కార్తీక దీపాలు

17
10

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో ₹ 2500/- బహుమతి పొందిన కథ. రచన ఆసూరి హనుమత్ సూరి గారు. ఈ కథకు ప్రైజ్ మనీని అందించిన వారు డా. అమృతలత.]

[dropcap]ద[/dropcap]సరా, దీపావళి సెలవులకు అమ్మమ్మా వాళ్ళింటికి వచ్చారు అక్కా, తమ్ముళ్లు వినీత, వినయ్. దీపావళి మరుసటి రోజు ఆదివారం కావడంతో అక్కడే ఉండిపోయారు పిల్లలు.

“పిల్లలూ నిద్ర లేవండి. రెండ్రోజుల్లో స్కూల్‌కి వెళ్ళాలి కదా ఊరెళ్ళాక! త్వరగా రెడీ అయితే కార్తీక దీపాలు పెడదాం. అలాగే శివాలయానికి కూడా వెళదాం.” అంటూ నిద్ర లేపే ప్రయత్నం చేస్తోంది మీనాక్షమ్మ.

ఆవిడ చూడ్డానికి పాతకాలం మనిషిలా ఉంటుంది. కానీ ఆ కాలంలోనే జువాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి లెక్చరర్‌గా రిటైర్ అయింది. విసుక్కుంటూనే నిద్ర లేచిన పిల్లలు “ఏంటమ్మమ్మా! ఈ రెండ్రోజులే కదా పడుకునేది. పైగా చలిగా కూడా ఉంది. ప్లీజ్” అంటూ బద్దకించారు.

“మీకొక కథ చెప్తాను. త్వరగా లేచి రెడీ అయితే” అన్న మాట ఎప్పుడైతే వినబడిందో టక్కున లేచారు వినయ్, వినీత.

“అమ్మమ్మా, నువ్వు వెళ్లి దీపాలు పెట్టి, గుడికి వెళ్లి రా! ఈలోగా మేం రెడీ అవుతాం, అప్పుడు చెబుదువు గానీ కథ” అంటున్న పిల్లల్తో..

“అది కాదర్రా, ఆ కథ విన్నాక మీరేం చెపుతారో వినాలని ఉంది నాకు” అని అమ్మమ్మ చెప్పడంతో చేసేదేం లేక అయిష్టంగానే రెడీ అయి, “ముందు కథ చెప్పు!” అంటూ అమ్మమ్మ చుట్టూ చేరారు.. పిల్లలిద్దరూ.

మీనాక్షమ్మ చెప్పనారంభించింది.

***

అది నైమిశారణ్య ప్రాంతం. నిజానికి ఆ ప్రాంతానికి ఆ పేరు కూడా లేని రోజుల్నాటి మాట.

మీకు గుర్తు ఉండడం కోసం కొన్ని పేర్లు పెడతాను. సరేనా..?! ఇక అడవికి వెళదాం.. అదే పిల్లలూ కథ లోకి వెళదాం!

అక్కడి ఒక అడవి జాతి గుంపులో ఒక కలకలం రేగింది. తమ లాంటి వేరొక అడవి జాతి వాళ్ళు తలదాచుకునే ఒక గుహ పైనుండీ ఒక పెద్ద బండ రాయి పడి ఆ గుహ మూసుకు పోయింది. తన రోజు వారి వేట కోసం అటుగా వెళ్లిన ఆ గుంపుకి పెద్ద అయిన కొండయ్య, వాళ్ళ హాహాకారాలు విని ఏమయిందో తెలియక భయపడి తాము తలదాచుకునే మర్రి చెట్టు దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాడు. విషయం తమ గుంపు లోని వాళ్లకి చెప్పి, మనకు ఈ మర్రి చెట్టే మంచిది. ఆ గుహలో తల దాచుకుందామని వెళ్లిన వాళ్ళ సంగతి చూసారా? అని భయంతో చెప్తూ ఉన్నాడు.

