కాలంతోబాటు మారాలి – 14

0
11

[ఓ రాత్రి భోజనాలయ్యా మంగమ్మ పెళ్ళి ప్రస్తావన తెస్తారు మాస్టారు. అమ్మ వద్దకి వెళ్ళి తన మనసులో మాట చెబుతుంది మంగమ్మ. వివేక్ తల్లి బ్రాహ్మణులు కాదని తెలిసి పెద్దలు ఆ సంబంధానికి అంగీకరించరు. తల్లిదండ్రులు విజయనగరం నుంచి మేనత్తని, గణపతిశాస్త్రిని పిలిపించి మంగమ్మని ఒప్పించప్రయత్నిస్తారు. అన్న శర్మ కూడా రాజమండ్రి నుంచి వస్తాడు. కులాంతర వివాహానికి కుటుంబ పెద్దలెవరు అంగీకరించకరు. పైగా తాము చూసే సంబంధమే చేసుకోవడం ఉత్తమం అని అంటారు. చివరికి పెద్దల మాటకి తలొగ్గి తాను వివేక్‌ని చేసుకోను అని ప్రకటిస్తుంది మంగమ్మ. పెద్దలంతా సంతోషిస్తారు. అదే సమయంలో తాను అసలు పెళ్ళే చేసుకోను అని తన కఠిన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది మంగమ్మ. కొన్నిరోజులు ఆగితే, తనే నిర్ణయం మార్చుకుంటుందని భావిస్తారు పెద్దలు. బీచ్‌కి వచ్చిన శర్మ చెల్లెలి నిర్ణయం పట్ల బాధపడతాడు. శర్మ ఎంచుకున్న యువతి జాహ్నవి గురించి అడుగుతుంది మంగమ్మ. ఇద్దరూ ఇంటికి బయల్దేరుతారు. – ఇక చదవండి]

[dropcap]శ[/dropcap]ర్మ సెలెక్టయిన బేచ్ లోనే, జాహ్నవి కూడా I.A.S. కు సెలెక్ట్ అయింది. ఇద్దరూ, ముస్సోరీ ఎకాడమీలో ట్రైనింగు అవుతున్న సమయంలో, ఒకరికొకరు చేరువయ్యేరు. ఇద్దరి మనోభావాలు, కలిసేయి. లంచాలు తీసుకోము, తీసుకోనివ్వము, అని ధృడంగా నిశ్చయించుకొన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు, తలవంచమనుకొన్నారు. పల్లెల అభివృద్ధికే ప్రాధాన్యం ఇవ్వదలిచేరు. అలా ఆ ఇద్దరి ఆలోచనలూ ఒకేలాగ ఉండేవి. పెద్దల సమ్మతితోనే పెళ్లి చేసుకొందాము అనుకొన్నారు. ఇద్దరూ, ఎవరి పరిమితిలో వారుండేవారు.

జాహ్నవి తండ్రి దివాకరరావు, హైదరాబాదులో లాయరు. తల్లి చాముండేశ్వరి, హైదరాబాదులోనే, పేరున్న లాయరు. తెలుగులో కథలు రాస్తూ ఉండేది.

మంగమ్మ, వివేక్ కు జరిగినది తెలియబరిచింది.

“I am extremely sorry, వివేక్. మా పేరెంట్సుని కన్విన్స్ చేయలేకపోయేను. నన్ను క్షమించు.” మంగమ్మ బరువయిన గుండెతో, చేదయిన వార్త తెలియజేసింది.

“It is okay, మంగమ్మా. వాళ్ళ లిమిటేషన్సు వాళ్లకి ఉన్నాయి. Let us understand it. మన కాస్ట్ సిస్టం అలాంటిది. Very rigid. కాలంతోబాటు, individuals మారుదాము, అనుకొన్నా society మారనివ్వదు.”

“మనం, ఇది చేద్దాం, అది చేద్దాం, అని ఎన్నో గాలిమేడలు కట్టుకొన్నాం, వివేక్. అవన్నీ, సొసైటీ కోసమే కదా.” నిరాశతో పలికింది.

“నువ్వు అలా నిరాశ పడకు, మంగమ్మా. సొసైటీకి మనం చేద్దాం అనుకొన్నది చేద్దాం. అయితే డిఫరెన్స్ ఏమిటీ అంటే, ఇద్దరం కలసి చేద్దామనుకొన్నాం. ఇప్పుడు, ఇద్దరం వేరువేరుగా, మనం అనుకొన్నవి చేద్దాం.”

“I agree with you.”

“Past is past. మంగమ్మా. Let us forget it and let us be good friends. సొసైటీ దానికి అభ్యంతరం చెప్పలేదుగా.” మందహాసంతో భావి ప్రణాళిక చెప్పేడు.

“Yes. Let us be good friends.”

ఇద్దరూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయేరు.

సహృదయులయిన ఇద్దరి ప్రేమను, జాతి పేరుతో సంఘం బలిగొంది. ఆహార, ఆచార వ్యవహారాలు, పూర్తిగా భిన్నంగా ఉంటే, అరమరికలు లేకుండా, సద్దుకుపోయి ఇద్దరూ జీవించగలరా, అని ఆలోచిస్తే, కొంతయినా అర్థముంది. వాటిలో ఎట్టి భేదమూ, లేనప్పుడు, అడ్డుచెప్పడం ఆలోచించవలసిన విషయం.

శర్మ రాజమండ్రీ చేరుకున్నాక, చెల్లెలి విషయం చెప్పడానికి, జాహ్నవికి ఫోను చేసేడు.

“జాహ్నవీ, బిజీగా ఉన్నావేమిటి.”

