కాలంతోబాటు మారాలి – 8

0
11

[సీతారామాంజనేయ శర్మ (బుజ్జిజాబు) పెద్దవాడయ్యాడు. ఇంటి వద్ద పిల్లలకి గణితం బోధిస్తూ లెక్కల మాస్టారు అని అనిపించుకుంటాడు. బాగా చెప్తాడని పేరు రావడంతో మరింత మంది విద్యార్థులు చేరుతారు. తనకి పై చదువుల పట్ల ఆసక్తి లేదని, తాను ఉపాధ్యాయుడిగా చేరుతానని అక్కాబావలకి స్పష్టం చేస్తాడు శర్మ. అనకాపల్లిలో అత్తగారి జోగులమ్మకి టైఫాయిడ్‌ సోకితే దగ్గరుండి సపర్యలు చేస్తుంది సీత. విజయనగరంలో శర్మ ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేస్తాడు. బావగారు గణపత్రి శాస్త్రి – శర్మ ఉద్యోగానికి సంబంధించిన వివరాలు కనుక్కుంటారు. విశాఖపట్టణంలో ఓ హైస్కూల్ చిన్న తరగతులకు బోధించే ఉద్యోగం వస్తుంది శర్మకు. తల్లి మంగమ్మగారిని తీసుకుని విశాఖపట్టణంలో మకాం పెడతాడు. బడిలో పిల్లలకు చక్కగా బోధిస్తూ, మంచి మాస్టారని పేరు తెచ్చుకుంటాడు. అక్కడి తెలుగు ఉపాధ్యాయులు విశ్వనాధశాస్త్రి గారి అభిమానాన్ని పొందుతాడు శర్మ. అక్కడ అనకాపల్లిలో – క్రమంగా సీత పట్ల అకారణ ద్వేషం తగ్గి, ప్రేమ పెరుగుతుంది జోగులమ్మలో. జ్వరం తగ్గాకా, కొడుకూ కోడళ్లకి వీలైనంత ఏకాంతం కల్పిస్తూంటుంది. హనుమలోనూ భార్య పట్ల మార్పు వస్తుంది. ఆమెను చక్కగా చూసుకుంటుంటాడు. – ఇక చదవండి]

[dropcap]ఒ[/dropcap]క ఆదివారం సాయంత్రం, హనుమ, సీతమ్మతో బాటు, నూకాంబికా అమ్మవారి దేవాలయానికి వెళ్ళేడు. ఆ సమయంలో, పెద్దలిద్దరూ ఇంటనుండేవారు. జోగులమ్మ, భర్తతో,

“ఏమండీ, మా పెద్దక్క మనవరాలు కనకమ్మ, మీకు తెలుసుకదూ.” అని శాంతంగా సంభాషణ ప్రారంభించింది.

“తెలుసు. దాని సంగతి నాకు తెలియకపోవడం ఏమిటి. దాని అక్క పెళ్ళిలో చూసేనుగా. బాగా జ్ఞాపకం ఉంది.” అని వెటకారంగా, చిన్న నవ్వుతో అన్నారు.

“ఏదో, అప్పుడు చిన్నదండీ. తెలిసీ తెలీని వయసు.”

“అయినా, దాని సంగతి ఇప్పుడెందుకూ.” అని, ప్రశ్నించేరు.

“దానికి పదేళ్లు నిండి ఉంటాయండీ. ఏదయినా మంచి సంబంధం చూడాలండీ.”

“చూడమని వాళ్ళు నీకు చెప్పేరా.”

“వాళ్ళు ఏమీ చెప్పలేదండీ. కాని, కుటుంబంలోని పిల్ల. మనకు తెలిసిన మంచి సంబంధం ఉంటే చెబ్దామని.”

“సరే, చెప్పేవుగా. నాకు తెలిసిన సంబంధం ఏదీ లేదు. తెలిస్తే, చూద్దాం.” అని, తనకు అందులో ఎట్టి ఆసక్తి లేదని తెలియబరుస్తూ, అన్నారు.

