కావ్య-5

0
8

[box type=’note’ fontsize=’16’] డా. ఇందు ఝున్‌ఝున్‍వాలా హిందీలో రచించిన ‘కావ్య’ అనే నవలని అదే పేరుతో అనువదించి అందిస్తున్నారు ఆర్. ఉమా శర్మ. [/box]

[dropcap]”మీ[/dropcap]కు అంతా తెలిసినప్పుడు నేను మీకు ఏం చెప్పాలి?” అన్నాను.  నేను అలా అన్నానో లేదో ఆయన – “ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు, నాతో వచ్చేయ్. ఇంక వెనక్కు తిరిగి చూడకు.. వీడు నీకు సరి అయిన జోడీ కాదు” అని అన్నారు. “వాడికి వజ్రం విలువ తెలియదు. రంగు రాయినే వజ్రం అని నమ్ముతూ ఉన్నాడు” అన్నారు.

ఆయనకు నీరజ్ మీద బాగా కోపం వస్తోంది. ఇంటి పరువు తీస్తున్నాడని నీరజ్ మీద విరుచుకుపడుతున్నారు.

నేను మెల్లిగా అన్నాను – “లేదండీ మామయ్య గారు, ఇపుడు నేను మీతో రాలేను.” అని.

చిన్న మామయ్య గారు ఏమి చేయలేక అలా చూస్తూ ఉండిపోయారు. తరువాత నా తల నిమురుతూ – “నువ్వు హాయిగా నిండు నూరేళ్ళు వర్ధిల్లమ్మా, నేను బతికి ఉన్నంత కాలం నీకు నేను ఉన్నాను అని మాత్రం మరచి పోవద్దు. ఎప్పుడు ఏ అవసరమైనా నన్ను పిలిపించు, తక్షణం వస్తాను” అన్నారు.

నీరజ్ గారి చిన్నాన్న చాలా కరెక్ట్‌గా చెప్పారు. నీరజ్ నాన్న, చిన్నాన్న, మరియు అందరూ చాలా మంచివారు, గొప్ప ఆదర్శాలు ఉన్నవారు. నిజంగానే మంచి కుటుంబం, కానీ నీరజ్ మాత్రం ఇలా ఎందుకు తయారయ్యాడు?

మామయ్య భారమైన మనసుతో అక్కడి నుంచి వెళ్ళి పోయారు. నేను అలాగే ఏడుస్తూ పరుపు మీద పడుకుని ఉండిపోయా.

***

కొన్ని రోజుల వరకూ నీరజ్ ఇంటిపట్టూనే ఉన్నాడు. కానీ తను ఇంట్లో ఉన్నన్ని రోజులు నాకు నరక సదృశంగా ఉండేది. తాను బయటికి వెళితేనే బాగుండు అనిపించేలా వ్యవహరించసాగాడు. ఒక మంచి మాట లేదు, ఒక ప్రేమతో కూడిన పలుకు లేదు, మాట మాట్లాడితే ఒక కొత్త కొట్లాటగా మారిపోయేది. నీరజ్‌ అక్కడికి వెళ్లకుండా ఉండలేడు అని నాకు అర్థం అయింది.

ఇదిలా ఉండగా నా చిన్న మామ్మయ్య గారు వచ్చారు. వారు వస్తూనే “అంతా మామూలుగా ఉంది కదా? సమస్య ఏమీ లేదు కదా?” అని అడిగారు. వారు ఎందుకు అలా అడిగారో తెలియలేదు.

అంతా మామూలుగా ఉంది అని చెప్పాను. కొంతసేపు కూర్చొని పిల్లలతో ఆడుకొని, టీ తాగి వెళ్ళిపోయారు.

కానీ మరలా రెండు రోజుల తరువాత వచ్చి అడిగారు, “అమ్మా, అంతా బాగుంది కదా? నీకు ఏమైనా సమస్య ఉందా?? ఊరకే అలా అడుగుతున్నాను, నీరజ్ క్లినిక్ వెడుతున్నాడు కదా?”

“అవును మామయ్యా, అంతా బాగా ఉంది, నీరజ్ క్లినిక్ వెడుతున్నారు” అన్నాను.

ఈ మధ్యన కొంత పని ఉండటం వల్ల క్లినిక్‌కు తక్కువగా వెడుతున్నారు. అందువల్ల ఇంటిపట్టునే ఉంటారు అని చెప్పాను.

“నిన్ను సతాయించడం లేదు కదా, అలా ఏమైనా ఉంటే చెప్పు. వాడి చెవులు మెలి పెట్టి నీ వెనుక పంపుతాను” అన్నారు.

ఆయన ప్రేమ చూసి నా కళ్ల వెంబడి నీరు తిరిగాయి. చాలా ప్రయత్న పూర్వకంగా నా కంటి నీరు ఆపుకోగలిగాను. అంతా బాగుంది లెండి అని ఆయనకు సమాధానం చెప్పాను కానీ ఈ ఒక్క విషయంలో కూడా నా జీవితం బాగా లేదు అని ఎవరికి ఫిర్యాదు చేసేది?

ఆయనను బాధ పెట్టడం నాకు ఇష్టం లేక చెప్పలేదు, కానీ నాకు తెలియని నిజం ఏంటంటే ఆయనకు జెనిఫర్, నీరజ్ విషయాన్ని ఆయన మిత్రులు చెప్పారని.

మామయ్య గారు చెప్పినట్టే వారి ఇంటా వంటా లేని బుద్ధులన్నీ నీరజ్‌కు ప్రాప్తించాయి, అది నా ఖర్మ తప్ప ఇంకోటి కాదు కదా. వారి నాన్న, చిన్నాన్న, మరియు మిగతా బంధువర్గం అంతా చాలా మంచి, మర్యాదతో మాట్లాడుతారు. వారి ఇంటి కుటుంబ మర్యాదల గురించి అందరూ చక్కగా చెప్పుకుంటారు. అలాంటిది నీరజ్ వారి ఇంట్లో చెడబుట్టాడనే చెప్పాలి.

