కాబూలీవాలా

0
9

[box type=’note’ fontsize=’16’] శ్రీ రవీంద్రనాథ్ టాగూర్ కథని ‘కాబూలీవాలా’ అనే పేరిట తెలుగులో అందిస్తున్నారు శ్రీ చింతపట్ల సుదర్శన్. [/box]

[dropcap]నా[/dropcap] ఐదేళ్ల కూతురు మినీ. ఈ లోకంలోకి వచ్చిన సంవత్సరం లోపునే మాట్లాడటం మొదలు పెట్టింది. ఇప్పుడు అది మెలకువగా ఉన్నసమయం అంతా మాట్లాడుతూనే ఉంటుంది. ఒక్క క్షణం కూడా నిశ్శబ్దంగా ఉండదు. దాని మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి తల్లి అప్పుడప్పుడు ‘నోరు మూసుకోరాదూ’ అని మందలించేది. నాకు మాత్రం అది నిశ్శబ్దంగా ఉండటం అసహజం అనిపించేది. ఓపిగ్గా దాని మాటలు వింటూ ఉండేవాడిని.

ఒకనాడు ఉదయం గదిలో కూర్చుని నా నవల పదిహేడవ అధ్యాయం మొదలు పెట్టబోతుంటే మినీ వచ్చి “నాన్నా మన రాందయాల్ కాకిని కాకి అనకుండా ఇంకేదో అంటాడు, ఏమీ తెలియదు కదా” అంది. వాడి మాతృభాష వేరని భాషల మధ్య తేడాను వివరించాలని అనుకున్నాను కానీ నేను చెప్పేది వినిపించుకోకుండా మాట మార్చి వెంటనే “ఆకాశంలో ఏనుగు తొండంతో నీళ్లు కిందకి పోస్తే వర్షం కురుస్తుందట, అంతా ఉత్తిదే కదా అన్ని అబద్ధాలే కదా” అంది. ఈ విషయం మీద కూడా నా అభిప్రాయం చెప్పే లోపునే “మరి అమ్మ నీకు ఏమవుతుంది?” అని అడిగింది. ఆ ప్రశ్నకు వచ్చిన నవ్వు ఆపుకుంటూ “నన్ను రాసుకోనీ చిట్టి తల్లీ, వెళ్లి భోలాతో ఆడుకో రాదూ” అన్నాను బుజ్జగిస్తూ. అది నా మాట పట్టించుకోలేదు. నా కాళ్ళ దగ్గర కూర్చుని మోకాళ్ళమీద చేతులు మార్చి మార్చి చరుస్తూ ‘కాళ్ళ గజ్జ’ ఆడుకోసాగింది.

ఈ సమయాన నా నవల పదిహేడవ అధ్యాయంలో ప్రతాపసింహుడు తన చేతులతో కాంచనమాలను ఎత్తుకొని చీకటి మాటున జైలు కిటికీలోంచి కింద ఉన్న నదిలోకి దూకుతున్నాడు. నా గది కిటికీ లోంచి చూస్తే బయట ఉన్న రోడ్డు కనిపిస్తుంది. మినీ హఠాత్తుగా ఆట ఆపేసి కిటికీ దగ్గరికి వెళ్లి ‘కాబూలీవాలా ఓ కాబూలీవాలా’ అని బిగ్గరగా అరిచింది. వదులుగా వేలాడే మురికి దుస్తులు తలమీద పాగా భుజం మీద వేలాడే బ్యాగ్‌తో రోడ్డుమీద కనబడ్డాడు కాబూలీవాలా. అతని చేతుల్లో ద్రాక్ష పండ్ల పెట్టెలు ఉన్నాయి. అతన్ని చూసి మినీ పెద్దగా కేకలు వేయడం మొదలుపెట్టింది. అతని భుజం మీద వేలాడుతున్న బ్యాగ్‌లో ముగ్గురు నలుగురు పిల్లల్ని పట్టుకుపోతున్నాడని మినీ భయం. ఇక పదిహేడవ అధ్యాయం ముందుకు సాగదని అనిపించింది. మినీ కేకలు విన్న కాబూలీవాలా నవ్వుతూ మా ఇంటి వైపు వచ్చాడు. అతను రావడం చూసి మినీ లోపలికి పారిపోయింది. కాబూలీవాలా కిటికీ దగ్గరికి వచ్చి నవ్వుతూ సలాం చేశాడు.

