కాలంతోబాటు మారాలి – 4

0
12

[గణపతిశాస్త్రి బుజ్జిబాబుకి చెరుకురసం తాగిస్తారు. వారు ఎక్కాల్సిన బస్సు ఆలస్యం అవుతుంది. విజయనగరం వెళ్ళే ఒక బస్సు వచ్చినా, అందులో ఖాళీ లేకపోవడంతో, విశాఖపట్నం వెళ్ళే మరో బస్ వస్తే అది ఎక్కుతారు గణపతి, వరలక్ష్మి, బుజ్జిబాబు. ఇబ్బందులు పడి విజయనగరం ఇంటికి చేరుతారు. గణపతిశాస్త్రి గారి పక్క ఇంటి భీమశంకరంగారింటికి చుట్టాలు వస్తే – వాళ్ళ రెండో అబ్బాయి పార్వతీశాన్ని గణపతిశాస్త్రి వాళ్ళింట్లో పడుకోమంటాడు. చుట్టాలు వెళ్ళాక కూడా, పార్వతీశాన్ని తమ ఇంటికి పంపవచ్చని అంటారు గణపతిశాస్త్రి. నందవలసలో వైద్యులు లేక ఇబ్బంది అవుతుంది. ఆ ఊరికి వారానికి రెండు రోజులుండేలా దయానిధి పట్నాయకు అనే వైద్యుడిని ఏర్పాటు చేస్తారు జమీందారు గారు. గణపతిశాస్త్రి ఇంట్లో పార్వతీశానికి, బుజ్జిబాబుకి స్నేహం కుదురుతుంది. బుజ్జిబాబు మూడో తరగతిలో చేరుతాడు. బుజ్జిబాబు స్కూల్లో చేరేముందు అక్కా బావగార్లు ఊరంతా తిప్పి చూపించారు. బుజ్జిబాబు చదువు పురోగతి గురించి అత్తమామలకి ఉత్తరం ద్వారా తెలుపుతారు గణపతి. మధ్యలో సహయ నిరాకరణ ఉద్యమం ప్రభావం వల్ల బడులు మూతబడతాయి. బుజ్జిబాబు చదువు కుంటుబడుతుంది. కొన్నాళ్ళకి మళ్ళీ స్కూళ్ళు తెరుస్తారు. బుజ్జిబాబు చదువుకు ఆటంకం తీరుతుంది. ఉగాదికి పిల్లాడి రాశిపలాలు చూసి అంతా బావుందని అంటారు పూజారిగారు. భర్త పంచాంగం చూస్తుంటే, కుతూహలంతో ఏం చూస్తున్నారని అడుగుతారు మంగమ్మ. వీరభద్రయ్య తెలుసుగా అంటారు పూజారి గారు. – ఇక చదవండి]

“తెలుసండీ. మనింటికి ఈ మధ్య, మూడు నాలుగు మార్లు వచ్చేడు.”

“అతగాడి కూతురుకు, పెళ్లి కుదిరిందట. ముహూర్తం పెట్టమని అడిగేడు. ఆ పనిలో ఉన్నాను.”

“ఏమండీ, బుజ్జిబాబు ఒడుగు విషయం కూడా చూడండి. ఈ సంవత్సరం చేద్దామన్నారు కదా.”

“అవును. అదీ చూడాలి. ముందు వాడి ఎండాకాలం శలవులు, ఎప్పటినుంచో కనుక్కోవాలి. రెండు మూడు ముహూర్తాలు పెట్టి ఉంచుతాను. వాడికి ఎప్పుడు కుదురుతుందో చూసుకొని, నిర్ణయించొచ్చు.”

“ఈ విషయం, గణపతికి ముందుగా తెలియబరచాలండి. అతడు కూడా తన పనుల్ని, ముహూర్తాన్ని బట్టి, ఏర్పాటు చేసుకోవాలి కదా.”

“అవును, నిజమే. నేను పెట్టిన ముహూర్తాలు కూడా, ఒకమారు అతణ్ణి చూడమంటాను.”

“సరే, వెళతాను. వంటింట్లో పని ఉంది.” అని మంగమ్మగారు నిష్క్రమించేరు.

ఆ తరువాత కొద్ది రోజులకు, విజయనగరము నుండి, అల్లుడు రాసిన ఉత్తరం, పూజారిగారికి అందింది. అక్కడ వాళ్ళు ముగ్గురూ క్షేమంగా ఉన్నారని; బుజ్జిబాబు చదువు నిరాటంకంగా సాగుతున్నాదని; క్లాసు పరీక్షల్లో, బుజ్జిబాబు మంచి మార్కులు తెచ్చుకొన్నాడని; ముఖ్యంగా, లెఖ్ఖల్లో నూటికి తొంభై మార్కులు వచ్చేయని, తెలియబరుస్తూ రాసిన ఉత్తరమది. ఆ వివరాలు తెలిసి, దంపతులిద్దరూ చాలా సంతోషించేరు. మంగమ్మగారికి బుజ్జిబాబు మీద మనసు పోయింది. అన్నాళ్లు, వాడిని వదిలి ఆవిడ ఎప్పుడూ ఉండలేదు. తన మనసులోని ఉద్దేశం తెలియబరుస్తూ ఆవిడ భర్తతో, “ఏమండీ, బుజ్జిబాబుని, ఒకమారు వెళ్లి చూస్తే, బాగుండునండీ. నాకు వారం రోజులై, రాత్రుళ్ళు వాడే కలలోకి వస్తున్నాడు. సీతాలు కూడా మొదలు పెట్టిందండీ. అమ్మా, అన్నయ్య ఎప్పుడు వస్తాడని.” అని కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యేరు, మంగమ్మగారు.

“నిజమే, నాకూ చూడాలనే ఉంది. ఊరు వదిలి వెళ్ళాలీ అంటే, ఇక్కడ రాములవారి సేవకి ఏర్పాటు చేసి వెళ్ళాలి.” అని పూజారిగారు కూడా తన మనసులోని మాట బయటపెట్టేరు.

“మోనిరుడు, మీ పిన్నిగారి మనవడి పెళ్ళికి, మనం కోటబొమ్మాళి వెళ్ళేం కదా. అప్పుడు ఒకాయన, వచ్చేరు. ఆయన్ని పిలిస్తే వస్తారనుకొంటాను.” మంగమ్మగారి సలహా.