“లేదు. చెప్పు. ఏమిటయింది, మంగమ్మ విషయం. మీ పేరెంట్సు ఎగ్రీ అయ్యేరా.” ఆత్రుతతో అడిగింది.

“కాలేదు, జాహ్నవీ. Meaningless caste system అడ్డుపడింది.”

“మరి, వివేక్ ఫాదరు, బ్రాహ్మిన్ కదా.”

“మదర్సు కాస్టుకి ఎవరూ ఒప్పుకోలేదు, జాహ్నవీ.”

“ఓ గాడ్. మరి మంగమ్మ ప్లాను ఏమిటి.”

వివరంగా మంగమ్మ కఠిన నిర్ణయాలూ, తన సలహా జాహ్నవికి చెప్పేడు.

“జాహ్నవీ, ఎప్పటికయినా, దాన్ని పెళ్ళికి ఒప్పిద్దామనుకొంటున్నాను. కాని దానికి ఎంత టైము పడుతుందో చెప్పలేను. అదే సమస్య.”

“అందులో సమస్య ఏమిటుంది.”

“చెల్లెలి పెళ్లి అయితేగాని, నాకు పెళ్లి చేసుకోడానికి, మనసు కూడా ఒప్పదు, జాహ్నవీ. మా సమస్యలో అనవసరంగా నువ్వు చిక్కుకు పోయేవు.”

“శర్మా, what are you saying. మా.. సమస్య అంటున్నావు. అంటే, నేను నీకు పైదానినా. మన సమస్య అను. (‘మన’ పదాన్ని నొక్కి చెప్పింది.) మనం కలసి ఆలోచిద్దాం. నేను కూడా మంగమ్మకు రాస్తాను. Let both of us be behind her.” అని శర్మకు చేయూతనిచ్చింది.

మంగమ్మ చదువు పూర్తి అయింది. తన కార్యాచరణకు రూపుదిద్దింది. అన్నకు వివరాలు తెలియబరచింది. ప్రణాళిక అమలులో పెట్టదలచింది. ఒక రోజు, తల్లిదండ్రులతో ఆ విషయం చర్చించింది.

“నాన్నా, నా చదువు అయిపోయింది. ప్రాక్టీసు చెయ్యడానికి లైసెన్సు కూడా వచ్చింది. ఇహ ప్రాక్టీసు చేద్దామని అనుకొంటున్నాను, నాన్నా.”

“మంచిదమ్మా. మంచిరోజు చూసి చెపుతాను. మన ఇంట్లోనే, ముందు గదిలో ప్రారంభించమ్మా. ప్రాక్టీసు పెరగగానే, మారవలసి ఉంటే, ఆలోచించవచ్చు.” మాష్టారు, సంతోషిస్తూ సలహా ఇచ్చేరు.

“అవునమ్మా, మన ఎదురుగా ఉన్న ఇల్లు, రెండు నెలలలో ఖాళీ అవుతుందట. ముందుగా చెప్పి ఉంచొచ్చు.” తల్లి, ప్రణాళిక.

“నేను ఈ.. ఊళ్ళో ప్రాక్టీసు పెట్టదలచుకోలేదు.”

“మరి ఏ ఊళ్ళో పెట్టదలచుకొన్నావ్. ఈ ఊరయితే అన్ని విధాలా బాగుంటుందమ్మా. పెద్ద ఊరు; ప్రాక్టీసు బాగుంటుందమ్మా.”

“మీకు ఇదివరకే చెప్పేను. నాకు ధనార్జన మీద ఆశ లేదు నాన్నా. ధనార్జన మీద ఆశ ఉంటే, మీరన్నట్టు, ఈ ఊళ్ళోనే పెట్టి ఉందును.”

“మరి ఎక్కడ పెట్టదలచుకొన్నావ్.”

“ఒక పల్లెటూరులో నాన్నా”

“చిన్నదానివి, నీకు తెలీదమ్మా. పల్లెటూరి జీవితం నాకు జ్ఞాపకముంది. ఎన్నో ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఆలోచించుకో అమ్మా.” మాష్టారి హెచ్చరిక.

“ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పుడు, పల్లెటూళ్ళ వారి గూర్చి, తెలుసుకున్నాను, నాన్నా. వాళ్లు, అమాయకులు. ఏ చిన్న సాయం చేసినా, పొంగిపోతారు. ‘దండాలమ్మా, దండాలమ్మా.’ అని విలువకట్టలేని ఆశీర్వచనాలు చేస్తారు. వాళ్ళ కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా చెపుతారు నాన్నా. అందుచేత, నాకు నమ్మకం ఉంది నాన్నా.. నేను వాళ్లకి సిన్సియరుగా సేవ చేస్తే, వాళ్ళు, నాకు ఏ ఇబ్బందీ రానివ్వరు.”

“ఏమో, బాగా ఆలోచించుకో.” మాష్టారి సలహా.

“అమ్మా, నీతో ఎవరయినా వస్తున్నారా.” తల్లి విచారణ.

“నాతో ఎవ్వరూ రావడం లేదమ్మా. ఏమి అలా అడిగేవ్.”

“నీకు పనిలో సాయం చెయ్యడానికి, ఎవరయినా ఉండాలి కదమ్మా.”

“అక్కడ ఉన్నవాళ్లలోనే, ఇద్దరు ముగ్గురికి నేనే పని నేర్పుతాను. రెండు మూడు నెలల్లో, వాళ్ళు తరిఫీదు అయిపోతారమ్మా.”

“ప్రాక్టీసు పల్లెటూళ్ళో అన్నావ్. ఏ పల్లెటూరో నిశ్చయించుకొన్నావా అమ్మా. విశాఖపట్నం దగ్గరలోనే ఉన్నాయి. చాలా పల్లెటూళ్ళు. వాటిలో ఏదో ఒకటి చూసి, అక్కడ మొదలుపెట్టు.” మాష్టారి సలహా.

