కావ్య-3

0
12

[box type=’note’ fontsize=’16’] డా. ఇందు ఝున్‌ఝున్‍వాలా హిందీలో రచించిన ‘కావ్య’ అనే నవలని అదే పేరుతో అనువదించి అందిస్తున్నారు ఆర్. ఉమా శర్మ. [/box]

[dropcap]అం[/dropcap]తలో పక్కనుండి   ఒక ముసలావిడ నన్ను పట్టుకొని తన గదిలోకి పిలుచుకొని వెళ్ళింది. ప్రేమగా నా తల నిమురుతూ, నన్ను అక్కున చేర్చుకుంది. ఆమె నన్ను తన ఒడిలో పడుకోబెట్టుకొని నా గురించి అడిగింది. అంతవరకూ ఒంటరితనలో ఉన్న నేను ఏదో ఆసరా దొరికినట్టు ఆమెకు జరిగినదంతా చెప్పాను. నేను కాలేజీలో చదువుతున్న సంగతి చెప్పాను. నాకు సంగీతం పట్ల ఉన్న ఇష్టం, ఇలా అన్నీ ఆమెకు చెప్పటంతో ఏదో ఒక గొప్ప రిలీఫ్‌గా అనిపించిది.

ఆమె నా మాటలన్నీ నెమ్మదిగా, శాంతంగా వింది. నాకు ‘అన్నీ సర్దుకుంటాయని’ దైర్యం చెప్పింది. నాకు అన్నం తినిపించిది కూడా. ఆమె మాటలు, ప్రేమ నాకు ఒకసారిగా ఎడారిలో ఒయాసిస్ దొరికినట్టయింది. వేసవిలో మధ్యాహ్నపు టెండకు అలసిన భూమి పైన వర్షపు చినుకులు పడి ఆవిరి అయినట్టు, ఆదరణతో కూడిన ఆమె మాటలు నన్ను శాంతపరచాయి.

మొదటిసారిగా ఆ ఇంటిలో హాయిగా అనిపించిది. అదే సంతోషంలో నేను పాట పాడాను. అందరూ చప్పట్లతో నన్ను మెచ్చుకున్నారు. నా సంగీత మాధుర్యాన్ని వేనోళ్ళా పొగిడారు. అలాగే రోజులు గడుస్తూ ఉన్నాయి. చేయని నేరానికి ఇక్కడ వనవాసం చేసున్నాను. కానీ సమయం చాలా ప్రభావవంతమైనది. ఎటువంటి గాయమైనా మాపగలిగే శక్తి కేవలం కాలానికి మాత్రమే ఉంది అని నాకు అనిపిస్తుంది.

దగ్గర దగ్గర ఆరు ఏడు రోజులకు నీరజ్ తన ఇద్దరు స్నేహితులతో,   పోలీసులతో నన్ను చూడడానికి వచ్చాడు. పోలీసులు అంటే చిన్నతనం నుంచి ఉన్న భయం ఇంకా పోలేదు. నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. పోలీసులు నన్ను పోలీస్ జీప్‌లో ఎక్కి కూచోమని చెప్పారు. నా మెదడు మొద్దుబారినట్టు వారి మాటను ఒక కొయ్యబొమ్మ వలె వింటూ వెళ్ళి జీప్‌లో కూర్చున్నా.

నన్ను వారు కోర్ట్‌కు తీసుకొని వెళ్లారు. నన్ను కొన్ని తెల్ల కాగితాల మీద, కొన్ని టైప్ చేసిన పేపర్ల మీద సంతకం చేయమని అన్నారు. నేను కొయ్య బొమ్మలా వారి మాట వింటూ ఉండిపోయాను. అన్నీ పేపర్ల మీద సంతకాలు అయ్యాక చూశాను, అక్కడ అమ్మానాన్న నిలబడి ఉన్నారు. వారిని చూస్తూనే నాలో దుఃఖం కట్టలు తెంచుకొంది. వెక్కి వెక్కి ఏడ్చాను. అమ్మను గట్టిగా కౌగిలించుకుందామనుకున్నాను, అంతలో లేడీ కానిస్టేబల్ నన్ను పట్టుకుంది.

అమ్మానాన్న నిస్సహాయంగా   నన్ను చూస్తూ ఉండిపోయారు. వారితో కూడా సంతకాలు తీసుకున్నారు. నాకు అనిపించిది ఇపుడు సర్దుకున్నాయీ అని ,  మా అమ్మ వాళ్ళతో ఇంటికి వెళ్ళొచ్చు అని సంబరపడుతూ ఉన్నాను. కానీ అక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతోంది.

అమ్మానాన్న ఏడుస్తూ నన్ను వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నా కంటి తడి ఆరనే లేదు, గుండె చప్పుడు మరింత వేగంగా కొట్టుకొంటూ ఉంది. ఇపుడు ఏమవుతోందన్న ప్రశ్నకు సమాధానం లేదు.

