కాలంతోబాటు మారాలి – 2

0
8

[box type=’note’ fontsize=’16’] సీనియర్ రచయిత శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం రచించిన ‘కాలంతోబాటు మారాలి’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[రవి అస్తమించని సామ్రాజ్యంలో, మన దేశం అంతర్భాగంగా ఉన్న రోజులవి. ఆనాటి మెడ్రాస్ ప్రెసిడెన్సీలో, నందవలస ఒక మారుమూల గ్రామం. చౌదరి గారు ఆ ఊరి జమీందారు. తమ గ్రామంలో పిల్లలు అందరూ చదువుకోవాలని ఆయనకి ప్రగాఢమైన కోరిక. ఓ ప్రాథమిక పాఠశాలని ఏర్పాటు చేస్తారు. ఊరి రామాలయానికి అన్ని వసతులు కల్పిస్తారు. విశ్వేశ్వర శర్మ ఆ ఆలయంలో పూజారి. ఆయనంటే జమీందారుగారికి కూడా గౌరవం. ఆ ఏడాది శ్రీరామనవమి ఉత్సవం ఘనంగా జరుపుతారు. శర్మగారి ధర్మపత్ని మంగమ్మ. వారి సంతానం వరలక్ష్మి, సీతారామాంజనేయ శర్మ (బుజ్జిబాబు), సీతమ్మలు. వరలక్ష్మికి విజయనగరానికి చెందిన గణపతిశాస్త్రితో వివాహం జరుగుతుంది. ఉత్సవాలకి భర్తతో కలిసి పుట్టింటికి వస్తుంది వరలక్ష్మి. ఊర్లో పాఠశాల మూతపడడంతో బుజ్జిబాబు చదువు ఆగిపోతుంది. అందుకు అక్కా బావగార్లు బాధపడతారు. తమ ఊరు తీసుకువెళ్దామని అనుకుంటారు. తమ్ముడికి నచ్చజెప్పి తమ ఊరు రమ్మంటుంది వరలక్ష్మి. బుజ్జిబాబు కూడా సిద్ధం అవుతాడు. – ఇక చదవండి]

[dropcap]ఇం[/dropcap]ట్లో ప్రవేశిస్తున్న తల్లిని దూరంనుండి చూసి, అక్కతో సంభాషణ ఆపి, పరుగున వెళ్లి, ఆమె కాలొకటి కాగలించుకొని, తలెత్తి, ఆమె ముఖంలోకి చూస్తూ, “అమ్మా, అక్కతో వాళ్ళ ఊరు వెళ్తానమ్మా, అక్క నన్ను పెద్ద క్లాసులు చదివిస్తానంది. అమ్మా, పండుగలకి అక్క పేంటు కుట్టిస్తానంది. అమ్మా, అక్క కూడా, నీలాగే బూర్లు, గార్లు, చేస్తానంది. వాళ్ళ ఊర్లో నేను ఇంగ్లీషు చదువులు చదువుకొంటే; పేంటూ కోటూ వేసుకొని; మా స్కూలుకొచ్చేరే, మా గురువుగారి మీదాయన; అలాంటి పని చెయ్యగలనట.” అని, గుక్క తిప్పుకోకుండా, కొడుకు దండకం వినిపిస్తూంటే, నివ్వెరబోయింది తల్లి. వాడి మాటలన్నీ ఆమెకు అయోమయంగా తోచేయి.

“ముందు నా కాలు ఒదులు. నన్ను, ఇంట్లోకి రానీ.” అని నెమ్మదిగా కొడుకు బంధనం విడిపించుకొని, “అమ్మా, వీడేమిటంటున్నాడో నాకేమీ బోధపడడం లేదు. నీతో మీ ఊరు వెళ్తానంటున్నాడు. నువ్వు వాడికి పేంటు కుట్టిస్తావట. బూర్లు వండి పెడతావట, ఏమిటయింది వీడికి.” అని నవ్వుతూ, కూతురు దిక్కుగా అడుగులేసేరు, మంగమ్మ.

ఆ సమయంలో, బుజ్జిబాబు తొందరగా అక్క చెంత చేరి, ఆమె భుజం పట్టుకొని, “అమ్మతో చెప్పక్కా, నాన్నగారితో చెప్పమని.” అని ఇంకా ఏవో చెప్పబోతూంటే, తనూ నవ్వుకొంటూ, “అలాగే, ముందు నీ చెయ్యి తియ్యి. నేను లేవాలి. అమ్మకి కాఫీ కలపాలి.” అని లేవబోయింది.

లేచి నిలబడి, “వీడికేమీ కాలేదమ్మా. అవన్నీ తరవాత మాట్లాడుకొందాం. ముందు నువ్వు కాళ్ళూ చేతులూ కడుక్కొని రా. ఈ లోగా కాఫీ కలుపుతాను. తాగుదువుగాని.” అని తల్లికి సలహా ఇచ్చింది, వరలక్ష్మి.

కాళ్ళూ చేతులూ కడుక్కొని వచ్చి, ఒక పీట వాల్చుకొని, దానిమీద ఆసీనురాలయ్యేరు, మంగమ్మ. ఆవిర్లొస్తున్న కాఫీ గ్లాసును, కూతురు అందిస్తూంటే, పైటకొంగుతో దానినందుకొని, “కాఫీ ఘుమఘుమలాడుతోంది. మీ నాన్నగారు కూడా, రెండు మూడు మాట్లన్నారు; పిల్ల కాఫీ బాగా పెడుతుందని. నావన్నీ, పల్లెటూరి వంటలు; దిబ్బరొట్టి అవే నాకు చేతనవును; అమ్మాయి పట్నంలో ఉంది; కాఫీ, అవి చెయ్యడం దానికి బాగా తెలుసు అంటే, నవ్వుతూ, ‘అయితే పిల్ల దగ్గర నేర్చుకో’ అని వెటకారం చేసేరు.”

“అదేంలేదమ్మా. నేను రాగానే, మన పాలవాడికి చెప్పేను. నేనున్నన్నాళ్ళూ గేదెపాలు పొయ్యమని. మీ అల్లుడు ఆవుపాల కాఫీ, అంత ఇష్టపడరు. మేమక్కడ, గేదెపాలు పోయించుకొంటున్నాం. ఆ పాలతో కాఫీకి మంచి వాసన, రుచి వస్తాయి. ఆ కాఫీ ఆయన ఇష్టపడతారు. గేదెపాల కాఫీ, నాన్నగారికి కూడా నచ్చిందన్నమాట.”

“గేదెపాలన్నమాట, అసలు రహస్యం. మంచిపని చేసేవ్. ఇక్కడున్న నాలుగు రోజులూ, అతనికి కావలసినట్టూ చెయ్యాలికదా.”

