కచుడు – దేవయాని

0
5

[box type=’note’ fontsize=’16’] “వినయసంపన్నుడు, బుద్దిమంతుడు, ధర్మాధర్మాలు తెలిసినవాడు అయిన కచుడు; సురాపానానికి లోనైనా గురువు శుక్రాచార్యుడు, యయాతి వంటి పాత్రలు మనకు ఎంతో నీతిని, మంచిని బోధిస్తాయి” అంటున్నారు అంబడిపూడి శ్యామసుందర రావు. [/box]

[dropcap]పు[/dropcap]రాణాల్లో మనము వినే ప్రేమ కథల్లో ప్రత్యేకమైనదిగా కచ దేవయానుల కథను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు ప్రేమికులు రెండు భిన్న సంస్కృతులకు చెందినవారు. పైపెచ్చు ఈ ప్రేమ కథ వన్ సైడెడ్ లవ్ స్టోరీ, అంటే ఓక్కళ్ళే ప్రేమిస్తు ఉంటారు. ఈ ప్రేమకథలో ప్రేమతో పాటు ఇతర అంశాలు… అసూయా, ఈర్ష్య వంటి లక్షణాలు; మోసము, తన ప్రేమను నిరాకరించాడన్న కోపముతో శపించటాలు లాంటివి జరుగుతాయి. అన్నిటికన్నా ముఖ్యముగా గమనించ వలసినది సురాపానము మనిషిని ఎంత పరిస్థితికి దిగజారుస్తుందో కూడా తెలుసుకోవచ్చు.

దేవ దానవ సంగ్రామము జరిగేటప్పుడు దానవుల గురువైన శుక్రాచార్యుడు చనిపోయిన రాక్షసులను మృతసంజీవిని విద్యతో బ్రతికించటం దేవతలకు పెద్ద సమస్యగా మారింది. కానీ దేవతలకు మృత సంజీవని విద్య తెలియదు. మృతసంజీవనీ విద్య తెలిసిన శుక్రాచార్యుడు ఆ విద్యను తన శత్రువులైన దేవతలకు చెప్పడు,

దీనికి పరిష్కారముగా దేవతలు, దేవతల గురువైన బృహస్పతి కుమారుడైన కచుని శుక్రాచార్యుని వద్దకు పంపి అయన శిష్యరికం చేసి ఆయనను మెప్పించి విద్యను నేర్చుకొని రమ్మంటారు. ఇంద్రుని, ఇతర దేవతల సూచనలను బట్టి కచుడు శుక్రాచార్యుల వారి వద్ద శిష్యరికం కోసము వృషపర్వుని నగరము చేరుతాడు.

గురువుగారికి సాష్టాంగ ప్రమాణము చేసి తనను తాను పరిచయము చేసుకొని శిష్యునిగా స్వీకరించమని ప్రార్ధిస్తాడు. దేవ గురువైన బృహస్పతి కుమారుడు తన వద్దకు శిష్యరికం చేయటానికి రావటాన్ని గుర్తించి, మరియు కచుని వినయవిధేయతలు, తెలివితేటలు, సుగుణ సంపత్తి శుక్రాచార్యునికి నచ్చి కచుని తన శిష్యునిగా స్వీకరిస్తాడు కచుడు గురువుగారి మాటను ఆజ్ఞగా భావిస్తూ గురువుగారి మనస్సు ఎరిగి మసలుకుంటు భక్తి శ్రద్దలతో సేవిస్తూ ఉన్నాడు.

శుక్రాచార్యులవారి కూతురు దేవయాని కచుని అందచందాలకు రూపలావణ్యానికి ముగ్దురాలై అతనిపై మరులు పెంచుకోసాగింది. కానీ కచుడు దేవయాని గురు పుత్రిక కాబట్టి ఆవిడను ఆ విధముగానే గౌరవిస్తుంటాడు. ఏదో ఒక రకముగా కచుని ఆకర్షించాలని దేవయాని ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటుంది. ఈ విధముగా ఐదు సంవత్సరాలు గడిచాయి. దేవగురువు కుమారుడైన కచుడు తమ గురువు కుమార్తెతో చనువుగా ఉండటం వారిద్దరి ఆటపాటలు రాక్షసులకు నచ్చక కచుని ఏదో ఒక విధముగా అంతము చేయాలని ఆలోచనలు చేయసాగారు.