నేను ప్రతాప్, కాంచనమాలల దుస్థితిని పట్టించుకోకుండా ఏమైనా కొందామని అతన్ని లోపలికి రమ్మన్నాను. “మీ పాప ఏది సాబ్? ఎక్కడికి వెళ్ళింది?” అన్నాడు. మినీ అర్థం లేని భయాన్ని పోగొట్టాలని నేను “చిట్టితల్లీ భయం లేదు బయటకురా” అని పిలిచాను. మినీ వచ్చి నన్ను గట్టిగా అదిమి పట్టుకుని నా వైపు, కాబూలీవాలా బ్యాగు వైపు అనుమాన పడుతూ చూసింది. కాబూలీవాలా బ్యాగ్ లోంచి కొన్ని ఎండుద్రాక్షలు బాదాములు తీసి మినీకి అందించబోయాడు. నీరు చేయి చాచకుండా అది నన్ను మరింత గట్టిగా పట్టుకుంది. మినీ కాబూలీవాలాను అంత దగ్గరగా చూడటం ఇదే మొట్టమొదటిసారి.

కొన్ని రోజుల తర్వాత ఉదయం పని మీద బయటకు బయయయల్దేరిన నాకు గుమ్మం ఎదురుగా బెంచి మీద కూర్చుని ఉన్న మినీ కనిపించింది. కాబూలీవాలా దాని కాళ్ళ దగ్గర కూర్చుని ఉన్నాడు. మినీ గుక్క తిప్పుకోకుండా ఏదో మాట్లాడుతున్నది. కాబూలీవాలా నవ్వుతూ దాని మాటలు వింటూ మధ్యమధ్యన తనకు వచ్చీరాని బెంగాలీ భాషలో ఏదో అంటున్నాడు. ఐదేళ్ల వయసులో తన మాటలు వినడానికి తండ్రి తప్ప మరో మనిషి చిక్కని దానికి అది చెప్పే కబుర్లు ఓపిగ్గా వినడానికి కాబూలీవాలా దొరికాడు. దాని ఒళ్ళో ఎండుద్రాక్షలు, బాదంలు కనిపించాయి నేను “ఇవన్నీ ఎందుకు ఇచ్చావు వద్దు వద్దు” అంటూ జేబులోంచి అర్ధ రూపాయి బిళ్ళ తీసి ఇచ్చాను. అతను తటపటాయిస్తూనే దాన్ని తీసుకుని తన బ్యాగులో వేసుకున్నాడు.

బయట పని పూర్తి చేసుకుని నేను ఇంటికి వచ్చేటప్పటికి అర్ధ రూపాయి బిళ్ళ పెద్ద గొడవే తెచ్చింది. గుండ్రంగా మెరుస్తూ ఉన్న ఆ బిళ్ళను పైకి ఎత్తి పట్టుకొని మినీని ప్రశ్నిస్తున్నది తల్లి. “చెప్పు ఈ అర్ధ రూపాయి బిళ్ళ నీకు ఎక్కడిది?”

“కాబూలీవాలానే ఇచ్చాడు” అంది మినీ.

“ఇస్తే మాత్రం నువ్వు ఎందుకు తీసుకున్నావు?” అని గద్దించింది తల్లి.

తల్లి కోపం నుంచి రక్షించడానికి నేను మినీని బయటకు తీసుకెళ్లాను. తర్వాత తెలిసింది కాబూలీవాలా ఇంటికి రావడం ఇది రెండోసారి కాదని, దాదాపు ప్రతిరోజు వస్తున్నాడని. చిట్టి తల్లికి ఎండుద్రాక్షలు, పిస్తా లంచంగా ఇచ్చి ఏవో కబుర్లు చెబుతున్నాడని, ఇద్దరూ కలిసి ఇంటి పైకప్పు ఎగిరిపోయి నవ్వుతూ ఉన్నారని తల్లి చెప్పింది.

తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నేను గమనించాను. కాబూలీవాలా రహమత్ వచ్చీరాగానే “నా బ్యాగులో ఏముందో చెప్పుకో చిట్టితల్లీ” అంటాడు. మినీ నాకు తెలుసులే అన్నట్లు ముఖం పెట్టి నవ్వుతుంది. తిరిగి నవ్వుతూ రహమత్ ముక్కుతో ‘ఏనుగు’ అని పలుకుతాడు. బ్యాగులో ఏనుగు ఉంది అనడం మినీ తమాషాగా నవ్వడం చూసి నాకు సంతోషం కలిగేది. వాళ్ళు సరదాగా మాట్లాడుకునే మాటల్లో అత్తగారిల్లు అనే మాట ఒకటి. రహమత్ మినీతో “చిట్టితల్లీ నువ్వు అత్తగారింటికి ఎప్పుడు పోతావ్?” అనేవాడు. చాలామంది ఆడపిల్లలు చిన్నప్పటినుంచి చాలాసార్లు ఈ మాట వింటూ పెరుగుతారు కానీ మేం మాత్రం మినీ ముందు పెళ్ళి, అత్తగారిల్లు అనే మాటలు ఎప్పుడు మాట్లాడేవారం కాదు. అందువల్ల మినీకి రహమత్ మాటలు స్పష్టంగా అర్థం కాక పోయేవి. కానీ మాటకు మాట చెప్పకుండా ఉండటం దాని స్వభావం కాదు కదా! “నువ్వు చెప్పు అత్తగారింటికి నువ్వు ఎప్పుడు వెళ్తావ్?” అనేది. తన ఎదురుగా అత్తగారు ఉన్నట్లు ఊహించుకుని తెచ్చిపెట్టుకున్న కోపంతో ఊగిపోతూ “నేనా? నేను ఎందుకు వెళ్తాను?” అనేవాడు రహమత్. కాస్సేపటిదాకా ఇద్దరూ ఆపకుండా నవ్వుతూనే ఉండేవారు.

నేను కలకత్తా వదిలి ఎక్కడికి వెళ్ళలేదు కానీ నా మనసు ప్రపంచమంతా పరిభ్రమిస్తూ ఉండేది. ఏ విదేశం పేరు విన్నా నా మనసు అటువైపు పరిగెత్తేది. ఏ నది ఒడ్డునో ఏ కొండ ప్రాంతంలోనో ఒకే ఒక ఒంటరి కుటీరం నా కళ్ళకు కనిపించేది. అక్కడ స్వేచ్ఛగా ఆనందంగా గడపాలననే ఆలోచన నన్ను కమ్మేసేది. కానీ నా మాతృదేశానికి సంబంధించిన దృఢమైన మూలాలు ఆ ఆలోచనలను చిందరవందర చేసేవి. నేను నా గదిలో కూర్చుని ముచ్చటించే సమయంలో నా మిత్రుడు రహమత్ తన స్వదేశం గురించి ఉత్సాహంగా చెప్తున్నప్పుడు ఎడారి దారిలో రెండువైపులా మండుటెండలకు ఎరుపెక్కిన కొండలు, బరువులు మోస్తూ కదిలిపోయే ఒంటెలు కనిపించేవి. తలపాగాలు ధరించిన వ్యాపారస్థులు కొందరు ఒంటెలమీద, బాటసారులు కొందరు కాలినడకన, కొందరు కత్తులు చేతబట్టి, కొందరు పాతకాలపు తుపాకులు చేతపట్టి నా కళ్ళముందు కనిపించేవారు. మినీ తల్లి ప్రతి విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండేది. వీధిలో చిన్న శబ్దం వినిపిస్తే చాలు ప్రపంచంలోని త్రాగుబోతులందరూ కలిసికట్టుగా మా ఇంటి మీద దాడికి వస్తున్నారని అనుకునేది. ఎంత జీవితానుభవం వచ్చినప్పటికీ ఈ ప్రపంచం తాగుబోతులతో, పులులతో, గొంగళి పురుగులతో, బొద్దింకలతో, తెల్లతోలు ఉన్న దోపిడీదారులతో క్రిక్కిరిసి ఉందని ఆమె నమ్మకం. ఆమెకు కాబూలీవాలాపై ఏ మాత్రం సదభిప్రాయం లేదు. అందుకే నాతో “వాడిని ఓ కంట కనిపెట్టి ఉండండి” అనేది. నేను ఆమె భయాన్ని నవ్వుతూ కొట్టిపారేస్తే “పసి పిల్లలు తప్పిపోరా? ఓ ఆఫ్ఘనిస్తాన్ వాడికి చిన్న పాపని కిడ్నాప్ చేయడం సాధ్యం కాదా?” అనేది. నేనామె మాటలు నమ్మే వాడిని కాదు. రహమత్‌ను ఇంట్లోకి రానివ్వడం తప్పు అని అనిపించేది కాదు.