“మీకు తెలియక పోవడమేమిటండీ. మన కోడలు సీతమ్మ, అన్న ఉన్నాడుగా. చదువుకున్నాడు; ఉద్యోగం చేస్తున్నాడు; మీరు ఓ మారు వాళ్ళతో మాట్లాడి చూస్తే; వాళ్ళు కాదనరండీ.” అని చల్లకొచ్చి, ముంత దాచకుండా చెప్పింది.

“జోగులూ, నేనా పొరబాటు ఎప్పుడూ చెయ్యను. వాళ్ళని అలా బతకనీ, జోగులూ. వాళ్ల జోలికి వెళ్ళకు.” అని వ్యంగ్యమయిన నాలుగు మాటలూ, కుండ బ్రద్దలుకొట్టినట్టు చెప్పేరు, సత్యనారాయణగారు.

“వాళ్ళని నేనేమిటి చేసేనండీ. స్వయాన్న, అక్కయ్య మనవరాలు. తెలిసిన మంచి సంబంధం. ఏదో చేయగలిగిన సాయం చేద్దామని చెప్పేను. సరే, మీ పని మీరు చూసుకోండి. నాకూ వంటింట్లో పనుంది, వెళతాను.” అని జోగులమ్మ నిష్క్రమించింది

***

ఉపాధ్యాయుడయిన శర్మను, ఆ పదవి గౌరవార్థం, ‘శర్మగారు’ అనడం ఉచితం. మాష్టారుగా శర్మగారు, విద్యార్థుల ప్రశంసలను, పొందనారంభమయింది. ఆయనను వారు, ‘మాష్టారూ’ అని సంబోధిస్తూ ఉంటే, సంతసించేవారు. స్కూలు పెద్ద పరీక్షలు అయ్యేయి. శర్మగారి విద్యార్థులలో, అధిక శాతం, లెక్కలులో మంచి మార్కులు పొందేరు. శర్మ మాష్టారు, లెక్కలు బాగా బోధపరుస్తారని, పేరు తెచ్చుకొన్నారు. దాని ప్రభావాన్న, కొందరు చిన్న తరగతి విద్యార్థులు, శలవుల్లో, ఆయన వద్ద లెక్కలు నేర్చుకోడానికి చేరేరు. కొద్ది రోజులలోనే, వారి సంఖ్య పెరిగింది. శర్మగారి వీధి గది వారితో నిండుతూ ఉండేది. తక్కువ సమయంలోనే, కొడుకు మంచి పేరు తెచ్చుకొన్నాడని, మంగమ్మగారు సంతసిస్తూ ఉండేవారు.

శర్మ మాష్టారుకు ఇరవై సంవత్సరాలు నిండేయి. మంగమ్మగారు, కొడుకు వివాహానికి ఆత్రుత పడుతూ ఉండేవారు. ఒకమారు, గణపతిశాస్త్రిగారు విశాఖపట్నం రావడం సంభవించింది. ఆ సమయంలో, మంగమ్మగారు, తన ఆతృతను, అల్లునికి తెలియజేసేరు. విజయనగరంలో, పేరయ్యశాస్త్రిగారని ఒకాయన, వధూవరుల వివరాలు సేకరించి, వివాహాల విషయంలో, సహాయపడుతూ ఉంటారని, శాస్త్రిగారు చెప్పేరు. ఆయనకు శర్మ విషయం తెలియజేస్తానన్నారు. వారం తిరగకుండా, పేరయ్యశాస్త్రిగారు, మంగమ్మగారిని కలిసేరు. ఆ సమయంలో, శర్మమాష్టారు కూడా ఉండేవారు. పేరయ్యశాస్త్రిగారు, రెండు సంబంధాల వివరాలు చెప్పేరు. వారిలో ఒక అమ్మాయికి పది సంవత్సరాలు. మరో పిల్లకు, పండ్రెండు సంవత్సరాలు. అంత చిన్న వయసువారిని వివాహమాడడానికి, మాష్టారు సమ్మతించలేదు. పేరయ్యశాస్త్రిగారు, మాష్టారు కోరిన వయసుగల అమ్మాయిల గూర్చి తెలియగానే, మరల సంప్రదిస్తానన్నారు. మంగమ్మగారు, తగు సంబంధం తెలియగానే, అల్లుని సంప్రదించమన్నారు.

