కైంకర్యము-37

0
9

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[dropcap]ఆ[/dropcap] రోజు సుదర్శనాచారి ఇంట్లో తెగ హడావుడిగా ఉంది. ఉదయం నుంచి ఆండాళ్లు తెగ హైరానా పడుతోంది. ప్రసన్నలక్ష్మిని కూర్చోనియ్యదు. ప్రసన్నలక్ష్మికి తనే తల దువ్వి పూలజడ వేసింది. పెద్ద జరీ ఉన్న పట్టు చీర ఇచ్చి కట్టుకోమంది. మెడలో కాసులపేరు, రవ్వల హారం పెట్టింది. ఆ చీరలో, నగలతో పూలజడతో ప్రసన్నలక్ష్మి మరింత ప్రకాశవంతంగా కనపడుతోంది. ఆ రోజు వారింట సుదర్శన హోమం చేసుకుంటున్నారు.

ప్రసన్నలక్ష్మి ఆడపడుచులు వచ్చారు. వారికి వాళ్ళమ్మ ప్రసన్నలక్ష్మిని చేస్తున్న గారాబానికి ఆశ్చర్యంగా ఉంది. చిన్న ఆడపిల్ల అననే అంది… “ఏంటి అమ్మా ఆ మురిపెం? ఎక్కడ చూడలేదు. అయినా ప్రసన్నలక్ష్మి! నీవు లక్కీ అబ్బా అసలు. మాకు ఉన్నారు అత్తగార్లు…” ఆ మాటలో శ్లేషకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మిన్నకుంది ప్రసన్నలక్ష్మి.

“ఊరుకోండే!!. చిన్నపిల్ల. పైగా మా రాజన్న కూతురు. మీకేం తెలుసు అన్న గొప్పతనం? ఆయన పెంపకం కాబట్టి బంగారు తల్లి పాలు నీళ్ళల్లా కలిసిపోయింది…” అతిశయంగా అంది ఆండాళ్లు.

నవ్వారు కూతుర్లు.

“వదినా! అత్తయ్య ప్రేమ ముందు ఏదైనా చిన్నదే. మీరెంత అదృష్టవంతులో. ఆ తల్లి కడువున పుట్టారు…” అత్తను కౌగిలించుకుంటు అంది ప్రసన్నలక్ష్మి.

నవ్వులు పువ్వులవలె విరిసాయి ఆ గదిలో.

“కానియ్యండంతా. మొదలెట్టేస్తారు ఇక…” హడావిడిగా చెబుతూ గది బయటకు నడిచింది ఆండాళ్లు.

ఢిల్లీలో ఉన్న పెద్దబ్బాయి కూడ వచ్చాడు. కోడలు ఆ ఏర్పాట్లలో ఉంది.

ఇంకా రాజన్న వాళ్ళు, రంగరాజన్ వాళ్లు ముందురోజే వచ్చారు హోమానికని.

రాఘవ పట్టు పంచె కట్టుకు వచ్చాడు. నిలువుగా దిద్దిన తిరునామంలో ముచ్చటగా ఉన్నాడతను.

ఆ హోమం చెయ్యటానికి కారణం రాఘవ ఎంబియే(MBA) పూర్తి చెయ్యటం.

కొడుకు ప్రయోజకుడు అయ్యాడని, ఇక తండ్రి బాధ్యత తీసుకుంటాడని ఆండాళ్లు ఆనందపడుతోంది. ఇంటి ముందర షామియానా వేశారు. కారు తీసేసి అక్కడ హోమగుండం అమర్చారు.

లోగిలి అంతా చుట్టాలతో కళకళలాడుతూ హడావిడిగా ఉంది. అందరి సమక్షంలో, ఋత్వికుల సాయంతో సుదర్శన హోమం చేశారు రాఘవ దంపతులు.

ఆ జంట అక్కడి వారందరికి కన్నుల పంటగా ఉన్నారు. వారే శ్రీమహావిష్ణువు సిరితో కలిసి వచ్చాడా!! అని అనిపించింది.

