కావ్య-6

0
13

[box type=’note’ fontsize=’16’] డా. ఇందు ఝున్‌ఝున్‍వాలా హిందీలో రచించిన ‘కావ్య’ అనే నవలని అదే పేరుతో అనువదించి అందిస్తున్నారు ఆర్. ఉమా శర్మ. [/box]

[dropcap]అ[/dropcap]త్తయ్య గారు నా ఇబ్బందిని కనిపెట్టి నా కొరకు ఒక బాత్రూమ్ కట్టించారు.. ఇంటి వెనుక ఉన్న పెరట్లోనే కట్టించారు. నాకు కొంత రిలీఫ్‌గా అనిపించింది. అత్తయ్యను ఎన్నోసార్లు మనసు లోనే మెచ్చుకున్నాను. కానీ నా కన్నా ముందు ఇంటికి వచ్చిన తోటికోడలికి మాత్రం మా అత్తయ్య మీద బాగా కోపం వచ్చింది. ఇన్ని సంవత్సరాల నుంచి తను బయటికి వెళుతున్నాను కదా, తనను అత్తయ్య పట్టించుకోలేదు, కొన్ని రోజులు ఉండటానికి వచ్చిన చిన్న కొడలికి ఇన్ని సదుపాయాలు అత్తయ్య చేయటం ఆమెకు బొత్తిగా నచ్చలేదు. బావగారు కూడా చాలా సరళమైన వ్యక్తి. తాను తన పని అంటూ చూసుకునే స్వభావం ఆయనది. మేము ఉన్న అన్నీ రోజులు మాతో ప్రేమగా మాట్లాడేవారు. కానీ మరిది మాత్రం ఆంబోతు లాగా పెరిగాడు. ఒక మర్యాద లేదు, పాడు లేదు, ఎవరితో ఎలా వ్యవహరించాలో కూడా తెలియదు వాడికి. అచ్చంగా నీరజ్‌ను పోలాడు.

అంత వరకు మా మరిది గురించి నాకు ఎక్కువ కూడా తెలియదు. కానీ పల్లెకు వెళ్ళిన రోజు నుంచి అతని ప్రవర్తనను గమనిస్తున్నాను. నాకు అతని నుంచి ఇబ్బంది ఏమీ రాలేదు కానీ ఒకటి రెండు సార్లు నేను ఒకతే రూమ్‌లో ఉన్నపుడు లోపలికి వచ్చి తలుపు గొళ్ళెం పెట్టడానికి ప్రయత్నించాడు. “ఎందుకు అలా గొళ్ళెం పెడుతున్నావు?” అని నేను అడిగాను.

అపుడు అతను – “నేను మీతో కొంచెం మాట్లాడాలి” అని కోరికతో అన్నాడు. అతని బాడీ లాంగ్వేజ్ కావచ్చు లేదా అతని ముఖ కవళికలు కావచ్చు. లేదా స్త్రీకి భగవంతుడు ఇచ్చిన అపురూపమైన శక్తి అని అంటే కూడా తప్పు కాదు మరి. ఒక పురుషుడు తన వైపు చూసే కంటి చూపుతో కూడా తను అతని మనసు లోని మాటను అర్థం చేసుకోగలదు.

అపుడు నేను “వాకిలి గొళ్ళెం వేయకుండా కూడా మాట్లాడవచ్చు కదా” అని అన్నాను.

నా గొంతు లోని కోపాన్ని చూసి ‘నా పప్పులు వదిన దగ్గర ఉడకవు’ అనుకున్నాడు కాబోలు, మెల్లిగా బయటికి వెళ్ళిపోయాడు. మరలా నన్ను ఏకాంతంగా నన్ను కలవాలని ఏనాడూ ప్రయత్నించలేదు.

కానీ వాడికి నా మీద ఉన్న మోహం కోపంగా మారి పోయింది. నా సత్ప్రవర్తన వాడి అహంకారాన్ని రెచ్చగొట్టింది. ఆ విషయం నాకు చాలా ఆలస్యంగా తెలిసింది.

పల్లెలో జరిగిన ఈ విషయాలు నేను పూర్తిగా మరచిపోయాను. నేను వాటికి పెద్దగా ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు. వాడు చిన్నవాడు అని అనుకోని ఆ సంఘటను మరచిపోయాను. అత్తగారింటి ఆ తీపి జ్ఞాపకాలు నా మనసులో నేటికీ నాలో స్థిరంగా ఉన్నాయి. పల్లె లోని ప్రకృతి, పచ్చదనం, అక్కడి ప్రజల అమాయకమైన మాటలు అన్నీ నాకు చాలా నచ్చాయి.

మా అత్తయ్య నన్ను చిన్న పిల్ల గాగే చూసుకునే విధానం, ముద్దు చేసే విధానం నా కొరకు బాత్రూమ్ కట్టించడం, ఇలా ఆమె చూపించే ప్రేమ నన్ను తబ్బిబ్బు చేసింది. వీటన్నింటినీ మించి నేను కోరే వంటలను, తిండ్లను కూడా చేసి మరీ తినిపించేది. ఆమె చూపించిన ప్రేమాభిమానాలను గుర్తు చేసుకుంటే నాకు ఎంతో సంతోషం అవుతుంది. నా గొంతెమ్మ కోరికలను గుర్తు చేసుకుంటే నవ్వు కూడా వస్తుంది.

నాకు చిన్నతనం నుంచి కూడా పల్లెలు, పచ్చదనం అంటే ఇష్టం ఉండేది. కొత్త పల్లె అందాలు నాకు మరింతగా నచ్చాయి. పల్లె అంతా తిరిగి చూడాలి అనిపించసాగింది. సాయంత్రం కావస్తూంది. నేను అత్తయ్య దగ్గరకు వెళ్ళి  “నేను అలా పొలం గట్టుకు వెళ్ళి వస్తాను.” అని చెప్పాను.

