కాలంతోబాటు మారాలి – 13

0
8

[శర్మ కలెక్టర్ అయ్యాడని తెలియగానే గణపతి శాస్త్రి, వరలక్ష్మి వచ్చి అభినందిస్తారు. పిల్లల పెళ్ళి విషయం ప్రస్తావిస్తుంది మేనత్త వరలక్ష్మి. అమ్మలుకి చేస్తే గాని శర్మకి చేయడానికి కాదని అంటారు మాస్టారు. తన పెళ్ళికి ఇంకా రెండు మూడేళ్ళ వ్యవధి ఉందని అంటాడు నాన్నలు (శర్మ). శర్మ ముస్సోరిలో ట్రైనింగులో చేరతాడు. ఏడు నెలల అనంతరం ఇంటికి వస్తాడు. పెద్దలందరికి బట్టలు పెడతాడు. తండ్రిని ట్యూషన్లు మానిపిస్తాడు. ఇంట్లో ఫోన్ పెట్టిస్తాడు. ఇతర వసతులు ఏర్పాటు చేస్తాడు. దుక్క సూరమ్మగారిని మళ్ళీ వంటకి పిలుస్తారు. తల్లితండ్రులని, మేనత్తని, మామయ్యని బదరీనాథ్ యాత్రకు పంపుతాడు శర్మ. అక్కడ బ్రహ్మకపాలం వద్ద మాస్టారు తన తల్లిదండ్రులకు పిండ ప్రదానం చేస్తారు. అనంతరం అందరూ ఇళ్ళకు క్షేమంగా చేరుతారు. మంగమ్మ (అమ్మలు) తన వివాహం గురించి ఆలోచిస్తుంది. తనకి ప్రపోజ్ చేసిన ఇద్దరు గుణగణాలని గమనించి, కాదని చెబుతుంది. తోటి డాక్టర్ వివేక్ సద్గుణాలు నచ్చి అతన్ని ఇష్టపడుతుంది. అయితే వివేక్ తండ్రిది బ్రాహ్మణ కులం, తల్లిది వైశ్యకులం కావడంతో పెద్దలు అంగీకరించరేమోనన్న సంశయంలో ఉంటుంది. అయితే ముందు అన్న అభిప్రాయం తెలుసుకోవాలని అన్నకి ఫోన్ చేస్తుంది. తనకి ఎటువంటి అభ్యంతరం లేదని, తల్లిదండ్రులని ఒప్పించడం ముఖ్యమని అంటాడు శర్మ. తల్లిదండ్రుల నిర్ణయం ఎలాగున్నా; కనీసం, అన్న తనను సమర్థిస్తున్నాడని అనుకుంటుంది మంగమ్మ. – ఇక చదవండి]

[dropcap]ఒ[/dropcap]క రాత్రి, భోజనాల సమయంలో, మాష్టారు మంగమ్మ పెళ్లి విషయం మాట్లాడేరు.

“అమ్మలూ, నీ చదువు పూర్తికాడానికి, ఇంకా ఎన్నాళ్ళు ఉందమ్మా.”

“ఇంకా అయిదు నెలలు ఉంది, నాన్నా.”

“అయితే, ఇంక అమ్మాయి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాలి, కళావతీ. మంచిరోజు చూసి, పేరయ్యశాస్త్రిగారితో మాట్లాడుతాను.” అని భార్యతో చెబుతూ, “అమ్మా, అన్నయ్య నీకు తీసిన ఫోటోలు ఉంటే, ఓ రెండు ఇయ్యమ్మా.” అని కూతురుకు సలహా ఇచ్చేరు.

మంగమ్మ, తలవంచుకొని అన్నం తింటూ, తల క్రొద్దిగా ఊపింది.

భోజనాలయ్యేయి. మాష్టారు శయనమందిరం చేరుకొన్నారు. మంగమ్మ, వంటిల్లు శుభ్రం చేస్తున్న తల్లికి సహాయపడుతోంది.

“అమ్మా, రోజల్లా కష్టబడి వచ్చేవ్. మళ్ళీ పొద్దున్నే పరిగెట్టాలి. నా పనికూడా అయిపోవచ్చింది. వెళ్లి పడుకో అమ్మా.” కన్నతల్లి, ప్రేమతో పలికింది.

“నీతో ఒక విషయం మాట్లాడాలి అమ్మా.”

“దేని గూర్చమ్మా. హాస్పిటలులో నిన్నెవరయినా అల్లరి పెట్టేరా ఏమిటమ్మా.” ఆందోళనతో అడిగింది, కళావతి.

“అబ్బే, అలాంటిది ఏదీ లేదమ్మా.”

“మరి ఏ విషయం.”

“నా పెళ్లి విషయం అమ్మా.”

“నీ పెళ్లి విషయమా. నాన్నగారు చెప్పేరుగా. ఫోటోలు; పొద్దున్న మర్చిపోతావ్. పడుక్కొనే ముందు, నాకు ఇచ్చి పడుకో.” తన ధోరణిలో సలహా ఇచ్చింది, కళావతి.

“అది కాదమ్మా..”

“అయితే అదేమిటో చెప్పు, తల్లీ.”

వంటింటి తలుపు దగ్గరగా చేరవేసి, తన పెళ్లి విషయంలో జరిగిన కథ, మూర్తి గూర్చి అన్ని వివరాలూ, పూసగ్రుచ్చినట్లు, తల్లికి చెప్పింది. అన్నతో మాట్లాడిన విషయం చెప్పలేదు. కళావతి నిర్ఘాంతబోయింది.

“అమ్మలూ, ఆ అబ్బాయి తల్లిది, వైశ్యుల కుటుంబం అంటున్నావ్. మన కుటుంబాలలో మరొక శాఖ వారినే చేసుకోరమ్మా. అటువంటిది, మరొక జాతి వారిని; నా మాట అటు ఉంచు. మీ నాన్నగారు, సుతరామూ ఒప్పుకోరు.”