“అవునమ్మా. దగ్గరలో పల్లెటూరయితే, రోజూ వెళ్లి రావచ్చు.” కన్నతల్లి సలహా.

“ఈ ఊరికి దగ్గరలో ఉన్న పల్లెటూళ్లవారు, గంటా, అరగంటలో, విశాఖపట్నం రాగలరు. వాళ్లకి పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. నేను అనుకొన్నది ఇటువంటి పల్లెటూరు కాదమ్మా.”

“మరి.” తండ్రి ప్రశ్న.

“గంటల తరబడి ప్రయాణం చేస్తేగాని, వైద్య సదుపాయం లేక, దగ్గర దగ్గరలో ఉన్న ఓ పది పన్నెండు గ్రామాల మధ్య ఉన్న ఓ ఊళ్ళో ప్రాక్టీసు పెడదామనుకొంటున్నాను, నాన్నా.”

“అయితే, అటువంటిది ఏదో చూడాలి.” మాష్టారి ఆలోచన.

“నేను చూసేను నాన్నా.”

“ఏదమ్మా, అది.” తండ్రి ఆత్రుత.

తల్లి కూడా ఆతృతలో ఉండేది.

“మీరు పుట్టి పెరిగిన ఊరు.. నందవలస నాన్నా.”

“నందవలసా.” ఆశ్చర్యంతో మాష్టారు రూఢి చేసుకో దలిచేరు.

“అవును నాన్నా.. నందవలసే.. ఏ.. గ్రామంలో, వైద్య సదుపాయాలు లేక తాతగారు చనిపోయేరో, ఆ.. గ్రామంలో, వైద్యసదుపాయాలు అందరికీ అందుబాటులో అందిద్దామని, నందవలస ఎంపిక చేసుకొన్నాను.”

మాష్టారు, కళావతి, ఒకరి ముఖం ఒకరు చూసుకొన్నారు.

“నీ నిర్ణయానికి, ఏమిటి చెప్పడమో, చెప్పలేకపోతున్నానమ్మా. తాతగారి మీద నీకున్న గౌరవానికి, నిన్ను మెచ్చుకొంటున్నాను. కాని, ఆ గ్రామంలో ఏం ఇబ్బందులు పడతావో, అని నా ఆందోళన అమ్మా.”

“అవునమ్మా, నాకు ఆ ఊరు గురించి మీ నాన్నగారు మీతో చెబుతూ ఉంటే విన్నాను. ఏ సదుపాయాలూ ఉండేవి కావట.” కన్నతల్లి ఆందోళన.

“ఆ ఊరి పరిస్థితి, ఇంకా అలాగే ఉందిటమ్మా. ఈ మధ్య, ఆ ఊరినుండి, ఒక పేషంటు వస్తే, నాకు తెలిసింది. జమీందారుగారి విషయం అడిగేను. మూడు, నాలుగు సంవత్సరాల క్రిందట, ఆయనకు షష్టిపూర్తి జరిగిందట. వాళ్ళ, అమ్మాయి, అల్లుడు వచ్చి, ఘనంగా జరిపించేరట. ఆ ఊళ్ళో ముఖ్యమయిన సదుపాయం, వైద్య సదుపాయం కల్పిద్దామని వెళుతున్నానమ్మా.”

మాష్టారు, ఆలోచించుకొన్నారు. దైవం మీద భారం వేసేరు. కన్నకూతురుకు, ఏ ఇబ్బందీ కలుగ కూడదని మనసులో ప్రార్థించేరు.

“నువ్వు అంత పట్టుదలతో, ఓ మంచి పని చేద్దాము, అనుకొంటే, అడ్డు చెప్పదలచుకోలేదమ్మా.(క్షణం ఆగి) నువ్వు నందవలస ఎప్పుడు వెళదాము అనుకొంటున్నావమ్మా.” మాస్టారు తెలుసుకోగోరేరు.

“వచ్చే వారంలో, ఏదయినా మంచి రోజు చూసి చెప్పండి నాన్నా. ఈ లోగా, అక్కడ కావలిసినవి నాలుగూ నేను జతబరచుకొంటాను.”

“నీతో బాటు, మేమిద్దరం వస్తామమ్మా. జమీందారు గారికి నిన్ను పరిచయం చెయ్యడమూ అవుతుంది; అమ్మకు, నేను పుట్టి పెరిగిన ఊరు చూపించినట్టూ, అవుతుంది. ఆ ఊరు వదలిపెట్టేక, నేనూ కూడా ఎప్పుడూ వెళ్ళలేదమ్మా.”

“అవునమ్మా, నాకూ ఆ ఊరు చూడాలని ఉంది.” తల్లి కుతూహలం.

“ప్రస్తుతానికి, నన్నొక్కర్తినీ, వెళ్లనివ్వండి. కొన్నాళ్ళు పోయేక, మీరిద్దరూ వీలు చూసుకొని వచ్చి, నా దగ్గర కొన్నాళ్ళు ఉండొచ్చు.” మంగమ్మ వినయంగా తన అభిప్రాయం చెప్పింది.

“జమీందారు గారికి, నేను ఉత్తరం ఒకటి రాసి ఇస్తానమ్మా. తీసుకెళ్ళమ్మా.”

“అలాగే నాన్నా.”

ఆ సంభాషణ అక్కడకు ముగిసింది.