అత్తయ్య ఉలికిపడి “అయ్యో ఎందుకు అమ్మా? నీకు అవసరమైతే పెరటి లోనే ఉందిగా, వెళ్ళు” అంది

నేను పల్లె చూడాలని మొండి పట్టు పట్టాను. నా ఇష్టాన్ని తీర్చాలని ఆమె నన్ను పంట పొలాల వైపు తీసుకొని వెళ్లింది. అది పల్లె కావటంతో ఆడవాళ్ళు బయటకు వెళితే వాళ్ళు తల మీద చీర కొంగు కప్పుకోవటం ఆనవాయితీ కూడా. కానీ నాకు అలా కొంగు కప్పుకోవటం రాదు. పల్లెలో ఎవరైనా చూస్తే ఎలా అని అత్తయ్య భయపడుతూ ఉంది. కానీ నేను మాత్రం పల్లె అందాలు హాయిగా చూస్తూ, చల్లగాలికి తిరుగుతూ ఉన్నాను. నేను తల మీద కొంగు కప్పుకోలేదు కానీ ప్రకృతి మాత్రం పచ్చని చీర కట్టుకున్నట్టు అనిపించింది. దాని మీద బుట్టల వలె ఆవాల చెట్ల పూలు విరగబూచాయి.

ఒక వైపు గలగలమని పారే నది. తిరిగి-తిరిగి నేను బాగా అలిసి పోయాను. అత్తయ్య అప్పుడప్పుడూ ఏదో చెబుతూ ఉంది కానీ నేను మాత్రం నా లోకంలో ఆనందంగా విహరిస్తున్నాను. అప్పుడే ఒక పంట పొలంలో వేసిన నులక మంచం చూసి ఒకసారిగా గెంటుతూ దాని మీద వాలిపోయాను. అత్తయ్యను కూడా బలవంతంగా నా పక్కన కూర్చొబెట్టుకున్నాను. అలా కొంత సేపు ఉండిపోయాము. చల్లని గాలికి ఇంటికి వెళ్ళాలి అని కూడా అనిపించ లేదు. అలాగే రాత్రి మొత్తం అక్కడే నిద్ర పోతే బాగుండు అనిపించింది. ఆమె ఒడిలో తల పెట్టుకొని నిద్ర పోయాను. ఆమె – “ఇంకా పంట పొలాలు చూడాలి అన్నావు?” అని అడిగారు. “అవును, ఇపుడు మనం పొలాల లోనే ఉన్నాము కదా” అని అన్నాను. తరువాత ఆమె ఉద్దేశం అది కాదు అని తెలిసింది. ఆరు బయట శౌచాలయానికి వెళ్ళాలి అని అని నేను అనుకున్నానని ఆమె అనుకుంది. తరువాత ఆ విషయం తెలుసుకొని నవ్వుకున్నాను.

ఆకాశం కాటుక దిద్దినట్టు నల్లబడుతూ ఉంది. పత్తి కొండల వలె తెల్లని మేఘాలు ఆకాశంలో నిండి ఉన్నాయి. పక్షుల గుంపులు వాటి గూళ్ళకు తిరిగి వస్తూ ఉన్నాయి. అత్తయ్య మరలా “నువ్వు బయట అంతా తిరిగి చూడాలనుకుంటున్నావు కదూ. ఇంకా ఎక్కడి కైనా తీసుకొని వెళ్లాలా?” అని అడిగారు.

“బయటకు వచ్చాము కదా, అంతే చాలు, మీ పల్లె చాలా అందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. నాకు హాయిగా ఉంది.” అన్నాను.

“సరే అమ్మా, పద ఇంటికి వెడదాం.”

అత్తయ్య కూడా ఇంటికి బయలుదేరడానికి తయారైంది. కానీ చుట్టూ పక్కలా దొంగలాగా చూస్తూ ఉంది. ఎవరినా నన్ను తల మీద కొంగు కప్పుకోకుండా చూస్తే ఎలా అని ఆమె భయం.

ఎవరూ చూడటం లేదు అని నిర్ధారించుకుని, నెమ్మదిగా బయలుదేరింది. బయటికి వెళ్ళేది, పొలాల వైపు వెళ్ళేది అంటే నేను అలా తిరిగి వచ్చేది అని మాత్రం అనుకునేదాన్ని. కానీ పల్లెలో అలా చెప్పేది ఈ విషయంలో అని ఇప్పుడు అర్థం అయింది, ఇపుడు నా మూర్ఖత్వానికి నవ్వు వస్తొంది. ఆ రోజు నేను బయటకు వెడదాం అంటే ఆమె ఏమి అనుకుందో అని తలచుకుంటే నవ్వు వస్తుంది. కానీ ఆమె పట్ల నాకు ప్రేమ ఎన్నడూ తగ్గలేదు. చాలా రోజుల వరకు కూడా పల్లె నుంచి ధాన్యంతో పాటుగా నాకు ఇష్టం అయిన వంటకాలు కూడా ఆమె పంపిస్తూ ఉండేది.

నాకు పిల్లలు పుట్టిన తరువాత ఆమెతో నా సంపర్కం బాగా తగ్గింది. ఆమెకు వయసు ఎక్కువ కావటం మరియు ముసలితనం వల్ల కూడా ఆమె రాలేక పోయేది. నేను కూడా ఇంటిని వదిలి వెళ్ళి ఆమెను చూడలేక పోయాను. నీరజ్ ప్రవర్తన, నా మరియు నా పిల్లల జీవితాన్ని పూర్తిగా చీకటి మాయం చేసింది.

***

ఆ రోజు ఒక చిన్న మాటకు నీరజ్ నన్ను ఇంటి నుంచి నన్ను మెడ పట్టుకొని తరిమి వేశాడు. అంత పెద్ద మోసం ఎలా చేయాలనిపించింది తనకు, అదీ కట్టుకున్న భార్యకి, అదీ ఎంతో ప్రేమించాను అనే చెప్పే భార్యకు, నమ్మించి తడి బట్టతో గొంతు కోయటం అంటే ఇదే కాబోలు.

