కాలంతోబాటు మారాలి – 9

0
9

[అనకాపల్లిలో జోగులమ్మ – తమ బంధువు కూతురిని – శర్మకి (మాస్టారుకి) సంబంధం అడుగుదామని భర్తతో అంటుంది. వద్దంటాడాయన. శర్మని అందరూ మాస్టారు అని పిలుస్తుండండంతో – అదే పేరుగా మారిపోతుంది. మాస్టారు లెక్కలు బాగా చెబుతారనే పేరు వస్తుంది. శర్మకి వివాహ వయసు వస్తుంది. అల్లుడు గణపతిశాస్త్రి ఒకసారి విజయనగరం వస్తే కుమారుడికి పెళ్ళి చేయాలన్న తన ఆలోచనను ఆయనతో పంచుకుంటారు మంగమ్మ. రెండు సంబంధాల తరువాత కళావతి అనే అమ్మాయి అందరికీ నచ్చి వివాహం జరిపిస్తారు. వధువు తండ్రి బొబ్బిలి సంస్థానంలో తెలుగు పండితులు. నూతన వధూవరులిద్దరూ ఒకరి గురించి మరొకరికి వివరంగా చెప్పుకుంటారు. ఆమె ఆయన్ని మాస్టారు అని, ఆయన ఆమెని గురువమ్మ అని ముద్దుగా పిలుచుకునేవారు. అనకాపల్లిలో సీత గర్భవతి అని తెలుస్తుంది. పురుటి కోసం ఆమెను విశాఖపట్టణం తీసుకువస్తారు. ఇంతలో అనకాపల్లిలో సీత మామగారు చనిపోయారనే కబురు అందుతుంది. నిండు చూలాలు, ప్రయాణం చెయ్యడం శ్రేయస్కరం కాదని వైద్యులు చెప్పినా, బయల్దేరి వెడుతుంది సీత. దురదృష్టవశాత్తు, అనకాపల్లి చేరిన వారానికే, ఒక రాత్రి, సీతాలుకు కడుపులో విపరీతమయిన నొప్పి వచ్చి, వైద్య సహాయం అందేలోగా శిశువుతో బాటు మరణిస్తుంది. హనుమ కుమిలిపోతాడు. ఈ వార్త విన్న మంగమ్మగారు వేదనకి లోనవుతారు. కుమిలి మంచానబడి, తేరుకోలేక, పరలోకం చేరుకుంటారు. మాస్టారు, కళావతి క్రమంగా సాధారణ జీవితంలోనికి మరల అడుగులు వేసేరు. చిలకా గోరింకలలాగా, అన్యోన్యంగా కాలం గడుపుతూ ఉండేవారు. కాలచక్రం, మూడు సంవత్సరాలు ముందుకు దొర్లి, కళావతి గర్భవతి అవుతుంది. తమ బావగారి ద్వారా ఈ శుభవార్తను – అత్తమామలకు తెలియజేయాలనుకుంటారు మాస్టారు. – ఇక చదవండి]

[dropcap]వి[/dropcap]జయనగరంలో శాస్త్రిగారు, మాష్టారు రాసిన ఉత్తరం అందుకొన్నారు. భార్య వరలక్ష్మికి, ఆ శుభవార్త తెలియజేసేరు. ఉభయులూ సంతోషించేరు. బొబ్బిలిలోని కళావతి తల్లిదండ్రులకు, ఆ తియ్యని విషయం తెలియజేయమని, బావమరిది తనకు పెద్దరికం ఇచ్చినందుకు, ద్విగుణీకృతమయిన తన సంతోషాన్ని, శాస్త్రిగారు వరలక్ష్మితో పంచుకొన్నారు. ఇద్దరూ, చిన్న లెక్కల మాష్టారిని, మెచ్చుకొన్నారు.

శాస్త్రిగారు రాసిన ఉత్తరం, మాణిక్యారావుగారు అందుకొన్నారు. కూతురు తల్లి కాబోతున్నదన్న శుభవార్త తెలిసి, తాతగారు కాబోతున్నారని, మాణిక్యారావుగారు, అమ్మమ్మ కాబోతున్నాదని, అన్నపూర్ణమ్మగారు, ఉప్పొంగిపోయేరు.

ఆ రోజుల్లో, మాష్టారు దంపతులు, సమయం అనుకూలించినపుడల్లా, వారి పుట్టబోయే పాప గూర్చి, ఊహాగానాలు చేస్తూ ఉండేవారు. అటువంటి సమయాలలో ఒక రోజు,

“ఏమండీ, పుట్టబోయే పాప, మగా, ఆడా, ఎవరు కావాలని మీరు అనుకొంటున్నారు.” అని మగని మనసును తెలుసుకోగోరింది, కళావతి.

