[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]
[కంపెనీ యాజమాన్యానికి రాఘవ మీద గురి పెరుగుతుంది. అదే సమయంలో ఆఫీసులో అతనికి శత్రువులు కూడా అధికమవుతారు. ప్రమోషన్ విషయంలో మరో మేనేజర్‌కి రాఘవతో పోటీ ఉంటుంది. ఆయనను సమర్థించేవారు రాఘవను ఎలాగైనా ఆపాలని, ఈ ప్రమోషన్ ఆయనకే రావాలని ప్రయత్నాలు చేస్తుంటారు. కార్మికులను రెచ్చగొట్టి సమ్మె మొదలుపెట్టిస్తారు. కార్మికనాయకులకు డబ్బిచ్చి సమ్మె ఆగకుండా చూస్తారు. యాజమాన్యం సమ్మె ఆపేలా చూడమని రాఘవపై ఒత్తిడి పెంచుతుంది. ఇవేవీ తెలియని రాఘవ తన పని తాను చేసుకుపోతుంటాడు. ఆ గురువారం రాఘవకి క్యారేజ్ సర్దిచ్చి, ప్రసన్నలక్ష్మి నాచారం వెళ్ళిపోతుంది. రాఘవ మిత్రులతో ఆ రాత్రి గడుపుతాడు. – ఇక చదవండి.]
[dropcap]రా[/dropcap]ఘవకు ఉదయం మెలుకవ వచ్చేసరికే తలుపులు ఎవరో కొడుతున్నారు.
టైం చూస్తే ఎనిమిది.
లేచి పరుగున వెళ్ళి తీసాడు.
ఫ్యాక్టరీ సెక్యూరిటీ.
“యస్..” అంటూ ప్రశ్నించాడు.
“సార్ మిమ్మల్ని ఓసారి అర్జంటుగా ఆఫీసుకు రమ్మనమని బాస్ పిలుచుకు రమ్మన్నారు.” చెప్పాడతను.
రాఘవ త్వరగా తయారై వెళ్ళాడు.
అక్కడ ‘ఎం.డి.రూమ్’లో కార్మికులతో ఉన్నాయన.
“రాఘవా, నీ లెడ్జర్‌లో పది లక్షల రూపాయలు తక్కువైయింది ఈ నెల. ఇలా ప్రతి నెల కనపడుతోంది. ఏంటి ఇది?” అడిగాడు షార్పుగా చూస్తూ.
ఆయన ప్రక్కనే ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసరు ఉన్నాడు.
“పైగా నీవు ఆఫీస్ మనీ పర్సనల్‌కి వాడావని కూడా తెలిసింది” అంటూ ఆగాడు.
రాఘవకు అర్థం కాలేదు. “నో… వే” అంటూ ఆ రికార్డులు చూశాడు. అతను చూసి ట్యాలీ చేశాక ఎవరో దానిని ఇంకుతో దిద్దారు.
ఆ రికార్డుల కీ అతని వద్దనే ఉంటుంది. కాని ఎవరో దానిని తస్కరించి, ఆ పని చేశారు. దీని వల్ల రాఘవ నెలకు పదిలక్షలు చొప్పున తీసుకున్నాడని తెలుస్తోంది. రాఘవను ఇరికించటానికి ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్ రైడ్ అరెంజ్ చేశారు.
రాఘవకు అర్థమవగానే వివరించే ప్రయత్నం చేశాడు. కాని ‘ఎం.డి.’ చాలా చిరాకుగా
“మీరేదో పెద్ద కుటుంబం నుంచి వచ్చారు, హానెస్ట్ అనుకున్నా. కాని డబ్బు దగ్గర అంతా ఒకటే!” అంటు సెక్యూరిటీని పిలిచాడు.
లోకల్ పోలీసులు వచ్చి రాఘవను వైట్ కాలర్ క్రైమ్ అని అరెస్టు చేసి తీసుకుపోయారు. ఇదంతా అరగంటలో జరిగింది.
రాఘవ నిర్దోషిగా బయటకు రావచ్చు కాని, అతని కెరీర్‌పై పడ్డ నష్టం మాత్రం పూడ్చలేనిదవుతుంది. అతనికి రావలసిన ప్రమోషన్ రాదు ఇక.
రాఘవకు పరమ అవమానంగా తోచింది.
ఏంటి??? ఈ నాటకీయ పరిణామం? అన్న ఆలోచన కలిగింది.
అతనికి అవమానం కన్నా, తల్లి తండ్రి ఎలా తీసుకుంటారో ఈ విషయం అన్న కంగారు కలిగింది.
పోలీసు స్టేషన్‌లో రాఘవతో మర్యాదగానే ఉన్నారు. అతనికి ఫోన్ చేసుకునే అవకాశమిచ్చారు.
రామచంద్రకు కాల్ చేశాడు రాఘవ.
అతనికి బ్రీఫ్‌గా విషయం చెప్పాడు. రామచంద్ర కంగారు పడవద్దని చెప్పి ఊరడించాడు.
“నేను చూసుకుంటాను. బెయిల్ తీసుకు వస్తాను. నీవు అప్పటి వరకు ఎవరు ఏం అడిగినా ఏం మాట్లాడక మౌనంగా ఉండు…” అని సలహా చెప్పాడు.
రాఘవను ఎవరు పలకరించలేదు కానీ, నగరంలో ప్రముఖ లాయరు కుమారుడు ఫ్యాక్టరీలో డబ్బు దొంగలించి జైలు పాలయ్యాడన్న కబురు పేపరు వారికి అందింది. వాళ్ళు కెమెరాలతో వచ్చారు కాని అతనిని పోలీసులు కలవనియ్యలేదు.