అక్కడ ఆ క్షణంలో నల్ల గౌను తొడుక్కున్న ఒక లాయర్, నీరజ్, అతని మిత్రులు, ఒక జీప్  , నేను మాత్రమే ఉన్నాము. నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అన్నట్టు, ఎక్కడో నట్టడవిలో ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది. అప్పుడు అక్కడ నిలబడ్డ ఆ లాయర్ నాతో అన్నాడు- “వివాహా శుభాకాంక్షలండీ, ఈ రోజు నుంచి మీరు నీరజ్ భార్యాభర్తలు అయ్యారు” అని.

నేను గుడ్లప్పగించి చూస్తూ ఉన్నాను. ఆయన ఏం చెప్పారన్నది నాకు ఇంకా ప్రశ్నార్థకంగా ఉంది. నా జీవితం ఎటు పోతోంది. నాకెవరూ లేరా? దేవుడా! నాతో ఎందుకు ఇలా ఆడుకొంటున్నావు?

ఇంతలో నీరజ్ నన్ను గట్టిగా పట్టుకొని లాక్కొంటూ జీప్‌లో కూర్చోబెట్టాడు. జీప్ రోడ్డు మీద వేగంగా వెళ్లసాగింది. నాకు తెలియని రోడ్డు, నేను ఎక్కడికి వెడుతున్నాను అన్నది తెలియలేదు. మొదటిసారిగా బెనారస్ లోని రోడ్డ్లు అపరిచితుల వలె నన్ను భయపెడుతున్నాయి. జీప్‌లో నీరజ్, ఒక భయంకరమైన మొహం ఉన్నవాడు నన్ను మింగి వేసేటట్టు చూస్తూ ఉన్నారు. నీరజ్ ఫ్రెండ్స్ నవ్వితే నాకు వారి నవ్వులో మా నాన్న అరుపులు, బాధా వినిపిస్తున్నాయి. అర్ధగంట ఎలా గడిచిందో తెలియలేదు. మేము ఒక రెండు గదులు ఉన్న ఒక ఇంటి ముందు ఆగాము.

అలా ఒక ముగ్ధ లాంటి అమ్మాయి   ఒక గృహిణి అయింది. నాన్న గారాల బిడ్డ, తాను కోరని మొగుడితో జీవితకాలం బందీ అయింది. అంతా ఒక కల లాగా జరిగిపోయింది.

***

ఈ రోజు అవన్నీ గుర్తు చేసుకుంటే అదొక పీడకల లాగా అనిపిస్తుంది. కానీ పరమశివుడు గరళాన్ని మింగినట్టు నా జీవితం లోని ఈ విషాన్ని నేను తాగాల్సి వచ్చింది. నన్ను మీరాబాయి లాంటి భక్తురాలితో పోల్చుకోలేను. కనీసం ఆమె శ్రీకృష్ణుని మీద ప్రేమతో విషాన్ని తాగింది. కనీసం నేను నీరజ్‌ను ప్రేమించనూ లేదు. నాకు అతని మీద పిచ్చి కూడా లేదు.

కాకపోతే నేను మా నాన్న ప్రేమ కొరకు పరితపించాను. నా లోకంలో నేను ఉండేదాన్ని. నేను నా సంగీతాన్ని ప్రేమించాను. నేను నా నాటకాలను కూడా ప్రేమించాను. సంగీతం, సితార్ వాయిద్యాన్ని ప్రేమించాను. మా మాస్టారుకు నేను మంచి శిష్యురాలిని కూడా.

ఈరోజుకి కూడా నాకు బాగా గుర్తు ఉంది, వారు నాకు సంగీతం నేర్పించేటందుకు వచ్చేవారు. నేను వారి సితార్ మీద వేళ్ళతో మీటుతూ ఉండేదాన్ని. అపుడు మాస్టర్ నన్ను తన సంగీతానికి వారసురాలిగా చెప్పేవారు. అతని మంచి మనసు గురించి ఎంత చెప్పినా తక్కువే. మాస్టర్ గారికి నాన్న ఆర్థిక పరిస్థితి  బాగా తెలుసు. సంగీతం పట్ల, సితార్ పట్ల నా అభిరుచి చూసి ఒక రోజు నెలాఖరున ఇచ్చే ఫీజు ఇవ్వ వద్దని నాన్నగారికి చెప్పారు. “నా దగ్గర ఉంటే ఖర్చయ్యే పోతుంది. ఒకసారిగా ఆ మొత్తాన్ని నేను నాకు కావలసినప్పుడు మీ దగ్గర తీసుకుంటా లే” అని నాన్నకు చెప్పారు.

