కాలంతోబాటు మారాలి – 3

0
9

[అక్క తనని వాళ్ళ ఊరు తీసుకువెళ్తుందన్న ఆనందంలో తల్లిని అనుమతి అడుగుతాడు బుజ్జిబాబు. ఆమెకి మొదట అర్థం కాదు. కాసేపటికి పూజారి గారు ఇంటికి వచ్చాకా, కూతురు వరాలు ఇచ్చిన కాఫీ తాగుతూ బుజ్జిబాబు చదువు ప్రస్తావన తెస్తారు. అప్పుడు, అల్లుడు గణపతి శాస్త్రి తమ ఉద్దేశం వివరిస్తాడు. బుజ్జిబాబును తమతో విజయనగరం తీసుకువెళ్ళి అక్కడ చదివిస్తామంటాడు. తల్లిదండ్రులు కాస్త సంశయించినా, వరలక్ష్మి పట్టుపట్టడంతో చివరికి అంగీకరిస్తారు. బుజ్జిబాబును పిలిచి జాగ్రత్తలు చెప్తారు. అక్కవాళ్ళింట్లో ఎలా మసలుకోవాలో వివరిస్తారు. బుజ్జిబాబు అక్కబావలతో ఊరు వెళ్తున్నాడని తెలిసి సీతాలు తానూ వెళ్తాళని మారం చేస్తుంది. తల్లి నచ్చజెపితే, ఆడుకోడానికి వెళ్ళిపోతుంది. ఊరు బయల్దేరే రోజు వస్తుంది. తల్లిదండ్రులు బుజ్జిబాబుకు హితబోధలు చేస్తారు. నందవలస నుండి విజయనగరం వెళ్ళడానికి, దారిలో ఒక బస్సు మారాలి. గణపతి శాస్త్రి గారు, వరలక్ష్మి, బుజ్జిబాబు, మొదటి బస్సు దిగారు. వారు ఎక్కవలసిన విజయనగరం బస్సు కొరకు, రెండు గంటలుగా నిరీక్షిస్తున్నారు. చెరుకు రసం బండి కనబడితే, తాగుతావా అని తమ్ముడిని అడుగుతుంది వరాలు. వద్దంటాడు బుజ్జిబాబు. – ఇక చదవండి]

[dropcap]శా[/dropcap]స్త్రి గారు, “కావాలా అని అడగడమేమిటి, వరాలూ, చూడలేదా నువ్వు. వాడి దృష్టంతా, దాని మీదే ఉంది.” అని, నవ్వుతూ, “బుజ్జీ, నాతో రా. చెరుకురసం తాగుదువుగాని.” అని వాణ్ణి పిలిచేరు. “ఏదీ, మన గ్లాసొకటి ఇలా ఇయ్యి.” అని, భార్యను అడిగి తీసుకొన్నారు.

తమ్ముడు, అక్క ముఖంలోకి చూసేడు. అక్కకు అర్థమయింది. “ఫరవాలేదు, వెళ్ళు.” అని మందహాసంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శాస్త్రి గారు, బుజ్జిబాబు భుజం పట్టుకొని, చెరుకురసం వ్యాపారి దరి చేరేరు. “బాబూ, ఓ గ్లాసు చెరుకురసం ఇందులో పొయ్యి.” అని గ్లాసు వాడికి అందిచ్చేరు. గ్లాసులో మూడువంతులు చెరుకురసం పోసి, “అయిసు కావాలా.” అని, బుజ్జిబాబు వంక చూసి, అడిగేడు, ఆ వ్యాపారి. బుజ్జిబాబు శాస్త్రిగారి ముఖంలోకి చూసేడు. శాస్త్రిగారికి అర్థమయింది. “వెయ్యి బాబూ.” అని, చెప్పి, వాడికి డబ్బు చెల్లించేరు. ఇద్దరూ వెనక్కి వెళ్ళేరు.

కొంత సమయం తరువాత, ముందుగా మాట్లాడిన కూలీవాడు, పరుగున వచ్చి, “అయ్యగారూ, ఇజేనగ్రమ్ బస్సు ఒత్తోంది. ఆ పెట్టి తొందరగ ఎట్టండి.” అని, భుజం మీదున్న కుళ్ళు తువ్వాలును, చుట్టచుట్టి, తల మీద పెట్టుకొని, వంగి నిలబడ్డాడు. శాస్త్రి గారు, భార్య సాయంతో, పెట్టెను కూలీవాని తలమీద దింపేరు. శాస్త్రి గారు వడివడిగా కూలివాని వెంట వెళ్ళేరు. వరలక్ష్మి, తమ్ముని చేయి పట్టుకొని, ఆయన వెంటా, గబగబా నడుచుకు వెళ్ళింది. బస్సు వచ్చింది. బస్సులో జనం క్రిక్కిరిసి ఉన్నారు. కొందరు వేలాడుతూ ఉండేవారు. వారిలో, బస్సు కండక్టరు కూడా ఉండేవాడు. బస్సు పూర్తిగా ఆగకుండానే, కండక్టరు అలవాటుకొద్దీ జాగ్రత్తగా దిగిపోయేడు. ఆ బస్సులో వెళ్లదలచిన ప్రయాణీకులు, అతని చుట్టుముట్టేరు. అందరికీ, అతడు మొండిచెయ్యి చూపిస్తూ, టీ దుకాణం దిక్కు వెళ్తూండేవాడు. శాస్త్రి గారు, వాడిని సమీపించి, “అయ్యా, రెండు గంటలై, మేం ముగ్గురం ఈ బస్సుకోసం పడిగాట్లు పడుతున్నాం. ఎలాగో, దయచేసి, బస్సులో జాగా ఇప్పించండి.” అని, బ్రతిమలాడేరు.

“అయ్యగారండి. కూకోడానికి జాగా నేదండి.” అని వినయంగా జవాబిచ్చేడు.

వెనుకనే ఉన్న, వరలక్ష్మి, “పోనీ, నిలబడయినా వెళతామని చెప్పండి.” అని భర్తకు సలహా ఇచ్చింది.

“అమ్మగారండీ, నిలబడినోళ్లందరూ, మగోళ్ళేనండీ. తమరు ఆల్ల మద్దిన, బాగోదు.” అని వివరిస్తూండగానే, దగ్గరలో ఓ బస్సు వస్తూండడం గమనించేడు. “అయ్యగారండీ, తొందరగ రండి. వైజాగు బస్సు ఒస్తోంది.” అని చెప్పగానే, “ఓఇజాగు బస్సు, ఈకాడ ఆపడే.” అని కూలివాడు, తనకు తెలిసినది అన్నాడు.