మామయ్య గారు భారమైన హృదయంతో అక్కడినుంచి నిష్క్రమించారు. వారు చాలా దుఃఖంతో అక్కడి నుంచి వెళుతున్నారు అని ఆయన దీనమైన మొఖం చెబుతోంది.

నేను మంచుబొమ్మ లాగా ముడుచుకొని అలాగే పడుకున్నా. కంటి నుంచి అవిశ్రాంతంగా పొంగుతున్న కంటిధారలు, నా హృదయ తాపాన్ని తగ్గించలేక పోతున్నాయి. అవి అలాగే మొఖం మీదనే ఆవిరి అవుతున్నట్టు అనిపించసాగింది. ఒకోసారి ఆ కన్నీటి ఉప్పు సముద్రంలో దూకి ఊపిరాడకుండా చనిపోతే ఎంత బాగుండు అనిపించసాగింది.

ఈ వయసులో మామయ్యకి భారంగా మారటం నాకు ఇష్టం లేదు మరి. ఆయన పరిస్థితి కూడా అంతంత మాత్రమే కదా.

ఈ నా జీవితం పైన నాకే నియంత్రణ లేని స్థితిలో వేరే వారి భుజాల మీద భారంగా మారటం నాకు సుతరామూ ఇష్టం లేదు. ఇది నా సమస్య, నేనే పరిష్కరించుకోవాలి. ఇంత జరిగాక తట్టుకున్నాను అంటే ఇంతకన్నా పెద్దగా జరగటానికి కూడా ఏమి మిగలలేదు కదా అన్న ఆలోచన నాకు మొండి దైర్యాన్ని ఇస్తోంది. కానీ నా భయం అంతా పిల్లల భవిషత్తు గురించి మాత్రమే.

ఇదిలా ఉండగా నీరజ్ ఈ మధ్యన ప్రతి రూపాయికి లెక్కపెట్టడం మొదలు పెట్టాడు. నిత్యావసర వస్తువుల నుంచీ ప్రతి చిన్న దానికి నస పెడుతూ నన్ను సాధించ సాగాడు. నేనేమీ దుబారా చేయటం లేదు కానీ ప్రతి రూపాయికి మొఖం చూస్తూ కూడా ఉండలేని స్థితి. పిల్లలున్న ఇంటిలో ఖర్చుకు కొదవ కూడా ఉండదు కదా.

కనీసం తల్లి అనే ప్రాణం ఉంటే ఆమెతో నా కష్టాలను ఏకరువు పెట్టేదాన్ని. నా గురించిన చింత లోనే ఆమె జీవితం క్రుంగి పోయింది. ఒకనాడు మమ్మలందరినీ వదిలి పరలోకానికి వెళ్ళిపోయింది. తల్లి దగ్గర ఉన్న చనువు మరి ఇంకెవరి దగ్గర రాదు, అలాంటి అనుభూతిని ఎవరూ ఇవ్వలేరు కూడా. నాటకీయమైన ప్రేమ చూపించే వారి ఆదరణ కంటే మా ఇంటి గురించి తెలుసుకోవాలనే తపన మిగతా వారిలో ఎక్కువ చూశాను నేను.

ఒక రోజు ఇంటికి వెళ్లినప్పుడు నా చెల్లెళ్లను, తమ్ముళ్ళనూ చూసినపుడు అనిపించింది నేను చాలా పెద్దద్దాన్ని అయ్యాను అని. నాన్న మొఖం లోని అసహాయతను చదవగలిగాను. నన్ను మొదటిసారిగా పోలీసులు పిలుచుకొని పోయిన రోజు నాన్న మొహం లోని అసహాయతను చూశాను. తరువాత నా పెళ్లి పేపర్ల మీద సంతకాలు చేయాల్సి వచ్చినప్పుడు, మరలా ఇపుడు అమ్మ పోయిన తరువాత అదే అసహాయతను నాన్న మొఖంలో చూస్తున్నాను.

కంటి నీరు ధారలై, గుండె మీద గాయాల మీద పూసే లేపనంలా అనిపించసాగింది. కన్నీటిని కప్పిపెట్టుకొని, బాధ, నొప్పి, వేదన లాంటి భావాలన్నిటినీ జీవననదిలో భాగంగా భావిస్తూ ముందుకు సాగిపోవటమొక్కటే మార్గం అనిపించింది.

ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోగల స్థితిలో ఉన్నాను. నాన్నను సముదాయించే అంత పెద్దద్దాన్ని కాదు కానీ ఆయన వేదనను మాత్రం బాగా అర్థం చేసుకున్నా. అమ్మ ఉంటే అప్పుడపుడూ చాటుగా అయినా నన్ను కలిసేది. వచ్చిన ప్రతిసారి పిల్లల కొరకు ఏదైనా ఒకటి తెచ్చేది. నా గురించి కూడా ఆలోచించే ఒకే ఒక ప్రాణం అది. కాసేపు అన్నీ బాధలు మరచిపోయి నెమ్మదిగా ఆమె ఒడిలో నిద్ర పోయేదాన్ని. ఆ క్షణం జీవితంలోని ప్రశాంతతని అనుభవించే దాన్ని.

ఇప్పుడు, నా స్నేహితురాళ్ళు అంజు, పూజాలు కూడా పెళ్లిళ్లు అయి వారి వారి అత్తగారి ఇళ్ళలో ఉన్నారు. సుఖ దుఃఖాలను చెప్పుకోవటానికి అంటూ మరో మనిషి లేరు. నేను, నా డైరీ. అదొక ప్రపంచం….

