కైంకర్యము-31

0
10

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[dropcap]ఇం[/dropcap]టికి వచ్చిన సుదర్శనాచారికి ఎదురు వచ్చిన ఆండాళ్ళు రాఘవను చూసి తట్టుకోలేక పోయింది.

గట్టిగా వాటేసుకొని “ఏమయ్యింది చంటి నీకు?” అన్నది కన్నీరు మున్నీరుగా.

సుదర్శనాచారి ఆమెను ఓదారుస్తూ “వాడికి జ్వరమని చెప్పాగా. వాడిని రెస్ట్ తీసుకోనివ్వు. నీవేడిస్తే వాడు గాబరా పడతాడు…” అన్నాడు ఆమెను సముదాయిస్తూ.

రాఘవ తల్లి చుట్టూ చేతులు వేసి తడుతు “తగ్గిందమ్మా! ఇప్పడు నేను చాలా బాగయ్యాను. నీవు కంగారు పడకు…” అంటూ లోపలికి నడిచాడు.

మెల్లగా తేరుకున్న ఆండాళ్ళు రాఘవకు దిష్టి తగిలిందని నమ్మేసింది.

ఇద్దర్ని స్నానాలు చేసి రమ్మని పురమాయించి, రాఘవకు చెప్పింది “నీకు తగ్గే వరకు నా ముందు నుంచి నీవు కదలటానికి వీలు లేదురా చంటీ. ఇక్కడే పడుకో” అంది అథారిటీగా..

“తినటానికి సాపాటు సిద్ధం చేస్తాను…” అంటూ హడావుడి పడింది.

వంటావిడకు చెప్పి రాఘవకు ఇష్టమైన కూర, పప్పు సాంబార్ చేయించి కొసరి కొసరి వడ్డించింది.

చాలా రోజులకు రాఘవకు కడుపు నిండా తిన్నాననిపించింది.

అతను తల్లిని చూసిన సంతోషంలో మనసులో దుఃఖం కొంత మరుగున పడింది.

***

రోజులు భారంగా గడుస్తున్నాయని అనిపిస్తుంది రాఘవకు.

అతను వచ్చి వారం రోజులైంది. ఇల్లంతా నిశబ్దంగా వుంది. పూర్వం సంగీత సరిగమలు లేవు. తల్లి తండ్రి ఉసిరిచెట్టు క్రింద ముచ్చట్లు లేవు. ఆండాళ్ళు పారాయణాలు లేవు.

ఆమె నీరసంగా కనపడుతోంది. పడుకొనే ఉండటము కూడా గమనించాడు.

అతనికి పెద్ద ఉత్సాహంగా లేనందున ఆ విషయం పెద్దగా ప్రాముఖ్యతనివ్వలేదు.

సుదర్శనాచారే పూర్వంలా కోర్టుకు వెళ్ళటం, పనుల హడావిడి తగ్గించకపోవటం చూస్తున్నాడు రాఘవ.

మరో వారం గడిచింది.

హఠాత్తుగా పెద్ద అక్క ఊరి నుంచి వచ్చింది.

ఆండాళ్ళుకు పిల్లలు వస్తే ఆనందంగా కనపడుతుంది. ఆమె ఉత్సాహాంగా కూతురుకు ఎదురు వెళ్ళింది.

“పిల్లల్ని తీసుకురాలేదేమిటే? అల్లుడుగారు బావున్నారా? మీ అత్తగారు వాళ్ళంతా క్షేమమే కదా?” అంటూ.

“అంతా బావున్నారమ్మా” అంది. “పిల్లలకి పరీక్షలు. అత్తయ్యను చూడమని ఇటు వచ్చాను.” చెప్పిందామే.

‘ఎందుకో ఒక్కతే వచ్చింది?’ అనుకున్నా ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు.

ఆమె రాఘవను చూసి కళ్ళనీళ్ళతో “తమ్ముడూ! ఏంటిరా ఇది? ఇంత జబ్బు పడ్డావు? నాన్నగారు నీవు జబ్బు పడ్డావంటే తోచక చూడాలని వచ్చేశాను. నీవు తోడుండి అమ్మానాన్న గారిని చూసుకుంటావని మేమంతా ఎంతో ఆశగా ఉన్నాము…” అన్నది.

రాఘవ తేరుకున్నా, పూర్తిగా మనిషి కాలేదు. అక్క మాటలకు మౌనమే సమాధానమతని నుంచి.

ఆనాటి సాయంత్రం సుదర్శనాచారి ఆఫీసు గదిలో కూతురు తండ్రి రహస్య సమావేశం జరుపుకున్నారు.

“ఎందుకు నాన్నగారు మీరు అర్జంటుగా రమ్మన్నారు?”

“రాఘవను చూశావు కదమ్మా?”

“చూశానండి …”

“వాడు చదువు తగలబెట్టి నెత్తి మీదకు తెచ్చుకున్నాడు. మాన్పించి తీసుకువచ్చాను. లేకపోతే మనకు మనిషి దక్కేవాడు కాడు…”

“అంత ప్రమాదంలో పడ్డాడా?”