“నీకు తెల్దు. తొందరగ రా.” అని దమాయించి, వస్తున్న బస్సును, చెయ్యి తెగ ఊపి, ఆపేడు, విజయనగరం బస్సు కండక్టరు. వైజాగ్ బస్సులోకి వెళ్లి, ఆ కండక్టరుతో ఏదో మాట్లేడేడు.

బస్సు దిగి, “అయ్యగారండి, తొందరగ బండెక్కండి. కొద్దిగ ఎడజస్టు అవ్వాలి.” అనగానే, శాస్త్రి గారు, వాడికి ధన్యవాదాలు పలికేరు. ముగ్గురూ బస్సెక్కేరు.

కండక్టరు, రెండో వరసలో ఉన్న ఆడవాళ్లను, సద్దుకొని వరలక్ష్మికి జాగా చెయ్యమన్నాడు. వరలక్ష్మి ఇరుక్కొని, వాళ్ళ మధ్య కూర్చుంది. తమ్ముణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకోడానికి, అవకాశం లేక తన దగ్గరే నిలబెట్టుకొంది. శాస్త్రి గారు, ఆశతో కండక్టరు వైపు చూసేరు. “మీకు ఆడు సెప్పనేదా, ఎడజస్టవ్వాలని” అని మర్యాదగా చెప్పడంతో, శాస్త్రి గారు గ్రహించి, ఒక చేత్తో మీద నున్న ఇనప కడ్డీని పట్టుకొన్నారు. ఆ దగ్గరలో, సీటు మీద ఆసీనులయి ఉన్న ఇద్దరు మగవారు, శాస్త్రి గారు నిలబడి ఉండడం చూసేరు. వారికి శాస్త్రి గారిని బాగా తెలుసు. వారి ఇళ్లలో శాస్త్రి గారు కొన్ని శుభకార్యాలు చేయించేరు. అంచేత ఆయనమీద ఉన్న గౌరవం కొద్దీ, వారిలో ఒకరు నిలబడి, శాస్త్రిగారికి జాగా ఇచ్చేడు. శాస్త్రి గారు కూర్చుని, నిలబడి ఉన్న బుజ్జిబాబుని, పిలిచి, తన ఒళ్ళో కూర్చోబెట్టుకొన్నారు. బస్సు కదులుతూ ఉండగానే, అవన్నీ జరిగేయి.

అష్టకష్టాలు పడి, ఆ ముగ్గురూ సాయంత్రానికి విజయనగరం చేరుకొన్నారు.

గణపతి శాస్త్రి గారి రాకకై, విజయనగరంలో భీమశంకరం గారు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉండేవారు. కారణం. తలవని తలంపుగా, ఆ ఉదయం వారింటికి, ఇద్దరు బంధువులు, వారం రోజుల కొరకు వచ్చేరు. వారికి రాత్రి పడకల ఏర్పాట్లు, ఎలాగా…అని, భీమశంకరం గారు ఆందోళన పడుతూ ఉండేవారు. శాస్త్రి గారు, రావడం గమనించేరు. ‘హమ్మయ్య,’ అనుకొన్నారు. ఓ గంట వేచి, శాస్త్రిగారి ఇంటికి వెళ్ళేరు.

ఆయన్ని చూడగానే, ఎందుకు ఇలా తను రాగానే వచ్చేరా, అని మనసులో అనుకొని, “రండి శంకరంగారూ, ఇలా కూర్చోండి.” అని స్వాగతం పలికేరు, శాస్త్రి గారు.

ముందుగా కుశలప్రశ్నలు వేసి, తమ రాక ఉద్దేశం, శాస్త్రిగారికి తెలియబరిచేరు, శంకరం గారు.

‘ఆడబోయే తీర్థం ఎదురయింది’ అనుకొన్నారు, శాస్త్రి గారు.

“అయ్యో, అదేం భాగ్యమండీ. తప్పక మీ అతిథుల్ని పంపండి. ఇదిగో, ఈ గదిలో వారికి జాగా అవుతుంది.” తాము కూర్చొని ఉన్న గదినే చూపెడుతూ శాస్త్రిగారు హామీ ఇచ్చేరు.

“అతిథులను పంపితే బాగుండదేమో. మా రెండోవాడు పార్వతీశాన్ని, పంపుతాను. వాడికి చదువుకోడానికి, ఇప్పటికే ఇబ్బంది అవుతోంది. మా పెద్దవాడు, కోడలు, ఈ నాలుగు రోజులూ, మా గదిలో పడుకొంటారు. వాడి గది, అతిథులకు ఇవ్వొచ్చు.”

“శంకరం గారూ, మీ రెండోవాణ్ణి, రోజూ, మీ అతిథులు వెళ్లిన తరవాత కూడా పంపొచ్చు. మాకు అభ్యంతరం లేదు.” అని నొక్కి చెప్పేరు.

“మీకు ఇబ్బంది కలుగదా.”

“అబ్బే, ఏ ఇబ్బంది ఉండదు. సంకోచించకండి. పంపండి.” అని, మరోమారు నొక్కి చెప్పేరు.

“మీకు, ధన్యవాదాలు.” అని రెండో కొడుకు సమస్య శాశ్వతంగా తీరిందని తలచుకొని, శలవు తీసుకొన్నారు, శంకరంగారు.

శాస్త్రి గారు కూడా, బుజ్జిబాబు సమస్య, గుమ్మంలో అడుగు పెట్టగానే, తీరిందని, సంతోషించేరు. ఆ వివరాలన్నీ, వంటింట్లో వండుతున్న భార్యకు చెప్పేరు.

వరలక్ష్మి కూడా, సంతోషించింది. తనకు దగ్గరగా కూర్చొనియున్న, తమ్మునికి విషయం బోధపరిచింది.

ఆ మరునాడు, గణపతి శాస్త్రిగారు, తాము క్షేమంగా చేరుకొన్న సంగతి, బుజ్జిబాబు పడకకు ఏర్పాటయిన వివరాలు, తెలియజేస్తూ, మామగారికి ఒక పోస్టు కార్డు మీద, రాసేరు. ఒక నెల తరవాత, పూజారిగారు ఆ ఉత్తరం అందుకొన్నారు. అంతవరకూ, ఆ వార్తకై ఎదురుచూస్తూ,మనసులో ఆందోళన పడుతూండే పూజారిగారు, భార్య. ఆ ఉత్తరం అందుకోడంతో, వారి మనసు కుదుటబడ్డాది.