ఒక పెద్ద నిట్టూర్పు విడుస్తూ ఆలోచనా తరంగాల నుంచి బయట పడసాగాను. పిల్లలు ఆడుకుంటూ అలాగే వారు కూడా నా దగ్గరికి వచ్చి నా నడుము చుట్టూ చేయి వేసి పడుకున్నారు. శంకర్ కూడా ఇంటికి వెళ్ళి పోయాడు. పిల్లలు పడుకున్నాక మెల్లిగా లేచి, కన్నీరు తుడుచుకుంటూ పనులలో దూరిపోయాను.

***

కష్టాలు, కన్నీళ్లూ నా ఇంటి గుమ్మం విడిచి వెళ్ళే దారి మూసిపోయినట్టు అనిపిస్తోంది. జెనిఫర్ విషయంలో అలిసిపోయిన నేను మరొక సుడిగుండంలో కూరుకుపోతున్న అనుభవమైంది. మా ఇంటి యజమానికి వయసులో ఉన్న ఒక బిడ్డ ఉంది. ఆ అమ్మాయి అప్పుడప్పుడూ మా ఇంటికి వచ్చిపోతూ ఉండేది. ఆ అమ్మాయి నీరజ్‌తో కూడా రాసుకుంటూ పూసుకుంటూ మాట్లాడేది. ఆ అటువాత నాకు తెలిసింది ఆ అమ్మాయి ప్రవర్తన అంతా మంచిది కాదు, మగ పిచ్చి, మద పిచ్చి ఉన్న అమ్మాయి అని. ప్రతి రోజూ ఎవరో ఒక అబ్బాయితో తిరుగుతూ ఉంటుంది.

నన్ను మాత్రం వదినా అని పిలిచేది. కానీ నీరజ్ దగ్గర మాత్రం ఆ అమ్మాయి వగలు పోయేది. నేను ఆ అమ్మాయికి తాను చేస్తున్నది తప్పు అని నచ్చచెప్పాలి అని ప్రయత్నం చేశాను. కానీ నా మాటలను నాకే తిప్పి కొట్టింది. ఆ అమ్మాయి నీరజ్ మీదనే అభాండాలు వేయసాగింది. అంతలో ఇంటి యజమాని భార్య మా మీద విరుచుకు పడింది. ఇంటి యజమాని మమ్మలని ఇల్లు వెంటనే ఇల్లు ఖాళీ చేయమని చెప్పింది. పోలీసు కంప్లయింట్ కూడా ఇస్తాను అని బెదిరించింది.

కొన్ని రోజుల కిందట నీరజ్ ప్రెండ్స్ ఇంటికి వచ్చారు. క్రితం రోజు రాసిన నా కవితలు అలాగే అక్కడే టేబుల్ మీద పడి ఉన్నాయి. ఒక మిత్రుడు అనుకోకుండా వాటిని చూశాడు. అతను నీరజ్‌తో “వదిన గారు చాలా చక్కగా రాశారు. మీకు ఇష్టం అయితే నాకు తెలిసిన స్నేహితుడి ప్రెస్‌లో వదినకు మంచి ఉద్యోగం దొరుకుతుంది” అన్నాడు. నాకు చాలా సంతోషం అయింది, నీరజ్ కూడా సరే అని వెంటనే ఒప్పుకున్నాడు.

నీరజ్ ఈ మధ్యన ఇంటి పట్టునే ఉంటున్నాడు. క్లినిక్‌కు కూడా అప్పుడప్పుడూ వెళ్ళేవాడు. నేను మాత్రం నా ఉద్యోగంలో చేరిపోయాను. ప్రెస్‌లో అసిస్టెంట్‌గా ఉద్యోగం దొరికింది. వార్తాపత్రికలను కట్ట కట్టి పంపే ఉద్యోగం నుంచి త్వరిత కాలం లోనే నాకు ప్రమోషన్ దొరికింది. అసిస్టెంట్ నుంచి నన్ను జర్నలిస్ట్‌గా నియమించారు. అనతి కాలం లోనే సిటీ కాలం లోని క్రైమ్ రిపోర్ట్ రాయటంలో నేను ఎక్స్‌పర్ట్‌ని అయ్యాను. ఈ విధంగా కొద్దికాలం లోనే నా పేరు రాజకీయ నాయకుల, పోలీసుల నోళ్లలో నానసాగింది.

ఇంటి యజమాని మా మీద రోపోర్ట్ ఇచ్చినపుడు, నీరజ్ ఆ కేస్ నా తల మీద నెట్టేశాడు. నీరజ్ అన్నాడు-”క్రైమ్ రిపోర్టర్ గా నీకు బాగా పలుకుబడి ఉందిగా, నువ్వే ఈ పరిస్థితి నుంచి నన్ను బయట పడెయ్యి.”

మొదటిసారి నాకు నీరజ్ నన్ను ప్రెస్‌లో పనిచేసేందుకు అనుమతి ఇచ్చాడో అని అర్థమైంది. నిజానికి నాకు జర్నలిస్ట్‌‌గా మంచి పేరు ఉంది అనే చెప్పాలి.

నేను ఏ మాత్రం భయపడలేదు. మా ఇంటికి వారెంట్ వచ్చింది. ఇలాంటివి క్రైమ్ డెపార్ట్మెంట్‌లో ఉంటూ చాలా చూశాను. ఆయన్ పేరుతో వారెంట్ వచ్చింది కానీ నేను కోర్టుకు వెళ్ళాను. మా ఇంటి యజమాని వాళ్ళ అమ్మాయి గురించి నేను చెప్పసాగాను. నా మాటల తీరుకు కోర్ట్ నివ్వెరపోయింది. అక్కడ ఉన్న చాలామందికి నేను తెలిసినందున వారు నా మాటలను విశ్వసించారు.

ఆ కేస్‌ను జడ్జిగారు కొట్టి వేశారు. కానీ ఇపుడు ఆ ఇంటిలో ఉండటం నరక ప్రాయంగా ఉంది. ప్రతి రోజూ ఇంటి యజమాని – యజమానురాలు ఏదో ఒక నెపంతో మాతో కొట్లాట వేసుకునేవారు.