ఖాళీ అయిన కాఫీ గ్లాసు, కిందకు దింపి, సంభాషణ ముందుకు సాగించేరు, మంగమ్మ.

“అది సరేగానీ, గుమ్మంలో నేను అడుగు పెట్టగానే, బుజ్జిబాబేదో దండకం మొదలుపెట్టేడు. నాకేమీ అర్థం కాలేదు.”

“వాడి చదువు విషయమమ్మా. ఈ ఊళ్ళో వాడి చదువు విషయం ఏమీ తేలడం లేదు. ఇలా ఎన్నాళ్ళు ఇంట్లో ఉంటాడు. మా ఊరయితే ఇలాంటి ఇబ్బందులు ఉండవ్. పెద్ద క్లాసులన్నీ ఉన్నాయి. చదువు ఆపీకుండా, పెద్ద క్లాసులు చదువుకొంటే మంచిదని, మీ అల్లుడు నిన్న రాత్రి నాతో అన్నారు. ఆ విషయమే వాణ్ణి కదిపి చూసేను. నాతో మా ఊరొచ్చి, పై క్లాసులు చదువుకొంటావా, అని నేనడిగితే, మొదట తటపటాయించేడు. ఈ ఊళ్ళోనే ఉండి, గుళ్లో పూజారి అవుతావా అని నేనడిగితే, కొంతసేపు బుర్ర గోక్కొని, అది ఇష్టం లేదన్నాడు. (నవ్వుతూ) ఏమిటి ఆలోచించుకొన్నాడో, నన్ను బేరాల్లోకి దింపేడు. పేంటు కుట్టిస్తావా… అమ్మలాగ పండుగలికి బూర్లు చేసిపెడతావా…అని ఒక్కక్కటి అడగడం ఆరంభించేడు.” అని తల్లితో ఇంకా ఏవో చెప్పబోతూంటే, తండ్రి ఇంట్లోకి వస్తూండడం గమనించి, “అమ్మా, నాన్నగారొచ్చేరు. నాన్నగారికి కాఫీ కలపాలి. తరవాత తీరుబాటుగా, నాన్నగారు కూడా ఉన్నప్పుడు, ఆ విషయం అందరం కలసి మాట్లాడుకొందాం.” అని జరుగుతున్న సంభాషణకు తెర దింపింది, వరలక్ష్మి.

పూజారిగారు, కాళ్ళూ చేతులూ కడుక్కొని వచ్చి, భార్యామణి తయారుగా వేసి ఉంచిన పీటమీద ఆసీనులయ్యారు. కూతురు అందించిన వేడి కాఫీ గ్లాసును, భుజం మీద ఉన్న కండువాతో అందుకొంటూ, “అమ్మా, కాఫీ మంచి వాసనొస్తోంది.” అని ఊదుకొంటూ ఒక గుక్క తాగి, మందహాసంతో, “కాఫీ చాలా బాగుందమ్మా, మీ అమ్మకి ఎలా చెయ్యడమో చెప్పు” అని, ఊదుకొంటూ మరో గుక్క కాఫీ నోట్లోకి జారవిడిచేరు, పూజారిగారు.

“చెప్పమ్మా మీ నాన్నగారికి, అసలు రహస్యమేమిటో.” అంటూ కొంటెగా భర్తవేపు చూసేరు, మంగమ్మ.

“మరేం లేదు నాన్నా. ఆయన గేదెపాలతో చేసిన కాఫీయే ఇష్టపడతారు. అంచేత, నేను వచ్చిననాటినుండి, గేదె పాలు పోయించుకొంటున్నాను. ఆవుపాలతో చేసిన కాఫీకి ఈ రుచి రాదు నాన్నా.” అని అసలు రహస్యం బయటపెట్టింది, వరలక్ష్మి.

“పిల్ల వచ్చిన నాటినుండి పెరుగులో కూడా తేడా వచ్చింది, పోల్చుకొన్నారా.” అని భర్తను మళ్ళీ, కొంటెగా ప్రశ్నించేరు, మంగమ్మ.

“అవును సుమీ, గడ్డలా ఉంటోంది పెరుగు. రుచి కూడా బాగుంటోంది. గేదెపాలతో ఇంత తేడా వస్తుందన్నమాట. కాని, చిన్న పిల్లలు అరిగించుకోలేరంటారు. అందుకే ఆవుపాలు పోయించుకోమన్నాను.” పూజారి గారు వివరణ ఇచ్చేరు.

“కొన్నాళ్ళు గేదెపాలు వాడి చూడండి నాన్నా. వాళ్లకి ఎప్పుడు అరక్కపోతే, అప్పుడు మళ్ళీ ఆవుపాలు పోయించుకోవచ్చు.” కూతురు సలహా.

“నువ్వు చెప్పింది బాగుందమ్మా.” అని కూతురు సలహాను అంగీకరిస్తూ,

“పిల్ల చెప్పింది బాగుంది. కొన్నాళ్ళు గేదెపాలు పోయించుకో. చూద్దాం. ఎప్పుడు కావలిస్తే, అప్పుడు మళ్ళీ ఆవుపాలలోకి మారిపోవచ్చు.” అని భార్యకు సలహా ఇచ్చేరు పూజారిగారు.

ఆ సమయంలో, పూజా కార్యక్రమాలు ముగించుకొని, గణపతి శాస్త్రి గారు అక్కడకు చేరేరు. తనకోసం భార్య వాల్చిన పీటమీద ఆసీనులయ్యేరు. అది గమనించి, “అమ్మా, మీ ఆయనకి కాఫీ తీసుకురా.” అని, కొబ్బరికాయ ఒలుస్తున్న కూతురికి పురమాయించేరు, మంగమ్మగారు.

“అఖర్లేదండీ, ఇందాకళే తాగేను.” వినయంగా తెలియజేసి,

“కొబ్బరికాయ బాగా కనిపిస్తోంది. పెద్దదిగా కూడా ఉంది… ఎంతయిందండీ.” మామగారిని అడిగేరు, శాస్త్రిగారు.

“కొన్నది కాదు, గణపతీ. వాళ్ళ తోటలో కొబ్బరికాయలు దింపినప్పుడు, జమీందారు గారు, మాక్కొన్ని పంపిస్తూంటారు. మంచి జాతివి. నీళ్లు తియ్యగా ఉంటాయి. కాయకి సుమారు రెండు గ్లాసుల నీళ్లొస్తాయి.” కొబ్బరికాయ కథ అల్లుడికి వినిపించేరు, పూజారిగారు.