“ఆడపిల్ల అయితే, నాకు సంతోషం. నీలాంటి ఆడపిల్ల.” అంటూ ‘నీలాంటి’ పదాన్ని నొక్కి చెబుతూ,

“మరి తమరి కోరిక.” అని తన వంతు ప్రశ్న సంధించేరు, మాష్టారు.

“నాకు మీవంటి మగపిల్లడు కావాలి.” అని, తనూ ‘మీవంటి’ పదాన్ని నొక్కి వక్కాణించింది, కళావతి.

“అయితే, ఒక పని చెయ్.” అని మాష్టారు, సలహా ఇవ్వబోతూంటే.

“ఏమిటో.. అది.” అని నిజంగా తెలుసుకోగోరినట్లు, నటించింది, కళావతి.

“ఒక మగ, ఒక ఆడ, అయితే, నీ కోరికా, నా కోరికా కూడా తీరుతాయి. బాగుంది కదూ, నా ఆలోచన.” అని, లెక్కలు చేస్తున్న విద్యార్థి, ఇక్కట్లు పడుతూ ఉంటే, సమస్యా పరిష్కారం చూపిన, మాష్టారువలే, పోజు పెట్టేరు, మాష్టారు.

“చాలా.. బాగుంది.” అని కొంటెగా దంతములతో సున్నితముగా నొక్కుతుండెడి జిహ్వను, బయటకు జాపి, అర్ధనిమీలిత నేత్రాలతో,

“ఇదేమయినా, బజారులో ఒక సువర్ణరేఖ, ఒక బంగినిపల్లి మామిడి పళ్ళు కొనుక్కోవడం, అనుకొంటున్నారా ఏమిటి, అబ్బాయి గారు.” అని సరసముగా, మాష్టారి తలపై, ఒక మెత్తని మొట్టికాయ వడ్డించేరు, గురువమ్మగారు.

“ఆమ్మో, నన్ను కొట్టకు. మా అమ్మ కూడా లేదు.” అని, కళ్ళు నులుపుకొంటూ, ఏడుపు నటించేరు, మాష్టారు.

“ఏడువకు, ఏడువకు, నా చిట్టి తండ్రీ.” అని గురువమ్మగారు, మగని శిరసును చుంబించి, లాలన నటించేరు.

అంతలో, వారి ప్రణయ సన్నివేశానికి అంతరాయం కలిగిస్తూ, పనిపిల్ల, వీధి తలుపు తట్టింది.

మాష్టారి ఇంట్లో, నూకాలమ్మ అనే పనిమనిషి, అప్పటికి సుమారు నాలుగు సంవత్సరాలనుండి పని చేస్తూ ఉండేది. నమ్మకమయినది. దాని శుచి, శుభ్రత, చూసి, తెలియనివారెవరూ దానిని పనిమనిషి అనుకునేవారు కాదు. మంగమ్మగారు గతించేక, వంటింట్లో కొన్ని పనులు, నూకాలమ్మచేత చేయించుకోమని, మాష్టారు, భార్యకు సలహా ఇచ్చేరు. కళావతి సంశయిస్తూ ఉండేది. మాష్టారు, పరిస్థితుల ప్రభావానికి, కాలంతోబాటు మారాలి, అని సలహా ఇచ్చేరు. అప్పటినుండి, నూకాలమ్మకు వంటింటి ప్రవేశమయింది. కూరలు తరగడం, బియ్యం, పప్పుల్లో, రాళ్లు ఏరడం వంటి పనులు చేస్తూ ఉండేది. పారితోషికం పెరిగింది.

ఒకరోజు, నూకాలమ్మ తిరగలిలో బియ్యం విసురుతూ ఉండేది. దగ్గరలో, కళావతి రుబ్బురోలులో పచ్చడి రుబ్బుతూ ఉండేది. నూకాలమ్మ తిరగలికి విరామమిచ్చి,

“అమ్మగారండి, మీరు మీయాళ్ళ యింటికి యెప్పుడు ఎల్తారండి.” అని వినయంగా అడిగింది, కళావతిని.

“ఇంకా మూడు నాలుగు నెలలుందే. ఏం; ఎందుకడిగేవు.” కళావతి జవాబులో ప్రశ్న.

“మీరు ఎల్లేక అయ్యగారి కూడు ఎట్టాయండి. అయ్యగారే వంట సేత్తారా.” అని మనసులో ఉండెడి అనుమానాన్ని తీర్చుకోబోయింది, నూకాలమ్మ.

“అయ్యగారికి, అంత వంట రాదే. ఏదో కాఫీ పెట్టుగోగలరు. అయినా అయ్యగారికి టైము ఎక్కడుందీ. చూస్తున్నావుగదే. అయ్యగారిదగ్గర చదువుకోడానికి ఎంతమంది వస్తున్నారో. ముందు గదిలో జాగా చాలక వెనకగదిలో కూడా కూర్చోపెడుతున్నారు.”