ఒకరోజు కచుడొక్కడే ఆలమందలతో అడవికి వెళ్ళాడు. సమయము కోసము ఎదురు చూస్తున్న రాక్షసులు అతనిని చంపి ముక్కలు ముక్కలుగా చేసి అడవి తోడేళ్లకు ఆహారముగా వేసారు. ఆలమందలు వచ్చినా, కచుడు రాకపోయేసరికి కీడు శంకించిన దేవయాని తండ్రి దగ్గరకు వెళ్లి గగ్గోలు పెడుతుంది. అతనిని చూడకుండా తానూ బ్రతకలేనని తండ్రితో మొరపెట్టుకుంటుంది. కూతురు కోసము అసుర గురువు తన దివ్యదృష్టితో జరిగిన విషయము తెలుసుకుంటాడు. మృత సంజీవిని విద్యతో శుక్రాచార్యుడు కచుని బ్రతికిస్తాడు. కచుని చూసిన దేవయాని పరమానంద పడుతుంది.

కానీ తమ పథకము విఫలమయినందుకు రాక్షసులు మరో అవకాశము కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. దేవయాని కచుని వనానికి వెళ్లి రంగు రంగుల పూలు తెమ్మని అడుగుతుంది. వనానికి వెళ్లిన కచుని, అవకాశము కోసము ఎదురు చూస్తున్న రాక్షసులు వెంబడించి అతన్ని చంపి కాల్చి బూడిద చేసి ఆ బూడిదను శుక్రాచార్యుని సురాపాత్రలో కలిపి పసందైన మద్యమని నమ్మించి గురువు గారి చేత త్రాగిస్తారు. విషయము తెలియని గురువుగారు ఆ మద్యాన్ని త్రాగేస్తాడు. కచుడు ఎంతసేపు అయినా రాకపోయేసరికి దేవయాని తండ్రి దగ్గర తన భాధను వెళ్లగక్కుతుంది. కూతురు ఏడుపుతో శుక్రాచార్యుని మత్తు దిగి కచుని కోసము శోధించటం మొదలుపెడతాడు. కానీ కనిపించకపోయేసరికి తానూ త్రాగిన సురాపానం గుర్తుకు వచ్చి\తనలో చూసుకున్నాడు. కడుపులో బూడిదగా ఉన్న కచుని సంగతి తెలుసుకొని మద్యము మత్తులో తానూ ఎంత పొరపాటు చేసింది గ్రహిస్తాడు.

సురాపానం చేయరాదని, కాదని మూర్ఖముగా త్రాగినవాడు శాశ్వతముగా అధోలోకాలకు పోతారని శపించాడు. ఆ రోజుల్లోనే శుక్రాచార్యుడు మద్యము యొక్క దుర్లక్షణాలను గుర్తించి సురాపానం తగదని హితవు పలికాడు.

కచుడు బయటికి వస్తే శుక్రాచార్యులవారు మరణిస్తారు ఎలా అని కూతురిని అడిగితే ‘కడుపులో ఉన్న కచునికి నీవు మంత్రోపదేశము చేస్తే కచుడు బయటకు వచ్చి నిన్ను బ్రతికిస్తాడు’ అని దేవయాని తండ్రికి సలహా ఇస్తుంది కూతురు మీద ఉన్న ప్రేమతో దేవయాని మాట కాదన లేక మంత్రాన్ని కచునికి ఉపదేశిస్తే, బయటకు వచ్చిన కచుడు చనిపోయిన శుక్రాచార్యుడిని బ్రతికిస్తాడు. కచునికి తనను రెండు సార్లు బ్రతికించి,తనకు మృత సంజీవని మంత్రాన్ని ఉపదేశించిన గురువుగారిపై అపారమైన భక్తి భావము ఏర్పడుతుంది.