“అమ్మా, మూర్తి తండ్రిది మన శాఖే కదమ్మా.”

“ఏదయినా, తల్లి విషయం కూడా ఆలోచించాలమ్మా. ఆ విషయం మరచిపో అమ్మా. నాన్నగారు పేరయ్య శాస్త్రిగారితో మాట్లాడితే, నీకు తగిన సంబంధాలు ఎన్నో వస్తాయమ్మా.”

కూతురుకు ప్రేమతో ఇంటి కట్టుదిట్టాలు తెలియజేసింది, కళావతి.

“అమ్మా, ప్లీజ్ నా మాట వినమ్మా. మూర్తి విషయంలో నాకన్ని విషయాలు తెలుసమ్మా. నాలుగు సంవత్సరాలనుండి అతన్ని చూస్తున్నానమ్మా. పేరయ్యశాస్త్రి, ఎవరిదో మనకేమీ తెలియని కుటుంబంలోని వాడి ఫోటో చూపిస్తారమ్మా. అతనితో పెళ్లిచూపులు అంటారు. ఓ గంట ఇద్దరం మాట్లాడుకొంటాం. ఆ గంటలో, ఆ మనిషి ఎటువంటివాడో ఏమిటి తెలుస్తుందమ్మా. నువ్వు బాగా ఆలోచించమ్మా. నాన్నగారితో చెప్పి ఒప్పించమ్మా. మిమ్మల్ని మరెప్పుడూ మరి ఏదీ అడగనమ్మా. మూర్తిని చేసుకొంటే జీవితమంతా సుఖబడతానమ్మా. మీకదేకదా కావాల్సింది. నాన్నగారిని ఒప్పించమ్మా.” అని తల్లి అరచేతులతో తలపెట్టి బ్రతిమాలాడింది.

కన్నతల్లి కళ్ళు చెమ్మగిల్లేయి. కాని, తను చేయగలిగింది ఏమీ లేదు. అయినా కూతురును కాదనలేక, “సరే, నువ్వు వెళ్లి పడుకో అమ్మా. నాన్నగారితో చెప్పి చూస్తాను.” అంది.

పడకగదిలో మాష్టారు, ఈజీ ఛైరులో కూర్చొని, పుస్తకం ఏదో చదువుకొంటూ ఉండేవారు. కళావతి ప్రవేశం గమనించి, “ఏం ఇంత ఆలస్యమయింది.. సరే పడుకో. మరో అయిదారు పేజీలున్నాయి, చదివి, నేనూ పడుకొంటాను.” అని పుస్తకంలోకి చూడబోతూంటే,

“పుస్తకం ఆలా ఉంచండి. మీతో చాలా ముఖ్యమయిన విషయం మాట్లాడాలి.” అని కళావతి చెప్పగానే, మాష్టారు,

“ఏమిటంత ముఖ్యమయిన విషయం.” అని, ప్రశ్నార్థకంగా అడిగేరు.

“మన అమ్మలు పెళ్లి విషయమండీ.”

“అమ్మలు పెళ్లి విషయమా. ఏమిటుంది అర్జంటుగా మాట్లాడడానికి. పేరయ్యశాస్త్రిగారితో ఇంకా మాట్లాడాలికదా.”

“పేరయ్యశాస్త్రిగారితో తరువాత మాట్లాడ వచ్చునండి.”

“ఎందుకు తరువాత మాట్లాడడం.”

“అమ్మలు, దానితో చదువుతున్న ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాదండి. ఆ అబ్బాయి కూడా అమ్మలుని ఇష్టపడుతున్నాడట.”

“తెలివితక్కువ పిల్ల. కాలేజీలో రోజూ కలిసినా, ఆ అబ్బాయి కుటుంబం ఏమిటి; వాళ్ళ వ్యవహారం ఏమిటి; అవన్నీ తెలుసుకోకుండా ఇష్టపడడాలు ఏమిటి. పేరిశాస్త్రిగారు ద్వారా వచ్చిన సంబంధం అయితే, అవన్నీ ముందుగా తెలుస్తాయి. పెళ్ళిచూపుల్లో, రెండు ప్రక్కల పెద్దవాళ్ళూ అన్నీ విషయాలు మాట్లాడుకోవచ్చు.” తన అభిప్రాయం చెప్పేరు, మాష్టారు.

“మనం అలా అనుకొంటాము.. గాని, పిల్ల ఏమిటి అంటుంది అంటే..” అని ఆ విషయంలో మంగమ్మ అభిప్రాయాలు వివరంగా చెప్పింది, కళావతి.

“అయితే, ఏమిటి; ఆ అబ్బాయి గూర్చి, వాళ్ళ కుటుంబం గూర్చి, అమ్మలు తెలుసుకున్నది.”

“ఆ అబ్బాయిని నాలుగేళ్ళ నుండి తెలుసునట. మంచి వాడట. చెడు అలవాట్లు లేవట..” అని, అబ్బాయి గూర్చి కూతురు చెప్పినవన్నీ చెప్పింది.

“సరే, కుటుంబం విషయం ఏమిటి. ఏమయినా తెలుసుకొందా.”

“కుటుంబం కూడా, చాలా సాంప్రదాయ కుటుంబంట. తండ్రిది మన శాఖేనట.. కాని, తల్లి.. వైశ్యులట.”

“ఏమిటన్నావు.. తల్లి వైశ్యులా.. పిల్లకేమయినా మతి పోయిందా. వైశ్యుల కుర్రాడిని పెళ్లాడుతుందా. నువ్వేమిటి చెప్పేవ్.”