ప్రతి ఏడు మాఘమాసంలో రహమత్ తన దేశానికి వెళ్ళేవాడు. ఈ సమయంలో తాను అప్పు ఇచ్చిన వాళ్ళ దగ్గరనుంచి డబ్బు వసూలు చేయడానికి ఇల్లిల్లూ తిరుగుతూ తీరికలేకుండా ఉండేవాడు. అయినా వీలు చేసుకుని ఏదో ఒక సమయంలో మినీని చూడటానికి వచ్చేవాడు. ఉదయం రావడం వీలుపడని రోజు రాత్రి చీకటి పడ్డాక ఇంట్లో ఓ మూల సన్నని పొడవైన అతని రూపం కనిపించేది. వదులు పైజామాతో భుజాన వేలాడే బ్యాగ్‌తో ఉండే అతని ఆకారం కొంచెం భయం కలిగించేది. కానీ అతన్ని చూడగానే వయసులో ఎంతో అంతరం ఉన్నా కేరింతలు కొడుతూ అతని దగ్గరికి పరిగెత్తే మినీని చూస్తే మనసు తేలిక పడేది. ఆ ఇద్దరి నవ్వుల శబ్దం చాలాసేపు వినిపించేది. ఒక ఉదయం అచ్చయిన కాగితాల్లో అక్షరదోషాలు సరి చేస్తున్నాను. శీతాకాలపు చివరి రోజులు కనుక చలి వణికిస్తోంది. ఉదయపు సూర్యుడు కిటికీలోంచి లోపలికి వచ్చి నా బల్లకింద ప్రకాశిస్తున్నాడు. లేత వెచ్చదనం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నది. సమయం ఎనిమిది గంటలయి ఉంటుంది. ఉదయపు నడకకు వెళ్ళినవాళ్ళు గాలికి కండువాలు ఎగురుతుంటే ఇళ్లకు తిరిగి వస్తున్నారు. వీధిలో ఏదో కలకలం వినిపించింది.

నేను బయటకు చూశాను. చేతులకు బేడీలు వేసి ఉన్న రహమత్‌ను ఇద్దరు పోలీసులు లాక్కెళ్తున్నారు. రహమత్ దుస్తులకు రక్తపు మరకలు ఉన్నాయి. ఒక పోలీసు చేతిలో నెత్తురు అంటిన కత్తి ఉన్నది. నేను పోలీసు వాళ్ళను ఆపి “ఏం జరిగింది?” అని అడిగాను. కొంత ఒక పోలీస్, కొంత రహమత్ చెప్పగా తెలిసింది. మా పొరుగున ఉన్న ఒక వ్యక్తి రహమత్ దగ్గర అప్పు తీసుకుని బాకీ చెల్లింపు విషయంలో అబద్ధం చెప్పాడు. ఈ విషయంలో జరిగిన గొడవలో రహమత్ ఆ వ్యక్తిని కత్తితో పొడిచాడు.