కానీ అతని భార్య కొండమ్మ మాత్రం ససేమిరా ఒప్పుకోవటం లేదు. ప్రతిసారి మన చెట్టు ఎండిపోవడం మళ్ళీ మెరుపు కోసం ఎదురుచూడడం.. వర్షం వచ్చిన కొన్ని రోజులకి గానీ చెట్టుకి ఆకులు రాకపోవడం చాలా కష్టంగా ఉంది. ఆ గుంపు వాళ్ళు ఎండకి వానకి భయపడకుండా ఎంత హాయిగా ఉంటున్నారో రోజూ నువ్వే కదా చెప్తుంటావంటూ గొడవ పడసాగింది.

“ఈ రోజు చూడు ఆ గుహకు అడ్డంగా పెద్ద బండ రాయి పడి వాళ్ళు లోపలే చచ్చిపోయారు. మనం అలా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. కొన్ని రోజులు కష్టపడితే తిరిగి ఈ చెట్టు మనకి కావాల్సినంత నీడ ఇస్తుంది. ఈ రోజు మనం బతికి ఉన్నామంటే ఈ చెట్టు వల్లే. ఈ చెట్టు మీదకి వచ్చే పిట్టల్ని కొట్టి అయినా మనం కడుపు నింపుకోవచ్చూ” అంటూ నచ్చచెప్పాడు కొండయ్య తన భార్యతో.

ఈ విషయం వింటున్న వాళ్ళ ముగ్గురు పిల్లలూ వాళ్ళమ్మ కోసం ఏదైనా చెయ్యాలని నిశ్చయించుకున్నారు. వాళ్ళ తల్లికి నచ్చినట్టు ఉండే ఒక గుహ కోసం వెతకడానికి బయల్దేరారు ఒక రోజు, ఎవ్వరికీ చెప్పకుండా..!

***

అలా వెళ్తున్న వాళ్ళు రాత్రి అయ్యే సరికి ఒక చెట్టు కిందకి చేరి పడుకున్నారు. బాగా నిద్రపోతున్న వాళ్లకి పెద్ద శబ్దం అయ్యేసరికి ఒక్క సారిగా ఉలిక్కి పడి లేచారు. ఆకాశంలో నుండీ పెద్ద మెరుపు ఒకటి వచ్చి భూమిని తాకడం, అంతలోనే పెద్ద శబ్దం రావడం గమనించి వాళ్ళు ఆ మెరుపు వచ్చిన దిశగా ప్రయాణం సాగించారు.

అలా వెళ్లగా, వెళ్లగా పెద్ద బండరాళ్లు ఉన్న చోటు ఒకటి కనబడింది వాళ్లకు.

దగ్గరికి వెళ్లి చూసారు. రెండు పెద్ద బండ రాళ్ళ మధ్య ఒక గుహ లాంటి ప్రాంతం చూసారు. అమ్మకి ఇది చూపించాలనుకున్నారు. కానీ వాళ్లలో ఒకడు పైన ఉన్న బండ రాయిని చూపించి వాళ్ళయ్య చెప్పినట్టు “ఆ రాయి పడి ఈ గుహ మూసుకు పోతేనో ఆ జాతి వాళ్లకి పట్టిన గతే మనకూ పడుతుంది. వద్దు” అని వారించాడు.

కానీ వాళ్లలో ఇంకోడు, “అయితే ఆ బండ రాయి దగ్గరికి వెళ్లి చూద్దాం. అది పడేలా ఉంటే ఇంకో చోటు వెదుకుదాం” అంటూ ముగ్గుర్నీ పైనున్న బండ రాయి దగ్గరికి తీసుకెళ్లాడు. తీరా చూస్తే అది కిందికి పడేలానే ఉంది.

మూడో వాడు అన్నాడు, “మనమే ఈ బండని వెనకకి తోసేద్దాం! మనకి ఇక ఆ భయమే ఉండదు” అని సలహా ఇచ్చాడు. ఈ సలహా నచ్చి ముగ్గురూ కలిసి ఆ బండని వెనకకి తొయ్యనారంభించారు.