“నేనూ అదే చెప్పేనండి. పై జాతి కుర్రాడు. కుదరదు, అని చెప్పేను. కానీ, అది కాళ్ళా వేళ్ళా పడింది.”

“అది చదివిన చదువు చాలు. రేపటినుండీ మరి కాలేజీకి వెళ్ళొద్దని చెప్పు. రేపే పేరయ్యశాస్త్రిగారితో తొందరగా సంబంధం చూడమంటాను.”

“మీరలా తొందరపడకండి. అది ఎంతో భయపడుతూ నాతో చెప్పింది. మీతో మాట్లాడడానికి కూడా దానికి ధైర్యం లేదు. వయసులో ఉన్న పిల్ల; చదువుకొంది; మనం నెమ్మదిగా బోధపరుద్దాం. మన కుటుంబానికి చెడ్డ పేరొస్తుందమ్మా; అని చెపితే; తెలివయినది. అర్థం చేసుకొంటుంది.”

“ఏమో కళావతీ. నాకు నమ్మకం లేదు.”

“పెద్దవాళ్ళు; వదినగారికి, అన్నయ్యగారికి, విషయం చెప్పి, పిల్లకి బోధపరచడానికి వాళ్లని కూడా రమ్మందామండీ, నలుగురం, పెద్దవాళ్లం చెబితే తప్పక వింటుందండీ.”

“సరే అయితే, రాజమండ్రీనుండి నాన్నలుని కూడా రమ్మందాం. రేపు బావగారికి ఉత్తరం రాస్తాను.”

మాష్టారు, విషయం విపులంగా తెలియబరుస్తూ బావగారికి ఉత్తరం రాసేరు. ఉభయులును రమ్మని ఆహ్వానించేరు. వారం రోజులు ఉండేటట్లు వీలు చూసుకొని రమ్మన్నారు. అమ్మలుకు, నాన్నలకు కుదురుతుందని, సమావేశం ఆదివారం నాటికి ఏర్పరిచేరు. శనివారం సాయంత్రం, గణపతి శాస్త్రిగారు, వరలక్ష్మి వచ్చేరు. ఉదయం పూట, వంటావిడ ఇంట్లో ఉంటుందని, సమావేశ సమయం మద్యాహ్నం మూడు గంటలకు నిర్ణయించేరు.

ఆదివారం ఉదయం, హాస్పిటలులో మూడు నాలుగు గంటల పని ఉందని, అమ్మలు వెళ్ళింది. ఇంట్లో పెద్దలు నలుగురూ ఉన్నారు. ఫలహారాలు చేసి, నలుగురూ మాష్టారి పడకగదిలో సమావేశమయ్యారు. అమ్మలుకు ఎలా బోధపరచడమా, అని ఆలోచిస్తూ ఉండేవారు. కళావతి ఆలోచించించినట్లే, వరలక్ష్మి కూడా ఆలోచించింది. వయసులో ఉన్న పిల్ల; సున్నితమయిన విషయం; కఠినంగా కాకుండా, శాంతంగా బోధపరచాలి; అని తన అభిమతం తెలియబరచింది.

గణపతి శాస్త్రిగారు, చాణక్యుని నీతి శ్లోకం ఒకటి ఉదాహరణ ఇస్తూ, “ప్రాప్తేతు షోడశే వర్షే, పుత్రం మిత్రవదాచరేత్; అన్నాడు చాణక్యుడు. దాని అర్థం; పదహారేళ్లు వచ్చేక, కొడుకును స్నేహితుడిలా చూడమన్నాడు. కొడుకూ అంటే, కూతురు అని కూడా అనుకోవాలి.” అని అమ్మలు బోధనా కార్యక్రమానికి, ముఖ్యమైన సూత్రంతో సలహా ఇచ్చేరు.

“అయితే, దాని క్లాసు ఎలా ప్రారంభించాలి.” మాష్టారు చిరునవ్వుతో అడిగేరు.

“తమ్మూ, మొదట, అది ఏమిటి చెప్పదలచుకొందో, చెప్పమందాం. అది చెప్పడం అంతా అయ్యేక, మనం మాట్లాడుదాం.” వరలక్ష్మి అభిమతం.

“వదినగారూ, అమ్మలు చెబుతున్నప్పుడు, మనం శాంతంగా విందాం. ఆ తరువాత మనం అడగొచ్చు.” కళావతి వ్యూహం.

మగవాళ్ళిద్దరూ అంగీకరించేరు.

“అది ఎంత బ్రతిమాలినా, ఆ పెళ్ళికి ఎంతమాత్రం ఒప్పుకోవద్దు.” మాష్టారి నిర్ణయం.

“ఒప్పుకోడమే అయితే, ఈ మీటింగు ఎందుకు పెట్టుకున్నాం భయపడకు. ఎవ్వరం ఒప్పుకోము.” తమ్మునికి అక్కయ్య హామీ.

అమ్మలును ఒప్పించడానికి, నలుగురు పెద్దలూ చేసిన వ్యూహరచన సమాప్తమయింది.

మద్యాహ్న భోజన సమయానికి ముందుగా, శర్మ ఇల్లు చేరుకొన్నాడు. అన్న వచ్చిన తరువాత, అత్త, మామయ్యగారు, ఎందుకు వచ్చేరో, అమ్మలుకు తెలిసింది. అన్న వేరే గదిలోనికి తీసుకువెళ్లి హితోపదేశం చేసేడు.

“వివేక్ గూర్చి నాకు మొదట్లో చెప్పినప్పుడే, అన్నాను కదమ్మా, I am doubtful అని.”

“అవును. కాని నాన్నగారు అప్పుడప్పుడు అంటూ ఉండేవారు కదా; కాలంతోబాటు మారాలి అని; అంచేత ఏక్సెప్ట్ చేస్తారేమో అనుకొన్నాను.”

