కాలంతోబాటు మారాలి – 10

0
11

[కళావతి గర్భవతి అయిన శుభవార్తను తెలియజేస్తున్న ఉత్తరాన్ని గణపతిశాస్త్రి అందుకుంటారు. మాస్టారి అభిప్రాయం ప్రకారం పెద్దరికంతో ఆ వార్తను కళావతి తల్లిదండ్రులకు ఆయన తెలియజేస్తారు. కళావతి ప్రసవానికి పుట్టింటికి వెళ్ళే సమయానికి తమ పనిమనిషి ద్వారా దుక్క సూరమ్మగారిని వంటకు కుదుర్చుకుంటుంది. ఒకరోజు మాస్టారు విజయనగరం వెళ్తారు. అక్కని ఆప్యాయంగా పలకరించి, మేనల్లుడు శంకరశాస్త్రిని ప్రశ్నలు వేస్తారు. శంకరుడి చెల్లెలు గిరిజను బడికి పంపి చదివించమని మాస్టారు అక్కకి సూచిస్తారు. రోజులు గడిచి, కళావతి పుట్టింట ఒక కుమారుడిని ప్రసవిస్తుంది. దుక్క సూరమ్మగారి పూర్తిగా వంటింటి బాధ్యత తీసుకోవడంతో మాస్టారు దంపతులు బాబుతో కాలం గడుపుతారు. బాబుకి విశ్వేశ్వర శర్మ అని పేరు పెట్టినా ముద్దుగా ‘నాన్నలు’ అని పిలుచుకునేవారు. నాలుగు సంవత్సరాలు గడుస్తాయి. విశ్వేశ్వర శర్మకి చెల్లెలు పుడుతుంది. మాస్టారు తమ తల్లి పేరిట ఆ పాపకి మంగమ్మ అని పేరు పెడతారు. ‘అమ్మలు’ అని పిలుచుకుంటారు. కాలం గడుస్తుంది. పిల్లలిద్దరూ బడిలో చేరుతారు. చదువులలో రాణిస్తారు. శర్మ హైస్కూలు చదువు పూర్తయి, కాలేజీలో చేరడంతో, మంగమ్మ ఒక్కర్తే స్కూలుకు వెళ్ళాల్సి వస్తుంది. ఒకరోజు ఒక ఆకతాయి దారిలో మంగమ్మతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. బెదిరిపోయిన మంగమ్మ తానిక బడికి వెళ్ళనని ఏడుస్తుంది. విషయం తెలుసుకున్న తండ్రి స్కూలు హెడ్‍మాస్టారుకు ఫిర్యాదు చేయగా, మంగమ్మ ఆ కుర్రవాడి గుర్తు పడుతుంది. ఆ పిల్లాడి మేనమామ వాడిని శిక్షించి, బుద్ధి చెబుతాడు. – ఇక చదవండి]

[dropcap]కా[/dropcap]లచక్రం ముందుకు సాగింది. మాష్టారు దంపతులు గర్వించదగినట్లు, నాన్నలు, B.Sc. 1st క్లాసులో పాసయ్యేడు. అమ్మలు, S.S.L.C. 92 శాతంతో పాసయి, స్కూలు ఫస్టుగా నిలిచింది. తమ కలలు నిజము అవుతున్నాయని, చిన్న లెక్కల మాస్టారు, గురువమ్మగారు, ఎంతో సంతోషించేరు. అక్క, బావగారు, తనను, పట్టుబట్టి, విజయనగరములో స్కూలులో జాయిను చెయ్యబట్టి, తన పిల్లలు ఆ స్థాయికి ఎదగగలిగేరని, వారిద్దరకు మాష్టారు ధన్యవాదాలు తెలియజేసేరు. వారునూ, తగు విధముగా తమ్ముని పట్టుదలను, పిల్లల ప్రతిభను కొనియాడేరు.

మాష్టారు, నాన్నలును పిలిచి, M.Sc. లో ప్రవేశించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టమన్నారు.

తరువాత నాన్నలు ఆ విషయం, తల్లితో చర్చించేడు.

