కాలోహి దురతిక్రమః!!

1
11

[శ్రీ సముద్రాల హరికృష్ణ రాసిన ‘కాలోహి దురతిక్రమః!!’ అనే గల్పికని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“ప్ర[/dropcap]భో, విరూపాక్షా! ఏమిటీ పరీక్ష?! సాక్ష్యం ఔనంటున్నది, మనసు కాదంటున్నది! తండ్రిగా భావించి గౌరవించిన అప్పాజీ గురించి ఇట్లా ఆలోచించే దుస్థితి కల్పించావే విభో, ఈ వయస్సులో! సర్వజ్ఞుడివే, నాకు ఈ ఒక్క నిజం చెప్పి, దయ చూపు స్వామీ”, —

అదీ —

మనసులోనే శ్రీక్రృష్ణదేవరాయలవారు చేసిన ప్రార్థన- తన భవ్య భవనంలోని పూజా గ్రృహంలో ఆనాడు!

రాయలవారి మనసు మనసులో లేదు రెండు రోజులుగా!

నిద్రాహారాలు పూర్తిగా దూరమైనాయి, తదేక ఆలోచనతో!

తుమ్మెద అక్కడక్కడే రొదచేస్తూ తిరిగి, తప్పించుకునే మార్గం చూడలేక కొట్టుమిట్టాడే స్థితి తలపిస్తున్నది, వారిని చూస్తుంటే!

నిజానికి చూసే వారెవరున్నారు?!

ఎవ్వరికీ వారు ప్రవేశమే ఇవ్వట్లేదు నాలుగు రోజుల నుంచీ, తమ మందిరానికి, తమ సమీపానికీ!

రాజ ప్రాసాదాలన్నిటిలో కనీ వినీ ఎరుగని నిశ్శబ్దం తాండవిస్తున్నది, గత వారం రోజులుగా!!

***

రాయల వారి ఆరు సంవత్సరాల వయస్సు గల కుమారుడు, తిరుమల రాయలు గతించి, అప్పటికి సుమారు నెల అవుతున్నది.

సాక్ష్యులందరిని ప్రశ్నించటం, వాజ్ఞ్మూలాలు తీసుకోవటం, ప్రాడ్వివాకుల ఆంతరంగిక చర్చలు – మొదలైన న్యాయ ప్రక్రియ జరిగి, నేర విచారణ పూర్తియైనది.

కృష్ణరాయల వారి కుమారుడు, పట్టాభిషిక్తుడూ అయిన తిరుమల రాయల మరణానికి కారణం, మహామంత్రి తిమ్మరుసు తన పుత్రుడైన తిమ్మదండనాథునితో కుట్ర చేసి, చేయించిన విషప్రయోగమే అని ప్రాడ్వివాక సంఘం-నిర్ధారణకు వచ్చారు. కూలంకష విచారణ పూర్తి చేసి, అందుకు ఆ పూర్వ శిరఃప్రధానులు శిక్షార్హులనీ, తేల్చారు.

వారి నివేదిక కిందటి రోజుననే న్యాయ కూటమి అధ్యక్షులు స్వయంగా రాయల వారిని ప్రత్యేక మందిరంలో దర్శించి సమర్పించారు.

ఇక రాయల వారి ఆమోదముద్రయే తుది మట్టము,శిక్ష అమలు చేయటానికి.

మరునాడే సభాభవనంలో నేర వివరణ, శిక్షా కాల ప్రకటన జరుగవలసియున్పది.

ఇది జరిగిన వెంటనే శిక్ష అమలు చేయబడుతుంది.

అదీ ఒక లాంఛనమే, ఇంత దాకా విద్యానగర చరిత్రలో ప్రభువులు కలుగజేసికొని మార్చిన న్యాయవేత్తల నిర్ణయములు బహు అరుదు.

దానికి ప్రధాన కారణము, పెద్ద నేరాల విచారణల వివరాలు, ఆనుపానులు ఎప్పటికప్పుడు ప్రభువులకు నివేదిస్తూనే ఉంటారు, వారికున్న సమయావకాశాన్ని బట్టి!.

ప్రభువులు ఏదైన బలీయమైన కారణాల వలన, న్యాయ కూటమి ఇచ్ఛిన తీర్పును మార్చాలని కోరితే గాని, సాధారణంగా, ఏ మార్పులూ, కలగచేసుకోవటాలు ఉండవు.

అంటే, ఏ అభ్యంతరము, ఆదేశము శిక్షాకాలారంభ దినానికి రాయ ప్రభువుల కార్యాలయము నుండి న్యాయాధీశ కూటమికి చేరకపోతే, అది అమలుపరచి తీరుతారు యథా ప్రకారంగా!

దయాభిక్ష కోసం చేసే విన్నపాల మాట, అది వేరు.