ఆ రాత్రి, మాస్టారి పడకగదిలో సంభాషణ:

“ఏమండీ, అమ్మలు నందవలస వెళ్ళడానికి, అంత వేగిరం ఎలా ఒప్పుకొన్నారండి. వయసులో ఉన్న పిల్ల. ఏమీ తెలియని ఊళ్ళో ఏ ఇబ్బందుల్లో చిక్కుకొంటుందో. అక్కడ ఏమిటి జరుగుతున్నాదో, మనకు తెలీదు కూడా.” తల్లి ఆందోళన.

“కళావతీ, జమీందారుగారు మన పిల్లకు, ఎటువంటి ఇబ్బంది రానివ్వరు. బెంగపడకు. ఇహ నేను ఒప్పుకోవడం అంటావా; పిల్ల దానంటిది అది అయ్యింది. మనం అది చెయ్యదలచుకొన్న ప్రతీ దానికి అడ్డు చెబితే, తాడు తెగిందంటే, మన మర్యాద పోతుంది. అదే కాదు; అమ్మలు, నెల్లాళ్ళు అక్కడ ఉంటే, దానికే బోధపడుతుంది; ఆ పల్లెటూళ్ళో ఉండడం కష్టమని; అప్పుడు దానంతట అదే, వెనక్కి వచ్చేస్తుంది. అంచేత, నిశ్చింతగా ఉండు.” అని, మాస్టారు, భార్యామణికి, తన మనసులోని మాట చెప్పేరు.

“ఏమో. మీరంత ధైర్యంగా ఉంటె, భగవంతుని దయవల్ల, ఆ ఊళ్ళో, దానికి ఏ హాని జరగకూడదనుకొందాం. మీరన్నట్టు, అది వెనక్కి వచ్చేస్తే ఏ సమస్యా ఉండదు.”

“రాములవారి దయవల్ల, దానికి ఏ ఇబ్బంది కలగదు. ధైర్యంగా ఉండు. చాలా రాత్రయింది, పడుక్కో.” అని మాస్టారు, సంభాషణకు తెర దించేరు.

మాష్టారు, కూతురు ప్రయాణానికి మంచి రోజు చూసేరు. తల్లిదండ్రులు, అత్తా, మామయ్యగార్ల, ఆశీర్వచనాలు పొంది, తను కలలు కంటుండెడి ప్రణాళిక, అమలుబరచడానికి, మంగమ్మ, నందవలస బయలుదేరింది.

ఉదయం పదిగంటలు దాటింది. మంగమ్మ ప్రయాణిస్తున్న బస్సు, నందవలసలో ఆగింది. పెట్టి, బెడ్డింగులతో, మంగమ్మ దిగింది. కూలివాని సహాయంతో, రామాలయం చేరుకొంది. ఆలయంలో సీతారాముల పూజ జరుగుతూ ఉండేది. మంగమ్మ కాళ్ళూ చేతులూ నూతివద్ద కడుగుకొని ఆసీనులయి ఉండెడి భక్తుల వెనుక మఠం వేసుకొని కూర్చొంది. పూజారి గారు ప్రసాద వితరణ ప్రారంభించేరు. అందరి దృష్టీ, మంగమ్మ మీదే. ఎవరీ అమ్మాయి; సామానుతోబాటు, దేవాలయానికి వచ్చింది, అని. పూజారిగారు, మంగమ్మకు ప్రసాదం అందజేస్తూ, “అమ్మా, మీరు ఈ ఊరు కొత్తగా వచ్చేరా.” అని కుశలప్రశ్న వేసేరు.

“అవునండీ, ఈ ఊరిలో నివసిద్దామని వచ్చేను.”

“బస ఏర్పాటు అయిందా అమ్మా.”

“ఆ ప్రయత్నం చెయ్యాలి. ముందుగా ఈ ఊరు జమీందారు గారిని కలుద్దామనుకొంటున్నాను.”

“అరిగో వారేనమ్మా జమీందారుగారు.” గర్భగుడికి దగ్గరగా ఆసీనులయి ఉన్న, జమీందారుగారిని చూపించేరు, పూజారిగారు.

జమీందారుగారు, ఆలోచనలోబడ్డారు. ఎవరీ అమ్మాయి; నన్ను కలుసుకోడానికి ఎందుకు వచ్చి ఉంటుంది, అని.

ముందునుండెడి భక్తులు దారి చేయగా, మంగమ్మ జమీందారుగారిని సమీపించి, ఆయనకు పాదాభివందనం చేసింది. తన hand bag నుండి, తండ్రి రాసిచ్చిన ఉత్తరం, వినయంగా అందించింది. జమీందారుగారు ఉత్తరం లోని రెండు మూడు పంక్తులు చదవగానే, “అమ్మా, విశ్వేశ్వరశర్మగారి మనవరాలా, మీరు.” ఆశ్చర్యము, సంతోషములతో అన్నారు.

“మీకన్నా చిన్నదానిని. నన్ను దయచేసి మన్నించకండి.” మంగమ్మ వినయంగా అంది.

“కూర్చో, అమ్మా, కూర్చో.” అని చెప్పి, ఉత్తరం కడవరకూ చదివి, జమీందారుగారు, నిలబడి,

“ఈ అమ్మాయిగారు డాక్టరు..” అని ప్రకటించి, ఇంకా మాట్లాడబోతూ ఉంటే,

“నన్ను మన్నించకండి.” అని మళ్ళీ విజ్ఞప్తి చేసింది.

“అమ్మా, వైద్యో నారాయణా హరిః, అని పెద్దలు చెప్తారు. వైద్యులు నారాయణ స్వరూపులు. దైవసమానులు మీరు; మన్నించడంలో తప్పులేదమ్మా.” అని మన్ననను సమర్థించుకొని, ప్రసంగం కొనసాగించేరు.