“అమ్మా, నాన్నగారు నన్ను M.Sc. చెయ్యమన్నారు మరి చెల్లి మాటేమిటి.” అని తన మదిలో ఉన్న సంశయం తీర్చుకోదలిచేడు.

“అది కూడా కాలేజీలో చేరుతుంది, నాన్నా నీకా అనుమానం ఎందుకొచ్చింది.”

“అమ్మా, M.Sc. కి చాలా ఖర్చవుతుందమ్మా. ఇద్దరం ఒకేమారు కాలేజీలో చేరితే, ఇబ్బందేమో. అంచేత, చెల్లిని ఒక్కదాన్నీ, ఇంటర్మీడియట్లో, చేరనీ. అది స్కూలు ఫస్టు ఒచ్చింది.” తన అభిప్రాయం, ఒక బాధ్యత గల కొడుకుగా తల్లికి చెప్పేడు.

“నాన్నా, మీ ఇద్దరి పై చదువులకోసం, నాన్నగారు, మీ చిన్నప్పటినుండీ, బేంకులో డబ్బు దాచేరు. ముందుగా నాన్నగారు అన్నీ ప్లాను చేసేరు. నువ్వు ఏమీ గాభరా పడకు. నాన్నగారు చెప్పినట్టూ చెయ్యి.” అని నాన్నలు భుజం తట్టింది, కళావతి.

కొడుకు బాధ్యతను మనసులో కొనియాడింది, తల్లి. ఆ సంతోషం భర్తతో పంచుకొంది.

ఒకరోజు, అన్న, చెల్లెలు, పైచదువుల గూర్చి, చర్చించుకొంటూ ఉండేవారు. వారి సంభాషణ, కొంతవరకు, ఆ సమయంలో అక్కడకు వచ్చిన కళావతి చెవిలో బడ్డది.

“ఏమిటి, మీరిద్దరూ అంతగా ఆలోచిస్తున్నారు.” అని కళావతి వారినడిగింది.

“అమ్మా, మా క్లాసులో పాసయిన ఆడపిల్లలలో, నేను, మరో అమ్మాయి, ఇద్దరమే కాలేజీలో జాయిను అవుదామని అనుకొంటున్నాం. ఆ అమ్మాయి, నా బెస్టు ఫ్రెండమ్మా. ఆ అమ్మాయి, ఆర్ట్సులో జాయిను అవుతానంది. నాకు తోడు ఉంటుందని, నేనూ, ఆర్ట్సులో జాయిను అవుదామని అనుకొంటున్నాను. అన్నయ్య, వద్దంటున్నాడు. సైన్సెసులో జాయిను అవ్వమంటున్నాడు.” అని చర్చ విషయం తల్లికి చెప్పింది, మంగమ్మ.

“అమ్మా, ఆ అమ్మాయికి సైన్సులో తక్కువ మార్కులు వచ్చేయట. అందుకే, ఆర్ట్సులో జాయిను అవుతున్నాదిట. చెల్లికి సైన్సులో తొంభై మార్కులు వచ్చేయమ్మా. అంచేత, సైన్సెసులో జాయిను అవమంటున్నాను.” అని, తన అభిమతమూ, సలహా, తల్లికి తెలియజేసేడు.

“అన్న చెప్పింది, బాగున్నట్టుందమ్మా. నీకు ఎందులో మంచి మార్కులు వస్తే, అందులో చేరడం మంచిది కదా. అయినా, నాన్నగారిని అడగండి, ఏం చెయ్యమంటారో.” కళావతి, తన తీర్పు చెప్పింది.