నందవలసలోని ప్రజలు, ఉన్న ఊరిలో వైద్యసౌకర్యాలు లేక, ఇబ్బందులు పడుతూండేవారు. ఇదివరకు, ఊళ్ళో ఒక ఆయుర్వేద వైద్యుడు ఉండేవాడు. చిన్న పిల్లల జబ్బులకు, ఆయన వైద్యం కొంతవరకు పనికివచ్చేది. అప్పటికి ఆరు సంవత్సరాల పూర్వం, ఆయన హఠాత్తుగా ఓ రాత్రి మరణించేరు. ఆయన పోయిన తరువాత, ఆ సౌకర్యం కూడా లేకుండా పోయింది. నందవలసకు, బండిమీద రెండుగంటల ప్రయాణంలో ఉండే, ఓ గ్రామంలో, నారాయణరాజు గారు అని, ఒకాయన ఉండేవారు. ఆయన ఓ ప్రభుత్వాసుపత్రిలో కాంపొండరుగా పని చేసి, అప్పటికి మూడు సంవత్సరాల క్రితం రిటైరయ్యేక, తన స్వగ్రామంలో, వైద్యసేవలు అందిస్తూండేవారు. చుట్టుపక్కల గ్రామాలనుండి కూడా వైద్యం కొరకు ఆయన వద్దకు వెళ్లేవారు. నందవలస నుండి కూడా, వైద్యం కోసం, ఆయన దగ్గరకు వెళ్లేవారు. గ్రామీణులందరూ, ఆయన్ని, డాక్టరుగారనే సంభోదించేవారు. కాని, ఆయనది తన అనుభవంలో నేర్చుకొన్న జ్ఞానమే. ఏదో దగ్గుకీ, జ్వరాలకీ మందులిచ్చేవాడు. ‘సూది మందులు’ కూడా ఇచ్చేవాడు. పూర్తి స్థాయి వైద్యుడు కాడు.

తమ గ్రామవాసులు వైద్యం అందక పడుతూండే, కష్టాలను చూసి, కనీస వైద్యసౌకర్యాలేనా, తమ గ్రామంలో లభింపజేయమని, ప్రభత్వానికి జమీందారుగారు, వినతిపత్రాలు సమర్పించేరు. అది చాలా ఖర్చులతో కూడిన పని అనిన్నీ, వైద్య సిబ్బంది కొరత కూడా ఉందనిన్నీ, అందుచేత వీలుపడదని, ఆయన విన్నపాన్ని ప్రభుత్వం తిరస్కరించింది.

నవరాత్రుళ్ళ సమయంలో, నందవలసకు, కొద్దిగా దూరంగా ఉన్న గ్రామానికి, వైద్యులొకరు రోజూ వచ్చి, సేవలందిస్తున్నారని జమీందారుగారికి తెలిసింది. జమీందారుగారు, ఆ వైద్యుని వివరాలు సేకరించేరు. ఆయన పేరు, దయానిధి పట్నాయకు. ఆయన, కలకత్తా విశ్వవిద్యాలయం నుండి, L.M.P. (Licentiate in Medical Practice) పాసు అయ్యేరు. ఆ రోజుల్లో, ఆ విద్యార్హత గలవారు, వైద్యరంగంలో సేవలందించడానికి అర్హులుగా ఉండేవారు. వారు, M.B.B.S. వైద్యులకు సమతుల్యులు కారు. 1946వ సంవత్సరంనుండీ, మన దేశంలోని విశ్వవిద్యాలయాలు, ఆ విద్యార్హతలు ప్రదానం చెయ్యడం ఆపీసేరు. డాక్టర్. పట్నాయకు ప్రభుత్యోగిగా ఉండేవారు. ఆయన విశాఖపట్నం జిల్లాలోనే పనిచేస్తూండేవారు. ఆయన అప్పటికి, ఒక సంవత్సరం ముందు, రిటైరు అయ్యేరు. ఆయన స్వస్థలం, బొరిగుమ్మపల్లి. అది కొద్దిగా పెద్ద గ్రామం. చుట్టుప్రక్కల, దగ్గర దూరంలో, వైద్యసౌకర్యాలు లేని గ్రామాలు, పది వరకూ ఉండేవి. వాటిలో నందవలస ఒకటి. ఆ పరిస్థితులలో, స్వంత ఊరు బొరిగుమ్మపల్లిలో చికిత్సాలయం నెలకొల్పితే, లాభదాయకంగా ఉంటుందని పట్నాయకుగారు అభిప్రాయపడ్డారు. ఆ విధంగా బొరిగుమ్మపల్లిలో డాక్టరు పట్నాయకు గారి చికిత్సాలయం, వెలిసింది. తొలిసారిగా, బొరిగుమ్మపల్లి వారికి, వారి గ్రామంలోనే నాణ్యమైన వైద్యసౌకర్యం లభించడం మొదలయింది. అతి త్వరలో, పట్నాయకు గారు, స్థిరపడ్డారు.

తమ గ్రామ వైద్యసౌకర్యాల విషయం చర్చించడానికి, జమీందారు గారు, డాక్టరు పట్నాయకు గారికి, ఆహ్వానం పంపేరు. డాక్టరు గారు, అది అందుకొని, జమీందారు గారి గురించి, వివరాలు సేకరించేరు. ఒక ఆదివారం సాయంత్రం, డాక్టరు పట్నాయకు గారు, నందవలసలో జమీందారు గారి బంగళాలో, ఆయన్ని కలసుకొన్నారు. జమీందారు గారు, డాక్టరుగారిని, తమ గ్రామానికి వైద్యసౌకర్యాలు అందజేయడానికి, రోజూ, ఒక రెండుగంటల కొరకైనా రావలిసిందని కోరేరు. దానికి సరియగు పారితోషికం ఇవ్వగలనని, చెప్పేరు. డాక్టరుగారు, తను అప్పటికే, రెండు గ్రామాలవారికి, వారానికి రెండు రోజులు సేవలందిస్తున్నానని చెప్పేరు. అందువలన, రోజూ రావడం వీలుపడదని, మర్యాదగా తెలియజేసేరు. డాక్టరుగారికి, జమీందారుగారి మాట కాదనడం, మనసులో ఇష్టం లేదు. ఏమంటే, ఆయన విరివిగా ఇస్తారని, ముందే తెలుసుకొన్నారు. ఏదయితేనేమి, చివరకు డాక్టరుగారు, వారానికి మూడు రోజులు నందవలస రావడానికి సమ్మతించేరు. జమీందారుగారు ఇవ్వదలచిన పారితోషికం, డాక్టరుగారు అనుకున్నదానికన్నా, ఎక్కువగానే ఉండేది. ప్రభత్వం వారు మొండిచెయ్యి చూపినా, జమీందారుగారు, తమ గ్రామవాసులకు, ఆ విధంగా వైద్యసౌకర్యాలు కొంతవరకు అందుబాటులోనికి తెచ్చేరు.