సాధారణంగా సంగీతం క్లాస్ సాయంత్రం ఉండేది. ఒకరోజు మాస్టారు గారు ఉదయాన్నే వచ్చారు. నాన్నగారు ఇంకా టీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుతున్నారు. మాస్టర్ గారు ఇన్ని రోజులు తాను దాచుకున్న డబ్బు ఇమ్మని నాన్నని అడిగారు. నాన్న కూడా సంతోషంగా, ఆయనకి త్రాగటానికి టీ ఇచ్చి, డబ్బులు కూడా ఇచ్చి పంపారు.

సాయంకాలం మాస్టారు గారు ఆటోనుంచి దిగారు. ఆయన చేతిలో ఒక కొత్త సితార్ కనిపించింది నాకు. ఇంట్లోకి వస్తూనే ఆ కొత్త సితార్ నా చేతిలో ఉంచి అన్నారు – “తల్లీ, ఇది నీ కోసమే తెచ్చాను. నువ్వు   బాగా సాధన చేయాలి. నా శిష్యురాలు చాలా గొప్పగా సితార్ వాయించగలగాలి. సంగీత రంగంలో నువ్వు ఒక సితారగా నిలవాలి” అంటూ ప్రేమతో నా తల మీద తన చేయి పెట్టి ఆశీర్వదించారు. నా కళ్ళు దీపాల్లా మెరిసాయి. నా మీద మాస్టర్ గారికి ఉన్న ప్రేమ చూసి పొంగి పోయాను.

నాన్న గారు సితార్ కొరకు ఎంత డబ్బులు ఇవ్వాలి అని మాస్టర్ గారిని అడిగారు. అపుడు ఆయన “గుడియా బాగా సితార్ వాయిస్తే చాలు. అంతకన్నా నాకు ఏమి వద్దు, తను కూడా నా బిడ్డ వంటిది. నా తరుపున గుడియాకు ఒక చిన్న బహుమతి” అంటూ నవ్వసాగారు. అంతలో అమ్మ వేడి వేడి యాలకుల టీ తెచ్చి మాస్టర్ గారికి ఇచ్చింది. ఆయనకు యాలకుల తో చేసిన టీ అంటే ప్రాణం, “ఇదిగో మీ అమ్మాయి సితార్ డబ్బులు నాకు వచ్చేసినట్టే. నా చెల్లి చేతి టీ కన్నా ఎక్కువ విలువైనది నాకు ఏదీ లేదు సార్” అని టీ త్రాగసాగారు.. అప్పుడు నాన్న గారికి అర్థం అయింది కొన్ని నెలలుగా ఆయన ఫీజు తీసుకోకుండా ఎందుకు ట్యూషన్ చెప్పారో అని. అతని మంచి మనసుని మా కుటుంబం లోని వారందరూ వేనోళ్ళా పొగిడాము.

అలాంటి గురువు దొరకడం నా అదృష్టం. ఆయన కేవలం సంగీతంలో మాత్రమే కాక కాలేజీలో కూడా నా లెక్చరర్ కావటం విశేషం. ఆ రోజు రాత్రంతా నిద్ర పట్టలేదు. ఏదో ఒక ఒక కొత్త ఉల్లాసం నాలో నిండి ఉంది. మనకి ఇష్టమైనది దొరికితే – అన్నం వద్దు, నీరు వద్దు అనేంతగా నా మనసు సితార్ మీదనే నిలిచి పోయింది. రాత్రంతా నా సితార్‌ను నా పక్కన పెట్టుకొని నిద్ర పోయాను. పొద్దున్న అమ్మ కసిరితే కానీ దానిని దాని స్టాండులో పెట్టలేదు.

***

నేను స్త్రీ సంరక్షణా గృహంలో ఉన్న రోజుల్లో మాస్టర్ గారు నన్ను చూడటానికి వచ్చారు. ఆయన కళ్ళు దీనంగా నా వైపు చూస్తూ ఉన్నాయి. ఈరోజు ఆ దృశ్యాన్ని గుర్తు చేసుకున్న మనసు భారంగా మారుతుంది. ఆయన తన కోహినూర్ వజ్రాన్ని పోగొట్టుకున్నంతగా బాధ పడుతున్నారు. నాతో కాసేపు మాట్లాడి, నాకు దైర్యం చెప్పారు.

పెళ్లి అయిన తరువాత నీరజ్ ఇంటిలో ఉంటూ సంగీత పరీక్షలు రాశాను. అప్పుడు ఈ విషయం తెలిసి మాస్టర్ గారు చాలా బాధపడ్డారు. “నీకు ఏమైంది తల్లీ, ఇంకా బాగా నిన్ను నేను పరీక్షలకు తయారు చేసి ఉండేవాణ్ణి కదా” అని బాధపడ్డారు. వారికి నేను అన్నిటిలో ఫస్ట్ ర్యాంకు తేవాలి అని ఉండేది.