“అయితే, మరి ఏటి సేత్తారండి.”

“ఎవరయినా సరైన వంటమనిషి కోసం చూస్తున్నాను. నువ్వు కూడా చూడు; ఎవరయినా ఉన్నారేమో.. మన ఇంటి సంగతి నీకు తెలుసుగదే.”

“నాకు ఎరికేనండి, అమ్మగారూ. పని నీటుగ సెయ్యాలిగదా. (కొద్ది క్షణాలు ఆగి) అమ్మగారండీ, నా ఎరికిన ఓ అమ్మగారు ఉన్నారండి. ఆ యమ్మని, (చిన్న నవ్వుతో) దుక్కసూరమ్మగారు అంటారండి.”

“అదేమి పేరే, దుక్కసూరమ్మ, సన్నసూరమ్మాను.” నవ్వుతూ, అడిగింది కళావతి.

“సన్నసూరమ్మగారు కూడా ఉన్నారెండి, అమ్మగారూ. ఆ యమ్మా వంటలు సేత్తారండి. కాని యారి ఇంటికాడ సెయ్యరండి. పెళ్లిళ్ల కాడ సేత్తారండి. ఆ యమ్మ అయ్యగారు, పూజలు సేయీత్తారండి.”

“నూకాలూ, ఆ అనవసరం విషయాలు ఆపి, ఆవిడ; ఎవరో (చిరునవ్వుతో) దుక్కసూరమ్మగారు, అన్నావ్. ఆవిడ సంగతి చెప్పు. ఆవిడని అడిగి చూడు. మన ఇంట్లో పని చేస్తుందేమో.”

“ఆ యమ్మ సేత్తాదండి. ఆ యమ్మే, నాతో సెప్పినారండి; యారైనా పెద్దోళ్ళు ఇంట్లో పని సూడమని. ఆ యమ్మతో సెప్పీదా, అమ్మగారు.”

“చెప్పు, మన ఇంట్లో పని సంగతి నీకు తెలుసుగా. రోజూ రావాలి. నాగాలు పెట్టకూడదు.” అని పని నిబంధనలు చెప్పింది, కళావతి.

“ఆ యమ్మకి, అన్నీ.. సెప్పినానండి. ఏటేటి సెయ్యాలో.. ఎట్టా సెయ్యాలో.. అన్నీ సెప్పినానండి.”

“మరేం. సగం సంగతులు, నువ్వే, మాట్లాడేసావన్నమాట. సరే, ఆవిడని రేపు నన్ను కలియమని చెప్పు.”

నూకాలమ్మ తెలివితేటలను మెచ్చుకొంది, గురువమ్మగారు.

ఆ మరునాడు, దుక్కసూరమ్మగారు, కళావతిని కలుసుకున్నారు. పూర్తి ఉద్యోగ నిబంధనలు తెలుసుకొన్నారు. పారితోషికం నిర్ణయమయింది. మంచిరోజున, ఉద్యోగంలో ప్రవేశించేరు, సూరమ్మగారు.

ఒక ఆదివారం, మాష్టారు దంపతులు విజయనగరం వెళ్లడం సంభవించింది. గణపతి శాస్త్రిగారు, ఒకరింట్లో సత్యనారాయణ వ్రతం చేయించడానికి వెళ్ళేరు. వరలక్ష్మి మధ్యాహ్న భోజనం తయారు చేస్తూ ఉండేది. వదినగారు, ఎంత వద్దన్నా, మరదలు కూరలు తరగడానికి సిద్ధమయింది. వారిద్దరకు దగ్గరలో, మాష్టారు ఒక పీటమీద ఆసీనులయ్యేరు. లోకాభిరామాయణం మొదలయింది. ఆ సమయంలో, మాష్టారి మేనల్లుడు శంకరశాస్త్రి ప్రవేశించి, మేనమామ ప్రక్కనే బుద్ధిగా మఠం వేసుకొని కూర్చున్నాడు. వాడినుద్దేశించి, మాష్టారు,

“శంకరా, ఏ క్లాసు చదువుతున్నావురా.” అని ఆప్యాయంగా అడిగేరు.

“ఆరో క్లాసు మామయ్యా.”

“వదినగారూ, శంకరుడి వయసు ఎంత ఉంటుందండీ.” గురువమ్మగారి విచారణ.

“క్రిందటి నెలే, పదకొండు నిండేయమ్మా.” వరలక్ష్మి జవాబు.

“ఏరా, బుద్ధిగా చదువుకొంటున్నావా.” మేనల్లుడిని దగ్గరగా తీసుకొని మాష్టారు వాడి ముఖంలోకి చూస్తూ అడిగేరు.