“నిన్ననే వచ్చేయి, పదో పన్నెండో. కావలిస్తే, మీరు కొన్ని తీసుకెళ్లండి.” కూతురుకి సలహా ఇచ్చింది, తల్లి.

“ఈ మధ్యనే మీ అల్లుడు చాలా అభిషేకాలు చేయించేరమ్మా. మా ఇంట్లోనే పడున్నాయమ్మా, బోలెడు. నేనే ఇరుగు పొరుగు వాళ్లకి పంచుతున్నాను. ఇవి కూడా తీసుకెళ్లి ఏం చేస్తాను.” మర్యాదగా నవ్వుతూ నిరాకరించింది, వరలక్ష్మి.

తల్లి, తండ్రి, భర్త, ముగ్గురూ ఉన్నారు. తమ్ముడి చదువు విషయం మాట్లాడడానికి, సరైన సమయమనుకొంది, వరలక్ష్మి.

“నాన్నా, తమ్ముడి చదువు విషయం, ఏమిటి చేద్దామనుకొంటున్నారు.” విషయం కదిపింది, వరలక్ష్మి.

“చెయ్యడానికేముందమ్మా. కొత్త గురువుగారు వచ్చేదాకా, ఇంట్లోనే, పాత పాఠాలు చదువుకొంటూ ఉంటాడు. ఆయన రాగానే, మళ్ళీ బడికి పంపిస్తాను.” అని తన అయోమయ స్థితిని వెళ్లబుచ్చేరు, పూజారిగారు.

“ఇదివరలో ఒకాయన ఏణ్ణర్ధం తరవాత వచ్చేరన్నారు. కొత్త గురువుగారు మరో రెండేళ్లదాకా రాకపోతే, అప్పటిదాకా తమ్ముడు ఇంట్లోనే ఉంటాడా.” మరో ప్రశ్న సంధించింది, కూతురు.

“మరేమిటి చెయ్యగలమమ్మా, చెప్పు.”

“అలా ఏళ్లతరబడి బడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే, వాడికి చదువు మీద ఆసక్తి పోవచ్చు, మామగారూ.” అల్లుడు అందుకొన్నాడు, సంభాషణ.

“గణపతీ, నువ్వన్నది నిజమే. కాని ఏమిటి చెయ్యగలను… చూద్దాం. వాడికి, చదువు ఎంతవరకు రాసి ఉందో.”

“మామగారూ, కొత్తగురువుగారు వచ్చి, బుజ్జిబాబు మళ్ళీ బడికి వెళ్లినా, మీ ఊరి బడిలో, నాలుగు తరవాత, పై తరగతులు లేవుకదా.”

“ఆఁ, పై తరగతులు లేవు. వాటికీ, ఏదో ఒక చిన్న ఆశ ఉండేది. అదీ పోయింది.” నిస్పృహతో తండ్రి సమాధానం.

“నిన్నటి వరకు ఏదో ఆశ ఉండేదన్నారు. ఏమిటది.” కుతూహలంతో అడిగింది, వరలక్ష్మి.

“మన జమీందారు గారు, మన ఊళ్ళో ఇప్పుడున్న బడిలోనే, పై తరగతులు పెట్టించడానికి, సాన్నాళ్ళనుండి, విశ్వప్రయత్నాలు చేస్తూండేవారమ్మా. దానికి అవసరమయిన సదుపాయాలన్నీ, తనే సమకూరుస్తానన్నారట. అయినా, ప్రభుత్వం దానికి ఒప్పుకోలేదట. ఇప్పుడున్న బడిలోనే, పిల్లల సంఖ్య అంత బాగులేదు: మీద క్లాసులకి వెళ్తున్నకొద్దీ, పిల్లల సంఖ్య తగ్గిపోతోంది: అంచేత ఇంకా పెద్ద క్లాసులు పెట్టడానికి, అవకాశం లేదని, తేల్చి తెలియజేసేరట. ఇవాళ పూజయ్యేక, వచ్చిన వాళ్లందరినీ ఉండమని చెప్పి, ఆ విషయం చెప్పేరు. ఇంటింటికీ వెళ్లి చెప్పి, గ్రామంలో ఉన్న పిల్లలందరినీ, బడిలో చేర్చేటట్లు, చూడాలని వచ్చినవాళ్ళకి, సలహా ఇచ్చేరు. ఒకటో తరగతి తరవాత బళ్ళో పిల్లల సంఖ్య తగ్గిపోకుండా చూడాలని కూడా సలహా ఇచ్చేరు. అలా పిల్లల సంఖ్య పెరిగితే, మళ్ళీ, ప్రయత్నాలు మొదలుపెడతామన్నారు. అదే, నిన్నటి వరకు, ఆ ఆశ ఉండేది. అదీ, పోయింది.

మామగారి మాటల్లో, కొడుకుని పై చదువుల్లో పెట్టడానికి సంకల్పం ఉందని గ్రహించేడు, అల్లుడు.

“మామగారూ, భగవంతుడు, అన్ని దార్లూ మూసీడు. ఒక దారి మూసేసినా, మరో దారి తెరుస్తాడు.” ఆశావాదిగా పలికేరు, శాస్త్రిగారు.

“గణపతీ, నువ్వేదో తత్వం చెప్తున్నావ్. ప్రస్తుతానికి, నాకు మరేదారి, కనిపించడం లేదు.”

“అలా, నిరాశ పడకండి. మేము విజయనగరంలో ఉంటున్నాం. విద్యానగరం, అంటారు, మా ఊరిని. మా ఊళ్ళో పెద్ద పెద్ద క్లాసులకి అవకాశాలున్నాయ్.”

“అవును. నేనూ విన్నాను. మా జమీందారుగారు కూడా; విజయనగరం మహారాజులు; వాళ్ళ ఊళ్ళో స్కూళ్ళు, కాలేజీలు పెట్టించేరు; అంతలా చెయ్యలేకపోయినా, కనీసం వీలయినంత కొంతయినా చెయ్యాలి, అని అంటూ ఉంటారు” పూజారిగారి స్పందన.

“అదే నాన్నా, మా ఊళ్ళో ఎన్నో పైచదువులున్నాయి.”

“అవునమ్మా, వాటివల్ల ఈ ఊళ్ళో ఉన్న బుజ్జిబాబుకి ఏం ప్రయోజనం. రోజూ ఏం వెళ్లి రాగలడా.” పూజారిగారి ప్రశ్న.

“రోజూ వెళ్లిరావడం దేనికి మామగారూ. మేం ఆ ఊళ్ళోనే కదా ఉన్నాం.” మందహాసంతో అన్నారు, శాస్త్రిగారు.