బలహీనమైన ఆర్థిక స్థితి కారణంగా ఇంకొక వీధి లోని ఇంకొక ఇంటికి మారాల్సి వచ్చింది. ఇలాగే జీవితం ఆటుపోట్ల నడుమ నడుస్తూ ఉంది. ఒక రోజు నీరజ్‌కు నా గురించిన ఒక విషయం తెలిసింది. నేను ఏదైనా సంతకాన్ని కాపీ చేస్తూ రాయగలను అని తెలిసిన నీరజ్ మొదట ఆశ్చర్యపోయాడు.

నీరజ్ తన స్నేహితుల ముందు నా ప్రతిభను పొగుడుతూ నాతో తెల్ల కాగితాల పైన అచ్చంగా నేను చేసే కాపీ సంతకాల ప్రతిభను ప్రదర్శించసాగారు. నేను కూడా సంతకం చేస్తూ ఎంతో సంతోషంగా చూపసాగాను. అలా చాలాసార్లు చేయటం కూడా జరిగింది. అది కేవలం తమాషాకు అని నాకు అనిపించేది. కానీ నా ప్రతిభ నాకే ముల్లుగా మారుతుందని నేను అనుకోలేదు.

నీరజ్‌కు ఉన్న తాగుడు అలవాటు వ్యసనంగా మారింది. ఎప్పుడూ దిగులుగా కూర్చోనేవాడు. డబ్బుల కొరకు ఎప్పుడూ ఇబ్బంది పడేవాడు. ఆదాయంలో వచ్చే ప్రతి రూపాయిని తాగేందుకు ఖర్చు పెట్టేవాడు.

ఒక వైపు నేను జర్నలిస్టుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నాను. నీరజ్‌కు మొదట్లో ఏదో కొంత డబ్బు సాయం కోసం మాత్రమే పనికి వస్తుందని అనుకున్నాడు. కానీ నా ఎదుగుదల అంచలెంచలుగా పెరగటంతో తట్టుకోలేక పోతున్నాడు. పురుషాహంకారంతో నా ఎదుగుదలను హర్షించకపోగా నన్ను హింసించడం మొదలుపెట్టాడు. చీటికి మాటికి నాతో కొట్లాడుతూ ఉండేవాడు.

నేను పొద్దున నుంచి ప్రెస్ పనితో, ఇంటి పనితో సతమతమవుతూ ఉంటే తాను మాత్రం తప్పతాగి అవాకులు-చవాకులు పేలుస్తూ నన్ను బాధ పెట్టేదే పనిగా పెట్టుకున్నాడు. నేను పిల్లలను తీసుకొని ఇంకో రూమ్‌లో వెళ్ళి పోయేదాన్ని.

ఈ మధ్య వార్తా పత్రికలు, మాస పత్రికలకూ ఆర్టికల్స్ రాసేదాన్ని. చిన్నప్పటి నుంచీ నటన పట్ల అభిరుచి ఉండేది. కానీ ఇపుడు అభిరుచి అనేదానికన్నా డబ్బు అవసరం ఎక్కువ అనే చెప్పాలి. ఒకటి, ఆరా సినిమాలలో నేను నటించాను. అలా కొంత డబ్బు ముట్టింది.

ఒక రోజు పోలీస్ స్టేషన్‌కు ఒక క్రైమ్ రిపోర్ట్ గురించి వెళ్ళాను. అక్కడ ఉన్న ఇన్‌స్పెక్టర్ నాతో నీరజ్ గురించి చాలా ప్రశ్నలు అడిగారు. అలా ఎందుకు ఆయన అడుగుతున్నారో కొంత సేపు అర్థం కాలేదు నాకు.

నాలో ఆదుర్దా పెరిగింది, “సార్, అలా ఎందుకు అడుగుతున్నారు? ఏమీ సమస్య లేదు కదా?” అని అడిగాను.

ఆయన చెప్పిన మాటలు వింటూ ఉంటే నా కాళ్ళ కింద భూమి కదిలినట్టయింది. నీరజ్ ఇలాంటివాడా? అయినా మరీ ఇంత మోసమా? ఇంత క్రైమ్ చేస్తాడు అని అనుకోలేదు. నా కళ్ళు ఒకసారిగా తిరిగినట్టు అయింది. ఇతరుల గురించి ఎన్ని క్రైమ్ రిపోర్టులు నేను రాసినా నా భర్త గురించి విన్నప్పుడు ఇన్‌స్పెక్టర్‌కు ఏమి చెప్పాలో తెలియలేదు.

కేవలం అంటే కేవలం డబ్బు కొరకు ఇంతటి మోసం చేయటానికి నీరజ్ తయారయ్యాడు అంటే నమ్మబుద్ధి కావటం లేదు. తనకున్న బలహీనతలను ఒక రకంగా ఎక్కడో ఒప్పుకున్నా కూడా ఇంతటి దారుణమైన మోసాలను చేస్తాడు అని కలలో కూడా నేను అనుకోలేదు.

నాకు భయంకరమైన మోసం చేయాలనే నీరజ్ ఆలోచనకు ఒళ్ళంతా జెర్రులు పాకినట్టు అయింది. నాకు ఏమైనా అయితే పిల్లలు అనాథలు అవుతారు, నీరజ్ వారిని చూసుకుంటాడనే నమ్మకం కూడా నాకు లేదు. తన పనికిమాలిన పనులకు నన్ను బలిపశువు చేయటం ఎంతవరకు సబబు అని అనుకున్నాను.