శర్మకు, ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో, తన క్లాసుమేటు అన్న, బెనారెసులో, ఎలక్ట్రికల్ ఎండ్ మెకానికల్ ఇంజినీరింగు చదువుతూ ఉండేవాడు. అతని పరిచయంతో, తనూ ఆ ఇంజినీరింగు చదవాలని, శర్మకు, కోరిక పుట్టింది. ఆ రోజుల్లో, విశాఖపట్నంలో ఇంజినీరింగు కాలేజీ ఉండేది కాదు. దగ్గరలో, కాకినాడలో ఉండేది. పై ఊరిలో, హోస్టలులో పెట్టి, చదివించే ఆర్ధిక స్థోమతు తండ్రికి లేదని, శర్మ గ్రహించుకొన్నాడు. అందుచేత, ఆ విషయం, తండ్రితో చెప్పలేదు. విశాఖపట్నంలోనే, అందుబాటులో ఉన్న ఉన్నతవిద్య నభ్యసించదలిచేడు. శర్మ, B.Sc. చదువుతున్న రోజుల్లో, ఒకమారు, ఊళ్లోని మెడికల్ కాలేజీకి వెళ్ళేడు. అక్కడ, తెల్లటి కోటు, మెడలో స్టెతస్కోపు ధరించిన లేడీ స్తూడెంట్సుని చూసి, తన చెల్లెలును కూడా, అలా చూడాలనిపించింది, శర్మకు.

దంపతులిద్దరూ, పిల్లల చదువు విషయం ఆలోచిస్తూ ఉండేవారు. ఆ సందర్భంలో, అదే విషయం, పిల్లలవద్ద తను విన్నది, మాష్టారుకు తెలియజేసింది, కళావతి. అది విని, మాష్టారు చిన్న చిరునవ్వు నవ్వేరు.

“మీరేమిటి చేద్దామనుకొంటున్నారండీ.” పతి మనసు తెలియగోరింది, సతి.

“నేను అదే, అన్ని పక్కలనుండి ఆలోచిస్తున్నాను, కళావతీ. మగపిల్లడికి చదువే ఆధారం. అందుచేత, వాడిని M.Sc. చేయిస్తే, పెద్ద ఉద్యోగం దొరుకుతుంది. దానితో వాడు సుఖంగా బ్రతకగలడు. ఇహ, అమ్మలు విషయం. తెలివయినది; వీలయినంత పెద్ద చదువులు చదివించాలనే ఉంది. కానీ.. నీ ఉద్దేశమేమిటి.” గురువమ్మగారిని అడిగేరు, చిన్న లెక్కల మాష్టారు.

“మీరన్నది నిజమేనండీ. వాడు పెద్ద ఉద్యోగంలో ఉంటే, మీరన్నట్టు, సుఖంగా బ్రతుకుతాడు. ప్రతీ చిన్న ఖర్చుకి, లెక్కలు చూసుకోవలసిన అవసరం ఉండదు. మరి అమ్మలు విషయమే, ఏమీ తెలియడం లేదండీ.”

“కళావతీ, అమ్మలుని కేవలం ఇంటర్మీడియట్ చేయిస్తే, ఏమీ లాభం ఉండదు. కనీసం డిగ్రీ అయినా చేయించాలి. కాని, నీకు తెలిసినదే. ఆడపిల్లకు ఎంత చదువు చదివించినా, తరువాత పెళ్లి కూడా చెయ్యాలిగా. దానికన్నా పెద్ద చదువో, కనీసం దానిపాటి చదువు ఉన్న వాడినయినా చూడాలి.” అని మాష్టారు ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే, కళావతి అందుకొంది.

“అంత పెద్ద చదువులవాళ్ళు కట్నాలూ దండిగా అడుగుతారు. ఈ రోజుల్లో, కట్నాలు కోరికలూ, కూడా విపరీతంగా ఉన్నాయి కదండీ. ఆడపిల్లల పెళ్ళిళ్ళకి, ఆస్తులు అమ్మీసుకోవలసి వస్తోంది.” అని, ఆడపిల్లల కన్నవారి పరిస్థితిని, జ్ఞాపకం చేసుకొంది, ఆడపిల్లను కన్న, తల్లి.

“ఆడపిల్లను పెళ్లి చేసుకోవడం, ఆ పిల్లకు, వాళ్ల కుటుంబానికి ఏదో ఉపకారం చేసేము అనుకొంటారు, మగవాళ్ళు. పెళ్లి, అన్నది ఇద్దరికీ కావలిసినదే అనుకోరు.” మాష్టారి నిరసన.