ఆయనతో ఏమని చెప్పేది – “మాస్టర్ గారు, ఇప్పూడు నీ కూతురు లాంటి కావ్య లేదు, చచ్చిపోయింది. మీ ముందు ఉన్నది కేవలం బలవంతపు పెళ్లికి కట్టుబడి, బతుకుతున్న జీవచ్ఛవం మాత్రమే. నా దగ్గర ఇపుడు మీరిచ్చిన సితార్ లేదు, మీ ప్రేమతో నిండిన ప్రోత్సాహం లేదు. ఆ రెండింటితో నేను ప్రపంచాన్నే గెలవగలిగేదాన్ని.”

నేడు కావ్య లోని ఆత్మ ఎన్నాడో దూరతీరాలకు వెళ్ళి పోయింది. నేడు కావ్య రూపంలో మీ ముందు తిరుగుతున్నది కేవలం ఒక మనసు లేని రాతిబొమ్మ. కావ్య సంతోషం కోసం ప్రాణాలైనా ఇచ్చే నాన్న, అన్నయ్య, మాస్టర్ గారు వీరందరిని దూరం చేసుకున్న మర బొమ్మ.

ఇపుడు నేను ఉన్న ప్రపంచం వేరు. పుట్టింటి విలాసం వేరు. నాతో ఉన్న నీరజ్‌కు ఇలాంటి సూక్ష్మమైన విషయాలు అర్థం కూడా కావు. సంగీతం గురించి తనకు అంతా పెద్దగా అభిరుచి కూడా లేదు మరి.

నా జీవితంలో నేను ఎన్నడూ కనీ విని ఎరుగని విషయాలను నేను చవిచూస్తాను అని కలలో కూడా అనుకోలేదు. స్త్రీ సంరక్షణా గృహం గురించి న్యూస్ పేపర్లలో చదవి ఉన్నాను కానీ, ఆ పేరుకు ఏ మాత్రం న్యాయం చేయని వాతావరణం లోపల ఉంది. పశువులు కూడా తినలేని ఆహారం, మంచి మాటలకు తావు లేనే లేదు. ప్రత్యక్ష్య నరకాన్ని చావుకు ముందు చూపించే ప్రయత్నం అక్కడ జరుగుతోంది. ఎన్నో శారీరిక, మానసిక హింసలకు లోనైన ఆడవారికి జీవితాన్ని కొత్త కోణంలో చూపించే పేరుతో నిర్మించిన స్త్రీ సంరక్షణా గృహం నేడు నరక సదృశంగా కనిపిస్తుంది. బయటి వారికి అది ఒక పరివర్తనా నిలయం, కానీ లోపలకు వెళ్ళి చూస్తే కానీ అర్థం కాదు, వారు ఇక్కడ ఎంత పరివర్తన చెందుతున్నారు అని. అదేదో సామెత చెప్పినట్టు ‘పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు’ వారి జీవితాలలో గాంచని కొత్త నరకాన్ని ఇక్కడ వారు అనుభవిస్తూ ఉన్నారు.

మరి, నా జీవితంలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. నేను నాకున్న బాధల్ని ఎక్కడా కంప్లయింట్ రూపంలో ఇవ్వలేదు. చెప్పాలంటే నాకు ఏ విధంగానూ, ఎవరి గురించి కూడా ఫిర్యాదు చేసే పరిస్థితి లేనే లేదు. కొద్దో గొప్పో ఉంటే గింటే మేనత్త మీద మాత్రం కొంచెం కోపం ఉంది. అది కూడా నాకు నేనే పరిష్కరించుకున్నాను. కాకపోతే ఏ విధమైనా సమస్యలు లేని నా జీవితానికి నేను మాట్లాడిన మాటలే సమస్య కావటం విధి వైపరీత్యమేమో.

ఇక పోలీసులు, కోర్టుల గురించి పుస్తకాలలో చదివాను లేదా సినిమాలలో చూశాను, కానీ నేను కోర్ట్ బోనులో నిలబడి చేయని తప్పుకు సంజాయిషీ చెప్పుకోవాలి అని అనుకోలేదు. మొత్తంలో కేవలం ఒకే ఒక సంతకం, నా జీవితాన్ని కబళించి వేసింది అంటే అతిశయోక్తి కాదు.