మూడు వారాలు గడిచేయి. ఒకరోజు, శాస్త్రిగారు విశాఖపట్నం చేరుకొన్నారు. పేరయ్యశాస్త్రిగారు చెప్పిన ఒక సంబంధం వివరాలు అత్తగారు, బావమరిదితో చర్చించేరు. ఆ వివరాల్లోకి వెళితే, అమ్మాయి పేరు, కళావతి; వయసు పదిహేను సంవత్సరాలు. ఎనిమిది సంవత్సరాలనుండి, వీణావాయిద్యం అభ్యసిస్తోంది. మాణిక్యారావు గారు, అన్నపూర్ణమ్మల, ఏకైక పుత్రిక. మాణిక్యారావు గారు, బొబ్బిలి సంస్థానం హైస్కూలులో తెలుగు పండితులు. శర్మమాష్టారు పని చేస్తున్న స్కూలులోని తెలుగు పండితులు, విశ్వనాధశాస్త్రి గారికి, మాణిక్యారావుగారు సుపరిచితులు. మాష్టారుకు, మంగమ్మగారికి, సంబంధం నచ్చింది. శాస్త్రిగారు, తనకు, వరలక్ష్మికి కూడా నచ్చిందని చెప్పేరు. అత్తగారు అంగీకరిస్తే, మాణిక్యారావుగారు, స్వయంగా విశాఖపట్నం వచ్చి, సంబంధం నిశ్చయం చేసుకొంటారని, శాస్త్రిగారు సలహా ఇచ్చేరు. మంగమ్మగారి ఆలోచన మరో విధంగా ఉండేది. అల్లునితో ఆ విషయం మాట్లాడుతూ, “గణపతీ, ఆ కార్యక్రమం కోసం, మీరుభయులూ ఇక్కడికి రావాలంటే, చిన్న పిల్లలతో ప్రయాణం ఇబ్బందవుతుంది. అంచేత, మేమిద్దరం ఆ వేళకి విజయనగరం వస్తాం. కార్యక్రమం అక్కడ జరుపుకోవచ్చు.” అని తన అభిప్రాయం చెప్పేరు. శాస్త్రిగారు, అత్తగారి అభిప్రాయంతో ఏకీభవిస్తూ, “సరేలెండి. పెళ్ళివారికి ఆ విషయం తెలియబరచమని, పేరిశాస్త్రిగారికి చెప్తాను. మీరుభయులూ, వీలు చూసుకొని, ఓ రెండు రోజులు ముందుగా రండి.” అని సలహా ఇచ్చేరు.

కార్యక్రమానికి మూడు రోజులు ముందుగా, మంగమ్మగారు, మాష్టారు, విజయనగరం చేరుకొన్నారు. ఆ మరునాడు, మాష్టారుతో బాటు మిగిలిన ముగ్గురు పెద్దలూ, పెండ్లిసంబంధం విషయం మాట్లాడుకొంటూ ఉండేవారు. ఆ సందర్భంలో, మాష్టారు తన అభిప్రాయం ఒకటి వెలిబుచ్చేరు.

“అక్కా, ఆడపెళ్ళివారు మన ఇంటికి వచ్చి, మన గురించి కొన్ని విషయాలు తెలుసుకొంటారు. వాళ్ళు నన్ను చూస్తారు. కాని వాళ్ళ గురించి, మనం ఒకరు చెప్పింది వినడమే. పెళ్లిరోజు దాకా, మనం పెళ్లికూతురిని కూడా చూడలేం.” అని, చిరునవ్వుతో మనసులోని మాట చెప్పేరు, మాష్టారు.