పైగా నన్ను కూడా ఫోర్జరీ సంతకాల కేస్‌లో భాగస్వామి చేయాలి ఆనుకున్నాడు. నేను ఖరాఖండిగా చేయను అని చెబితే కోపం వచ్చింది. తనను కూడా ఈ పనిని మానమని చెప్పి చూశాను.. లేకపోతే ఈ పాటికే జైలులో ఊచలు లెక్కపెట్టేవాడు. దానికి నా మీద కోపం పెంచుకొని నన్ను ఇంటి నుంచి తరిమి వేశాడు. ఎంతటి వారైనా అహంకారం అనే మత్తులో కండ్ల కావరంతో ప్రవర్తిస్తారు. ఎవరూ అవసరం లేదు అని అనుకుంటారు. వివేకం నశించి బుద్ధిని కోల్పోతారు. అహంకారం మనుష్యుని రాక్షసుడిగా మార్చివేయగలదు అన్న విషయం నాకు ఆ రోజు రాత్రి బాగా తెలిసింది.

వదిన గారు, అన్న గారు రాత్రి అంతా నిద్ర పోలేదు. నేను రాత్రి అంతా ఏడుస్తూ ఉంటి. కంటి నీరు ఇంకిపోయినట్టు తెల్లవారుజామున దాకా ఏడుస్తూ ఉన్నాను. ఏడవటం చేతనో, నిద్ర లేకనో లేదా ఒత్తిడి వల్లనో తల, మెదడు పని చేయటం లేదు. శరీరం ఎప్పుడో నా మాట వినటం మాని వేసింది.

అద్దంలో మొహం చూసుకున్నాను. కళ్ళు వాచి ఉన్నాయి, నా మొఖం నాకే కొత్తగా అనిపించింది. నా పెదవుల మీద వచ్చిన నవ్వు అది నన్ను చూసి నవ్వినట్టు అనిపించింది.

ఒకసారిగా పిల్లలిద్దరూ గుర్తు వచ్చారు. అయ్యో, ఈ పాటికి వారు లేచి ఉంటారు, వారికి పాలు ఇవ్వాలి అని మాతృ హృదయం విలవిలలాడింది. పిల్లలు నేను కనిపించక దిగులు పడుతూ ఉంటారు. రాత్రి అంతా ఎలా పడుకున్నారో ఏమో. వారి వయసు చాలా చిన్నది, పాపం వారికి ఈ చిన్న వయసులో ఇలాంటి తల్లి తండ్రుల కొట్లాటలు, ఇంత మానసిక హింస భరించవలసి వస్తోంది.

నాకు మాత్రం జీవించడానికి ఉన్న ఒకే ఒక ఆశ నా పిల్లలే. వారికి కూడా నేను ఏమీ చేయలేని స్థితిలో ఆ దేవుడు నన్ను పడేశాడు. నీరజ కళ్ళు తెరుస్తూనే అమ్మ, అంటూ అరుస్తూ నా దగ్గర్రకు వస్తుంది, నేను లేకుంటే అరిచి మారాం చేస్తుంది. నీరజ్‌కు వీరిని సంబాళించడం చేత కాదు. దానికి ఆకలి కూడా త్వరగా అవుతుంది. తను ఆకలికి తట్టుకోలేదు కూడా. రాత్రి కూడా ఒక వేళ ఆకలి అంటే తినిపించేందుకు నేను ఏదైనా రెడీగా పెట్టుకొని ఉంటాను.

కొడుకు పింకూ మాత్రం ఏమి తక్కువ కాదు. వాడు చాలా తుంటరి. నీరజను ఎప్పుడూ ఏడిపిస్తూ ఉంటాడు. నేను ఉంటే అరుస్తూ ఉంటాను. నీరజ్‌కు వారి అలవాట్లు, వారి ఇష్టా ఇష్టాలు ఏవీ తెలియవు. ఎప్పుడైనా అవి అర్థం చేసుకునేందుకు ఆయన ప్రయత్నం చేసి ఉంటే కదా తెలిసేది. కానీ ఆయనకు ఆయనదే ఒక ప్రత్యేక లోకం ఉన్నపుడు, నేను నా పిల్లలు ఆయనకు అవసరం లేదు.

ఇంకా రాత్రి తాగిన మత్తులో తూలుతూ ఉంటాడు నీరజ్. పిల్లలిద్దరి గతి చూసేవాడు లేరు అని నా మనసు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంది. పింకూకు కూడా ఆకలి అవుతూ ఉంటుంది. రోజూ ఈ పాటికి నేను ఏదైనా చేసి పెట్టేదాన్ని. నీరజ్ త్వరగా లేవడు. పిల్లల స్కూల్ టైమ్ కూడా అవుతోంది. నా జీవితంలో ఉండే ఒక నవ్వు అంటే అది కేవలం నా పిల్లలతో మాత్రమే కదా. ఈ రోజు వాళ్ళే నాకు దూరం అయితే, నేను తట్టుకోలేను. లేదు-లేదు ఎలాగైనా నా పిల్లలు నాకు కావాలి. వారు లేకుండా నేను బ్రతకటం అసాధ్యం. మరొక్క సారి కన్నీటి ఉప్పెన పొంగింది, కానీ ఇది కేవలం పిల్లల కోసం మాత్రమే.

వదిన గారు నా మొఖం చూసి దిగులు పడసాగింది. చూస్తూ చూస్తూ మధ్యాహ్నం కావస్తోంది. వారు అనుకున్నారు నీరజ్ ఏమైనా ఫోన్ చేసి విచారిస్తాడేమో అని, లేక పోతే నీరజ్ వస్తాడేమో అని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఏమాత్రం ప్రయోజనం కాలేదు. నీరజ్ నుంచి ఫోన్ కానీ మనిషి కానీ పత్తా లేదు.

రాత్రి తమతో ఉన్న అమ్మ కనిపించక పిల్లలు ఎంత ఆందోళన పడుతూ ఉంటారో అని మనసులో రకరాలుగా ఆలోచనలు వస్తూ ఉన్నాయి. వారికి చెప్పకుండా నేను ఎప్పుడూ బయటుకి కూడా వెళ్ళను. వారికి కూడా తెల్సు. రాత్రి పడుకునేవారకు పిల్లలు నా దగ్గరే ఉన్నారు. వారు నిద్ర లేచి చూసేసరికి నేను లేకపోతే వారు భయపడతారు.