ఇక ఒక ఆడపిల్ల జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం, పెళ్లి. పెళ్లి గురించి నా కన్నె మనసులో కూడా కొన్ని ఊహలు లేక పోలేదు మరి. పెళ్లి తంతు గురించి, మగ పెళ్ళివారితో చేసే తమాషాలు, పెళ్లిసందడిలో ఉన్న సంతోషాన్ని ఎన్నో పెళ్లిళ్లలో నేను అనుభవించాను కూడా. కానీ, నా పెళ్లిని నేనే చూసుకోలేదు. దానికి కోసం నేను ముస్తాబు అయింది లేదు, పల్లకి రాలేదు, పెళ్లి సందడి అనేది లేనే లేదు. విందు భోజనం అనే మాటే రాదు. పెళ్ళికి బాజా భజంత్రీలు కూడా లేవు. ఇలాంటి పెళ్లి గురించి నేను కల కనలేదు.

లాయరు పురోహితుడి వలె, మా పెళ్లి అయింది అన్నాడు, మేము తల ఊపాము. అంతే, మా పెళ్లి అయింది. ఎంత సరళమైన వివాహమైనా కొన్ని సరదాలు ఉంటాయి. కానీ నాది మాత్రం దానికన్న కూడా సరళంగా నడిచిన వివాహం. ముఖ్యంగా పెళ్లి కూతురికి కూడా తెలియకుండా అయింది నా పెళ్లి…

పెళ్లి అంటే బంధుమిత్రుల రాక, వారి కబుర్లు, ముఖ్యంగా వారు ప్రేమతో ఇచ్చే కానుకలు. ఎలాంటి కానుకలు నాకు దొరకలేదు. కేవలం నాన్న అమ్మ, మాస్టర్ గారి కంటి తడి ఇప్పటికీ గుర్తు ఉంది. అదే నా పెళ్లి కానుకగా నేను తీసుకొని వచ్చాను. కానీ వారి కళ్ళలో నా భవిష్యత్తు గురించిన ఆశ ఎక్కడా కనపడలేదు.

పెళ్లికూతుర్ని పల్లకిలో అత్తవారింటికి సాగనంపేటప్పుడు అమ్మానాన్నల కళ్ళు చెమర్చడం మనకు తెల్సు. కానీ అవే నాలుగు కళ్ళు నన్ను పాడె మీద పంపుతున్న శవం లాగా బాధతో చూస్తూ ఉన్నాయి. వారి చూపుల్లో వారి ప్రేమను వెదుకుతూ ఎప్పుడు ఈ రెండు గదుల ఇంట్లోకి వచ్చి పడ్డానో తెలియలేదు.

***

మధ్య రాత్రి, ఒక్కసారిగా మెలకువ వచ్చింది. పరుపు మీద నీరజ్ బలమైన చేతులు నన్ను గట్టిగా నలుముతున్నాయి. అంతే, నేను గట్టిగా అరవడంతో అతను పక్కకు తప్పుకున్నాడు. అతను కూడా ఇలాంటి అరుపు ఇదివరకూ విని ఉండదు కాబోలు, దూరంగా వెళ్ళి పడుకున్నాడు.

ఈ కార్యక్రమం కొన్ని నెలల వరకూ ఇలాగే కొనసాగింది. పొద్దున్న నిద్ర లేచి, ఇంటి పనులన్నీ చకచకా చేసి, ఒక మూలలో కూర్చొని నా లోకంలో నేను ఉండి పోయేదాన్ని. సాయంత్రం నుంచే ఏదో ఒక రకమైన దిగులు, భయం నాలో ఆవరించేది. రాత్రి చీకటి నాకు, గుహలో ఒంటరిగా ఉన్న భావనను కలుగ చేసేది.

మనిషికి ఉండే భావనలు నాలో నశించి పోయాయి, కేవలం మర బొమ్మ వలె శరీరం, ప్రాణం నిలుపుకునేందుకు ఏదో తినేదాన్ని, పగలంతా పనులతో సరి పోయేది. రాత్రి ఒక మంచుముద్ద వలె పరుపు మీద పడి ఉండేదాన్ని.

అపుడప్పుడూ కాలేజీ రోజులను, అంజుతో స్నేహాన్ని గుర్తు చేసుకునేదాన్ని. అపుడప్పుడూ నేను నా స్నేహితురాలు అంజును కలిసేందుకు వారి ఇంటికి వెళ్ళేదాన్ని. అంజు ఇల్లు నీరజ్ ఇంటి పక్క ఇల్లు. నీరజ్ అంజు అన్నకు మంచి స్నేహితుడు కూడా. అందరం కలిసి మాట్లాడేవారం. అంజు అమ్మ పిల్లలందరికీ వేడి వేడి పకోడీలు లేదా ఏదైనా చిరుతిండ్లు చేసి ఇచ్చేది. తిన్న తరువాత అందరూ వారి వారి ప్లేట్లను కడిగి పెట్టేవారు, కానీ ఆంటీ నన్ను మాత్రం ప్లేట్ కడుగవద్దు అని చెప్పేది. ఆమెకు తెలుసు నేను ఇంటిలో కూడా ఏమీ పని చేయను అని, అమ్మానాన్న ఏ పని చేయనివ్వరు కూడా, అలాంటప్పుడు ఇక్కడ ఇలా ప్లేట్ కడిగేది ఆమెకు నచ్చేది కాదు. నిజంగా నేను ఇంటిలో ఎన్నడూ తిన్న తట్ట కడుగలేదు, తాగిన లోటా తీసి కూడా పెట్టలేదు. అమ్మానాన్న నన్ను అంతా గారాబంగా పెంచారు. కానీ ఈ రోజు పూర్తి ఇంటి పాత్రలు అన్నీ కడుగుతున్నది నేనేనా అన్న సందేహం నాకు వస్తూ ఉంటుంది.

