కైంకర్యము-33

0
11

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[dropcap]ఆం[/dropcap]డాళ్ళు తను మామూలుగా పిలిచే పురోహితుడ్ని పిలిచి ఇంట్లో సుందరకాండ పారాయణం సంకల్ప పూర్వకంగా మొదలు పెట్టించింది.

“హనుమయ్యను నమ్ముకుంటే మన కష్టాలు కడిగేస్తాడు” అన్నది రంగితో సంతోషంగా.

“అమ్మగారు భలే బాగున్నారండి. మీరెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి” అంది ఆమెను చాన్నాళ్ళకు అలా చూస్తూ రంగి.

***

పాలెం కోదండరాముని కోవెలలో ధ్వజస్తంభపు మువ్వలు మ్రోగుతున్నాయి. చెరువు మీద నుంచి చల్లని గాలి నెమ్మదిగా వీస్తున్నది.

సుదర్శనాచారి కారు రంగరాజన్ ఇంటి ముందు ఆగింది.

కారు దిగే సరికే ఆప్యాయంగా ఎదురు వచ్చారు రంగరాజన్, తల్లి. ఆండాళ్ళును, సుదర్శనాచారి రాఘవతోపాటు రాఘవ పెద్ద అక్క కూడా వచ్చే సరికి చాలా ముచ్చట పడ్డారు.

అందరూ కాళ్ళు కడుక్కొని అక్కడే ఉన్న వరండా లోకి వచ్చారు.

పచ్చని చీర కట్టిన ఆండాళ్ళు నీరసించినా, గంభీరమైన ముఖంతో వెలుగుతోంది. మడిపై కట్టిన బేసరి పెట్టి చూడగానే ఆండాళ్ళు సాక్షాత్తు ఆండాళ్ళు తల్లే అనిపించటము వారందరికి సామాన్యమే. ఆమె ప్రక్కనే ఆమె పెద్ద కూతురు నెమ్మదిగా నడుస్తూ వస్తున్నారు.

రాజన్న, సీత వారికి ఎదురు వచ్చారు.

ఆండాళ్ళు, ఆమె పెద్దకూతురు ఇద్దరు రాజన్నకు భక్తిగా నమస్కారం చేశారు.. ఆయన వారిని దీవించి ఆండాళ్ళు యోగక్షేమాలు అడిగాడు.

సుదర్శనాచారిని విచారించాడు. రాఘవ నమస్కారం చెయ్యగానే దీవించాడు.

సీత మాత్రం రాఘవను పరీక్షించి చూస్తూ తన కూతురుకు తగ్గ వరుడని మనసులో భావించింది. ఆండాళ్ళు నెమ్మదిగా లోపలికి నడిచింది.

లోపల గదిలో ప్రసన్న లక్ష్మి కూర్చుని ఉంది. వీళ్లని చూడగానే లేచి ఎదురు వస్తూ “అత్తయ్యా ఆరోగ్యం బావుందా?” అంటూ అప్యాయంగా పలకరిస్తున్న ఆమెను అక్కున చేర్చుకుంది ఆండాళ్ళు.

ప్రక్కన ఉన్న కూతురుని చూపుతూ “మీ పెద్ద వదినే” అంది.

ప్రసన్న లక్ష్మి “వదినా అంతా క్షేమమా” అంటూ పలకరిస్తుంటే ఆమె కలుపుగోలుతనం, ప్రసన్నతా, ఆ ముఖంలో కాంతులకు సంతోషపడింది ఆండాళ్ళు పెద్ద కూతురు.

వారంతా కబుర్లలో పడ్డారు.

అంతలో సౌందర్యరాజన్ వచ్చాడు.

పెద్ద వదినను చూసి ఆనందపడ్డాడు. అత్తతో “అత్తా! లక్ష్మిని రాఘవకు చూపించాలి ఇక… ముహుర్తం మించకూడదని చిన్నాన్న చెబుతున్నారు” అన్నాడు.

“సరే…సరే… పదండి…” అంటూ కబుర్లు ఆపి అందరు ముందు వరండా వైపుకు నడిచారు.

