నిర్దేశించే రాజకీయాలను నెరపగల శక్తిగలవారు ముగ్గురని అభిప్రాయపడ్డాడు. బ్రాహ్మణులు, భట్టులు, ‘and the sizable population of Muslims, who as traders, fortune seekers and refugees had come to settle here and had excelled, over period of time as warriors, men of many skills and importantly as most dependable allies. Muslims though still in minority were a force to reckon with’ అంటాడు. అంటే, అధిక సంఖ్యలో లేకున్నా ముస్లింలు తమ ఐకమత్యం వల్ల, యజమానుల విశ్వాసం చూరగొనటం వల్ల శక్తిమంతులయ్యారన్న మాట సూహదేవుడి కాలానికి. ఇక్కడ జోనరాజు కానీ, గుల్షన్ మజీద్ కానీ బహిరంగంగా ప్రకటించని విషయం ఏమిటంటే – కశ్మీరులో ఇస్లామీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతూండటంలో మతాంతీకరణ ప్రధాన పాత్ర పోషించిందన్నది. ఇంకా ఇస్లామీయుల పాలన ఆరంభం కాలేదు కాబట్టి, మతం మారే వారి సంఖ్య అల్పమే అయినా, మారిన ప్రతి ఒక్కరు ఇస్లామీయుల సంఖ్య పెరగటంలో తోడ్పడుతున్నారన్నది సత్యం. చిన్న చినుకులు  పెద్ద చెరువును నింపుతాయి.

ఇస్లామీయులు ఆరంభంలో ఎలాంటి క్రియాశీల పాత్రను పోషించలేదు. కానీ కశ్మీర రాజులు ఇస్లామీయులను ఆదరించి వారికి కీలకమైన పదవులు కట్టబెట్టటం, వారిపై విశ్వాసముంచి వ్యవహరించటంతో కశ్మీరులో ఇస్లామీయుల ప్రాబల్యం పెరిగింది.  అల్పసంఖ్యాకులుగా ఉన్న దశలోనే రాజకీయాలను నిర్దేశించే స్థాయిలో ఉన్నవారు అధిక సంఖ్యాకులయితే, దేశ చిత్రపటాన్నే సంపూర్ణంగా రూపాంతరం చెందిస్తారు. కశ్మీరులో కాలక్రమేణా జరిగింది అదే! ఇప్పుడు వెనక్కి తిరిగి చూసి విశ్లేషిస్తే, ఇదే పొరపాటు తరతరాలుగా జరుగుతూ వస్తోందని అర్థమవుతుంది. ఇప్పుడు సమకాలీన సమాజంలో కూడా జరుగుతున్న సంఘటనలు, ఆనాడు సూహదేవుడి నాటి కశ్మీరును తలపుకు తెస్తున్నాయి. ఆ విషయాన్ని ఇకపై కశ్మీరంలో జోనరాజు వర్ణించిన సంఘటనల క్రమం నిరూపిస్తుంది. ఇక్కడినుంచీ జోనరాజు ప్రత్యక్షంగా రచించినదానికన్నా, పైకి కనబడే అర్ధంలో ఒదిగివున్న గూఢార్ధాన్ని అర్ధంచేసుకుంటూ ముందుకు సాగాల్సివుంటుంది. అయితే, ఇకపై జరిగినది తెలుసుకుంటూంటే మనసులో తీరని బాధ కలుగుతుంది. ఇంతకాలానికీ ఇలాంటి వేదన కలుగుతూంటే, ఆ కాలంలో ఇస్లామీయుల పాలనలో తలవంచి జీవిస్తూ,  భవిష్యత్తులో ఇస్లామీయుల పాలన అంతమయ్యే సూచనలు కనబడని పరిస్థితుల్లో జీవికను సాగిస్తున్న జోనరాజు వంటి వారి మానసిక స్థితిని ఊహించాలంటేనే బాధతో మనసు రోదిస్తుంది. ఈనాడు, ఆనాటి మానసిక వేదన  స్పృహ లేకుండా వాదిస్తూ, తీర్మానాలుచేస్తూన్న వారిని చూసి బాధపడాలో, జాలిపడాలో, ఆగ్రహించాలో, ఛీత్కరించాలో తెలియదు.

