కైంకర్యము-47

0
14

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[పటాన్‌చెరువు నుంచి తిరిగి వస్తుండగా, అసలేం జరిగిందో చెప్పమంటాడు సుదర్శనాచారి. జరిగినదంతా వివరిస్తాడు రాఘవ. ప్రత్యర్థులు రాఘవని బాగా ఇరికించారని గ్రహిస్తాడు సుదర్శనాచారి. అమ్మకి ఏం చెప్పద్దనీ, ప్రసన్నలక్ష్మికి మాత్రం నిజం చెప్పేయమని అంటాడు సుదర్శనాచారి. భర్తతో వచ్చిన కొడుకుని చూసి ఆశ్చర్యపోతుంది ఆండాళ్లు. ప్రమోషన్ రాకపోవడంతో అక్కడ ఉద్యోగం మానేసాడని చెప్తాడు సుదర్శనాచారి. విషయం తెలిసిన ప్రసన్నలక్ష్మి విస్తుపోతుంది. అన్నింటికీ ఆ పెరుమాళ్ళే ఉన్నాడంటుంది. కంపెనీకి డబ్బు కట్టి కేసు తీయించాడు సుదర్శనాచారి. అది రాఘవకు ఇష్టంలేదు. తను చెయ్యని పనికి ఎందుకు ఇలా చెయ్యాలని. కాని అలా చెయ్యటమే నయమని సముదాయిస్తాడు తండ్రి. మార్పు కోసం కొడుకు కోడలిని ఎక్కడికయినా వెళ్ళి రమ్మంటాడు. శ్రీరంగం బయలుదేరుతారు రాఘవ, ప్రసన్నలక్ష్మి. – ఇక చదవండి.]

[dropcap]శ్రీ[/dropcap]రంగం చేరుకున్నారు దంపతులు ఇద్దరు. శ్రీరంగంలోని రంగనాథుని కోవెల అత్యంత పెద్దది. భారతదేశం లోని దేవాలయాలలో అత్యంత పెద్ద దేవాలయాలలో ఇది ఒకటి. శ్రీవైష్ణవులకు ముఖ్యమైన దేవాలయం ఇది.

రామానుజులు ప్రతిపాదించిన శ్రీవైష్ణవానికి పట్టుకొమ్మ ఈ శ్రీరంగం. ఈ దేవాలయం ఏడు విశాల ప్రాకారాలతో ఉంటుంది. ఊరు కూడా ఈ ప్రాకారాల మధ్యకు వ్యాపించి ఉంటుంది. 21 గోపురాలతో  ఉంటుంది ఈ కోవెల. ఈ దేవాలయం రాజగోపురం ప్రపంచంలో ఎత్తైన రాజగోపురంగా పేరు పొందింది. శ్రీరంగనాథుడు దేవేరి రంగనాయికతో కొలువైన పురమిది.

ఇక్కడ విశిష్టాద్వైతం వెల్లువిరిసింది.

శ్రీవైష్ణవుల తవియల్ అయిన

“శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం

యతీంద్ర ప్రణవం వందే రమ్యజామాతరం మునిం॥”

ఈ పురంలో రంగనాథుడు ప్రసాదించాడని అంటారు.

ఇక్కడి స్వామి ఉదయం తిరునారాయణ పురంలో మేల్కొని, తిరుమలలో సుప్రభాతసేవ చేయించుకొని, ప్రయాగలో స్నానమాడి, బదిరికావనంలో జపమాచరించి, పూరిలో ఆరగింపు చేసి అయోధ్యలో రాచకార్యం సలిపి, బృందావనంలో విహరించి, శ్రీరంగంలో శయనిస్తాడని వైష్ణవుల నమ్మకం.

వైష్ణవమత గురువులు యమునాచార్యులవారిది శ్రీరంగమే. వారి శిష్యుడే రామానుజులు.