పటిష్టమైన న్యాయవ్యవస్థ నిర్మించి, దాని నిర్వహణ సక్రమంగా చేయటం, ఈ ప్రభువు వంశంలో ప్రధాన ఆదర్శాలలో ఒకటి, రాజ్య తంత్రంలో.

ఇప్పుడు ఈ రాకుమార హత్యానేరంలో ఆ శిక్షా ప్రకటన సమయ మాసన్నమైంది.

అది మరునాడే!

ఈ నేరానికై విధించినది పది సంవత్సరాల కారాగార శిక్ష!

సభాంగణంలో ప్రకటించగానే అది తక్షణం అమలై పోతుంది.

విజయనగర సామ్రాజ్య చరిత్ర లోని అతి విషాదమూ, సంక్లిష్టమూ అయిన కాలఘట్టమది!

***

ఏకాంతంగా ఆసీనులై యున్న రాయల మదిలో గత కొన్ని రోజులుగా జరిగిన సంఘటనలన్ని వరుసగ పరుగులిడ సాగాయి.

మళ్ళీ మళ్ళీ అవే పునరావృత్తమై, ఆలోచనల అల్లిబిల్లి అల్లికయై, ఏ నిర్ణయమూ సరియైనదిగా వారి బుద్ధికి తోచటల్లేదు, న్యాయకూటమి తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా.

వారి మదిలోనూ, మహారాణి తిరుమల దేవి గారి హృదయంలోనూ రేగిన అనుమానాలే కూటమి కూడా సర్వమూ పరిశీలీంచి నిర్ధారించినట్లైనది.

అయినా ఏదో ముల్లు లాగా బాధించ సాగింది,ఇందులో దోషిగా నిలబడ్డది, అంతవరకు తనకు అత్యంత ఆప్తుడైన మహామంత్రి తిమ్మరుసు కావటం వలన!

ఆలోచనలు, నిస్తబ్ధత; మళ్ళీ ఆలోచనలు, నిస్తబ్ధత – ఇదీ వారి కల్లోలిత మానసార్ణవ స్ధితి ఆ సమయంలో!

కనురెప్ప వాలుతుండగా, మళ్ళీ ఆ ఘటనలను నిశితంగా విశ్లేషించే యత్నం మొదలుపెట్టారు, రాయలవారు అప్రయత్నంగానే!

***

అసలు గత ఆరు నెలలుగా సాగుతున్న అభిషేక వేడుకలు ఆగిపోయే ఈ పరిస్థితికి దారి తీసినది –

ఆ రోజు జరిగిన కుమార తిరుమల రాయల వారి జన్మదిన వేడుకలు, ఆ తరువాతి విందు!

విందు పూర్తి కాగానే, కాస్సేపు బాగానే ఉన్న బాలుడు, అకస్మాత్తుగా ముహూర్త కాలంలో ఏదో బాధతో విలవిలలాడాడు.

వైద్యులు పరమ ప్రభావవంతమైన ఔషధ మిశ్రమాలు అనుపానాలు సేవింపచేస్తూనే వచ్చారు, కానీ ఫలితం లేకపోయింది.

తరతరాలుగా రాజవైద్యులయిన, అస్వస్థతా నిదాన నిష్ణాతులై, అపర ధన్వంతరులని పేరుమోసిన వారే అసహాయులై, “కారణం తెలియటం లేదు మహాప్రభో, మన్నించాలి”, అని వేడుకున్నారు.

గోధికావిషం, గౌళికా విషం, సరీస్రృపకీటక విషాలు, పత్రఫలపుష్పసంజనిత సర్వ విధ విష పరీక్షలు చేశారు కానీ ఏదీ ఇదమిత్థమని చెప్పలేకపోయారు, ఏ వైద్యులూ!

అన్ని ఉపాయాలూ చేశాము, అన్ని రకాల వైద్య నిష్ణాతులను సంప్రదించి పిలిపించి పరీక్ష చేయించాము.

ఫలితం శూన్యమై మిగిలింది, మా చిన్ని కుమారుడు మమ్ము వీడి వెళ్ళిపోయాడు, తిరిగిరాని లోకాలకు!

ఎవ్వరికీ పగ, పసి బాలునిపై?!

అంత తీవ్రతర విషాన్ని కర్కశులై ఎట్లా ప్రయోగించిరో, చిత్రమైన ఆ ప్రాణాంతక వ్యాధి కారణమేమిటో కూడా తెలియలేదే, అయ్యో!

***

చేయని యత్నమా, మొక్కని దైవమా – మాకు, రాణీ తిరుమల దేవి వారికీ!

పర్యవేక్షణ లోని లోపమనుకొనటానికే లేదు.

చిన్న రాయలవారికి తామే స్వయముగా ఎంపిక చేసి, తిమ్మదండనాథుని ఉంచాము, ఆ విధి నిర్వహణకు.

అతను తిమ్మరుసుల వారి పుత్రుడవటం, ఇంకొక సాటిలేని అర్హతగ భావించే నియమించాము.