“మన గ్రామంలో వైద్య సౌకర్యానికి ఏళ్ల తరబడి విశ్వప్రయత్నాలు చేస్తున్నాం. ఇన్నాళ్ళకి, ఆ సీతారాములకు దయకలిగి, ఈ డాక్టరుగారిని మన ఊరు పంపించేరు. మీకు చెప్పేనుగా, చాలా సంవత్సరాల క్రిందట, ఈ దేవాలయంలోనే హఠాత్తుగా చనిపోయిన, విశ్వేశ్వరశర్మ గారి మనవరాలు, ఈవిడ. మనందరి సేవలకై, మన ఊరు వచ్చేరు. ఈవిడకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా మనం చూసుకోవాలి.” అని అక్కడ ఉన్నవారికి నొక్కి చెప్పేరు.

“అట్టాగేనండి అయ్యగారూ , అట్టాగేనండి అయ్యగారూ.” అని అక్కడ ఉన్నవారందరూ,

ఏక కంఠంతో, హామీ ఇచ్చేరు. ఒక్కొక్కరూ, మంగమ్మను సమీపించి, “దండాలమ్మా, డాక్టరమ్మగారూ.” అని వినయంగా తలవంచి నమస్కరించేరు.

జమీందారుగారు, ఆ శుభపరిణామం, ముందుగా బంగాళాలోని భ్రమరాంబగారికి అందజేసేరు.

జమీందారుగారు, మంగమ్మకు తగు వసతి భోజన సదుపాయాలు అమర్చిపెట్టేరు. తాత్కాలికంగా, ఒక మూడు గదుల పెంకుటింట్లో, ఆసుపత్రికి ఏర్పాట్లు చేయించేరు. ‘శ్రీ శ్రీ శ్రీ విశ్వేశ్వర శర్మ (పూజారి గారు) గారి స్మారక చికిత్సాలయం’ ప్రారంభమయింది. మంగమ్మ ప్రోత్సాహంతో, గ్రామంలోని ఇద్దరు యువకులు, ఒక మందుల దుకాణం తెరిచేరు. మంగమ్మ ఒక యువతీ యువకుల జంటకు, నర్సింగులో శిక్షణ ప్రారంభించింది. అది గమనించిన మరో యువకుడు ఉత్సాహం కనబరచి, ఆ శిక్షణలో చేరేడు. నందవలసలో ఆసుపత్రి వెలసిన వార్త నలు దిక్కులా వ్యాపించింది. ఇరుగు పొరుగు గ్రామాలనుండి వైద్యసేవలకు, రోగులు నందవలస రావడం ప్రారంభమయింది. దాని ప్రభావాన్న, చికిత్సాలయానికి సమీపంలో ఒక హోటలు వెలిసింది. ఆ హోటలు పరిశుభ్రతను, మంగమ్మ పరీక్షిస్తూ ఉండేది. రోగుల రక్తపరీక్షకు కావలిసిన పరికరములతో బాటు, మరికొన్ని ఆవశ్యకమయిన పరికరములు, డాక్టరుగారి సలహాతో జమీందారుగారు చికిత్సాలయానికీ అందజేసేరు. చికిత్సాలయం జనంతో కిటకిటలాడుతూ ఉండేది. మంగమ్మ, రోగులనుండి, ఒక నిర్దిష్టమయిన ఫీజు ఆశించేది కాదు. ఎవరు ఎంత ఇస్తే, అంతే పుచ్చుకొనేది.

సుమారు ఆరు నెలలు, కాలగర్భంలో కలసిపోయేయి. నందవలసలోని చికిత్సాలయం, విశాలమయిన నూతన భవనంలోకి మారింది. చికిత్సాలయంతో బాటు, డాక్టరు మంగమ్మ గారి పేరు, నలుదిక్కులా మారుమ్రోగింది. ప్రముఖ దినపత్రికలలో, శ్రీ శ్రీ శ్రీ విశ్వేశ్వరశర్మ (పూజారిగారు) గారి స్మారక చికిత్సాలయంలో, సీతారామాంజనేయ శర్మ, కళావతి గార్ల సుపుత్రిక, డాక్టరు మంగమ్మగారు అందిస్తుండెడి నిస్వార్థ సేవలు, ఆ ఊరి జమీందారుగారు చికిత్సాలయానికి అందజేస్తుండెడి విలువయిన సహాయం, విపులంగా తెలియజేస్తూ చికిత్సాలయం, డాక్టరు మంగమ్మ, జమీందారుగార్ల ఫోటోలతో బాటు, ప్రచురణమయ్యేయి.

మాష్టారు, పేపరులోని ఆ వార్త, భార్యకు చూపించేరు. ఇద్దరూ, అనతికాలంలో తమ కూతురు, పొందుచుండెడి పేరు ప్రతిష్ఠలు తెలుసుకొని గర్వించేరు. మంగమ్మ విశాఖపట్నంలో ప్రాక్టీసు పెట్టి ఉంటే, ఇంత పేరు, గౌరవము వచ్చేవి కావని, అర్థం చేసుకొన్నారు. విజయనగరంలో, శాస్త్రిగారు, వరలక్ష్మి, అదే విధంగా ఆలోచించేరు. రాజమండ్రీలో, అన్న, ఆ వార్త చూసి, ఉబ్బితబ్బిబ్బయ్యేడు వెంటనే చెల్లికి అభినందిస్తూ ఉత్తరం రాసేడు. హైదరాబాదులో, జాహ్నవి చూడగానే, శర్మకు ఫోను చేసి, సంతోషం పంచుకొంది. తనూ, మంగమ్మను అభినందిస్తూ ఉత్తరం రాసింది.