యమునాచార్యుల రచనలు సిద్ధాంతపరంగా అతి ముఖ్యమైనవి. వీటిని సిద్ధిత్రయం అంటారు. ఆత్మసిద్ధి, సంవిదసిద్ధి, ఈశ్వరసిద్ధి గురించి చెప్పేదే సిద్ధిత్రయం. వీరి రచనల ప్రభావంతో రామానుజులు విశిష్టాద్వైత ప్రతిపాదన చేశారని చెబుతారు వైష్ణవులు.

శ్రీరంగం కలియుగ వైకుంఠమని పరవశించే శ్రీవైష్ణవులు కోకొల్లలు. శ్రీరంగం దర్శించాలని కోరని వైష్ణవుడుండడు.

ప్రసన్నలక్ష్మికి కూడ శ్రీరంగంలో కొలువైన రంగనాథుని దర్శించాలని, రంగనాయికను అర్చించాలని చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక. అది తీరుతుందని ఆమె అనుకోలేదు. ఇలా తన భర్తతో కలిసి రావటం ఆమెకు ఎంతో సంతోషానిచ్చింది.

ఆమె శ్రీరంగం చేరినప్పటి నుంచి ఆనందం అవధులు దాటింది. ఇద్దరు స్నానాలు చేసి పట్టుబట్టలు ధరించి కోవెలకి వెళ్ళారు.

అంతర్మందిరంలోని మూల రంగనాథుడిని దర్శించి ఆమె భక్తి ప్రపత్తులతో కీర్తించింది.

పాశురాలలో దాదాపు 200 పైగా పాశురాలు రంగనాథుని గురించి పొగిడినవే. అవి ఆమె హృదయంలో మెదిలాయి.

“కావేరి విరజా సేయం వైకుంఠం రంగమందిరమ్।

సవాసుదేవో రంగేశః ప్రత్యక్షం పరమం పదమ్॥” అంటు రంగనాథున్ని కొలుచుకుంది.

అమ్మవారిని “కావేరి.. శ్రీరంగేశ మనోహరి.. కళ్యాణకారి కలుసాని… నమస్తేసు శుభాచరి…” అని కీర్తించుకుంది. ఆమె హృదయం భక్తితో పొంగారగ “బావా! మీకు కృతజ్ఞతలు. శ్రీరంగనాథున్ని ఈ కన్నులతో చూశాము. హృదయం నిండింది…” అంది భక్తితో.

రాఘవ ఆశ్చర్యపడ్డాడు. ఆమె భక్తి చూసి, ఆ ఆనందం చూసి.

“ఏమి కావాలని మొక్కుకున్నావు?” అడిగాడు ఆశ్చర్యంగా.

“ఏమి కావాలి నాకు? అడగనివి ఎన్నో ఇచ్చాడు. ఆ స్వామే నా స్వామి రూపంగా వచ్చాడు. ఇంకేం కావాలి నాకు? మీరు సంతోషంగా ఉండాలి…” అన్నదామే అరమోడ్పు కన్నులతో. ఆమెను, ఆమె సంతోషాన్ని చూస్తూ ఆశ్చర్యపోయాడు రాఘవ. అతనికి తెలిసి ఆమె అంత సంతోషపడ్డ సందర్భం లేదు. కోవెలలో కూర్చొని  ఆలోచనలో పడ్డాడు రాఘవ.

తాను అదృష్టం చేతిలో రాయిలా ఉన్నాడు. ఎందుకిలా జరుగుతోంది? అన్న ప్రశ్న లోలోపల తొలచసాగింది.

అతని మౌనాన్ని మరోలా అనుకొని ఆమె మిన్నుకుండిపోయింది.

వారు శ్రీరంగంలో రెండు రోజులున్నారు. ఆ రెండురోజులు ఆమె మరో లోకంలో ఉన్నట్లుగా ఉంది. అతనికి ఆమె ఆనందం భంగపర్చడం ఇష్టం లేక మౌనాన్ని ఆశ్రయించాడు.

“మనం వెళ్ళాలిగా ఇక!!” అని అన్నాడు రాఘవ.

“నీకు ఈ దివ్యదేశాలన్ని చూపితే సరి కదా అని అనుకుంటున్నాను” అని అన్నాడు ఆమె ముఖం లోకి చూస్తూ. ఆమెకు కళ్ళు మిళమిళ మెరిసాయి.