భీమశంకరంగారి రెండో అబ్బాయి పార్వతీశం, గణపతి శాస్త్రిగారి ఇంటికి, రాత్రుళ్ళు చదువుకోడానికి రావడం ప్రారంభించేడు. మొదటి రోజు రాత్రి, వరలక్ష్మి, తమ్ముణ్ణి, పార్వతీశానికి పరిచయం చేస్తూ, “బాబూ. వీడు నా తమ్ముడు శర్మ. ఇంట్లో మేము ‘బుజ్జిబాబు’ అంటాం. వీడు కూడా ఇక్కడే పడుకొంటాడు. రాత్రి నీకు ఏ అవసరమొచ్చినా, మొహమాట పడకు. వీడితో చెప్పు.” అని మృదువుగా పలికింది. వరలక్ష్మి. పార్వతీశానికి చదువులో ఆటంకపరచొద్దని, తమ్మునికి సలహా ఇచ్చింది. పార్వతీశాన్ని, పేరుపెట్టి పిలవద్దు అని చెప్పింది. ‘అన్నా’ అని పిలవమని, సలహా ఇచ్చింది.

వరలక్ష్మి వెళ్ళిపోయేక, పార్వతీశం బుజ్జిబాబుతో సంభాషణకు దిగేడు. బుజ్జిబాబు గురించి, నందవలసలో వాడి బడి గురించి, కొన్ని విషయాలు తెలుసుకొన్నాడు. తన స్కూలు గురించి కూడా చెప్తూ, “మా స్కూల్లో ఎన్నో తరగతులున్నాయి. టీచర్లు చాలామంది ఉన్నారు. మాకు డ్రిల్లు టీచరు కూడా ఉన్నారు. ఆయన మాచేత ఆటలాడిస్తూ ఉంటారు.” అని చెపుతూంటే.

“మీ గురువుగారు ఆటలాడిస్తారా. మా గురువుగారు పాఠాలే చెప్తారు. ఆటలు, బడి అయిపోయేక, మేమే ఆడుకొంటాం.” అని, తన కథ వినిపించేడు, బుజ్జిబాబు.

రోజల్లా ఎండలో బస్సు ప్రయాణం చేసి, బాగా అలసి ఉండేవాడు, బుజ్జిబాబు. ఆవలింతలు వస్తూ ఉండేవి. పార్వతీశం కూడా చదువుకోడానికి సిద్ధమవుతూ ఉండేవాడు.

“శర్మా, నీకు నిద్ర వస్తోంది, పడుక్కో. నేను కూడా చదువుకోవాలి.” అని, సంభాషణకు స్వస్తి పలికేడు, పార్వతీశం.

బుజ్జిబాబుకు, అక్కా బావగారూ, విజయనగరం ఓ పది పదిహేను రోజుల్లో చూపించేరు. బుజ్జిబాబు, అంత పెద్ద పట్నం, అప్పటికి చూడలేదు. పొడవైన రోడ్లు, పెద్ద దుకాణాలు, రోడ్డు మీద తిరుగుతూండే వాహనాలు చూసి ఆశ్చర్యపోయేడు. తను చదవబోయే స్కూలు చూసి, ‘ఎంత పెద్దదో’ అనుకొన్నాడు. పార్వతీశం, వీధిలో పిల్లలు కొందరితో బుజ్జిబాబుకు పరిచయం చేసేడు. బుజ్జిబాబు, క్రమక్రమంగా, వారికి దగ్గరయ్యేడు. వాళ్ళతో కలసి, సాయంత్రాలు ఆడుకోడం మొదలు పెట్టేడు. రోజులో ఎక్కువ సమయం, అక్కతో గడుపుతూండేవాడు. అక్క, వంటింట్లో పనిచేసుకొంటూ ఉంటే, దగ్గరలోనే మఠం వేసుకొని కూర్చొని, ఏవో కబుర్లు చెప్తూ ఉండేవాడు. వరలక్ష్మికి కూడా, తమ్ముడు వచ్చిన నాటినుండి, ఒంటరితనం లేకుండా ఉండేది. ముఖ్యంగా, గణపతి శాస్త్రి గారు, పై ఊర్లు వెళ్లిన రోజుల్లో, ఇంట్లో తమ్ముడు, పార్వతీశం ఉండడం మూలాన్న, రాత్రిళ్ళు బిక్కుబిక్కు మని, ఎప్పుడు తెల్లారుతుందా అని గడపడం, తప్పిపోయింది.

స్కూళ్లకు ఎండాకాలం సెలవులు ముగిసేయి. పిల్లలు, మళ్ళీ స్కూలుకు వెళ్లే రోజులొచ్చేయి. బుజ్జిబాబు చేత, గణపతి శాస్త్రిగారు, ఉదయాన్న, విఘ్నేశ్వర పూజ, సరస్వతీదేవి పూజ చేయించేరు. కొత్త నిక్కరు, చొక్కా వేసుకొని, బుజ్జిబాబు కొత్త బడిలో చేరడానికి, సంబరపడుతూ ఉండేవాడు. బావగారికి, అక్కకు, సాష్టాంగ నమస్కారం చేసేడు. గణపతి శాస్త్రిగారు, బుజ్జిబాబుని తీసుకొని స్కూలుకు వెళ్ళేరు. అక్కడ, తనకు పరిచయమున్న ఒక టీచరు సహాయంతో, బడిలో చేర్పించేరు. సీతారామాంజనేయ శర్మ, విజయనగరం స్కూల్లో మూడో తరగతిలో చేరేడు. ఇంటికి రాగానే, పట్టలేని సంతోషంతో , అక్క చెంత చేరి, “థేంక్ యు, అక్కా.” అని చేటంత ముఖం చేసుకు చెప్పగానే, వరలక్ష్మి, తమ్ముని గట్టిగా కాగలించుకొని, తలపై ముద్దులు పెట్టింది. అది గమనిస్తూండే, శాస్త్రి గారి చెవిలో, బుజ్జిబాబు నోట వచ్చిన ఇంగ్లీషు ముక్క పడ్డాది. “వరాలూ, బడికి ఒక్క… రోజు వెళ్ళగానే, నీ తమ్ముడు, దొరల భాష మాట్లాడుతున్నాడు.” అని నవ్వుతూ అన్నారు. బుజ్జిబాబు, సిగ్గుపడి, చిరునవ్వుతో, తల దించుకున్నాడు. వరలక్ష్మి, “సిగ్గెందుకురా, బావగారికి చెప్పు. నీకు మరో రెండు ఇంగ్లీషు ముక్కలు కూడా వచ్చని.” అని, పుట్టింట్లో జరిగిన విషయం భర్తకు నవ్వుతూ తెలియజేసింది.

