కైంకర్యము-17

0
12

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[dropcap]వా[/dropcap]సుదేవుడు ఆశ్రమములో నాలుగు రోజులు ఉన్నాడు.

అతనికి ఆరోగ్యం చిక్కిన తరువాత, అతనికి కొత్త వస్త్రాలను ఇచ్చారు. నారాయణ యతి అతనికి కొత్త చెప్పులు తెప్పించారు.

వాసుదేవుని హృదయం నిండింది. “సామీ నన్ను కనిపెట్టుకో. అనునిత్యం నీవు తప్ప నాకు మరొకటి తెలియదు…” చెప్పాడు భక్తితో.

అతనిని ఊరు వెళ్ళే బస్సు ఎక్కించారు ఆశ్రమవాసులు.

నిజమైన భక్తులకు నారాయణ యతి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవారు. భక్తుల ధనముతో భగవంతునికేమి పని?

***

ప్రతి ఉదయం తిరువారాధన తదనంతరం జరిగే తీర్థగోష్టికి ఎందరెందరో వచ్చేవారు. ముఖ్యంగా ఆరోగ్యం బాగా లేకపోతే నారాయణ యతి ఇచ్చే తీర్థం సేవిస్తే జబ్బులు తగుతాయని నమ్మకం ఉంది ప్రజలలో.

ఆ రోజు ఎప్పటిలాగానే జనులకు ఆయన తీర్థమిస్తున్నారు.

భక్తులలో ముగ్గురు భక్తులు కొద్దిగా కంగారుగా ఉన్నారు. వారికి నారాయణ యతి తీర్థమిచ్చి ఉండమన్నట్లుగా సైగచేసి తన ప్రక్కన ఉన్న అంతేవాసిని చూసి సైగచేశారు.

అంతేవాసి వేణుగోపాలుని సమర్పించిన చందనము, కొన్ని పూలు, పళ్ళు తెచ్చి ఇచ్చారు. వారు ముగ్గురు నారాయణ యతికి సాష్టాంగం చేసారు కన్నీరు మధ్య.

“ఇప్పుడు ఎక్కడికెళ్ళాలి మీరు?” అడిగారాయన.

“నాన్నను హైద్రాబాదులో ఉంచాం. అక్కడికే వెళ్ళాలి…” చెప్పాడు వారిలో ఒకతను.

“మంచిది వెళ్ళి రండి. అంతా సర్దుకుంటుంది…” అన్నారాయన.

వారు ముగ్గురు బయటికి అక్కడ ప్రసాదంగా ఇచ్చిన బాలభోగాన్ని స్వీకరించారు.

తరువాత వచ్చి వారి కారు ఎక్కి వెళ్ళిపోయారు.

వారి తండ్రి నారాయణ యతి భక్తుడు. ఆయన వ్యాపారి రాజమండ్రిలో. ఆయన ఒకరోజున ఉన్నట్లుండి తన దుకాణంలో పడిపోయారు. పిల్లలు ఆసుపత్రిలో చేర్చారు. డాక్టర్లు హైద్రాబాదు తీసుకుపొమ్మని, అక్కడ మెరుగైన సేవలు అందగలవని సలహా ఇచ్చారు. కానీ భక్తుడైన ఆయన మాత్రం తనని అప్పన్నపల్లెకు తీసుకుపొమ్మనాడు. ఆయనకు స్ఫృహ కూడా సరిగ్గా ఉండనందున, ఒక అంబులెన్స్‌లో హైద్రాబాదు పంపి, వారు అప్పన్నపల్లె వచ్చారు. వారు తీసుకున్న తీర్థం వారి తండ్రిగారికి ఆపరేషను ముందు ఇచ్చారు. ఆయన ఆపరేషను సక్రమంగా జరిగింది. తరువాత నెల రోజులకు ఆ భక్తుడు వచ్చి నారాయణ యతిని దర్శించి వెళ్ళాడు.

***.

నారాయణ యతి ఆశ్రమములో ప్రవచిస్తున్నారు. ఆనాటి విషయము ‘తిరుప్పావై’.

“నీలా తుంగస్తన గిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణమ్
పారార్థ్యం స్వం శ్రుతి శతశిరస్సిద్థ మధ్యాపయంతీ।
స్వోచ్ఛిష్ఠాయాం స్రజి నిగళితం యాబలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః॥”

“తిరుప్పావైని ఉపనిషత్తులతో సమానమైనది. గోదాదేవి రచించిన తిరుప్పావైని ‘గోదోపనిషత్‌’ అంటారు. ఇది పాశుర ప్రబంధంగా. వేదాలను, ఉపనిషత్తులను సూర్యాస్తమయం తరువాత చెప్పరు, అలానే తిరుప్పావైని రాత్రివేళ అనుసంధానించరు.

వేదాధ్యయనం ప్రణవోచ్చారణతో మొదలవుతుంది, ప్రణవోచ్చారణతో ముగుస్తుంది. ‘ద్రవిడ వేదం’గా పూజలందుకున్న ఆళ్వారుల చతుస్సాహస్రి [నాలాయిర (4 వేల) దివ్యప్రబంధం] తిరుప్పావైతో మొదలవుతుంది, తిరుప్పావైతో ముగుస్తుంది (శాత్తుమురై). తిరుప్పావై సాక్షాత్తూ ప్రణవమే. సంస్కృత వేదాలు యోగ్యులకే తప్ప అందరికీ అందుబాటులో ఉండవు. ద్రావిడ ప్రబంధాలు అంటే ఆళ్వారుల అనుభవసారమైన 4 వేల తమిళ పాశురాలను వర్ణభేదం లేకుండా చాతుర్వర్ణాల వారెవరైనా చేసుకోవచ్చు. అందరికీ వాటిపైన సమానాధికారం ఉంటుంది. ప్రత్యేకించి ‘తిరుప్పావై’ అందరిదీ!