“ఈ మధ్య, ఓ పేరంటంలో ఒకావిడ, కూతురు పెళ్ళి విషయంలో, కట్నాల సంగతి చెపుతూ ఉంటే, మరో ఆవిడ, ‘మీకేమిటండీ, మగపిల్లాడు కూడా ఉన్నాడుగా. వాడికి కట్నం పుచ్చుకొని, అమ్మాయి పెళ్లి చేసీవచ్చు. మా సంగతి చూడండి, ఉన్న ముగ్గురూ ఆడపిల్లలే’ అని అనగానే, అందరూ నవ్వుకున్నాం.” అని నవ్వుతూ చెప్పింది, కళావతి.

“కట్నాలు పుచ్చుకోవడమే కాదు కళావతీ. మగపిల్లాడు పెళ్లి, అంటే ఏమిటి. కన్యాదానం పుచ్చుకోడమే కదా. పోనీ, కట్నం అన్నది, దానంతో దక్షిణ అనుకొందాం. కాని, దానం పుచ్చుకొన్న మగపెళ్లివారు, దానం ఇచ్చిన ఆడపెళ్ళివారిని, చిన్నచూపు చూస్తూ ఉంటారు. విచిత్రంగా ఉంది గదూ.” అని మాష్టారు నవ్వేరు.

అంతలో అమ్మలు అక్కడకు రావడంతో, ఆ సంభాషణకు తెర దించేరు, దంపతులు.

కళావతి, పిల్లల చదువు విషయం ఏకాంతంగా ఆలోచించింది. ఖర్చుల విషయంలో, భర్త ఆలోచనలో పడినట్లు గ్రహించింది. తనకో ఆలోచన తట్టింది. సమయం చూసుకొని, భర్తతో ఆ విషయం లేవనెత్తింది.

“మన పిల్లల చదువు ఖర్చు విషయంలో, మీరేమీ అనుకోకపోతే, నాకో ఆలోచన వచ్చిందండి. చెప్పీదా.” వినయంగా భర్తనడిగింది, కళావతి.

“కళావతీ, నేననుకోవడమేమిటి. పిల్లల చదువు, ఇద్దరం కలసి ఆలోచించుకోవలసిన విషయం. నువ్వు ఏమిటి అనుకొంటున్నావో చెప్పు.” మాష్టారు అలా స్పందించేరు.

“మా నాన్నగారికి పెట్టవలసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అంచేత, మా నాన్నగారిని సహాయం చెయ్యమంటే; ఊరకునే కాదు; అప్పుగా అడుగుదామా.”

“కళావతీ, ఇద్దరూ ఒకేమారు కాలేజీలో చదవడం, కేవలం రెండు సంవత్సరాలే. ఆ తరువాత, నాన్నలు చదువు అయిపోతుంది. అప్పుడు, అమ్మలు చదువు ఒక్కటే ఉంటుంది. ఆ రెండు సంవత్సరాలూ, కష్టపడి మేనేజ్ చేస్తే, మరే ఇబ్బంది ఉండదు. వీలయినంతవరకు, మన ప్రోబ్లెంసు మనమే సాల్వు చేసుకోడానికి ప్రయత్నిద్దాం. అప్పటికీ అవసరం అయితే, నువ్వు చెప్పింది ఆలోచించవచ్చు. ఏమంటావ్.” అని మాష్టారు తన అభిమతం, భార్యకు తెలియజేసేరు.

కళావతి ఆ ఆలోచనతో ఏకీభవించింది .

చెల్లెలు, I.Sc. పాసయిననాటికి, తన M.Sc. అయిపోతుందనుకున్నాడు, శర్మ. అప్పుడు తను ఏ కాలేజీలోనయినా లెక్చరరుగా చేరి, తండ్రికి ఆర్ధిక భారం లేకుండా, చెల్లిని మెడిసిన్ చేయించగలను అనుకొన్నాడు. గతంలో తను ఆశించినట్లు, తెల్ల కోటు, స్టెతస్కోపుతో, చెల్లిని చూడగలను అనుకొన్నాడు. ఆ ప్రణాళికా వివరాలు చెల్లితో పంచుకున్నాడు.