చదువుకోడానికి కావలిసిన పుస్తకాలు, ఇత్యాదివి, శాస్త్రి గారు సమకూర్చిపెట్టేరు. శాస్త్రి గారు ఉండే వీధిలోనే ఉండే కొందరు పిల్లలు, ఆ స్కూల్లోనే చదువుతూండేవారు. వారితో కలసి, బుజ్జిబాబు, రోజూ స్కూలుకు వెళ్లడం రావడం, చేయ నారంభించేడు. బుజ్జిబాబు, స్కూల్లో ప్రవేశించేక, ఆ విషయం, మామగారికి పోస్టు కార్డు ద్వారా తెలియబరచేరు, శాస్త్రి గారు. ఆ వార్త తెలియగానే, పూజారిగారు, మంగమ్మగారు, పూజామందిరంలో కొలువుతీర్చి ఉన్న, శ్రీరాములవారికి సాష్టాంగ నమస్కారం చేసేరు. ఆ శుభవార్త, పూజారి గారు, జమీందారు గారికి, తెలియజేసేరు. ఆయన తన సంతోషాన్ని వ్యక్తబరుస్తూ, “మీ అల్లుడు మంచి నిర్ణయం తీసుకొన్నారు. మీ అబ్బాయికి, పెద్ద చదువులు చదువుకొనే, మంచి అవకాశం కలిగింది.” అని, పూజారిగారిని అభినందించేరు.

బుజ్జిబాబు ఉత్సాహంతో చదువుకో నారంభించేడు. తమ్ముడు రాత్రిపూట చదువుకోడానికి, సాయంత్రమే, కిరసనాయిలు లాంతరు శుభ్రముగా తుడిచి ఉంచేది, వరలక్ష్మి. ఆ లాంతరుకు ఇరువైపులా కూర్చొని, బుజ్జిబాబు, పార్వతీశం, శ్రద్ధగా చదువుకొంటూ ఉండేవారు. బుజ్జిబాబు ఓ గంటో గంటన్నరో చదివి, పడుకునేవాడు. పార్వతీశం సుమారు మరో గంట వరకూ చదువుకొంటూ ఉండేవాడు. బుజ్జిబాబు హోమ్ వర్కును ఎప్పుడూ వెనకపెట్టే వాడు కాదు. రెగ్యులరుగా చేస్తూ ఉండేవాడు. తెలుగు టీచరుకు, బుజ్జిబాబు తెలుగులో పద ఉచ్చారణ ఎక్కువగా ఆకట్టుకొంది. తోటి విద్యార్థులతో, బుజ్జిబాబు కలసి మెలసి ఉండేవాడు. వీటన్నితో బుజ్జిబాబు టీచర్ల సదభిప్రాయం, తొందరలో పొందేడు. స్కూలులో, తోటి విద్యార్థులు, టీచర్లు, ‘శర్మా’ అని సంబోధించేవారు. కొడుకు శ్రద్ధగా చదువుకొంటున్నాడని, శాస్త్రిగారు తరచూ మామగారికి తెలియజేస్తూ ఉండేవారు. ఆ ఉత్తరం అందుకొని, పూజారిగారు, భార్య, సంతోషిస్తూ ఉండేవారు.

అలా, సుమారు రెండు నెలలు గడిచేయి. ఆ దినం, సెప్టెంబరు 5 వ తారీఖు, 1920 వ సంవత్సరం. మన దేశ స్వాతంత్ర్య సమర చరిత్రలో, ఒక ప్రధాన ఘట్టం ప్రారంభమయిన రోజు. గాంధీగారు, సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపు నిచ్చిన రోజు. అది హఠాత్తుగా సంభవించినది కాదు. అంతకు క్రిందటి సంవత్సరమే, ఏప్రిలు 13 న అమృతసరులోని జలియనువాలాబాగ్‌లో సంభవించిన నరమేధ, ఒక మూలకారణం.

ఆ రోజు సిక్కుల బైసాఖీ పర్వదినం. సిక్కులు కొందరు, పిల్లా పెద్దా, మగా ఆడా, సరదాగా ఆ ఉద్యానవనంలో పండుగ వేడుకలు, జరుపుకొంటూ ఉండేవారు. హఠాత్తుగా, జనరలు డైయ్యరు ఆదేశాల మేరకు, బ్రిటిషువారి సైన్యం ఆ అమాయకులపై, తుపాకీలతో గుళ్ల వర్షం కురిపించేరు. వందలకొద్దీ, జనం అక్కడికక్కడే మరణించేరు. వేలమంది గాయపడ్డారు. ఆ తరువాత, రాజకీయ ఖైదీల హక్కులను తుడిచిపెడుతూ జారీ అయిన రౌలట్ చట్టం, కూడా ఆనాటి ప్రజల మనోభావాలను దెబ్బతీసేయి. పర్యావసానం, గాంధీగారు పిలుపునిచ్చిన, సహాయ నిరాకరణ ఉద్యమం. గాంధీగారు, విదేశీ వస్తువులను బహిష్కరించమన్నారు. ప్రభుత్వోద్యాగాలను, వీడమన్నారు. విదేశీ వస్త్రధారణ చేయవద్దన్నారు. ఖాదీని ప్రోత్సహించమన్నారు. ఆ సందేశాలతో దేశమంతటా తిరిగి ప్రజలను ఉత్తేజపరిచారు. అనేకమంది ప్రభావితులయ్యేరు. స్కూళ్కు, కాలేజీలను బహిష్కరించేరు. దాని ప్రభావం, బుజ్జిబాబు చదువుపై పడ్డాది. వాడి బడి, తాత్కాలికంగా మూతబడ్డాది.

తమ్ముడు నిరాటంకంగా చదువుకోగలుగుతున్నాడని, ఆ నాటివరకూ, వరలక్ష్మి సంతోషిస్తూ ఉండేది. కానీ, అనుకోకుండా సంభవించిన పరిణామాలతో, మనసులో బాధపడ నారంభించింది. ‘ప్రథమ కబళే, మక్షికాపాతః’ అన్నట్టు అయింది. చదువు ప్రారంభించి రెండు నెలలైనా కాకుండా, పెద్ద ఆటంకం ఎదురయిందని, వరలక్ష్మి మనసులో బాధపడుతూ ఉండేది. అటు, తల్లిదండ్రులకు ఆ విషయం, వార్తల ద్వారా తెలిసి, ఎంత చింతిస్తున్నారో, అని మరోపక్క, ఆవేదన. భార్య మనోవేదన, శాస్త్రిగారు గ్రహించేరు. త్వరలోనే, సమస్య పరిష్కారం కావచ్చని, ధైర్యం చెప్పసాగేరు. ఆ చీకటి మేఘాలలో, ఒక మెరుపుతీగ ఉండేది. బుజ్జిబాబు, ఇంట్లోనే, పగలూ, రాత్రీ, శ్రద్ధగా చదువుకొంటూ ఉండేవాడు. పార్వతీశం, కొత్త పాఠాలు నేర్చుకోడంలో, సహాయపడుతూ ఉండేవాడు. అది, శాస్త్రిగారి దంపతులకు, సంతోషము, ధైర్యము, చేకూర్చేయి.