“అది మన సాంప్రదాయం నాన్నా. అక్క పెళ్లి అలాగే అయింది. చెల్లెలి పెళ్లి కూడా అలాగే అయింది.” అని కొడుకు భుజం తట్టి, చెప్పేరు, మంగమ్మగారు.

అమ్మ చెప్పిన కారణంతో, మాష్టారు మనసులో ఏకీభవించలేదు. కాలంతో బాటు మారాలి అని మనసులో అనుకొన్నారు. కాని, తల్లి మాట కాదనలేక, ఆ విషయం చర్చించలేదు.

“ఏమండీ మాష్టారూ, పెళ్లికూతురును చూడాలని ఉందా మీకు; చెప్పండి; రేపు వాళ్ళతో చెప్తానామాట.” అని బావమరిదిని హాస్యం చేసేరు, శాస్త్రిగారు.

“అబ్బే, బావగారూ, ఏదో అన్నాను అంతే. అమ్మ చెప్పినట్లు, అవి మన సాంప్రదాయాలు.” అని మాట దాటవేసేరు మాష్టారు.

నిజానికి, పెళ్ళికొడుకు, పెళ్లికూతురు, ఒకరిని ఒకరు చూసుకోకుండా, పెళ్లిళ్లు నిశ్చయం చేయడం, మాష్టారుకు అంత ఇష్టముండేదికాదు. కాలంతో బాటు, సాంప్రదాయాలలో కూడా మార్పు రావాలి అనే భావనతో ఉండేవారు. కాని పెద్దల మాటలను కాదనే సంప్రదాయం కూడా, కాదు ఆయనది. అందుచేత, ఆయన ఆ విషయం మరి మాట్లాడలేదు. బొబ్బిలి నుండి మాణిక్యారావు గారు వచ్చి, నిశ్చయ తాంబూల కార్యక్రమం జరిపించుకొన్నారు. ఆయన శాస్త్రిగారితో చర్చించి, వివాహానికి ముహూర్తం నిశ్చయించేరు. ఆ తరువాత కొద్ది రోజులకు, నిశ్చయించిన ముహూర్తానికి, సీతారామాంజనేయ శర్మ, కళావతిల వివాహం జరిగింది. శర్మ మాష్టారు, ఓ ఇంటాయన అయ్యేరు. ఆ నూతన దంపతులను చూసి, మంగమ్మగారు, మురిసిపోతూ ఉండేవారు. కాని, ఆ సంతోషంలోనే, ఏదో ఒక వెలితి దాగి ఉండేది. ఆ జంటను చూసి, భర్త ఎంత సంతోషించి ఉండేవారో అనే మనోభావనే అది.

కళావతి, శర్మ మాష్టార్ల జంట, నూతన వైవాహిక జీవన మాధుర్యాన్ని, తనివితీరా చవి చూస్తూ ఉండేవారు. ఆ విషయంలో, మంగమ్మగారు, వారికి సహకరించేవారు. విశాఖపట్టణ సౌందర్యం, ముఖ్యంగా, బీచి సౌందర్యాన్ని, కోడలుకు చూపమని, ప్రోత్సహించేవారు. వారిరువురూ, అటు వెళ్లిన సమయాలలో, ఆవిడ ఇంటనుండి, వంటపనులు చూసుకునేవారు. కళావతికూడా, ఇంటిపనులు చేసుకొంటూ, వంటలో అత్తగారికి సహకరించేది. తల్లివద్ద నేర్చుకొన్న కొన్ని వంటకాలు, స్వయంగా చేస్తూ ఉండేది. చిన్నదానివయినా, చదువుకొంటూ కూడా చాలా నేర్చుకొన్నావని, అత్తగారి ప్రశంసలను, అందుకొనేది.