ఆ వరండాను ఆనుకున్న రాధామాధవం పూలు ఆ ప్రాంతానికి తన సువాసనలతో సొగసులద్దాయి.

ఆగి ఆగి వీస్తున్న గాలి కోవెల తోటలోని పారిజాతాల సువాసనలను తెచ్చి చల్లుతోందక్కడ.

చాన్నాళ్ళకు కలసిన పెద్దల ముచ్చట్లకు అంతులేదు మరి.

రాజన్న కొడుకులు, తమ్ముళ్ళు, రంగరాజన్ మిత్రులు దూరపు చుట్టాలతో గలగలమంటోది చావడి.

వాళ్ళందరికి ఆశ్చర్యమే మహాలక్ష్మి లాంటి ఆండాళ్ళు ఈ దరిద్రనారాయణుని కూతురుని కోడలు చేసుకుంటోదని. ఆ విషయం ఎవ్వరు పైకి అనకపోయినా లోలపల ఒక కుతూహలం, ఒక ఆశ్చర్యం! కొందరికి రాఘవ కురూపినా అన్న అనుమానం వచ్చి చూడ వచ్చారు. రాఘవను చూసి ఆశ్చర్యం పోవటం వారి వంతే మరి.

ఇవేమి పట్టనివారు ఇద్దరున్నారక్కడ.

రాజన్న ఒకరు. అన్నింటిని సమదృష్టిలో చూసే రాజన్న మాత్రం కూతురు వివాహం పరమాత్మ నిశ్చయించాడని మౌనంగా ఉన్నాడు. మరొకరు రాఘవ. చేసుకుంటున్నది తల్లి ఆరోగ్యం కోసమన్న నిర్లిప్తతతో అతను తల ఎత్తలేదు.

విశాలంగా విస్తరించిన వరండాలో ఒక ప్రక్కగా మూలకు మౌనంగా తల వంచుకు కూర్చున్నాడు రాఘవ. అతనికి ఇదంతా ఏదో తంతులా తప్ప మరో భావం కలగటం లేదు. తల్లిని చూస్తే మాత్రం మరో మాట మాట్లాడలేకపోతున్నాడు. బీడు కట్టిన నేల మీద తొలకరిలా ఆండాళ్ళు కళ్ళలో వెలుగులు వచ్చాయి చాన్నాళ్ళకు మరి. అందుకే దేనికి స్పందించక కదలక మెదలక ఉన్నాడు.

వరండాలోకి ప్రసన్న లక్ష్మిని తీసుకు వచ్చారు స్త్రీలంతా.

అందరు కూర్చున్నాక అక్కడ ఒక మౌనం నిలిచింది. ఆండాళ్ళు, ఆమె పెద్దకూతురు రాఘవను చూస్తున్నారు. సుదర్శనాచారి ప్రసన్నలక్ష్మిని చూస్తున్నాడు. రాఘవ తల వంచుకు కూర్చున్నాడు.

కొంత తడువు తరువాత మౌనం బద్దలు చేస్తూ ఆండాళ్ళు “ఒక కీర్తన పాడు ప్రసన్నలక్ష్మి!” అన్నది.

తల వంచుకున్న ప్రసన్నలక్ష్మి తల తిప్పి అత్తను చూసి చిన్న నవ్వు నవ్వి గొంతు సవరించుకొని “మరుగేలరా ఓ రాఘవా!” అంటూ జయంతిశ్రీ రాగంలో త్యాగరాజ కృతి అందుకుంది. అందరూ నవ్వారు ఆమె పాట అందుకోగానే. ఆమెకు అర్థమవలేదు తొలుత.

ఆమె పాట అందుకోగానే ఆ కంఠస్వర మాధుర్యానికి అందరూ ఆశ్చర్యానందాలలో ఉంటే రాఘవకు ఆ స్వరంలోని మృదుత్వానికి మైమరచి తల ఎత్తి ఆమెనే చూస్తూ ఉండిపోయాడు.