అటు, నందవలసలో వార్తల ద్వారా, దేశంలో నెలకొన్న విపరీత పరిస్థితులు, పూజారిగారికి తెలుస్తూ ఉండేవి. విజయనగరంలో బుజ్జిబాబు చదువుతూండే బడి తెరచి ఉందో లేదో, అనే సంశయం మనసులో గట్టిగా ఉండేది. పూజారిగారి భార్య మంగమ్మగారికి, విషయం తెలిసిననాటినుండి, ‘పిల్లాడిని ఎందుకు పంపేమా. అక్కడ ఎలా ఉన్నాడో, ఏమిటో’ అని, చింతిస్తూ ఉండేవారు. పూజారిగారు, ఆమెకు ధైర్యం చెపుతూ ఉండేవారు. “మంగమ్మా, ధైర్యంగా ఉండు. బుజ్జిబాబు, అమ్మాయి ఇంట్లో ఉంటున్నాడు. వాడు క్షేమంగానే ఉండి ఉంటాడు. గణపతికి వాడంటే, బాగా అభిమానం. జాగ్రత్తగా చూసుకొంటాడు. ఇహ, చదువంటావా, ఇక్కడున్నా, వాడికి అవకాశం లేదు. జమీందారు గారు అన్నారు; ఈ పరిస్థితులు త్వరలోనే, సరిదిద్దుకొంటాయని.”

“ఏమోనండీ, పిల్లాడి సంగతి, గణపతి ఉత్తరం రాస్తాడనుకొంటాను.” అని అల్లునినుండి ఉత్తరానికి ఎదురుచూస్తూ, ఉండేవారు.

అనుకున్నట్టే, అప్పటికి పది రోజుల్లో, మంగమ్మగారు ప్రక్కనే ఉన్న సమయంలో పూజారిగారికి, ఒక కవరు ఉత్తరం అల్లుని నుండి అందింది.

పూజారిగారు, అది విప్పి బయటకు చదివేరు.

మహారాజశ్రీ మామగారికి, అల్లుడు గణపతి శాస్త్రి, నమస్కరించి రాయునదేమనగా,

మేము ఇక్కడ క్షేమంగా ఉన్నాము. మీరు అత్తగారూ సీతాలు క్షేమమనుకొంటాను. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితి మీకు తెలిసే ఉంటుంది. ఉద్యమకారుల ఒత్తిడికి బడులూ కాలేజీలు తాత్కాలికంగా పనిచేయుటలేదు. బుజ్జిబాబు బడి కూడా తెరువలేదు. కానీ ఆ విషయంలో మీరు ఆందోళన పడకండి. నిన్ననే కొందరితో బాటు నేను కూడా బడి ప్రధానోపాధ్యాయుని కలుసుకొన్నాను. పిల్లల చదువు విషయమై చర్చించేము. ఆయన దయతో మా ఆందోళన అర్థం చేసుకొన్నారు. సంబంధిత అధికారులకు మా విన్నపం తెలియజేస్తాను అని అన్నారు. త్వరలో వారి నిర్ణయం తెలుస్తుందని హామీ ఇచ్చేరు. ఆయన మాటలలో కొంత సుముఖత ఉందని మేమందరమూ అభిప్రాయపడ్డాము. దేశంలోని బడులన్నీ శాశ్వతంగా మూసీరని మాలో కొందరు అనుభవజ్ఞులు ధైర్యం చెప్పేరు. బుజ్జిబాబు ఇంటివద్ద శ్రద్ధగా చదువుకొంటున్నాడు. మీకు ఇదివరలో తెలియజేసేనుకదా. మా వీధిలోని భీమశంకరం గారి అబ్బాయి, రోజూ రాత్రి మన ఇంట్లోనే చదువుకొంటున్నాడు. ఈ పరిస్థితి వచ్చిననాటినుండి పగలుకూడా మన ఇంటికి వచ్చి కొన్నిగంటలు చదువుకొంటున్నాడు. ఆ అబ్బాయి బుజ్జిబాబుకన్నా పెద్ద క్లాసులో ఉన్నాడు. వాడితోబాటు మనవాడు కూడా చదువుకొంటున్నాడు. బుజ్జిబాబుకు ఆ కుర్రాడు చదువులో సాయం చేస్తున్నాడు. ఆ విధంగా మనవాడి చదువుకు ఇబ్బంది లేదు. అందుచేత బుజ్జిబాబు చదువు విషయంలో మీరు ఆందోళన పడకండి. బడి త్వరలోనే తెరుస్తారని నాకు నమ్మకముంది. తెరవగానే మీకు జాబు రాస్తాను.

మీకు అత్తగారికి నా నమస్కారాలు. సీతమ్మకు ఆశీర్వచనములు. శలవా మరి.

ఇట్లు

మీ అల్లుడు గణపతిశాస్త్రి

అల్లుడు రాసిన ఉత్తరంలోని వివరాలు తెలిసేక, మంగమ్మగారి మనసు చాలావరకు కుదుటబడ్డాది. పూజారిగారి మనసు కూడా, చాలావరకు తేలికయింది.

కొత్త సంవత్సరంలో, జనవరి నెల వచ్చింది. నందవలస భోగిపండగతో సందడిగా ఉండేది. తెల్లవారుఝామునే, భోగి మంటలు రగిలించి, గ్రామస్థులందరూ వాటి చుట్టూ నిలబడి, చలి కాచుకొంటూ, సరదాగా కబుర్లు చెప్పుకొంటూ ఉండేవారు. ఆడపిల్లలు, ముందుగా చేసి ఉంచిన, చిన్న చిన్న ఎండుపిడకల దండలను, ఆ మంటల్లో వేసి ఆనందించేవారు. పిల్లలు సందడిగా పరుగులిడుతూ, మంటలు, ఒక్కొక్కదాని దగ్గరా కొంతసేపు అరచేతులు కాచుకొని, మరో మంట వద్దకు పరుగులెడుతూ ఉండేవారు. పూజారిగారు కూడా తమకు దగ్గరలో నున్న భోగి మంటకు చేరువయి, అక్కడ ఉన్న వారితో, భోగి సంక్రమణాల ప్రత్యేకత గూర్చి చెపుతూండేవారు. వారందరూ అవి శ్రద్ధగా వింటూండేవారు. ఆ భోగి మంటలు, చలి కాచుకొడానికే కాక, తెల్లవారితే, స్నానాలకు వేడి నీళ్లు కాచుకోడానికి కూడా ఉపయోగపడుతూ ఉండేవి. ఆ మంటలలో పెద్ద ఇత్తడి బిందెలతో నీళ్లు సలసల కాగుతూ ఉండేవి. భోగి మంట వద్ద కొంతసేపు కాలక్షేపం చేసి, పూజారిగారు ఇంటికి తిరిగి వెళ్ళేరు.

