కైంకర్యము-19

0
11

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[dropcap]“శ్రీ [/dropcap]విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం
శ్రీ రంగరాజ హరిచందన యోగదృశ్యాం
సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం
గోదామనన్య శరణం శరణం ప్రపద్యే”

రాగయుక్తంగా శ్లోకాలు పాడుతూ గోదాదేవిని పూజిస్తోంది ఆండాళ్ళు.

మరుసటి రోజు నుంచే మార్గళి ప్రారంభమవుతుంది. ఈసారి గోదాదేవి అలంకారం ఎలా చెయ్యాలా అని ఆలోచనతో ఉందామె.

ఇంతలో హాలు లోంచి పిలుపు వినవచ్చింది,

“అమ్మాయి! ఆండాళ్ళూ! ఎక్కడా?” అంటూ.

ఆ పిలుపు వినగానే చేస్తున్న పూజ ఆపి టక్కున బయటకొచ్చింది ఆండాళ్ళు.

వచ్చింది ఆమె అన్న రంగరాజన్.

రంగరాజన్‌ని చూడగానే సంప్రదాయ శ్రీవైష్ణవ రూపములో మరో విష్ణువులా, చూసేవారు తిరిగి చూసేలా ఉంటాడు. ఎత్తుగా ఉండి, తిరునామాలతో వెలుగుతూ ఉంటాడాయన. నేతపంచె కట్టుకొని, పైన లాల్చీ వేసుకున్నాడు. దానిపైన అంగవస్త్రం. రంగరాజన్ వేదం చదువుకొని వారి వంశపారపర్యంగా వస్తున్న దేవాలయ అర్చకత్వం నిర్వహిస్తు ఉంటాడు పాలెంలో.

ఆయనకు ఇద్దరు అబ్బాయిలు, ఇంగ్లీషు చదువులు చదివి అర్చకత్వం వదిలేశారు. వారున్న టౌనులో వైశ్యులు ఆ దేవాలయాలని బాగా చూసుకుంటారు. పైపెచ్చు రంగరాజన్‌కు ఐదెకరాల పొలం ఉంది. అందులో జొన్నలు, మినుములు పండుతాయి.

ఆయనకు తమ్ములిద్దరు కాక చెల్లి ఆండాళ్ళు ఒక్కతే.

ఈ మధ్య ఆయన పట్నంకు కోర్టు పనుల మీద వచ్చిపోతున్నాడు. అలా వచ్చినప్పుడు చెల్లి ఇంటికి ఉదయమే వచ్చి బావగారితో కలిసి కోర్టుకెళ్ళి, పని ముగిసిన తరువాత అటు నుంచి ఊరికెళ్ళిపోతాడు.

ధనుర్మాసం ముందు రోజు ఆయన ఈ కోర్టు పని మీదనే తప్పక రావలసి వచ్చి ఇలా వచ్చాడు.

అన్నగారిని చూచి వెలిగిపోతున్న ముఖంతో ఎదురెళ్ళింది ఆండాళ్ళు. అన్న వెనకే తోటమాలి చేతిలో సంచి చూస్తూ “ఏంటి ఇది” అంటూ “అన్నా! సౌఖ్యమా? వదిన బావుందా?” అంటూ అడిగింది.

“అంతా బాగున్నారమ్మా. జొన్నలు కొత్త పంట వచ్చింది తెచ్చానమ్మా!” అన్నాడాయన.

“స్నానం చెయి. కాఫీ తాగి, టిఫిను తిందువు గాని,” అంటూ “నాగన్నా, అవి స్టోర్ రూములో ఉంచు…” అన్నది.

ఉదయమే రంగరాజన్ తన స్నానపానాదులు ముగిసినా, బస్సులో వచ్చాడు కాబట్టి మళ్ళీ స్నానం చేస్తాడు. ఆమెకు తెలుసు అన్న విషయం.

ఆ ఏర్పాటు తరువాత ఆమె తన పూజ కానిచ్చింది గబగబా. అందరిని ఉపాహారానికి రమ్మని పిలిచింది.