తిమ్మరుసుల వారి పెంపకం అంటే అది, ధార్మికము, క్రమశిక్షణకు నిలువుటద్దం అన్నది జగమెరిగిన విషయమే!

తిమ్మదండనాథుడు కూడా మా ఊహకు తగినట్టే ప్రవర్తించాడు – నిష్కర్ష స్వభావానికీ, కర్తవ్యం పట్ల నిష్ఠకూ, స్వామిభక్తికీ అతని తరువాతనే వేరెవ్వరైనా!

ప్రాణాచార్యు లిరువురు ఏకకంఠంతో చెప్పారు, సమస్త భోజ్య చోష్య పానీయాలన్నీ తాము పరీక్షించిన పిమ్మటనే, రాకుమారుల వారు గ్రహించారని!

ఇక ఈ సర్వతోభద్రమైన ఇనుపచట్రము దాటి, ఏ తుచ్ఛ తక్షకం కాటు వేసిందో, నా ప్రాణ సమానమైన చిన్నవాడిని?!

మా కుల దైవము శ్రీ వేంకటేశ్వరుడే మా యింట ఈ బాలుడి రూపమై వెలిశాడనుకొన్నామే!

అంతటి వానికి ఈ అబోధగ ఉన్న రుగ్మతా, అకాల మరణమా?!

మా బుధ్ధి దూషితమై పోయి, సామాన్య బాలునికే అఖిలాండకోటి నాయకుని లక్షణాలు, ఆ అంశ ఆపాదించామా?!

దైవాపరాధమే జరిగి,ఆ పాపమే ఇట్లా వెన్నాడుతోందా?!

“ప్రభో వేంకటేశ్వరా, నీ దయకు పాత్రం గాని ఈ జీవన మెందుకు ప్రభో?! తెలియక చేసిన తప్పులు మన్నించవా కారుణ్యనిధీ”, అని ఆ అర్ధరాత్రి సమయంలో రాయల నోట శోకాకులితుడై అరిచినట్లే బిగ్గరగ వచ్చినై ఆ విన్నపాలు!

ఇదేమి కాల వైపరీత్యమో అంతా మబ్బులో నున్న సూర్యకాంతి లాగా మమ్మేమారుస్తోందే, మా ఆలోచనా పథాన్నే కప్పి వేస్తోందే?!

రాయలకు దుఃఖావేశము హెచ్చి ఆ కనుపించని శత్రువును ఖండఖండాలు చేయాలని రక్తం పొంగులు వారింది.

దక్షిణాపథ సార్వభౌములు, శాత్రవమత్తగజ సింహులు, శ్రీ కృష్ణదేవరాయల వారు ఏకాకియై, బేలయై, అసహాయ స్థితి నొక దాంట్లో చిక్కుపడినట్లు భావించిన క్షణమది.

సుదూర శూన్యములోకి చూస్తూ, వారు తమను తాము శాంతవరచుకోవటానికి యత్నించారు.

మళ్ళీ వేరొక ఉత్తుంగ తరంగంగా ఆలోచనల ఉరవడి వారిని ముంచివేసింది.

అంతలో అది వశం తప్పి, తిమ్మరుసు దిశగ మళ్ళింది.

గతంలో మమ్మల్ని రక్షించటానికి తిమ్మరుసుల వారు చేసిన తంత్రాలు, అన్ని సంఘటనలు, ప్రస్తుతపు ఋజువులు, మా అంతరంగం, మా సన్నిహిత వర్గం వారి వివిధ అనుభవాలు,- అన్ని వారిని దోషిగానే వేలు చూపిస్తున్నాయి.

అన్నింటినీ మించి, ధర్మాసనము వారి నిర్ణయమూ ఆ దిశలోనే వెలువడింది.

అందరికీ తన మీద వీగిపోని నమ్మకం ఉన్నది కనుకనే, ఈ దురాగతానికి ఒడికట్టారా?

ఏది చేసినా అనుమానం రాదని తెలిసే, మొదటి నుంచి కుమారుల అభిషేకాన్ని వ్యతిరేకించిన మంత్రివర్యులు, బాలుని పర్యవేక్షకుడైన తమ కుమారుడు తిమ్మదండనాథునితో ఈ పని చేయించారా?!

ఎంత విషమనస్కులై చేశారు ఈ ద్రోహం, మా దాయాది అచ్యుతదేవరాయలను రాజు చేయాలనే తమ పంతం నెగ్గించుకోవటానికి?!

బాల రాయలకు అభిషేకం అని ప్రస్తావించగానే, వారి నోట వచ్చినది ఆ మాటే కదా!

మేము తప్పుకుంటే, తదనంతరం, రాజ పదవికి అర్హుడు, అచ్యుతుడు మాత్రమేనని?!

ఎంత సంతులనమున్న ప్రవ్రృత్తి కలవారైనా, అహాన్ని జయించిన యోగిపుంగవులు కాదు కదా!