“శంకరా, మొన్న క్లాసుపరీక్షల్లో, లెక్కల్లో నీకు ఎన్ని మార్కులు వచ్చేయో, మామయ్యకు చెప్పు.” అని పుత్రరత్నాన్ని ప్రోత్సహించింది, వరలక్ష్మి.

శంకరుడు కొద్దిగా సిగ్గుపడుతూ, చిన్న చిరునవ్వు నవ్వేడు.

మేనమామ, సిగ్గుబడుతున్న, మేనల్లుడిని, మరికొద్దిగా దగ్గరకు తీసుకొని, వాడి ముఖంలోకి కొంటెగా చూస్తూ,

“భయపడుతున్నావ్, సున్నా వచ్చింది కదూ.” అని చమత్కరించారు.

శంకరుడు ఫక్కున నవ్వి, కాదన్నట్లు, తల అడ్డంగా ఊపేడు.

“నాకు తెలుసు; నీకు నూటికి నూరు మార్కులూ వచ్చేయికదూ.” అని కళావతి, వాడి నోట మాట రాబట్టడానికి ప్రయత్నించింది.

దానికి స్పందిస్తూ, అవును అన్నట్టు, తల నిలువుగా క్రిందకు మీదకు నెమ్మదిగా ఊపేడు, శంకరుడు.

మాష్టారు దంపతులు, శంకరునికి, నిండుగా అభినందనలు తెలియజేసేరు.

కొద్దిసేపటి తరువాత, శంకరుడు వీధిలోకి వెళ్ళేడు; తోటి పిల్లలతో ఆడుకోడానికి. మళ్ళీ ముగ్గురూ సంభాషణలో పడ్డారు. అందులో, ఆడపిల్లల చదువు విషయం వచ్చింది. శంకరుడి చెల్లి గిరిజకు, ఏడేళ్లు ఉన్నాయని, ఇంటిదగ్గరే, దానికి తెలుగు వ్రాయడం, చదవడం, శాస్త్రిగారు, వరలక్ష్మి, నేర్పుతున్నారని, ఎక్కాలు కంఠస్థా పెట్టిస్తున్నారని, మాష్టారుకు తెలిసింది. విద్యార్హత, మగవారితో బాటు, స్త్రీలకు కూడా సరిసమానంగా ఉండాలని, మాష్టారి అభిప్రాయం. మేనకోడలును, బడిలో చేర్చి, పద్ధతిగా చదివించాలని, మాష్టారు, అక్కకు నొక్కి చెప్పేరు. శాస్త్రిగారు కూడా ఆ విషయం ఆలోచిస్తున్నారని, వరలక్ష్మి చెప్పింది.

కళావతికి నెలలు నిండుతూ ఉండేవి. విజయనగరంలో, గణపతి శాస్త్రి గారి ఇంట, సూడిదలు ఇవ్వడం జరిగింది. కళావతి పుట్టింట చేరింది. నిండు చూలాలు, నెలలు నిండి, ఓ రోజు పండువంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువుకు నామకరణం జరిగింది. సంతోషంతో చూస్తున్న, పెద్దల సమక్షంలో, మాష్టారు, ఇత్తడి పళ్ళెంలోని బియ్యంలో, విశ్వేశ్వరశర్మ, అని రాసేరు.

సూరమ్మగారు వంటింటి బాధ్యత తీసుకోవడంతో, పుట్టిన పిల్లడి లాలన, పాలనలో, కళావతి ఎక్కువ సమయం, వర్ణింపలేని సంతోషంతో గడుపుతూ ఉండేది. వీలయిన సమయాల్లో, మాష్టారూ ఆ సంతోషం పంచుకొంటూ ఉండేవారు. దినదిన ప్రవర్ధమానమవుతుండెడి విశ్వేశ్వరశర్మ, మాష్టారి దంపతులను, కొన్ని సమయాలలో ఊహాలోకాల్లో విహరింపజేసేవాడు. పాలు త్రాగిన పిల్లడిని, నిదురింపజేసే ప్రయత్నంలో, చెరో చేతితో, వాడున్న ఊయలను, మెల్లగా ఊపుతూ, తమ బుజ్జికన్నను, ఎన్నెన్ని చదువులో చదివించాలని, ప్రణాళికలు వేస్తూ ఉండేవారు; మాష్టారు దంపతులు. పెద్ద చదువులు, తప్పక చదివించాలని ఇద్దరూ ఏకాభిప్రాయంలో ఉండేవారు. అందుకు అనుగుణంగా, విశాఖపట్నంలో ఉన్నత చదువులకు అవకాశాలు ఉండడం, వారికి కలిసి వచ్చిందని, సంతసించేవారు.