***
రామచంద్ర ఆఫీసుకెళ్ళాడు.
సుదర్శనాచారి అతనిని చూసి “ఈ రోజు నా కేసులేమీ లేవుగా…” అన్నాడు.
“అవును. మీతో కొంత పర్సనల్ పని ఉండి వచ్చాను..”
“ఏంటి అది?”
“ఒక బెయిల్ తీసుకోవాలి సార్. మీరుంటే జడ్జి వెంటనే స్పందిస్తారు. మీరు రావాలి…”
“ఎవరికేంటి?”
“నా తమ్ముడికి సార్.. చిక్కుకున్నాడు అమాయకంగా…”
“అరే.. అలాగా. పద పద…” అంటూ ఆయన బయలుదేరాడు.
కారులో బయలుదేరాక ఆయనకు నెమ్మదిగా అసలు విషయం చెప్పాడు రామచంద్ర.
ఆయన కొంత షాక్‌కు గురి అయ్యాడు.
తేరుకొని “ఎప్పుడు జరిగింది?” అన్నాడు.
“ఈ ఉదయమే అనుకుంటా సార్. ఉదయమే ఫోన్ చేశాడు”
ఆయన గడియారం చూసుకున్నాడు. పదకొండు. ‘అంటే కొడుకు రెండు గంటలు పైగా సెల్‌లో ఉన్నాడు. ఏంటి వీడి జాతకం? కాస్త కుదురుకున్నాడంటే’ అనుకున్నాడాయన. నుదుటి మీద మడతలలో మరోటి పెరిగింది ఆయన ఆ ఆలోచనలకు.
రామచంద్ర ఆయనతో “ఇదేదో సెటప్ సార్. బట్ ఇలాంటివి మీకు నాకు తెలియనివా? ఫ్యాక్టరీ గొడవలలో, కార్మికుల గొడవలలో ప్రాణం కూడా పోగొట్టుకుంటారు. మనం అదృష్టవంతులం” అన్నాడు.
సుదర్శనాచారి తల ఊపాడు అవునని.
రామచంద్ర చెప్పినట్లుగా ఇలాంటి ఫ్రాడ్ కేసులెన్నో. సొంతది అంటేనే మనస్సు చివుక్కుమంటోంది.
వారు కోర్టుకి చేరి, జడ్జి దగ్గరకు వెళ్ళారు.
సుదర్శనాచారి వివరించి బెయిల్ తెచ్చాడు.
ఇద్దరు పటానుచెరువు వైపు సాగారు.
***
రాఘవను ఆకలి, తల నొప్పితో పాటు అవమానం కూడా బాధించింది.
అతను నెమ్మదిగా ఆలోచించగా అర్థమయ్యింది. తన ప్రత్యర్థి పన్నిన కుట్ర కావచ్చునిది అని.
అతను హాని తలపెట్టవచ్చని అనుకున్నాడు. కాని, ఏ వైపుగా వస్తాడన్నది తెలియలేదు. ఈ కార్మిక సమ్మె అన్ని అతని ప్లానే అయి ఉండవచ్చు. కార్మికులకు అందుతున్న ధనం కూడ అతనే అందించి ఉండవచ్చు. దేనికిదంతా? ప్రమోషన్ కోసమేనా? అతను లోలోపల అగ్నిపర్వతం లాగా కుతకుతలాడసాగాడు.
అతనిని ఎవ్వరు పలకరించలేదు. మంచినీరు కూడ ఇవ్వలేదు.
దాదాపు రెండు అవుతుండగా స్టేషన్‌లో అలికిడి అయింది. అతనిని బయటకు తెచ్చారు.
అక్కడ తండ్రి, ఆయన ప్రక్కనే రామచంద్ర కనిపించారు.
ఆయన బెయిల్ ఇచ్చి అతనిని బయటకు తీసుకువచ్చారు.
అతను బయటకు రాగానే ఒక వాటర్ బాటిల్ ఇచ్చాడు రామచంద్ర. అది తీసుకు గుటగుటా త్రాగాడు రాఘవ.
ఎవ్వరు మాట్లాడుకోలేదు. ఒక మూల నుంచి ఒక కెమెరా క్లిక్ మన్నది. ముగ్గురు మౌనంగా వచ్చి కారులో కూర్చున్న తరువాత “ఒకసారి ఇంటికెళ్ళదాం…ఇక్కడే” అన్నాడు రాఘవ రామచంద్ర వైపు తిరిగి.
అతను సుదర్శనాచారిని చూస్తూ “సరే…” అన్నాడు.
కారు రాఘవ ఇంటి వైపు సాగింది. అతను లోపలికి వెళ్ళి ముఖ్యమైన కాగితాలు, కొద్దిగా డబ్బు, నగలు వంటివి చిన్న బ్యాగులో సర్ది, తన బండి దగ్గరకు వచ్చాడు.
“మీరు కారులో వచ్చెయ్యండి. నేను బండి మీద వస్తాను…” అన్నాడు.
సుదర్శనాచారి “వద్దు. నీవు కారెక్కు. రాములు బండి తీసుకొస్తాడు ఇంటికి…” అన్నారు. అదే ఆయన మొదటి మాట రాఘవ బయటికొచ్చినప్పటి నుంచి. రాఘవ మారు మాట్లాడలేదు. వచ్చి కారులో కూర్చున్నాడు. రామచంద్ర డ్రైవ్ చెయ్యటం మొదలుపెట్టాడు. కారు నాచారం వైపు సాగిపోయింది.
(సశేషం)