“ఆయన, సాలూరులో ఉంటారు; కాశీపతిగారు. ఆ ఊళ్ళో కొందరు కాశీ, రామేశ్వరం వెళ్ళినప్పుడు, ఆ పుణ్యక్షేత్రాలలో దగ్గరుండి పూజలు చేయించడానికి, అప్పుడప్పుడు, వాళ్ళతో బాటు, ఆయన వెళుతూ ఉంటారు. ఆయన్ని అడిగి చూడాలి; వీలవుతుందేమో. వార్త తెలిస్తే, ఆయన తప్పక వస్తారు. ఎంచేతంటే; క్రిందటిమాటు ఆయన వచ్చినప్పుడు, జమీందారుగారు, బాగా ముట్టచెప్పేరు. వెళ్తున్నప్పుడు, నాతో అన్నారు కూడా, ‘శర్మగారూ, మీకు ఎప్పుడు అవసరం వచ్చినా, తెలియబరచండి; నేను తప్పక వస్తాను’, అని.”

“అయితే, ఇవాళే, ఆయనికి ఉత్తరం రాయండి.” అని మంగమ్మగారు సలహా ఇచ్చేరు.

“అలాగే,” అన్నారు పూజారిగారు.

విజయనగరం ప్రయాణానికి, పూజారిగారు, మంచిరోజు చూసేరు.

ఆ రోజు సాయంత్రం, రాములవారి పూజా సమయంలో, అక్కడ ఉన్న కొందరు గ్రామస్థులలో ఒకాయన, ఆ మరునాడు, ఒక రోజు పని మీద సాలూరు వెళుతున్నట్లు, పూజారిగారికి తెలిసింది. ఆయన చేతికి, సాలూరులో ఉన్న పురోహితులు కాశీపతిగారికి ఉత్తరం రాసి ఇచ్చేరు. అందులో, ఆయన తమ విజయనగరం ప్రయాణం వివరాలు తెలియబరుస్తూ, ఆ రోజుల్లో నిరాటంకంగా రాములవారి పూజలు జరిపించడానికి నందవలస రాగలరేమో తెలియజేయమన్నారు. రాగలిగితే, రెండు రోజులు ముందుగా రమ్మని, అభ్యర్ధించేరు. ఆ ఉత్తరం అందుకొని, తప్పక రాగలనని తెలియబరుస్తూ, ఉత్తరం ఇచ్చిన ఆసామీకే, జవాబు ఇచ్చేరు.

అల్లునికి కూడా, విషయాలన్నీ తెలియబరుస్తూ, ఉత్తరం రాసేరు. వారు, ఏ దినం బయలుదేరుతున్నారో, తెలియబరిచేరు. బస్సు, విజయనగరం ఎన్ని గంటలకు చేరుతుందో తెలియదు గావున, బస్సు స్టాండుకు వచ్చి ఎదుర్కొనే ప్రయాస పడవద్దని సలహా ఇచ్చేరు. తనకు ఇంటి చిరునామా తెలుసుగావున, ఎట్టి ఇబ్బందీ ఉండదని, కూడా తెలియజేసేరు.

ఇంట్లో మంగమ్మగారు, ఒకటే సందడి. విజయనగరం, తమతో బాటు తినడానికి ఏమిటేమిటి తీసుకెళ్లాలో, రోజూ ఆలోచిస్తూ ఉండేవారు. సీతాలుకు హితబోధ మొదలుపెట్టేరు. “మనం, అన్నా, అక్కల ఊరు వెళుతున్నాం. నువ్వు అక్కడ బుద్ధిగా ఉండాలి. అన్నని చదువుకోకుండా అల్లరి పెట్టకూడదు. అది పెద్ద ఊరు. ఎవరికీ చెప్పకుండా వీధిలోకి వెళ్ళకు.” అని హెచ్చరిక చేస్తూ ఉండేవారు. చిన్నదానికి కూడా ఒకటే సందడి. తోటి చెలికత్తెలందరితో, “నేను మా అక్కయ్యగారి ఊరు వెళ్తున్నాను. ఆ ఊల్లో మా అన్నకూడా ఉన్నాడు. వాడక్కడ పె…ద్దక్లాసులు చదువుతున్నాడు. మా అమ్మ చెప్పింది. ఆ ఊరు చా… లా పెద్దదని. మా అక్క కూడా చెప్పింది. వాల్ల ఊళ్ళో ఎన్నో… ఉన్నాయని. నాకవన్నీ… మా అక్క చూపెడుతుంది.” అడిగిన వాళ్లకి, అడగని వాళ్ళకీ, ఆ దండకం వినిపిస్తూండేది, సీతాలు.

కాశీపతి గారు, పూజారి గారు కోరినట్లు, రెండు రోజుల ముందే, నందవలస చేరుకొన్నారు. ఆయన రాకకు ముందుగానే, పూజారి గారు జమీందారు గారికి, తను తలబెట్టిన ప్రయాణం గురించి, అయన లేని రోజుల్లో, నిత్యం రాములవారి సేవకు చేసిన ఏర్పాట్లు, తెలియజేసి, ఆయన అనుమతి తీసుకొన్నారు.

పూజారిగారి ప్రయాణం రోజు వచ్చింది. ఆయన, బుజ్జిబాబు ఉపనయనానికి మూడు మంచి ముహూర్తాలు ఎంపిక చేసేరు; విజయనగరంలో అల్లునితో, ఆ విషయం చర్చించడానికి. మంగమ్మగారు, లడ్డుండలూ జంతికలూ చక్కిలాలూ, తయారుచేసినవన్నీ రేకుపెట్టిలో జాగ్రత్తగా పట్టించేరు. దారిలో సీతాలు తినడానికి, పైన ఒక గుడ్డసంచీలో కొన్ని భద్రపరిచేరు. ప్రయాణం మొదలయింది. అదృష్టవశాత్తు, ఆ రోజు రెండు బస్సులలోనూ దంపతులిద్దరకూ కూర్చోడానికి సీట్లు దొరికేయి. సీతాలును, ఇద్దరూ మార్చి మార్చి, ఒళ్ళో కూర్చోబెట్టుకొంటూ ఉండేవారు.

