[box type=’note’ fontsize=’16’] “నీలి నీడలు” అనే ఖండకావ్యంలో మొత్తం ఏడు ఖండికలు ఉన్నాయి. ప్రతి ఖండికలో ఆణిముత్యాల వంటి పద్యాలు ఉన్నాయి. ‘చేతన’ అనే కలం పేరుతో ప్రస్తుత సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలను ప్రజలకు తెలిపి, జాగృతపరుస్తారు కవి మేడిపల్లి వేంకట లక్ష్మీ నారాయణ. ఇది మూడవ ఖండిక ‘జూదము’. [/box]
[dropcap style=”circle”]జూ[/dropcap]దము – ‘నీలి నీడలు’ ఖండకావ్యంలోని మూడవ ఖండిక.
***
భారతదేశ కీర్తికిని భంగముగల్గెడి రీతినింబ్రజల్
భారమనంగ నిద్ధరకు భాసుర మార్గమునందు నిల్పకే
కారణమౌచు చెడ్డకును కందుగ జేసెడి జూదక్రీడకున్
చేరువగా మెలగుంచును శ్రేయముబొందక గుందుచుండిరే. (1)
కాలక్షేపమటంచు కొందరును, కాక్షంజేసి యుంగొందరున్
కేళీలోలత చేత కొందరును, జంకే లేక యింకొందరున్
మేలౌ డబ్బును గోరి కొందరును, నేవులెంచక గొందరున్
నేలంధార్మిక బుద్ధి గొందరును, బత్నీచాత్ములై కొందరున్. (2)
మోదము గూర్చునంచుగడు మూర్ఖపు భావనతోడ మానవుల్
జూదమునాడి పూర్వమున సొమ్ములు గోల్పడి రిక్తహస్తులై
ఖేదము జెంది సంతతము క్లేశములందుచు గ్రుంగిపోవుచున్
వేదన పొందినారు పృథివీస్థల మందున నెందరెందరో. (3)
నలుడుగోలుపోయె నిలవైభవమంబును
ధర్మరాజు వీడె దనదు పదవి
శిష్టులెల్లరోసె దుష్టపద్ధతియైన
జూదమందునోడి, చోద్యముగను. (4)
ధరను సప్త వ్యసనముల వరుసయందు
ప్రథముగ జెప్పబడుచుండి ప్రజలకెపుడు
హాని గల్గించుచుండెడి యథమగుణము
జూదమే యని దెల్పిరి వేదవిదులు. (5)
మాయపాచికలాటనే మహినియెల్ల
ఎంచుచుండ్రి జూదంబుగ నింతదనుక
ఇంతకన్నను ఘోరమై యిండ్లు గూల్చు
ఆటలెన్నేనిగల నరసిచూడ. (6)
పౌరుషంబది యెంతయో ప్రకటితమవ
పెచ్చుపెరిగెడి రోషాన రెచ్చిపోయి
పందెములపైన పందెముల్పరగవేసి
మేదినిని యాడునాటను జూదమండ్రు. (7)