“నువ్వు కామ్‌గా, పాయింట్ బై పాయింట్, ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఏమో, ఎగ్రీ అవుతారేమో. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నేను నీకు ఎంతవరకు హెల్ప్ చెయ్యగలనో తెలీదు. But I will do my best.”

“Thank you అన్నా.”

“నువ్వు కామ్‌గా ఉండమ్మా. వాళ్ళు ఏమిటి చెప్తారో విను.”

“దానికి ఇంత ఫస్ ఎందుకు చేస్తున్నారో నాకు బోధపడడం లేదు, అన్నా. We don’t agree అని చెప్పీస్తే అయిపోయేదిగా.”

“నీకు తెలుసు గదమ్మా. నాన్నగారికి, అత్తా మామయ్యగారు అంటే చాలా respect. వాళ్ళు కూడా చెబితే, నువ్వు నీ ఐడియా మార్చుకొంటావేమో అని; వాళ్ళ ఆశ. అందుకే వాళ్ళని కూడా రమ్మన్నారు. Try to understand them. నన్నూ అందుకే కదా రమ్మన్నారు.”

“అయితే ఏమిటి; మీరందరు కలసి నన్ను బొంబార్డ్ చేస్తారా.” అని మందహాసంతో, అన్న భుజం తట్టింది.

“నిన్ను ఎవ్వరూ బొంబార్డ్ చెయ్యరమ్మా. I am sure.”

“అమ్మకి వంటింట్లో హెల్ప్ చెయ్యాలి. వెళ్తాను, అన్నా.” అని మంగమ్మ వంటింటి దిక్కు వెళ్ళింది.

భోజనాలు అయ్యేయి. మాష్టారు, శాస్త్రిగారు, ఓ ఘడీ నడుం వాల్చుకోడానికి వెళ్ళేరు. డైనింగు టేబులు వద్ద, ఆడవాళ్లు ముగ్గురూ, చేరేరు. టెలీఫోనులో ఎవరితోనో మాట్లాడి, శర్మ కూడా, వాళ్లలో కలిసేడు. బాతాఖానీ ప్రారంభమయింది.

“ఏరా కలెక్టరూ, ఎవరితోనురా; అంతసేపు మాటలు.”

“నా క్లాసుమేటు అత్తా, సూర్యం అని; వాడి విషయాలు ఏవో చెప్పుకొచ్చేడు.”

పక్కనే ఉన్న మేనకోడలితో, వరలక్ష్మి, “ఏమిటమ్మా, నువ్వు ఆదివారాలు కూడా డ్యూటీకి వెళ్లాలా.” అని తల నిమురుతూ అడిగింది.

“మాకు ఆదివారాలతో సంబంధం లేదత్తా. ఎప్పుడు అవసరం ఉంటే, అప్పుడు వెళ్ళాలి.”

“వదినగారూ, ఇదేం చదువోగాని, పిల్ల నలిగిపోతోంది. (కొడుకును చూపిస్తూ) వాడే దాన్ని ఈ చదువులో పెట్టేడు.”

“మంచిపని చేసేడు. నలుగురికి పనికొచ్చే చదువు. సరే, సందర్భం వచ్చింది. (మేనకోడలితో) అమ్మలూ, మామయ్యగారు ఈ మధ్య అప్పుడప్పుడు, తల తిరుగుతున్నట్టు ఉన్నదంటున్నారు. దానికి ఏదయినా మందు చెప్పమ్మా.”

“అత్తా, మామయ్యగారు, బ్లడ్ ప్రెషర్ చూపించుకొన్నారా.”

“అదేమిటో నాకు తెలీదు గాని, అటువంటిది ఏది చూపించుకొన్నట్టు లేదమ్మా.”

“ఫరవాలేదు. మామయ్యగారు లేచేక నేను చూస్తాను.”

“చూడడానికి, అదేదో ఇంట్లోనే ఉంది, వదినగారూ. రెండు మూడు రోజులకోసారి, మా ఇద్దరికీ చూస్తూ ఉంటుంది. ఇవాళ ప్రొద్దున్నే చూసింది.”

“చూసేవా కళావతీ, ఇంట్లోనే డాక్టరు ఉండడం ఎంత సదుపాయమయిందో. కలెక్టరు తెలివయినవాడు. ఇవన్నీ ఆలోచించే, చెల్లిని డాక్టరు చదువులో పెట్టేడు.” మేనల్లుడిని మెచ్చుకొంది, మేనత్త.

మాష్టారు లేచిన అలికిడి అయింది.

“అమ్మా, నాన్నగారు లేచినట్లుంది. టీ పెట్టీదా.” తల్లిని అడిగింది, మంగమ్మ.

“ఇంతవేగరం తాగుతారో లేదోనమ్మా.”

“అడిగి వస్తాను.” అని వెళ్లి తండ్రి ఉద్దేశం తెలుసుకొని మంగమ్మ తిరిగి వచ్చి,

“తరువాత నాలుగు గంటలకు, తాగుతానన్నారు. అందాకా ఓ అరకప్పు ఇమ్మన్నారు. మామయ్యగారికి కూడా తెమ్మన్నారు.” అని చెప్పి, టీ తయారు చేయడానికి వెళ్ళింది.

కళావతి వెళ్లి, భర్తను, శాస్త్రిగారిని, డైనింగు టేబులు దగ్గరకు రమ్మని చెప్పింది. అక్కడే మాట్లాడుకోవచ్చు అంది.

డైనింగు టేబులు చుట్టూ, ఆరుగురూ ఆసీనులయ్యేరు. వరలక్ష్మికి చెరోప్రక్క, మేనల్లుడు మేనకోడలు కూర్చున్నారు.