హద్దులులేని సంతోషం, మాష్టారు దంపతులకు కాలప్రగతి వేగం తెలియకుండా చేసింది. నాలుగు నూతన సంవత్సరాలు, గతంలో కలసిపోయేయి. ఓ రోజున, విశ్వేశ్వరశర్మ, ఓ చక్కని పాపకు అన్నయ్య అయ్యేడు. ఆ చిట్టితల్లి, మాష్టారి తల్లి మంగమ్మగారి పేరుగలదయింది. నూతన శిశువు రాక, తొలి రోజుల్లో కళావతికి ఒక సంతసించెడి సమస్యకు దారి తీసేది. పాప, తల్లి పాలు త్రాగుతున్న సమయంలో, బుజ్జికన్న తన హక్కు కాపాడుకోడానికి , తల్లి ఒళ్ళో బలవంతాన్న చేరేవాడు. నవ్వుకొంటూ, వాడిని బుజ్జగించి, క్రిందకు దింపేది, ఆ మాతృమూర్తి.

ఇద్దరు పిల్లలూ గారాబంగా పెరుగుతూ ఉండేవారు. పిలుపులో, ముద్దుల కొడుకు, ‘నాన్నలు’ అయ్యేడు. చిట్టితల్లి మంగమ్మ, ‘అమ్మలు’ అయింది. అమ్మలు అందాల రాసి. మేనత్త ఎప్పుడూ, ‘ఒసే చక్కనీ’ అనే పిలిచేది. ‘చక్కని చక్కని చుక్కలులా, ఎంత చక్కని చుక్కలులా’ అని కళావతి ముద్దులగుమ్మను, ముద్దులాడేది. తండ్రి భుజాల మీద స్వారీ చెయ్యడం, ఆ చక్కని చుక్కకు ఎక్కువ ఇష్టం.

ఉగ్గుపాలు త్రాగుచుండెడి మంగమ్మను, జీవితంలో ఎలా తీర్చిదిద్దాలో, మాష్టారు దంపతులు, కొద్దిపాటి లోతుగానే ఆలోచించేవారు. నిరభ్యంతరంగా, ఎంత పెద్ద చదువులయినా, చెప్పించ దలచుకొన్నారు. దానితోబాటు, చిట్టితల్లిని, మెట్టినింటికి పంపే ప్రయత్నాలు, చదువు పూర్తయినవరకూ, చేయకూడదు, అని ధృడంగా నిశ్చయించుకొన్నారు.

బుడిబుడి నడకల బుడుతడు, వడివడిగా పెరిగి, ఓ రోజు, బడిలో చేరేడు. ఒక్కొక్క తరగతి, అవలీలగా దాటసాగేడు. ‘పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది.’ అంటారు. విశ్వేశ్వరశర్మ, తెలివితేటలలోనేగాక, వినయవిధేయతలలో కూడా, గురువుల ప్రశంసలు అందుకొనేవాడు. అది తెలిసి, మాష్టారి భుజాలు పొంగిపోయేవి. అలా, తేనెలొలుకు మాటలు, స్కూలులో ఏ రోజయినా, మాష్టారి చెవిన పడితే, ఇంటనడుగు పెడుతూనే, ‘కళావతీ, ఈవేళ మన నాన్నలు గురించి, తెలుగు మాష్టారు ఏమన్నారో తెలుసా..’ అని భార్యకు సగర్వంగా ఆ మధురవాణి వినిపించి, సంతోషాన్ని పంచుకునేవారు.

మరికొన్ని సంవత్సరాలు, కాలగర్భంలో కలసిపోయేయి. చిన్న లెక్కల మాష్టారి నాన్నలు, పదకొండవ తరగతిలో అడుగు పెట్టేడు. ‘నీ వెంటే నేనున్నాను, అన్నా’ అన్నట్టుగా, అమ్మలు ఏడవ తరగతిలో అడుగుపెట్టింది. ‘అన్నను మించిన చెల్లెలు’ అనిపించుకోసాగింది, ఆ చిన్నది. అన్న, చెల్లెలు, రోజూ స్కూలుకు కలసి వెళ్లేవారు. ఇంటికి కలసి వచ్చేవారు. మాష్టారు, రోజూ స్కూలునుండి కూరలబజారుకు వెళ్లి, తాజా కూరలు కొనుక్కొని, ఇంటికి వెళుతూ ఉండేవారు.