నీరజ్ మిత్రుడు వినయ్‌కు ఫోన్ చేయటం ఒకటే సరి అయిన మార్గం అనిపించింది. అలా చూస్తే నీరజ్ జీవితంలో అనేకమంది స్నేహితులు ఉన్నారు. రకరకాలైనా స్నేహితులు ఉన్నారు తనకు. కొందరికి రాజకీయంగా కూడా మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఇంకా కొంతమంది దాదాగిరి చేసేవారు కూడా లేకపోలేదు. బెనారస్ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘానికి హెడ్‌గా ఉన్నవారు, ఇంకొంతమంది కేవలం తాగటానికి, తినడానికి మాత్రమే పనికి వచ్చే స్నేహితులు. వారికి ఆదాయానికి లోటు లేదు, కేవలం సమయం వెళ్ళబుచ్చాడమే వారికి పెద్ద పని.

కానీ ఇక్కడ చెప్పి తీరవలసిన మాట ఉంది. వారు ఎటువంటి వారు అయినా నా దగ్గర మాత్రం చాలా సభ్యతగా ప్రవరించేవారు. ఒకరు అక్క అని పిలిస్తే ఇంకొకరు వదిన అని పిలిచేవారు. వారి పిలుపు తగ్గట్టే వారి ఆత్మీయత నాకు వారి కళ్ళలో కనబడేది. వారు కూడా నా కొరకు నీరజ్‌తో కొట్లాడేవారు. అపుడు నాకు అందరూ ఉన్నారు అన్న దైర్యాన్ని వారు నాకు ఇచ్చేవారు.

వారిలోనే ఒకడు వినయ్. నా కన్నా వయసులో చిన్నవాడు. నన్ను కేవలం మాట వరసకు అక్క అని పిలిచేవాడు కాదు, కానీ నిజంగా అక్క లాగానే ప్రేమ చూపించేవాడు. వారి నాన్న గారు కూడా నన్ను వారి ఇంటి పెద్ద కోడలు అనే లాగా మర్యాద చూపేవారు. నీరజ్ కూడా వీరి కుటుంబానికి సన్నిహితుడు కావటంతో వినయ్ నాకు సహాయం చేయగలడు అని నాకు బలంగా అనిపింఛింది.

మా వదిన భర్త కూడా నా పరిస్తితి చూసి నా పైన జాలి పడుతూ అన్నాడు – “రానీ వాడిని, నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగితే కానీ నిన్ను పంపను. ఏమి చేస్తాడో చూద్దాం . వీడి ప్రవర్తన రాను రాను శృతి మించి రాగాన పడుతూ ఉంది” అని.

నాకు నీరజ్ అహంకారం, మొండి పట్టుదల బాగా తెలుసు. ఆయన రాడు అని నాకు గట్టిగా అనిపిస్తూ ఉంది. పిల్లలు తిన్నారో లేదో తెలియకుండా నా గొంతులో ఒక బియ్యపు గింజ కూడా దిగుడు పడలేదు. నీరు మాత్రం తాగుతూ ఉన్నాను.

వినయ్‌కు ఫోన్ చేసి చెప్పాను- “అన్నా, మీరు వెంటనే మా వదిన గారింటికి రండి, చాలా ముఖ్యమైన పని ఉంది.”

కొంచెం సేపటి లోనే వినయ్ వదిన గారింటికి వచ్చాడు. ఆయనతో పాటుగా ఆయన తండ్రిగారు కూడా వచ్చారు. నేను సంతకాల విషయం ఎవరికీ చెప్పలేదు కానీ నన్ను ఇంటి నుంచి బయటికి గెంటిన విషయం మాత్రం చెప్పాను. విషయం అంతా విని ఆయన – “పదమ్మా, మా ఇంటికి వెడదాం, ఏం చేయాలి అన్నది చూద్దాం” అని అన్నారు.

నా దగ్గర వేసుకోవటానికి వేరే బట్టలు కూడా లేవు. పొద్దున అన్నయ్య గారి చొక్కా ప్యాంటూ వేసుకున్నా. వదిన నా కన్నా చాలా లావుగా ఉంటుంది. సాయంత్రానికి నా బట్టలు ఎండిపోయాయి, మరలా వాటినే వేసుకొని వినయ్ వాళ్ళతో పాటు వారి ఇంటికి వెళ్ళాను. వినయ్ వాళ్ళ ఇల్లు మా ఇంటికి దగ్గరగానే ఉంది.

వినయ్ నాన్నగారు మొదట నీరజ్‌ను పిలిచి చీవాట్లు పెట్టి తరువాత నన్ను ఇంటికి పంపుతా అన్నారు. నాకు మాత్రం నా పిల్లలను ఎప్పూడెప్పుడు చూస్తానా అనిపిస్తూ ఉంది. నా కన్నీరే నాకు తోడుగా ఉంది.

వినయ్ మా ఇంటికి వెళ్లారు. కానీ వెంటనే ఇంటికి తిరిగి వచ్చారు. అతని మొహం లోని ఆందోళన చూసి నేను చాలా భయపడ్డాను. వినయ్ ఇల్లు తాళం వేసుందని చెప్పారు. సరిగా అపుడే గోవర్ధన బాబు గారు అక్కడ నుంచి వెళ్తూన్నారు. మా వీధిలో పలుకుబడి ఉన్న వ్యక్తులలో ఆయన కూడా ఒకరు. అంతే కాదు ఆయన మా నాన్నగారి స్నేహితుడు కూడా. ఆయన నన్ను చూసి అన్నారు- “అరె కావ్యా, నువ్వు ఇక్కడా? ఏంటి సమాచారం?”అని ఆయన నన్ను మాట్లాడిస్తూంటే, నాలో దుఖం కట్టలు తెంచుకొని వచ్చింది. “బాబాయ్, నా పిల్లలు?” అన్నాను.

“అరె, పిల్లలకు ఏమయింది? ఎందుకు అలా ఏడుస్తున్నావు? పొద్దున్నే నీరజ్ మా ఫార్మ్ హౌస్ తాళం చెవులు తీసుకొని వెళ్ళాడు. ఏదో అర్జెంట్ పని చెప్పి తీస్కున్నాడు. ఏదో మీరందరూ కలిసి ఉండాలి అనుకోని తీసుకున్నాడు అనుకున్నా.”