మాష్టారి దంపతులు, కూతురు పెళ్లి విషయం, ఆలోచించుకొన్నారు. పేపరులోని వార్తలను బట్టి, తన జీవితాశయం నెరవేరుతున్నందులకు, మంగమ్మ సంతోషంగా ఉండి ఉండొచ్చునని, ఊహించుకున్నారు. ఆ మారిన పరిస్థితులలో, వివాహానికి సమ్మతించవచ్చు, అనుకొన్నారు. ఉభయులూ, విజయనగరం వెళ్లి, శాస్త్రిగారిని, వరలక్ష్మిని, సంప్రదించేరు. వారిదీ, అదే అభిమతం ఉండేది. ఉత్తరం ద్వారా కాక, స్వయంగా నందవలస వెళ్లి, మాట్లాడడం ఉచితమని, నలుగురూ అభిప్రాయబడ్డారు. అది కుటుంబ విషయం గనుక, ఆ ప్రయత్నాలలో, జమీందారుగారి సహాయం ఎంతమాత్రమూ కోరవద్దని, శాస్త్రిగారు మరీ మరీ చెప్పేరు.

నందవలస వెళ్ళడానికి, మాష్టారు మంచిరోజు చూసేరు. కూతురుకు ముందుగా ఉత్తరం ద్వారా తెలియజేసి, ఉభయులూ, ప్రయాణమయ్యేరు. తను పుట్టి పెరిగిన ఊరు, ఎలా ఉందో చూడడానికి, మాష్టారు కుతూహలంగా ఉండేవారు. ఉభయులూ, ఆరు నెలలనుండి దూరమయిన అమ్మలును, ఎంత వేగరం చూడగలమా, అని తహతహలాడుతూ ఉండేవారు. దంపతులిద్దరూ, నందవలసలో బస్సు దిగేరు. అమ్మలు కొరకు ఆత్రుతతో నలు దిక్కులా చూసేరు. కానరాలేదు. పని ఎద్దడిలో రాలేకపోయిందని అనుకొన్నారు. చేతిలోనున్న పెట్టి కూలివానికిచ్చి, చికిత్సాలయానికి దారి తీసేరు. చికిత్సాలయం చేరుకొన్నారు. లోనికి ప్రవేశించే ముందు, పైనున్న బోర్డు చూసేరు. అక్కడే ఆగేరు. తాను ఎప్పుడూ తాతగారిని చూడకపోయినా, ఆయన జీవితమంతా గడిపిన నందవలసలో, ఆయన పేరున, అతి విలువయిన శాశ్వత స్మారకం, నెలకొల్పినందులకు, కూతురును ఏ విధంగా మెచ్చుకోవాలో, మాష్టరుగారి ఊహకు అందలేదు. ఉభయుల కళ్లన, ఆనంద బాష్పాలు రాలేయి.

తమ పేర్ల పిలుపుకై, బారులు తీర్చి వేచియున్న జన సమూహం మధ్యనుండి, ఉభయులూ, లోనికి ప్రవేశించేరు. వారి రాకను గమనించింది, మంగమ్మ. పట్టరాని సంతోషంతో, ఒక్కమారుగా, వడివడిగా వారిని చేరింది. ఉభయులకూ పాదాభివందనం చేసింది. “నాన్నా, వస్తున్నామని, ముందుగా ఒక ఉత్తరం రాసి ఉంటే, నేనే బస్సుదగ్గరకు వచ్చి ఉందునుకదా.” అని మంగమ్మ అనగానే, “పది రోజుల ముందే రాసేనమ్మా. నీకు అందలేదా.” అన్నారు, మాష్టారు.

“నాకు ఉత్తరం ఏదీ అందలేదు. సరే, నాకు, ఈ పేషంట్సు అందరినీ చూడడానికి, మరో మూడు గంటలు పట్టొచ్చు. ఈలోగా మీరు ఇంటికి వెళ్లి స్నానం చేసి, వంటావిడ, సుభద్రమ్మగారు ఉంటారు, ఆవిడకు చెప్పి, అందాక ఏదయినా చేయించుకొని తినండి. నేను వచ్చేక, కలసి భోజనం చెయ్యొచ్చు.” అని తల్లిదండ్రులకు చెప్పి, దగ్గరలోనే ఉన్న స్టాఫ్ మెంబరు, అప్పారావును సాయమిచ్చి, తల్లిదండ్రులిద్దరునూ, తన నివాసానికి చేర్పించింది,

మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో, మంగమ్మ ఇల్లు చేరుకొంది. ఆ సమయానికి, సుభద్రమ్మగారు వేడిగా భోజనం తయారు చేసి, టేబులుపై ఉంచి వెళ్ళేరు. ముగ్గురూ, సరదాగా కబుర్లు చెప్పుకొంటూ, భోజనాలు ముగించేరు. వెంటనే, మంగమ్మ, చికిత్సాలయానికి వెళ్లే ప్రయత్నంలో ఉండేది.

“ఇప్పుడే వచ్చేవు కదమ్మా. ఓ ఘడీ ఆగి వెళ్లకూడదా.” మాతృహృదయం స్పందన.

“అవునమ్మా, అమ్మ చెప్పినట్లు, కొంతసేపు రెస్టు తీసుకో అమ్మా.” మాష్టారు, భార్య సలహాకు వంత పలికేరు.

“పేషంట్స్ చాలామంది ఉన్నారు నాన్నా. వాళ్లలో పై గ్రామాలవాళ్ళు కూడా ఉన్నారు. అందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్ళాలి నాన్నా.” అని తండ్రికి వివరణ ఇచ్చి,

“అమ్మా, సుభద్రమ్మగారికి కబురు పంపిస్తాను. నాలుగు గంటలకు వచ్చి, మీకు టిఫిను చేసి టీ పెడతారు. వీలయితే, ఆ వేళకు నేను వస్తాను. నా కోసం వెయిట్ చెయ్యకండి. నేను వచ్చేసరికి, ఏడుగంటలు కావచ్చు.” అని తల్లికి చెప్పి, చికిత్సాలయానికి బయలుదేరింది.

