కైంకర్యము-22

0
12

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[dropcap]ఆ [/dropcap]మరుసటి రోజు ఆండాళ్ళుతో చెప్పింది వల్లి.

“మీ రాజన్నయ్యకు ఇష్టం ఉండదు కానీ వారింటికి నెలకు కొంత వెచ్చాలవీ పంపుతూ ఉంటాము. మీ సీత వదిన ఆ సీతా మహాసాధ్వినే అనుకో. లోపల ఎంత జరుగుబాటు కాకున్నా ఏనాడు ఒక్క మాటా చెప్పదు. ఆ మగపిల్లలు అంతే, ఆ ఆడపిల్లా అంతే. మన కోవెల అర్చకత్వం మన అబ్బాయిలు తీసుకోకపోయినా మీ అన్నయ్య ధైర్యం రాజన్న కొడుకులలో ఒకడికివ్వాలని, ఈ దేవాలయాన్ని చూడమని…”

“అవునా! చాలా కాలమయింది వీళ్ళ సంగతులేవీ నాకు తెలియవు…” అంది ఆండాళ్ళు అపరాధనా భావంతో.

“నీకెలా తెలుస్తాయి ఆండాళ్ళూ. నీవేమో హైద్రాబాదులో ఉంటివి. ఎప్పుడైనా వచ్చినా ఒక పూటలో వెళ్ళిపోవటం. ఏ కళనున్నాడో కాని మీ ఆయన ఇన్నాళ్ళకు నిన్ను వెళ్ళనిచ్చాడు కానీ…” అంది వల్లి.

“అవును…” అంది ఆండాళ్ళు ఆలోచనగా.

“ఆ పిల్లనెవరు చేసుకుంటారో గాని చిదిమి దీపం పెట్టవచ్చు. అంత అణుకువ, అంత వినయం చూసావుగా! నోట్లో నాలుక లేదమ్మా!” అంది వల్లి.

మౌనంగా వింటూ తల ఊపింది ఆండాళ్ళు. వాళ్ళ అబ్బాయికి చేసుకోమనటానికి వల్లికి నోరు రాలేదు. అంత ధనవంతులు ఇంత కూటికి గుడ్డుకు తడుముకునే వారిని చేసుకుంటారా అని. దానికి తోడు అప్పటి వరకూ వారింటికి వచ్చిన కోడళ్ళు బాగా డబ్బున్న వారింటి పిల్లలే.

ఆండాళ్ళుకు మనసులో కోరిక కలిగినా కుదరదని అనుకొని ఆ ఆలోచనను త్రుంచివేసింది.

***

నాలుగు రోజుల తరువాత రాజన్న దంపతులు వచ్చారు ఆండాళ్ళును చూసి పోవటానికి. ఆండాళ్ళు సంతోషించింది వారిని చూచి.

“ఏవమ్మా! ఎలా ఉన్నావు? బావగారు రాలేదా?” అంటూ పలకరించాడు రాజన్న.

ఆయన దుస్తులలో బీదరికం కనిపిస్తోంది. ముఖంలో మాత్రం బ్రహ్మవర్చస్సు. ఎవరన్నా మాట్లాడగలరా ఈయన ముందు అనుకున్నది ఆండాళ్ళు ఆయనను చూచి.

వచ్చి పాదాలంటి నమస్కరించిన ఆండాళ్ళుని “అఖండ శ్రీరస్తు!” అని దీవించాడు రాజన్న.

వారి రాకకు రంగరాజన్ చాలా ఆనందపడ్డాడు. రాజన్న ఒకపట్టాన ఎక్కడికి రాడు మరి.

వారిరువురూ వేదగోష్ఠి మొదలుపెట్టారు.

“రా వదినా!” అంటూ ఆయన భార్య సీతను లోపలికి తీసుకువెళ్ళింది.

“పిల్లలంతా బావున్నారా ఆండాళ్ళు?” యోగక్షేమాలు విచారిస్తున్నట్లుగా అడిగింది సీత.

తల ఊపుతూ “అంతా క్షేమం వదినా. మొన్న పాపను చూశాను…” అన్నది ఆండాళ్ళు.

“అది చెప్పింది. పెద్ద పెద్ద కళ్ళతో అత్తయ్య ఎంత బావుందో అని…” నవ్వుతూ అంది సీత.

“దానికి మాత్రం తక్కువా? దానివీ పెద్ద కళ్ళేగా. పైగా బుగ్గన సొట్ట. దాన్ని చూస్తుంటే గోదాతల్లిని చూచినట్లే ఉంది వదినా…”

“దాని చూస్తూంటే నీ పెళ్ళప్పుడు నీవు అలానే ఉండేదానివనిపిస్తుంది. దానికి మేనత్త పోలిక వచ్చిందే ఆండాళ్ళు” నవ్వుతూ అన్నది వల్లి.

“అన్నయ్య ఏమైనా మారాడా వదినా?”

“ఆయన వ్రతమది. మారాలని ఎందుకు కోరటం? మనం అనుసరించాలి అటువంటి పుణ్యాత్ములను…” అన్నది సీత.

“అన్నయ్యకు తగ్గదానివి వదినా. అవును అంతటి నిష్ఠకు ఎంతటి దృఢసంకల్పం కావాలి. పైగా నీవంటి ఉత్తమురాలి సాంగత్యం. అన్నయ్య అదృష్టం…” మనస్ఫూర్తిగా అంది ఆండాళ్ళు.

ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ కాలం ఇట్టే గడిచింది. సాయంత్రం పెరుమాళ్ళు సేవకు ఆలశ్యమవుతుందని బయలుదేరారు ఇద్దరూ. వారు భోజనం చెయ్యరు ఎక్కడా.

ఇద్దరికీ బట్టలు పెట్టింది ఆండాళ్ళు.

రాజన్న తీసుకోలేదు. సీత చేతికిచ్చింది. ఆయన నిష్ఠ, ఎవ్వరి వద్దా ఏదీ పుచ్చుకోరు. ఇచ్చే వారి కర్మలు పుచ్చుకునే వారికి బదిలీ అవుతాయని చెబుతాడు రాజన్న. నిష్కామకర్మలు చెయ్యాలి. దానధర్మాలు పుచ్చుకోకూడదు. పరుల ఇంట భోజనం చెయ్యకూడదు. చెట్టు పండైనా సరే పక్వానికొచ్చి క్రింద పడితే తప్ప తీసుకోకూడదన్న ఆచారం ఆయనది. సత్యాన్ని, ధర్మాన్ని నమ్మి జీవిస్తే అవి ముందుకు తీసుకుపోతాయని చెబుతాడు రాజన్న.

సీత కూడా అంతే కానీ, ఆడపడుచు వరస అయిన ఆండాళ్ళు ఇస్తుంటే కాదనలేకపోయింది.

వాళ్ళు వెళ్ళాక వల్లితో “రాజన్నకు మహారాజు వంటి అల్లుడే వస్తాడు. ఆయన ధర్మనియతి అటు వంటిది వదినా…” అన్నది ఆండాళ్లు. తల ఊపింది వల్లి అవునన్నట్లుగా.

***

భోగి నాటికి సుదర్శనాచారి వచ్చేశాడు. ఆయనతో పెద్దావిడా, రాఘవ కూడా.

కోవెలలో సంక్రాంతి నాడు గోదా రంగనాథుని కల్యాణం. దేవుని పెళ్ళంటే అంగరంగ వైభోగమే.

కోవెల చుట్టూ పందిళ్ళు. ఆ రోజు ముందు వేద పఠనం, అనంతరం కల్యాణం, విందు. ఊరంతా అక్కడే ఉన్నారు. రంగవల్లులు, గంగిరెద్దులు, సన్నాయిలు, హరిదాసులు ఒకటేమిటి… పండగంటే పల్లెలలో చూడాలి. నగరాలలో ఏమీ ఉండదు.

చాన్నాళ్ళ తరువాత సుదర్శనాచారి కుటుంబం పండుగను వైభవంగా జరుపుకున్నారు. ఆండాళ్ళుతో కలసి ఆయన దేవుడి పెళ్ళిలో పాల్గొన్నాడు.

కనుము నాడు గారెలు తిని ముక్కనుము నాడు నగరానికి బయలుదేరారు.

వల్లి ఆడబడుచుకు వడిబియ్యం ఇచ్చింది. శ్రీవైష్ణవులలో ఆ పద్ధతి పాటించరు కానీ, ఆమె ఎంతో కాలంగా అక్కడ ఉండబట్టి వారి ఆచారమైన వడిబియ్యం ఇస్తుంది.

ఈ వడిబియ్యం తెలంగాణాలో ఆడపిల్లలు పుట్టింటి నుంచి వెళ్ళేటప్పుడు తల్లిగారింటి వైపు వారు ఇస్తారు. కొంగులో బియ్యం పోసి, ఐదు రకాల స్వీట్లు ఇస్తారు. అలా ఆమెకు సారె ఇచ్చి పంపింది. అరిసెలు చలిమిడి, కొత్త బట్టలు, చెరుకు గడలు, బెల్లం ఇత్యాదివితో పాటు పొలంలో పండిన మినుములు, కూరగాయలు కూడా కారులో నింపారు. అన్నింటితో పాటు చాలా కాలం తరువాత పుట్టింటికి వచ్చినందుకు, తిరిగి వెడుతుంటే ఆండాళ్లుకు దుఃఖం కలిగింది.

ఆడపిల్లలు ఎన్నాళ్ళు పుట్టింట్లో ఉన్నా విసుగురాదు కదా. స్త్రీకి ఎంత వయస్సు వచ్చినా, ఆమె తల్లిగారింటికో, తోబుట్టువుల వద్దకో వచ్చినప్పుడు తిరిగి బాల్యం లోకి వెళ్ళిపోతుంది.

వెనక్కు తన సొంత ఇంటికి వెడుతున్నా గుండె భారమైయింది ఆమెకు.

ఆ విషయం అక్కడ అందరూ గ్రహించారు.

వల్లి, రంగరాజన్‌ల వద్ద సెలవు తీసుకొని హైద్రాబాదు వైపు కారు కదిలింది.

***

హైద్రాబాదు వచ్చినా ఆండాళ్లుకు కొంత సమయం పట్టింది మామూలు స్థితిలోకి రావటానికి.

ఆమె తన భాగవత పారాయణంలో తిరిగి నిమగ్నమయింది.

అయినా అప్పుడప్పుడు కళ్ళ ముందు ఘనాపాఠి అయిన రాజన్న, చుక్కలాంటి ఆయన కూతురు సృతిపథంలో మెదిలేవాళ్ళు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here