కాసేపటికి అది పెద్ద శబ్దం చేస్తూ కింద పడింది. కానీ అది పడిన చోట మరో పెద్ద రాయి ఉంది. దాని మీద పడడం అక్కడ పెద్దగా దుమ్ము రేగడంతో అంతా కళ్ళు మూసుకున్నారు. కళ్ళు తెరిచే లోగానే అక్కడ పొగ అలుముకుంది. చూస్తుండగానే అది పెద్ద వెలుగులు చిమ్ముతూ వేడి పుట్టించే మంటగా మారింది. ఆ ప్రాంతంలో అన్నీ ఎండిన చెట్లే ఉండడంతో ఆ నిప్పు వ్యాపించడానికి ఎంతో సమయం పట్టలేదు. ముగ్గురూ అక్కడి నుండీ భయంతో పారిపోయారు. వాళ్ళు ఎప్పుడూ చూసినట్టు వెలుగు ముందు, శబ్దం తర్వాత రాలేదు ఈసారి. శబ్దం ముందు వెలుగు తర్వాత రావడం వాళ్లకి ఆలోచన రేకెత్తించింది. ఈ విషయం వాళ్ళ అమ్మకి, అయ్యకి చెప్పాలని బయల్దేరారు ముగ్గురూ.

ఈ విషయం తెలుసుకున్న కొండయ్య ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో అని ఆందోళన పడుతూ తన పిల్లల్ని మందలించాడు. కానీ వాళ్ళు చెప్పిన వెలుగు, శబ్దం గురించి మాత్రం ఆలోచిస్తూనే ఉన్నాడు. ఏమైనా ఒక సారి ఆ గుహకి వెళ్లి చూడాలని నిశ్చయించుకుని పిల్లల్ని తీసుకుని ఆ ప్రాంతానికి బయల్దేరాడు.

చాలా దూరం ప్రయాణించాక ఆ ప్రాంతానికి చేరుకున్న అతడికి అక్కడ మంటలు ఇంకా వస్తూనే ఉండడం అవి ఎండ కన్నా చాలా వేడిగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించాయి. పిల్లలు ఏం చేశారో వివరంగా అడిగాడు. బండ మీద బండ పడడం వల్లే ఇలా మంట పుట్టిందని నిర్ధారణకి వచ్చాడు. కానీ ఇంకా నమ్మకం కలగడం లేదు. తనకి. ఎప్పుడూ పైనుండీ మాత్రమే వెలుగు వస్తుందని, వేడి కూడా పైనుండీనే వస్తుందనీ ఎన్నో తరాలుగా వింటూ వచ్చాడు. చూస్తూ కూడా ఉన్నాడు.

ఇంకోసారి తాను ఇదే లాగా చేసి చూడాలని అనుకుని పిల్లల సాయంతో ఇంకో బండరాయిని ఎత్తునుండి తోసాడు. ఆశ్చర్యం.. మళ్ళీ మంట పుట్టింది. ఈ విషయం ఆ అడవి లోని అన్ని జాతులకు తెలిసిపోయే లోగానే అది ఎంతో వేగంగా విస్తరించింది. అప్పట్నుంచీ మంట పుట్టించగలిగే వాళ్లదే ఆధిపత్యం ఆ అడవిలో. తొలిసారి అగ్గిని కనుక్కున్న ఆ జాతి పెద్దని తమ దేవుడిగా, ఆ జాతి ఉంటున్న చెట్టుని ఒక పవిత్ర ప్రాంతంగా ఆరాధిస్తూ వచ్చారు ఆ అడవి లోని అన్ని జాతులూ.

***

ఆ అడివి జాతులన్నీ అగ్ని పుట్టించే సామర్థ్యం ఉన్న కొన్ని జాతుల ఆధిపత్యం లోకి వచ్చాయి. మెల్లిగా ఏ రోజుకు ఆ రోజు వేటాడి పచ్చి మాంసం తింటున్న వాళ్ళు కాస్తా మెల్లిగా తమ కింద ఉన్న జాతుల వాళ్లకి వేటాడే పని అప్ప చెప్పారు. వాళ్లంతా తలా ఒక జంతువుని వేటాడి తేవడం వల్ల రోజూ తాము తినగా మాంసం మిగిలిపోతూ వచ్చింది.