వినయ్ ఆయనకు విషయం చెప్పాక ఆయనకు మహా కోపం వచ్చింది. “నేను ఏదో అనుకుని తాళం చెవులు ఇచ్చాను. నీరజ్ ఇలా చేస్తాడు అని నేను అనుకోలేదు. నన్నే మోసం చేశాడు చూడు” అంటూ వాపోయారు.

“నేను కూడా మీతో వస్తాను. కానీ ఇపుడు అప్పుడే చీకటి పడింది. ఫార్మ్ హౌస్ ఇక్కడికి చాలా దూరం, పొద్దున్నే మనం అందరం కలిసి వెడదాం”

ఆ రాత్రి నా జీవితం లోని అన్నీ రాత్రుల కంటే చాలా బాధాకరమైన చీకటి రాత్రి. నా పిల్లలు లేకుండా నేను ఒంటరిగా ఆ రాత్రి నాకు జీవితం లోని మరింత దుఖాన్ని చూపించగలిగింది. నిద్ర పడితే కదా, తెల్లవారింది అని లేవటానికి, నేను రాత్రంతా నా జీవితం లో జరిగిన అన్నీ విషయాలను గుర్తు చేసుకుంటూ ఉండిపోయా. నా గురించి ఏడుస్తున్న పిల్లల మొఖాలు గుర్తు చేస్కుంటూ ఉండిపోయా. పాపం వారికి మా వల్ల అనవసరమైన బాధలు.

రాత్రి వినయ్, ఇంకా వారి నాన్నగారు నన్ను అన్నం తినమని చాలా బతిమాలారు. కానీ నాకు మెతుకు మింగుడు పడలేదు. తెల్లవారక ముందే గోవర్ధన్ చిన్నాన్న గారు ఇంటి ముందు వచ్చి పిలుస్తున్నారు. ఆయనకు నా బాధ బాగా అర్థం అయి ఉంటుంది మరి. – “అమ్మా, త్వరగా రండి, వెడదాం” అని ఆయన పిలుస్తున్నారు.

నేను పిల్లలను చూడడానికి తయారుగా ఉన్నాను. వినయ్, ఇంకా వారి నాన్నగారు కూడా వచ్చారు.

దగ్గర దగ్గర ఒక గంట ప్రయాణం తరువాత ఫార్మ్ హౌస్ చేరుకున్నాము. పిల్లలు ఒక మూలగా భయంతో కూర్చొని ఉన్నారు. నన్ను చూస్తూనే వారిద్దరూ పరిగెట్టుకొని వచ్చి గట్టిగా వాటేసుకున్నారు. ఎన్నోసంవత్సరాల నుంచి నన్ను చూడనట్టు వారు నన్ను గట్టిగా పట్టేసుకున్నారు. నేను కూడా వారిని ఎప్పుడూ వదిలి ఉండలేదు. ముగ్గురం వెక్కి వెక్కి ఏడుస్తున్నాము.

ఆ దృశ్యం చూసి వినయ్, వాళ్ళ నాన్నగారు, గోవర్ధన్ గారికీ అక్కడ ఉన్న అందరికీ అయ్యో పాపం అనిపించసాగింది. నీరజ్ ఆ సమయంలో అక్కడ లేడు. కొంత సేపు అయ్యాక నీరజ్ వచ్చాడు. మమ్మల్ని చూసి ఏమి చేయాలో పాలుపోక దిక్కులు చూస్తూ నుంచున్నాడు. గోవర్ధన్ బాబాయ్, నీరజ్‌ను చూస్తూనే బాగా గట్టిగా తిట్టారు. ఆయన – “నాకు అబద్ధం చెప్పావు కదా, నా కూతురు లాంటి కావ్యకు ఇంత దుఃఖం కలిగించడానికి నీకు అధికారం లేదు. నువ్వు ఏమైనా కావ్య భర్త కాకపోయి ఉంటే ఈ పాటికి నిన్ను జైలుకు పంపి ఉండేవాణ్ణి.” అన్నారు.

వినయ్ వాళ్ళ నాన్న గారు కూడా నీరజ్‌ను నిందించారు. “నీవు చేస్తున్నది సరి అయిన పని కాదు, సర్దుకొని జీవితం సాగించు” అని ఉపదేశించారు కూడా.

నీరజ్ తన తప్పును ఒప్పుకున్నాడు. వినయ్ అన్నయ్య నీరజ్‌ను పక్కకు తీసుకొని వెళ్ళి మాట్లాడాడు. పిల్లలు మూడు రోజుల తరువాత హాయిగా తిన్నారు. అపుడు గట్టిగా నిర్ణయం తీసుకున్నా, ఏది ఏమైనా నేను పిల్లలను విడిచి ఉండరాదు అని.

నీరజ్ అంటే మరింతగా విరక్తి మొదలయింది నాకు. ఇల్లు వదిలి అలా ఫార్మ్ హౌస్‌కి రావటం, నా నుంచి దూరంగా పారిపోవటం, లేదా మరేదైనా కారణం ఉండొచ్చు. అవి అడగాలని కానీ సమాధానం తెలుసుకోవాలని కానీ నాకు అనిపించలేదు.

పిల్లలు స్కూల్‌కు వెళ్ళి దగ్గర దగ్గరగా ఒక నెల కావస్తోంది. వారి చదువు-సంధ్యలు నిలిచి పోయాయి. కొన్ని రోజుల తరువాత అన్నాను- “పిల్లల చదువు ఆగిపోతుంది. మనం సిటీ లోని ఇంటికి పోదాము అని.”

***

నీరజ్ నా మాటలను ఏమాత్రం గంభీరంగా తీసుకోవటం లేదు. పని పాట లేకుండా అందరూ అలా తింటూ కూర్చోవటానికి మేము రాజులం కాదు. కూర్చొని తింటే కొండలు కూడా కరుగుతాయి. ఇప్పుడు నేనే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి. నీరజ్‌కు ఇసుమంత కూడా దిగులు, భయం లేవు.

