కైంకర్యము-5

2
13

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[dropcap]నా[/dropcap]చారంలో ఒక పెద్ద ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించాడు రాఘవ. అది సుదర్శనాచార్యుల రెండు అంతస్తుల భవనం. ఆయన ఊర్లో పేరున్న పెద్ద లాయరు.

ఆ ఇంటి చుట్టూ ఎత్తైన కాంపౌండు గోడ. గేటు దాటి లోపలకడుగిడితే, అటు ఇటూ పెద్ద కొబ్బరి చెట్లు నాలుగు ఉన్నాయి. ఒక వైపు జాగాలో విశాలమైన తోట ఉంది. తోటలో గులాబీలు, మందారాలు, మల్లె తీగ, విరజాజి తీగ, చేమంతులు, బంతులు విరివిగా పూచి, కళ్ళకింపుగా కనపడుతున్నాయి. జామ చెట్టు విరగగాసింది. మరో ప్రక్క దానిమ్మ కాయలు, సీతాఫలం, నిమ్మ అన్ని చెట్లు పళ్ళతో ఊగుతున్నాయి. తోట మధ్యలో ఉసిరి చెట్టు, ఆ చెట్టుకు చుట్టూ సిమెంటు చప్టా వేసి ఉంది. అటు పక్కనే నాలుగు ఇనుప కుర్చీలు, చిన్న బల్ల ఉన్నాయి.

తోటలో ఈశాన్యము మూలన బావి ఉంది. దానికి మోటరు, నీరు పట్టేందుకు వీలుగా ట్యూబు ఉన్నాయి. ఆ తోటలో ఉత్తరంవైపు ప్రహరీ గోడకు ఆనుకొని రెండు గదుల చిన్న షెడ్డు తోటమాలి ఉండటానికి వీలుగా ఉంది. అందులో మాలి నారన్న, అతని భార్య రంగి ఉంటారు. రంగి ఇంట్లో పనులు, నాగన్న బయట పనులు చూస్తూ ఉంటారు.

ఇంటి ముందు ఒక కారు పార్కు చేసి ఉంది. సుదర్శనాచారి కోర్టుకు తీసుకువెళ్ళే కారు అది కాదు. ఆ కారు లేదక్కడ.

రాఘవ బండిని పోర్టికోలో ఆపి, ‘నాన్నగారు ఇంకా రాలేదు. గుడ్!’ అని అనుకుంటూ సన్నగా విజిల్‌ వేస్తూ, ఒక ప్రక్కగా నడిచి, మేడ మెట్ల మీదుగా పైకి వెళ్ళాడు.

పైన ఒక పెద్ద హాలు. దాని తలుపులు దగ్గరకు వేసి ఉన్నాయి. ఆ హాలులోకి వెళ్ళకుండా బారుగా ఉన్న బాల్కనీ ప్రక్కగా ముందుకు వెళ్ళాడు. ప్రక్కకు తిరిగితే ఉన్న గదికి తాళం వేలాడుతోంది. తన దగ్గర ఉన్న తాళంచెవితో తాళం తీసి లోపలికి వెళ్ళాడు.

అదే రాఘవ గది. దానికి బాల్కనీ నుంచి ఒక దారి కాక, గదిలో మరో ద్వారం ఆ ఇంటి లోపలికి దారి ఉంది. ఆ గదికి అటాచ్ బాత్‌రూం. గదిలో ఒక మంచం, మరో ప్రక్క టేబుల్, కుర్చీ ఉన్నాయి. విశాలమైన ఆ బెడ్రూమ్‌లో మరో వైపు పెద్ద అలమార, అందులో కొన్ని బుక్స్, ఒక ప్రక్క గిటారు, ప్రక్కనే టీవీ, టీవీ ముందు సోఫా ఉన్నాయి. గదికి నీలి రంగు పెయింటు వేసి ఉంది. ఉన్న రెండు పెద్ద కిటికీలకు తెల్లని తెరలు వేలాడుతున్నాయి. కిటికినీ ఆనుకొని ఉన్న తోటలోని మామిడి కొమ్మలు ఊచలకు తగులుతున్నాయి. తోటలోని సంపెంగ చెట్టు కూడా మరో కిటికీ ప్రక్కనే ఉన్నందున, గదంతా సంపెగపూల సువాసనతో నిండి ఉంది.

గది శుభ్రంగా తుడిచి ఉంది. రాఘవ గదిలోంచి బయటకు పోగానే రంగి వచ్చి క్లీన్ చేసి వెడుతుంది.