“రోజూ మిగిలిపోయిన, కుళ్ళిన మాంసం తినడం కంటే వాటిని మచ్చిక చేసుకుని తమకు నచ్చినప్పుడు చంపి తింటే ఎక్కువ రోజులు తమకు ఆహారం దొరుకుతుంది. అందుకే వేట అంటే చంపి తీసుకురావడం కాకుండా బతికి ఉన్న ప్రాణుల్ని తెచ్చి తమ ఆధీనంలో ఉంచుకోవడం మంచిది అనుకుని మెల్లిగా జింక, మేక, గొర్రె లాంటి జంతువుల్ని మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు వాళ్ళు.”

***

ఇలా ఉండగా ఒక రోజు తాము మచ్చిక చేసుకున్న పశువుల్ని తాటాకుతో చేసిన పాకలో కట్టి నిద్ర పోతున్నారు ఆ అడవి జాతి వాళ్ళు. ఇంతలో పెద్ద గాలి లేచి వాళ్ళుంటున్న కొండ పైనున్న బండ జారి పడడం చూసిన వాళ్ళు అక్కడ అగ్గి పుట్టడం ఖాయమని గ్రహించి పశువుల్ని అక్కడే వదిలి పారిపోయారు. మరుసటి రోజు పశువుల కోసం వచ్చి చూస్తే ఇంకేముంది. పశువుల పాక తగలబడి పోయింది. పశువులన్నీ చచ్చిపోయి పడి ఉన్నాయి. పాక చుట్టూ ఉన్న చెట్లు ఇంకా కాలుతూనే ఉన్నాయి. వాటన్నిటినీ తీసేద్దామని వెళ్లిన వాళ్ళ చేతులకి, కాలిన పశువుల మాంసం అంటుకు పోతూ ఉంది. వాళ్లలో ఒకడు వేడికి తాళలేక వేలు నోట్లో పెట్టుకున్నాడు. ఇంకేముంది? కాలిన మాంసపు రుచి ఎంతో బాగుంది. ఇక ఈ విషయం దావానలంలా అడివంతా వ్యాపించింది. అంతా వచ్చి కాలిన మాంసపు రుచి చూసి, ఇక తాము పచ్చి మాంసం కాకుండా ఇలా రుచికరమయిన మాంసం తినడానికి అలవాటు పడ్డారు.

***

“అయితే వాళ్లకు పప్పు, సాంబార్ వండుకోవడం రాదా? వాళ్ళు ఎప్పుడూ నాన్‌వెజ్ మాత్రమే తింటారా అమ్మమ్మా?” ఆత్రంగా అడిగాడు వినయ్.

“ఒరేయ్ నీకెప్పుడూ తిండి గోలే! నువ్వు చెప్పు అమ్మమ్మా! వీడికి వేరే పనేం లేదు” అంటూ చిర్రు బుర్రు లాడింది వినీత.

“సర్లేవే, ఎదో వాడి డౌట్స్ వాడివి.. అడగనిద్దూ!” అంటూ గారాలు పోయింది మీనాక్షమ్మ.

“ఆ.. మాంసం కాలింది.. తర్వాతేమైందో చెప్పు” అంటూ ఇద్దరూ అడగడంతో మళ్ళీ చెప్పనారంభించింది మీనాక్షమ్మ.

***

అలా మాంసాన్ని కాల్చుకు తినడానికి నిప్పు కావాలి కదా! అప్పట్నుంచి అందరూ రాళ్లను కొట్టి నిప్పు రగిల్చి ఎండిన చెట్లని కాల్చి ఆ మంటలో జంతువుల్ని కాల్చుకు తినడం ప్రారంభించారు.

అలా నిప్పు పెట్టిన చెట్లన్నీ రగులుతూ అడవిని దహించి వేయడం మొదలు పెట్టాయి. ఇంకేముంది ప్రతిసారి కొత్త చోటుకి వెళ్లి బండలు, చెట్లు వెతుక్కుని నిప్పు పెట్టుకోవడం కష్టం అనిపించసాగింది ఆ అడవి మనుషులకి.

కావాల్సి నప్పుడల్లా నిప్పు పుట్టించడం కంటే మంటని అలాగే ఉంచుకుంటే బావుంటుందనిపించి రోజుల తరబడి మంట ఉండడం కోసం చెట్లని నరికి మంటలో వేస్తూ వచ్చారు.

