కైంకర్యము-1

    10
    10

    [box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి.  [/box]

    [dropcap]2[/dropcap]019 ఆషాఢం

    తెల్లవారటానికి, సూర్యుడుదయించటానికి ఇంకా సమయముంది. తూర్పున పెనుచీకటి నును తెలుపులోకి మారే ప్రయత్నంలో వుంది. పక్షులు నెమ్మదిగా నిద్ర లేస్తున్నట్లు అలికిడి. అక్కడో ఎక్కడో ఒక కోడి కూస్తోంది. కొబ్బరిచెట్లు మధ్య చిన్న చిన్న అలికిడులు…. పల్లె లేచే సందడి ఇంకా మొదలవలేదు. అలికిడి అక్కడక్కడా నెమ్మదిగా వుంది. చిక్కటి చలి నెమ్మదించింనా నులి చలి నిలిచే వుంది. ఆ నులి చలిలో వడి వడిగా వైనతేయ నది వైపుగా నడుస్తున్నారు రాఘవాచార్యులు.

    తెల్లవారకముందే నదిలో మునకలేసి ఆశ్రమము వైపు సాగిపోతారాయన. అది ఆయన దినచర్య. ఆనాడు కొంత ఆలస్యమయింది. రోజూలానే ప్రాతరిత్యాను సంధేయ శ్లోకాలు పలుకుతూ ఆ దేవదేవుని తలుస్తూ నదిని సమీపించారు. కేశవ నామాలతో మూడు మునకలూ వేసి, నదీమతల్లికి అర్ఘ్య వందనాలిచ్చి ఒడ్డుకు వచ్చారు. తడి పంచె తీసి పొడి పంచె కట్టుకొని, తడి పంచె పిండుకొని, భుజాన వేసుకొని దివ్య ప్రబంధములోని శ్లోకాలను వల్లె వేస్తూ ఆశ్రమము వైపుకు నడచారు.

    వైనతేయ నదికి అర మైలు దూరములోనే ఆయన ఉండే నారాయణాశ్రమము. అది పరమహంస పరివ్రాజకులైన యతివరేణ్యులు నారాయణదాసు ఆశ్రమము. నారాయణ యతివరేణ్యుల అంతేవాసిగా రాఘవాచార్యులు ఎంతో నిష్ఠాగరిష్ఠులు. అరవై సంవత్సరాలు ఈ మధ్యే నిండాయి రాఘవాచార్యులకు. పచ్చటి దబ్బపండు రంగులో ఆరు అడుగుల పైన ఎత్తులో ద్వాదశోర్ధ్వపుండ్రాలతో సదా ఆ శ్రీకృష్ణుని నామజపంతో పులకరించే ఆచార్యులను చూసిన వారు లేచి నమస్కరించటము సామాన్యము. ఆయన నడిచి వస్తుంటే ఆయన కళ్ళలో వెలుగు, శోభ ప్రస్ఫుఠంగా కనపడుతూ వుంటాయి. ఆయనను ఆశ్రమవాసులు ఆరాధనగా చూడటము సామాన్యమే. సన్యాసము తీసుకోలేదు కాని మానసికముగా పూర్ణ విరాగి ఆయన.

    ఆ విశాలమైన ఆశ్రమము వెనక భాగము ఉన్న గేటు వైనతేయ నది వైపుకు వుంటుంది. ఆచార్యులవారు గేటు తీసుకు లోపలికి వచ్చారు. ఆ గేటుకు అల్లంత దూరములోనే గోశాల. ఆయన అడుగుల సవ్వడికి కపిలగోవు గుర్తించింది కాబోలు. ‘అంబా’ అంటూ పలకరించింది. ఆయన తలవూపుతూ చిరునవ్వు పెదవుల మీద పుష్పించగా, పశ్చిమముగా సాగిపోయారు.

    ఎదురుగా రెండతస్తుల వేద పాఠశాల. విద్యార్థులు ఉదయమే వేదం వల్లె వేస్తున్నారు. లయ బద్ధంగా వినవస్తున్న ఆ ద్రవిడవేదము వింటూ ‘ఈ రోజు కొద్దిగా ఆలశ్యమైనది’ అనుకున్నారు. వేదపాఠశాలను దాటి మరింత ముందుకు వెడితే శ్రీ వేణుగోపాలుని గుడి. దేదీప్యమానముగా బంగారు శిఖరాలతో, ఆకాశానికి అంటే ధ్వజస్తంభముతో ఎత్తుగా నిలచి ఉంటుంది.

    గుడి జేగంటలు చేసే చిన్న సవ్వడి వింటూ, గుడి ప్రక్కగా తిరిగి వెనక వున్న కుటీరాల వైపు నడిచారాయన. అక్కడ చిన్న చిన్న కుటీరాల వంటి ఇళ్ళు వున్నాయి. అవి ఆశ్రమవాసుల ఇళ్ళు.  దారిలో నాలుగు తిరుత్తుళాయిలను (తులసీదళాలు), రెండు మందారాలు తుంపుకొని తిరుత్తుగ్రాయి(పూలసజ్జ) లో వేసుకు నడిచారు. గుడి ప్రక్కనే కాదు ఆశ్రమము నిండా పూల చెట్లు, ఫల వృక్షాలే. ఏ చెట్టు చూసినా నిండా పుష్పించి వుంటుంది.