అటు విజయనగరంలో, వరలక్ష్మికి ఒకటే సందడి. అమ్మా నాన్నగారూ, ఏ సమయానికి వస్తారో అని, వెయ్యికళ్లతో ఎదురు చూస్తూ ఉండేది. వాళ్ళు చేరుకోగానే తినడానికి, వేడి వేడిగా పకోడీలు చెయ్యడానికి, అన్నీ సిద్ధం చేసి ఉంచింది. అమ్మా నాన్నగారూ వస్తున్నారని, బుజ్జిబాబు ఉబ్బితబ్బిబ్బయిపోతూ ఉండేవాడు. ప్రతీ అరగంటకు, వీధి తలుపు తీసి, చూస్తూ ఉండేవాడు; అమ్మా నాన్నగారు, వస్తున్నారేమో అని. అది గమనించిన వరలక్ష్మి, “బుజ్జీ, అమ్మా నాన్నగారు వచ్చేసరికి, ఇంకా చాలా వేళవుతుంది. నీకు జ్ఞాపకముందా, మనం ఆవేళ ఎంత ఆలస్యంగా వచ్చేమో. గాభరా పడకు. సాయంకాలానికి వచ్చేస్తారులే.” అని తమ్ముడికి చెప్పింది. ఆ సలహా, బుజ్జిబాబుని, ఓ పది నిముషాలు ఆపింది. మళ్ళీ, మొదలుపెట్టేడు. ఓ గంటకు, అమ్మా నాన్నగారు, దూరమునుండి వస్తూండడం, బుజ్జిబాబు, కళ్ళలో పడ్డాది. ఆ సమయంలో, వాడి సందడి, ఇంతా అంతా కాదు. వాడి ముఖం వికసించుకుపోతూ ఉండేది. ఒక్కమారు పరుగున వంటింట్లో ఉన్న అక్కకు, దూరంనుండే , “అక్కా, అమ్మా నాన్నగారు వస్తున్నారు.” అని బిగ్గరగా ఒక ప్రకటన చేసి, పరూగున వీధి గుమ్మం చేరుకొన్నాడు. ఆ సమయంలో వరలక్ష్మి, రాత్రిభోజనానికి, రోట్లో ఏదో రుబ్బుతూ ఉండేది. తమ్ముడి వార్త వినగానే, ఒక్కమారుగా రుబ్బుతున్న కార్యక్రమాన్ని ఆపి, పక్కనే చెంబులో ఉన్న నీళ్లతో చెయ్యి తొందరగా కడుక్కొని, వడివడిగా పడకగదిలో ఉన్న భర్తకు ఆ సమాచారం తెలియజేసి, తానూ పరుగున వీధిగుమ్మం చేరుకొంది. అత్త మామలు వచ్చేరన్న వార్త వినగానే, కుర్చీకి వ్రేలాడుతున్న కండువాను భూజానికెక్కించుకొని, గణపతిశాస్త్రి గారు కూడా, గబగబా వీధిగుమ్మం చేరుకొన్నారు.

గుర్రపు బండీ, గణపతిశాస్త్రి గారి గుమ్మం ముందు ఆగింది. అందులోనుండి పూజారిగారు ముందుగా దిగేరు. బుజ్జిబాబు వెళ్లి, ఆయన కాలు కౌగిలించుకొన్నాడు. ఆయన వాణ్ణి ఎత్తుకు ముద్దులాడేరు. వరలక్ష్మి బండి వద్దకు వెళ్ళింది. అంతలో మంగమ్మగారు కూడా దిగేరు. వరలక్ష్మి, బండిలోనున్న చెల్లిని, దింపుతూ ముద్దులాడి ఒక చేత్తో ఎత్తుకొని, మరో చేత్తో తల్లిని చేరదీసుకొని, “అమ్మా, ప్రయాణం బాగా అయిపోయిందా.” అని కుశలప్రశ్నలు వేస్తూండగానే, పూజారిగారి చేతులలో నున్న, బుజ్జిబాబు, “అమ్మా” అని ఆతృతగా అనడంతో పూజారిగారు వాణ్ణి క్రిందకు దింపేరు. దిగీదిగడంలో, తల్లి చెంత చేరి, వంగి కాళ్ళు గట్టిగా కౌగిలించుకొన్నాడు. ఆవిడ వంగి, తనయుడి తలపై ముద్దులవర్షం కురిపించేరు. ఆ సమయంలో, శాస్త్రిగారు, మామగారి చెంత చేరి, “ప్రయాణం బాగా జరిగిపోయిందా. దారిలో ఇబ్బందులేవీ పడలేదు కదా.” అని కుశలప్రశ్నలు వేసేరు. “ఆ రాములవారి దయవల్ల, ఏ ఇబ్బందీ కలగలేదు. మా ఊరువాళ్ళు ఇద్దరు, మాతో ఇక్కడిదాకా ప్రయాణం చేసేరు. వాళ్ళు తోడుండేవారు. దారిలో బాగా సాయబడ్డారు.” అని తమ అనుభవాన్ని అల్లునికి తెలియజేసేరు, పూజారిగారు.

అందరూ ఇంట్లోకి వెళ్ళేరు. మామగారూ అల్లుడూ, కూర్చొని మాట్లాడుకొంటూ ఉండేవారు. అంతలో, వరలక్ష్మి కుండలోని చల్లటి నీళ్లు ఓ గ్లాసుతో తెచ్చి, తండ్రికందిస్తూ, “నాన్నా, అమ్మ చెల్లికి స్నానం చేయిస్తోంది. మీరు కూడా స్నానం చేసీయండి. వేణ్ణీళ్ళు పెట్టి ఉంచేను.” అంది.

“వేణ్ణీలేమిటమ్మా, ఉక్క మాడిపోతూ ఉంటే. మీ అమ్మ వచ్చి, పెట్టెలోనుంచి తువ్వాలు పంచా తీసి ఇస్తే, నూతిదగ్గర నిలబడి నాలుగు చేదల నీళ్లు తలమీంచి పోసుకొంటే, ప్రాణం లేచి వస్తుంది” అని చెప్పి, తన నిర్ణయం తెలియజేసేరు, పూజారిగారు.