ఇద్దరు పిల్లలూ, కాలేజీలలో చేరేక, మాష్టారు దంపతులు, కలసి ఆలోచించి, కొన్ని ఆర్థిక సంస్కరణలు చేబట్టేరు. ఎక్కడెక్కడ, ఏ ఏ ఖర్చులు తగ్గించుకోగలరో ఆలోచించేరు.

“ఏమండీ, వంటకి సూరమ్మగారిని మాన్పించేస్తే, చాలా ఖర్చు తగ్గుతుందండీ. ఆవిడ నూనె వాడకం ఎక్కువ. చాలా దూబరా చేస్తోంది. చెప్పినా, ‘తగ్గిస్తాను’ అంటుంది, కాని ఆవిడా అలవాటు మానుకోదు.” తన డిపార్టుమెంటులో ఏక్షన్ ప్లేన్ చెప్పింది, కళావతి.

భార్య, మరీ నొక్కి చెప్పడంతో, మాష్టారు అంగీకరిస్తూ, ఓ సలహా ఇచ్చేరు.

“కళావతీ, నీకు కొంచెం పని తగ్గుతుంది. పనిపిల్ల శుభ్రంగా ఉంటోంది. దాన్ని సబ్బుతో చేతులు కడుక్కోమని; వంటింట్లో దానిచేత మరికొన్ని పనులు చేయించుకో.” హాస్యం జోడిస్తూ, “అది ఊరకే ఉండదు. ఏవో కబుర్లు కూడా చెపుతుంది. నీకు ఊసుపోతుంది.” అన్నారు.

“మన ఇళ్లలో పనివాళ్లని ఎప్పుడూ వంటింట్లోకి రానివ్వరండీ.” తన అభిప్రాయం చెప్పింది, కళావతి.

“కళావతీ, మనవాళ్ళు అలా చేసేరంటే; ఆ రోజులు వేరు; ఈ రోజులు వేరు. మనం కాలంతోబాటు మారాలి.” అని చెప్పి ఒప్పించేరు.

మాష్టారి ఇంటికి బాగా దూరంలోనుండెడి, మరొక స్కూలు విద్యార్థులు, శని, ఆదివారాల్లో ట్యూషను చెప్పమని కోరేరు. కళావతి, మాష్టారి ఆరోగ్యాన్ని దృష్టిలో నుంచుకొని, సుముఖత చూపలేదు. మాష్టారు, చెప్పి ఒప్పించేరు. క్రమేపీ, శని, ఆదివారాల విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఆ రోజుల్లో, శర్మ, తండ్రికి చాలా సహాయబడుతూ ఉండేవాడు.

మంగమ్మ కాలేజీ, మరియు శర్మ యూనివర్సిటీ, శలవుల తరువాత తెరువబడ్డాయి. తండ్రిని సంప్రదించి, శర్మ, M.Sc. మేథ్స్ లోను, మంగమ్మ, ఇంటర్మీడియేట్ బయాలజీలోనూ, చేరేరు.

అది, 1956వ సంవత్సరం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మైలురాయి. హైదరాబాదు రాజధానిగా, నవ్యాన్ధ్రప్రదేశ్ అవతరించిన వత్సరమది. మాష్టారి జీవితంలో కూడా, ఆ సంవత్సరం ఒక మైలురాయి. పౌరోహిత్యమే, వంశపారంపర్యంగా వస్తున్న కుటుంబంలో, ఆయన కుమారుడు, ఉన్నతవిద్యకై, ఒక విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టిన సంవత్సరం, అది. ఆడపిల్లల చదువుకు, చాకలిపద్దే హద్దుగా నుండెడి వారసత్వంలో, ఆయన కుమార్తె, కాలేజీలో కాలు పెట్టిన సంవత్సరం, అది. అంతటి అభివృద్ధికి, బీజం ఎప్పుడు పడింది. అల్లుడు, కూతురు, ఇచ్చిన సలహాను పాటించి, పూజారి గారు, పైచదువుకు, బుజ్జిబాబును విజయనగరం పంపిన రోజు, అది.