రాత్రి తొమ్మిది గంటలు దాటుతూన్న సమయాన్న మంగమ్మ ఇల్లు చేరుకొని, గుమ్మంలో అడుగు పెడుతూండగానే,

“ఏమమ్మా, ఇంత ఆలస్యమయింది.” కన్నతల్లి విచారణ.

“డెలివరీ కేసు ఒకటి వచ్చిందమ్మా. అది చూసుకొని రావడంలో ఆలస్యమయింది.. మీరు భోజనాలు చేసేరా.”

“లేదమ్మా, నువ్వు వస్తావని చూస్తున్నాం.” మాష్టారి సమాధానం.

“అయ్యో, నా కోసం ఎందుకు వెయిట్ చేసేరు. బాగా లేటయింది. భోజనాలు, మీరు ప్రారంభిస్తూ ఉండండి. ఈ లోగా, బట్టలు మార్చుకొని వస్తాను.”

భోజనాల సమయంలో, మంగమ్మ చికిత్సాలయం విశేషాలు, తల్లిదండ్రులకు వివరిస్తూ ఉండేది.

“హాస్పిటలు దగ్గర చూసేం అమ్మా, అక్కడ ఉన్నవాళ్లు, ‘మన ఊరికి దేవతలాగ వచ్చేరు, డాక్టరమ్మగారు.’ అని వాళ్లలో వాళ్ళు అనుకొంటూ ఉండేవారు.” అని మాష్టారు, గర్వబడుతూ కూతురుకు feedback ఇచ్చేరు.

“నేను చెప్పేను కదా నాన్నా; పల్లెటూరు వాళ్ళిచ్చే గౌరవం, చూపించే అభిమానం, విశ్వాసం, కోట్లు డబ్బు ఇచ్చినా, పట్టనాళ్ళలో దొరకదు నాన్నా. మీకు మరో సంగతి చెప్పనా నాన్నా.”

“ఏమిటమ్మా అది.”

“ఈ ఊరు, చుట్టుప్రక్కల కొన్ని ఊళ్లలోనూ కలిపి, పది పదిహేను మంది, మంగమ్మలు ఉన్నారు నాన్నా.”

“అదేమిటమ్మా, పది పదిహేనుమంది మంగమ్మలు ఏమిటి.” తల్లి ప్రశ్న.

“కొత్తగా పుట్టిన కొందరు ఆడపిల్లలకి, నా పేరు పెట్టుకొన్నారమ్మా.”

“నిజమేనమ్మా, ఈ గౌరవం పట్టణాల్లో ఉండదమ్మా.” మాష్టారు ఏకీభవించేరు.

“అమ్మా, ఈ వస్తున్నవాళ్ళు, నీకు ఏమయినా ఇస్తున్నారా.” తల్లి విచారణ.

“ఇస్తున్నారమ్మా. వాళ్ళు ఏమీ ఇవ్వకపోతే, నేను బ్రతకాలి.. స్టాఫుకు జీతాలివ్వాలి… నేను వాళ్ళని, ‘ఇంతా’ అని అడగనమ్మా. ఎవరు ఎంత ఇస్తే అంత పుచ్చుకొంటాను. నాకు అదే ఎక్కువవుతోంది.” విశదీకరించి చెప్పింది, మంగమ్మ.

కొద్దిసేపు ఆగి, మాష్టారు, “రోజూ, రాత్రి ఎన్ని గంటలకు పడుకొంటావమ్మా.” తెలియగోరేరు.

“తొమ్మిదీ, పదీ, అవుతుంది నాన్నా.”

“పొద్దున్న ఎన్ని గంటలకు లేస్తావమ్మా.” తల్లి ప్రశ్న.

“ఐదు గంటలకు లేస్తానమ్మా. ఓ గంట యోగా చేసుకొంటాను. తరువాత స్నానం చేసి, ఓ ఘడియ, దేముని ముందు కూర్చొని ధ్యానం చేసుకొని, సర్వే జనా సుఖినో భవంతు, అని దేముణ్ణి ప్రార్థిస్తాను. నాకు మరే పూజలు రావమ్మా.” అని మందహాసంతో చెప్పింది.

“మానవ సేవే, మాధవ సేవ అంటారమ్మా. అక్షరాలా నువ్వు అదే చేస్తున్నావమ్మా. చిత్తశుద్ధి లేని పూజలకు విలువ లేదమ్మా.” అని మాష్టారు, కూతురిని ప్రశంసించేరు.

భోజనాలయ్యేయి. ముగ్గురూ, ముందు గదిలో కూర్చున్నారు.

మాష్టారు, తాము వచ్చిన విషయం ప్రారంభిస్తూ, “అమ్మా, నువ్వు ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నట్టుంది.”

“అవును, నాన్నా, చాలా happy గా ఉన్నాను. దీని కోసమే కదా, కలలు కంటూ ఉండేదాన్ని.”

“తల్లీ, అనుకున్నది సాధించేవు.” కళావతి ఉద్దేశపూర్వకంగా, అంది.

“అయిపోలేదమ్మా, ఇది ఇలా నా జీవితంలో చివరి దాకా సాగవలసినదేనమ్మా.”

“అవునమ్మా, నిజమే. మరి దీనికి, ఏ ఆటంకాలూ లేవు కదా.”

ఆ ప్రశ్నలో నిగూఢమయి ఉన్న ఉద్దేశాన్ని, మంగమ్మ గ్రహించింది.