శర్మ, చెప్పుకోదగ్గ మార్కులతో, S.S.L.C. పాసయ్యేడు. ఇంటర్మీడియేట్ సైన్సెసులో జాయినయ్యేడు. ఆ రోజు, నాన్నలు మొదటిసారిగా కాలేజీకి బయలుదేరుతూ ఉండేవాడు. ముందుగా, పూజామందిరంలోని, సీతారామాంజనేయ పటానికి, సాష్టాంగ నమస్కారం చేసేడు. తరువాత, తల్లిదండ్రులకు పాదాభివందనం చేసేడు. తన కన్నా, ఒక అంగుళం ఎత్తు ఎదిగిన, తనయుని కౌగలించుకున్నారు, మాష్టారు. ఆ సమయంలో, ఆయన మనసులో, ఎట్టి ఆనందం చోటుచేసుకొన్నదో తెలియదు కాని; ఆయన కంట రాలిన ఆనందబాష్పాలు, ఆ ఆనందానికి అద్దం పట్టేయి. అది గమనిస్తుండెడి కన్నతల్లి కంటిని కూడా, ఆనందబాష్పాలు అలరించేయి. తమ కలలు ఫలిస్తున్నాయని, ఇద్దరూ సంతసించేరు.

శర్మకు, ఒకమారు మనసులో ఏదో సందేహం కలిగింది. ఆ విషయం తెలుసుకోడానికి, తల్లిని సంప్రదించేడు.

“అమ్మా, నాన్నగారు ఎంతో తెలివయినవారు. స్కూలులోను, బయటా, అందరూ నాన్నగారిని తెలివయినవారని పొగుడుతూ ఉంటారు. మరి, స్కూలు ఫైనలుతో నాన్నగారు చదువు ఎందుకు ఆపేసారమ్మా. విజయనగరంలో కాలేజీ ఉంది కదా. నాన్నగారు కాలేజీలో ఎందుకు చదువుకోలేదు.” అని, సందేహ నివృత్తి కోరేడు, కుమారుడు.

“నాన్నలూ, అప్పట్లో, మీ నాన్నగారి పరిస్థితి ఎలా ఉండేదంటే,..” అని, గతంలో మాష్టారు తనకు తెలియజేసిన వివరాలన్నీ, పూస గ్రుచ్చినట్లు, చెప్పింది, కళావతి.

కుటుంబ బాధ్యత, భుజాన్న వేసుకొనుటకు, అందుబాటులో నుండెడి, అవకాశాలను కన్నతండ్రి ఎలా త్యాగం చేసేరో, తల్లి నోట వివరంగా విన్నాడు, నాన్నలు. తను విన్నవి విన్నట్టూ, చెల్లెలుకు చెప్పేడు, అన్నయ్య. తమ ఉజ్వల భవిష్యత్తుకై, తండ్రి, రాత్రింబగళ్లు శ్రమిస్తున్న వాస్తవం, ఆ ఇద్దరి మనసులో ధృడంగా నాటింది. నాన్నగారిమీద గౌరవం, అత్యధికంగా పెరిగింది, ఆ ఇద్దరకు.

శర్మ, కాలేజీలో చేరేక, ఇంటినుండి స్కూలుకు వెళ్లి రావడంలో, మంగమ్మకు తోడు లోపించింది. స్కూలునుండి, ఇంటికి వెళుతున్న సమయంలో, కొంత దూరం, మరొక అమ్మాయి, తోడు ఉండేది. మిగిలిన దూరం, ఒంటరిగా ఇంటిదాకా నడిచేది. అలా సుమారుగా రెండు సంవత్సరాలు గడిచేయి. ఆ ఒంటరి ఘడియలలోని మంగమ్మ, ఆ స్కూలులోనే మరొక తరగతిలోని, ఒక ఆకతాయివాని కంటబడ్డాది. ఆ సమయాల్లో, ఆ నిస్సహాయురాలి వెంటబడి, అసభ్యకరమగు మాటలతో, ఆ చిన్నారిని వేధించసాగేడు. దిక్కు తోచక, బితుకు బితుకుమంటూ, భయపడిన లేడిపిల్లలా, వడివడిగా అడుగులు వేస్తూ, ఇంటి గుమ్మం చేరుకొనేది, మంగమ్మ. కొద్ది రోజులు, ఆ వేధింపులు పట్టించుకోకుండా కాలం గడిపింది, మంగమ్మ. అలా రెండు మూడు వారాలు గడిచేయి. ఒకనాడు, ఆ దుర్మార్గుని వేధింపు ముదిరింది. మంగమ్మ భుజం గట్టిగా తాకి, అసభ్యకర ప్రవర్తన చేసేడు. ఆ పరిస్థితిలో, ఆ చిన్నది, చేయగలిగినది లేక, కంట తడి పెట్టుకొంటూ, ఇల్లు చేరుకొంది. చేరుతూనే, పడకగదిలో తన మంచముపైబడి, భోరున ఏడువసాగింది. అది విన్న కన్నతల్లి, తల్లడిల్లి, హుటాహుటిన, విలపిస్తున్న కూతురు చెంత చేరింది.