“సరేలెండి, అలాగే చెయ్యండి. మీరు తింటారని, పకోడీలు చేద్దామనుకున్నాను. అమ్మ ఇప్పుడు అవేవీ వద్దంది. వేగిరం భోజనం చేసి పడుక్కొంటాను అంది. భోజనం కూడా తయారైపోతోంది.” అని చెప్పి, వంటింట్లోకి వెళిపోయింది, వరలక్ష్మి.

రాత్రి భోజనాలయ్యేయి. ప్రయాణ బడలికతో అలసిపోయి, పూజారిగారు, మంగమ్మగారు, సీతాలు, తొందరగా పడుకొన్నారు. ఆ రాత్రి, బుజ్జిబాబు తల్లి పక్కలో చేరేడు.

ఆ మరునాడు, ఉదయం కాఫీ ఫలహారాదులు ముగిసేక, మామగారూ అల్లుడూ, బుజ్జిబాబు చదువు విషయం మాట్లాడుకున్నారు. బుజ్జిబాబు పెద్ద పరీక్షలు అప్పటికి అయిపోయేయి. మూడో తరగతి పాసయ్యేడు. ఆ సంగతి మామగారికి తెలియజేసేరు, శాస్త్రిగారు. ఆ శుభవార్త వినగానే, పూజారిగారు, “మీ పుణ్యమా అని, వాడి చదువు నిరాటంకంగా సాగింది. ఆ ఊళ్ళో ఉండిఉంటే, ఏమీ తేలకుండా ఇంట్లోనే ఉండేవాడు.” అని తన అల్లునికి ధన్యవాదాలు తెలియజేసేరు.

“వాడికి చదువు ప్రాప్తి ఉంది, మామగారూ. మధ్యలో పెద్ద ఆటంకమే వచ్చింది. ఆ వెంకటేశ్వరస్వామి దయవల్ల, సంవత్సరం నష్టం కాకుండా, పరీక్షలు పాసయి, మీద తరగతికి వెళ్ళేడు. మనవాడు పాసయ్యేడని తెలిసేక, నేను స్వయంగా వెళ్లి, వాళ్ళ గురువుగారిని అడిగి తెలుసుకున్నాను. బుజ్జిబాబు పరీక్షల్లో ఎలా రాసేడని. ఆయన, వాడికి అన్నింటిలో మంచి మార్కులు వచ్చేయన్నారు. లెఖ్ఖల్లో ఫస్టు మార్కు, నూటికి నూరూ వచ్చేయట. చిన్న ఊరయినా, ఆ ఊళ్ళో గురువుగారు గట్టి పునాది వేసేరని కొనియాడేరు, ఆయన.

కొడుకు, తెలివితేటలుగా చదువుకొంటున్నాడని తెలిసి, పూజారిగారు మనసులో ఎంతో సంతోషించేరు. ఆయన విజయనగరం వెళ్లడంలో ముఖ్య ఉద్దేశం; బుజ్జిబాబును చూడడానికే కాకుండా, తను తలపెట్టిన ఉపనయన విషయం అల్లునితో చర్చించడం కూడా. అవేకాక, ఆ శుభకార్యానికి అల్లుని స్వయంగా ఆహ్వానించడం కూడా కలసివస్తుందని, అభిప్రాయపడ్డారు. తను పెట్టిన, మూడు ముహూర్తాలూ, అల్లునితో చర్చించేరు. వాటిలో ఏది ఆయనకు సదుపాయంగా ఉంటే, ఆ ముహూర్తానికే, బుజ్జిబాబుకు ఉపనయనం చేస్తానన్నారు. శాస్త్రిగారు, ఆ మూడూ, బాగానే ఉన్నాయన్నారు. వాటిలో, ఓ ముహూర్తం రోజున, తన తల్లిగారి ఆబ్దికం ఉండడం మూలాన్న, వీలుపడదన్నారు. మిగిలిన రెండింటిలో ఏదయినా, తనకు సదుపాయమే అన్నారు. పూజారిగారి దంపతులిద్దరూ, అల్లుని వీలుచూసుకొని ఓ నెల ముందుగా రావలెనని కోరేరు. లాంఛనప్రాయంగా కూతురిని కూడా ఆహ్వానించేరు. వెళ్లిన వెంటనే, ఆహ్వాన పత్రిక పంపిస్తామన్నారు. శాస్త్రిగారు, తను ఒక వారం ముందుగా రాగలనని, వినమ్రంగా చెప్పేరు. అక్కడ పనులలో సహాయపడడానికి, వరాలును నెల ముందుగా తప్పక పంపుతామన్నారు. ఉపనయన కార్యక్రమంలో కావలిసినవి ఏవైనా అవసరమయితే, మొహమాటపడక తెలియజేయమన్నారు. తాము వచ్చినప్పుడు తీసుకొస్తామన్నారు.

పూజారిగారు, అల్లుని ఇంట ఓ వారం రోజులు ఉందామని వచ్చేరు. కాని, కూతురు, అల్లుని అభ్యర్థన మేరకు, మరో వారం పొడిగించేరు. ఆ వారం తరువాత, పూజారిగారి దంపతులు, బుజ్జిబాబు సీతాలుతోబాటు, నందవలస ప్రయాణమయ్యేరు. సాయంత్రం నాలుగు గంటలకు, వారు నందవలస చేరుకొన్నారు.