“మరి ఏ ఆటంకాలూ, నేను సృష్టించుకొంటే గాని రావు నాన్నా. ఇక్కడి ప్రజలంతా మంచివాళ్ళు.”

“అమ్మా, నీ కంటే పెద్దవాళ్ళం. నీ మంచి కోరేవాళ్ళం. మేము, నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడుదామని వచ్చేమమ్మా.”

“మీరు ఎప్పుడూ, నా మంచి కోరుతూ ఉంటారు నాన్నా. నాకు ఏది మంచిదో, ఏది కాదో, మీకు బాగా తెలుసు. మీరు మాట్లాడదలచుకున్నది ఏమిటో, చెప్పండి నాన్నా.”

“అమ్మా, నీ పెళ్లి విషయం మాట్లాడాలి అని వచ్చేమమ్మా.” ఎంతో ఆప్యాయంగా మాష్టారు అన్నారు.

“అందులో ఇంకా మాట్లాడడానికి ఏమిటి ఉంది నాన్నా.”

“అమ్మా, శాంతంగా ఆలోచించు. ప్రతి మనిషికి జీవితంలో, పెళ్లి చాలా ముఖ్యమయినదమ్మా. కుటుంబం, మనిషికి జీవితంలో మంచికీ చెడుకీ, వెంటా ఉండి, ఒక సెక్యూరిటీ ఇస్తుందమ్మా.” మాష్టారు బోధనా పద్ధతిలోకి వెళ్ళేరు.

“అవును నాన్నా. I agree. కుటుంబం మన మంచి కోరుకొంటుంది. నేను దానిని కాదనను. అయితే, మన కష్టసుఖాలని, మనతో సమానంగా పంచుకొనే వాళ్ళందరూ, మన కుటుంబమే అని, నేను అనుకొంటాను, నాన్నా. ఇక్కడ, నా కాలిలో ముల్లు గుచ్చుకున్నా, చుట్టూ ఉన్నవాళ్లు, వాళ్ళ కాలిలో ముల్లు గుచ్చుకొన్నట్లు, బాధ పడతారు నాన్నా.” అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే,

“నువ్వు చెప్పినవన్నీ, బాగానే ఉన్నాయమ్మా. నాన్నగారు చెప్పినది విన్నావు కదా. ఇహ, నువ్వు పెళ్లి చేసుకోవడం మంచిదమ్మా.” కళావతి, ఆప్యాయంగా సంభాషణని విషయంలోనికి తెచ్చింది.

“అమ్మా, ఆ విషయంలో నా ఆలోచనలు అన్నీ, మీకు ఇదివరకే చెప్పేను. అందులో ఆలోచించడానికి మరేమీ లేదమ్మా.”

“పోనీ, నువ్వు చేసుకొందామనుకొన్నావు.. ఆ అబ్బాయినే చేసుకో అమ్మా. మాకు ఏ అభ్యంతరమూ లేదు.” అని బ్రతిమలాడుతూ చెప్పింది, కన్నతల్లి.

ఆ మాటలు మంగమ్మను బాధించేయి. కన్నతల్లి మనసును అర్థం చేసుకొని, కఠినంగా ఏమీ అనలేదు. పక్కనే ఉన్న తల్లిని, చేతితో ఆప్యాయంగా దగ్గరగా తీసుకొని, మందహాసంతో, మనసులోని బాధను, హాస్యముగా మలచి, “వివేక్ తల్లికి బ్రాహ్మణ రక్తం ఎక్కించేరా ఏమిటి అమ్మా.” అని.. వెంటనే, “సరదాకి అన్నానమ్మా. ఏమీ అనుకోకు.” అని damage control చేసింది.

“అమ్మ చెప్పింది ఆలోచించుకో అమ్మా. జరిగినదేదో జరిగిపోయింది. ఇప్పుడు అవి అనుకొని, ఏం లాభం.”

“ఒక మారు ఎస్స్, మరోమారు నో, అని మనం చెప్పదలచుకొన్నా.. అతని సెల్ఫ్ రెస్పెక్ట్ అతనికి ఉంటుంది, కదా నాన్నా. ఇంతకూ, వివేక్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా, నాకు తెలీదు నాన్నా. ఆఫ్రికాలో, సోషల్ సర్వీస్ చెయ్యడానికి ఒక NGO లో చేరడానికి వెళ్లేడని విన్నాను.”

“అన్న, ఉద్యోగంలో స్థిరబడ్డాడు. వయసు దాటిపోకుండా వాడి పెళ్లి చెయ్యాలి కదమ్మా. నీ పెళ్లి అయితేగాని, వాడి పెళ్లి చెయ్యలేమమ్మా. అందుకే, నీకు ఇన్నిసార్లు చెబుతున్నామమ్మా. ఆలోచించుకో తల్లీ.” ప్రాధేయపడింది, కళావతి.

“మరేమీ అనుకోకండి అమ్మా. నేను ఒక నిర్ణయానికి వచ్చేను. క్షమించడమ్మా. నేను ఆ నిర్ణయం మార్చుకోలేను. జీవితంలో, నేను కలలు కంటూండేది, దేముడి దయవల్ల, నెరవేరుతున్నాది. అదే నాకు సంతోషం. నాకు మరే కోరికా లేదు. అందుచేత, ఇంకా ఆలస్యం చెయ్యకుండా, అన్న పెళ్లి ప్రయత్నాలు వెంటనే ప్రారంభించండమ్మా.”

మాష్టారు, ఆ విషయం, అప్పటికి ఆపి, మరో మారు ప్రయత్నించవచ్చనుకొన్నారు.

“చాలా టైము అయింది. పొద్దున్న లేవాలి. వెళ్లి పడుకో అమ్మా.” అని సంభాషణకు తెర దించేరు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here