ఇన్‌స్పెక్టర్ గంభీరంగా చెప్పసాగాడు – “ఆయన మీ భర్త అని తెలిసి మీకు ఒక మాట చెప్పి హెచ్చరించాలి అని ఊరుకున్నా. లేకుంటే ఈ పాటికి ఎప్పుడో యాక్షన్ తీసుకునేవాడ్ని. లాకప్‌లో వేసి ఉండేవాణ్ణి.”

నీరజ్ పనుల వల్ల నాకున్న మర్యాద కూడా పోయినట్టు అయింది. ఆ రోజు ఇంటికి రావటానికే చాలా సమయం పట్టింది. ఇక నీరజ్‌ను అడిగే ఓపిక నాకు లేదు. పిల్లలు కూడా నా అలిసిపోయిన మొహం చూసి చప్పుడు చేయకుండా ఆడుకుంటూ ఉన్నారు. విషయం చాలా గంభీరమైనది అయినప్పటికీ కొంత నెమ్మదిగా చూడాలి అని ఊరికే ఉండిపోయాను.

మరుసటి రోజు పొద్దున్నే నీరజ్ కొత్త మిత్రుడు ఒకడు ఇంటికి వచ్చాడు. మరలా అదే పాత నాటకం. నీరజ్ నన్ను పిలిచి ఆయన ముందు “ఖాళీ పేపర్ మీద ఒక సంతకం చేసి చూపించు” అని అన్నాడు. ఇపుడు నేను తేరుకున్నాను. పోలీస్ ఇన్‌స్పెక్టర్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి “నేను పేపర్ మీద సంతకం చేయను” అని ఖరాఖండిగా చెప్పాను.

అంతే, నీరజ్‌కు కోపం ముంచుకొచ్చింది. “ఏంటి? ఏమయింది నీకు ఈ రోజు?” అని గట్టిగా అరిచాడు. లోపల ఉన్న కోపాన్ని అణగదొక్కుకొని ప్రేమ నటిస్తూ అన్నాడు – “ఏం ఏమయింది ఈ వేళ, ఈ నా మిత్రుడికి నీ కళ గురించి నేను చెబితే నమ్మటం లేదు. నువ్వు ఒక సారి సంతకం చేస్తే కానీ నా మాటకు విలువ ఇవ్వడు.” అంటూ నాటకీయంగా నా వైపు చూశాడు.

నా కోపం కట్టలు తెంచుకొంది. ఆవేశంతో “నా నోటి నుంచే తెప్పించాలని ప్రయత్నం చేయకు. నీ మోసాలు అన్నీ నాకు తెలిసాయి. నీ ఈ పనిలో నన్ను భాగస్వామిని చేయటానికి నేను ససేమిరా ఒప్పుకోను.” అన్నాను.

కోపాన్ని దిగమింగుకుంటూ – “అయినా నువ్వు ఇలాంటివి ఎందుకు చేస్తున్నావు? నీకు అంతటి కష్టం ఏమి వచ్చింది? నన్ను అడిగితే నువ్వు ఇవి అన్నీ వదిలి పెట్టి బుద్ధిగా ఉంటే బాగుంటుంది.” అన్నాను.

వీరావేశంలో నీరజ్ పేపర్లను చింపి వేశాడు. వచ్చిన కొత్త మిత్రుడిని పిలుచుకొని బయటకు వెళ్ళి పోయాడు. ఆ చింపిన పేపర్లను కలిపి చూస్తే కింద కార్బన్ పేపర్ పెట్టబడి ఉంది. నా కాలి కింద భూమి కదిలినటు అయింది. కేవలం డబ్బు కోసం ఇలాంటి నీచమైన పనులు చేయటం మరొక భరించలేని సత్యమే అయింది నాకు……

నాలోని అణువణువూ భయంతో ఊగిపోయింది. చలికి వణికినట్టు వణకసాగాను. ఇది ఎక్కడికి పోయి నిలుస్తుంది దేవుడా అని మూగగా రోదించ సాగాను.

అసలు ఆ పోలీస్ ఆఫీసర్ నాకు ఈ విషయం చెప్పి ఉండకపోతే నేను ఈ పాటికి జైలులో చిప్ప కూడు తింటూ ఉండేదాన్ని. దాని కన్నా నా బిడ్డలని అనాథలుగా ఊహిస్తూ ఉంటే నా మనసు బాధతో నిండి పోయింది. ఎప్పుడూ ఇలా జరుగుతుంది అని మనసులో ఒక ఆలోచన కూడా నాకు రాలేని నా మూర్ఖత్వం మీద అసహ్యం వేసింది.

నీరజ్ మీద ఉండే గుడ్డి నమ్మకం నేడు ఎంత పని చేసింది చూడు అని అనుకున్నా. ఎప్పుడు నీరజ్ అడిగినా సరదాకి కదా అని చేసి చూపించాను. నమ్మకం, నమ్మక ద్రోహం రెండింటి మధ్య ఉన్న అతి చిన్న పరదాను నేడు అర్థం చేసుకోగలుగుతున్నాను.

సంతకం చేసి చూపిస్తే నీరజ్ కంటిలో కనిపించే మెరుపును చూసి నన్ను మెచ్చుకుంటూ ఉన్నాడు అని పొంగిపోయేదాన్ని. ఆ మరుసటి క్షణం నా పనిలో నేను నిమగ్నమై పోతాను. కానీ ఆయన మెదడులో ఇంకా వేరే ఆలోచనలు నిండి ఉండేవి అని తెలియదు.

నాకు ఇప్పుడిప్పుడే గుర్తొస్తోంది, నేను బాగా బిజీగా ఉన్నప్పుడే నా దగ్గరికి నీరజ్ వచ్చి పేపర్ మీద సంతకం చేయమని అడిగేవాడు. నేను కలలో కూడా తను ఇలా చేస్తాడు అని అనుకోలేదు.

