కైంకర్యము-38

0
9

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[రాఘవ ఎం.బి.ఎ. పాసయినందుకు ఇంట్లో సుదర్శన హోమం జరిపిస్తారు సుదర్శనచారి దంపతులు. చిన్న కోడలికి తల్లి చేసే మురిపాలు చూసి విస్తుపోతారు ఆండాళ్లు కూతుర్లు. రాఘవకీ తనకీ మధ్య పెద్దగా మాటలు లేవనే విషయాన్ని తల్లికి తెలుపుతుంది ప్రసన్నలక్ష్మి. హోమం పూర్తయ్యాకా, ఎవరిళ్ళకు వాళ్ళు బయలుదేరుతారు. – ఇక చదవండి.]

[dropcap]త[/dropcap]ల్లిదండ్రులు ఎలా ఉన్నారో అని ఆలోచనలో పరధ్యానంగా ఉంది ప్రసన్నలక్ష్మి. హోమానికి వచ్చి వెంటనే వెళ్ళిపోయిన వారిని ఆమె మరువలేకపోతోంది. తండ్రి సంగతి తనకు తెలుసు. ఆయన ఎక్కడ భోజనం చెయ్యరు. తల్లి కూడా ఆయన సహధర్మచారిణి. వారిని చూస్తే భార్యాభర్తలెలా ఉండాలో తెలుస్తుంది. ధర్మపరుడైన భర్త, వారిని అనుసరిస్తూ భార్య. వారిని అందరు సీతారాములనే అంటారు.

తండ్రి జపతాపాదులు తప్ప మరో విషయం చూడడు. పేదరికాన్ని వారు ఎంతో సంతోషంగా భరిస్తారు. వారికి పేదరికం పెద్దగా మాట్లాడవలసినది కాదు. విద్వత్తు, తపస్సు ముఖ్యమని రాజన్న చెబుతాడు.

‘వారిలా మరొకరు ఉండరు’ అనుకుంది ప్రసన్నలక్ష్మి.

ఆమెకు తన తల్లిదండ్రుల వలె ఉండాలని ఉంది. కాని భర్త అసలు ఆమెతో ఉలుకు లేదు పలుకు లేదు…

‘పట్నం మనుషులు వింత పోకడలు, ఇక్కడ అత్తయ్య కోసమే వచ్చినట్లుగా ఉంది’ అనుకుంటు ఆండాళ్లేమి చేస్తుందో అన్న ఆలోచన కలిగి క్రిందకొచ్చింది.

ఎంబియే(MBA) పూర్తి అయ్యాక రాఘవ మౌనంగా ఉండలేకపోయాడు. ఎలాగైనా ఒక ఉద్యోగం సంపాదించాలన్న పట్టుదల అతనికి లోలోపల ఉంది. డబ్బు కోసం తల్లిని అడగాలంటే చాలా విసుగ్గా ఉంటుంది. అప్పటికి సుదర్శనాచారి ప్రతి నెలా రాఘవకందుబాటులో కొంత ఉంచుతున్నా అతనికి నచ్చటం లేదు.

ప్రసన్నలక్ష్మికి ఏమైనా కొనాలంటే కూడ తల్లితండ్రులను అడగాలంటే పరమ చిరాకుగా ఉంది. ఆ చిరాకుతో ఆమెపై మరింత విసుగు చూపటం అతని దినచర్యలో భాగమైయింది.

ఒకరోజు సాయంత్రం తల్లి పడుకొని ఉండగా, వంటగది వరండాలో ప్రసన్నలక్ష్మి మౌనంగా కూర్చొని ఉండటం చూసాడతను.

“అమ్మా!” అంటూ దూరం నుంచి పిలిచాడు.

ఆ పిలుపుకు చటుకున్న లేచి ఇటు తిరిగిన ఆమె కన్నులలో నీరు అతని దృష్టి దాటిపోలేదు. ఆనాటి నుంచి అతను ఆలోచనలో పడ్డాడు. ఆమెతో మాట్లాడటానికి చిన్నతనం అనిపించింది. తనంతట తాను అడిగితే లోకువైపోతాననుకున్నాడు. ఆమె ఏమి మాట్లాడలేదు.

తను ఉద్యోగం చూసుకుంటే ఈ విషయాలన్నీ కనపడవన్న భావన కలిగింది. అందుకే ఉద్యోగం వేటలో పడ్డాడు.

అతనిని గమనిస్తున్న సుదర్శనాచారికి అతని వెతుకులాట గురించి చూచాయగా తెలిసింది.

ముందుగా ఆండాళ్లును సంసిద్ధం చేస్తే మంచిదన్న భావం కలిగింది.

ఆరోజు సాయంత్రం తేనీరు త్రాగుతూ తోటలో మొక్కలను చూస్తూ “వాడు చదువు పూర్తి చేశాడు. ఇక ఇంట్లో ఉంటాడా? ఉద్యోగమంటూ వెడతాడేమో?…” అన్నాడు ఆమెను చూస్తూ.

“వాడెక్కడికి పోతాడు?” తేలికగా తీసివేస్తూ అన్నది.

“కాళ్ళొచ్చిన పిల్లలు ఎటైనా పోతారు..” అన్నాడు సుదర్శనాచారి.

“వాడికి మీరే అందించేలా ఉన్నారు మాటలు. మాట్లాడకండి. ఆ పొలాల పని అప్పచెబుతానన్నారుగా?” అడిగింది ఆండాళ్లు.

“చూద్దాంలే. కాని నీవు మరీ స్వార్థంగా వాడు నీ ముందే ఉండాలనుకోకు. లాయరీ చేస్తే అదో తీరను కాని…”

“అదే చేయించండి. ఇప్పడు మాత్రం ఆలస్యమేంటి?”