భర్త సౌజ్ఞ చేయడంతో, వరలక్ష్మి, మేనకోడలు భుజం మీద చెయ్యి వేసి, “అమ్మలూ, నువ్వు ఏమీ అనుకోకపోతే, నీతో ఓ విషయం మాట్లాడాలి అనుకొంటున్నామమ్మా. అది నీ స్వంత విషయం. నీకు అభ్యంతరము అయితే అడగను.”

“అదేమిటత్తా అలా అంటున్నావ్. నాన్నగారే, నిన్నూ మామయ్యగారిని సలహాలు అడుగుతూ ఉంటారు. నేను నీకన్నా బాగా చిన్నదాన్ని. నువ్వు నా విషయం, ఏమిటి మాట్లాడుదలచుకొన్నావో, నిరభ్యంతరంగా మాట్లాడు.” మేనత్తకు వినయంగా చెప్పింది, మంగమ్మ.

అంతటి ఉన్నత చదువులు చదివిన మేనకోడలు, ఎంతో వినయంగా, తనను గౌరవిస్తూ పలికిన పలుకులు, వరలక్ష్మికి కనులు కొద్దిగా చెమ్మగిల్చేయి. పైటకొంగుతో కళ్ళు తుడుచుకొంది. ప్రారంభించింది.

“అమ్మలూ, నీ వివాహ విషయం మాట్లాడాలి అనుకొంటున్నానమ్మా.”

“మాట్లాడు అత్తా. చెప్పేనుగా, నాకు అభ్యంతరం లేదని.”

“నువ్వు నీతో చదువుతున్న ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొందాము అనుకొంటున్నావట.”

“అవును అత్తా.”

“ఆ అబ్బాయి విషయమే తెలుసుకొందాము అనుకొంటున్నామమ్మా.”

“ఆ అబ్బాయి కుటుంబం గూర్చి మీ అమ్మా నాన్నా, చెప్పేరమ్మా. ఆ వివరాలు తెలుసు. నువ్వు ఆ.. అబ్బాయినే ఎందుకు కోరుకుంటున్నావమ్మా.” గణపతి శాస్త్రిగారి సూటి ప్రశ్న.

“మామయ్యగారూ, నేను నా జీవితమంతా ఎవరితో గడపాలో, నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయండి.”

“ఏమిటమ్మా అవి.”

“ఆ వ్యక్తికి ఏ చెడు అలవాటూ ఉండకూడదు.” అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే,

“ఈ అబ్బాయికి, ఏ.. చెడు అలవాటూ లేదా. ఉందో లేదో నీకు ఎలా తెలుసు.” మాష్టారు మనసులోని కోపాన్ని, కప్పిపుచ్చుతూ అడిగేరు.

కళావతి గ్రహించింది. పరిస్థితులు, చెయ్యి జారిపోకుండా, “పిల్ల ఏదో చెప్తున్నాది. శాంతంగా వినండి.” అని మాష్టారికి సలహా ఇచ్చింది.

మంగమ్మ అర్థం చేసుకొంది.

“అది చాలా ముఖ్యమయినది కదమ్మా. నాన్నగారికి తెలియాలి కదా.” అని వినయంగా స్పందించి,

“నాన్నా, వివేక్‌ని నాకు నాలుగు సంవత్సరాలనుండి తెలుసు.” అని తను ఏ విధంగా, అతనికి ఏ.. చెడు అలవాటు లేదని తెలుసుకొందో వివరించి చెప్పింది.

“అంతేనా, చెడు అలవాట్లు లేని పెళ్లికొడుకులు ఎంతమందో ఉంటారు. పేరయ్యశాస్త్రిగారితో చెప్తే, అటువంటి పెళ్లికొడుకులనే చూస్తారు.” మాష్టారి కౌంటర్.

“పేరయ్యశాస్త్రిగారు, పిల్లడి తల్లిదండ్రులు ఏమిటి చెప్తే, అది మనకు చెప్తారు.” అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే,

“పిల్లడి తల్లిదండ్రులు అబద్ధాలు చెప్తారంటావా.” మాష్టారి క్రాస్ ఎక్జామినేషన్.

“తమ్మూ, దాన్ని పూర్తిగా చెప్పనీ. మధ్యలో ప్రశ్నలు వెయ్యకు.” అని వరలక్ష్మి సౌమ్యంగా సలహా ఇచ్చి, (మంగమ్మను ఉద్దేశించి) చెప్పమ్మా, అదేమిటో పూర్తిగా చెప్పు.” అని మంగమ్మకు సలహా ఇచ్చింది.

“పిల్లడి తల్లిదండ్రులు అబద్ధాలు చెప్తారని నేను అనుకోను. కాని, వాళ్ళ పిల్లలు ఫ్రెండ్సు తోను, క్లబ్బులలోను ఏమిటి చేస్తున్నారో వాళ్లకి తెలీదు కదా.”

“సరేనమ్మా, నువ్వు కోరుకొంటున్న అబ్బాయికి చెడు అలవాట్లు ఏవీ లేవన్నావు. అది మంచి విషయమే. అదొక్కటే చూసి, అతన్ని కోరుకొంటున్నావా. లేక..” గణపతి శాస్త్రిగారి విచారణ.

“అదొక్కటే కాదు, మామయ్యగారూ. మూర్తికి, నా లాగే, జీవితంలో ధనార్జన ముఖ్యం కాదండి.” అని ఇంకా చెప్పబోతూంటే,

“మరి” మాష్టారి విచారణ.