***

సమయం ఎంత విచిత్రమైనది సుమా, నేను ఎక్కడో తప్పిపోయి ఇక్కడికి వచ్చిన అనుభూతి కలుగుతుంది ఒక్కోసారి.

కానీ రాత్రి అయితే చాలు, నా మీద పడి, నన్ను ఆక్రమించుకునే చేతులను మాత్రం నేను భరించలేక పోతున్నా. గట్టిగా అరిచేదాన్ని. చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడ వింటారో అని అతను నన్ను వదిలి పెట్టేవాడు. కానీ ప్రతీ రాత్రి ఆ ప్రయత్నం మాత్రం చేసేవాడు. నిజం చెప్పాలంటే నాకు నీరజ్ అంటే ఏ మాత్రం ప్రేమ లేదు. అలా అని ద్వేషం కూడా లేదు. కానీ బలవంతంగా నన్ను పెళ్లి చేసుకున్నందుకు అతని మీద కొంచెం అసహనం ఉంది. మా అమ్మానాన్నలకు దుఃఖాన్ని కలిగించాడు. ఆ కారణం చేత నా మనసు అనే చిన్న మొక్క, నీరజ్ చూపిన క్రౌర్యం అనే ఎండలో వాడిపోయింది.

రాత్రి…..

రాత్రి అనే పదం ఒక్కొక్కరికి ఒక్కోలా అనుభవాలను ఇస్తుంది. ఒకరికి అనంత సుఖాలను అందించేది కావచ్చు, ఇంకొకరికి రాత్రివేళ లోని చీకటి భయాన్ని పెంచేది కూడా కావచ్చు. ఒకరికి రాత్రి కొరకు నిరీక్షణ ఉండొచ్చు, కొందరికి రాత్రి త్వరగా వెళ్లిపోవాలనే తపన ఉండొచ్చు. రాత్రి అంటేనే సహజంగా అందరికీ గుర్తుకు వచ్చేది విశ్రాంతి. నాకు మాత్రం ఆ పదం వింటేనే ఒక రకమైన జుగుప్స నాలో కలుగసాగింది. గత ఆరు నెలలుగా రాత్రిని ద్వేషిస్తూ కాలం వెళ్ళబుచ్చాను. ఒకే పదం, రకరకాలైన అనుభవాలను ఇస్తుంది అంటే ఆశ్చర్యం అవుతుంది కదా….

వంట చేసేది వచ్చేది కాదు ఇదివరలో, నెమ్మదిగా నేర్చుకున్నాను. నీరజ్‌కు మిత్రులు ఎక్కువగా ఉండేవారు. రోజూ ఎవరో ఒకరు ఇంటికి వచ్చేవారు. వయసులో ఒకరిద్దరిని విడిచి అందరూ నాకన్నా పెద్దవారే. నాతో ఎంతో మర్యాదగా నడుచుకునేవారు అందరూ.

నీరజ్‌కు కొంతమంది విద్యార్థి సంఘాలలో నాయకత్వాల వల్ల కొంచెం చెడ్డ పేరు కూడా లేకపోలేదు. వీరందరితో నాకు కూడా మిత్రత్వం మొదలయింది. మెల్లిగా జీవితం పట్టాల మీద పడ్డట్టు అనిపించసాగింది. నీరజ్ తండ్రి గారు, అతని ప్రేమ కూడా అప్పుడప్పుడూ గుర్తుకు వచ్చేది. నీరజ్ తండ్రిగారు సన్యాసం తీసుకున్నారు.

బెనారస్ లోని మఠంలో వారు సన్యాసిగా ఉంటున్నారు. వారు అక్కడ ప్రధాన పూజారిగా కూడా వ్యవహరిస్తూంటారు. నీరజ్ పెళ్లి విషయం ఆయనకు తెలిసి నన్ను తీసుకొని మఠంకు రమ్మని ఆయన నీరజ్‌కు చెప్పారట. నేను నీరజ్ వెంట వెళ్ళాను. నన్ను చూస్తూనే నీరజ్ చిన్నాన్నతో “పూవు లాంటి ఈ అమ్మాయి జీవితం నాశనం అయింది” అన్నారు. ఆ మాట నాకు చాలా ఆలస్యంగా తెలిసింది.