“నాన్నగారు మర్చిపోయినట్టున్నారు.” చిన్న నవ్వుతో అంటూ, “నాన్నా, రోజూ వెళ్లిరావడం దేనికి, మా దగ్గర ఉండి, దర్జాగా చదువుకోగలడు.” వరలక్ష్మి, తన మనసులోని మాట బయటపెట్టింది.

“అమ్మా, చిన్నపిల్లవి. తమ్ముడు, ఎలాగయినా పైచదువు చదువుకోవాలని అనుకొంటున్నావు. మంచిమాటే. కానీ, నీకు తెలీడం లేదు.” పూజారిగారి నోట ఆ మాట రాగానే.

“వరాలూ, నాన్నగారు చెప్పినట్టు, నీకు తెలీడం లేదు. నీకే రోజూ ఎన్నో పనులుంటాయ్. వాటికి తోడు, వీడి బాధ్యతకూడా పైన పడితే, చేసుకోలేవమ్మా. రేపు నీకు పిల్లా, పాపా, పుడితే, వాళ్ళ పనులతోనే, రాత్రీ పగలూ, సతమతమయిపోతావు. దానికి తోడు, వీడి పనులు కూడా మీద పడితే, చేసుకోలేవు.” పిల్లల పెంపకంలో అనుభవమున్న తల్లి సలహా.

“అత్తగారూ, వాడి, ఏం పనులు మీ అమ్మాయి చెయ్యాలి, చెప్పండీ. వాడికి తనేం పళ్ళు తోమాలా, స్నానం చేయించాలా, అన్నం తినిపించాలా, వాడి పనులన్నీ వాడే చేసుకొంటున్నాడు. మీరే చూస్తున్నారుగా.” హాస్యం జోడించి, మందహాసంతో, భార్యను సమర్థించేరు, శాస్త్రిగారు.

“గణపతీ, వాడిప్పటివరకు మమ్మల్ని వదిలి ఉండలేదు.” అని మామగారు ఆ విషయం ఎత్తగానే, అత్తగారు అందుకొంది.

“కొత్త ఊరు, అందులోనూ పట్నం. వాడు, ఏవో, ఇవీ అవీ, అన్నీ, ఓ వారం పది రోజులు సరదాగా చూసేక, మేమంతా జ్ఞాపకమొస్తామ్. అప్పుడు, ‘అమ్మా, నాన్నగారిని, చెల్లిని, చూడాలని ఉంది’ అని వాడు మొదలుపెడితే, ఏమిటి చెయ్యగలరు. బాగా ఆలోచించుకో అమ్మా.” కూతురుకు నొక్కి చెప్పింది, తల్లి.

“అంతేకాదమ్మా, రాత్రిపూట వాడొక్కడూ వేరే పడుక్కోలేడు. ఆ సంగతి ఆలోచించేవా.” పూజారిగారి ప్రశ్న.

“దానికేమీ ఇబ్బంది లేదు, నాన్నా.” అని వరలక్ష్మి ఇంకా ఏదో చెప్పబోతూంటే,

“ఏమిటి, మీ దగ్గర పడుకోపెట్టుకొంటావా.” నవ్వుతూ, కొద్దిగా కొంటెతనంతో, కూతురినడిగింది, తల్లి.

“అదేం అఖర్లేదమ్మా. దానికి మీ అల్లుడు ఏర్పాటు చేస్తున్నారు.” అని తల్లికి సమాధానమిస్తూ,

“చెప్పండీ, ఆ భీమశంకరం గారి విషయం.” భర్తకందించింది సంభాషణ, వరలక్ష్మి.

భీమశంకరంగారి రెండో కొడుకు రోజూ రాత్రి వచ్చి చదువుకొని పడుక్కొంటాడని, వాడు బుజ్జిబాబుకి చదువులోకూడా సాయం చెయ్యగలడని, ఆ వివరాలు అత్తగారికి, మామగారికి తెలియజేసేరు గణపతిశాస్త్రి గారు.

“మాకూ, వాడు పైచదువులు చదువుకొని బాగుపడాలనే ఉంది గణపతీ, కానీ, ఎంతవరకు సాధ్యమో ఆలోచించాలికదా. ఏదో వారం పదిరోజులు కాదు. నెలల తరబడి వదిలి ఉండాలి.” అని అల్లునితో చెబుతూ, “అమ్మ చెప్పినట్టు, బాగా ఆలోచించుకో అమ్మా.” కూతురుకు పూజారిగారి సలహా ఇచ్చేరు.

కథ ముగిసిపోకుండా చూడాలని, సంభాషణ తనవైపు మళ్లించేరు, శాస్త్రిగారు.

“మామగారూ, మీరంటున్నది నిజమే. అది ఆలోచించవలసినదే. కాని, వాడికి పైచదువు చదువుకోవాలనే ఉద్దేశం గట్టిగా ఉన్నట్టుంది. ఓమాటు, మీరన్న విషయం, వాడితో మాట్లాడి చూద్దాం. వాడు ఉండలేనంటే, మరి, ప్రశ్నే లేదు. ఒక మారు వచ్చిన తరువాత, మధ్యలో రావడం కుదరదని, వాడికి బోధపరచి చూద్దాం. మీరుకూడా, కొన్నాళ్ళు, వాడికి అలవాటయ్యేదాకా, వీలుచూసుకొని, మధ్యమధ్యలో ఓ మారు వస్తూ, పోతూ ఉంటే, వాడా విషయం ఎత్తకపోవచ్చు.”

అది విన్న వెంటనే “అయితే, తమ్ముణ్ణి పిల్చుకొస్తాను.” అంటూ, వడివడిగా వీధిగుమ్మం దగ్గరలోనే పిల్లలతో ఆడుకొంటున్న తమ్ముణ్ణి తేడానికి వెళ్ళింది, అక్క .

కొద్దిగా వంగి నడుస్తూ, తమ్ముడి చెవిలో ఏదో హితోపదేశం అక్క చేస్తూంటే, వాడు, నమ్రతతో గంగిరెద్దులా బుర్ర ఊపుకొంటూ, అక్కతోబాటు, సమావేశస్థలం చేరుకొన్నాడు.

తండ్రికెదురుగా వినయంగా నిలబడి, “నాన్నగారండీ, మీరు రమ్మన్నారట.” నెమ్మదిగా అడిగేడు, బుజ్జిబాబు.

“అవును బాబూ, నీతో, నీ చదువు విషయం మాట్లాడాలని, రమ్మన్నాను. నువ్వు కూర్చో చెప్తాను.” ఆప్యాయంగా అన్నారు, పూజారిగారు.

అది విన్నవెంటనే, నేలమీద బుద్ధిగా మఠం వేసుకొని, ఆసీనుడయ్యేడు, బుజ్జిబాబు.