అవకాశాలు ఉన్నా, అభివృద్ధికి, ఉన్నత ఆశయాలు ఉండాలి. ‘చదువు చాలించి, నాన్నగారి లాగ పూజారివి అవుతావా.’ అని హాస్యానికే అక్క అడిగినా, తల అడ్డముగా ఊపి, అది కాదు అని, ఆనాడే, తన ఖచ్చితమయిన అభిప్రాయాన్ని చెప్పేడు, ఏడేళ్ల బుజ్జిబాబు.

ఆశయాలు ఉన్నా, అవి నెరవేర్చుకోడానికి, పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలే, మాష్టారి జీవితంలో, గట్టి పునాదులు వేసింది. ఒకనాటి చిన్న లెక్కల మాష్టారు, ఆనాడు ఆ స్థాయికి ఎదిగేరు.

ఒక సంవత్సరం గడిచింది. నాన్నలు, M.Sc. మొదటి సంవత్సరం, అమ్మలు, ఇంటరు మొదటి సంవత్సరం, సత్ఫలితాలతో పాసయ్యేరు. మాష్టారు దంపతులు, ఆర్ధిక పరిస్థితిని, సమీక్షించుకొన్నారు. మరొక్క సంవత్సరం, అలా కష్టబడితే, అనుకొన్నది సాధించగలమని, వారికి నమ్మకం కలిగింది.

అవి ఎండాకాలం శలవులు. ఉన్నతాశయాలు గలవారు, రేపటి పని, ఈ రోజే చేస్తారు. మరుసటి సంవత్సరం పాఠాలు, చెల్లెలుకు ముందుగా నేర్పుతూ ఉండేవాడు, అన్నయ్య. మంగమ్మ, శ్రద్ధగా నేర్చుకొంటూ ఉండేది. అన్నా, చెల్లెళ్ళ అనుబంధం, మాష్టారు దంపతులకు, సంతోషం కలుగజేస్తూ ఉండేది.

I.Sc. మొదటి సంవత్సరం, మంచిమార్కులతో పాసయిన, ఇద్దరు విద్యార్థులకు, ఇంజినీరింగు చదవాలని, ఉన్నతాశయం ఉండేది. ఆ ముందు సంవత్సరమే, ఆంధ్రా యూనివర్సిటీలో, ఇంజనీరింగ్ కాలేజీ స్థాపింపబడ్డది. కాని, ఆ ఇద్దరికీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చేయాలని ఉండేది. వారి ఆశయం నెరవేర్చుకోడానికి, ట్యూషనులో చేరదలచుకొన్నారు. కాలేజీలో లెక్చరర్ అయితే, ఏ సబ్జెక్టు లెక్చరరు, ఆ సబ్జెక్టే చెబుతారు; తెలివయిన సీనియరు విద్యార్థి దగ్గర, మూడు సబ్జెక్టులూ నేర్చుకోవచ్చును, అని అభిప్రాయబడ్డారు. అదేకాకుండా, సీనియరు విద్యార్థి దగ్గర, నేర్చుకోడంలో స్వేచ్ఛ ఉంటుంది, అనుకొన్నారు. కోరిన సీనియరు విద్యార్థిగా, వారి దృష్టిలోకి, మాష్టారి శర్మ వచ్చేడు. ఒక రోజు, ఆ ఇద్దరూ, శర్మను ఇంటివద్ద కలుసుకున్నారు. వారి కోరిక తెలియజేసేరు. ఆలోచిస్తాను, అన్నాడు శర్మ. తన నిర్ణయం కొరకు, ఆ మరునాడు రమ్మన్నాడు.