ఇపుడు నీరజ్‌తో కూడా జాగ్రత్తగా ఉండవసిన సమయం వచ్చింది. ఎంత విచిత్రమైన జీవితం నాది కదా. జీవిత భాగస్వామి గుండె మీద నిశ్చింతగా నిద్ర పోవలసిన వ్యక్తి నీరజ్. కానీ తనతో కూడా జాగ్రత్తగా ఉండవసిన పరిస్థితి నాది. పగవారికి కూడా ఇలాంటి జీవితం వద్దు అని అనుకుంటాను. సమయం, జీవితం ఎవరి కొరకు వేచి ఉండవు. ఇంతకూ నీరజ్ నా పిల్లల తండ్రి కూడా. పిల్లలకు తండ్రి లాలనను, ప్రేమను దూరం చేయటం నాకు ఇష్టం లేదు.

ఇప్పుడు ఇంక ఎక్కువగా ఆలోచించడం లేదు. అయింది ఏదో అయింది, ఇక మీదట నేను సంతకాలు పెట్టను అని దృఢంగా నిశ్చయం చేసుకున్నాను.

నాకు కూడా ప్రెస్‌లో అర్జెంట్‌గా ఒక క్రైమ్ రిపోర్ట్ చేయాల్సి ఉండే. ఇంకా నీరజ్ గురించి ఆలోచన లేదు అనుకుని, పిల్లలకు బ్యాగు, లంచ్ బాక్స్ సర్ది నేను కూడా ప్రెస్‌కు బయలుదేరాను.

***

ఆ సంగతి అక్కడికి ముగిసింది అని నేను మాత్రమే అనుకున్నాను. కానీ నీరజ్‌లో ఆ విషయం గురించిన నిప్పు ఇంకా రాజుకుంటూనే ఉంది. మగవాడి అహంకారాన్ని కొలవలేం కానీ కొలవగలిగితే అది ఎవరెస్ట్ పర్వతం కన్నా పెద్దదే అని అనిపిస్తుంది. ఆడది ఎంత చదివినా, ఎంత నేర్చినా, ఎంతా అందగా ఉన్నా, ఆమె ఏ పొజిషన్‌లో ఉన్నా ఆడదే అనే స్థాయి భావాన్ని మగవాడు (మొగుడు) మనసులో నాటుకుంటాడేమో.

ఒక రోజు మామూలు గానే ప్రెస్ పని ముగించి ఇంటికి వచ్చేటప్పటికి నీరజ్ ఇంటిలోనే ఉన్నాడు. అతని వాలకం చూస్తేనే తెలుస్తుంది అతను తప్పతాగి ఉన్నాడు అని. తాగిన మత్తులో ఏదేదో గొణుగుతూ ఉన్నాడు. పిల్లలిద్దరూ ఒక మూల కూర్చొని వారి పాటికి వారు ఏదో ఆడుకొంటున్నారు. ఇంట్లో తాగద్దని, పిల్లల ముందు తాగద్దని నీరజ్‌కు ఎన్నోసార్లు చెప్పాను. కానీ తాను వినలేదు సరికదా, నేను చెప్పినపుడు ఇంకా ఎక్కువ చేస్తాడు. అందుకే ఆ విషయంలో పట్టించుకోకుండా ఉన్నాను.

నన్ను చూడగానే పిల్లలిద్దరూ వచ్చి నా చుట్టూ చేరి గట్టిగా పట్టుకున్నారు. వారికి కొంచెం తినడానికి ఇచ్చి, వారి హోం వర్క్ చేయించి వారితో పాటు ముందు రూమ్‌లో కూర్చొని ఉన్నాను. పొద్దున నుంచి ఇంటి పని, ప్రెస్‌లో పని, మరలా ఇంటికి వచ్చి పని, ఇలా పని మాత్రమే జీవితంలో ముఖ్యమైన నేస్తం అని నాకు అనిపిస్తుంది. జీవితంలో వయసు పైబడుతూ ఉంటే వైరాగ్యం దానంతట అదే వస్తుంది కదా….

బడలిక వల్ల కాబోలు, కొంచెం నిద్ర వస్తున్నట్టు అనిపించసాగింది. ఇంతలో అవే బలమైన చేతులు నన్ను గట్టిగా లాగాయి. ఒక్కసారిగా ఉలిక్కిపడి చూశాను. తాగిన మత్తులో తూలుతూన్నా నీరజ్ పట్టు మాత్రం సడలలేదు. గట్టిగా నన్ను పిల్లల దగ్గర నుంచి లాగసాగాడు. ఏదేదో గొణుగుతూ నన్ను తిట్టసాగాడు. నేను ఏమి జరుగుతోంది అని అర్థం చేసుకునే లోపే నన్ను ఇంటి బయటకు నెట్టేస్తూ అన్నాడు- “ఇక మీదట నీకు ఈ ఇంట్లో స్థానం లేదు” అని. వెంటనే ధభేలుమని వాకిలి వేసేశాడు.

నేను ఇంకా మాట్లాడనే లేదు. నన్ను తోసేసి వాకిలి వేసుకున్నాడు. బయట ఉన్న లైట్ కూడా ఆర్పేశాడు. చీకటిలో, రాత్రి వేళ ఇంటి బయట నిలబడి ఉన్నాను. పిల్లలు ఏమీ తెలియకుండా నిద్ర పోతూ ఉన్నారు. బయట చీకటి, నాలో కూడా దట్టమైన చీకటి అలుముకున్నాయి. పొద్దున నుంచి అయిన అలసట వల్ల మరలా ఏడ్వటానికి కూడా శక్తి లేకుండా ఉండిపోయాను.