తన చక్కని తల్లి, ఏ చిక్కులలో చిక్కుకొందో అని ఆందోళన చెందింది. పరుండి, వెక్కి వెక్కి విలపిస్తున్న, చిన్నదానిని లేపి, దగ్గరగా తీసుకొని, తల నిమురుతూ, “ఏమయిందమ్మా నీకు, నా చిట్టితల్లీ చెప్పమ్మా. ఎవరయినా కొట్టేరా తల్లీ. నువ్వు, నా బంగారు తల్లివి కదూ; నాతో చెప్పమ్మా.” అని పరిపరి విధాల బుజ్జగించింది. ఆ గాయపడిన లేత మనసు, జరిగిన దుర్ఘటన వివరించింది. ఆ దుష్టుడు, తన తరగతి వాడు కాదనియు, మరే తరగతి వాడో తెలియదు, అంది. మరింతగా విలపిస్తూ, తల్లిని, కౌగలించుకొంది. “రేపటి నుండి నేను స్కూలుకు వెళ్ళనమ్మా.” అని పదే పదే, వినయంగా విన్నవించుకొంది. కళావతి మనసు తీవ్రంగా గాయపడింది. ఆపుకోలేని కోపం కలిగింది. పువ్వులలో పెట్టి పెంచుతున్న, కన్నకూతురును, కితవ చేష్టలకు గురిచేసి విలపింపజేసిన, దుర్మార్గుని, నిలువునా చీరేయాలనిపించింది. తన కోపాన్ని దిగమ్రింగుకొంది, ఆ సహనశీలి. చిన్నదాని ముఖం చన్నీళ్లతో కడిగి తుడిచింది. సూరమ్మగారు చేసి ఉంచిన బజ్జీలను, ప్రేమతో తినిపించింది. అవి ఆరగించి, మరల మంచముపై మేను వాల్చింది, మంగమ్మ.

కొద్దిసేపటికి, మాష్టారు తాజా కూరలతో ఇల్లు చేరుకొన్నారు. నేరుగా పెరటిలోనికి వెళ్లి, కాళ్ళూ చేతులూ కడుగుకొన్నారు. శ్రీమతి అందించిన తువ్వాలుతో, తుడుచుకొన్నారు. “కళావతీ, అమ్మాయి కనిపించడం లేదు. స్కూలునుండి వచ్చిందా.” అని వివరణ కోరేరు.

“ఉష్షు” అని మెల్లగా సంజ్ఞ చేస్తూ, “ఇలా రండి. చెపుతాను.” అంటూ, నట్టింట్లోకి దారి చూపింది. పీట వేసి మాష్టరును కూర్చోమంది. ప్లేటుతో బజ్జీలు తెచ్చి, మాష్టారు ముందు ఉంచింది. మాష్టారు ఆందోళన చెందుతూ, “ఏమిటయింది.” అని అడిగేరు. మగనికి దగ్గరగా చేరి, జరిగినది మెల్లగా తెలియజేసింది. ఆ నమ్మశక్యము గాని, నిజాన్ని తెలుసుకొని, మాష్టారు కొయ్యబారిపోయేరు. నోటిలోని, సగం తిన్న బజ్జీముక్క నేల రాలింది. కళ్ళనీళ్ళతో, “అమ్మాయి ఎక్కడ ఉంది.” అని మెల్లగా అడిగేరు. గదిలో పరుందని, సంజ్ఞ చేసి చెప్పింది, కళావతి. పూర్తిగా కోలుకొన్నాక మాట్లాడవచ్చని సలహా ఇచ్చింది. “రేపటినుండి స్కూలుకు వెళ్లనంటున్నాది.” అని తల పట్టుకు విలపించింది. మాష్టారు పరిస్థితిని అవగాహన చేసుకొన్నారు. ఒక నిట్టూర్పు విడిచి, “కళావతీ, ఇప్పుడు ఆ విషయం అమ్మాయితో మాట్లాడొద్దు. నువ్వు ధైర్యంగా ఉండు. సమస్యకు పరిష్కారం నేను చూస్తాను. జాగ్రత్తగా ఆలోచించి, ముందడుగు వెయ్యాలి. అమ్మాయి తప్పక స్కూలుకు వెళుతుంది. నాకు ఆ ధైర్యం ఉంది.” అని, మాష్టారు, భార్యామణికి హామీ ఇచ్చేరు. హెడ్ మాస్టరు గారి ఇంటికి వెళ్లి, ఆయనతో జరిగిన విషయం చర్చించి, ఆయన సలహా తెలుసుకొని వస్తానని చెప్పేరు.

