కైంకర్యము-25

0
9

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[dropcap]రా[/dropcap]ఘవ మరుసటి రోజు నెమ్మదిగా లేచి కాలేజీకి బయలుదేరాడు. ఆ కాలేజీ, హాస్టలు అన్నీ అదే కాంపౌండులో ఉన్నాయి.

తరగతి వెతుకుతూ నడుస్తున్నాడు రాఘవ.

వెనకగా “హలో!” అన్న మాట వినపడి వెనక్కు తిరిగాడు.

తన వయస్సే ఉన్న ఒక కుర్రాడు జీన్స్ ప్యాంటు పసుపు చొక్కాలో ఉన్నాడు. అతని చేతులలో కీస్ గిర్రున తిప్పుతూ నోట్లో బబుల్‌గమ్ నములుతూ కొద్దిగా నిర్లక్ష్యంగా ఉన్న కుర్రాడు.

కళ్ళు ఎగరేసాడు ఏం అన్నట్లుగా.

“ఎంబిఎ ఫస్టు యియర్ క్లాస్ కిదర్” అన్నాడు అతను.

“తెలీదు” చెప్పాడు రాఘవ

“నువ్వు ఇక్కడ స్టూడెంటు కాదా?”

“స్టూడెంట్‌నే. మొదటి రోజు. క్లాసురూముకై వెతుక్కుంటున్నా”

“వావ్. నేను అంతే. నా పేరు రాకేష్. నీ పేరు? ఎక్కడ్నుంచి వచ్చావు?”

“హైద్రాబాదు!”

“నేను అహ్మదాబాదు!” చెప్పాడతను.

ఇద్దరూ మాట్లాడుతూ రూము వెతుక్కొని వెళ్ళారు.

అక్కడ వీళ్ళలాంటి వారే కొందరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు.

అందరూ ఒకరిని ఒకరు పరిచయం చేసుకున్నారు.

అందరూ దాదాపు రాఘవలానే ధనవంతులైన తండ్రులు ఉన్నవారు.

ఆ రోజు అక్కడ పరిస్థితికి అలవాటు పడేసరికే అందరికి అలసట వచ్చింది.

వాళ్ళలో ఒకడు “పదండిరా. మనం అలా బారు వరకు వెళ్ళి చల్లగా బీరు కొట్టి వద్దాం…” అన్నాడు.

“హస్టల్‌లో కర్ఫ్యూ ఉంటది…” ఎవరో అన్నారు.

“పదింటి లోపల వచ్చేదాం పదండి…”

“మనకు బండి లేదురా…”

“రాకేష్ గాడి కారుంది…”

పది మంది పొలోమంటూ ఆ ఫియట్ కారులో ఇరుక్కొని ఊర్లో బారు వెతుక్కొని వెళ్ళారు.

అందరూ గోలగోలగా అల్లరల్లరిగా ఉన్నారు.

కొత్త స్నేహాలు, కొత్త మాటలు. మరో ప్రపంచం వాళ్ళందరికీ ఆవిష్కరించబడుతోంది.

“నేను లేకుండా మీరింత ఫన్ చేసుకుంటున్నారా?” అన్న ఒక స్త్రీ కంఠం వినిపించింది.

అందరూ తల త్రిప్పి అటు చూశారు.

బాబ్ హెయిర్, జీన్స్, పూల అంగీ, మెరిసే చిన్న కళ్ళు, నవ్వితే పన్ను మీద పన్ను తళుక్కున మెరుస్తున్న ఒక యువతి.

రాకేష్ లేచి వచ్చి వాటేసుకున్నాడు. “నాటెటాల్…” అంటూ.

అందరి వైపు చూస్తూ “తను విద్య. నా ఫ్రెండు. మన క్లాసే. ఈ రోజు నుంచి మన గ్యాంగు కూడా…” అన్నాడు.

విద్య అందరికీ కలిపి ఓ హల్లో వేసుకొని ఒక కుర్చీలో సెటిల్ అయింది.

ఆమె వాళ్ళతో సమంగా సిగరెట్లు ఊదేస్తూ, బీరు త్రాగుతూ ఉంటే రాఘవకే కాదు మరికొందరికీ వింతగా ఉంది.

విద్య నవ్వుతూ “మరీ అంతలా వింతగా చూడకండి. మా క్యాంపస్‌లో ఇది మాములే…” అంది.

“ఏ క్యాంపస్ మీది?” అన్నాడు రాఘవ.

“ఢిల్లీ యూనివర్సిటీ” చెప్పిందామె.

‘ఓ ఈవిడ ఢిల్లీనా. అందుకే మస్త్ ఫాస్టుగుంది’ అనుకున్నాడు రాఘవ.

అతనికి మిత్రులతో కలిసి తిరగటం త్రాగటం అలవాటే గాని ఇలా ఒక అమ్మాయి కూడా వాళ్ళలో ఉండటం కొత్తగా, కాస్త ఇబ్బందిగా అనిపించింది.

కాని మిత్రులందరూ చాలా త్వరగానే విద్యకు అలవాటు పడిపోయారు. అందుకు కారణం విద్య తనో ఆడపిల్లను మీరంతా దూరం అన్నట్లుగా ఉండదు. ఆమె వాళ్ళతో చాలా సహజంగా మరో ఫ్రెండులా ఉంటుంది.

అలా ఆ పది మంది ఎప్పుడూ చూసినా తిరుగుడు, ఆటలు పాటలతో గడిపేస్తున్నారు.

వాళ్ళు పూనే కొచ్చిన కారణం ఎవరికీ గుర్తు ఉన్నట్లుగా కూడా లేదు.