వంటగది బయట ఉన్న బల్ల వద్ద కూర్చున్నారు సుదర్శనాచారి, రాఘవ, రంగరాజన్.

టిఫిను తిని, ఫిల్టరు కాఫీ త్రాగుతూ మాట్లాడుకుంటున్నారు.

“ఎలా ఉన్నాయి ఊర్లో సంగతులు?” అడిగాడు సుదర్శనాచారి.

“అన్నీ మాములే బావగారు. రేపటి నుంచి హడావిడి కదా! కదలలేము ఇక సంక్రాంతి వరకూ…”

“ఏరా రాఘవా? ఏం చేస్తున్నావు ఇప్పుడు?” అంటూ మేనల్లుడిని అడిగాడు.

రాఘవ చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు.

సుదర్శనాచారి గట్టిగా, “చెప్పవేంటిరా మామయ్య అడుగుతుంటే? వాడు ఆఫీసులో అసిస్టెంటులా పని చేస్తున్నాడు బావా. లాయరీ చదవాలిగా మునుముందు…”

“అయితే ట్రయినింగు మొదలెట్టారు బావగారు…” చిరునవ్వుతో అన్నాడు రంగరాజన్.

“ఏం ట్రయినింగోలే బావా. చూడాలి వీడెంత ఘనకార్యాలు చేస్తాడో…”

ఇంతలో పెద్దావిడ వచ్చి “మా పిల్లాడు కాకపోతే ఎవరు చేస్తారు ఘనకార్యాలు. మా నాయన బుద్దిమంతుడు బాబూ. ఈ రోజుకూ సంధ్య వార్చకుండా గంగ ముట్టడు…” అంది ఉన్నవి లేనివీ చెబుతూ మనమడిని వెనకేసుకోస్తూ.

“అబ్బబ్బా! నీ మనమడిని ఇప్పుడెవ్వరూ ఏమీ అనలేదులే పిన్నీ…” అన్నాడు సుదర్శనాచారి.

సంభాషణను మరలిస్తూ రంగరాజన్, “మీరూ, చెల్లాయి ఈసారి పండగకు తప్పక రావాలి. చాలా కాలమయింది వచ్చి మీరసలు…” అన్నాడు.

“మీ చెల్లాయిని తీసుకుపో బావా. నాకు కుదరదు…”

“ఇప్పుడు నేను ఆండాళ్ళును తీసుకుపోతాను. మీరు పండక్కి రండి బావగారు. నేను దాని తీసుకుపోవటానికే వచ్చానసలు…”

“తను వస్తే తీసుకుపో, నాకభ్యంతరం లేదు…”

“సరే. ఆ మాట మీదే ఉండండి. ఆండాళ్ళు సర్దుకో. సాయంత్రం బస్సుకు వెడదాం…”

ఆండాళ్ళు నవ్వి “భలే బావుంది. నే వచ్చేస్తే అత్తయ్యో మరి? చంటి ఇంట్లోనే ఉన్నాడు. నాకెక్కడ కుదురుతుందన్నయ్యా?”

“ఏవో ఏర్పాట్లు చూసి రామ్మా! నీవు వచ్చి చాలా కాలమయింది. మన కోవెలలో కూడా రాములవారున్నారు. ఆయన్ని నీవు మర్చిపోయావు కానీ…”

“భలే వాడివి అన్నయ్యా! రాముడ్ని నేనెందుకు మరుస్తా. అత్తయ్య పెద్దావిడ చూసుకోవాలని…”

“అత్తయ్యనీ తీసుకుపోదాం. మన కోవెలలో ఇప్పుడు నెత్తికెత్తుకునేటన్ని కార్యక్రమాలు సాగుతున్నాయి. వాటిని చూసుకుంటుంది అత్తయ్య. ఏం అత్తయ్య ఏమంటావు?”