చలికాలం, చల్లని గాలులు సూదుల్లాగా గుచ్చుకుంటూ ఉన్నాయి. చుట్టూ చిమ్మ చీకటి. వీధిలో అందరూ నిద్రలో మునిగి ఉన్నారు. సమయం దాదాపుగా పన్నెండు పైగా అయింది. ఇప్పుడు ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది ఏమీ పాలు పోవటం లేదు. ఇంటి తలుపులు మూసుకున్నట్టు నా మెదడు తలుపులు కూడా మూసుకుపోయాయా అన్నట్టు దిక్కు తోచని స్థితి. వీధి మలుపు లోకి వచ్చాను. ఎటు పోవాలి అని ఆలోచిస్తూ నుంచున్నా…

ఇంతలో ఒక యువకుడి స్కూటర్ నా ముందు వచ్చి ఆగింది. దాని మీద ఇరవైఒక్క సంవత్సరాల యువకుడు కూర్చొని ఉన్నాడు. ఆ వేళలో అతను హెల్మెట్ వేసుకున్నందున సరిగా గుర్తు పట్టలేక పోయాను. కానీ తాను నన్ను గుర్తు పట్టాడు. వీధి దీపం వెలుగులో నన్ను గుర్తు పట్టగలిగాడు. దగ్గరగా వచ్చి – “అరె మేడమ్, ఇంత రాత్రి పూట, ఇలా వణుకుతూ ఎందుకు నిలబడ్డారు మీరు?” అని అన్నాడు.

గొంతు వినగానే గుర్తు పట్టాను అతను సుధీర్ అని. అతను నాతోనే ప్రెస్‌లో పని చేస్తాడు. అంతరాత్రి వేళ సుధీర్ అలా అడిగే సరికి నాలో దుఃఖం కట్టలు తెంచుకుంది. ఎంత ఆపుకుందాం అన్నా దుఃఖం ఆగలేదు. వెక్కి వెక్కి ఏడుస్తున్నాను. సుధీర్ అర్థం కాక అలా నిశ్చేశ్టుడై ఒక నిమిషం నన్ను చూస్తూ ఉండిపోయాడు.

ఒక దైర్యవంతురాలైన క్రైమ్ రిపోర్టర్‌గా మాత్రమే నేను సుధీర్‌కు తెలుసు. అలాంటి నేను ఇంత బేలగా ఏడుస్తూ ఉంటే తాను తట్టుకోలేక పోయాడు. నేను ఏమీ చెప్పకుండానే అర్థం చేసుకున్నాడు.

ఉడుకు రక్తం మరిగింది – “పదండి మేడమ్, పోలీసు రిపోర్ట్ ఇద్దాం, తరువాత మా ఇంటికి వెళ్దాం, రండి” అన్నాడు.

కొంచెం తేరుకొని “పోలీస్ రిపోర్ట్ వద్దు. అంతే కాకుండా ఇంత రాత్రి పూట నేను మీ ఇంటికి వస్తే బాగుండదు” అని అన్నాను. స్త్రీ ఏ వేళలో అయినా సరే, తన చుట్టూ ఒక కంచె పెట్టుకొని తీరాలి అని మన సమాజం మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉంటుంది.. నా జీవితంలో చేయని తప్పుకు ఇప్పటికే కావలసినంత అనుభవించాను. ఇక కోరి కొత్త సమస్యలు తెచ్చుకునే ఓపిక నాకు లేదు.

“మరి ఇపుడు ఎలా? మిమ్మల్ని ఇలా వదిలి అంటూ నేను వెళ్లలేను” అన్నాడు సుధీర్

“సరే, అలా యితే నన్ను మా పెద్ద ఆడపడుచు ఇంటి దగ్గర వదిలి పెట్టు, ఇక్కడే వెనుక వీధిలో వాళ్ళ ఇల్లు ఉంది. అక్కడ నన్ను అక్కడ దిగబెట్టు” అన్నాను.

సుధీర్ బైకు మీద అలాగే సంకోచంగా కూర్చొని వెళ్ళాను. దాదాపుగా 45 నిమిషాల తరువాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. రాత్రి ఒంటి గంట సమయానికి వేరే వారి ఇంటి కాలింగ్ బెల్ నొక్కడం కొంచెం ఎబ్బెట్టుగా అనిపించినా తప్పలేదు. నా నిస్సహాయతకు నేనే సర్ది చెప్పుకున్నాను. అర్ధరాత్రి సమయంలో నిద్ర మత్తులో తూలుతూ మా ఆడపడచు భర్త వాకిలి తీశాడు. నన్ను చూసి ఆయన నిద్ర మత్తు వదిలింది. కరెంట్ షాక్ తగిలిన వాడిలా ఉలిక్కిపడ్డాడు.

భయపడుతూ – “అంతా బాగుంది కదా? లేదా ఏదైనా సమస్య ఉందా?” అని అడిగాడు.

నేను సమాధానం చెప్పే లోపల నుంచి సుధా వదిన వచ్చారు -“ఇంత రాత్రి పూట ఎవరు వచ్చారు? మీరు ఎవరితో మాట్లాడుతున్నారు?” అంటూ.

నాకు సుధా వదినను చూసి ఒకసారిగా దుఃఖం వచ్చింది. వెక్కివెక్కి ఏడ్చాను. నన్ను చూసి సుధా వదిన చాలా భయపడింది. “అరె, కావ్యా, నువ్వా? నీరజ్, పిల్లలు ఎలా ఉన్నారు?” అని అడిగింది. “అందరూ క్షేమమే కదా?” అంది.

చలికి వణుకుతూ నేను ఏడుస్తూ ఉండి పోయాను. సుధీర్ ఇంకా అక్కడే ఉన్నాడు. నన్ను సురక్షితంగా వదిలి వెళ్ళాలని అతని తపన. వారిద్దరి ఆందోళన చూసి సుధీర్ చెప్పాడు- “ఆవిడ భర్త తనను ఇంటిలోనుంచి బయటకు నెట్టేశారు. రాత్రి వేళ ఆమె ఒక్కతే ఏడుస్తూ ఉంటే నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను.” అని.