రహమత్ అబధ్ధం ఆడిన వ్యక్తిని తిడుతూ శాపనార్థాలు పెడుతుంటే అతని వైపు ‘కాబూలీవాలా కాబూలీవాలా’ అని అరుస్తూ పరిగెత్తింది మినీ. నిమిషం సేపు రహమత్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అతని భుజం మీద వేలాడే బ్యాగులేదు. అందువల్ల వారిద్దరి మధ్య ఇదివరకటి సంభాషణ సాగలేదు. మినీ సూటిగా అడిగింది “కాబూలీవాలా నువ్వు మీ అత్తగారింటికి వెళ్తున్నావా?” అని. “అవును చిట్టి తల్లీ నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను”అన్నాడు రహమత్ చెరగని చిరునవ్వుతో. తన మాటలు విని మినీ అంతగా ఆనంద పడలేదు అనుకున్నాడేమో చేతులు పైకి ఎత్తి చూపుతూ “వెళ్లక తప్పదు కదా చిట్టి తల్లీ చేతులకు బేడీలు ఉన్నాయి కదా!” అన్నాడు.

హత్యా ప్రయత్ననేరానికి రహమత్‌కు చాలా సంవత్సరాలు జైలు శిక్ష విధించబడింది. క్రమంగా అతని జ్ఞాపకాలు మా మనసుల్లో నుంచి చెరిగిపోయాయి. తన దేశాన్ని వదిలి వచ్చిన ఒక కొండ ప్రాంత వాసి జైలుగోడల వెనుక ఎలా గడుపుతున్నాడు అని ఆలోచించే తీరిక మినీకి గాని ఆమె తండ్రికి గాని ఎందుకు ఉంటుంది. ఎంత హటాత్తుగా మొదలైందో అంత వేగంగా ఆ స్నేహం మరుగున పడిపోయింది. మినీ తన స్నేహితుడిని పూర్తిగా మర్చిపోయింది. వయసు పెరిగేకొద్ది మినీకి కొత్త స్నేహితులు పెరిగారు, ఆమె నా గదిలోకి రావడం కూడా తగ్గిపోయింది.

మినీ పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి కొడుకు నవీ ఆమె మనసంతా నిండిపోయాడు. పార్వతి కైలాస పర్వతానికి వెళ్లిపోయినట్లు అది తల్లిదండ్రులమైన మమ్మల్ని వదిలేసి తన ఇంటికి వెళ్లి పోయే సమయం వచ్చింది. వరుస వర్షాలు సూర్యకాంతిని పరిశుభ్రం చేశాయి.

ఆ ఉదయం సూర్యుడు కరిగించిన బంగారంలా మెరిసిపోతున్నాడు. సూర్యకాంతి కలకత్తాలోని మురికి వీధుల్లో ఇరుకైన ఇళ్లను కూడా ఒక అసాధారణమైన సౌందర్యంతో ముంచేసింది. మంగళవాయిద్యాలు మ్రోగుతుండగా వాటి ప్రకంపనలు నా వెన్ను లోతుల నుంచి వినిపిస్తున్నాయి. సూర్యకాంతితో జతకట్టి భైరవి రాగం ఏదో తెలియని దిగులు నాలో వ్యాపింప జేస్తున్నది. మినీ పెళ్లి రోజు. బంధువులు హడావిడిగా ఇంటి లోపలికి బయటికి తిరుగుతున్నారు. గదుల్లో వరండాల్లో వేలాడదీయబడిన శాండిలైర్లలో గాజు పలకలు గలగలా శబ్దం చేస్తున్నవి. ఇంటి ముందు పెళ్లి పందిరి వేయబడింది. నా గదిలో నేను ఖర్చు లెక్క చూసుకుంటున్నాను. హఠాత్తుగా నాముందు ప్రత్యక్షమయ్యాడు రహమత్!!!