కొంతకాలము గురువుగారికి సేవచేసి తన విద్యాభ్యాసము పూర్తిచేసుకొని తన ప్రయాణానికి అనుమతి ఇవ్వవలసినదిగా గురువుగారిని ప్రార్థిస్తాడు. గురువుగారు సంతుష్టుడై అనుమతిని ఇస్తాడు. అందరి దగ్గర సెలవు తీసుకుంటూ కచుడు దేవయానిని కూడా సెలవు అడుగుతాడు. దేవయాని, “నేను నీపై మరులు గొన్నాను, నిన్ను వివాహమాడ దలచుకున్నాను. నన్ను వివాహమాడు” అని కచుడ్ని అడుగుతుంది.

“నీవు గురుగారి పుత్రికవు, అంటే నాకు సోదరి సమానురాలవు. నిన్ను వివాహమాడటం అధర్మము” అని దేవయానికి నచ్చజెప్పాలని ప్రయత్నిస్తాడు. కానీ దేవయాని తనను నిరాకరించాడు అన్న కోపముతో విచక్షణా జ్ఞానము వివేకము కోల్పోయి, “నీవు సంపాదించుకున్న మృత సంజీవని విద్య నీకు ఫలించకుండుగాక”అని శపిస్తుంది.

కచుడు ఆమె మూర్ఖత్వానికి నవ్వుకొని, “ధర్మవిరుద్ధ ఆలోచనలతో సాగే నీ ఆలోచనల వల్ల నీకు బ్రాహ్మణేతరుడు భర్తగా లభిస్తాడు. నేను సంపాదించుకున్న విద్య నాకు ఫలించకపోయిన ఆ ఫలము నా ద్వారా ఇంకొకరి అంది లోక కళ్యాణార్ధము ఉపయోగపడుతుంది” అని చెప్పి కచుడు అమరపురికి బయలు దేరుతాడు.

దేవయాని కథ అంతటితో అయిపోలేదు. ఒకనాడు దేవయాని రాక్షస రాజైన వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠతో విహారానికి వెళ్లి అక్కడి కొలనులో ఇద్దరు స్నానమాచరిస్తారు. స్నానము చేసి బయటకు వచ్చిన దేవయాని పొరపాటున శర్మిష్ఠ చీర కట్టుకుంటుంది. ఇది చూసిన శర్మిష్ఠ కోపముతో దేవయానిని దగ్గరలో ఉన్న బావిలో పనివాళ్ళచే తోయించి నగరానికి వెళుతుంది. అటుగా వెళుతున్న నహుషుని కుమారుడైన రాజు యయాతి బావిలోని దేవయానిని చూసి రక్షిస్తాడు. రక్షించేటప్పుడు కుడి చేయి పట్టుకొని దేవయానిని బయటకు లాగుతాడు కాబట్టి, “నీవే నాభర్తవు” అని దేవయాని యయాతితో అంటుంది. కానీ కోపముతో ఉన్న దేవయాని నగరానికి వెళ్లదు. తండ్రి శుక్రాచార్యుడు విషయము తెలుసుకొని అడవికి వస్తాడు. వృషపర్వుడు పేరుకు రాజైనా, రాజ్యము శుక్రాచార్యుని దయాదాక్షిణ్యాల మీద నడుస్తుంది. ఈ విషయము బాగా తెలిసిన దేవయాని శర్మిష్ఠ తనకు దాసిగా ఉండాలని షరతు విదిస్తుంది. తండ్రి కోసము శర్మిష్ఠ దేవయాని షరతులకు లొంగి జీవితాంతము దాసిగా ఉండటానికి ఒప్పుకుంటుంది. ఆ విధముగా దేవయాని శర్మిష్ఠను దాసిగా చేసుకుంటుంది.

