ఆర్ద్రతని పండించిన ‘కైంకర్యము’ నవల

0
9

[శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ రచించిన ‘కైంకర్యము’ అనే నవలని విశ్లేషిస్తున్నారు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి.]

[dropcap]సం[/dropcap]ధ్యా యల్లాప్రగడ గారు రాసిన ‘వడ్డించిన రుచులు’ హాస్యకథలు, ‘నర్మదా పరిక్రమ’ చదివాను. ఇప్పుడు ఈ ‘కైంకర్యము’ చదివాను. ‘వడ్డించిన రుచులు’ ఎంత హాస్యాన్ని పండించిందో ఈ నవల అంత ఆర్ద్రతని పండించింది. వైష్ణవ సంప్రదాయం, ఆచారాలు, అందులో భాగం అయిన పాశురాలు, రామానుజాచార్యులు వారి విశిష్టాద్వైతం ఇత్యాది విషయాలు చాలా కూలంకషంగా చర్చించారు.. అదంతా చదివి ఆమె వైష్ణవులు అనుకున్నాను. కానీ, కాదని ఆమె చెప్పారు.

ఈ నవల ఆధ్యాత్మికమైనది కాదు. ఇందులో కథ, పాత్రలు, వాటి స్వభావాలు అన్నీ కూడా చాలా సాధారణమైన జీవితాల నుంచి తీసుకున్నవే. కానీ అంతర్లీనంగా ప్రతి పాత్రలో ఎక్కడో భక్తీ, పాపభీతి మనకి కనిపిస్తాయి. ఆండాళ్ళు, ప్రసన్నలక్ష్మి, సీత పాత్రలు స్త్రీ పాత్రలు కాబట్టి, నాటి ఆచారాలను అనుసరించి గృహానికి పరిమితం అయిన స్త్రీల మనస్తత్వాల లాగానే వీరు కూడా ఆధ్యాత్మికతను ఆధారంగా చేసుకుని జీవితంలో వచ్చే కష్టనష్టాలను సహించి, భరించే స్త్రీలు. సుదర్శానాచారి లాయర్.. ఆయన సాత్వికుడు.. సహజంగా దైవభక్తుడు కాదు కానీ భార్య నమ్మకాలను గౌరవించడంలో తాను కూడా అంతో, ఇంతో దైవభక్తిని ఒంట పట్టించుకున్నాడు. అలా అని గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అనే అజ్ఞాని కాదు. కొడుకు అప్రయోజకుడుగా మారుతున్న సమయంలో ఎంతో చాకచక్యంగా ఆ వాతావరణం నుంచి కొడుకుని తప్పించి, మరో ప్రదేశానికి తరలించడంలో ఆయన చూపించిన సంయమనం చాలా గొప్పగా, పాత్రని ఒక స్థాయికి తీసుకుని వెళ్ళేలా ఉంది. ఆండాళ్ళు తల్లిగా, ఒక స్త్రీగా కొడుకు తన నుంచి దూరం అయిపోతున్నాడని విలవిల్లాడినా సుదర్శనాచారి భార్యకు నచ్చచెప్పి ఒప్పించడం పాత్ర ఔచిత్యం కనిపిస్తుంది. ఈ నవల స్థూలంగా కథ ఇది.

చిన్నప్పటి నుంచి చెడు స్నేహాలతో వ్యసనాలకు అలవాటు పడి చదువు నిర్లక్షం చేసిన రాఘవాచార్యులు అనబడే ఒక గొప్పింటి కుర్రవాడు సత్ప్రవర్తన కల వాడిగా ఎలా మారాడు? అతను అలా మారడానికి దోహదం చేసిన మనుషులు, సంఘటనలు, అతన్ని మంచిగా మార్చుకోడంలో భార్య ప్రసన్న లక్ష్మి పాత్ర ఎంత, తల్లి పాత్ర ఎంత?, తండ్రి పాత్ర ఎంత? ఇలాంటి విషయాలు ఈ నవలలో చదువుతూ ఉంటే ముందు వ్యసనపరుడుగా ఉన్నవాడు. చివరికి ఎన్నో కష్టాలు, కలతలతో బాధపడుతూ తన దగ్గరకు వచ్చేవారికి హితవచనాలు చెప్పేంతగా ఎదిగే ఎన్నో పాత్రలు గుర్తుకు వస్తాయి. అందులో గుణనిధి బాగా గుర్తొస్తుంది. వాల్మీకిగా మారి మానవాళికి ఒక మహాగ్రంథం అందించిన వేటగాడు కూడా గుర్తుకు వస్తాడు.