ఆ కుర్రాళ్ళిద్దరూ వెళిపోయేక, శర్మ, వంటింట్లోని తల్లిదగ్గరకు వెళ్లి, ఆ విషయం తెలియజేసేడు. కళావతి, స్పందిస్తూ,

“నాన్నా, ఇప్పుడు నీకు డబ్బు ఆర్జించవలసిన అవసరం ఏమిటొచ్చింది. హాయిగా, ఉన్న టైములో, నీ చదువు సంగతి చూసుకో. అది ముఖ్యం. ఈ సంవత్సరం కూడా, మీ ఇద్దరి చదువు, ఏ ఇబ్బందీ లేకుండా అయిపోతుంది. బెంగపడకు.” అని హామీ ఇచ్చింది, తల్లి.

“అదికాదమ్మా…” అని కొడుకు ఏదో చెప్పబోతూ ఉంటే,

“సరే, నాన్నా. ఆ విషయంలో, మీ నాన్నగారు సరి అయిన సలహా ఇవ్వగలరు. ఆయన వీధిలోనుండి వచ్చేక, ఆయనతో ఆ విషయం మాట్లాడు.” అని సలహా ఇచ్చింది, కళావతి.

శర్మ, ఆ విషయం తండ్రితో చర్చించేడు. తన చదువుకు ఎట్టి ఆటంకమూ రాదని హామీ ఇచ్చేడు. ఆ ఇద్దరకూ, ఇంజినీరింగులో సీటు దొరికితే, భవిషత్తులో తనకు ఎలా లాభిస్తుందో, వివరంగా చెప్పి ఒప్పించేడు. కొడుకు, బయటకు చెప్పకపోయినా, అప్పట్లో అది తనకు చేయూత నీయడానికే అని, మాష్టరుకు తెలుసు. కొడుకు బాధ్యతను, మనసులో కొనియాడేరు. తన భవిష్యత్తుకై కష్టపడ దలచిన కొడుకు ఆత్రుతపై, చన్నీళ్ళు జల్లదలచుకోలేదు. వచ్చిన అవకాశాన్ని, సద్వినియోగం చేసుకొని, రాబోయే రేపటికి, ఈనాడే వ్యూహరచన చేసిన కొడుకు తెలివితేటలును మెచ్చుకొన్నారు. భార్యతో, ఆ వివరాలన్నీ, సంతోషంతో పంచుకొన్నారు.

మంగమ్మ పరీక్షా ఫలితాలు వచ్చేయి. ఆశించినట్లూ, 87 శాతంతో, ఫస్టు క్లాసులో పాసయింది. శర్మ విద్యార్థులలో ఒకడు ఫస్టు క్లాసులో పాసయ్యేడు. రెండవవాడు, పది మార్కులలో ఫస్టు క్లాసు, తప్పేడు. ఆ తరువాత కొన్నాళ్ళకు, ఆ ఇద్దరిలో ఒకరికి కాకినాడలోను, రెండవవానికి బెనారస్ హిందూ యూనివర్సిటీలోనూ ఇంజినీరింగులో సీట్లు దొరికేయి. పాఠాలు బాగా బోధపరుస్తాడని, శర్మకు పేరు వచ్చింది. నలుగురు ఇంటర్ విద్యార్థులు, ట్యూషను చెప్పమని వచ్చేరు. అప్పటికి, శర్మ, ఫైనల్ ఇయర్ పరీక్షలు కాలేదు. నెల తరువాత పాఠాలు ప్రారంభిస్తాను అన్నాడు, శర్మ.

అన్న ప్రోత్సహించినట్లూ, మంగమ్మ మెడిసినులో చేరుదామనుకొంది. ఓ రోజు, మాష్టారు, కళావతి, శర్మ, ఉన్న సమయంలో, ఆ విషయం చర్చకు వచ్చింది. తను తప్పక ఫస్టు క్లాసులో పాసవుతానని, లెక్చరర్ ఉద్యోగం దొరుకుతుందనీ, అదీ కాక, ట్యూషన్లు కూడా బాగా వస్తాయని, అందుచేత, చెల్లెలి చదువుకు ఆర్థిక ఇబ్బంది ఉండదనీ శర్మ, తల్లిదండ్రులకు హామీ ఇచ్చేడు. మాష్టారు, చిరునవ్వుతో, “నువ్వు చెప్పింది బాగానే ఉంది. నాన్నా, చెల్లెలు డాక్టరు అయితే, అంతకన్నా కావలసింది ఏమిటి. కానీ, అది, దాని పెళ్ళికి సమస్య అవుతుందేమో.. అదే ఆలోచించాలి.” మాష్టారు సందేహం వెలిబుచ్చేరు.