స్వగ్రామంలో అడుగు పెట్టిన క్షణం నుండీ, బుజ్జిబాబుకు ఒకటే తహతహ. ఎంత వేగరం, పాత మిత్రులను కలుసుకొని, వారందరితో తన స్కూలు కబుర్లు చెబుదామా అని. స్నానం చేసిన వెంటనే పరుగున వీధిలోకి వెళ్లి, ఇద్దరు ముగ్గురు స్నేహితులను కలిసేడు. వాళ్ళతో తన విజయనగరం కబుర్లు, అత్సుత్సాహంతో చెప్పనారంభించేడు. శర్మ విజయనగరం నుండి వచ్చేడని, మిగిలిన మిత్రులకు సమాచారమందింది. వాళ్ళూ వచ్చి, శర్మను చుట్టుముట్టేరు. వారందరి రాకతో, శర్మ ఉత్సాహం మరో మెట్టు మీదకు వెళ్ళింది. “మా స్కూలు ఎంత పెద్దదో తెలుసా. మన వీధి కన్నా చాలా…పెద్దది.” అని నేలకు సమాంతరంగా రెండు చేతులూ చాపి చూపేడు. “మా స్కూల్లో ఎన్నో క్లాసులు ఉన్నాయి. నేను ఆ క్లాసులన్నీ…చదువుతానని మా అక్క చెప్పింది. మా స్కూల్లో టీచర్లు ఎంతమందో ఉన్నారు.” అని ఇంకా ఏవో చెప్పబోతూంటే, చుట్టూ చేరిన ఒకడు, “శర్మా, నువ్వు రోజూ బడికి ఎలా వెళ్తావురా.”అనీ అనడంతోనే, “మా స్కూలుకు నేను రోజూ మా వీధిలోని ఫ్రెండ్సుతో వెళుతూ ఉంటాను.” అని పల్లెటూరు మిత్రునకు, పట్నవాసి చెప్పేడు.

పూజారిగారి దూరపు బంధువు, నరసమ్మగారు అని ఒకావిడ, నందవలసకు నాలుగు గంటల బస్సు ప్రయాణంలో ఉండేవారు. ఆవిడ ఒంటరి. అందరూ ఆవిడను, ‘పిన్నిగారు’ అనేవారు. ఆవిడకు నికరాదాయం ఉండేది కాదు. పూజారిగారి భార్య, గతంలో రెండు మూడు సార్లు, పుట్టింటికి వెళ్ళవలసి వచ్చింది. ఆ రోజుల్లో నరసమ్మగారు నందవలస వచ్చి, పూజారిగారికి దేవాలయ పనులలోనూ, ఇంటివద్ద వంట చేసిపెట్టడంలోనూ, సహాయపడేది. పారితోషికం బాగా లభ్యమయ్యేది. పూజారి గారి కోరిక మేరకు, ఆవిడ ఉపనయనమునకు ఆరు వారాల ముందు, వచ్చింది. ఉపనయనం సుమారు నెల్లాళ్ళు ఉందనగా, ఓ మంచిరోజున, వరలక్ష్మి పుట్టిల్లు చేరుకొంది. ఆమె రాకతో, ఉపనయనం పనులు ఊపందుకున్నాయి.

పూజారిగారు, బంధువులందరకు పోస్టు కార్డు పైన ఆహ్వానాలు రాయడం ప్రారంభించేరు. రాయడం ముగించిన పోస్టుకార్డులకు, నాలుగు చివర్లలోనూ, జాగ్రత్తగా పసుపు పెడుతూ ఉండేవాడు, బుజ్జిబాబు. జమీందారుగారి కొరకై, పూజారిగారు ఒక తెల్లకాగితం మీద ప్రత్యేకంగా శుభలేఖ రాసేరు. ఉపనయనానికి పది రోజుల ముందుగా, ఆ శుభలేఖ పట్టుకొని, జమీందారుగారిని స్వయంగా ఆహ్వానించడానికి, పూజారిగారు, మంగమ్మగారు, ఆయన బంగళాకు వెళ్ళేరు. పూజారిగారు, జమీందారుగారికి వినయంగా శుభలేఖ అందిచ్చేరు. ఉపనయనమునకు ఇరువురూ విచ్చేసి, వటువును ఆశీర్వదించమని, మనవి చేసుకొన్నారు. వారిరువురూ ఉపనయనమునకు తప్పక వచ్చెదమన్నారు. తమ ఇంటిముందు పందిళ్లు వేయడానికి ఏ రోజో తెలియజేస్తే, ఆ దినం తమ పనివారు వచ్చి పందిళ్లు వేయగలరని, జమీందారుగారు పూజారిగారికి చెప్పేరు. ఆలోగా జమీందారుగారి భార్య, లోనికి వెళ్లి, ఒక వెండిపళ్లెంలో, ఒక కొత్త జరీచీర, జాకట్టుగుడ్డ, పసుపు, కుంకం, పెట్టి తెచ్చి, స్వయంగా పూజారిగారి భార్యకు అందజేసేరు. వేరే, కొన్ని కరెంసీ నోట్లు ఉన్న ఒక కవరును తెచ్చి, జమీందారుగారికి అందజేసేరు. ఆయన ఆ కవరును పూజారిగారి చేతిలో పెట్టేరు. పూజారిగారు, మంగమ్మగారు జమీందారుగారి దంపతులవద్ద వినయంగా శలవు తీసుకొన్నారు.

ఉపనయనానికి పది రోజులు ముందుగానే, గణపతిశాస్త్రి గారు నందవలస చేరుకొన్నారు. ఆయనతో బాటు నలుగురు వంటవాళ్లు కూడా వచ్చేరు. మామగారు కోరిన బట్టలూ, ఇతర సామగ్రి కూడా, శాస్త్రిగారు తెచ్చేరు. ఉపనయనం, ఒకటి రెండు రోజులుందనగా బంధువుల రాక ప్రారంభమయింది. పెరట్లో పెద్ద గాడి పొయ్యి మీద వంటలు ప్రారంభమయ్యేయి. వచ్చిన అతిథులలో, కొందరు పిల్లలు కూడా ఉండేవారు. వారందరితో కలసి, బుజ్జిబాబు ఒకటే సందడి. ఆ జట్టుతో, బుజ్జిబాబు స్నేహితులు కూడా కలిసేరు.

ఉపనయనం రోజు వచ్చింది. ముహూర్తం, ఉదయం తొమ్మిది గంటల, పదిహేడు నిమిషాలకు. గ్రామవాసులకు పూజారిగారు స్వయంగా ఆహ్వానించడం మూలాన్న, పందిళ్లు క్రిక్కిరిసి ఉండేవి. జమీందారు గారు, ఆయన భార్య భ్రమరాంబ, ముహూర్తానికి ఒక గంట ముందుగా చేరుకొన్నారు. పెద్దల ఆశీర్వచనములతో, ఉపనయనం నిరాటంకంగా జరిగింది.