ఆయన నన్ను చాలా ప్రేమగా తన దగ్గర కూర్చొబెట్టుకొన్నారు. నన్ను అడిగారు – “అమ్మా, నీకు ఏవిధంగానూ సమస్య లేదు కదా? నీరజ్ నిన్ను బాగా చూసుకొంటున్నాడా?”

ఆయన నాకు ప్రసాదం ఇచ్చారు. నీరజ్‌తో నన్ను అప్పుడప్పుడూ అక్కడికి తీసుకొని రమ్మని చెప్పారు. ఇంకా నన్ను బాగా చూసుకో అని పదే పదే చెప్పారు.

ఎప్పుడైనా మేము వెళితే నాతో తప్పక అడిగేవారు – “ఏమ్మా, నీకు అక్కడ బాగా ఉందా? నీరజ్ బాగా చూసుకుంటూన్నాడా?” అని.

వారి పనివాడు రోజుకు ఒకసారి లేదా రెండు రోజులకు ఒకసారి వచ్చేవాడు. నన్ను కలిసి మాట్లాడి వెళ్ళేవాడు. ఆయన ప్రత్యేకమైన పని లేకుండా ఎందుకు వస్తున్నాడో నాకు అర్థమయ్యేది కాదు మొదట్లో. ఒకరోజు ఉండబట్టలేక అడిగా, అపుడు అతను అది స్వామీజీ ఆదేశం అని చెప్పాడు. రోజూ నన్ను చూసి వచ్చి ఆ విషయం చెప్పమని చెప్పారని అతను చెప్పాడు. నాకు ఆ రోజు ఎందుకు అలా ఆయన చెప్పారని అర్థం కాలేదు. నేడు పూర్తిగా అర్థం అవుతూ ఉంది.

ఒకరోజు వారు నన్ను మాత్రమే కలవాలి అని చెప్పి పంపారు. మేము ఇద్దరం వెళ్లాము. కానీ ఆయన నీరజ్‌ను బయట కూర్చోమని చెప్పారు. నాతో మాత్రమే మాట్లాడాలి అని ఆయన అన్నారు. నీరజ్‌కు ఇష్టం లేకపోయినా ఆయన మాటను ఎదురించలేక పోయారు.

ఆనాటి దృశ్యం, ఆ క్షణం నాకు కంటికి కట్టినట్టు గుర్తు ఉంది. అందరూ పిలిచినట్టే నేను కూడా ఆయనను స్వామీజీ అని పిలిచేదాన్ని. నేను ఈనాటికి కూడా ఆయనను మామయ్యా అని పిలిచింది లేదు. ఆయన తలుపు వేసి దగ్గరగా వచ్చి కూర్చోమని చెప్పారు. నాకు కొంత ఇబ్బందిగా అనిపించిది కానీ ఆయన మాట కాదనలేక వాకిలి తలుపు వేసి వచ్చి కూర్చొన్నాను.

ఆయన అన్నారు- “అమ్మా, నన్ను ఒకసారి ‘నాన్నా’ అని పిలువు” అని. ఆయన మొట్టమొదటి సారిగా నన్ను అలా అడిగారు. “మీరు నీరజ్‌కు తండ్రిగారు, అంటే నాకు కూడా తండ్రి సమానులే కదా” నేను అన్నాను. మొదటిసారి ఆయనను నాన్నా అని పిలిచాను. ఆయన కళ్ళ వెంబడి కన్నీరు కారింది. నా ఎడారి లాంటి బ్రతుకును ఆయన తన కన్నీళ్ళతో నింపారు.

ఆయన అలా ఎందుకు అలా ఏడ్చారో తెలియలేదు. కొంత సేపు అయ్యాక ఆయన కళ్ళు తుడుచుకొని “బిడ్డా, నీ నోటి వెంట నాన్నా అన్న పదం విని నా మనసు తృప్తి చెందింది. ఒకటి మాత్రం నీకు నేను చెప్పి తీరాలి. నీరజ్ మంచి పిల్లవాడు మాత్రం కాదు. అతను నీకు యోగ్యుడైన వాడు కూడా కాదు. ఆ భగవంతుడు ఎందుకు నీ జీవితంతో ఇలా ఆడుకున్నాడో అర్థం కావటం లేదు. నువ్వు ఏమీ బాధ పడవద్దు, నేను నా ప్రాణం ఉన్నంత కాలం నీకు రక్షణగా ఉంటాను.” అన్నారు.