    ఆయన భార్య ప్రసన్నలక్ష్మి. పేరుకు తగ్గట్లుగా ప్రసన్నంగా వుంటారామె. కాంతివంతముగా ఉన్నకళ్ళు, నుదుటి మీద శ్రీ చూర్ణ తిలకముతో, కళ్ళకు కాటుక, మెడలో పసుపుతాడు, బంగారు గొలుసు మెరుస్తూ ఉంటాయి. చెవులకు రవ్వల దుద్దులు, ముక్కుకు రవ్వ బులాకీ పోటి పడుతాయామెరుపులకు. చేతులకు బంగారు మట్టి గాజులు కలిపి వేసుకొని, కాళ్ళకు పసుపు పూసుకు వుండే ఆమె సదా నవ్వుతూ, మహాలక్ష్మిఅమ్మన్ ప్రతిరూపములా, ఆచార్యుల వారికి సరి అయిన జోడీ అన్నిట్లా అన్నట్లుగా వుంటుంది. ఆయన నది నుంచి వచ్చే లోపు ఇంటి ముందు చిన్న ముగ్గు వేసి, ఇంటిలోకి వెళ్ళి, తొమ్మిది గజాల సరిగంచు కంచి చీర గోచిపోసి మడిసై కట్టి, పెరుమాళ్ళుకు కైంకర్యాన్ని సిద్ధము చేస్తుంది. ఉదయము నుంచి భర్తకు సేవ చేస్తూ, పెరుమాళ్ళును మనస్సులో ఉంచుకు ధ్యానిస్తూ గడుపుతుంది. ఆశ్రమములో కావలసిన చోట పని అందుకుంటూ గడిపే ఆమెకు తీరిక దొరకటము మృగ్యమే.

    ఆయన వసారాలోకి వచ్చి అక్కడ వున్న బకెట్టులో తడి పంచె వుంచి లోపలికి నడిచారు. అవి రెండు గదుల చిన్న కుటీరము. ముందు గదిలో బల్లా, కుర్చీలు, మంచము వున్నాయి. వెనక వంటగది. అందులో ఆగ్నేయ మూల వంటకోసము వీలుగా సామాను సర్ది వుంది. ఈశాన్యమువైపు ఆచార్యుల వారి పెరుమాళ్ళు వున్న చిన్నకోయిలాళ్వారు (మందిరము) వున్నాయి. ఆయన చిన్న ఎర్రంచు పట్టు వస్త్రము కుచ్చిళ్ళు పోసి కట్టుకొని పెరునాళ్ళు తిరువారాధనకు ఉపక్రమించారు.

    ఆసనము పై కూర్చొని తిరుమడి పెట్టె తీసి అందులో నుంచి తిరుమణి (నాము సుద్ద)ని ఎడమ చేతిలోకి తీసుకొని తడి చేసుకొని కణికతో అద్దుకుంటూ “మధుసూదనాయ నమః” అని నుదురుతో మొదలు పెట్టి కేశవనామాలతో పలుకుతూ భుజాలకు, మెడకు, పొట్టకు నామం పెట్టుకున్నారు. నుదురు మీద ఎర్రటి శ్రీచూర్ణముతో తిలకం దిద్దుతూ “శ్రీ మహాలక్ష్యే నమః” అంటూ ఊర్ధ్వపుండ్రాలను పెట్టుకోవటం పూర్తిచేశారు. చేతిలో మిగుళ్ళని ముంజేతులపై పులుముకున్నారు.

    తిరువారాధన గుర్తుగా ముందుగా కరతాళత్రయం చేసారు. ముందున్న పెరుమాళ్ళు వంక ఆరాధనగా చూశారు ఆచార్యులు. ఆయన పెరుమాళ్ళు భూదేవీ, శ్రీదేవి సహిత అనంతుడు. కుడి వైపు గరుడాళ్వారు, విష్వక్సేనుడు. ఎడమ వైపు హనుమంతుల వారు పరాంకుశులు, రామానుజులు వారి ఆచార్యులు.

    ముందుగా శుభ్రమైన తిరువిళక్కును(దీపము) వెలిగించారు. తదనంతరము స్వామి పై నుంచి నిర్మాల్యము తీసి ప్రక్కన పెట్టి, సంధ్యావందన విధి చేసుకొని, మధురముగా విష్ణు సహస్రము పూర్తి చేశారు. ప్రసన్నలక్ష్మి ఇచ్చిన పదార్థాన్ని స్వామికి కైంకర్యముగా నివేదన చేసి పూజ ముగించారు.

    లేచి అంగవస్త్రము ధరించి కోవెలలో వేణుగోపాలుని ఆరాధనకు గుడి వైపు నడుస్తూ ద్వయ మంత్రము చదువుతూ వడివడిగా సాగారు.

    కోవెలలో ఆయన ప్రతి నిత్యము పల్లాండు, తిరుప్పడి, తిరువాచికం, తేవారం పాడుతూ వుంటారు. మార్గశిరము వచ్చిందంటే ఆశ్రమము తిరుప్పావైతో మారుమ్రోగుతుంది. మధురాతి మధురమైన కంఠముతో, హృద్యముగా ఆయన పాశురాలు గానము చేస్తూంటే ఆశ్రమము ఆనంద పారవశ్యములో పులకరించిపోతుంది. అవి ప్రక్కనే వున్న అప్పనపల్లికి మేలుకొలుపులయ్యేవి. ఆయన కోవెలలోని వేణుగోపాలునికే కాదు, తమ ఆచార్యులకూ శరణాగతి చేసిన ప్రపత్తినిష్ఠులు.

    (సశేషం)

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here