“వీలయినంతవరకు, నాలాగే పేదవాళ్ళకి సహాయపడుదాం అనుకొంటున్నాడు నాన్నా. రోజూ నేను చూస్తున్నాను. చాలా దూరాన్న ఉన్న పల్లెటూళ్ళనుండి మా ఆసుపత్రికి పేషంట్సు వస్తూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి చూస్తూంటే జాలేస్తుంది. నేను నిశ్చయించుకున్నాను, నాన్నా. ఎక్కడో దూరాన్న ఉన్న పల్లెటూరులో ప్రాక్టీసు పెడితే, ఆ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలకి కూడా సహాయపడగలను, అని. అతనిదీ అటువంటి ఆలోచనే. బహుశా ఇవన్నీ చూసే, గురజాడ అప్పారావుగారు, స్వంతలాభం కొంత మానుకు పొరుగు వాడికి తోడుపడవోయి, అని, రాసి ఉంటారు.” తన మనోభావాలను, భావి ప్రణాళికను, పెద్దలకు నిశితంగా చెప్పింది.

“అమ్మో డాక్టరుగారు కవిత్వం కూడా చెప్తున్నారు.” అని మేనత్త చమత్కరించింది.

“సరేనమ్మా, అవన్నీ బాగున్నాయి. కాని, ఆ అబ్బాయి తల్లి వైశ్యులు. అది మనకు పనికిరాదమ్మా.” తేల్చి చెప్పేరు, మాష్టారు.

“కాని తండ్రి మనలాగే, ఆయన కూడా, బ్రాహ్మడు కదా.”

“అవన్నీ ఎందుకమ్మా. అబ్బాయి తల్లి వైశ్యులు; వైశ్యుల రక్తం పంచుకు పుట్టింది.” వైశ్యుల పదాన్ని నొక్కి చెపుతూ, తల్లి మనసులోని మాట.

మంగమ్మ చిన్న చిరునవ్వుతో, “అదేమిటమ్మా నాకు తెలీదే. బ్రాహ్మణుల రక్తం, వైశ్యుల రక్తం అని వేరువేరుగా ఉంటాయేమిటి. నేను ఎన్నో రక్త పరీక్షలు చేసేనమ్మా. రక్తంలో రోగాలు గూర్చి తెలుస్తుంది గాని, జాతులు కూడా తెలుస్తాయా. నాకు తెలీదు. నాకు తెలిసినంతవరకు, అందరి మనుషులలోని రక్తం, ఇంచుమించుగా ఒకేలాగ ఉంటుంది. బ్రాహ్మడి రక్తం ఎర్రగాను, మాలవాడి రక్తం నల్లగాను ఉండదమ్మా.” కొద్దిగా సహనం కోల్పోతూ నిప్పువంటి నిజాన్ని చెప్పింది, మంగమ్మ.

“కూల్ డౌన్. కూల్ డౌన్.” చెల్లికి అన్న సలహా.

మంగమ్మ గ్రహించింది; తన కోరిక నెరవేరదు, అని. ఇహ వారిని ఒప్పించడానికి ప్రయత్నాలు అనవసరమని నిర్ధారించుకొంది. తను ముందుగానే ఆలోచించుకు వచ్చింది. వివేక్‌తో తన పెళ్లి, అసంభవము, అని రూఢిగా తెలియగానే, ఆ పరిస్థితిలో తన భావి జీవితం గూర్చి, తానేమి నిశ్చయించుకొందో, పెద్దలు నలుగురికీ, స్పష్టంగా చెప్పదలచుకొంది.

మంగమ్మ ఒక నిట్టూర్పు విడిచి, “మీరంతా పెద్దవాళ్ళు. నాకన్నా అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు. మీరు చెప్పినవన్నీ అర్థం చేసుకొన్నాను. బహుశా నేను నా విషయమే ఆలోచించేను. మీరు కుటుంబం విషయం ఆలోచించేరు. (తల్లిదండ్రులను ఉద్దేశించి) మీరిద్దరూ స్వంత సుఖాలు sacrifice చేసుకొని, నన్ను ఇంతదానిని చేసేరు. మీ మనసు కష్టపడే పని నేనెప్పుడూ చెయ్యను. కుటుంబంలో ఒక మనిషిగా నాకూ బాధ్యత ఉంది. ఒకరు మిమ్మల్ని వేలెత్తి చూపించే పని, నేను ఎప్పుడూ చెయ్యను. కాని, జాతుల విషయంలో నా అభిప్రాయాలు, నాకున్నాయి. కాలంతో బాటు, ఎప్పటికయినా నేను కోరే మార్పు వస్తుందని నమ్మకం ఉంది నాకు.” అని ఇంకా చెప్పబోతూంటే,

“చెల్లీ, మన రాజకీయ నాయకులు నువ్వు కోరుకొనే మార్పు ఎన్నటికీ రానివ్వరు. Vote bank politics ఉన్నన్నాళ్లూ జాతులు ఉంటాయి. మనం ఏమీ చెయ్యలేం.” అని తన అభిప్రాయం కుండ బ్రద్దలుకొట్టినట్లు చెప్పేడు, శర్మ.

“దాన్నేదో పూర్తిగా చెప్పనీరా.” మాష్టారి సలహా.

మంగమ్మ కొనసాగించింది.

“నేను వివేక్‌ను పెళ్లిచేసుకోవడం పెద్దలెవ్వరికీ ఇష్టం లేదు. పెద్దలను ఎదిరించి నేను ఏ పనీ చెయ్యను. (ఒక్క క్షణం ఆగి) మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నేను ఆ విషయం మరచిపోతున్నాను. వివేక్ నాకు కేవలం ఒక మంచి స్నేహితుడుగానే ఉంటాడు.” అని తన ఖచ్చితమయిన నిర్ణయం, బరువయిన గుండెతో పెద్దలకు తెలియజేసింది. పెద్దల గుండె బరువు తగ్గింది. ప్రక్కనే ఉన్న మేనత్త, మంగమ్మను చేరువుగా తీసుకొని, తల నిమిరి, తలపై ముద్దు పెట్టింది. తల్లి కళావతి, మంగమ్మను చేరి, చేతులతో కూతురు మెడ బంధించి, తలపై ముద్దుల వర్షం కురిపించి, “నా బంగారు తల్లివే, నాకు తెలుసమ్మా నువ్వు మా మాట తప్పక వింటావని.” అని కూతురును కొనియాడింది.