ఆమె పాట ఆపగానే “రాఘవుడు వచ్చేసాడే… ఇక నీవు మరుగేలరా? అంటూ పాడనక్కల్లేదు” అంటూ చతుర్లాడారు. ప్రసన్నలక్ష్మి చెవిలో ఆండాళ్ళు గుసగుసగా “మావాడి పేరు రాఘవేనే” అన్నది.

ప్రసన్నలక్ష్మి బుగ్గలు సిగ్గుతో కుంకుమ వర్ణంలోకి మారుతుంటే అందరూ నవ్వేశారు.

రాఘవకు ఆమె చూస్తే గొంతులో తడి ఆరింది. పొడి దగ్గు కలిగింది.

చెంపకు చారడేసి కళ్ళతో, దోసగింజ బొట్టుతో, గోధుమరంగు చీరలో, ఎలాంటి ఆభరణాలు అలంకారాలు లేక కడిగిన ముత్యంలా స్వచ్ఛంగా ఉంది.

ఆమె స్వచ్ఛతతో పాటు ఆమె చుట్టూ ఉన్న మెరుపులు ఆమెలోని దైవత్వం చూపుతుంటే రాఘవకు మాటలు రాలేదు. ‘ఈమె ఎవరు? అమ్మకెక్కడ దొరికింది?’ అనుకున్నాడు.

అందరూ సంతోషంగా నవ్వుతూ “మరో పాట అందుకో లక్ష్మి” అని ప్రోత్సహించారు..

ఆమె తల ఎత్తి రాఘవను చూడలేకపోతోంది. ప్రసన్నలక్ష్మి అన్నమయ్య పాట పాడింది.

పెద్దలందరూ ఘోష్టిగా వేదగానం మొదలెట్టారు.

ఒక ప్రక్క తాంబూలాలు మార్చుకునే ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి.

ఆండాళ్లు తనతో తెచ్చిన చీర, పసుపు కుంకుమ, పువ్వులు, ప్రసన్నలక్ష్మికి ఇచ్చింది. మెడలో గొలుసు, నగ వేసింది. చేతులకు బంగారు గాజులు తొడిగింది.

“ఈ చీర కట్టుకు రామ్మా!” అంది ప్రేమతో బుగ్గలు పుణికి.

తరువాత ఇరువురు వేద మంత్రాల మధ్య తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్నారు. రాజన్న, రాఘవను ఆశీర్వదించాడు.

ఆ నాటి నుంచి పదిహేను రోజులకు పెళ్ళి నిశ్చయించారు. సుదర్శనాచారి ఆలోచనగా “సరే” అన్నాడు.

ఆయనకు కొడుకులు అందరూ వెంటనే రమ్మంటే రాగలరా అని అనుమానం కలిగింది. చూడబోతే సమయం లేదు. ఇదేమో ఇంట్లో చివరి శుభకార్యం కూడా. ఆ విషయమే అన్నా మంచి ముహూర్తం కుదిరిందని ఆ సమయానికే వివాహం చెయ్యాలనుకున్నారు.

రాఘవకు మనసులో గడ్డగట్టినట్లుగా ఉంది. అతనికి విద్య చేసిన గాయం, తనకు కలిగిన అవమానం మరుపుకు రావటం గగనమవుతోంది.

ఆండాళ్లుకు మాత్రం పూల వాన కురిసినట్లుగా ఉంది. ఆమె కళ్ళలో ఆనందభాష్పాలు ఆగటం లేదు ఎంత దాచినా.

ప్రసన్నలక్ష్మిని బుగ్గలు పుణికి “ఆ గోదా తల్లి దయన నా కోడలవుతున్నావు నీవు. రాజన్నతో వియ్యం మేము చేసుకున్న అదృష్టమే తల్లీ. ఇదంతా ఆ కోదండరాముని కృప…” అంటూ పొంగిపోయింది.

వల్లి, రంగరాజన్‌లు కూడా చాలా సంతోషపడ్డారు.

పెళ్ళి పాలెంలోని కోదండరాముని కోవెలలో చెయ్యాలని నిశ్చయించారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here