వేదం చెప్పిందే సరళ పదాలలో, సామాన్యుల భాషలో తిరుప్పావై బోధిస్తుంది. హిందూ ధర్మం దైనందిన జీవితంలో హరి నామస్మరణ ప్రాముఖ్యాన్ని ప్రబోధిస్తుంది. నిద్ర లేవగానే హరిని స్మరిస్తాం. నడయాడేటప్పుడు కేశవుని తలచుకుంటాం. భోజన సమయంలో గోవిందుని మననం చేసుకుంటాం. ఆపైన మాధవుని మనసులో నిలుపుకొని నిద్రిస్తాం. ఈ అనుష్ఠాన ధర్మాలను అదే క్రమంలో ఆండాళ్‌ తన

తిరుప్పావైలో మృదుమధురంగా పేర్కొంది.

తిరుప్పావై జీవుని – పరమాత్మకు అనుసంధానపరిచే వేదం. తిరుప్పావై అంటే గోపికలు కృష్ణుని పొందడానికి చేసిన వ్రతం గురించిన కథ మాత్రమే కాదు. వ్రతకథకు అతీతంగా వేదంలో ప్రతిపాదించిన సిద్ధాంతాలనూ, ఇతిహాస, తాత్త్విక పురాణాలనూ ఇది తనలో ఇముడ్చుకుంది. ఆండాళ్‌ తిరుప్పావైలో వేదాంత విషయాలెన్నిటినో మధురంగా, సరళంగా తన సహజ శైలిలో ప్రస్తావించింది. యుగాల నుంచి తిరుప్పావై వేదాలన్నిటికీ బీజంగా పూజలందుకుంటోంది.

తిరుప్పావైని మార్గళి వ్రతముగా స్థిరపడింది. ఈ మార్గశిరమున ఈ తిరుప్పావైని అనుసంధానపరుచుకొని గోదా దేవినీ పూజిస్తే సర్వ పురుషార్థాలు లభ్యమవుతాయి.

నేటి నుంచి తిరుప్పావై నేర్చుకోవాలనుకునేవారు ఆశ్రమములో తరగతులలో నేర్చుకోండి. ఈ ధనుర్మాసం అందరం కలిసి ఆండాళ్‌ తల్లిని కొలుద్దాం” అని ముగించారు నారాయణ యతి.

***.

నారాయణ యతి కూర్చొని ఉన్నారు. భక్తులు తన సందేహాలను తీర్చుకుంటున్నారు.

అందులో కొందరు విదేశాల నుంచి వచ్చిన వారు. వారు నారాయణ యతి వద్దకు వచ్చి, “స్వామిగళ్! ఉపనయనం అయిన బ్రాహ్మణులు విదేశాలకు వెళ్ళి వస్తే ప్రాయశ్చిత్తము చేసుకోవాలా?” అని అడిగారు.

ఆ రోజులలో (1970 దశకాలలో) విదేశాలకు వెళ్ళిన వారు తిరిగి వచ్చి రామేశ్వరం వద్ద సేతుస్నానం చేసి వచ్చేవారు.

అడిగిన భక్తునికి సమాధానం ఇవ్వకుండా, నారాయణ యతి వారిని ఇలా ప్రశ్నించాడు “భారతదేశంలో ఎన్ని రామాయణాలు ఉన్నవి?”

“దాదాపు 300 ఉండవచ్చు స్వామిగళ్…”

“రాముడు లంకకు వెళ్ళాడు. తిరిగి అయోధ్యకు ఎలా వచ్చాడు?”

“పుష్పకవిమానంలో స్వామిగళ్…”

“రాముడు విదేశీయానం చేసాడన్నమాట…చోళదేశపు రాజు కాంబోడియాలో దేవాలయం కట్టించాడు. తెలుసునా?”

“చూశాము స్వామిగళ్…”

“అంటే వారూ విదేశీయానం చేశారు కదా… మరి ప్రాయశ్చిత్తం చేసుకొని ఉన్నారా?”

“తెలియదు స్వామిగళ్…”

“సరే. విషయమేమంటే మన శాస్త్రాల ప్రకారం వరుసగా ఎవరైనా తన నిత్యకర్మానుష్ఠానం మూడు రోజులు చేసుకోపోతే వారు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆ రోజులలో అందరూ నిత్యకర్మను చేసుకునేవారు. అందుకే వరుసగా మూడు రోజులు చెయ్యకుండా ఉండేవారు కారు. నిత్యకర్మలకు ప్రవహించే నీరు కావాలి. ఓడలలో వెడితే దొరకదు కాబట్టి విదేశీయానం చేసేవారు కారు. ఇప్పుడు నిత్యకర్మలను ఎంత మంది చేస్తున్నారో వాళ్ళకు వారే ఆలోచించుకోవాలి…” అంటూ వివరించారు యతివరేణ్యులు.

మిన్నకున్నారు భక్తులు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here