“సరే నీవు మళ్ళీ మొదటికొచ్చావు. అంత ఉంటే అనుకునేదేమిటి అంట? అయ్యగారు చెయ్యనన్నారే. ఇప్పుడు వాడికో తోకను కట్టాము…”

“ఉష్ ష్ ష్ నెమ్మది. ఏంటా మాటలు? ఆ బంగారుతల్లి వల్ల వాడు కాస్త కుదురుగున్నాడు. నేను శాంతితో ఉన్నాను…”

“బంగారుతల్లి కాబట్టే నా ఆలోచన. ఆ పిల్లను జాగ్రత్తగా చూసుకోవాలి. మొన్నో రోజు వరండాలో కూర్చొని కంట నీరు పెడుతోంది. తెలుసుకో సంగతేమిటో…”

“ఆ!” అంటూ ఆశ్చర్యపోయింది ఆండాళ్లు.

“కంగారు పడకు. వాడు ఏమన్నా అన్నాడో? లేక వాళ్ళ అమ్మవాళ్ళ మీద బెంగో?. లేకపోతే ఒకసారి పాలెం వెళ్ళి రండి మీ ఇద్దరు”

ఆలోచనగా తల ఊపింది ఆండాళ్లు.

***

ఒకరోజు సాయంత్రం రాఘవ తండ్రితో చెప్పాడు “నాకు ఉద్యోగం వచ్చింది…” అంటూ

అలాంటిది వినాలని ఆయన ముందే అనుకున్నాడు కాబట్టి ఏ భావము లేకుండా అడిగాడు

“అవునా! ఎక్కడా? ఏం ఉద్యోగం? ఏం జీతము?”

“ఇక్కడికి గంట దూరంలో బాలానగర్‌లో. కంపెనీలో మేనేజరుగా… ” అంటూ వివరాలు చెప్పాడతను.

“మీ అమ్మకు చెప్పు! ఆమె ఏది చెబితే అది చెయ్యి!” అని ఊరుకున్నారాయన.

మరుసటి రోజు తల్లికి విషయము చెప్పటానికి పూర్వ ఉపాయమే తోచింది. ఉదయమే తిరునామంతో తయారై వచ్చి విష్ణుసహస్రనామం చదవటం మొదలుపెట్టాడు. ఆండాళ్లు చూసి సంతోషపడింది.

ఆనాటి భాగవత పారాయణం కూడా తల్లితో కలిసి చేశాడు. ప్రసన్నలక్ష్మి కూడ అతని ఈ పద్ధతి చూసి ఆశ్చర్యపోయింది.

ఆనాటి సాయంత్రం ఆండాళ్ళు ఆనందం చూసి మెల్లగా బాంబ్‌లా పేల్చాడు రాఘవ “అమ్మా! నాకు ఉద్యోగం వచ్చింది… చేరుతాను” అన్నాడు.

అతను ఈ విషయం చెప్పగానే హాతాశురాలయ్యింది ఆండాళ్ళు.

“నాన్న నిన్ను ఇంట్లో ఉండి ఇంటిని, పొలాన్ని మమ్మల్ని చూసుకోమన్నారు కదరా చంటి! మళ్ళీ ఇదేంటి కొత్తగా. రానని చెప్పు వాళ్ళకు. నీవెక్కడికి పోకూడదు. ఇంట్లో ఉండు చాలు…” అన్నది తల అడ్డంగా ఊపుతూ హిస్టీరికల్‌గా.

ఆ రోజు ప్రసన్నలక్ష్మి ఆశ్చర్యంతో “మీరు ఉదోగ్యము చేద్దామనుకుంటున్నారా? అత్తయ్యను, మామయ్యను వదిలి వెళ్ళటమా?” అంది.

“నేను ఎక్కడికి వెళ్ళటం లేదు. ఇంట్లోనే ఏడుస్తా…” అన్నాడు రాఘవ కోపంతో.

“నేనేమన్నాను?” అన్నది ప్రసన్నలక్ష్మి చిన్నబుచ్చుకుంటు, కాస్త భయంతో.

“మా అన్నలు, వదినలు నన్ను పెద్ద చేతకానివాణ్ణి అని అనుకుంటున్నారు. వాళ్ళ మాట నిజం చెయ్యటం నాకిష్టంలేదు…” అన్నాడు మొదలెడుతూ..

“ఇదంతా మీ ఊహేమో?” అన్నది ఏమనాలో తెలియక..

“ఏది ఊహ? నాకు తెలియదా? చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. నన్ను కట్టి పడేస్తున్నారు. చెప్పకుండా ఎటన్నా పారిపోవాలి” అన్నాడు చిరాకు అంతా ముఖంలో తాండవిస్తుంటే.

“మీరు లాయరవుతారని అత్తయ్య అనుకుంటు గడిపింది ఇన్ని రోజులు…”

“నీతో అన్నదా అమ్మ?”

“ఎప్పుడు అనేదిగా”

“అబ్బా! అమ్మకు ఎంతో చెప్పాను కుదరదని…..” చిరాకుతో కూడిన స్వరంతో, ఆలోచనగా అన్నాడు.

“రేపు మీ ఆలోచన వారికి చెప్పవచ్చుగా. అదే మీ అన్నల విషయము…”

“తెలియని వారికి చెప్పాలి. వీళ్ళకు తెలుసు. నేనో బేవార్సు వాడినని…. పడి తింటూ ఆస్తి కరిగించుకుంటున్నానని…”

“మీ ఊహ అది. అయినా నేను చెబుతా అత్తయ్యతో…”

“ఇక నీ రాయబారమే తక్కువ. మాట్లాడకుండా ఉండు…” అని ఉరిమాడు రాఘవ.

మారు మాట్లడక మిన్నకుండిపోయిందామె.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here