శర్మ మాష్టారు, అప్పటివరకు తన జీవితంలో ఆయన ఎదుర్కొన్న, ఒడుదుడుకులను, భార్య కళావతితో, చెబుతూ ఉండేవారు. ఒకమారు, మాటల సందర్భాన్న, తను శలవుల్లో ఇంటికి వెళ్ళినప్పుడు, సీతాలుకు తెలుగు, లెక్కలు బోధపరుస్తూ ఉండడం, అలాగే, విజయనగరంలో తన వీధిలోనున్న చిన్న తరగతి పిల్లలకు, లెక్కలు ట్యూషను చెప్పేవాడినని, దాని కారణంగా, పెద్దబావగారు, సరదాకి, అప్పుడప్పుడు, ‘చిన్న లెక్కల మాష్టారు’ అని సంబోధిస్తూ ఉండేవారని చెప్పేరు.

కళావతి కూడా, ఆమె సహాధ్యాయులు, ఆమెను, అప్పుడప్పుడు, తెలియని తెలుగు పదాలకు, అర్థాలు, వ్యాకరణంలో సమస్యలకు సమాధానాలూ, అడిగి తెలుసుకొనేవారని, మందహాసంతో చెప్పింది. వారు, ‘ఏమండీ, గురువమ్మగారూ, కొంచం ఇది చెప్తారా.’ అని హాస్యం చేసేవారని చెప్పింది. మాష్టారు చెప్పిన కథ విన్నాక, కళావతి, శర్మ మాష్టారిని, అప్పుడప్పుడు, సరదాకు ‘ఏమండీ, చిన్న లెక్కల మాష్టారూ.’ అని పిలువ నారంభించింది.

మాష్టారు కూడా, ‘ఏమండీ, గురువమ్మగారూ.’ అని సరదాగా పిలువ నారంభించేరు.

అలా అయిదారు నెలలు గడిచేయి. ఒకరోజు, సీతమ్మ గర్భవతి అయినదని తెలియజేయుచూ, మాష్టారుకు అనకాపల్లినుండి ఉత్తరం అందింది. మంగమ్మగారు పొంగిపోయేరు. తన ముద్దుల చెల్లెలు, తల్లి కాబోతున్నదని, చిన్న లెక్కల మాష్టారు, గురువమ్మగారితో, అంతులేని సంతోషాన్ని పంచుకొన్నారు. కళావతి, సీతమ్మ వయసు తెలియగోరింది. దానికి మాష్టారు, కొద్దిగా ఆలోచించి, పదిహేడు నడుస్తున్నాదనుకొంటాను అని స్పందించేరు. అటు విజయనగరంలో శాస్త్రిగారు, వరలక్ష్మి, కూడా ఎంతో సంతోషించేరు. చెల్లిని పురిటికి విజయనగరం తీసుకొచ్చి, పురుడుపోయాలని ఉవ్విళ్ళూరింది, వరలక్ష్మి. మంగమ్మగారు చిన్న పిల్లలతో చేసుకోలేవని, హితవు పలికేరు. అది తన బాధ్యత అన్నారు, మాష్టారు. ఏదయితేనేమి, సీతమ్మను ఏడో నెలలో, సంప్రదాయాలు విస్మరించకుండా, విశాఖపట్నం తీసుకెళ్ళేరు.

ఆ రోజుల్లో, సీతమ్మకు ఎనిమిదో నెల నిండుతూ ఉండేది. ఒకరోజు, సీతమ్మ మామగారు పోయేరని, అనకాపల్లినుండి ఉత్తరం వచ్చింది. సీతాలు, భర్త శోకాన్ని పంచుకొంటూ, ఆ సమయంలో, అతని చెంత, అనకాపల్లిలో ఉండాలనుకొంది. అదియును గాక, తనను ఆదరాభిమానాలతో ఆప్యాయంగా చూసుకొనుచుండెడి, మామగారి గౌరవార్థమయినా, అనకాపల్లి, వెంటనే వెళ్లాలనుకొంది. డాక్టరుగారిని సంప్రతించేరు. నిండు చూలాలు, ప్రయాణం చెయ్యడం శ్రేయస్కరం కాదన్నారు. ఎలాగయినా, వెంటనే అనకాపల్లి వెళ్లాలని నిశ్చయించింది, సీతాలు. తిరుగు ప్రయాణం చెయ్యలేకపోతే, పురిటికి అనకపల్లిలోనే ఉండిపోతానంది. మరి చేయునది లేక, మాష్టారు, కళావతి, జాగ్రత్తగా అద్దెకారులో, సీతమ్మను అనకాపల్లిలో అత్తవారింట దిగబెట్టి వచ్చేరు. దురదృష్టవశాత్తు, అనకాపల్లి చేరిన వారానికే, ఒక రాత్రి, సీతాలుకు కడుపులో విపరీతమయిన నొప్పులు వచ్చేయి. హనుమ సత్వరం వెళ్లి, ఒక నర్సును వెంటా తీసుకొచ్చేడు. కాని, నిష్ప్రయోజనమయింది. భరింపశక్యముగాని నొప్పులతో, శిశువుతోబాటు సీతాలు, పరలోకం చేరుకొంది. హనుమ కుమిలిపోయేడు.