కొన్ని రోజుల తరువాత దేవయాని, శర్మిష్ఠ ఇతర దాసీ జనముతో వనవిహారానికి వెళుతుంది. అదే సమయములో అక్కడికి యయాతి వేటకు వచ్చి వీరిని కలుస్తాడు. దేవయాని యయాతిని తన తండ్రి వద్దకు తీసికొనివచ్చి తాను యయాతిని పెళ్లాడదలుచుకున్నాను అని చెపుతుంది. శుక్రాచార్యుడు అంగీకరిస్తాడు కానీ తన కూతురితో పాటు శర్మిష్ఠను కూడా వస్తుంది, రాకుమార్తె కాబట్టి ఆవిడను కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెపుతాడు కానీ యయాతి శర్మిష్ఠతో ఏవిధమైన శారీరక సంబంధము పెట్టుకొని దేవయానికి ఆగ్రహము తెప్పించకూడదని ఆదేశిస్తాడు.

గురువుగారి ఆజ్ఞ ప్రకారము యయాతి దేవయానిని వివాహము చేసుకొంటాడు. యయాతి శర్మిష్ఠ అందానికి ఆవిడ తెలివితేటలకు బందీ అవుతాడు. శర్మిష్ఠ కూడా యయాతి పట్ల ప్రేమను పెంచుకుంటుంది. ఆ విధముగా శుక్రాచార్యుని ఆదేశాలను విస్మరించి యయాతి శర్మిష్ఠతో శారీరక సంబంధము ఏర్పరచుకుంటాడు. శర్మిష్ఠను రెండవ భార్యగా స్వీకరించి శర్మిష్ఠ ద్వారా ముగ్గురు (దృహ్యు, అను, పురు) అని కుమారులను పొందుతాడు క్రమముగా దేవయానికి తన భర్త శర్మిష్ఠల మధ్య సంబంధము తెలిసి తన తండ్రి శుక్రాచార్యునికి చెపుతుంది. ఉగ్రుడైన శుక్రాచార్యుడు యయాతి యవ్వన మదంతో ఇటువంటి పనులు చేస్తూ తన కుమార్తెను కష్టపెడుతున్నాడు కాబట్టి ఆ యవ్వనాన్ని కోల్పోవునట్లు శపిస్తాడు. యయాతి వేడుకోగా శాంతించిన శుక్రాచార్యుడు, “నీ ముగ్గురి కుమారులలో ఎవరైనా నీ వృద్ధాప్యాన్ని తీసుకుంటే నీవు తిరిగి యవ్వనవంతుడివి అవుతావు” అని శాప ఉపసంహరణ చెపుతాడు. యయాతి కుమారులలో మూడవనాడు పురూరవుడు తండ్రి వృద్ధాప్యాన్ని తీసుకొని తన యవ్వనాన్ని తండ్రికి ఇవ్వటానికి అంగీకరిస్తాడు. ఆ పురూరవుడే కురువంశానికి మూలపురుషుడు. శర్మిష్ఠ కూడా తాను చేసిన త్యాగాలకు ప్రతిఫలంగా నక్షత్ర మండలములో శాశ్వత స్థానాన్ని పొందింది.

కానీ దేవయాని తన సహజ అసూయా, ఈర్ష్య ద్వేషాలతో తాను బాధపడి ఇతరులను బాధపెట్టింది, ముఖ్యముగా తండ్రి శుక్రాచార్యుడు కూతురు పట్ల గల పుత్రిక వ్యామోహముతో చేయకూడని పనులు చేసాడు. ఈ విధముగా మనకు ఈ కథలో వినయసంపన్నుడు, బుద్దిమంతుడు, ధర్మాధర్మాలు తెలిసినవాడు అయిన కచుడు; సురాపానానికి లోనైనా గురువు శుక్రాచార్యుడు, యయాతి వంటి పాత్రలు మనకు ఎంతో నీతిని, మంచిని బోధిస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here