మా వలెనే సంసారులే కద?! ఉక్రోషరోషకావేషాలున్న వారే కదా?!

వారి మాట త్రోసిరాజని, ఈ చిన్నవాడికి పట్టం కట్టామని కినుకా?!

అట్లాంటి కినుక ఉన్నా, అది మా మీద కదా చూపించ వలసినది, ముక్కుపచ్చారని బాలుడేమి చేశాడు, శిక్షించటానికి!

ఎంత అమానుషం?!

తమ మార్గం నిష్కంటకం చేయటానికి, ఎందరిని తప్పించారు, ఎందరిని మట్టు పెట్టారు, ఈ తంత్రాంగ చక్రవర్తులు?!

మా అన్నగారు వీరనరసింహరాయల వారినే మోసం చేయలేదా?!

అటువంటిదే, ఇప్పుడు అచ్యుతరాయలకై చేశారేమో?!”

***

అనుమానపు పురుగు ప్రవేశించి రాయల మదిని తొలిచి వేయసాగింది.

అది క్షణక్షణానికి పెరిగి పెనుభూతమై ఆవరించింది కొన్ని నాళ్ళుగా వారి మదిని.

గతంలో తమకు అనేక విజయాలు ఇప్పించటానికి ఆపదలు తొలగించటానికి, తిమ్మరుసు చేసిన ఉపాయాలే, వేసిన ఎత్తులే రాయల మనసుకు ఇప్పుడు బలీయమైన కారణాలుగా కనబడసాగాయి -ఈ నేరాన్ని, పంతం నెగ్గించుకోటానికి తిమ్మరుసే చేయించాడని!

బాలరాయల సర్వరక్షకుడూ తన పుత్రుడైన తిమ్మదండ నాథుని ద్వారా చేయించాడని మొదట అనుమానంగా మొదలైంది.

ఇప్పుడు నమ్మకంగా వ్రేళ్ళూనింది, రాయ ప్రభువుల హృదయంలో.

నమ్ముకున్న వారే ఇట్లా చేశారని వారి అనుమానము గట్టిపడిన కొలదీ, అపురూపంగా కలిగిన పుత్రుని కోల్పోయిన దుఃఖము మరింత ఉధృతమై, వారిని వివశుల చేయసాగింది.

అది ఉపశమించాలంటే, ఆ మహాక్రోధావేశానికి ఎవరో ఒకరు బలి కావాలి.

అది ఆ పరిస్థితులలో తిమ్మరుసు కావటానికి, ప్రధాన కారణం, నేరం జరిగినప్పుడు నెలకొని ఉన్న పరిస్థితులూ, ఆయన గతంలో చూపించిన అఖండ తంత్రాంగ పటిమే!

ఇది ఆశ్చర్యకరంగా అనిపించినా, ఒక వ్యక్తికి గతంలో తాను చూపిన సమర్థతే శత్రువై, నేరస్థుడిగా నిలబెట్టిన విషాదకర ఘట్టం, చరిత్రలో!

ఇది- చక్రవర్తి, మహామంత్రి, వేదాంతి, యాచకుడు, ధనికుడు, బీదవాడు అని లేక అందరినీ ఆడించే విధి వింత ఆటలలో ఒకటిగా చెప్పి సమాధానపడటం తప్ప వేరే చెప్పగలిగింది ఏదీ తోచదు!

రాయల ఆలోచనల స్వైరవిహారం కొనసాగింది మళ్ళీ!

***

“రహస్య విచారణ సమయంలో మా మౌనానికి ఈ అనుమానమే బలీయమైన కారణం కూడా!

మా మదిలో తారాడుతున్న దానినే ధర్మాసనం వారు నిరూపించినట్లు అనిపించినది.

ఇక ధర్మాసనం వారి మాట నడ్డగింప మాకు మారు మాటే రాలేదు.

తిమ్మరుసుల వారు నిశ్చేష్టులై ఒక్క 24 గంటల సమయ మడిగారు నిజ నిర్ధారణకై!

కాని ఇరవై నాలుగు నిమిషాల వ్యవధి గల ఒక్క ముహూర్త కాలంలో దేనినైన మార్చగల వారి ప్రతిభ మాకు తెలియనిదా ఏమిటి?

మేమా అభ్యర్ధనను నిరాకరించాము.

నిరాకరించటానికి, స్వయంగా మాకే ఉన్న అనుమానమే బలీయమైన కారణం!

అటువంటి పరిస్థితులలో కూడా, ఈ సమయ నిరాకరణతో వారి అభిమానము దెబ్బ తినినట్లున్నది!

మది గాయపడి, ఆ పైన వారు మారుమాటాడలేదు, తమను తాము కాపాడుకొనటానికి కూడా!

