కైంకర్యము-57

0
12

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[అనేక ఇబ్బందులు పడుతూ రాఘవ కాకినాడ నుంచి రాజమండ్రి దగ్గరకి  చేరుకుంటాడు. గోదావరి ఒడ్డున నిలబడి ఆ యతిని స్మరిస్తాడు. దర్శనం ఇవ్వమని వేడుకొంటాడు. స్నానం చేసి మళ్ళీ ప్రార్థిస్తాడు. సాయంత్రం వరకు అక్కడే ఉండి, బయల్దేరుతాడు. దారిలో హవాయి చెప్పు తెగిపోతుంది. అక్కడ చెప్పులు కుడుతున్న ఒక వృద్ధుడు కనబడతాడు. ఆయన దగ్గరకి వెళ్ళి, తన చెప్పు కుట్టడానికి వీలవుతుందా అని అడుగుతాడు రాఘవ. రెండు రోజుల నుండి ఆహారం లేకపోవడం వల్ల బలహీనమవుతాడు. అక్కడ ఆ యతి ఫోటో చూసి స్పృహ తప్పుతాడు రాఘవ. సుదర్శనాచారి భార్య ఆండాళ్ళును రాఘవ వెళ్ళేముందు ఏం చెప్పాడని అడుగుతాడు. కులగురువు దగ్గరకి వెడుతున్నానని చెప్పాడని అంటుందామె. వారిద్దరూ కలిసి రాజన్న ఇంటికి వస్తారు. పలకరింపులన్నీ అయ్యాకా, ఆండాళ్ళు అసలు విషయం చెబుతుంది. రాజన్న ఆమెకు ధైర్యం చెబుతాడు. రాఘవ కర్మశేషం అనుభవించడానికి వెళ్ళాడని, తిరిగి వస్తాడని, బీదలకు అన్నదానం చేయమని చెప్తాడు. మర్నాడు ఉదయం ప్రసన్నలక్ష్మిని తీసుకుని హైదరాబాద్ బయల్దేరుతారు సుదర్శనాచారి దంపతులు. – ఇక చదవండి.]

[dropcap]“మీ[/dropcap] రాజన్న అలా ఎలా చెప్పగలిగారు?” హైదరాబాద్ వెళుతుండగా కారులో అడిగాడు సుదర్శనాచారి.

“అన్నకు అన్ని తెలుస్తాయి..” అన్నది ఆండాళ్లు.

“నాన్న మునుపే చెప్పారు బావ గురించి. నన్ను సుందరకాండ పారాయణం కూడా చెయ్యమని చెప్పారు. మీరు ఈ వారంలో వస్తారని కూడా అన్నారు..” చెప్పింది ప్రసన్నలక్ష్మి.

సుదర్శనాచారికి ఆశ్చర్యం కలిగింది.

“ఇంకా ఏమన్నారు మీ నాయనగారు?” అడిగాడు.

“మిమ్ములను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు మామయ్యా..” అంది.

ఆండాళ్లు చిన్నగా భుజం మీద తట్టింది ప్రసన్నలక్ష్మికి.

హైదరాబాద్ వెళ్ళే వరకు ఆ విషయం ఎవ్వరు మాట్లాడుకోలేదు.

ఆండాళ్లు మాత్రం ఆ రోజు నుంచి బీదవారికి నిత్యం అన్నదానం చెయ్యటం మొదలెట్టింది.

***

“ఏంటి బాబు తెలివితప్పి పడ్డావు?” నెమ్మదిగా కదిలిన రాఘవతో అన్నాడు వామదేవుడు.

“ఏం లేదు..” చిన్నగా కదిలాడు రాఘవ.

రాఘవ చెప్పు కుట్టిన వామదేవుడు అప్పన్నపల్లెకు కాలినడకన వెళ్ళి నారాయణ యతి దర్శనం చేసుకు వస్తాడు ప్రతి ఏడాది.

మునుపటి ఏడు అతను వృద్ధాప్యం వలన జనాలకు భయపడి గుడిలోకి వెళ్లలేక బయటే కూలపడిపోతే, అతనిని పిలిపించి దర్శనం ఇప్పించారు యతివరేణ్యులు.

ఆ వామదేవుడు చెప్పులు కుట్టే కొట్టుకు రాఘవ వచ్చాడు.

ఆ కొట్టులో ఆ యతిమహరాజ్ ఫోటోను చూసి ఒక్కసారిగా కళ్ళు తిరిగాయి.

“ఆ స్వామి ఎవరు..” అడుగుతుండగానే కళ్ళ వెంట నీరు కారింది రాఘవకు.

“వారు అప్పన్నపల్లె లోని శ్రీ పీఠంలో ఉంటారండి. వారి పేరు నారాయణ యతి. వారు మా కులదైవమండి. నేను ప్రతి యేడు కాలి నడకన వారి దర్శనం చేసుకు వస్తానండి..” వివరించాడు వామదేవుడు.