“బాబూ, మీ బడిలో, గురువుగారు ఎప్పుడు వస్తారో తెలీదు. అయినా, మన ఊళ్ళో, నీకు తెలుసుగా. నాలుగో తరగతి తరవాత, పెద్ద క్లాసులు లేవు. నీకు నాలుగో తరగతి తరవాత, ఇంకా పెద్ద క్లాసులు కూడా చదువుకోవాలిని ఉందా…చెప్పు నాన్నా.” నెమ్మదిగా అడిగేరు పూజారిగారు.

బుజ్జిబాబు, నాన్నగారి వంక, అక్క కళ్ళల్లోకీ, బిక్కు బిక్కుమని చూస్తూ ఉంటే,

“బుజ్జీ, నీకు చదవాలని ఉందో లేదో నాన్నగారికి చెప్పు; భయపడకు.” తమ్ముడికి ధైర్యం చెపుతూ, ప్రోత్సహించింది, అక్క.

“నాకు…చదవాలనే…ఉంది.” అక్క కళ్ళలోకి చూస్తూ, మెల్లగా తన మనసులోని మాట బయట పెట్టేడు, బుడతడు.

“అందులో భయపడ్డానికేముంది, బాబూ. పై చదువు చదువుకోవాలనుకోడం, మంచి విషయమే. కానీ, పై ఊళ్ళో ఉండి, చదువుకోగలవా. అది అడగడానికే రమ్మన్నాను.”

“పై ఊరంటే, అక్కావాళ్ళ ఊరా.” అనుమానం తీర్చుకొందామనుకొన్నాడు, బుజ్జిబాబు.

“వాళ్ళ ఊరని ఎందుకనుక్కొన్నావ్.” పూజారిగారి కూపీ.

“అక్క నాతో చెప్పింది. వాళ్ళ ఊళ్ళో ఎన్నో పెద్దక్లాసులున్నాయని.” అమాయకంగా అన్నాడు, బుజ్జిబాబు.

“అలాగా…అక్కా …తమ్ముడూ, ఈ విషయం…అప్పుడే…మాట్లాడుకొన్నారన్నమాట.” మందహాసంతో, కూతురు ముఖంలోకి చూసేరు, పూజారిగారు.

అంతలో, మంగమ్మ గారు చిన్న నవ్వుతో, “అయ్యో, మాటల సందట్లో చెప్పడం మరిచిపోయేను. ఇందాకళ, నేను దేవాలయం నుండి ఇంట్లోకి రాగానే, గుమ్మం దగ్గరే, నన్ను ముందడుగు వెయ్యనీకుండా ఆపి, నా కాలు కాగలించేసుకొని, గుక్క తిప్పుకోకుండా, ‘అమ్మా, అక్కా వాళ్ళ ఊళ్ళో పెద్దక్లాసులున్నాయట, వాళ్ళ ఊరు వెళితే, అక్క చేర్పిస్తానంది. నానాగారితో చెప్పమ్మా’ అని చెప్తూ, నవ్వు స్థాయిని పెంచి, ‘అక్క నాకు పేంటు కుట్టిస్తానంది… బూర్లు చేసి పెడతానంది…’ అని ఓ దండకం వల్లీస్తుంటే, ఏమిటో అనుకొన్నాను. ఇదన్నమాట, సంగతి” మంగమ్మగారికి, కొడుకు మాటలు బోధపడ్డాయి.

“నేను కూరలు తరుగుతూంటే, బుజ్జిబాబు నా దగ్గరకొచ్చి చేరేడు,నాన్నా. ఏదో ఒకటి మాట్లాడాలికదా అని, వాడి చదువు ఊసు ఎత్తేను. అలా, ఏవో మాట్లాడుకున్నాం. అంతే నాన్నా.” అని తండ్రికి సంజాయిషీ చెప్పుకొంది, వరలక్ష్మి.

“అందులో తప్పేమీ లేదమ్మా. నాకు నిజంగా సంతోషంగా ఉంది. చిన్నదానివయినా, పెద్దరికం తీసుకొని, తమ్ముడి చదువు విషయంలో చొరవ తీసుకున్నావ్. నీ దగ్గర వాడికి చనువుండబట్టి, వాడూ నీతో వాడి మనసులో ఏమిటుందో చెప్పేడు.” పూజారిగారు, కూతురు పెద్దరికాన్ని, అలా మెచ్చుకొన్నారు.

“మీ అల్లుడే నిన్నరాత్రి, నాతో ఆ విషయం లేవనెత్తేరు నాన్నా. ‘ఈ పరిస్థితుల్లో బుజ్జిబాబు, మన ఊరొచ్చి చదువుకొంటే బాగుండును; కానీ మీరేమిటనుకొంటున్నారో తెలీదు’ అని అన్నారు.” భర్తకి మెప్పు రావాలని, ఆ విషయం బయటపెట్టింది, వరలక్ష్మి.

“పెద్దమనసుతో ఆలోచించేవు, గణపతీ చాలా సంతోషం.” అని అల్లుడిని కొనియాడుతూ,

“వాడికి ఇంకా పై చదువు, ప్రాప్తం ఉంది కాబోలు. అందుకే మీ ఇద్దరికీ, ఆ శ్రీరామచంద్రుడు, ఆ ఆలోచన కలిగించేడు.” కళ్ళు మూసుకొని, దండం పెడుతూ, మనసులో తన ఆరాధ్యదైవాన్ని తలచుకొన్నారు, పూజారిగారు.

“మామగారూ, బుజ్జిబాబు పై చదువు, మనందరికీ కావలిసిన విషయమే కదా. మీ వైపు గాని, మా వైపు గానీ, పెద్ద చదువులు చదువుకొన్న వాళ్ళెవరూ లేరు. అందరూ వేదపాఠశాలల్లో గురువులు వద్ద చదువుకొన్నవాళ్ళమే. ఈ తెల్లదొరల ప్రభుత్వంలో, క్రమక్రమంగా, అనేకం, ఇంగ్లీషు చదువులవైపు, మొగ్గు చూపుతున్నారు. కాలంతో బాటు మనమూ మారాలి. ఆ సరస్వతీదేవి కటాక్షంతో, బుజ్జిబాబు తెలివిగా చదువుకొంటున్నాడు. వాణ్ణి వృద్ధిలోకి తీసుకురావడం, మన అందరి బాధ్యత. వాడి అదృష్టానికి, మేము, విజయనగరంలో ఉన్నాం. మా మహారాజుగారు, ఇంగ్లీషు చదువులన్నీ, పిల్లలకు ఉచితంగా అందజేస్తున్నారు. అన్నీ కుదిరేయి, వాడికి.” అని గణపతి శాస్త్రిగారు మందహాసంతో, అన్నారు

అల్లుని నోట ఆ మాటలు విని, అత్త మామలిద్దరూ, అతని విశాల హృదయాన్ని మనసారా కొనియాడేరు.