ఆ నవ దంపతులను పెద్దలందరు వేదమంత్రాల మధ్య ఆశీర్వదించారు.

ప్రసన్నలక్ష్మితో, “మేము బయలుదేరుతాము. నాన్నగారికి రాత్రికి ఇంటికి వెళ్ళాక భోజనం పెట్టాలి కదా…” అన్నది సీత.

ఆడపిల్ల ఇంట్లో ఆమెకు సంతానం కలిగే వరకు భోజనం చెయ్యరు తండ్రి. అందుకే వారు ఆ ఉదయమే వచ్చి వెంటనే బయలు దేరుతున్నారు.

మౌనంగా తల ఊపింది ప్రసన్నలక్ష్మి.

“అంతా బాగానే ఉందా?” అడిగింది ఆమె మౌనం చూసి.

“బాగానే ఉంది?”

“అత్తయ్యకు అన్ని చూసుకుంటున్నావా?”

“ఆ….”

“బావకు సాయంగా ఉంటున్నావా?”

“బావే నాతో పలకడు. నేను చెప్పినట్లుగా ఉంటున్నా….”

“అంటే?”

“ఏం లేదులే… అదో టైపు…”

“అందరు ఒక్కలా ఉండరుగా లక్ష్మీ!” అంది కాని సీత ఆలోచనలో పడింది.

“డబ్బులేమైనా కావాలా?”

“ఆ ప్రశ్న నేనడగాలి… ఎలా జరుపుకుంటున్నావో.. నేనైతే వచ్చేశాను…” అంది గొంతులో జీరతో ప్రసన్నలక్ష్మి.

“జరుగుతోందిలే..” అంది సీత లోతుగా చూస్తూ కూతురిని.

ఇంతలో అక్కడికి ఆండాళ్లు వచ్చింది.

“సీత వదినా! బయలుదేరుతున్నారా?” అంటూ

“అవును ఆండాళ్లూ. మీ అన్నయ్య భోజనం చెయ్యరుగా…”

“సరే వదినా. తెలుసుగా నాకు. మీరు వచ్చారు. అది చాలు. ఉండండి ఇద్దరికి తాంబూలం ఇస్తాను” అంటు రాజన్నను, సీతను కలిపి కూర్చోబెట్టి తాంబూలం బట్టలతో పెట్టింది.

రాజన్న మాట్లాడలేదు. సీత తాంబూలం తీసుకుంది.

ఆండాళ్లు సీత కోసం క్యారియర్, కారులో బియ్యం, పప్పులు, కాయగూరలు ముందే సర్దించి ఉంచింది. వాటితో పాటు సీతకు ఒక కవరు ఇచ్చింది.

సీత ఏదో చెప్పబోతే “అన్నయ్యకు తెలియనియ్యకు వదినా. ఉండనియ్యు. నేను నీ మరదలునేగా…” అంది.

వారిద్దరు మౌనంగా కారెక్కారు. డ్రైవరుకు వారిని ఊరి వద్ద దింపి రమ్మని చెప్పాడు సుదర్శనాచారి.

రాజన్న రాకనే చాలా అదృష్టం అనుకున్నారు పెద్దలందరు అక్కడ.

హోమం అనంతరం అందరికి భోజనాలు వంటగది వైపుగా ఉన్న వరండాలో వడ్డించారు. చక్కటి అరటి ఆకులలో వేడి వేడి భోజనం తరువాత తాంబూల సేవనం చేసి ఋత్వికులు, ప్రక్క ఊరి చుట్టాలు వెళ్ళారు.

పెద్దకొడుకు ఢిల్లీకి వెళ్ళిపోయాడు మరుసటి రోజు.

కూతుర్లు పైనాడు వెళ్ళిపోయారు. ఇల్లు మళ్లీ మాములు స్థితికి వచ్చింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here