అప్పటికే మంగమ్మగారు, స్నానం చేసి, వంటింట్లో పనిలో ఉండేవారు. పూజారి గారు వంటింట్లోకి వెళ్ళేరు. ఆయన్ని చూసి మంగమ్మగారు,

“ఏమండీ, బోగి మంటల సందడి అయిందా.” అని మందహాసంతో అన్నారు.

“ఇంకా ఉన్నారు, చలి కాచుకొంటూ; పెద్దవాళ్లదేమిటి గాని; పిల్లలది ఒకటే సందడి. వాళ్ళని చూస్తూంటే, నిరుడు మన బుజ్జిబాబు, వాళ్ళతో బాటు పరుగులెడుతూ ఆడుకోడం జ్ఞాపకమొచ్చింది. ఆ రోజు, అలా ఆడుకొంటూ ఉండేవాడిని, కొంతసేపయ్యాక, ‘నాన్నా ఇహ వెళదామా’ అంటే, నా ముఖంలోకి దీనంగా చూసేడు. నాకు అప్పుడు అర్థమయింది. ఇంకా కొంతసేపు ఉందామని అనుకొంటూ ఉండేవాడని. ‘సరే, మరి కొంతసేపయ్యాక రా. ఇవాళ పండగ. తలకి స్నానం చెయ్యాలి.’ అని చెప్పి, అప్పుడు ఇంటికొచ్చేను.”

“అవునండీ. ఇవాళ బుజ్జిబాబు ఇక్కడ ఉండి ఉంటే, వాడూ వాళ్లతో సందడిగా తిరిగేవాడు. మీకు జ్ఞాపకం ఉందా. నిరుటేడు, ఆ భోగి మంటలు మీద వేణ్ణీళ్ళు కాచమని, ఎంత సరదాపడ్డాడో. వాడి సరదా చూసి ఆఖరుకి, నేనే ఒక బిందెడు నీళ్లు తీసుకెళ్లి, ఆ మంటలమీద పెట్టేను. అవి కాగేక, ఎవరో ఒకాయన ఆ వేణ్ణీళ్ళ బిందెను మన ఇంటికి తీసుకొచ్చేడు.” అని గతాన్ని స్మరించుకున్నారు, మంగమ్మగారు. అంతలో ఏదో సంశయం వచ్చి, “ఏమండీ, ఆ ఊళ్ళో కూడా భోగీ మంటలు వేసుకొంటూ ఉంటారనుకొంటాను. లేకపోతే బుజ్జిబాబు బాధ పడుతూ ఉంటాడు.” అని, కొడుకును తలచుకొన్నారు.

“అయ్యో, చిన్నా పెద్దా, అన్ని ఊళ్ళలోనూ భోగీ మంటలు వేసుకొంటారు, మంగమ్మా, అందరికీ పండగే కదా. ఆ ఊళ్లోనూ వేసుకొనే ఉంటారు. గణపతి, వాళ్ళ వీధిలో చాలా మంది పిల్లలున్నారని రాసేడు. వాళ్ళందిరితో మనవాడూ, హడావిడిగా ఉండి ఉంటాడు.” అని భార్యకు హామీ ఇచ్చేరు, పూజారిగారు.

“అలా అయితే ఫరవాలేదు… అన్నట్టు, ఏమండీ, సాయంకాలం సీతాలుకి భోగిపళ్లు పోయాలి. జ్ఞాపకం ఉందా.”

“జ్ఞాపకముంది. రేగుపళ్ళు, దమ్మిడీలు గురించి ఒకాయనకు చెప్పేను. ఇవాళ దేవాలయానికి వచ్చినప్పుడు తెస్తాడనుకొంటాను.”

“చెప్పేరు కదా. ఒకవేళ మర్చిపోయుంటే జ్ఞాపకం చేద్దామని అన్నాను.”

“సరే, నేను స్నానానికి వెళతాను. నువ్వు వచ్చే లోగా, నేను నూని పిండి, ఎక్కించుకొంటూ ఉంటాను.” అని వెళ్లబోతుంటే,

“అలా చేస్తూండండి. నేను పది నిమిషాల్లో వచ్చి, వీపు నలిచి, తల మీద పుల్ల పోస్తాను.” అని సలహా ఇచ్చేరు, మంగమ్మ గారు. పూజారిగారు నిష్క్రమించేరు.

మరో నెల గడిచింది. స్కూళ్ళు క్రమక్రమంగా తెరవడం ప్రారంభమయింది. బుజ్జిబాబు స్కూలు కూడా తెరిచేరు. ఆ వేళ శాస్త్రిగారు స్వయంగా బుజ్జిబాబుతో బాటు, స్కూలుకు వెళ్ళేరు: పరిస్థితులేమిటో స్వయంగా తెలుసుకోడానికి. అన్ని క్లాసుల పిల్లలూ రావడం, సజావుగా క్లాసులు ప్రారంభం కావడం గమనించి, సంతృప్తి చెందేరు. ఇంటికి వెళ్ళేక, భార్యకు ఆ విషయం చెప్పేరు. అది విని వరలక్ష్మి, “మీరు స్వయంగా వెళ్లడం మంచి పని చేసేరు. దేముడి ధర్మాన్న, వాడి చదువుకు ఆటంకం తీరింది. నాకో పెద్ద బెంగ తీరింది. ఏమిటి చెప్మా, చదువుకొంటాడని తీసుకొస్తే, ఇలా అయింది; అమ్మా నాన్నగారూ, ఎంత బెంగ పెట్టుకొంటున్నారో, ఏమిటో; అని మనసులో ఇన్నాళ్లూ బెంగగా ఉండేది. ఆ బెంగ తీరింది. మా నాన్నగారికి ఇవాళే ఉత్తరం రాయండి. వాళ్ళ బెంగ కూడా తీరుతుంది.” అని తన సంతోషం వ్యక్తపరచింది.