“ఆ మంచిమాటలన్నీ, నీ నోట ఆ శ్రీరామచంద్రుడే పలికిస్తున్నాడు నాయనా.” అత్తగారు, ‘పలికించెడివాడు రామభద్రుడట.’ అని, పోతనగారు, తన భాగవతంలో అన్నట్టు, పలికేరు.

“నిజమే నువ్వన్నట్టు, వాడు వృద్ధిలోకి వస్తే, మనందరికీ సంతోషమే.” మామగారు, సంతోషంతో అన్నారు.

అంతలో, పూజారిగారి కొరకు ఎవరో వచ్చారని తెలియడంతో, అక్కడితో ఆ సంభాషణకు తెర పడ్డాది.

మధ్యాహ్న భోజనాలయ్యేయి. శాస్త్రిగారు, నడుం వాల్చడానికి, తన పడక గదిలోకి వెళ్ళేరు. తల్లీ కూతుళ్లు, వంటింట్లోని పనులన్నీ ముగించుకొన్నారు. అక్కడే తచ్చాడుతున్నాడు, బుజ్జిబాబు. ఆ సమయంలో, పూజారి గారు, కొడుకుతో వాడి చదువు విషయం మాట్లాడ దలిచేరు. భోజనాల గదిలో, ఓ పీట వాల్చుకొని కూర్చున్నారు. కొడుకును, వచ్చి కూర్చోమన్నారు. వంటింట్లో ఉన్న ఇద్దరిని కూడా రమ్మన్నారు. నలుగురూ ఆసీనులయ్యేరు. పూజారిగారు సంభాషణ ప్రారంభించేరు.

“బుజ్జిబాబూ, పొద్దున్న బావగారు చెప్పింది విన్నావు కదా.”

విన్నానన్నట్టు, తండ్రి ముఖంలోకి చూస్తూ, తల ఊపేడు, బుజ్జిబాబు.

“చూడు నాయనా, నువ్వు అదృష్టవంతుడివి. బావగారు, నిన్ను వాళ్ళ ఊళ్ళో పై క్లాసులలో చేర్పిస్తానన్నారు. నిన్ను, అక్కా వాళ్ళతో, చదువుకోడానికి, వాళ్ళ ఊరు పంపిస్తాను.”

అది వినీ వినడంతో, సంతోషంతో, అక్క ముఖంలోకి చిరునవ్వుతో చూసేడు, తమ్ముడు. ఆ చిరునవ్వులో ఇమిడియున్న భావాన్ని, గ్రహించింది, అక్క. తనూ, అదే చిరునవ్వుతో, సంతోషం తెలియజేస్తూ, స్పందించింది.

అక్కా తమ్ముళ్ల సంతోషం, పూజారిగారు గమనించేరు. వస్తున్న చిరునవ్వును, పెదిమెలుతో నొక్కి ఆపేరు. సంభాషణ ముందుకు పోనిచ్చేరు.

“నాన్నా, నువ్వు అక్కడ బుద్ధిగా ఉండాలి… బావగారు ఎలా చెపితే, అలా నడుచుకోవాలి… ఆయనతో ఎప్పుడూ వాదించకూడదు… అది కావాలి… ఇది కావాలి… అని దేనికీ మారాం పెట్టకూడదు.” అని హితోపదేశం చేస్తూంటే, తండ్రి ముఖంలోనికి చూస్తూ అన్నింటికీ అంగీకరిస్తున్నానని తెలియబరుస్తూ, వినయంగా, బుర్ర టక టకా ఊపేడు; సంతోషసముద్రంలో మునిగి తేలుతున్న, బుడతడు.

“పాపం, వాడెప్పుడూ, దేనికీ, అది కావాలి, ఇది కావాలి, అని మారాం పెట్టలేదండీ.” ముద్దుల కొడుకును వదలి ఉండాలని, మనసులో బాధ పడుతున్న తల్లి, ఇచ్చిన కాండక్ట్ సర్టిఫికేటు.

“అయినా, చెప్పడం మంచిది.” పూజారిగారి స్పందన.

“నాయనా, బావగారికి, అక్కకి, చెప్పకుండా ఎప్పుడూ వీధిలోకి వెళ్ళకూడదు. పెద్ద ఊరు. జాగ్రత్తగా ఉండాలి.” మంగమ్మగారి సలహా.

బుజ్జిబాబు, తల్లి ముఖంలోకి చూస్తూ, ‘అలాగే’ అన్నట్లు బుర్ర ఊపేడు.

“అమ్మా, వాడే తప్పు చేసినా, వెనకాడక మందలించు. సంశయించకు. లేకపోతే, వాడికది అలవాటయిపోతుంది.” కూతురుకు సలహా ఇచ్చేరు, పూజారిగారు.

“అలాగే నాన్నా.” తండ్రికి హామీ ఇచ్చింది, వరలక్ష్మి.

అలా, తొలిమారు అత్తవారింటికి పంపుతున్న కూతురుకు ఇచ్చిన సలహాల రీతిని, పూజారిగారు, మంగమ్మగారు, కొడుక్కి హితోపదేశం చేసేరు.

ఆ సాయంత్రం, పూజారిగారు కూతురును తన గదిలోనికి పిలిచి,

“అమ్మా, ఈ సొమ్ము, నీ దగ్గర ఉంచు.” అని కొంత సొమ్మును, కూతురు చేతిలో పెట్టేరు.

“దేనికి నాన్నా, ఇంత సొమ్ము.” తండ్రి ముఖలోనికి ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగింది, వరలక్ష్మి.

“అమ్మా, ఇక్కడ, వాడి బట్టలికి, వేరే పెట్టేదీ లేదమ్మా. మీ ఊరు వెళ్ళేక, వాడి బట్టలకోసం, పెట్టొకటి కొనిపెట్టమ్మా.”

“వాడికి వేరే పెట్టెందుకు నాన్నా. మా బట్టలు, చొరుగుల్లో పెట్టుకొంటున్నాం. అక్కడే, జాగా చేసి, వాడి బట్టలు కూడా పెడతాను. అయినా, ఇంత సొమ్మెందుకు, నాన్నా.” అంటూ, తండ్రికి ఆ సొమ్ము, తిరిగి ఇవ్వబోతూంటే, అందుకోకుండా, కూతురు భుజం తడుతూ, “ఉండనీ అమ్మా. అదే కాదు. పెద్ద పట్నం. వాడికోసం ఇంకేవయినా ఖర్చులుండొచ్చు. ఉంచమ్మా.” అని ఆప్యాయంగా అన్నారు, పూజారిగారు.