“ఇలా చేస్తూ పోతే అడవంతా నాశనమయి పోదూ?” కుతూహలం గా అడిగాడు వినయ్.

“కదా! అందుకే ఆ అడివి మనుషులకి నిప్పుని మచ్చిక చేసుకుని తమకు కావలసినప్పుడు వాడుకోవాలని ఆలోచన పుట్టింది.” మళ్ళీ కొనసాగించింది మీనాక్షమ్మ.

అనుకున్నదే తడవు అంతా అదే పనిలో పడ్డారు. ఎండాకాలంలోనయితే ఎండు కట్టెలు దొరుకుతాయి. అదే వానాకాలంలో అన్నీ తడిసిపోయి ఉంటాయి. అందుకే ఏ చెట్టు త్వరగా నిప్పుకు అంటుకుంటుంది అని శోధించడం మొదలు పెట్టారు ఆ అడివి మనుషులు.

“కొండయ్య, కొండమ్మ వాళ్ళా?” అడిగాడు వినయ్.

“ఇంకా కొండయ్య, కొండమ్మ వాళ్ళేనా? వాళ్ళ తర్వాతి తరం వాళ్ళు. ఇదంతా జరగడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. తెలుసా?” అంటూ కొనసాగించింది మీనాక్షమ్మ.

అలా శోధించగా శోధించగా పత్తి చెట్టు త్వరగా అంటుకుంటుంది అని కనుక్కోగలిగారు. అదయితే కనుక్కున్నారు గానీ అది ఇట్టే మండి అట్టే చల్లారి పోవడం వల్ల మంట త్వరగా ఆరిపొతోంది. మరెలా అని ఆలోచించారు.

“కొన్ని పత్తి చెట్లు, ముఖ్యంగా పత్తి విత్త నాలు బాగా ముదిరి ఉంటే అవి ఎక్కువసేపు మండుతూ ఉన్నట్లు గమనించారు, కొండయ్య, కొండమ్మా తర్వాతి తరాల వాళ్ళు. మరి వాళ్లకేం పేర్లు పెడదాం?” ప్రశ్నించింది మీనాక్షమ్మ.

“కోనయ్య, కోనమ్మ అని పెడదాం!” చెప్పింది వినీత.

“సరేనర్రా, పత్తి విత్తనాలు బాగా ముదిరి ఉంటే ఎందుకు ఎక్కువసేపు మండుతున్నాయి?” అడిగింది మీనాక్షమ్మ పిల్లల్ని.

ఏమో తెలీదన్నట్లు అడ్డంగా తలాడించారు పిల్లలిద్దరూ!

“ఎందుకంటే బాగా ముదిరిన పత్తి విత్తనాల్లో ఆయిల్ ఉంటుంది. అది నిప్పు ఎక్కువ సేపు ఉండడానికి ఉపయోగ పడుతోంది అని గమనించారు కోనయ్య, కోనమ్మ తరం వాళ్ళు.

ఇంకేం పత్తిని, నూనెని కలిపితే మంట నిలిచి ఉంటుంది అని కనిపెట్టారు. మంట వల్ల వేడి పుడుతుంది. వెలుగు వస్తుంది. ఎన్నో పనుల్ని రాత్రి కూడా చేసుకోవచ్చు. వేడి వల్ల చలికాలంలో వెచ్చగా కూడా ఉంటుంది కదా! అందుకే పత్తి మాత్రమే కాకుండా, ఇంకా ఏయే విత్తనాల్లో నూనె ఉంటుందో తెలుసుకుని నిప్పుని పట్టి ఉంచడం నేర్చుకున్నారు తర్వాతి తరం వాళ్ళు.

వాళ్లకేం పేర్లు పెడదాం పిల్లలూ!” అడిగింది మీనాక్షమ్మ.

“గంగయ్య, గంగమ్మ!” ముక్త కంఠంతో చెప్పారు పిల్లలిద్దరూ.