సలాం చేసిన రహమత్‌ను మొదట నేను గుర్తు పట్టలేదు. అతని భుజం మీద వేలాడే బ్యాగులేదు. తల మీద పొడవైన వెంట్రుకలు లేవు. ముఖంలో ఇదివరకటి కాంతి లేదు. కానీ అతని చిరునవ్వే అతన్ని గుర్తుపట్టేట్టు చేసింది. “ఎలా ఉన్నావ్ రహమత్, ఎప్పుడు వచ్చావు?” అని అడిగాను.

“నిన్న సాయంత్రం జైలు నుంచి విడుదల అయ్యాను సాబ్” అన్నాడు రహమత్.

ఉలిక్కిపడ్డాను. హత్యా ప్రయత్నం చేసిన వ్యక్తి నా ఎదురుగా ఉన్నాడు అన్న ఆలోచన నన్ను భయపెట్టింది. మినీ పెళ్లి జరగబోతున్న శుభదినాన ఇలాంటి వ్యక్తి రాకపోతే బాగుండుననిపించింది.

“ఇంట్లో వేడుక జరుగుతున్నది ఇక నువ్వు వెళ్ళు రహమత్” అన్నాను గొంతు పెగల్చుకుని. వెళ్లిపోవడానికి అడుగులు ముందుకు వేసి గుమ్మం దగ్గర ఆగి తడబడుతూ అడిగాడు “నేను చిట్టి తల్లిని ఒకసారి చూడవచ్చా” అని.

తను జైలుకు వెళ్లినప్పుడు చూసిన చిట్టితల్లి అలాగే ఉంటుందని ఇదివరకు అలాగే ‘కాబూలీవాలా ఓ కాబూలీవాలా’ అంటూ పరిగెత్తుకు వచ్చి సరదాగా కబుర్లు చెప్తుంది అనుకుంటున్నట్టున్నాడు. తన పాత స్నేహాన్ని గుర్తు పెట్టుకొని ఏ ఆఫ్ఘన్ స్నేహితుడు దగ్గర్నుంచో ఓ ఎండుద్రాక్షల పెట్టె, పేపర్‌లో చుట్టి బాదాములు తెచ్చినట్లు ఉన్నాడు.

“చెప్పాను కదా ఇంట్లో వేడుక జరుగుతున్నదని ఇప్పుడు నువ్వు ఎవరిని చూడలేవు” అన్నాను. అతని ముఖం కళావిహీనం అయింది. నా వైపే చూస్తూ కాసేపు నిశ్శబ్దంగా నిలబడి “బాబూ సలాం” అంటూ బయటకు నడిచాడు. వెనక్కి పిలవాలని అనుకున్నాను కానీ అతనే తిరిగి వస్తూ ఉండటం కనిపించింది. “నేను ఈ పెట్టెను చిట్టితల్లి కోసమే తెచ్చాను ఆమెకు ఇవ్వరా?” అన్నాడు దీనంగా. నేను డబ్బులు ఇవ్వబోయాను. రహమత్ నా చేతులు పట్టుకొని “డబ్బు ఇవ్వద్దు సాబ్. మీ కూతురి లాగే నా దేశంలో నాకూ ఒక కూతురు ఉంది. చిట్టి తల్లిని నా కూతురుగా భావించి తీసుకు వచ్చాను అమ్మడానికి కాదు” అంటూ తన చొక్కా జేబులోంచి ఒక కాగితాన్ని జాగ్రత్తగా బయటకు తీసి మడతవిప్పి నా ముందు బల్లమీద పరిచాడు.