తన చిన్న తమ్ముడి స్వభావం గురించి తెలిసిన వదిన గారు నన్ను అక్కున చేర్చుకొని ఓదార్చింది. మిగతా రాత్రంతా నా దగ్గరే కూర్చొని నన్ను సముదాయిస్తూ ఉండింది. పాపం. నా వల్ల వారి నిద్ర కూడా పాడయింది.

***

ఈనాటికి కూడా మా అత్తగారింటి గురించి అనుకుంటే నాకు వారి ప్రేమలు గుర్తుకు రాక మానవు. మా అత్తయ్య, వదిన నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే వారు. అలా చూస్తే మా అత్తగారింట నన్ను కన్న కూతురు లాగా చూసుకునేవారు. సాధారణంగా అందరికీ అత్తగారు అంటేనే ఒక పెద్ద సమస్య, అలాంటిది ఆమె నన్ను ఎంతో ప్రేమగా చూసుకోవటం దేవుడికి కూడా నచ్చలేదు కాబోలు. నా జీవితం లోని ముఖ్యమైన వ్యక్తి, నా భర్త ప్రవర్తన వల్లనే నేను ఎక్కువ బాధ పడవలసి వచ్చింది.

నా పెళ్లయిన కొత్తలో మా అత్త-మామ, చిన్న మామ గారు నన్ను చూడటానికని ప్రత్యేకంగా వచ్చేవారు. వచ్చిన ప్రతిసారి అత్తగారు నాకొరకు నాకు ఇష్టమైన పిండివంటలు చేసి తెచ్చేవారు. మా అమ్మ ప్రేమ తరువాత అంతటి ప్రేమను ఆమె చూపించారు. అవి అన్నీ నాకు ఇప్పటికీ గుర్తున్నాయి మరి.

నా పెళ్లి అయిన రీతి తెలిసిన వారు కావటం వల్లనో, లేక వారి అబ్బాయి ప్రవర్తన మీద అనుమానం వల్లనో, తెలియదు నన్నుపరామర్శించేందుకు వారు వచ్చేవారు.

నీరజ్ మీద ఉన్న కోపం వల్ల ‘వీరిని కూడా క్షమించరాదు’ అనేంత కోపం నాకు వీరి మీద కూడా వచ్చేది. కానీ నెమ్మదిగా వీరి సంస్కారాలు చూసి ఆ కోపం పోయింది. వారి సంస్కారాలు నీరజ్‌కు రాకపోవటం నా దురదృష్టం అంతే తప్ప వారి తప్పు కాదు అనిపించింది. అప్పటి నుంచి వారితో ప్రేమగా మసలటం మొదలు పెట్టాను. మా అత్తింటి వారు అందరూ బాగా చదువుకున్నవారు, విద్వాంసులు. వారి ఆలోచనా విధానం కూడా చాలా ఉన్నతంగా ఉండేది. అత్తయ్య గారు మంచి మనసు ఉన్నావిడ. ఇంతకూ నీరజ్‌ని కోపగించుకునే ముందు నేను నా సంస్కారాల గురించి కూడా ఆలోచించటం కూడా ముఖ్యం కదా.

పెళ్లి అయిన కొత్తలో, అకస్మాత్తుగా ఇంటికి వచ్చిన అతిథులను చూసి కంగారుపడ్డాను. ఇంకా పని పాట పూర్తిగా రాని నేను అంతమందిని ఒకసారి చూసి కొంత భయపడ్డాను కూడా. తల మీద చీర కొంగు కప్పుకొని పెద్దవారందరి ఆశీర్వాదం తీసుకున్నాను. అత్తగారి కాళ్ళు కడిగి ఆశీర్వాదాలు తీసుకున్నా.

ఆరోజు అత్తయ్య ఆశీర్వాదం నేటికీ కూడా నా చెవులలో వినిపిస్తూ ఉంది. “కుందనపు బొమ్మ లాగా ఉన్నావు తల్లీ, నా బంగారమే మంచిది కాదు. కానీ నువ్వు ఏమీ దిగులు పడవద్దు. మేము అందరం నీతో ఉన్నాము.”

చిన్న మామయ్య గారు మఠం ప్రధానాధికారిగా ఉండేవారు. ఆయనకు కూడా నీరజ్‌కు నాలాంటి చక్కని చుక్క మరియు సంస్కారం ఉన్న భార్య దొరకడం నచ్చింది. పెళ్లి అయిన దగ్గర నుంచీ పుట్టినింటి వారి స్నేహం, ప్రేమకు ప్రాకులాడుతున్న నాకు వారి ఆప్యాయ్యత కొంచెం ఊరట కలిగించింది. మొదటి సారి నేను అనాథ కాదు అన్న భావం కొత్త జీవనోత్సాహాన్ని కలిగించింది.

అత్తయ్య గారు పల్లె నుంచి రావటం వల్ల కొన్ని రోజుల తరువాత తిరిగి వెళ్ళి పోయారు. కానీ చిన్న మామ్మయ్య గారు మాత్రం మా ఊరిలోనే ఉన్నందున అప్పుడప్పుడూ వచ్చి మా యోగక్షేమాలు కనుక్కునేవారు.

కొన్ని రోజుల తర్వాత అత్తయ్య నన్ను తీసుకొని పల్లెకు రమ్మని నీరజ్‌కు చెప్పారు. అందువల్ల మొదటిసారిగా పల్లె లోని ఇంటికి వెళ్లాము. అదొక చిన్న పల్లె, కుగ్రామం. పెద్ద ఇల్లు, వరండా, అన్నీ ఉన్నాయి కానీ అవసరమైన టాయిలెట్ ఆ ఇంట్లో లేదు. అది పల్లె కావటంతో అటు ఆడవారు, మగవారు అందరూ శౌచాలయానికి అంటూ చెంబు పట్టుకొని బయటికి వెళ్ళే అలవాటు ఉండేది. అది చాలా కష్టంగా నాకు అనిపించసాగింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here