ఆయన ప్రేమ, అనురాగం నన్ను కూడా సంవేదనకు గురి చేశాయి. ఆయన్ను కలవాలి అంటే అది ఒక ఉత్సవం లాగా అనిపించేది నాకు. ఒక రోజు, ఆనాటి మాట మరింత ప్రత్యేకం. ఆయన్ని కలిసి మాట్లాడితే నాకు మా నాన్నగారితో మాట్లాడినట్టు అనిపించేది. ఆ రోజు హటాత్తుగా ఆయన నన్ను “నువ్వు సంస్కృతంలో ఎం.ఏ చెయ్యి” అని చెప్పారు. నేను ప్రాచీన భారతీయ చరిత్ర గురించి ఎం.ఎ. చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. ఆయన ఎందుకు అలా చెప్పారో అర్థం కాలేదు. ఆయన ఇంకో మాట కూడా చెప్పారు “నీకు ఎప్పుడైనా డబ్బుల అవసరం వస్తే ఇక్కడికి నా దగ్గరికి వచ్చి అడుగు, నేను ఇస్తాను” అని. నేను ‘సరే’నంటూ తల ఊపుతూ బయటకొచ్చాను.

బయటికి వస్తూనే నీరజ్ అడిగాడు- “నాన్న ఏమి మాట్లాడారు నీతో?” అని. అతని ప్రశ్నకు జవాబు ఏమి చెప్పాలో తెలియలేదు. “నువ్వు చెడ్డవాడివని చెప్పారు” అని చెప్పలేక ఏదో మాట మార్చాను.

ఆ సంఘటన జరిగిన తరువాత కొన్ని రోజులకి నాకు కబురు వచ్చింది. స్వామీజీ గారు పంచభూతాలలో విలీనం అయ్యారు అని. ఈ వార్త నీరజ్ నాకు చెప్పాడు, నాకు మా నాన్నగారిని పోగొట్టుకున్నంత దుఃఖం కలిగింది.

కానీ నేను ఈనాటికి కూడా ఆయన నాతోనే ఉన్నారు అని బలంగా విశ్వసిస్తూన్నాను. ఆయన ఆశీర్వాదం నా పైన అలాగే ఉంది, ఆయన నా వెనకే ఉంటూ నన్ను నడిపిస్తూన్నారు అని అనిపిస్తూ ఉంది.

నీరజ్ నా నుదుటి బొట్టు తుడిచి, నన్ను విడిచి వెళ్ళిన సమయంలో నేను ఒంటరినైపోయాను. ఆ సమయంలో నాకు గుర్తుకు వచ్చింది స్వామీజీ. ఆయన భౌతికంగా మాతో లేకపోయినా కూడా ఆయన ఆశ్రమంలో ఆయన నిలువెత్తు ఫోటో ఉంది. ఆ ఫోటో దగ్గర కూర్చుంటే నాకు ఆయనతో మాట్లాడినట్టు అనిపించేది. అక్కడ ఉన్న ప్రధానాధికారిని “ఆ ఫోటో కావాలి” అని అడిగాను నేను. “నేను ఈ ఫోటో ఇంకొక కాపీ చేసుకొని వాపసు ఇస్తాను” అని అడిగి తీసుకున్నాను.

ఎలాగో ఆ ఫోటోను ఇంకొక కాపీ చేయించి పెట్టుకున్నాను. ఈనాటికి కూడా అది నా దగ్గర ఉంది. ఏ బాధ వచ్చినా కూడా ఆ ఫోటో చూస్తే ఆయన నాకు ఆయన సమాధానం చెబుతున్నట్టు అనిపిస్తుంది.

స్వామీజీ ఫోటో ఇంకొక కాపీ చేయించుకొని ఇంటికి వచ్చాను. అప్పుడే ఇంటి ముందు ఉన్న పోస్ట్ బాక్స్‌లో గువాహాతీ నుంచి ఇంటర్వ్యూ లెటర్ రావటం నా అదృష్టం. బాబాజీ ఆశీర్వాదం నా మీద ఎప్పుడూ ఉంది.

బాబా గారు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. ఎం.ఏ. సంస్కృతం చేస్తే నాకు ఎలా పనికొస్తుంది అని అనుకున్నాను. నేడు అదే నాకు అండగా మారుతుందని ఆయనుకు ముందే తెలుసు కాబోలు. బాబాగారు సిద్ధ పురుషులు మరియు అవధూత అని నా అభిప్రాయం. ఆయన నా భవిష్యత్తును చూశారు కాబోలు, నన్ను సంస్కృతంలో ఎం.ఏ చేయమని చెప్పారు. ఆయన నా జీవితానికి ఒక బాట చూపించారు.

నేడు కూడా ఆయనను గుర్తు చేసుకుంటే నా కళ్ళు వర్షిస్తూనే ఉంటాయి. ఆయన కరుణ, ప్రేమ, నా పైన ఆదరణతో నా మనసు నిండిపోతుంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here