ఉపనయన కార్యక్రమం ముగిసేక, గణపతి శాస్త్రిగారు, తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతూ ఉండేవారు. బుజ్జిబాబు ప్రయాణం విషయం పెద్దలు నలుగురూ, ఆలోచించుకొన్నారు. అప్పటికి, బుజ్జిబాబు స్కూలు, శలవుల తరువాత తెరుచుకోడానికి ఇరవై రోజులుండేవి. అక్కా బావగార్లతో వాడిని పంపడమా, లేక స్కూలు తెరవడానికి రెండు రోజుల ముందుగా, ఒకరి సాయంతో పంపడమా, అని ఆలోచిస్తూ ఉండేవారు. శాస్త్రిగారు, బుజ్జిబాబును తమతో పంపడం మంచిదని సలహా ఇస్తూ, “మాతో కాక, వాణ్ణి వేరే పంపాలంటే, మళ్ళీ మీరే శ్రమ పడాలి. మీరు రావడం మాకు ఆనందమే. కాని, ఈ ఎండల్లో, బస్సు ప్రయాణం మీకు తప్పుతుంది.” అని మామగారికి తన సలహాకు కారణం చప్పేరు.

“నువ్వు చెప్పింది నిజమే గణపతీ. కాని, వాణ్ణి మళ్ళీ చూడాలంటే, ఏ ఆరేడు నెలలో పడుతుంది. అందుకే మరో రెండువారాల పాటు ఉంటే బాగుండుననుకొంటున్నాను.” మంగమ్మగారి మాతృహృదయం అలా పలికింది.

అత్తగారి మాటలు విన్నాక, శాస్త్రిగారు పునరాలోచనలో పడ్డారు. ఏమి ఆలోచించుకొన్నారో, భార్యనుద్దేశించి, “వరాలూ, నేను ఒక్కణ్ణి ఇప్పుడు వెళిపోతే, రెండు వారాల తరువాత, బుజ్జిబాబుని తీసుకొని నువ్వు రాగలవా. చిన్న పిల్లాడిని తీసుకొని బస్సులు మారి రాగలవా.” అని అడిగేరు.

పుట్టింట మరో రెండు వారాలు ఉండగలిగే అవకాశమొస్తే కాదంటుందా. వెంటనే, “ఫరవాలేదండీ, నేను రాగలను. కానీ, నేను లేకపోతే మీకు అక్కడ ఇబ్బంది కాదా.” అని భర్త నడిగింది.

“నాకు పెద్ద ఇబ్బందేదీ ఉండదు. వెళ్ళగానే, రెండు పెళ్లిళ్లు, ఒక ఉపనయనం ఉన్నాయి. పై ఊళ్లు వెళ్ళాలి.”

అల్లుని విశాల హృదయాన్ని, పూజారిగారి దంపతులిద్దరూ, మనసారా పొగిడేరు.

తమ్మునితోబాటు వరలక్ష్మి, విజయనగరం చేరుకొంది. బుజ్జిబాబు స్కూలు, శలవుల తరువాత తెరుచుకొంది. బుజ్జిబాబు, నాలుగో తరగతిలో చేరేడు. భీమశంకరంగారి రెండోవాడు, శాస్త్రిగారింటికి రాత్రుళ్ళు చదువుకోడానికి రావడం ప్రారంభించేడు. బుజ్జిబాబు, వాడూ, శ్రద్ధగా చదువుకొంటూ ఉండేవారు. శాస్త్రిగారు, ఆ విషయాలు మామగారికి తెలియబరిచేరు. అప్పటికి కూడా, నందవలసలోని బడిలో, గురువుగారు ఎవరూ చేరలేదు. బుజ్జిబాబును, పైచదువుకు విజయనగరం పంపడం వల్ల, వాడి చదువు నిరాటంకంగా సాగుతున్నదని, పూజారుగారి దంపతులు చాలా సంతోషపడ్డారు. ఆ విషయంలో, అల్లుడు, కూతురు తీసుకొన్న చొరవ, బుజ్జిబాబుపై వారివురకు వున్న అభిమానాన్ని తలచుకొని వాళ్ళను మెచ్చుకొన్నారు.

కాలచక్రం రెండు నెలలు ముందుకు తిరిగింది. గణపతిశాస్త్రిగారి ఇంట ఒక శుభ పరిణామం చోటుచేసుకొంది. వరలక్ష్మి గర్భవతి అయింది. ఆ పరిణామం దంపతులిద్దరకూ పట్టరాని ఆనందం కలుగజేసింది. ఆ శుభవార్త, శాస్త్రిగారు మామగారికి తెలియజేసేరు. అది తెలియగానే, పూజారిగారి దంపతులు సంతోషసముద్రంలో మునిగి తేలేరు. మంగమ్మగారు, అమ్మాయిని పురిటికి ఏ మాసంలో తేవడమా అని, భర్తతో దీర్ఘంగా ఆలోచించసాగేరు.

“ఏమండీ, అమ్మాయిని ఏడో నెలలో మంచిరోజు చూసి తేవాలండీ. అప్పటిదాకా ఇంటిపనంతా ఎలా చేసుకొంటుందో ఏమో. చిన్నది. ఇంట్లో మరో పెద్ద ఆడదిక్కు కూడా లేదు.” అని, చింతించసాగేరు, మంగమ్మగారు.

“మంగమ్మా, నువ్వు అంటున్నది నిజమే. అమ్మాయి గర్భవతి అయింది. ఎంతో సంతోషించవలసిన విషయమే. కాని దాన్ని పురుటికి తేవడం విషయం ఆలోచించే ముందు, మరో ముఖ్యమయిన విషయం కూడా ఆలోచించాలి.”

“ఏమిటండీ, అది.” అని ఆతృతగా అడిగేరు, మంగమ్మగారు.