ఆ కాగితం మీద ఒక చిన్నారి అరచేతి ముద్ర ఉన్నది. అది ఫోటో కాదు గీసిన చిత్రం కాదు. సిరాలో అద్ది కాగితం మీద వేయించుకున్న చిట్టి అరచేతి ముద్ర. కూతుర్ని వదిలి వచ్చేటప్పుడు తెచ్చుకున్న ఈ చేతి ముద్ర కాగితాన్ని తన గుండెకు ఆనుకుని ఉన్న జేబులో పెట్టుకుని కలకత్తా వీధుల్లో పండ్లు ఎండు ద్రాక్షలు అమ్ముకునే రహమత్‌కు ఆ సున్నితమైన మెత్తనైన ఆ చిట్టి చేతి ముద్ర ఇంటి మీద బెంగ నుంచి కూతురు జ్ఞాపకం వల్ల కలిగే దుఃఖం నుంచి ఊరట కలిగించేది. ఆ చిట్టి చేతిముద్రను చూసిన నా కళ్ళు కన్నీటితో తడిసిపోయాయి. ఆ క్షణాన అతను ఓ ఎండుద్రాక్షలు అమ్ముకునే వాడని, నేను ఒక బెంగాలీ బాబునని మర్చిపోయాను. నేను ఎలాగో అతను అలాగే ఓ కూతురు తండ్రి అని నాకు అర్థం అయింది. అతని చిన్నారి చేతి ముద్ర నాకు చిన్ననాటి మినీని గుర్తు చేసింది.

క్షణం ఆగలేదు నేను. ఇంటి లోపల ఉన్న మినీని పిలిపించాను. అభ్యంతరాలు వచ్చాయి కానీ నేను వినిపించుకోలేదు. ఎర్రటి పట్టు చీర కట్టుకుని నుదుట గంధపు బొట్టుతో పెళ్లికూతురుగా ముస్తాబై ఉన్న మినీ అడుగులో అడుగు వేస్తూ నా గదిలోకి వచ్చింది. నా పక్కన నిలబడి ఉన్న మినీని చూసి కంగారు పడ్డాడు రహమత్. అతని ఊహకు అందని రూపం అది. అందుకే ఇదివరకులా పలకరించ లేకపోయాడు. కాసేపటికి తేరుకుని నవ్వుతూ “చిట్టి తల్లీ అత్తగారింటికి వెళ్ళిపోతున్నావా?” అన్నాడు. ఇప్పుడు మినీకి ఆ మాటకు అర్థం తెలుసు. ఇదివరకులా సమాధానం చెప్పలేకపోయింది. మినీ రహమత్‌లు కలిసిన మొట్ట మొదటి రోజు గుర్తుకువచ్చి బాధ కలిగింది.

మినీ గదిలోనుంచి లోపలికి వెళ్ళిపోయింది. భారంగా నిట్టూరుస్తూ రహమత్ నేల మీద కూలబడ్డాడు. తను చివరిసారిగా చూసి వచ్చిన కూతురు గుర్తు వచ్చి ఉంటుంది. తన కూతురు కూడా తన వదిలిపెట్టి వచ్చినప్పటిలా ఉండదని, ఈ ఎనిమిదేళ్లలో ఆమె కూడా మినీ అంత పెద్దది అయి ఉంటుందని అనిపించి ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ కొండ ప్రాంతం నుంచి కలకత్తాకు వచ్చిన రహమత్ ఓ ఇరుకు వీధిలోని ఇంట్లో ఈ మూలన కూలబడి తన మాతృభూమిని తన కూతురిని మనసులో చిత్రించుకుంటున్నాడు.

రహమత్ కు ఒక బ్యాంకు నోట్‌ను అందిస్తూ “రహమత్ నీ మాతృదేశానికి వెళ్ళు. నా కూతురంత పెద్దదయిన నీ కూతురు నీ కోసం ఎదురు చూస్తుంటుంది. వెళ్ళు. మీ తండ్రి కూతురుల కలయిక నా కూతురు మినీకి శుభం కలిగించే దీవన అవుతుంది” అన్నాను. రహమత్‌కు డబ్బు ఇవ్వడం వల్ల పెళ్లి ఖర్చులు కొన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది. కరెంటు దీపాలంకరణ చేయించలేకపోయాను. బ్యాండ్ మేళం రప్పించలేకపోయాను. ఇంట్లో ఆడవారికి తీవ్ర అసంతృప్తి కలిగింది. కానీ నాకు మాత్రం మినీ పెళ్లి వేడుక మరింత వైభవంగా జరిగింది అనిపించింది.

మూలం: రవీంద్రనాథ్ టాగూర్

అనువాదం: చింతపట్ల సుదర్శన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here