సీతమ్మ మరిలేదనే పిడుగువంటి వార్త, విశాఖపట్నం చేరుకొంది. ఒక్కమారుగా మాష్టారి ఇల్లు, శోకసముద్రంలో మునిగిపోయింది. ఆ వార్త విని, మంగమ్మగారు సొమ్మసిలిపోయేరు. చెల్లెలు తల్లి కాబోతూందని ఎన్నో కలలు కన్న, మాష్టారు, ఒక ప్రక్క, తన దుఃఖాన్ని దిగమ్రింగుకొంటూ, మరో ప్రక్క, తల్లిని ఓదార్చే ప్రయత్నాలు చేసేరు. కళావతి కూడా, చాలా విచారించింది. తనూ, అత్తగారిని ఓదార్చ ప్రయత్నించింది.

ఆ విషాద వార్త, విజయనగరంలోని శాస్త్రిగారింట చేరింది. శాస్త్రిగారు, భార్య వరలక్ష్మిని ఓదారుస్తూ, వీలయినంత వేగిరం విశాఖపట్నం వెళ్లడం అవసరమని, మనవలు అక్కడ ఉంటే, అత్తగారికి కొంతవరకు ఉపశమనం ఉంటుందని అభిప్రాయబడ్డారు. ఆ మరునాడే, శాస్త్రిగారు, వరలక్ష్మి , పిల్లలు ముగ్గురూ, పెద్దవాడు శంకరశాస్త్రి, కూతురు గిరిజ, నెలలపిల్లడు, విశ్వేశ్వరశాస్త్రి, విశాఖపట్నం చేరుకొన్నారు. వారి రాకతో, కొంతవరకు మంగమ్మగారు తేరుకున్నారు. నాలుగు రోజులుండి, శాస్త్రిగారు వెనుదిరిగేరు. పదిరోజుల తరువాత మళ్ళీ విశాఖపట్నం వచ్చి, సకుటుంబంగా, విజయనగరం మరలి వెళ్ళేరు.

సీతమ్మ విషయాలే తలచుకొంటూ, మంగమ్మగారు కుమిలి మంచాన్నబడ్డారు. మరి తేరుకోలేకపోయేరు. మూడు నాలుగు నెలలు అలా జీవచ్ఛవంలాగ ఉండి, ఒక రోజు, మంగమ్మగారు, పరలోకం చేరుకొన్నారు. తల్లిలేని లోటును, మాష్టారు ఊహించుకోలేకపోయేరు. ఆ విషాదాన్ని జీర్ణించుకోలేకపోయేరు. సమయమే వైద్యం చేస్తుంది, అంటారు. కళావతి సాన్నిధ్యంలో, క్రమంగా మాష్టారు తేరుకున్నారు.

మాష్టారు, క్రమంగా సాధారణ జీవితంలోనికి మరల అడుగులు వేసేరు. ఇంట ఇద్దరే ఉండడానికి అలవాటు బడ్డారు. అత్తగారు పోయిన చాలారోజులవరకూ, మాష్టారు స్కూలులో ఉన్న సమయంలో, ఇంట ఒంటరితనం కష్టతరంగా ఉండేది, కళావతికి. ఆ సమయాల్లో, సంగీత సాధన చేసుకొంటూ ఉండేది. దంపతులిద్దరూ, అప్పుడప్పుడు శలవు రోజుల్లో, ఒకటి రెండు రోజులకు, విజయనగరం వెళ్లేవారు. అక్కడ, పిన్నలు, పెద్దలతో సరదాగా కాలం గడుపుతూ ఉండేవారు.