ఇలా ఆలోచిస్తూ ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపానో తెలియలేదు. పురుషుడు పైకి ఎంత అహంకారం అనే ముసుగు వేసుకున్నా కూడా లోపల అంతే బలహీనంగా ఉంటాడు అని నీరజ్ ప్రవర్తన చూస్తే తెలుస్తుంది. అతనికి తన తప్పులు మరియు ఓటమి కూడా బాగా బలహీనం కావటానికి కారణం అయ్యాయి అనిపిస్తుంది. అలాగే అనుకుంటూ నీరజ్‌తో అన్నాను- “మనం ఇలా ఎన్ని రోజులు ఈ అడవి ప్రాంతంలో ఇలా బ్రతికేది? పిల్లల భవిష్యత్తు గురించి కూడా మనం ఆలోచించాలి కదా.”

తాను కొంత సేపు శాంతంగా ఉన్నాడు. “ఇంటి అద్దె కట్టడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు. ఇక్కడ అయితే డబ్బులు అవసరం లేదు కదా.”

నీరజ్ డాక్టర్‌గా పని చేశాడు. ఇంత హీనమైన స్థితికి కారణం నాకు అర్థం కావటం లేదు. డబ్బుల కొరకు ఏమి చేయాలి అని ఆలోచిస్తూ ఉండిపోయాను. నీరజ్ దురలవాట్లు ఒకటా, రెండా? ఉన్న డబ్బు మొత్తం పోవటానికి అవే కారణం అని అనిపించింది. దానికి తోడు జెనిఫర్ స్నేహం చాలదా జీవితం పాడు కావటానికి. ఈ మధ్య క్లినిక్‍ని కూడా మూసేశాడు. ఇంత దూరం నుంచి పిల్లలను స్కూల్‌కు పంపించడం కష్టం అవుతూ ఉంది.

మంచి జీవితాన్ని చేజేతులా పాడు చేసుకున్నవారి గురించి చదివి ఉన్నాను. నేడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. చూడటం ఏమిటి? నేను నా జీవితంలో అది భాగంగా అనుభవించడం నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఇలా చేసావు అని అడిగితే సరిగా సమాధానం చెప్పే స్థితిని తాను ఏనాడో కోల్పోయాడు. అడిగి ప్రయోజనం లేదు. మరలా అదే కొట్లాట, దెబ్బలు, తన్నులు, ఏడుపులు, పెడబొబ్బలు, పిల్లల బెదురు చూపులు, ఇవన్నీ మరలా మరలా పునరావృతం అవుతూ ఉంటాయి. నేను అతనికి సమాధానం చెబుతూ – “అయింది ఏదో అయింది, కనీసం ఇప్పటి నుంచి అయినా ఇద్దరం కలిసి ఏదైనా పని చేస్తూ జీవితం సాగిద్దాం” అని అన్నాను.

***

1986 , సోమవారం రోజు పొద్దున, మా పెళ్లి అయి ఏడు సంవత్సరాలు గడిచాయి. నీరజ ఇపుడు నాలుగు సంవత్సరాల పిల్ల. పింకూకు మూడు సంవత్సరాలు వచ్చాయి.

మేము రామనగర్ లోనే ఉన్న ఇంకో చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నాము. పిల్లలకు స్కూల్ చాలా దగ్గరగా ఉంది, కానీ డబ్బుల సమస్య అలానే ఉంది. నీరజ్ క్లినిక్ తెరిచే ప్రసక్తి కూడా లేదు. అతను పూర్తిగా ఇంటి పట్టున ఉండేవాడు, డబ్బులు కావాలి అంటే నన్ను వేధించేవాడు. పనికిమాలిన పనుల వలన డబ్బులు సంపాదిచవచ్చు అనుకోని ఉన్న పనికి స్వస్తి పలికాడు. అలాంటివి ఎప్పుడో ఒకప్పుడు మనకు హాని కలిగిస్తాయి అని అతను అనుకోలేదు. అలాగే జీవితం సుఖంగా సాగుతుందనే అపోహలో ఉన్నాడు. ఇపుడు తనకు డబ్బులు చేతిలో లేకపోయేటప్పటికి ఉండుండి ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు నామీద విరుచుకు పడేవాడు. నా వల్లనే అతని జీవితం ఇలా అయింది అని నన్ను చీవాట్లు పెట్టేవాడు.

పేకాట, తాగుడు లాంటి అలవాట్ల వల్ల జీవితంలో బాగు పడి పైకి వచ్చిన వారిని నేను చూడలేదు, వారి గురించి చదవలేదు కూడా. నా దగ్గర జరిగినవి చెప్పటానికి తనకు అహం అడ్డు వచ్చేది. డబ్బుల అవసరం చాలా ఎక్కువగా ఉంది. కనీసం రెండు పూట్లా తినే దానికి కూడా లేనంతగా పరిస్థితి దిగజారింది. దాని మీద నెల పడితే అద్దె, పిల్లల స్కూల్ ఖర్చులు, తదితర ఖర్చులకు కూడా లేని స్థితి.

ఆ రోజులు తలచుకుంటే దుఃఖం ముంచుకొస్తుంది. పిల్లల ఆహారానికి కూడా తొందర అయ్యేది. నేను ఏనాడూ ఎవ్వరి ముందు చేయి చాచి అడుగలేదు. అలాంటిది పిల్లల కొరకు నేడు నా చేతులు చాచవలసి వస్తోంది. మనసు చంపుకొని రోజులు వెళ్ళబుచ్చుతున్నాను.

ఇలా ఇంకా ఎంత కాలం? పరాధీనం బతుకు బ్రతకటం కన్నా చావు నయం. కానీ నా పైన ఆధారపడిన పిల్లలను నేను వదిలి చచ్చేందుకు కూడా మనసు ఒప్పడం లేదు. నాకు ప్రెస్‌లో జీతం కూడా అప్పట్లో బాగానే వచ్చేది. నీరజ్ నన్ను మళ్లీ ప్రెస్‌లో పని చేయమని చెప్పాడు. నాకు అతని ధోరణి ఆశ్చర్యాన్ని కలిగించినా అది కూడా ఒకందుకు మంచిదేలే అని అనుకున్నా. ప్రెస్‌కు వెళ్ళి చూస్తే నాకు మునుపటి వలె మర్యాదగా ఉద్యోగం దొరికింది. నా పరిశ్రమ, పట్టుదల, పనితీరు వారు మరచిపోలేదు. మరలా నేను మనసు పెట్టి ప్రెస్‌లో పని చేయటం ప్రారంభించాను.