“నా వల్ల ఏమౌతుందిరా? మీరు వెళ్ళండి. నేను పండుగ రోజుకు సుదర్శనంతో కలసి వస్తాను…”

“సరే. అన్నీ తీరాయి, నీవు బయలుదేరమ్మాయి సాయంత్రం…”

“ఉండన్నయ్య. మరి పిల్లాడ్ని ఏం చెయ్యమంటావు?”

“ ఒరే రాఘవా…నీవు అమ్మతో వచ్చేయి. ఈ పది రోజులూ ఉండండి చక్కగా…”

“ఆ మామయ్య! నాకు పని ఉంది ఇక్కడ…అమ్మా! నీవు వెళ్ళు… నేనూ నాన్నమ్మతో వస్తాను…” నాన్చాడు రాఘవ.

ఇదంతా చూస్తున్న సుదర్శనాచారి, “ఆండాళ్ళు! నీవు వెళ్ళు. చాలా రోజుల నుంచి ఎటూ వెళ్ళలేదు కూడా. మీ పుట్టింట్లో నాలుగురోజులు ఉండిరా. పిన్ని, నేను ఉంటాము. నేను మూర్తిగారికి చెబుతా భోజనం సంగతి చూడమని…” అంటూ రాఘవతో “రాఘవా! అమ్మని మామ్మయ్యని పాలెంలో దింపి రా. రెండు రోజులు ఉండు అక్కడ. అది మీ మామయ్య ఇల్లే…” అన్నాడు తీర్మానిస్తూ. “పండక్కి నేనూ పిన్నితో బయలుదేరి వస్తాను…” అన్నాడు ముక్తాయింపుగా.

దాంతో ఆండాళ్ళు ప్రయాణం ఖరారు అయింది.

***

ఆండాళ్ళు మళ్ళీ పెద్దావిడి రమ్మనమని బ్రతిమిలాడింది.

“రా అత్తయ్య! అక్కడ ఇబ్బంది కలగకుండా నే చూసుకుంటాగా…”

“కాదులేవే! నీవు వెళ్ళు. పండక్కి వస్తానంటికదా. నీవూ లేక, నేనే లేకపోతే పిల్లాడి దారి పిల్లాడు, సుదర్శం దారి వాడిదిగా ఉంటారు. నేనుంటే కనీసం నా కోసం అయినా కొంప చేరుతారు. నీవు చక్కగా ఈ నెళ్ళాళ్ళు గోదాతల్లి వత్రం చేసుకో. ఇక్కడ నేనూ చేయిస్తాలే. మన గోపాలాన్ని పిలువు. రోజూ వచ్చి పెరుమాళ్ళుకు అర్చన చేసి పోతాడు. మూర్తిని పిలువు. మడితో వండి పెరుమాళ్ళుకు నివేదించి నాకు వడ్డించి పోతాడు…” చెప్పిందామె.

“వినవు కదా అత్తయ్యా, రమ్మనంటేనూ. ఏదో చెబుతావు…”

“నీవు లేక పోతే నాకు తోస్తుందటే. అదీ గాక అక్కడకొచ్చి నా గురించి నీకు హైరానా ఎందుకు? చక్కగా ఈ నెల్లాళ్ళు గడుపు…” సర్దిచెప్పిందావిడ.

ఆండాళ్ళు వంట మూర్తి గారికి, బ్రహ్మచారి గోపాలానికి కబురు చేసింది.

వాళ్ళు మరుసటి రోజు నుంచి చెయ్యవలసినవి వివరించిదామె.

ఆ సాయంత్రం రాఘవ కారు నడుపుతుండగా రంగరాజన్, ఆండాళ్ళుతో కలసి వారి టౌను పాలం వైపుకు సాగిపోయారు.

వాళ్ళు వెళ్ళగానే పెద్దావిడకు, సుదర్శనానికీ ఇల్లంతా బోసి పోయినట్లుయింది.

ఆండాళ్ళు ఆ ఇంటి గృహలక్ష్మి. నిండుకుండ అనుకున్నారిద్దరూ.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here