“అక్కడికి ఎలా వెళ్ళాలి తాతా?” అడిగాడు రాఘవ

“ఇక్కడ్నుంచి బస్సుందండి!” ఎలా వెళ్ళాలో వివరించాడు వామదేవుడు.

“మీరు ఏమన్నా తిన్నారండి?”

“లేదు తాతా. తిని రెండు రోజులు” అన్నాడు రాఘవ. “నా వద్ద డబ్బు కూడా లేదు..”

“అయ్యో! పరవాలేదండి. నా దగ్గర రొట్టె ఉంది తినండి..” అంటు తన రొట్టె పంచాడు. “టికెట్టుకు ఈ డబ్బులుంచండి” అని వామదేవుడే పది రూపాయలు చేతిలో పెట్టాడు. “మీరు నా దేవుడి దగ్గరకు వెడుతున్నారు. వెళ్ళి రండి..” అని దీవించాడు వామదేవుడు.

రాఘవకు కళ్ళ నీరు ఆగలేదు. అతను వామదేవునికి నమస్కరించి నెమ్మదిగా నడిచి ఆ ప్రక్కనే ఉన్న బస్టాండ్ చేరాడు.

అప్పన్నపల్లె వైపు వెళ్ళే బస్సు ఎక్కాడు.

***

ఆ రోజు రాత్రికి పది దాటాక చేరాడు అప్పన్నపల్లె. బస్సు దిగి ఆ చీకట్లో ఎవరిని అడగాలో తెలియలేదు.

ఆ బస్టాండ్‌లో దిగిందొక్కడే. బస్సు వెళ్ళిపోయింది రాఘవను దింపి. చప్పుడు దూరమయ్యాక కటిక చీకటికి కళ్ళు అలవాటుపడ్డాయి. ఒక చిన్న బడ్డికొట్టు ప్రక్కనే బుడ్డి దీపంతో వెలుతురు కనపడింది.

అటు నడిచాడు. చిన్న గుడిసె ముందు దీపం వెలుగుతోంది.

“ఎవరూ?” అన్నదొక పురుషకంఠం

“స్వామివారి దగ్గరకు వెళ్ళాలి. దారి చెబుతారా?” అన్నాడు రాఘవ.

ఒక మధ్య వయస్కుడు లేచి వచ్చాడు.

“ఇంత రాత్రివేళ వచ్చారేంటయ్యా? ఇప్పుడు బస్సు కూడ లేదే!” అన్నాడతను రాఘవను చూస్తూ.

“బస్సు చెడిపోయింది. బాగు చేసి బయలుదేరే సరికే ఈ వేళ అయింది..” చెప్పాడతను.

“అవునా. ఇక్కడ వీధి దీపాలు కూడా లేవు. నేను కొట్టు కట్టేశాను ఉండండి..” అని లోపలికెళ్ళి చిన్న లాంతరు తెచ్చాడు.

అది వెలిగించి రాఘవకి ఇస్తూ “ఇలా బారునా వెళ్ళండి బాబు. ఒక రెండు మైళ్ళు నడవాల. అప్పుడు అగుపడుతుంది మీకు గుడి. అక్కడే గుడిసెలుంటాయి.. ఈ లాంతరు పట్టుకుపొండి..” అన్నాడు.

“లాంతరా వద్దులే..”

“చీకటి. మీకు కొత్త. పర్వాలేదు తీసుకుపొండి. నేను రేపు ఉదయం వచ్చి తీసుకుంటాను. మీరు గుడికొచ్చారుగా బాబు. మా సామికాడకొచ్చారు. పర్వాలేదు..” అన్నాడతను ఆప్యాయంగా.

శ్రీ పీఠం కోసమెవరన్నా వచ్చారంటే అప్పనపల్లె ప్రజలు వారికి అతిథి సత్కారాలు చేస్తారు మరి.

రాఘవ మారు మాట్లాడకుండా లాంతర్ తీసుకుని బయలుదేరాడు.

అరగంట నడిచాక గోపురం కనిపించింది. గుడి బయట అంతా కరెంట్ దీపాలు వెలుగుతున్నాయి.

గుడి ప్రక్కన చిన్న గుడిసెలు, కొంత దూరంలో ఒక భవనం కనపడ్డాయి.

గుడి వద్దకు రాగానే ఇక చేతిలో లాంతరు అవసరం లేకపోయింది. అందరు పడుకున్నట్లుగా ఉన్నారు, చడీ చప్పుడు లేదు. రాఘవ గుడి బయట ఉన్న మండపంలో కూర్చున్నాడు. ఆ రాత్రి ఆ మండపంలో పడుకోవాలని నిశ్చయించుకున్నాడు అతను.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here