‘కురుషాహ’ ఉన్నత కుటుంబంలో జన్మించాదు. అతడి చేతిపై బాణం పచ్చబొట్టు, అతని ఖ్యాతిలా, కొండల నడుమ నుండి ఉదయించే సూర్యుడిలా తేజోవంతమైనది. ఇది చెప్పిన తరువాత జోనరాజు, కల్హణుడు రాజతరంగిణిలో రాసిన శ్లోకాన్ని యథాతథంగా తన రాజతరంగిణిలో పొందుపరిచాడు.

కశ్మీరాః పార్వతీ తత్ర రాజాజ్ఞేయో హరాంశజః।
ఇత్య తతృత్సయాయేవ యస్యాసీన్బక్షుషాం త్రయమ్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 134)

ఈ శ్లోకం లోని మొదటి పాదం కల్హణ రాజతరంగిణిలోది. శ్రీకృష్ణుడు కశ్మీర రాజును వధించిన తరువాత, అతని మంత్రులు కశ్మీరాన్ని ఆక్రమించమని అభ్యర్థిస్తారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు అన్న మాటలు ఇవి. కశ్మీరం పార్వతితో సమానం. కాబట్టి కశ్మీర రాజు శివుడితో సమానం. అందువల్ల కశ్మీరంపై చెడు దృష్టి ప్రసరింపనీయవద్దు అని హెచ్చరించి, రాజు సంతానం బాలుడయినందువల్ల, రాణి యశోవతిని కశ్మీర సింహాసనంపై కూర్చుండబెడతాడు శ్రీకృష్ణుడు.

‘కురుషాహ’ గురించి రాస్తూ, హఠాత్తుగా జోనరాజు ఈ శ్లోకాన్ని రాజతరంగిణిలో చొప్పించాడు జోనరాజు.  రాజతరంగిణిని అనువదించిన జోగేష్ చందర్ దత్‍కు ఈ శ్లోకం అసందర్భం అనిపించి ఉంటుంది. అందుకని ఆయన ‘కురుషాహ’కు మూడు కళ్ళు ఉన్నాయని, తన సంతానం ‘శంషదేవముఖి’ కశ్మీరాన్ని పాలిస్తాడని, కశ్మీరు రాజులు శివాంశజులు’ అని అనువదించాడు. కానీ జోనరాజు ‘శంషదేవముఖి’ ప్రస్తావన తెచ్చేకన్నా ముందే ‘కశ్మీరాః పార్వతీ’ శ్లోకాన్ని పొందుపరిచాడు. ‘కురుషాహ’, ‘శంషదేవముఖి’ వంటివన్నీ జోనరాజు తురుష్క పేర్లను సంస్కృతీకరించిన ఫలితం. ‘శంషదేవముఖి’ అసలు పేరు ‘షాహమిర్’. వీరు తురుష్కులు. ఇక్కడే, రాజతరంగిణి రచనలో జోనరాజు చేసిన చమత్కారాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.

తురుష్కుల పేర్లను సంస్కృతీకరించాడు. ‘షాహ’ అన్నది తురుష్క పదం. ‘కురుషాహ’ను పొగిడి ‘కశ్మీరాః పార్వతీ’ శ్లోకం చొప్పించాడు. ఒక కోణం నుంచి చూస్తే కశ్మీరు పార్వతితో సమానం. రాజు శివాంశజుడు. కాబట్టి కశ్మీరాన్ని భారతీయ రాజు పాలించినా, తురుష్క రాజు పాలించినా, ఆ రాజు శివాంశజుడే అవుతాడు. పాలకుడిని బట్టి రాజ్యం ఆత్మ మారదు అన్న అర్థం వచ్చినా, కశ్మీర పాలకులు శివాంశజులే అని చెప్తున్నాడని అర్థం చేసుకోవచ్చు.  ఇది ఇస్లామీయుల పాలనకు భారతీయ దృక్కోణంలోంచి ప్రామాణికతను కల్పిస్తుంది. రాజీపడే మానసిక స్థితిని కలిగిస్తుంది. ఇస్లామీయులకు ఆనందం కలిగిస్తుంది.మరో కోణం లోంచి అర్థం చేసుకుంటే శివాంశజులు రాజుగా ఉండాల్సిన కశ్మీరుకు తురుష్కులు రాజులవుతున్నరన్న సూచన కనిపిస్తుంది. భవిష్యత్తులో జరగబోయేదాన్ని సూచన ప్రాయంగా తెలుపుతూ, ఎలాంటి కశ్మీరం ఎలాగవబోతోందన్న ఆవేదనను, ఆక్రోషాన్నీ జోనరాజు నిగూఢంగా వ్యక్తపరుస్తున్నాడన్నమాట.  ఏ కోణం లోంచి చూస్తే అలా అర్థం చేసుకోవచ్చు. ఈ శ్లోకం తరువాతి శ్లోకంలో కురుషాహ సంతతి కశ్మీరు రాజులవుతారన్న శ్లోకం వస్తుంది.