“అమ్మాయి మన దగ్గరకు వస్తే, అక్కడ బుజ్జిబాబుని ఎవరు చూసుకొంటారు. ఏదో, వారం పది రోజులు కాదుగా. అన్నాళ్లు, గణపతి వాడి పనులన్నీ చూసుకోలేడుగా. అదీ కాక, ఈ మధ్య, పై ఊళ్లు తరచూ వెళుతున్నాడట. అదీ ఆలోచించాలి. అమ్మాయి గర్భవతి అయిందని తెలియగానే ఎంతో సంతోషించేను. కాని, బుజ్జిబాబు మాట జ్ఞాపకం రాగానే, ఏమిటి చెయ్యడమో తోచని స్థితి ఏర్పడింది.” అని సమస్య విశదీకరించి, భార్యకు తెలియజేసేరు, పూజారిగారు.

“అవునండి. నిజమే మీరన్నది. అమ్మాయి విషయమే నేను ఆలోచించేను గాని, మీరు ఆలోచించినట్లు, నేను బుజ్జిబాబు విషయం ఆలోచించలేదు. ఈ మధ్యనే, వాడు నాలుగులో చేరేడని గణపతి రాసిన ఉత్తరం చూసి, వాడి చదువు బాగా సాగుతోందని సంతోషించేం. ఏమిటోనండీ, వాడి చదువుకు ఏదో ఒక సమస్య ఒస్తున్నాది. నిరుడు అలా అయింది. ఆ సీతారాముల దయ వల్ల అప్పుడు ఆ సమస్య తీరింది అనుకొంటే, ఇప్పుడు ఇలా వచ్చింది. వాడి చదువుకోసం అమ్మాయిని పురిటికి తేవడం మానీ లేము. వాడి చదువు అర్ధాంతరంగా ఆపీలేము. ఏమిటి చెయ్యడమో తెలీదు.” అని తన గందరగోళ పరిస్థితి, భర్తకు విన్నవించేరు, మంగమ్మగారు.

“మంగమ్మా, ఇప్పుడేగదా తెలిసింది, ఆ శుభవార్త. తీరిగ్గా ఆలోచిద్దాం. బెంగ పడకు. ఆ శ్రీరామచంద్రమూర్తే దారి చూపిస్తాడు.” అని ధైర్యం చెప్పేరు, పూజారిగారు.

తనకు వేరే పని ఉంది, వీధిలోకి వెళ్ళాలి అని చెప్పి, పూజారిగారు, ఆ సంభాషణకు తెర దించేరు.

మంగమ్మగారు వంటింట్లో పని చేసుకొంటున్నారే గాని, కూతురును పురిటికి తీసుకురావడం విషయమే, ఆలోచిస్తూ ఉండేవారు. ఆవిడకు ఏదో ఆలోచన తట్టినట్టుంది.

అంతలో పూజారిగారు ఇంట్లోనికి ప్రవేశిస్తూ ఉండడం గమనించేరు. తను చేస్తున్న పని ఆపి, వడిగా ఆయనను సమీపించి, “ఏమండీ, మీరనట్టు ఆ సీతారాములే దారి చూపించేరు.” అని వికసించిన ముఖంతో, ఇంకా ఏదో చెప్పబోతూంటే,

“మంగమ్మా, నన్ను ఇంట్లోకి రానీ. అదేదో చెబుదువుగాని.” అని భార్య సందడికి, మందహాసంతో స్పందిస్తూ, పెరటిలోనికి కాళ్ళు కడుక్కోడానికి వెళ్ళేరు. ఓ రెండు నిమిషాలలో ఆ పని ముగించుకొని, ఆయన రాకకై ఎదురుచూస్తున్న భార్య చెంతకు చేరి,

“ఏది, అమ్మాయి విషయమేనా; నీకేదో తట్టినట్టుంది; చెప్పు.” అన్నారు.

“పిన్నిగారు, మీకు తెలుసు కదా. మొన్న పిల్లాడి ఒడుక్కి వచ్చింది ఆవిడ.”

“తెలుసు. ఇదివరకు కూడా వచ్చింది, ఆవిడ.”

“ఆవిడ, మనం అడిగితే, అమ్మాయి పురిటికి ఇక్కడున్న రోజుల్లో, విజయనగరం వెళ్ళడానికి ఒప్పుకోవచ్చునండీ.” అని తనకు తట్టిన విషయం చెప్పేరు.

“నేనన్నానా, ఆ శ్రీరామచంద్రుడే దారి చూపిస్తాడని. ఇప్పుడే రాస్తాను, ఆవిడకి. ఆవిడ జవాబు చూసేక, గణపతికి రాయొచ్చు. ఇలా ఏర్పాటు చేస్తామని.”

“ఆవిడకి ఇప్పుడే రాయండి. వెంటనే జవాబు ఇమ్మనమని కూడా ఆవిడకి రాయండి.” అని నొక్కి చెప్పేరు, మంగమ్మగారు.

పూజారి గారు ఉత్తరం రాయడానికి గదిలోకి వెళ్ళేరు. మంగమ్మ గారు, వంటింట్లో సగంలో ఆపేసిన పని పూర్తి చెయ్యడానికి వెళ్ళేరు.

అటు విజయనగరంలో, దంపతులిద్దరూ ఆ విషయమే ఆలోచిస్తూ ఉండేవారు. పురిటికి ఆడపిల్ల పుట్టింటికి వెళ్లడం ఆనవాయితీయే గాక అవసరం కూడా. కానీ బుజ్జిబాబు విషయమే ఆలోచిస్తూ ఉండేవారు.

“ఏమండీ, నాకు ఏడో నెల వచ్చేసరికి, బుజ్జిబాబు బడికి ఎండాకాలం శలవులు ఇవ్వరనుకొంటా.” అని తన అనుమానం తీర్చుకోబోయింది, వరలక్ష్మి.

శాస్త్రిగారు, ఏవో లెఖ్ఖలు చూసుకొని, “అప్పటికి, ఇంకా రెండు మూడు నెలలయినా ఉండొచ్చు వరాలూ. అయినా, ఆ శలవులు ఓ రెండు నెలలు ఉంటాయి. నువ్వు మీవాళ్ళ ఇంటికి మామ్మోలుగా వెళ్లడం కాదుగా. పురిటికి వెళితే, తిరిగి రావడానికి అయిదారు నెలలయినా పడుతుంది. ఆ లోగా వాడి బడి తెరిచి మూడు నాలుగు నెలయినా అవుతుంది. అయినా వరాలూ, నువ్వు ఆ విషయాలు ఆలోచిస్తూ, బెంగ పడకు. ఈ రోజుల్లో నువ్వు ఏ చింతా లేకుండా, ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.” అని సలహా ఇచ్చేరు, శాస్త్రిగారు.