“వాడికి వేరే ఖర్చులేమిటుంటాయి నాన్నా. అయినా, ఆయనికిది చెప్తే, వాడి ఖర్చుకు డబ్బు ఎందుకు పుచ్చుకొన్నావు, అని నన్నంటారు, నాన్నా.”

“సరేలే, ప్రస్తుతానికి ఇది ఉంచమ్మా. అవసరమయితే, గణపతితో నేను మాట్టాడతాను.” అని, కూతురుకు నచ్చచెప్పేరు, పూజారిగారు.

అక్కతో వాళ్ళ ఊరు వెళుతున్నానని, బుజ్జిబాబు, ఒకటే సందడి. చెల్లితో, “చెల్లీ, నేను అక్కతో వాళ్ళ ఊరు వెళుతున్నాను. నాన్నగారు చెప్పేరు. నీకు తెలుసా. అక్కావాళ్లది పెద్ద… ఊరు. ఎన్నో మంచిమంచి…వి వాళ్ళ ఊళ్ళో ఉన్నాయట. అక్క నాకు చెప్పింది. అక్క, నాకవన్నీ చూపిస్తానంది.” అని, సంబరబడుతూ చెప్పగానే, పరుగున నట్టింట్లో ఉన్న తల్లిని చేరి, “అమ్మా, అన్నయ్య, అక్కావాళ్ళ ఊరు వెళుతున్నానని చెప్పేడు. ఆ ఊళ్ళో ఎన్నో మంచిమంచివి ఉన్నాయట. అన్నయ్య చెప్పేడు. అక్క వాడికి అవన్నీ చూపిస్తుందని చెప్పేడు. నేనూ అక్కతో వెళతానమ్మా. నాన్నగారితో చెప్పమ్మా.” అని తల్లిని బ్రతిమాలాడడం మొదలుపెట్టింది, ఆ చిన్నారి.

ప్రక్కనే ఉన్న, వరలక్ష్మి, చెల్లెని ఒళ్ళోకి దగ్గరగా తీసుకొని, “అన్నయ్య, మా ఊరు చదువుకోడానికి వస్తున్నాడమ్మా. ఊరు చూడ్డానికి కాదు. ఈ ఊళ్ళో వాడి చదువయిపోయిందికదా. నీకు తెలుసుకదా.” అని అనగానే, తెలుసునన్నట్లు, బుర్ర ఊపింది, ఆ చిన్నది.

“అయితే అక్కా, నేనూ చదువుకొంటాను. నన్నుకూడా తీసుకెళ్లక్కా.” అని అక్క బుగ్గ పట్టుకొని, విన్నవించుకొంది, ఆ అమాయకపు పిల్ల.

“ఇక్కడ చదువుకొన్న తరవాత, పై చదువుకి వెళ్తున్నాడు, అన్న. నువ్విక్కడేమీ చదువుకోలేదుగా, అక్కడికి వెళ్ళడానికి.” మంగమ్మగారు కారణం చెప్పేరు.

చిన్నదానికి, ఏమిటి అనడమో తోచక, అక్క ఒళ్ళోనుండి దిగి, తోటి పిల్లలతో, చెమ్మచెక్కలు ఆడుకోడానికి పరుగున పోయింది.

అక్కతో బాటు వాళ్ళ ఊరు వెళుతున్నానని, చెల్లెలితో ముచ్చటించేక, బుజ్జిబాబు తన స్నేహితులను కలసి, తను అక్కతో పట్నం వెళుతున్నానని, ఆ విషయాలన్నీ, పూసగుచ్చినట్లు గొప్పగా వాళ్లతో చెప్పుకొచ్చేడు.

బుజ్జిబాబు, దూరంగా వెళిపోతున్నాడని, పూజారిగారు, ఒక పక్క మనసులో బాధపడుతూండేవారు. మరోపక్క, పైచదువులు చదువుకొని, అల్లుడు చెప్పినట్లు, బాగుపడతాడనే ఆశతో, సంతోషంగా ఉండేవారు. రోజూ, వాడు ముందుగదిలో మఠం వేసుకొని కూర్చొని, ముందుకు వెనక్కు, కొద్దిగా ఊగుతూ, వేమన పద్యాలు, సుమతీ శతకాలు, చదువుకొంటూ ఉంటే, పూజారిగారు, భార్యతో సహా, కొద్దిపాటి దూరం నుండి వింటూ, ఆనందించేవారు. అది తలచుకొని, పూజారిగారికి, వాడు వెళిపోతే, బోసిపోతుందనే బాధ మనసులో ఉండేది.

అటు నట్టింట్లో, మంగమ్మగారు కూడా, కొడుకును విడిచి ఎలా ఉండడమా అని మనసులో దిగులు పడుతూండేవారు. పక్కనే ఉన్న కూతురు వరలక్ష్మి, తల్లికి ధైర్యం చెపుతూండేది. “అలా బెంగపడకమ్మా. నాకు తెలుసు. వాణ్ణి వదిలి నువ్వెప్పుడూ ఉండలేదు. కష్టంగానే ఉంటుందమ్మా. కాని, వాడి చదువు ముఖ్యం గదా. పెద్దశలవులు, ఇట్టే తిరిగి ఒస్తాయి. అప్పుడు వాడు నీ దగ్గరకి తిరిగి వస్తాడు. నేను, వాణ్ణి జాగర్తగా చూసుకొంటాను. (మందహాసంతో) వాడికి కావలిసినవి, బెల్లం పులుసు, బూర్లు, చేసి పెడుతూంటాను. ఇంకా వాడు ఏమయినా కావాలంటే, అవి కూడా చేసిపెడతాను.” అని, తల్లి మనోభావాలు పంచుకొంటూ, హామీ ఇచ్చింది, వరలక్ష్మి.

“ఆఁ, మరిచిపోతాను. జ్ఞాపకం చెయ్యమ్మా.వాడికి బెల్లం ఆవకాయ ఇష్టం. వెళ్ళేటప్పుడు, నీకిస్తాను.” అని బూర్లు వేచుతున్న తల్లి, బుజ్జిబాబు ఇష్టం తెలియజేసింది, కూతురుకు.

కూతురు ప్రయాణానికి, రెండు రోజులు ముందునుండీ, రాత్రి పొద్దుపోయేదాకా, మంగమ్మగారు కూతురు సహాయంతో, పలహారానికి, చక్కిలాలు, జంతికలు, అధిక పరిమాణంలో తయారు చేసేరు. అవన్నీ, తమ ఊరికి తిరిగి వెళ్ళబోతున్న, కూతురికి, అల్లునికి, వారితో వెళుతున్న బుజ్జిబాబుకు, ఇవ్వడానికి.