“మనం ఈ భూమి మీద చూడతగ్గవి 106 ఉన్నాయి…” అంది.

“సరే! చూడగలిగినన్ని చూద్దాం. సరియా?” అన్నాడు.

ఆమె ముఖంలో వెలుగుతున్న కాంతులకు అతనికి పూర్ణమైన భావన కలిగింది.

దాదాపు దివ్యదేశాలు చాలామటుకు తమిళనాడులోనే ఉంటాయి. కంచి చుట్టుప్రక్కల, తంజావూరు వద్ద, రామేశ్వరం వద్ద… ఇలా.

రాఘవ శ్రీరంగంలో టూరిస్ట్ గైడును ఒకతనిని సంపాదించాడు. అతను శ్రీవైష్ణవుల కుర్రాడే. అతనికి అక్కడంతా కొట్టిన పిండే. రాఘవతో కలిసి వచ్చి తమిళనాట ఉన్నవి చూపించటానికి సమ్మతించాడు.

కోవెలలో అర్చకస్వాములు నవదంపతులనుకొని వారికి వారు చూడవలసిన క్రమంతో లిస్టు ఇచ్చాడు.

రాఘవ ఒక కారు మాట్లాడుకొని అందులో తమిళనాడు యాత్ర చేశాడు. తమిళనాట ఉన్న ఆ పుణ్యక్షేత్రాలు తిరుగుతు ఇద్దరు దాదాపు పదిహేను రోజులు గడిపేశారు.

దక్షిణ తమిళనాట పదిహేను రోజులు తిరిగి కేరళలోని తిరువనంతపురంలో శ్రీపద్మనాభస్వామి కోవెలకొచ్చారు. అక్కడ రెండు రోజులు ఆగి రెస్ట్ తీసుకున్నారు.

తిరువనంతపురంలో పద్మనాభుడు అంటే నాభిలో పద్మం కలవాడని పేరు. ఈ దేవాలయానికి ట్రావెన్‌కోర్ రాజులు ధర్మకర్తలు. ఇక్కడి కోనేరులో స్నానం వలన అనంతమైన పుణ్యం లభిస్తుందని పేరు.

ఈ దేవాలయం నేలమణిగలో సంపదను తరువాత కనిపెట్టారు. ఆనాటికి ఇంకా ఆ సంగతి తెలియదు. అందుకని అన్ని కోవెలలో ఉన్నంత ప్రాముఖ్యతనే తప్ప మరోకటి ఆ కోవెలకు లేదు. రాఘవ అక్కడ్నుంచి ఇక వెనకకు మళ్ళుదామా? ఇంకా ఉత్తరభారతం కూడ తిరుగుదామా? అన్న ఆలోచనలో పడ్డాడు. ఆనాటికి ఇంకా సెల్‌ఫోనులు లేవు. హైదరాబాదుకు ట్రంకాల్ చేశాడు రాఘవ.

సుదర్శనాచారి ఫోనులో పలికాడు.

“నాన్నా! మేము కేరళ వచ్చాము…” అన్నాడు రాఘవ.

“బావుందా అక్కడ?”

“ఆ… నార్త్ కూడ వెళ్ళుదామా? అని ఆలోచన…”

“వెళ్ళండి. ఇప్పుడే అన్ని చూసి రండి…”

“అమ్మ…”

“అమ్మ బానే ఉంది.. ఇస్తానుండు…”

ఆండాళ్లు మాట్లాడింది. ప్రసన్నలక్ష్మి తన సంతోషం పంచుకుంది. వాళ్ళను అన్నీ చక్కగా చూసి రండి అని ఆమె కూడా ఉత్సాహపరిచింది.

ఆ రోజు కారును పంపేసి నార్త్ వెళ్ళాలని ప్లాన్ చేశాడు రాఘవ.

కేరళ నుంచి ఢిల్లీ వెళ్ళి, అక్కడ ఉన్న దివ్యదేశాలు చూడాలని.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here