రాఘవ గదిలోకి వచ్చి కీస్ టేబుల్ మీదకు విసిరి, మంచానికి అడ్డంగా పడ్డాడు. టైం చూసుకుంటే రెండు. ఆకలిగా అనిపించి లేచి స్నానం చేశాడు. తెల్లని పైజామా, నీలి చొక్కా వేసుకొని లోపలి వైపు తలుపు తీసుకు క్రిందికి వచ్చాడు.

మెట్లు దిగగానే పెద్ద హాలు వస్తుంది. అది దాటుకు వెడితే లోపల భోజనాల గది. ఒక వైపు పెద్ద వంటగది. మరో వైపు సుదర్శనాచార్యుల పడకగది. సుదర్శనాచార్యులు, ఆండాళ్ళు, రాఘవ తల్లిదండ్రులు. కుదుమట్టంగా ఉండి మాములు పొడవు, తెల్లటి తెలుపు, బట్టతలతో, చురుకైన కళ్ళతో సుదర్శనాచార్యులు చూడగానే ఆకర్షించడు కాని, ఆయన మనుషులను కనిపెట్టేయగలడు. చాలా నెమ్మదైన మనిషి ఆయన. ఆయన మాట్లాడితే మాత్రం ఆయనకు తెలియని విషయం ఉండదేమో అనిపిస్తుంది. ఆయన వాదనాపటిమ ముందు ఎవరూ నిలబడేవారు లేరు. ఆ మాటామంతీ ఆయనకు బాగా పేరు తెచ్చాయి ఊళ్ళో.

ఆండాళ్ళమ్మ పసుపు పచ్చని చాయలో, పెద్ద కళ్ళతో ఆకర్షణీయంగా ఉంటుంది. చూడగానే ఆయన కంటే కొద్దిగా పొడుగనిపిస్తుంది. బక్కపలుచగా ఉండే ఆమె ఆరుగురు పిల్లల తల్లి అంటే ఆశ్చర్యమే. ఇంట్లో ఉన్న పిన్నత్తగారిని చూసుకుంటూ కూడా ఎక్కడా అలిసినట్లు కనపడదు. ఆండాళ్ళు పరమ ఆచారవంతురాలు. సుదర్శనాచారికి ఆచారమంటే అంత సొంపు కాదు. అందుకే పూజాపునస్కారాల జోలికి పోడు. కాని ఆండాళమ్మ చెప్పినవి చేస్తాడు. ఆమె మాత్రం అన్నీ పద్ధతిగా పాటిస్తుంది.

రోజులో చాలా సేపు మడిసై కట్టుకొని ఉండే ఆచారం ఆమెది. ముఖాన రూపాయి కాసంత కుంకుమ బొట్టు, చేతులకు డజను బంగారు గాజులు, అరడజను మట్టిగాజులతో, కాళ్ళకు పట్టీలు, మువ్వలతో, చెవులకు రవ్వల దుద్దులతో, ముక్కుకు వజ్రపు బేసరితో మెరిసిపోతూ ఉంటుంది. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ పనులు జరిగిపోతాయి. అది ఆమె నేర్పు.

వారికి నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు. రాఘవాచార్యులు కడగొట్టు బిడ్డ. అందరూ రాఘవ కంటే వయస్సులో చాలా పెద్దవాళ్ళు. అన్నలలో ఒకరు ఢిల్లీ, ఒకరు కలకత్తా, ఒకరు అమెరికాలో ఉన్నారు. అక్కలలో ఒకరు మద్రాసు, మరొకరు తిరుపతిలలో ఉన్నారు. రాఘవ ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు.

వారింట సుదర్శనాచారి పిన్నిగారు పెద్దదిక్కుగా ఉంటారు. ఆవిడే సుదర్శనాచారిని పెంచింది. ఆమె వంటగది ప్రక్కనే ఉన్న చిన్న గదిలో ఉంటుంది. ఆమె సంరక్షణ ఆండాళ్ళమ్మదే కానీ, ఆ పిన్నిగారు గట్టి పిండం. ఎనభైలలో కూడా చాలా ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆవిడే ఆండాళ్ళును చూసుకుంటున్న చందాన నడుపుతుంది వ్యవహారం.