మరి కొద్ది సేపట్లో, శర్మ కాలేజీనుండి వచ్చేడు. కాళ్ళూ చేతులూ కడుగుకొని, చెల్లెలు కోసం నలుప్రక్కలా చూసేడు. మంగమ్మ, పడకగదిలో, తలుపు చారవేసుకొని, పరుండి ఉండడం గమనించేడు. ఆ సమయంలో, ఎందుకు అలా పరుందో బోధపడలేదు. చెల్లికి నిద్రాభంగం చేయదలచలేదు. నేరుగా వంటింట్లోకి వెళ్ళేడు; తల్లిని కలియడానికి. అక్కడ, కూరలు తరుగుతున్న సూరమ్మగారిని అడిగేడు; అమ్మ ఎక్కడ ఉందని.

“తలనొప్పిగా ఉందని, నాతో అన్నారు బాబూ.” అని సమాధానమిచ్చేరు, ఆవిడ.

తలుపు తట్టి, అమ్మ పడకగదిలోనికి వెళ్ళేడు, శర్మ. గది చీకటిగా ఉండేది. లైటు వేసేడు. పక్కమీద పరున్న, తల్లి నుదురు నిమురుతూ, “అమ్మా, అమృతాంజనం రాసీదా.” అని ఆప్యాయంగా అడిగేడు.

“అక్కర్లేదు నాయనా; సద్దుకొంది. నాన్నా, రా, బజ్జీలు తిందుగానివి.” అని లేచి కూర్చొంది. కళావతి కళ్ళ, నీళ్లు రాలేయి; పైటకొంగుతో తుడుచుకొంది. అది గమనించేడు, శర్మ. గాభరా పడ్డాడు. “ఏమిటయిందమ్మా, ఎందుకు అలా ఉన్నావు. చెల్లి కూడా ఎందుకు పడుకొంది అమ్మా.” అని ఆందోళనతో ప్రశ్నించేడు. తీసి ఉన్న, గది తలుపును మూసి, తన చెంతకు రమ్మని మెల్లగా చెప్పింది, కళావతి. సూరమ్మగారికి వినబడకుండా, బరువయిన గుండెతో, జరిగినది చెప్పి, తన మనోవ్యథ, నాన్నలుతో పంచుకొంది. తనకు, అతి గారాబమయిన చెల్లెలుకు, ఒక నీచుడు చేసినది విని, తోక త్రొక్కిన త్రాచుపాములా అయ్యేడు, అన్నయ్య. ఉద్రేకంలో ఏదో అనబోతూంటే, “సూరమ్మగారు వింటుంది, గట్టిగా మాట్లాడకు.” అని, ఆవేశంలో నుండెడి తనయునకు హితబోధ చేసింది, కళావతి. కొద్దిసేపట్లో, సూరమ్మగారి డ్యూటీ అయిపోయింది. అమ్మగారి గదికి దగ్గరగా వచ్చి, శలవు తీసుకొన్నారు.

హెడ్ మాష్టార్ని సంప్రతించి, మాష్టారు ఇంటికి వచ్చేరు. ఆ వివరాలు, కళావతికి, దగ్గరలోనే ఉండెడి, కుమారునికీ, తెలియజేసేరు. ఉద్రేకంలో నుండెడి తనయుని, శాంతించమన్నారు.,

మరునాటినుండి, అమ్మలును, రోజూ తనతోబాటు స్కూలుకు తీసుకెళ్లి, స్వయంగా, తనే ఇంటికి దిగబెడతానన్నారు. ఆ తరువాతే, కూరల బజారుకు వెళతానన్నారు.

ఆ మరునాడు, అమ్మలు, తండ్రితోబాటు స్కూలుకు వెళ్ళింది. హెడ్ మాస్టారు, స్కూలులోని పై తరగతులకు తీసుకెళ్ళేరు. పదకొండవ తరగతిలోని, అపరాధిని, ఏరి చూపించింది, మంగమ్మ. వాడు, నగరంలోని, లాయరు వివేకరావుగారికి, పల్లెటూళ్ళో ఉండెడి, చెల్లెలి కొడుకని తేలింది. లాయరుగారికి కంప్లైంటు అందింది. మేనల్లుడికి, దేహశుద్ధి చేసేరు. మందు పనిచేసింది.

అది, మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన, తొలి దశాబ్దంలోని మాట. తరువాత దశాబ్దాలు మారేయి కాని, దురదృష్టమేమిటంటే, మన ఆడపిల్లల దశ మాత్రం మారలేదు. అంతకంతకు, మరీ ఆందోళనకరంగా మారుతోంది. ఈనాటికీ, ఎన్ని పసిమొగ్గలు, ఎన్ని వికసించిన పూలు, కామాంధుల చేతులలో, నలిగి నశించిపోతున్నాయో, ఆ పరమాత్ముడికే ఎరుక. జాతి, తలవంచుకొని సిగ్గు చెందవలసిన పరిస్థితి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here