“అవును. మన స్థాయి మరిచి ఎగరబోయాడు. వాడిని దారిలోకి తీసుకురావాలి. ఇంటికి పెద్దఆడపడచుగా నీవే ఆ పని చెయ్యగలవు…”

“వాడిని నే తీసుకుపోతాను మా ఇంటికి…”

“వద్దు. అమ్మ ఆరోగ్యం బాగోలేదు. నాన్నమ్మ పోయిన దిగులు నుంచి ఇంకా కోలుకోలేదు…”

“మరి ఏం చెయ్యమంటారు…”

“వాడిని ఒప్పించు. పెళ్ళి చేసేద్దాం. ఆండాళ్ళుకు బాగుంటుంది, ఇంట్లో మరో మనిషి కనపడితే. వీడు దారికొస్తాడు పెళ్ళి చేస్తే…”

“సరే నండి. ప్రయత్నిస్తాను”

“ప్రయత్నం కాదు. నీవు చెయ్యాలీ పని…”

ఆమె తల ఊపి వెళ్ళిపోయింది.

***

“అమ్మా! ఒక కీర్తనందుకో..” తంబురా మీటుతూ అంది ఆండాళ్ళు పెద్ద కూతురు.

ఆండాళ్ళు వంటావిడకు చెయ్యవలసినవి పురమాయించి వచ్చి వంట వసారాలో కూర్చుంది. కూతురు తంబురా తీగలు సవరిస్తోంది.

రాఘవ టిఫిను చేసి అక్కడే మంచం మీద వాలి పేపరు చూస్తున్నాడు.

అక్క మాటలకు తల్లి వైపు చూశాడు. ‘అమ్మ పాట విని చాలా కాలమైంది’ అనుకున్నాడు.

ఆండాళ్ళు నిరాసక్తిగా తల ఊపింది.

“తప్పించుకోవటానికి వీలు లేదు. అమ్మా నీ గొంతు విప్పాల్సిందే…” చెప్పిందామె తీగలు మీటుతూ.

రాఘవ కూడా తల్లితో గారంగా.. “పాడమ్మా ఒక పాట…” అన్నాడు.

“నీవు గొంతు కలుపుతావా చంటీ…” అన్నదామె.

“రారా! నీవందుకుంటే అమ్మ కూడా ఉత్సాహపడుతుంది…” అన్నది అక్క.

“అమ్మా నీవే పాడు ముందు…” మరింత పెంకిగా పిలిచాడు రాఘవ

ఆండాళ్ళు నవ్వుతూ వచ్చి రాఘవను తట్టింది భుజం మీద.

“లే… రా, నా ప్రక్కన కూర్చో వచ్చి!” పిలిచింది.

రాఘవ లేచి వచ్చి తల్లి ప్రక్కన కుర్చీలో కూర్చున్నాడు.

ఆండాళ్ళు గొంతు సవరించుకొని ఆలాపన మొదలు పెట్టింది..

ఆమె నెమ్మదిగా స్వరాలాపన మొదలు పెట్టగానే రాఘవ, అతని అక్క కూడా అందుకున్నారు.

భద్రాద్రి రామదాసు కీర్తన ‘పలుకే బంగారమాయెనా….’ అంటూ మొదలు పెట్టి ‘తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు’ అంటూ సాగి ‘రామచంద్రాయ జనక రాజ మనోహరాయ…’ అని మంగళ వరకు రాముని పాటలతో ముగ్గురు గంట సేపు ఓలలాడారు.

ఆ సంగీతం కమనీయంగా అలలు అలలుగా ఆ ప్రాంగణమంతా వ్యాపించింది. తోటమాలి, రంగి, వంటావిడా పనులు మానేసి వచ్చి సర్పద్రష్టులలో వింటు ఉండిపోయారు.

సుదర్శనాచారికి ఆ సంగీతం పైకి వినపడుతున్నా తాను వస్తే మధ్యలో ఆపుతారని ఆయన వింటు ఉండి పోయాడు.

ఆ నాటికి ఆ ఇంట్లో పేరుకున్న మంచు కరుగుతున్నట్లుగా అనిపించింది.

చాన్నాళ్ళకు ఆండాళ్ళు హృదయం కొంత తేలికపడింది. ఆశ్చర్యంగా రాఘవకు కూడా.

వీరిద్దరిలో వచ్చిన మార్పును గమనించింది రాఘవ అక్క. ఆమె ఇదే మంచి సమయమని “అమ్మా! మన వాడికి పెళ్ళి చేసేయి. ఇంకా ఎన్నాళ్ళు వాడినిలా ఉండమంటావు?” అంది నవ్వుతూ.

పెళ్ళి మాట ఎత్తగానే రాఘవ ముఖం కోపంతో అవమానంతో కందింది.

అప్పటి వరకూ నవ్వుతున్న అతను కోపంగా లేచి వెళ్ళిపోయాడు.

ఇద్దరు స్త్రీలు ఆశ్చర్యపోయారు.

కూతురు తేరుకొని “అమ్మా! అప్పుడేదో సంబంధముందన్నావుగా… వాళ్ళున్నారా? తమ్ముడికి చూడవచ్చుగా…” అంది.

“వాడు సరేనంటే మామయ్యకు కబురు చెయ్యవచ్చు…” అంది ఆండాళ్ళు గొంతు పెగల్చుకొని.

“సరే. ముందు వాడిని నే ఒప్పిస్తా” అన్నది కూతురు ధైర్యం చెబుతూ

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here