వంటగది వెనక ఉన్న విశాలమైన వరండాకు గ్రిల్ పెట్టించారు. ఆ వరండా నుంచి తోట లోనికి వెళ్ళవచ్చు. పెద్దావిడ తోటలోకి, ఇంటిలోకి తిరుగుతూ అందరినీ ఒక కంట కనిపెడుతూ ఉంటుంది. తేడాలు వస్తే సుదర్శనాచార్యుల చెవిలో పడేస్తుంది. ఆండాళు అమాయకురాలని ఆమె అభిప్రాయం. ఆ వరండాలో ఒక కూర్చునే కుర్చీపీట, దాని ముందు మరో పీట మీద వ్యాసపీఠం ఉన్నాయి. వ్యాసపీఠం మీద భాగవతము ఉంది. ఆండాళ్ళు పని అయ్యాక, పెరుమాళుకు నివేదించి, అందరికీ భోజనాలు పెట్టి వచ్చి కూర్చుంటుంది. సాయంత్రం వరకూ భాగవతం చదువుతూ గడుపుతుంది. భాగవతం అయ్యాక రామాయణం. అలా ఎన్నిమార్లు పారాయణం చేసిందో ఆమెకు లెక్క తెలియదు. కానీ, అది తప్ప మరో ధ్యాస ఉన్నట్లుగా అగుపించదు ఆమెకు.

రాఘవ క్రిందికి వచ్చేసరికే, తల్లి వంటగది వరండాలో భాగవతం చదువుతోంది అలవాటుగా.

గజేంద్రమోక్షంలోని పద్యాలు. తంబూరా మీటుతూ హృద్యంగా పాడుతోంది ఆమె.

“కలడందురు దీనులయెడ
కలడందురు పరమయోగి గణములపాలం
కలడందురన్ని దిశలను
కలడు కలండనెడువాడు కలడో లేడో!”

అంటూ సావేరి రాగంలో ఆ పద్యము పాడుతుంటే వినేవారికి మనసు ద్రవించిపోతుంది.

అక్కడే ఉన్న నులక మంచంపై పెద్దావిడ పడుకొని వింటోంది. మధురమైన కంఠము ఆండాళ్ళుది. పైపెచ్చు సంగీతం కూడా వచ్చు ఆమెకు. సంప్రదాయ సంగీతం నేర్చుకుంది. చదవటం, రాయటంతోపాటూ వాళ్ళ కుటుంబాలలో తప్పని సరిగా సంగీతం నేర్పుతారు.

మధురమైన స్వరంతో భాగవత పద్యాలు పాడుతుంటే వింటూ రాఘవ ఆగిపోయాడు.

ఆ పద్యమయినాక వచ్చి నాన్నమ్మ ప్రక్కన కూర్చొని గారంగా పిలిచాడు “అమ్మా! ఆకలి…” అన్నాడు ముద్దులు గునుస్తూ.

తలతిప్పి చూసి “నీవెప్పుడొచ్చావురా చంటీ!” అంటూ లేచి వచ్చింది ఆండాళ్ళమ్మ.

“ఎటు పోయినావురా నాయనా? నిన్న రాత్రి కనపడలేదు…” అడిగింది పెద్దావిడ ఆరాగా.

“నా దోస్త్ పుట్టినరోజు పార్టీ ఇచ్చినాడు నాన్నమ్మా. దానికి పోయాను. అమ్మా! సాపాటు పెట్టు…” అన్నాడు తల్లితో.

ఆండాళ్ళు లేచి లోపలికి వెళ్ళింది.

అన్నం వడ్డిస్తూ, “రాత్రికే వస్తావనుకున్నానురా. ఇంత ఆలస్యం చేసావేమిటి?” అడిగింది.

“నా ఫ్రెండు తోటకెళ్ళాము. అక్కడే తిని, రాత్రికి ఉండి ఉదయం లేచి వచ్చాను…” చెప్పాడు.

“రాత్రులు ఇంటికొచ్చేసేయి నాయనా! నాన్నగారు అడిగారు నిన్ను…” అంది తల్లి ప్రక్కనే కూర్చొని కొసరి కొసరి వడ్డిస్తూ.

తల ఊపాడు రాఘవ తింటూ.

తిన్నతరువాత రాఘవ లేచి, చెయ్యి కడుక్కుంటుంటే, “అయితే మీ దోస్తులు ఏం పెట్టారురా? ఏం తిన్నావు అక్కడ? రాత్రంతా ఏంచేసారేమిటీ కుర్రాళ్ళంతా? ఆడపిల్లలు కూడా వచ్చారా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది పెద్దావిడ.

“అదేం లేదు బామ్మా… కేకు తిని వచ్చాను. ఒట్టు!” అంటూ గబగబా పైకి వెళ్ళిపోయాడు.

అక్కడే ఉంటే, ‘నాన్నమ్మ ప్రశ్నలను తప్పించుకోలేము, పట్టేస్తుంది చేసిన పని’ అనుకున్నాడు. మొదటిసారి తప్పిన ఆచారం గడబిడ పెడుతోంది లోపల. తల్లి పాడుతుంటే వినాలని ఉంది కానీ ప్రస్తుతం అలసటగా కూడా ఉంది. అందుకే మాయమయ్యాడు అక్కడ్నుంచి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here