ఈ ముదిమిలో కూడా ఎంత బిగువు, తమనే ప్రశ్నిస్తారా వీరు అని, ఎంత స్వాతిశయం?!

అటు తరువాతి విచారణలో, వారి ఆ మౌనం, మరింతగా ధర్మాసనము వారికీ, మాకూ ఈ ఘోర నేరంలో వారి పాత్రను వారంగీకరించినట్లు అనిపింప చేసింది.”

***

పుత్ర మోహంతో, పుత్ర నష్ట దుఃఖముతో రాయల వారి మనసు కకావికలమై పరిపరి విధాల పోయి, అరికట్టటానికి వారి నశక్తులను చేసేసింది,నిశ్శబ్దం తాండవించిన ఆ అర్ధరాత్రి సమయంలో!

అంతలో వారి ఆలోచనల ధోరణి మారినది!

ఈ ద్వైధీభావమె వారిని లోపల నుంచి దహించివేస్తున్నది.

ఏది నిజం,ఏది న్యాయం. ఈ విషమ ఘట్టంలో ఎట్లా నిర్ణయించటం?!

సంక్షుభిత, హృదయాలు సరైన సత్య పథాన్ని చూడకల్గలేవు కదా!

ఏ విషయాన్నైనా తృటిలో నిర్ణయం తీసుకొని, ఆచరణలో పెట్టే రాయల వారికి, ఇట్లాంటి ఊగిసలాట సహజ ప్రకృతికి విరుధ్ధం!

ఎంతకూ తెగని రాత్రి లాగా వారికి ఆ కాళరాత్రి దుర్భరంగా అనిపించింది.

***

అంతలో వారి ఆలోచనా స్రవంతి, మళ్ళీ మార్గము మళ్ళింది!

“మాకు పితృతుల్యులైన తిమ్మరుసుల వారా దోషులా ఈ విషయంలో?! తాము పొరబడి, మహాపరాధానికి ఒడికట్టుతున్నామేమో?!

ఎన్ని మారులు మా సాహసోపేత నిర్ణయాలకు వారి బుద్ధిబలం తోడవటం వలన మేము విజయాలు చేజిక్కించు కొన్నాము!

ఈ విశాల దక్షిణాపథ సామ్రాజ్య విస్తరణకు మా ఖడ్గ మెంత కారణమో వారి బుధ్ధిఖడ్గం కూడా అంతే కారణం కదా?!

మా వివాహ విషయాన సైతం వారు చేసిన ఉపకారము మరువతగినదా, కాదేఁ?!

మా ప్రేమ రాశి, రాణీ నాగులాంబ, మా చిన్నాదేవిని మాకు ఎంత చాకచక్యంగా దక్కించారు?!

కానీ మా కుమారుని విషయంలో వారి పాత్ర ఇంత విరుద్ధముగా కనిపిస్తున్నదే, ఏం చేయాలి!

నమ్మకం చెప్పిన దారిలో ముందుకు పోవటమా, ఆధారాలతో కనిపిస్తున్న దానిని నమ్మటమా?!

అదీ గాక, వారికి అగత్యమేమిటి ఈ బాలుణ్ణి తుద ముట్టించటం?!!

రాజ్యభాగము రాదే?!

ధనాదులకు లోబడువారు కారే?!

మా తరువాత, ఒక్కొక్కచో మా కంటే వారిదే కదా, మాట చెల్లేది ఈ రాజ్యనిర్వహణా చట్రంలో!

మేమే ఇష్టపూర్వకంగా వారికిచ్చిన స్వతంత్రము, మర్యాద, పదవి, అధికారము కావూ ఇవన్నీ!

ఇంక వారి కేముంది కొదువ?!

వారీ ఘాతుకానికి పాల్పడవలసిన అగత్యమేమిటి?!

అహో మా తల వేయి ముక్కలయ్యేట్లున్నదే, విరూపాక్షా ఏమిటి ఈ అగ్ని పరీక్ష!?

తెల్లవారితే, సభాంగణంలో ప్రకటించి శిక్ష అమలు చేయాలి!

కిం కర్తవ్యం?!”

***

ఆలోచనలో మునిగిన రాయల వారికి రేయి చివరి ఝూములో మాగన్నుగ నిదుర పట్టింది.

వారికి మెలకువ వచ్చే సమయానికి తెల్లవారింది. తలంతా భారంగా అనిపించింది, విపరీతమైన ఆలోచనల వలన, నిద్ర లేమి వలన!

దైవ నిర్ణయం వేరు విధంగా ఉన్నట్లున్నది!

***

రాయల వారు కలత చెందిన మనసుతో సభాంగణంలోకి ప్రవేశించారు.

అంతా కల లాగా, వింతగా, కొంత తెలియని భయం ఆవరించినట్లు అనిపించింది వారికి, భావోద్వేగం వలన, మానసిక ఒత్తిడి వలన!

చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్ద వాతావరణంలో అందరు వింటుండగా, ప్రధాన న్యాయమూర్తి చేత, యథాస్థానంలో నిలుచున్న తిమ్మరుసు నుద్దేశించి ప్రకటింప చేశారు.

ఇతర వివరాలు చదివి, చివరగా న్యాయమూర్తి బిగ్గరగా ఇట్లా ప్రకటించారు:

“సాళువ తిమ్మరాజు అను ఈ వ్యక్తి, మహారాజులు, శ్రీ కుమార తిరుమలరాయల వారి హత్యలో ప్రధాన భూమిక వహించినట్లు మా న్యాయ పరిషన్మండలి, తగిన ఋజువులు, వాజ్ఞ్మూలములు ఉన్న కారణమున, నిర్ధారణకు వచ్చినది. ఇతర వివరములు దస్త్రములందు పొందుపరచటమైనది. శిక్షా స్మృతి ననుసరించి మేము వ్యవహరించితిమి.

ఇది సత్యము!

మా కర్తవ్యము మాత్రము నిర్వహించితిమి, మేము నిమిత్తమాత్రులము.

నేరము: రాకుమారులూ, విజయనగర సామ్రాజ్య పట్టాభిషిక్తులూ అయిన శ్రీతిరుమల రాయల హత్య.

విధానము: విష ప్రయోగము.

శిక్ష: పది సంవత్సరముల కారాగారము!”

***

సభ నిశ్చేష్టమైపోయింది ఆ మాటలు వినగానే!

రాయల వారు ఆ ప్రకటన పూర్తి అయిందో లేదో, విసవిస సింహాసనం నుంచి లేచి వెళ్లిపోయారు, తమ అభ్యంతర మందిరానికి.

రాబోయే రెండు దినాలలో, ఎవ్వరిని దర్శించబోమని ఉత్తర్వులను జారీ చేయించారు.

***

రాజోద్యోగులలోని తిమ్మరుసు శత్రువుల మనసులు శాంతించాయి.

తిమ్మరుసు దోషి అని నమ్మలేని వారు నోట మాట రాక స్తబ్ధులై పోయారు, శిలాప్రతిమల లాగా!

సభ కళావిహీనమై తోచింది, ఏదో ఒక మహా పాతకానికి తాను స్థానమైనందుకు అన్నట్లు!

అమంగళతా సూచకంగా దూరాన తీతువు కూసింది.

***

యథా ప్రకారము శిక్ష అమలై పోయింది.

తిమ్మరుసుల వారిని చేతులు వణకుతుంటే ఇద్దరు భటులు సంకెళ్ళు వేసి, శిక్షా నియమం ప్రకారం కారాగారంలో బంధించి, బయట తాళం వేసి వెళ్ళిపోయారు, విధ్యుక్త ధర్మంగా, తన్నుకొని వస్తున్న కన్నీళ్ళు నదుముకొనే యత్నం చేస్తూ!!

ఎంతటి వారికి ఇంతటి గతి పట్టినదే, అది అమలు చేసే కర్తవ్యం తమ పాలు పడిందే అని వారి ఆవేదన!

రాయ శిరః ప్రధానులు, విజయనగర సామ్రాజ్య చక్రాన్ని తన మేధో సంపత్తితో, తంత్రాంగ నైపుణితో నడిపిన మహామంత్రి, సాళువ తిమ్మరుసుల వారు –

ఇప్పుడు అదే విజయనగరంలో, ఒక బందీ!

శిక్ష వేసినది, వారికి శిష్య సమానులై, వారికి పుత్ర సమానులుగా పరిగణింపబడుతున్న, శ్రీకృష్ణదేవరాయల వారే!

విధి బలీయము, అనుల్లంఘనీయము –

రాజు మంత్రీ తేడా లేదు దానికి, నిస్సంశయంగా!

***

స్వల్ప కాలం విజయనగర కారాగారంలో ఉంచి తిమ్మరుసును, పెనుగొండ తరలించారు పరమ రహస్యంగా!

ఇక మిగతా శిక్షా కాలం అంతా అక్కడే గడపాలి వారు.

ఈ నిర్ణయంతో దుర్భర మనోవేదన అనుభవిస్తున్న రాయలవారు తమ రహస్య దర్యాప్తు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు .

వారి మనస్సులో ఏదో ఇంకా శంక వెంటాడుతోంది, చేసిన పని, వేసిన శిక్ష, సరియైనవేనా అని!

చివరకు, ఒకరోజున అంతశ్శత్రువుల కుట్ర అని నిజానిజాలు తెలుసుకొని, తిమ్మరుసుల వారు నిర్దోషులన్న నమ్మకం కలిగిన తరువాత వారిని కారాగారంలో దర్శించి క్షమాపణలు చెప్పుకున్నారు, రాయలవారు, శిక్ష మొదలైన సంవత్సర కాలానికి.