***

ఆండాళ్ళు కళ్ళు తిరిగి పడి ఉండటం చూసి పెద్దావిడ నాగన్నతో డాక్టరుకు కబురు పంపింది. సుదర్శనాచార్యులుని పిలవమని చెప్పింది.

డాక్టరు వచ్చే సమయానికి సుదర్శనాచారి కూడా వచ్చేశాడు ఇంటికి.

‘ఇంటి వద్ద మరో కారు మరో డ్రైవర్‌ని ఉంచటం ఎంత నయమైయిందో’ అనుకున్నాడు మనసులో.

డాక్టరు పరీక్ష చేసి సుదర్శనాచారితో “ఆమెకు మైల్డుగా స్ట్రోకు వచ్చింది. బిపి ఇంకా నార్మల్‌గా లేదు. ఆందోళన కలిగించే మాటలు చెప్పకండి. భారీ పనులు గట్రా కూడా చేయించకండి…” అన్నాడు మందుల చీటీ రాస్తూ.

సుదర్శనాచారి తలఊపాడు మానంగా.

ఆయనకు ఆండాళ్ళు ఆరోగ్యం గురించి బెంగగా ఉన్నా ఆమె హృద్రోగం తెచ్చిపెట్టుకుంటుదని అనుకోలేదు.

డాక్టరు వెళ్ళిపోయాక పెద్దావిడ వచ్చి “ఏం అంటున్నాడు డాక్టరు?” అంది

“పిన్నీ, మనం ఆండాళ్ళును జాగ్రత్తగా చూసుకోవాలి…” అన్నాడు.

“డాక్టరేమన్నాడురా?” రెట్టించింది.

“ఆందోళన పడే విషయాలు మాట్లాడవద్దన్నాడు. మందులు రాసాడు…” అన్నాడు

డ్రైవరును పిలిచి మందులు తీసుకు రమ్మనమని చెప్పి పంపాడు.

ఆండాళ్ళు తేరుకునే వరకూ ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు.

వారం తరువాత సుదర్శనాచారి ఆమెతో అన్నాడు, “ఆండాళ్ళూ, నీవు దేనికీ కంగారు పడకు. నీవు ఎలా అనుకుంటే అలానే కానిద్దాం. రాఘవకు పెళ్ళి చేద్దామంటే, అలాగే చేద్దాం, నీకు నచ్చిన పిల్లతో. సరేనా…” లాలనగా చెప్పాడాయన.

ఆండాళ్ళుకు ఆయనలో ఎందుకింత మార్పు వచ్చిందో తెలియలేదు.

ఆమెకు కొంత మెరుగయ్యాక పని మొదలుపెట్టబోతే ఎవ్వరూ చెయ్యనివ్వలేదు.

“నేను వండుతాను ఈ రోజు. నాకు తగ్గింది…” అన్నది ఆమె వారం తరువాత.

“వద్దులే. వంటాయన బానే చేస్తున్నాడుగా. చెయ్యనీయి. నీవు రెస్టు తీసుకో…” అన్నది అత్తగారు.

సుదర్శనాచారి కూడా అలానే మట్లాడాడు.

“వంటకు కూడా వంటవాళ్ళను పెట్టుకున్నామా ఇన్నాళ్ళూ అయితే?” అన్నదామె.

పెద్దావిడ దగ్గరకొచ్చి, “ఆండాళ్ళు ఆయనకూ భృతి కావాలి. బానే చేస్తున్నాడుగా. ఉండని ఇలా…” అన్నది.

ఆండాళ్ళు “సరే. మీ ఇష్టం…” అంటూ రోజంతా పైపై పనులు చూసుకుంటూ భాగవతం పారాయణం చేస్తూ గడిపేస్తోంది ఇక.

ఆడపిల్లలకు చెప్పలేదు తల్లి ఆరోగ్యం గురించి సుదర్శనాచారి. కాని ముగ్గురు మగపిల్లలకు చెప్పాడాయన.

పెద్ద కొడుకుకు ఫోను చేసి “ఈ మధ్య అమ్మకు మైల్డుగా స్ట్రోకు వచ్చిందిరా…” అన్నాడు.

అమెరికాలో ఉన్న అతను కంగారుగా “ఇప్పుడెలా ఉంది?” అడిగాడు.

“పర్వాలేదులే. నాన్నమ్మ సమయానికి డాక్టరు పిలిచింది. మందులవీ ఇచ్చాడతను…”

“అమ్మకెందుకంత ఆందోళన? ఏ విషయమై ఆమె కంగారు పడుతోంది?”

“రాఘవ గురించేరా…”

“మళ్ళీ ఏం చేసాడు వాడు?”

“ఏముంది. తోటలెంట పడి తిరిగి పూర్తిగా చెడ్డాడు. ఒక అలవాటు కాదనుకో. అందుకని తీసుకుపోయి పూనేలో మేనెజ్‌మెంటు కోర్సులో చేర్చి వచ్చాను. వాడిని తీసుకువెళ్ళానని ఆమె కంగారు పడిపోయి గుండెల మీదకు తెచ్చుకుంది…”

“మీరు కంగారు పడకండి నాన్నగారు. నేను బయలుదేరి రానా?”

“ఇప్పుడొద్దులే. వీలు చూసుకు రండి. మిమ్ములను చూసి సంతోష పడుతుంది…”

“సరే. వీలు చూసుకు వస్తాను. మీరేమి కంగారు పడకండి…” చెప్పాడు అమెరికాలో ఉన్న కొడుకు.

ఆయన అలాగే మిగిలిన ఇద్దరికీ కూడా చెప్పాడు.

అందరూ వారి వారి వీలు బట్టి అమ్మను చూడటానికి వస్తామని చెప్పారు.

అప్పటికి కొద్దిగా కుదటపడ్డాడు సుదర్శనాచారి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here