కూతురు ప్రయాణం రోజు వచ్చింది. రోజులు ఇట్టే తిరిగిపోయినట్టు, భావించేరు, పూజారిగారి దంపతులు. వరలక్ష్మికి కూడా, తల్లిదండ్రులను వదలి వెళ్ళడానికి, మనసులో బాధగానే ఉండేది. తల్లిదండ్రులను వదలి వెళ్ళిపోతున్నాననే బాధ, బుజ్జిబాబు మనసులో ఉండేదో లేదో కాని, పట్నం వెళుతున్నాననే సంతోషం, మాత్రం, ఉండేది. పూజారిగారి దంపతులు, కూతురు అల్లునికి, లాంఛనప్రాయంగా వీడ్కోలు పలికేరు. వరలక్ష్మి కళ్ళ నీటిబొట్లు రాలేయి. తల్లిదండ్రులిద్దరూ, తనయుని దగ్గరగా తీసుకొని, వాని తలపై ముద్దులవర్షం కురిపించేరు. మరోమారు, క్లుప్తంగా హితబోధలు చేసేరు.

బుజ్జిబాబు విజయనగర ప్రయాణం ప్రారంభమయింది. వాడి జీవితంలో, అది తొలి దూరప్రయాణం. ఉబ్బి తబ్బిబ్బయిపోతూండేవాడు. దారి పొడుగునా, అక్కను, ‘అదేమిటక్కా, ఇదేమిటక్కా.’ అని అడుగుతూ, 9th cloud లో ఉండేవాడు.

నందవలస నుండి విజయనగరం వెళ్ళడానికి, దారిలో ఒక బస్సు మారాలి. గణపతి శాస్త్రి గారు, వరలక్ష్మి, బుజ్జిబాబు, మొదటి బస్సు దిగేరు. వారు ఎక్కవలసిన విజయనగరం బస్సు కొరకు, రెండు గంటలై నిరీక్షిస్తూండేవారు. కూర్చోడానికి అవకాశాలు లేవు. తమ రేకుపెట్టెమీదే, దంపతులిద్దరూ, సద్దుకొని ఆసీనులయ్యేరు. వరలక్ష్మి, తన ఒళ్ళో తమ్ముణ్ణి కూర్చోపెట్టుకొంది. మే నెల; మండుటెండ; శాస్త్రి గారు, భజం మీద ఉన్న కండువాను, తలకు చుట్టుకొన్నారు. వరలక్ష్మి, తన పైటకొంగును తలమీదనుండి రానిచ్చి, అందులోనికి తమ్ముడి బుర్రనూ, చేర్చింది. ఎండమూలాన్న, గొంతుకులు ఎండిపోతూండేవి. దారిలో త్రాగడానికి, ఒక పెద్ద మరచెంబుతో, ఇంటినుండి నీరు తెచ్చుకొన్నారు. ఎండవేడికి, అవి వేడెక్కి ఉన్నా, ముగ్గురూ, ఉండుండి అవే గ్లాసులో పోసుకొని త్రాగుతూండేవారు. బుజ్జిబాబు, ఎంత వేగరం విజయనగరం చేరుకొంటామా, అని మనసులో తహతహలాడుతూండేవాడు.

కొంత సేపయ్యేక, “మన బస్సు ఎప్పుడొస్తుందక్కా.” అని అక్క ముఖంలోకి చూస్తూ, అడిగేడు.

“వస్తుంది, బుజ్జీ. అది మరో ఊరునుండి రావాలికదా. ఇవాళ ఎందుకో ఆలస్యమయింది.” అని బోధపరస్తూ, “ఇబ్బందిగా ఉందా.” అని ఆప్యాయంగా అడిగింది.

“లేదక్కా. నాకు తెలీదుగదా. అందుకు అడిగేను. అంతే. నాకు ఇబ్బందేమీ లేదక్కా.” అని బుర్ర కొద్దిగా అడ్డంగా తిప్పుతూ, జవాబిచ్చేడు, బుజ్జిబాబు.

ఆ సంభాషణ వింటున్న శాస్త్రి గారు, “బుజ్జీ, విజయనగరం ఎప్పుడొస్తుందా, అని ఉందికదూ. మరో గంటలో వస్తుందిలే.” అని, చిరునవ్వుతో, పిల్లవాడి ఆతృతను గ్రహించి, మందహాసంతో అన్నారు. బుజ్జిబాబు, దానికి స్పందిస్తూ, చిన్న చిరునవ్వుతో అక్క ముఖంలోకి చూసేడు. అక్కా , ఓ చిరునవ్వు నవ్వింది.

దగ్గరలో, ఓ నడివయస్కుడు కర్రల పొయ్యిమీద, విశాలమయిన ఎల్యూమినియం పాత్రలో, టీ తయారు చేస్తూండేవాడు. ఒక పెద్ద కాడ గరిటతో, దానిలోనుండి వేడి టీను తీసి, ఓ గుడ్డద్వారా వడబోస్తూ, గాజు గ్లాసులో పోసి, గ్రాహకులకు అందజేస్తూండేవాడు. గ్రాహకులు, తాగి కిందనుంచిన గ్లాసులను, నీళ్లతో ఉన్న మరో ఎల్యూమినియం పాత్రలో, ఇటూ అటూ ఒకమారు ముంచి తీసేవాడు. అదే ఆ గ్లాసులకు గంగాస్నానం. అక్కడకు దగ్గరలోనే, బహుశా టీ చేస్తున్నవాని భార్యేమో, మరో కర్రల పొయ్యిమీద, పకోడీలు చేస్తూ ఉండేది. అక్కడ, గ్రాహకులు, చిన్న ముక్కలు గావించిన న్యూసు పేపరు ముక్కను పట్టుకొని, ఆతృతగా ఆవిర్లొస్తున్న మూకుడు దిక్కు చూస్తూ ఉండేవారు. మరికొద్ది దూరంలో, చెరుకు గడలను మరలో తిప్పుతూ, తాజాగా చెరుకు రసం తయారు చేస్తూండేవాడొక, ఆసామీ. బుజ్జిబాబుకు చెరుకు రసం ప్రీతికరమయినది. అటువైపే చూస్తూండేవాడు. అది అక్క కంటబడ్డాది.

“చెరుకురసం తాగాలని ఉందా.” అని తమ్ముణ్ణి అడిగింది. బావగారినీ అక్కను, ఏమీ అడగకూడదు అని, అమ్మ నాన్నగారూ, చెప్పిన హితవు తట్టిందో ఏమో, “ఒద్దక్కా.” అని బుర్ర ఊపీసేడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here