ఒక దుర్మార్గుడు సన్మార్గుడిగా మారాలంటే అతనికి కావలసింది దండన కాదు, నీతులు బోధించే సూత్రాలు కాదు, అర్థం చేసుకుని ఆదరిస్తూనే జీవితం అంటే ఏమిటో తెలియచేసే తల్లి,తండ్రులు, సహచరులు. సుదర్శనాచారి కొడుకు ఎన్ని వెధవ పనులు చేసినా కఠినంగా దండించడం అనేది ఈ నవలలో ఎక్కడా కనిపించదు. చాలా చాకచక్యంగా, లౌక్యంగా, సున్నితంగా కొడుకుని ఒక దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అలాగే తన అమాయకమైన మాతృప్రేమతో కొడుకు మనసులో తన స్థానం పదిలంగా ఉంచుకుంది ఆండాళ్ళు. ఇక భార్య ప్రసన్నలక్ష్మి.. భర్త తన మాట వినలేదని, తనని స్వేచ్చగా తిరగనివ్వలేదని విడాకులు తీసుకుంటున్న ఈనాటి ఆధునిక యువతులు ప్రసన్నలక్ష్మిని చదివితే ఏమంటారో నాకు సందేహం. అంత సహనం, శాంతం మూర్తీభవించిన స్త్రీలు ఎవరన్నా ఉన్నారా ఈ రోజుల్లో. సుదీర్ఘమైన నిరీక్షణ ఆమెది, చిటికెడు ప్రేమకోసం సముద్రమంత సహనం ప్రదర్శించింది. చివరికి భర్తతో కలిసి జీవనం సాగించింది. ఒక సందర్భంలో ప్రసన్నలక్ష్మిని రచయిత్రి చంపేస్తారేమో అనుకున్నాను. ఎందుకంటే ఇలాంటి పాత్రలు అంతే! రాఘవాచారి లాంటి దారితప్పిన యువకులు మంచి మార్గంలో నడవడానికి వారిలో పరివర్తన కలిగించడంలో చాలా మంది రచయితలు భార్యనో, తల్లినో అకారణంగా చంపేయడం జరుగుతుంది. ఇందులో రచయిత్రి ఏ పాత్రను కూడా అకాల మరణానికి గురి చేయకుండా చాలా సహజంగా తనకి ఎదురైన అనేక దుస్సంఘటనలు ద్వారా పశ్చాత్తాపంతో రాఘవాచారి మారిపోడం చాలా హాయిగా ఉంది. ఈ కథ మొత్తం ఫ్లాష్‌బ్యాక్‌లో సాగింది. ప్రారంభంలో రాఘావాచార్యులవారి పరిచయం, వారి ఆశ్రమ జీవనం, ఆశ్రమం, వైష్ణవ ఆచారం మొదలైనవి ఎంతో చక్కగా వర్ణించి నవలని ప్రారంభం లోనే పాఠకులకు దగ్గరగా తీసుకుని వెళ్ళారు. ఈ నవలలో కొన్ని చాలా అమూల్యమైన వాక్యాలు ఉన్నాయి.

  • సుఖవంతమైన కాలమంటే రెండు దుఖాల మధ్య సమయం..
  • అప్పుడు ఏది చూసినా వెన్నెలే.. పాల వెల్లువే..
  • హృదయానికి అలజడినివ్వని జీవిక.
  • కాలం కన్నా గొప్ప వైద్యుడు లేడు కదా!
  • జ్ఞాపకాల దొంతరల సౌధాలు హృదయం మీద పెరుగుతూనే ఉంటాయి.

ఇలాంటి అమూల్యమైన వాక్యాలతో సాగిన ఈ నవల వైష్ణవుల జీవితాలను కళ్ళకు కట్టింది అనడంలో అతిశయోక్తి లేదు.

సంధ్య గారికి అభినందనలు.

***

కైంకర్యము (నవల)
రచన: సంధ్యా యల్లాప్రగడ
ప్రచురణ: అచ్చంగా తెలుగు
పేజీలు: 220
వెల: ₹ 200/-
ప్రతులకు:
అచ్చంగా తెలుగు, 8558899478 (వాట్సప్ మాత్రమే)
https://books.acchamgatelugu.com/product/kainkaryam/
https://www.amazon.in/dp/B0CJZ11PCL/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here