“మిగతా శిక్ష రద్దు చేస్తాను, మీరు యథాస్థానంలో, అంటే మహామంత్రి పదవిలో సమస్త లాంఛనాలతో, రాచమర్యాదలతో మళ్ళీ అలంకరించవలసినది” అని తిమ్మరుసు చేతులు పట్టుకుని కన్నీళ్ళతో అభ్యర్ధించారు రాయలు.

హృదయం తీవ్రంగా గాయపడియున్న, అవమాన భారం, వయోభారంతో కుంగిపోయిన తిమ్మరుసుల వారు రాయల అభ్యర్ధనను మన్నించలేదు.

“అది ఉచితం కాదు, మీరు వెళ్ళి సుఖంగా రాజ్యమేలుకోండి”, అని ఆశీర్వదించి మిన్నకున్నారు.

తిమ్మరుసుల వారికి జరిగిన ఘోర అన్యాయం బాగా తెలిసిన రాయలు, ఇక అప్పటికి ఒత్తిడి చేయటం సబబు కాదని వెనుతిరిగారు.

మళ్ళీ వద్దామనీ, వచ్చి ఒప్పిద్దామనీ వెళ్ళిన రాయల వారి ఆరోగ్యం నానాటికీ క్షీణించింది.

ఇక మళ్ళీ పితృతుల్యులైన తిమ్మరుసుల వారిని కలుసుకునే అవకాశమే లేకపోయింది, వారికి.

ఈ పెనుగొండ కలయిక తరువాత, కొద్ది కాలానికే అనారోగ్యంతో శ్రీకృష్ణదేవరాయల వారు మరణించారు.

***

రాజకీయాల, రాజపదార్హతల కుమ్ములాటలలో తిమ్మరుసుల వారిని పరామర్శించిన వారు, పలుకరించిన వారే లేరు, రాజవంశీకులలో, రాయల మరణానంతరం!

***

తిమ్మరుసుల వారు, పది సంవత్సరాల తరువాత విడుదల కావింపబడ్డారు, శిక్షా కాలం పూర్తి అవటం వలన.

వారు అతి సామాన్యుని వలె తిరుమల క్షేత్రానికి సమీపంలో, కుటీర మొకటి నిర్మించుకుని, పేదరికంలో బతుకు వెళ్ళదీస్తున్నారు.

***

వారికి, వారి సోదరులు గోవిందనాయకులకు ఆదాయము – దశాబ్దాల క్రితం తిరుమల దేవస్థానానికి, గోవిందరాజాలయానికి ఇచ్చిన విరాళాల వలన సంక్రమించిన ప్రసాదాల హక్కులే!

ఆ హక్కులను విక్రయించి ఆ సొమ్ముతో గ్రాసవాసాలు నెట్టుకుని వస్తున్నారు, ఆ జీవనచరమాంకంలో.

ఇప్పుడు వారిని చూసిన వారెవరైనా వారు ఒకప్పటి శ్రీకృష్ణదేవరాయల వారి సర్వ శిరః ప్రధాని అంటే నమ్మక పోగా, నవ్విపోతారంటే అతిశయోక్తి ఎంత మాత్రము కాదు.

***

సుమారు పాతికేళ్ల కిందట వారు తిరుమల వేంకటేశుని భార్యసమేతంగా దర్శించుకొని, “స్వామీ అంతా నీ దయ”, అని ఒక పెద్ద మొత్తం విరాళంగా ఇచ్చారు.

పొత్తపినాడులో ఒక గ్రామాన్ని తిరుమలేశుని ఆలయానికి విరాళంగా వ్రాసి యిచ్చారు. అలాగే శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి కూడా!

తనదీ, తన సతీమణిదీ – జన్మ నక్షత్రాలలో నిర్దుష్ట ప్రసాదాలు స్వామి వారికి నైవేద్యాలుగా ఏర్పాటు చేశారు.

అన్నగారితో పాటు స్వామి దర్శనానికి వెళ్ళిన గోవిందనాయకుడు కూడా అదే విధంగా విరాళాలిచ్చి, కైంకర్యం ఏర్పాటు చేశారు.

సకల పూజల అనంతరం, నైవేద్య సమర్పణ తరువాత, ఆ ప్రసాదాలలో కొంత వీరికి ముట్టేటట్టు వీరికి ఆ విరాళాల ద్వారా కొన్ని హక్కులు సంక్రమించాయి.

***

ఒక అమ్మకపు పత్రం వ్రాయించి ఈ ప్రసాదాల హక్కులను అమ్మి, తమ అవసాన కాలంలో జీవనం గడపటానికి కావలసిన ధనం ఏర్పాటు చేసుకున్నారు తిమ్మరుసుల వారు.

ఇటువంటి అమ్మకం అనేది ఆ రోజుకి చాలా వింతయైనదే, కొత్తదే!

అంతకు ముందు ఎవ్వరూ ఇటువంటి లావాదేవీలు చేసిన దాఖలాలు లేవు.