“అవును నాన్నా, నువ్వు చిన్నవాడివి. నీకు తెలీదు. ఈ రోజుల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు తలచుకొంటే భయమేస్తోంది.” కళావతి, భర్త సందేహంతో ఏకీభవించింది.

“సమస్య ఏమిటి వస్తుంది. నాకు తెలియడం లేదు.” శర్మ ప్రశ్నార్థకంగా అడిగేడు.

“నాన్నా, అమ్మలు, అంత పెద్ద చదువు చదివితే, అంతకన్నా ఎక్కువ చదివిన వాడినో, కనీసం, దానంత చదివిన వాడినో చూడాలి. అలాంటి వాళ్ళు, కట్నాలు మరీ ఎక్కువగా అడుగుతారు బాబూ; అదీ సమస్య.” మాష్టారు, కొడుకుకు ఉపదేశం చేసేరు.

“చెల్లి, B. A. గాని B.Sc. గాని చేస్తే, మీరన్న సమస్య రావచ్చేమో. (చిన్న నవ్వుతో) “కానీ, చెల్లి, మెడికలు పూర్తి చెయ్యకుండానే, మన ఇంటి ముందు, పెళ్లికొడుకులు, క్యూలో నిలబడతారు.” అని హాస్యం మేళవించి చెప్పేడు, శర్మ. తనకు తెలిసిన రెండు ఉదాహరణలు కూడా ఇచ్చేడు. కొడుకు మాటలు విని దంపతులిద్దరూ నవ్వుకొన్నారు. కొడుకు ఆలోచనతో ఏకీభవించేరు.

ఆ రాత్రి, మాష్టారు దంపతులు, కొడుకు ప్రయోజకత్వాన్ని, కుటుంబం యెడ బాధ్యతనూ, ఆత్మ విశ్వాసాన్ని, తలచుకొని, ఉప్పొంగిపోయేరు.

శర్మ ఫైనల్ పరీక్షలు రాసేడు. ఇంటివద్ద, ట్యూషన్సు మొదలుపెట్టేడు. మంగమ్మ, ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రవేశ పరీక్ష రాసింది. అన్నా, చెల్లెలు, వారి వారి, ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. ముందుగా, శర్మ పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. ఆశించిన శాతం రాకపోయినా, ఫస్టు క్లాసులో పాసయ్యేడు. చిన్న లెక్కల మాష్టారి కొడుకు, లెక్కల్లో మాస్టర్సు డిగ్రీ పొందేడు. ఆ రోజు, ఇంట్లో పండుగలా జరుపుకొన్నారు. శర్మ, ఊళ్లోని ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్ పోస్టుకు ఎప్లై చేసేడు. అప్పటికి ఇంకా, మంగమ్మ ఫలితాలు తెలియలేదు. అమ్మలు టెన్షనులో ఉండేది. అది గ్రహించిన పెద్దలు ముగ్గురూ, తప్పక సెలెక్టు అవుతావని, ధైర్యం నూరి పోస్తూ ఉండేవారు. పెద్దల మాట, నిజమయింది. ఓ రోజు మంగమ్మ, మెడికలు కాలేజీలో సీటుకు, సెలెక్ట్ అయినట్లు తెలిసింది. ఆ కుటుంబంలో, ఆ రోజు మరో పర్వదినం. మరో వారంలో, శర్మ లెక్చరర్ పోస్టు ఇంటర్వ్యూకు వెళ్ళేడు. సెలెక్ట్ అయ్యేడు. శర్మ, వ్యూహ రచన ఫలించింది. తెలిసిన వారందరకూ, మాష్టారి కుటుంబం ఓ ఆదర్శంగా నిలిచింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here