కొంతవరకు డబ్బు సమస్య తీరింది. కనీసం ఇంటి అద్దె, పిల్లల ఖర్చు, రోజూవారీ ఖర్చుకు ఎవరి దగ్గర చేయి చాచే అవసరం లేక పోయింది. ప్రెస్ ఉధ్యోగం నా జీవనాధారం అయింది.

కానీ మగవాడు ఇంటిపట్టున ఉంటే వాడి అహంకారానికి అది పెద్ద గొడ్డలి పెట్టు. నీరజ్ పరిస్థితి అలా తయారు అయింది. నా జీతంతో ఇల్లు గడుస్తోంది. నీరజ్ పురుషాహంకారం దాన్ని తట్టుకోలేక పోయింది. అతను క్రమంగా మానసికంగా క్షీణిస్తున్నాడు అని మాత్రం అర్థం కాసాగింది.

ఎలాగోలా జీవితం గడుస్తున్న ప్రతి రూపాయికి లెక్క పెట్టి ఖర్చు పెట్టే పరిస్థితి. ఇంటి మొగవాడు పని పాటా లేకుండా అలా కూర్చోంటే ఇల్లు గడిచేది కూడా కష్టం కదా. ఇంటి అద్దె కొంచెం భారం కాసాగింది నాకు. ఇంటి అద్దె ప్రతి నెలలో కొంచెం కొంచెంగా పెరగసాగింది. ఆ రీతిలో నా ఆదాయం పెరగలేదు. ఖర్చులు పెరుగుతున్నాయి కానీ నా ఆదాయం ఎక్కడ వేసిన గొంగళి లాగా అలాగే ఉంది. ఇంటి యజమానికి నా పరిస్థితి అర్థం కాసాగింది, కావున నన్ను కొంచెం లేట్‌గా ఇంటి అద్దె ఇచ్చినా ఏమీ అనేవాడు కాదు.

ఇంకా మేము ఆ ఇంటికి మారి మూడు-నాలుగు నెలలు మాత్రమే అయింది. నా సంపాదన అరాకొరగా దేనికి పూర్తి సరిపోవటం లేదు. వేడి నీళ్ళకు చల్ల నీళ్ళు తోడు అన్నట్టు నీరజ్ ఏదో కొంత సంపాదిస్తే మాకు బాగా ఉండేది. కానీ నీరజ్ మొద్దు లాగా తయారు అయ్యాడు.

***

ఆ రోజు జరిగిన సంఘటన నా జీవితంలో అతి పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టింది. నా జీవితంలో సముద్రపు అలల కన్నా పెద్ద అలలు నిరంతరం ఆ దేవుడు ఎందుకు రాశాడో తెలియలేదు. నా జీవితం ఎంత మందికి ఉదాహరణ అవుతుందో నాకు తెలియదు కానీ నా జీవితం ఒక పెద్ద పజిలు పుస్తకం లాగా మాత్రం నాకు అనిపించసాగింది.

ఆ సాయంత్రం నీరజ్ ఇంటికి వచ్చాడు. తనతో పాటు ఒక షేక్‍ను కూడా తీసుకొని వచ్చాడు. ఆయనను ఒకసారి ఫార్మ్ హౌస్ ఇంటిలో ఉన్నపుడు చూసిన గుర్తు ఉంది. వారిద్దరికీ స్నాక్స్, వేడి టీ తీసుకొని వెళ్ళాను. అపుడు నీరజ్ నాతో అన్న మాటలు విని నేను రాతి బొమ్మ లాగా కొంత సేపు నిలబడి పోయాను. నా మెదడు మొద్దుబారిపోయినట్టు అయింది.

ఇన్ని రోజులు నీరజ్ చేసిన అన్నీ పనులు సహించాను, భరించాను కానీ ఇది అన్నింటి కన్నా అసహ్యమైన పని. నేనే కాదు ఏ ఆడది ఇలాంటి పనికి ఒప్పుకోదు. ఈ పని నేను చేయను అని ఖరాఖండిగా చెప్పేశాను.

నా నుదుటి నుంచీ చెమట ధారాలుగా కారసాగింది. నీరజ్ ఇంతకు తెగిస్తాడని నేను ఎన్నడూ అనుకోలేదు. ఇంతకూ నీరజ్‌కు తాను అన్న మాటలలో పెద్ద తప్పు కనపడలేదు. “షేక్ గారికి తల నొప్పిగా ఉందట. ఆయనను రూమ్ లోనికి తీసుకొని వెళ్ళి కొంచెం బామ్ రాసి తల మర్ధన చేయి, ఆయన బాగా డబ్బున్న వాడు, ఆయనను నువ్వు సంతోషపెడితే మనం అడిగినంత డబ్బు ఇస్తాడు” అని అన్నాడు నీరజ్. మనకు డబ్బు కొరత ఉండదు”అని అన్నాడు.

నేను ఒక్కసారిగా దెయ్యం పట్టిన దానిలాగా అరిచాను. “నేను చచ్చినా కూడా ఇలాంటి పని చేయను. నన్ను ఏమి అనుకున్నావు నువ్వు? డబ్బు కోసం ఇంత నీచానికి ఒడి కడతావు అని నేను కలలో కూడా అనుకోలేదు. దానికన్నా నా గొంతు పిసికి నన్ను చంపేయ్. అది అయినా సంతోషంగా భరిస్తాను కానీ అలాంటి పొరబాటు నేను ఎప్పుడూ చేయను.”

నీరజ్‌కు కోపం కట్టలు తెంచుకుంది. బుసలు కొడుతున్న పాములాగా ఊగసాగాడు. స్నాక్స్ ప్లేట్ నా మీదకు విసిరి వేశాడు. అతని అహంకారం దెబ్బ తింది. నీరజ్‌కు అవమానం అనిపించింది.