ఒక ఆదివారం సాయంత్రం, మాష్టారు దంపతులు, టీ త్రాగుతూ, కబుర్లు చెప్పుకొంటూ ఉండేవారు. ఆ ఖబుర్లు, మాష్టారి గత వ్యక్తిగత జీవితంలోనికి దారి తీసేయి. ఆ సందర్భంలో, కళావతి, “ఏమండీ, S.S.L.C. అంత మంచి మార్కులతో పాసయ్యేరు గదా, విజయనగరంలోనే కాలేజీ ఉంది; మరి కాలేజీలో ఎందుకు చేరలేదండీ.” అని కుతూహలంతో అడిగింది. నిజానికి, కళావతికి, ఆ విషయం తెలుసుకోవాలని, పెళ్లయిన తొలి రోజులనుండీ ఉండేది. మొదట్లో, అంత చనువు లేక అడగలేదు. తరువాత, ఇంట జరిగిన విషాదాలతో, ఆ ఆలోచన మరుగున బడ్డాది. ఇన్నాళ్లకు, అవకాశం దొరికింది.

మాష్టారు, భార్య సందేహాన్ని నివృత్తి చేస్తూ, “కళా, పదోతరగతిలో ఉన్న రోజులనుండీ, నాకు కాలేజీలో పెద్ద చదువులు చదువుకొని, పెద్ద ఉద్యోగం చెయ్యాలని ఉండేది. నేను S.S.L.C. పాసయ్యేక, అక్కా, బావగారు కాలేజీలో చేరమని ఎంతో ప్రోత్సహించేరు కూడా.”

అని ఇంకా ఏదో చెప్పబోతూంటే,

కళావతి, “మరి ఎందుకు చేరలేదండీ.” అని మరో ప్రశ్న వేసింది.

“నాన్నగారు పోవడంతో, పరిస్థితులు తారుమారయ్యేయి, కళా. నాతోబాటు అమ్మ కూడా బావగారి ఇంట్లో ఉండవలసి వచ్చింది. అమ్మ చాలా మొహమాటపడుతూ ఉండేది; బావగారిమీద ఇద్దరి భారం పడుతూండేదని.”

“అవునండీ, అత్తగారు; కోడలిని, నాకు పనులు చెప్పడానికే మొహమాటపడుతూ ఉండేవారు.” అని అత్తగారి మెత్తని మనసును, జ్ఞాపకం చేసుకొంది, కోడలు.

“ఆ పరిస్థితులలో, వీలయినంత వేగరం, ఉద్యోగంలో చేరాలని నిశ్చయించుకున్నాను. ఆ తరువాత కథ, నీకు తెలిసినదే.” అని మాష్టారు మందహాసంతో, భార్య భుజం తట్టి చెప్పేరు.

“అవ్విధంబున, విజయనగరంలోని.. చిన్న లెక్కల మాష్టారు.. విశాఖపట్నం స్కూల్లో.. లెక్కల మాష్టారుగా.. అవతారం ఎత్తేరన్నమాట.” అని, బొబ్బిలి స్కూలులోని, తెలుగు పండితులు, మాణిక్యారావు గారి కుమార్తె, కళావతి, భర్త మీద ఒక ఛలోక్తి విసిరింది.

మాష్టారుకు, ఆ హాస్యం నచ్చి, మెచ్చుకొంటూ, ఆమె బుగ్గలమీద ఒక కానుక ఇచ్చేరు.

అంతలో, వీధి తలుపు ఎవరో తట్టడంతో మాష్టారు అటు వెళ్ళేరు. కళావతి, రాత్రి భోజనాల ప్రయత్నం చేయసాగింది.