మాష్టారు, శాస్త్రిగారూ కూడా, మంగమ్మను ప్రశంసించేరు.

చేరిన పెద్దలు, మంగమ్మను ఆకాశానికి ఎత్తీస్తూ ఉంటే, ఆ దృశ్యం చూసి, మంగమ్మ మనసులో అనుకొంది; తన త్యాగం, పెద్దలందరినీ అంతగా సంతోషపెట్టింది, అని. తనకుతానే అభినందనలు తెలియజేసుకొంది.

తను ఒక ముఖ్య విషయం చెప్పదలచుకొన్నానని మంగమ్మ సభకు తెలియజేసింది.

అందరూ అదేదో చెప్పమని కుతూహలంతో అడిగేరు.

మంగమ్మ, “నేను మీ అందరి మాట గౌరవించి, నా జీవితానికి సంబంధించిన విషయంలో నా ఆలోచన మార్చుకున్నాను. అయితే, ఆ విషయంలోనే, నాది ఒక రిక్వెస్టు.” అని ఒక క్షణం ఆగింది.

నలుగురూ అదేమిటో చెప్పమని ఆప్యాయంగా అడిగేరు. మంగమ్మ కొనసాగించింది.

“నన్ను పెళ్లి చేసుకోమని, దయచేసి, నా మీద ఒత్తిడి తేవద్దు. నేను ఎప్పుడు చేసుకొంటానో.. అసలు చేసుకొంటానో.. లేదో, నాకు తెలీదు. నాకు ఆలోచించుకోడానికి సమయం పడుతుంది. అందుచేత, నా పెళ్లితో ముడి పెట్టకుండా, అన్న పెళ్లి ప్రయత్నాలు చెయ్యండి.” మంగమ్మ, తను చెప్పదలచుకొన్న నాలుగు ముక్కలూ, ఎట్టి అనుమానాలకు తావు లేకుండా, ఖచ్చితంగా చెప్పింది.

అది విన్నవెంటనే, కళావతి స్పందించింది.

“తల్లీ, అలాగంటే ఎలాగమ్మా. నీ పెళ్లి అయినదాకా అన్న పెళ్లి చేయలేము కదా. అది సాంప్రదాయమమ్మా.” మృదువుగా సాంప్రదాయాన్ని తెరమీదకు తెచ్చింది.

మరదలు మాటలకు, కథ అడ్డం తిరిగి, అసలుకే మోసం వస్తుందేమో అనుకొంది, వరలక్ష్మి.

“కళావతీ, అమ్మలు చెప్పింది కదా; ఏ విషయం ఆలోచించుకోడానికి కొంత టైము కావాలని. దాన్ని ఆలోచించుకోనీ.” అని పరిస్థితులు చెయ్యి దాటిపోకుండా, మరదలుకు సలహా ఇచ్చింది. తరువాత మంగమ్మను ఉద్దేశించి,

“అమ్మలూ, నువ్వు చెప్పినట్లు జాగ్రత్తగా ఆలోచించుకో అమ్మా. అమ్మ మాటలు కూడా జ్ఞాపకం ఉంచుకో తల్లీ.” అని మేనకోడలును సమర్ధించింది.

శాస్త్రిగారు, ఆలోచించేరు. మరి మాట్లాడడానికి ఏమీ లేదు. ఇంకా ఉంటే, కొత్త సమస్యలు తలెత్తవచ్చు. అందుచేత, సమావేశానికి మంగళగీతం పాడ దలచుకొన్నారు.

“అన్ని విషయాలు అయిపోయేయి గదా. అమ్మలు ఆలోచించుకు చెప్తానంది. అంచేత, ఇంక ఇక్కడకు అది ఆపి, (మందహాసంతో) టీ త్రాగుదామా,” అని తనవంతు నివారణ చర్య, తీసుకొన్నారు.

కళావతి దానికి సిద్ధమవుతూ ఉంటే,

“నువ్వు కూర్చో అమ్మా. అత్తా మామయ్యగారితో మాట్లాడుతూ ఉండండి. నేను చేసి తెస్తాను.” అని వంటింట్లోకి వెళ్ళింది. చెల్లి వెంటా అన్న కూడా వెళ్ళేడు.

“వాళ్లిద్దరినీ ఏదో మాట్లాడుకోనీ.” అన్నారు శాస్త్రిగారు.

అమ్మలు టీ తయారయింది. అన్నా, చెల్లెలు, చెరో రెండు మగ్గులు తెచ్చి పెద్దవాళ్లకు అందించేరు. ఇద్దరూ వాళ్ల మగ్గులు తెచ్చుకొన్నారు మాటలు ప్రారంభమయ్యేయి. శర్మ, అందరం కలసి బీచికి వెళదామన్నాడు. పెద్దలు దానికి ఉత్సాహం చూపించలేదు. అన్నా చెల్లిని వెళ్ళమన్నారు. సాయంత్రమయింది. అన్నా చెల్లెలు బీచికి వెళ్ళేరు. పెద్దలు, ఆ విషయంలోకి మళ్ళీ వెళ్ళేరు. మాష్టారు దంపతులు, శాస్త్రిగారికి, వరలక్ష్మికి ధన్యవాదాలు చెప్పేరు.

“మీరు అదృష్టవంతులు. ఈ కాలం పిల్లలు, అంత పెద్ద చదువులున్నవాళ్ళు, కుటుంబాల గూర్చి ఆలోచించరు. ఆ విషయంలో అమ్మలుని మెచ్చుకోవాలి.” అమ్మలు గూర్చి తన సదభిప్రాయాన్ని వెలిబుచ్చేరు, శాస్త్రిగారు.