అంతలో ఆ సిగ్గు లేని షేక్ – “ఇలాంటి పెళ్లాన్ని నేను ఎక్కడా చూడలేదు, మొగుడి మాట అంటేనే లెక్క లేదు ఈమెకు, నేను ఏదో మీ మీద దయ చూపించాలని వచ్చాను. దీనిని చూస్తే నేనంటే లెక్కనే లేదు.” అన్నాడు.

ఆ షేక్ గాడి పళ్ళు రాలగొట్టాలని ఆ సమయంలో అనిపించింది. నా కాళి లాంటి మొఖం చూసి వాడు భయపడి పారిపోయాడు. కానీ నేను ఆ షాక్ నుంచి తేరుకోలేక పోయాను. నిర్జీవంగా అలాగే పడి పోయాను. ఆ రాత్రి పిల్లలు కూడా ఏమీ తినలేదు అనుకుంటా. నీరజ్ మాత్రం ఆ షేక్ వెనుక వాడిని నచ్చచెబుతూ వెళ్ళాడు. నా మీద కోపం వచ్చింది తనకు. రాత్రి అంతా కూడా నీరజ్ రాలేదు, ఎక్కడికి పోయాడో ఏమో, అడగాలని కూడా ఆనిపించలేదు.

పొద్దున లేచేటప్పటికి నా ఒళ్ళంతా కాలి పోతూ ఉంది. జ్వరంగా ఉంది. ఈ సారి ఈ సంఘటన వల్ల షాక్ నా మనసుకు మాత్రమే కాక నా శరీరానికి కూడా తగిలినట్టు అనిపించింది. పిల్లలు గుర్తు వచ్చి చూశాను, వారిద్దరూ నిద్ర పోతూ ఉన్నారు.

నేను నా పిల్లలకు ఎలాంటి జీవితం ఇస్తున్నాను. తండ్రి జూదగాడు, తాగొబోతు. సాయంత్రం అయితే తప్పతాగి వస్తాడు. నన్ను తిడుతూ, కొడుతూంటాడు. ప్రతి రోజు కొట్లాటలతో పిల్లలకు నేను ఏం సంస్కారం నేర్పుతున్నాను. వారి జీవితానికి నేను ఇస్తున్న కానుక ఇదేనా? ఇలా రకరాకాలైన ప్రశ్నలు నా మనసును వేధిస్తున్నాయి.

ఇంకా నేను పిల్లలను తీసుకొని ఎక్కడికి వెళ్లగలను? నాకు ఎవరు ఉన్నారు? పుట్టింటితో సంబంధం ఆరోజే తెగిపోయింది. నీరజ్ నన్ను పెళ్లి పేరిట ఆ సంబంధాని తుంచి వేశాడు కదా. ఇక నా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు హాయిగా ఉన్నారు, వారి ముందు పోయి నేను ఇలా బతకడం బాగుండదు.

నీరజ్ తాను ఒక పని చేయడు, నన్ను చేయనివ్వడు. తాను నెమ్మదిగా బతకడు, నన్ను, పిల్లలను కూడా నెమ్మదిగా ఉండనివ్వడు. ఈనాటి నిర్వాకంతో నాకు నీరజ్ మీద ఉన్న అల్పమైన ప్రేమ కూడా తుడిచి పెట్టుకు పోయింది.

కళ్ళు ఏడ్చి ఏడ్చి కంటి నుంచి ఒక చుక్క కూడా కన్నీరు రావటం లేదిప్పుడు. నీరజ్ మరుసటి రోజు మధ్యాహ్నం అయినా రాలేదు,. అతనికి కబురు పెట్టాలి అని కూడా అనిపించలేదు.

రాత్రి పది గంటలు అయింది. పిల్లలు తిని పడుకున్నారు. అపుడు వాకిలి చప్పుడు అయింది. వాకిలి తీసి చూస్తే ఎదురుగా నీరజ్, తప్ప తాగి ఉన్నాడు. ఇంట్లోకి వస్తూనే “నీకు తెలుసా, నేను ఎంత అప్పు చేశానో, దాని ఎవరు తీరుస్తారు, ఎక్కడి నుంచి వస్తాయి అన్నీ డబ్బులు?” అంటూ గట్టిగా అరవటం మొదలు పెట్టాడు.

నేను జవాబు ఇవ్వకుండా పిల్లలను తీసుకొని వేరే గదిలో పడుకొని లోపల నుంచి గడియ పెట్టుకున్నాను. నీరజ్ మీద అనుమానం, కోపం, అసహనం, విరక్తి ఇలా ఎన్నో భావనలు ఉండేవి. పొద్దున నిద్ర లేచే టప్పటికి ఒళ్ళంతా నొప్పి, తలనొప్పిగా ఉంది. ప్రెస్‌లో కూడా చాలా పని ఉంది. ఎలాగో శక్తి కూడబలుక్కొని లేచాను. లేచి టిఫిన్ తయారు చేసి పిల్లలను స్కూల్‌కు పంపించి నేను కూడా ప్రెస్‌కి వెళ్లడానికి తయారు అవుతున్నా.

తలనొప్పితో ఏ పని చేయబుద్ధి కాలేదు. పర్స్ అంతా వెతికితే ఒక ఆస్పిరిన్ మాత్ర దొరికింది. నేను చిన్నప్పుడు ఎవరినా తలనొప్పి అంటే గట్టిగా నవ్వేదాన్ని. ‘అంత గట్టిగా ఉన్న నీ తలకు నొప్పి ఏమిటి’ అంటూ గట్టిగా నవ్వుతూ పరిహాసం చేసేదాన్ని. ఆ రోజుల్లో తెలియదు – అంత గట్టి తలను కూడా ఓడించగల నొప్పి, బాధలు ఉంటాయి అని. ఈ రోజుల్లో నా పర్స్‌లో డబ్బులు ఉంటాయో ఉండవో తెలియదు కానీ తలనొప్పి మాత్రలు మాత్రం వెతికితే తప్పక ఉంటాయి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here