కశ్మీరేషు హి సామ్రాజ్యం కురుషాహస్య సంతతిః।
శంషాదేవముఖ ముఖ్యా ఖ్యాతకీర్తిః కరిష్యతి॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 135)

‘కశ్మీరాః పార్వతీ’ శ్లోకం తరువాత కురుషాహ సంతతికి కశ్మీర సామ్రాజ్యం దక్కుతుందని రాయటం వల్ల రెండు కోణాల్లో అర్థం చేసుకునే వీలు కలిగింది. సుల్తాను ఆశ్రయంలో ఉంటూ రాజతరంగిణి రాస్తున్న జోనరాజుకు మొదటి కోణంలో అర్థమవటం లాభకరం, క్షేమకరం. వ్యక్తిగతంగా రెండవ కోణం జోనరాజు ఉద్దేశం. ఈ రకమైన రచనా పద్ధతి జోనరాజు రాజతరంగిణిలో అడుగడుగునా కనిపిస్తుంది. సుల్తానుల గొప్పతనం వర్ణించటంలో కూడా ఇలాంటి రెండు అర్థాలనిచ్చే రెండు వైపులా పదునైన కత్తి లాంటి రచనా పద్ధతిని జోనరాజు అవలంబించాడు.

‘కురుషాహ’కు ‘తాహరాజు’ అనే కొడుకు జన్మించాడు. అతని వింటి నారి ఎప్పుడూ చెవి వరకూ లాగి సిద్ధంగా ఉంటుంది. అంటే, ఈయన ఎప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉంటాడన్న మాట. ఒక వైపు నుంచి చూస్తే వీరుడు. మరో వైపు నుంచి చూస్తే సమరలోలుడు. కలహప్రియుడు.  ‘తాహరాజు’ తర్వాత జన్మించాడు ‘షాహమేరుడు’. ఇతడినే ‘షాహమీర్’  అంటారు. ఇతని శక్తి మిట్టమధ్యాహ్నం సూర్యుడి లాంటిది. శత్రువు వధువుల కంటి నుండి జారిపడే  బాష్పకణాలు అతని ప్రతాపాగ్నిని ప్రదీప్తం చేస్తాయి అంటాదు జోనరాజు. ఈ వర్ణన ఒక కోణం లోంచి చూస్తే వారిద్దరి ధైర్య శౌర్యాలను పొగుడుతున్నట్టుంటుంది. మరో వైపు నుంచి చూస్తే, ఒకడు యుద్ధానికి ఎల్లప్పుడూ సిద్ధం, మరొకడు ఎంత మంది శత్రువులను చంపితే  అంత ఆనందం, అంతగా శత్రువుల భార్యలు ఏడుస్తారు. అప్పుడు మరింతగా రెచ్చిపోతాడన్న మాట ‘షాహమీర్’. ఇలాంటి వర్ణనలు సంస్కృత కావ్యాలలో కోకొల్లలు. కానీ ఈ వర్ణనలను తురుష్క వీరులకు వాడటంలో అర్థం మారుతుంది. వర్ణన వల్ల కళ్ళ ముందు కదిలే దృశ్యాలను అర్థం చేసుకునే తీరు మారుతుంది.

ఒకరోజు షాహిమీరుడు అడవిలో వేటాడుతున్నాడు. వేటాడుతూ అలసిపోయి ఓ చెట్టు నీడన విశ్రమించాడు. అప్పుడతనికి ఒక కల వచ్చింది. ఆ కల కశ్మీరు భవిష్యత్తును నిర్దేశించింది. కశ్మీరును సంపూర్ణంగా రూపాంతరం చెందించింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here