“నిజమే అనుకోండి. ఏదో వాడి చదువు సజావుగా వెళుతున్నాదనుకొంటే, ఇప్పుడు ఏమిటి చెయ్యడమా, అని అనిపించింది.”

“వరాలూ, మరి ఆ విషయం ఆలోచించకు. దేముడు ఏదో మార్గం చూపిస్తాడు. అయినా పెద్దవాళ్లు, అత్తగారూ మామగారూ, ఉన్నారు. వాళ్ళూ, ఈ విషయం ఆలోచిస్తూ ఉండి ఉంటారు.” అని సలహాతో కూడిన తన ఆలోచన చెప్పేరు, శాస్త్రిగారు.

భర్త సలహా విన్నాక, అప్పటికి ఆ విషయం ఆలోచించడం మానీసింది, వరలక్ష్మి.

శాస్త్రిగారు, సంధ్య వార్చుకోడానికి వెళ్ళేరు.

వరలక్ష్మి, వంటింట్లోకి వెళ్ళింది. రాత్రి భోజనాలకు సంబంధించిన పనులేవో చూసుకొంటూ ఉండేది. శాస్త్రిగారు వద్దన్నా, ఇంకా ఆ విషయం ఆలోచిస్తూ ఉండేది. అంతలో శాస్త్రిగారు వంటింట్లోకి వచ్చేరు. ఆయన్ని చూడగానే, వరలక్ష్మి, “ఇప్పుడే నాకొక ఆలోచన తట్టిందండీ.” అని ఇంకా ఏదో చెప్పబోతుండగా, “వరాలూ, ఇప్పుడే నీకు చెప్పేను; ఆ విషయం ఆలోచించకని.” అని తను చెప్పిన సలహా జ్ఞాపకం చేసేరు.

దానికి స్పందిస్తూ వరలక్ష్మి, “నిజమేనండీ. అయినా నాకో ఆలోచన తట్టింది. కొంచెం వినండి.” అని వినయంగా అంది.

“సరే, అదేమిటో చెప్పు.” అన్నారు, శాస్త్రిగారు.

“బుజ్జిబాబు ఒడుగులో, అమ్మకి పనుల్లో సాయం చెయ్యడానికి, ఒకావిడ పై ఊరునుండి వచ్చింది; ‘పిన్నిగారు’ అంటారు. మీరు చూసే ఉంటారు.”

“చూసేను. కొద్దిగా పెద్దావిడ.”

“ఆవిడ ఉపనయనం పనుల్లో, అమ్మకి సాయం చెయ్యడానికి వాళ్ళ ఊరునుండి వచ్చింది. ఇదివరలో కూడా, అవసరమయినప్పుడు రెండు మూడు మార్లు వచ్చిందట. ఆవిడ వస్తుందేమో, కనుక్కోమని నాన్నగారికి రాయండి. ఆవిడ వస్తే, అన్ని పనులూ చూసుకోగలదు.”

“నీ ఆలోచన బాగుంది. పెద్దావిడ; అన్ని పనులూ బాధ్యతగా చూసుకోగలదు. ముఖ్యంగా, బుజ్జిబాబుకు కావలిసినవన్నీ చేసిపెడుతుంది. వరాలూ, నేను అన్నానా; ఆ భగవంతుడే ఏదో చూస్తాడని.” అని భార్య సలహాను ప్రశంసించేరు, శాస్త్రిగారు.

“ఆలస్యం చెయ్యకండి. నాన్నగారికి వెంటనే రాయండి.”

“ఇప్పుడే రాస్తాను. అని శాస్త్రిగారు, మామగారికి ఉత్తరం రాయడానికి గదిలోకి వెళ్ళేరు.

మూడు వారాలు గడిచేయి. ఒకరోజు, అల్లుడు రాసిన ఉత్తరం, పూజారిగారు అందుకొన్నారు. అది చదువుకొంటూ ఉంటే, మంగమ్మగారు, అది చూసి, అక్కడకు వచ్చేరు.

“ఏమండీ, ఎవరిదగ్గరనుండి, ఆ ఉత్తరం. పిన్నిగారేనా. వేగరమే జవాబు ఇచ్చింది. ఏమిటంటుంది.”

“పిన్నిగారు కాదు. అల్లుడు నుండి వచ్చింది.”

“ఏమిటంటాడు. పిల్ల బాగానే ఉందా. చులాగ్గా తిరుగుతోందా.” అని ఆత్రుతతో భర్తను అడిగేరు, మంగమ్మగారు.

“పిల్ల బాగానే ఉంది. విషయం ఏమిటంటే, మనం అనుకొన్నామే; పిన్నిగారు గురించి; వాళ్ళకీ, అదే తట్టింది. ఆవిడ వస్తుందేమో కనిక్కోమని రాసేడు.”

“ఆవిడ నుండి వేగిరం జవాబొస్తే బాగుండునండీ. నెలలు నిండిన దాకా ఎందుకు; వెంటనే వెళ్ళమని చెప్పొచ్చు. పిల్లకు మరో సాయం లేదు కదా. నూతినుండి, తాగడానికి నీళ్లు మోసుకురావడం అవీ, తప్పుతుంది. తినాలని ఉన్నవన్నీ చేసిపెడుతుంది కూడా.”

“గాభరా పడకు, మంగమ్మా. ఆవిడనుండి జవాబు రానీ.”

“ఆవిడని, అక్కడకు వెళ్లే ముందు, ఇక్కడికి ఒకమారు వచ్చి, వెళ్ళమనాలండి. ఆవిడ చేత చింతకాయ పచ్చడి, అవి చేసి పంపించొచ్చు.”

“సరే, ఆవిడ నుండి ఉత్తరం రానీ. ఈలోగా అవేవో చేసి ఉంచు.” అని సలహా ఇచ్చి, పెరట్లోకి వెళ్ళేరు, పూజారిగారు.

మంగమ్మగారు వంటింట్లోకి వెళ్ళేరు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here