చిన్న లెక్కల మాష్టారు, గురువమ్మగారు, అలా, చిలకా గోరింకలలాగా, అన్యోన్యంగా కాలం గడుపుతూ ఉండేవారు. కాలచక్రం, మూడు సంవత్సరాలు ముందుకు దొర్లింది.

ఒక రోజు, భార్య కోరిక మేరకు, మాష్టారు ఆమెను లేడీ డాక్టరు వద్దకు తీసుకెళ్ళేరు. పరీక్షలు జరిపి, డాక్టరుగారు కళావతి తల్లి కాబోతున్నదని, నిర్ధారించేరు. దంపతులిద్దరకు, అభినందనలు తెలియజేసేరు.

దంపతులిద్దరూ, గాలిలో తేలుతూ, ఇల్లు చేరుకొన్నారు. చేరిన వెంటనే, ఒకరినొకరు బిగువుగా కౌగలించుకొని, ఒకరినొకరు అభినందించుకొన్నారు. మాష్టారు, నూత్న గర్భవతి ఉదరముపై, ముచ్చటగా ముద్దులు పెట్టేరు.

“అప్పుడే, నన్ను.. ప్రక్కకు పెట్టి, పుట్టబోయేవాడికి అన్ని ముద్దులా,” అని కొంటెగా అంది, కోమలి.

“కళావతీ, నిన్ను ఎప్పుడూ ప్రక్కన పెట్టను. ఇదిగో, నువ్వు ఎప్పుడూ.. ఇక్కడ ఉంటావ్.” అని, ఛాతీపై ఉన్న షర్టును, కొద్దిగా విడదీసి, గుండె చీల్చి, సీతారాములను చూపుతున్న ఆంజనేయుని పోజు పెట్టేరు, మాష్టారు.

“చాల్లెండి, ఆపండి. ఆ చేతులు ఇంకా గట్టిగా లాగితే షర్టు చిరిగిపోతుంది.” అని చమత్కరించింది, కళావతి.

అలా, ఆ ఇద్దరూ, సంతోషసాగరంలో కొంతసేపు విహారయాత్ర చేసేరు.

తను తల్లికాబోతోంది అన్న విషయం, తల్లిదండ్రులకు వీలయినంత తొందరగా తెలియబరచాలని, కళావతి కుతూహలబడుతూ ఉండేది.

“ఏమండీ, మా వాళ్లకి ఈ విషయం తెలియబరచాలి కదండీ.” అని, కళావతి ఉత్సాహంతో భర్తను కోరింది.

“ఆఁ., మీ వాళ్లకీ, మా వాళ్ళకీ.. కూడా తెలియజేయాలి.” కొద్దిగా వ్యంగ్యం పాలు కలిపి చిరునవ్వుతో చమత్కరించేరు, మాష్టారు.

“అవును, నిజమే. పెద్దవాళ్ళు; వాళ్లకి కూడా తెలియబరచాలి.” అని, తన తప్పు దిద్దుకొంది, గురువమ్మ.

“అదే, ఆలోచిస్తున్నాను. నా ఉద్దేశంలో, ఇటువంటి విషయాలు, ఇంటి పెద్దల ద్వారా తెలియబరచడం, సబబుగా ఉంటుందనుకొంటాను.” అని మాష్టారు తన అభిప్రాయం వెలిబుచ్చేరు.

“అవునండీ, మీరన్నది కరెక్టే.”

“పెద్దవాళ్ళు, మా బావగారికి, అక్కకు, ముందుగా తెలియజేస్తాను. మీ వాళ్లకి, ఈ శుభవార్త తెలియజేయమని, బావగారిని రిక్వెస్టు చేస్తాను; ఏమంటావ్.” అని, భార్యనడిగేరు, మాష్టారు.

“బాగా ఆలోచించేరండి. మీ బావగారి పెద్దరికం నిలబెట్టినట్టూ ఉంటుంది.” అని చిన్న లెక్కల మాష్టారి ఆలోచనతో, ఏకీభవించింది, గురువమ్మ.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here