ఈ విక్రయానికి ముందుకొచ్చి కొనుక్కున్నవారు, పదకవితాపితామహులు అన్నమయ్య గారి పెద్ద కుమారుడు తిరుమల అయ్యంగార్ గారు.

సాధారణంగా దైవతాలకు విరాళాలు ఇచ్చిన ప్రసాదపు హక్కులు పొందిన వారు, ఆ ప్రసాదాలను ఆ యా రోజుల్లో సామాన్య జనానికి ఉచితంగా పంచే ఏర్పాట్లు చేసేవారు.

అదొక పుణ్యకార్యమని వారి భావన, నమ్మకమూ!

అటువంటి పవిత్రమైన హక్కలను అమ్ముకుని జీవించ వలసిన పరిస్థితికి తిమ్మరుసుల వారి మది ఎంత కుమిలిపోయిందో ఊహకు కూడా అందనిదే!

అది ఒక అపూర్వమైన క్రయవిక్రయ సంబంధిత కార్యకలాపము.

అమ్మకందారులు, విజయనగర సామ్రాజ్య పూర్వ మహా ప్రధానులు, వారి సోదరులు- క్రయదారులు, అన్నమయ్య గారి వారసులు, తిరుమలయ్యంగారు.

అంతకు ముందు వరకు, తమ చిన్న పూలతోటను చూసుకుంటూ, తన పేదరికం బయటకు కనపడకుండా, గుంభనగా జీవించిన వారే, తిమ్మరుసు కూడా!

ఆ ప్రసాదాలను పేద భక్తులకు అందే ఏర్పాటు కొనసాగించిన వారే వీరునూ, అందరు దాతల లాగా!

కారాగారం నుంచి విడుదలైన తరువాత కొంత కాలం ఎట్లాగో గడిచినా, రాను రాను దినం గడవటమే కష్టమైపోయి, ఈ ప్రసాదాల హక్కుల్లో నాలుగో వంతు అమ్ముకోవాల్సిన పరిస్థితి, అగత్యం ఏర్పడ్డది ఆ మహామంత్రికి!

***

ఆకారానికి, పాండిత్యానికి, మేధస్సుకీ; ఒక వ్యక్తి అదృష్ట రేఖకి, ఏ సంబంధమూ ఉన్నట్లు తోచదు, ఆ రేఖ ఎటు తీసుకు వెళితే, అటు వెళ్ళవలసినదే మహరాజైనా, మహామంత్రి యైనా!

***

ఎట్లాగో ఈ వార్త, రెండు మూడు ఏళ్ళ తరువాత, అప్పటి ఏలిక అచ్యుత రాయలకు తెలిసింది.

ఆయన మహాప్రధాని దుస్థితికి చాలా నొచ్చుకుని తిరుమల అప్పప్రసాదాలలో ఒక నాలుగోవంతు ఫలానా గ్రామంలో నివసిస్తున్న ‘అప్పయ్య’, అనే వ్యక్తికి దక్కేట్టు ఆదేశాలు జారీచేశారు.

ఆ అప్పయ్య ఎవరో కాదు, మహామంత్రి తిమ్మరుసు గారి అల్లుడే!

తిరుమలలో ఒక తోటను చూసుకునేవాడు అతను.

తద్వారా తిమ్మరుసుల వారికి కొంత వెసులుబాటు కల్గుతుంది అని, అచ్యుత రాయల అభిప్రాయం.

వారి ఆత్మగౌరవాన్ని ఎట్టి పరిస్థితిలో చిన్నపుచ్చరాదని ఆ రాజు సదుద్దేశం!

అంతటి అత్యున్నత పదవి నలంకరించి రాజ్య చక్రాన్ని తిప్పిన మహామేధావి, అమాత్యవరుల పేరు ‘తిమ్మరుసు’, అని ఆ ఏర్పాటు వివరాలలో బయట పెట్టక పోవటం, ఆ ప్రభువైన అచ్యుత రాయలు గొప్ప సౌజన్యమూ, సంస్కారమే అని చెప్పాలి ఈ సందర్భంలో!

***

మహావైభవం, దేశవ్యాప్తకీర్తీ, సర్వం సహా అధికారం అనుభవించిన వారే, అనూహ్యమైన కడగళ్ళ పాలు కావచ్చు కాలం కలిసి రాకపోతే అనటానికి, ఈ ఇరువురి ఉదంతం, ఒక ప్రబల నిదర్శనం అనవచ్చు.

ఒక మహా చక్రవర్తి, ఒక మహామేధావియైన మహామంత్రీ – ఇద్దరూ చరమ కాలంలో తమ జీవితాల్లో అనుభవించిన పరమ విషాద ఘట్టాలుగాగా కనిపిస్తుంది ఇది.

కాలోహి దురతిక్రమః!!

***

ఓం నమో వేంకటేశాయ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here