“అంతేకాదు. ఈ మధ్య ఓ పేరంటంలో, ఒకావిడ నన్ను అడిగింది; ‘మీ మేనకోడలు డాక్టరు చదువు అయిపోయిందా..’ అని. అయిపోవస్తోంది అన్నాను. మరో ఆవిడ ‘సంబంధాలు చూస్తున్నారా..’ అని అడిగింది. నేను ఏ సమాధానం చెప్పకుండానే, మరో ఆవిడ, ‘మెడికలు కాలేజీలో , పిల్లలు వాళ్ళ పెళ్లిళ్లు వాళ్లే చేసీసుకొంటారమ్మా. నిరుడు, మా బంధువుల కుర్రాడొకడు, రామరామా, చెప్పా చెయ్యకుండా, తురక పిల్లని చేసీసుకొన్నాడు.’ అని దండకం ప్రారంభించింది.” వరలక్ష్మి, మగని సలహాకు మద్దత్తు ఇచ్చింది.

“మీ ఇద్దరికీ, నా సలహా. అమ్మలుతో, ఆ విషయం కొన్నాళ్ల వరకూ మాట్లాడకండి. తనే మళ్ళీ ఆలోచించుకొంటుంది. దానికి కొంత సమయం పడుతుంది. ఆలోచించుకొన్నాక, పెళ్లి చేసుకోడానికి ఒప్పుకొంటుంది, అనుకొంటాను. నాన్నలు పెళ్లి ప్రయత్నాలు ఇప్పట్లో చెయ్యకండి. బెంగ పడకండి. అన్నీ సద్దుకొంటాయి.” అని సలహా ఇస్తూ, ధైర్యం చెప్పేరు, శాస్త్రి గారు.

అన్నా చెల్లెలు, బీచ్ చేరుకొన్నారు. జనసమ్మర్ధానికి దూరంగా, ఇసుకలో చతికిలబడ్డారు. ఇద్దరి మనసులూ భారంగా ఉండేవి. అన్న సంభాషణ ప్రారంభించేడు.

“చెల్లీ, I am really sorry అమ్మా. నువ్వు చాలా disappoint అయిపోయేవు. నీ జీవితంలో నువ్వు వేసుకొన్న ప్లాన్స్ అన్నీ, తలక్రిందులు అయిపోయేయి. ఈ విషయంలో నీకు ఏమీ హెల్ప్ చేయలేకపోతున్నాను.”

“అలా బాధపడకు, అన్నా. నిజానికి, నాకు అట్టే హోప్స్ ఉండేవి కావు. కాని, హోప్ ఎగినెస్ట్ హోప్, ప్రయత్నించేను. That chapter is closed.”

“పెళ్లి చేసుకొంటానో లేదో అన్నావ్. అదే నన్ను బాధిస్తున్నాదమ్మా. జీవితంలో పెళ్లి ముఖ్యమయినది. అది కాదనకమ్మా.”

“నిజమే అన్నా. జీవితంలో మేరేజ్ ముఖ్యమయినదే. కాని అది ఆల్ ఇంపార్టెంట్ కాదు. ఎంతమందో పెళ్లి చేసుకోకపోయినా happy గా ఉంటున్నారు కదా, అన్నా.”

“నువ్వు తెలివయినదానివి. బాగా ఆలోచించుకో అమ్మా. నువ్వు పెళ్లి చేసుకోకపోతే, ఇంట్లో ఎవ్వరూ happy గా ఉండరమ్మా.”

“ఇంట్లో అందరూ happy గా ఉండాలనే కదా అన్నా, నేను, ఆరు నెలలనుండీ, ఆలోచించి ఆలోచించి వేసుకొన్న ప్లానుని డ్రాప్ చేసుకొన్నాను.”

“నిజమేనమ్మా, family కోసం, చాలా పెద్ద sacrifice చేసేవు.”

“సరే అన్నా, నా స్టోరీ వదిలీ. నీ స్టోరీ చెప్పు. మా కాబోయే వదినగారు ఎలా ఉంది. జాహ్నవీని ఈ మధ్య కలిసేవా.”

“కలిసేనమ్మా. లాస్ట్ మంత్, హైదరాబాద్, కాన్ఫరెన్సుకి వెళ్ళినప్పుడు కలిసేను. She is fine. నీ గురించి అడిగింది. నీ చెల్లెలు చాలా అందమయినది. ఎప్పుడు చూపిస్తావు అని అడిగింది.”

“జాహ్నవి నా కన్నా అందమయినది. ఎప్పుడు చూపిస్తావు.” నవ్వుతూ అడిగింది.

“నీ పెళ్ళిలో.”

“అంటే చూపించవన్నమాట.” మందహాసంతో అంది.

“అదే వద్దన్నాను.”

“ఓకే, ఓకే. అన్నా. (క్షణం ఆగి) జాహ్నవితో నీకు పరిచయమయి, టు ఇయర్స్ అవుతున్నాదా, అన్నా.”

“అవుతుందమ్మా. మసూరీలో ట్రైనింగు అవుతున్నప్పటినుండీ పరిచయం.”

“సారీ అన్నా, నిన్ను చాలా రోజులు వెయిటింగులో పెట్టేసేను.” నవ్వుతూ చమత్కరించింది.

“ Don’t worry. We are enjoying it.” నవ్వుతూ స్పందించేడు.

శర్మ, వాచీలో టైము చూసి, “చెల్లీ చాలా టైము అయిందమ్మా. అమ్మ గాభరా పడుతుంది. ఇంటికి వెళ్దాం.” అని తను నిలబడి, ఇసుకలో కూర్చున్న చెల్లికి, చేయూతనిచ్చేడు.

ఇద్దరూ గృహోన్ముఖులయ్యేరు .

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here