“వరాలూ, నాకూ మనసులో కొంత చింత ఉండేది. కానీ, ఏమీ చేయలేని పరిస్థితి. నువ్వు బెంగగా ఉండడం, నాకు అర్థమవుతూ ఉండేది. అంచేత బయటకు చెపితే, నువ్వు మరీ బెంగపడతావని, నీకు ధైర్యం చెపుతూ ఉండేవాడిని. ఏదైనా…నువ్వన్నట్టు, ఆ పరమేశ్వరుని దయ. బుజ్జిబాబు మళ్ళీ బడికి వెళ్లడం ప్రారంభించేడు. మామగారికి ఇప్పుడే రాస్తాను. దాని కోసమే, దారిలో పోస్టు కార్డు కొనుక్కొని వచ్చేను.” అని చెప్పి మామగారికి ఉత్తరం రాయడానికి వెళ్ళేరు, శాస్త్రిగారు.

శాస్త్రిగారు రాసిన ఉత్తరం సుమారు మూడు వారాలకు, పూజారిగారికి చేరింది. ఆయన ఉత్తరంలోని విషయాలు: బుజ్జిబాబు బడి, తెరిచేరని; వాడు బడికి వెళ్లడం ప్రారంభించేడని; మరి ఎటువంటి సమస్యా లేదని; భార్యకు చదివి వినిపించేరు. ఇద్దరికీ బెంగ తీరింది. ఇద్దరి ముఖాలూ వికసించేయి. మంగమ్మగారు, పూజామందిరంలోని ఒక చిన్న గుడ్డలో కట్టి ఉంచిన ముడుపును, తీసుకొచ్చి, కళ్ళకి అద్దుకొంటూ, భర్త చేతిలో ఉంచి, “పిల్లడి బడి తెరవగానే, సమర్పించుకొంటానని ముడుపు కట్టేనండీ. ఇది దేవాలయంలో రాములవారి హుండీలో వేసీయండి.” అని వినయంగా చెప్పేరు.

“మంగమ్మా, నేనూ మొక్కుకొన్నాను. బుజ్జిబాబు, మళ్ళీ బడికి వెళ్లడం ప్రారంభిస్తే, ఆంజనేయస్వామి మెడలో వడల మాల వేస్తానని.” చిరునవ్వుతో పూజారిగారు తన మొక్కుబడి విషయం చెప్పేరు.

“మంచిపని చేసేరు. పిలిస్తే పలుకుతాడండీ, ఆ స్వామి. రేపే వేద్దాం, ఆయన మెడలో వడల హారం.” అని భర్తకు హామీ ఇచ్చేరు, మంగమ్మగారు.

ఆ శుభవార్త, జమీందారుగారికి తెలియబరిచేరు, పూజారిగారు. ఆయన తన సంతోషాన్ని వ్యక్తబరిచేరు.

ఆ సంవత్సరం ఉగాది పండగ వచ్చింది. దేవాలయంలో ఆ ఉదయం, పూజ వేళకు, జనం రోజూ కన్నా, ఎక్కువమంది వచ్చేరు. ఎంచేతంటారా: ప్రతీ ఉగాదినాడు, పూజారిగారు సంవత్సరఫలాలు, కొత్త పంచాంగం నుండి చదివి వినిపిస్తూ ఉండేవారు. అవి వినడానికే వారందరూ ఆనాడు చేరేరు. ముఖ్యముగా వాళ్ళు తెలుసుకోదలచినది, ఆ సంవత్సరంలో వర్షాలు బాగా పడతాయా, లేదా; పంటలు సమృద్ధిగా పండుతాయా లేదా, అంతే. వారెవరికీ రాశి ఫలాలు, తెలుసుకోడానికి ఉత్సాహం ఉండేది కాదు.

ఆ రోజు సాయంత్రం, పూజారి గారు, ఇంట్లో కొత్త పంచాంగం చూస్తూ ఉండేవారు. మంగమ్మగారు ఆయన దరి చేరి తీరిగ్గా ఆసీనులయ్యేరు.

“ఏమండీ, కొత్త పంచాంగం చూస్తున్నారా.” అని సంభాషణ ప్రారంభించేరు.

“అవును. బుజ్జిబాబు రాశి ఫలాలు చూస్తున్నాను.” అని పంచాంగంలోకి చూస్తూ, జవాబిచ్చేరు, పూజారిగారు.

“ఎలా ఉందండీ, ఈ సంవత్సరం, వాడికి.”

“చదువు బాగా సాగాలి. విద్యా కారకుడు గురుడు, ఎల్లుండి సప్తమినాడు, మనవాడి చతుర్థ స్థానంలోకి వెళతాడు. చతుర్థం, విద్యాస్థానం. అంచేత వాడి చదువు సాఫీగా వెళ్ళాలి.” అని బుజ్జిబాబు చదువు విషయంలో భవిష్యవాణి పలికేరు.

“ఏమండీ, వరాలుకు పిల్లలెప్పుడు పుడతారో కూడా చూడండి. ఇన్నాళ్లయింది, ఇంకా దాని కడుపు పండలేదు. దాని ఈడు వాళ్లకి, ఇద్దరేసి కూడా పుట్టీసేరు. దాని కడుపున కూడా ఓ పిల్లాడు పుడితే, బాగుండును.” మంగమ్మగారి మనసులో ఆందోళన.

“అలా గాభరా పడకు మంగమ్మా. మా చిట్టెత్తకి, పెళ్లయిన పదిహేను సంవత్సరాలకి, మొదటి సంతానం కలిగిందట. మన పిల్లకీ పుడతారు. నేనూ ఆ విషయమే చూద్దామనుకొంటున్నాను. దాని జాతకంలో, ఏ గ్రహం ఏ రాశిలో ఉందో, సరిగ్గా జ్ఞాపకం రాడం లేదు. పిల్లాడి జాతకం ఈ మధ్యనే చూసేను. అందుకు జ్ఞాపకం ఉంది. మన పిల్లల జాతకాలు, ఎక్కడో రాసి ఉంచేను. అవి వెతికి చూడాలి. తరవాత చూస్తాను. దేవాలయానికి వెళ్ళాలి. అక్కడ పని అయ్యేక, జమీందారుగారి బంగళాకు కూడా వెళ్ళాలి; పంచాంగశ్రవణం కోసం. అవయ్యి, ఇంటికొచ్చేసరికి కొంత ఆలస్యం అవ్వొచ్చు.” అని, దేవాలయానికి వెళ్లే ప్రయత్నాల కోసం, లేచేరు, పూజారిగారు.

ఒక రోజు రాత్రి, పూజారిగారు గదిలో కూర్చొని, పంచాంగం చూస్తూ, తెల్లకాగితం మీద ఏదో రాసుకొంటూ ఉండేవారు. కొంతసేపట్లో, అక్కడికి మంగమ్మగారు వచ్చేరు. భర్త, పంచాంగంలో ఏమిటి చూస్తున్నారో తెలుసుకోదలచి, “ఏమిటండీ చూస్తున్నారు.” అని కుతూహలంతో అడిగేరు.

“వీరభద్రయ్య…నీకు తెలుసనుకొంటాను.”

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here