కాల(అ)జ్ఞానం!!

0
11

[dropcap]ఓ[/dropcap] కాలమా!!

ఉలకవు పలకవు, మౌనమె నీ ఆయుధమై,
చలము లచలము లన్ని, ఇట్టె నీ కైవశమై!!√√

ఏ యుగమైనను, ప్రాచీనమ, అధునాతనమ
ఏ యావేశము లేని అవికారతె, నీ లక్షణం!!√√

***

భూమి చాపగ చుట్టి, అసురు డెటొ మాయమైన
సామి చావనని, వాని అన్న, తెలివి జూపిన!!√√

దానమున పెంపెద్ద, దానవ రాజు నణచగ
ఊనమై వామనమైన హరి, త్రివిక్రమమైన!!√√

జనకుకై రాజ్యము, మాటకై జాయ త్యాజ్యమని
మానవుడై వెలసిన దేవుడె, చేసి చూపిన!!√√

ధర్మ స్థాపనకై అని పరమ కర్తవ్యమని,
మర్మభేది కృష్ణ వాక్పాంచజన్యమె ఘోషించిన!!√√

***

రాజు లున్మాదులై, పర సీమ లాక్రమించినను
ప్రజ లలోలక్ష్మణ యని కకావికలైనను!!√√

మతములు నమ్మకములు వెర్రి తలలేసిన
కైతవములు సమతల చెదర జేసినను!!√√

చాప క్రింద నీరై, యధర్మ మన్నిటి ముంచెత్తిన
కోపగించి, ధీరు డొక డుధ్ధరించు త్రాతయైన!!√√

***

కుట్రల కుతంత్రముల ప్రపంచ మాక్రమించిన,
ఇట రవి అస్తమించడని చాటింపు వేసిన! √√

విజ్ఞానము నహంకృతితో జన వినాశముకై,
అజ లేక నుసి చేయు అణుబాంబుకై వాడిన!!√√

మనిషిని మనిషె తరుముచు వేటాడినను
కనికరము మాయమై ధనమె శాసించినను√√

జనులెన్నిన ప్రభుతలు, మాటల మోసపుచ్చి
కనరాని శఠగోపములతొ యేమార్చినను!!√√

ఓటేసిన వాడు గొర్రె, ఇక ఆటాడిద్దామని
చాటేమి లేకనె నాయకులు దగా చేసినను!!√√

***

మూగవొ, జ్ఞానివొ, దైవమవో, మే మెరుగమహో
అగాధ, అదృశ్య, అగమ్య ఘనమ, ఓ కాలమా!!√√

సత్య ధర్మములు భువి నేలితె నీ మహిమయొ?!
సత్య హాని, ధర్మ గ్లాని జరుగటె నీ కతమో?!√√

కనబడని, వినబడని నీకు చెప్పలేక,
కనలజేయు ఆ అన్యాయము లెదుర్కొనలేక!√√

కన్నీటి కడలియె ఇంకిపోయె! సొలసిపోయె
జన సామాన్యము, క్షత వ్యాఘ్రమై మూల్గుచున్నది!!√√

కాని,త్వరలో వస్తుందొక ప్రభంజనాంజనము
జన శక్తియె దుర్గయై, కత్తి ఝళిపించే రోజు!√√

నవరక్తపు నవయుగారంభం అతి త్వరలో
జవసత్త్వాలుడిగి దౌర్జన్యం పారిపోయే రోజు!!√√

అధికార మదపు టేనుగుల పలాయనము
తథ్యం, తథ్యం, తథ్యం,అనివార్యం, అనుల్లంఘనీయం!!√√

***

ఆశంస:
అప్పుడైనా, కనబడి పలకరించవోయ్, ఓ కాలమా!√√
చెప్పుకునేందుకు బహుబాగుంటుంది, నీ వైనం మారిందని!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here