“బావుందర్రా! మరి అంతటితో అయ్యిందా. నిప్పుని పట్టి ఉంచాలంటే నూనె ఎప్పుడూ పోస్తుండాలిగా అందుకే రాళ్ళని కొట్టి గుంటగా చేసి అందులో నూనెగింజల్ని నలిపి వచ్చిన నూనెలో పత్తిని ఒత్తిగా చేసి, రాళ్ళని కొట్టి నిప్పు పుట్టించి వెలిగించడం మొదలు పెట్టారు గంగయ్య, గంగమ్మ తరం వాళ్ళు.

మరి ఇది ఇలా చెయ్యాలంటే ఎంత కష్టం. పత్తి కావాలి. నూనె కావాలి. గుంటగా ఉన్న గిన్నె లాంటి దేదైనా కావాలి. ఇది అందరూ చెయ్యాలంటే కష్టం కదా. అందుకే ఒక ఊరంతా కలిసి వాళ్ళు దేవుడిగా పూజించే చెట్టు దగ్గరో, కొండ దగ్గరో ఒక రాతి గుంట చేసి నూనె పోసి దీపం వెలిగించాలని, నిప్పు అవసరమైనప్పుడు అందరూ అక్కడికి వచ్చి నిప్పు వెలిగించుకోవాలని తీర్మానించుకున్నారు.

అయితే చలికాలం దగ్గరకొచ్చే కొద్దీ వేడి అవసరం బాగా ఎక్కువయింది. ఎముకలు కొరికే చలిలో అప్పుడే పుట్టిన బిడ్డలు చలికి తట్టుకోలేక చనిపోయేవారు. ముసలి వాళ్ళు నానా అవస్థలు పడేవారు. అందుకే దీపం అవసరం అందరికీ ఉంది అని గ్రహించారు.

కాలక్రమేణా, ముఖ్యంగా చలి బాగా ఎక్కువగా ఉండే కార్తీక మాసంలో ప్రతి ఇంటి ముంగిటా దీపాలు పెట్టాలని, అది మనకు ఎంతో శుభాలు చేకూరుస్తుందని చెప్పి దాన్నొక సంప్రదాయంగా తీర్చిదిద్దారు మన పెద్దలు. అంటే గంగయ్య, గంగమ్మ తర్వాతి తరం వాళ్ళు” అంటూ నవ్వేసింది మీనాక్షమ్మ.

“అందుకేనర్రా, కార్తీక మాసంలో దీపాలని దానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని ఎప్పుడో పెట్టిన ఆచారం ఈ నాటికీ మనం పాటిస్తున్నాం. మనకు దీపం వెలుగు నివ్వడమే కాదు.. మనం దీపానికి వాడే నూనెని బట్టి కూడా దాని ఔషధ గుణాలు మన ఇంటిలో వ్యాపిస్తాయి. పైగా ఈ కార్తీక మాసంలో అప్పుడప్పుడే వర్షాలు తగ్గి క్రిమి కీటకాదులు కూడా ఎక్కువగా వస్తాయి. వాటి వల్ల పంటలకి కలిగే నష్టాన్ని తగ్గించడానికి కూడా ఈ దీపాలు ఉపకరిస్తాయి. దీపానికి ఆకర్షింపబడే క్రిమి కీటకాదులు ఆ వేడికి చనిపోతాయి. దాని వల్ల పంటలు కూడా రక్షింప బడతాయి.

ఇలా ఎన్నో ప్రయోజనాల్ని చేకూర్చే విధంగా కార్తీక దీపాలని మన సంప్రదాయంలో భాగం చేశారు మన పెద్దలు.

ఇప్పుడు చెప్పండర్రా.. వస్తారా నాతో దీపాలు పెట్టడానికి మన గుమ్మం ముందూ అలాగే గుళ్లోనూ?” ప్రశ్నార్థకంగా పిల్లల వైపు చూసింది మీనాక్షమ్మ.

“తప్పకుండా అమ్మమ్మా! ఇక్కడే కాదు మేము ఊరెళ్ళాక కూడా ఇంటి ముందు దీపాలు పెడతాం. అమ్మతో పాటు దీపదానాలకి వెళతాం. పదమ్మమ్మా!” అని రెడీ అయ్యారు వినీత, వినయ్ లు.. ఉత్సాహంగా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here