నల్లమల అడవుల్లో మేడిమల్కల్ కాకతీయ శాసనం

    0
    4

    [box type=’note’ fontsize=’16’] హైదరాబాదుకు 185 కి.మీ.ల దూరంలో వున్న మన్ననూరు, నల్లమల అడవుల్లోని బౌరాపురంకు మరో 10 కి.మీ.ల దూరంలో మేడిమల్కల్ అనే చిన్న చెంచుగ్రామం వుంది. ఆ వూరిచివర అడవిలో వున్న ఓ శాసనం వివరాలను అందిస్తున్నారు శ్రీరామోజు హరగోపాల్.[/box]

    రాష్ట్రరాజధాని హైదరాబాదుకు 185 కి.మీ.ల దూరంలో వున్న మన్ననూరు, నల్లమల అడవుల్లోని బౌరాపురంకు మరో 10 కి.మీ.ల దూరంలో మేడిమల్కల్ అనే చిన్న చెంచుగ్రామం వుంది. ఆ వూరిచివర అడవిలో వుంది ఈ శాసనం.

    శాసనంలో మేడిమల్కల్‌కు పూర్వనామం ‘మేడిమ లంకలు’ అని వుంది.

    మేడిమల్కల్ శాసనం కాకతీయుల కాలంలో వేయించినది. శ్రీపర్వతం(శ్రీశైలం)లోని స్వయంభువుడైన శ్రీలింగచక్రవర్తి మల్లికార్జున మహాలింగదేవుని కలుమఠానికి పూర్వదత్తమైన మేడిమలంకలు అనాదిగా చెల్లుతుండంగ నడుమ కొంతకాలం కారణాంతరాలవల్ల విచ్ఛిత్తి కాగా మహామండలేశ్వరుడు కాకతీయ ప్రతాపరుద్రుడు రాజ్యం చేస్తున్న కాలంలో శక సం.1211 విరోధినామ సం.ఫాల్గుణ శుధ్ద 15(పౌర్ణిమ),సోమ(చంద్ర) గ్రహణం సందర్భంగా అనగా క్రీ.శ.1290 సం. ఫిబ్రవరి 25న, కాకతీయ మహాసామంతుడు చెరకు ఇమ్మడి బొల్లయరెడ్డివారు శ్రీ మల్లినాథదేవుని అంగ,రంగ భోగాలకు గాను కలుమఠానికి అక్కడ శాశ్వతంగా వుండే శివాచార్యుల చేత ధారాపూర్వకంగా (మళ్ళీ) ఇచ్చిన మేడిమలంకలు  ఆచంద్రార్కస్థాయిగా వుండాలని భావించారు.

    సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలానికి సమీమంలోని జలాల్పూర్ ఒకప్పుటి  జమ్మలూరు. చెరకు ఇమ్మడి బొల్లయరెడ్డి మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ దాకా విస్తరించిన  జమ్మలూరు పురవరాధీశ్వరుడు చెరకు ఇమ్మడి విశ్వనాధుని కుమారుడే ఈ బొల్లయరెడ్డి(?).

    ఈ శాసనస్తంభం ఎరుపురాయి. శాసనం స్పష్టంగా, పెద్ద,పెద్ద తెలుగు అక్షరాలలో చెక్కివుంది. లిపి 13వ శతాబ్దంనాటి తెలుగు. ఈ శాసనంలో క,ళ, రకార పొల్లులు ప్రత్యేకం. 7,8 శతాబ్దాల నాటి ళ. ర కార పొల్లులు, 11వ శతాబ్దంనాటి క ఈ శాసనంలో కనిపిస్తాయి. రెండువైపుల 38పంక్తులలో చెక్కబడిన శాసనమిది. శాసనం రెండవ వైపు కాకతీయుల సాంప్రదాయికమైన సూర్య,చంద్రులు, శివలింగం, ఖడ్గం, ఆవు చిహ్నాలు చెక్కివున్నాయి. శాసనం చివర దానశాసన సంప్రదాయం ప్రకారం శాపోక్తి శ్లోకం ‘‘స్వదత్తాం పరదత్తాం’’ చెక్కివుంది.

    ఈ శాసనం తేదీ గొప్పమనిషి, ప్రఖ్యాత చరిత్రకారుడు మల్లంపల్లి సోమశేఖరశర్మ పరిష్కరించిన  ప్రసిద్ధమైన రాగిరేకుల ‘ఉత్తరేశ్వర శాసనం’ తేదీ ఒక్కటే కావడం యాదృచ్ఛికం, చారిత్రాత్మకం.

    మేడిమలంకలు అనబడు మేడిమల్కల్ శాసనపాఠం:

    1. @స్వస్తిశ్రీ శ్రీపర్వత శ్రీ
    2. స్వయంభు శ్రీలింగచక్రవర్తి
    3. శ్రీ మల్లికార్జున మహాలింగ
    4. దేవుని కలుమఠమునకు పూ
    5. (ర్వో)దత్తైన మేడిమలంకలు
    6. అనాది సంసిద్దమై చెల్లు
    7. చుండగాను నడుమం
    8. గొంతకాలము విచ్చిత్తై(వు)
    9. 0డితేని స్వస్తి శ్రీ మ
    10. హామండలేశ్వర కాక(తి)
    11. య్య ప్రతాపరుద్రదే(వ)
    12. మహారాజులు ప్రిథ్వి (రా)
    13. జ్యము సేయుచుండ(గా)
    14. ను స్వస్తిశ్రీ శక వర్ష
    15. ములు 1211లవు
    16. విరోధి సంవత్సర ఫా
    17. ల్గుణ శు15వ నాండి
    18. (సో)మగ్రహణకాలమున
    19. ….డు స్వస్తిశ్రీ మహాసా
    20. మంత చెఱకు ఇమ్మడి బొల్ల
    21. మరెడ్డివారు శ్రీ మల్లినా…

    రెండవవైపు

    సూర్యుడు,(చంద్రుడు)

    శివలింగం,ఖడ్గము, ఆవు చిహ్నాలు

    1. థ దేవుని అంగరంగ భో
    2. గాలకు కలుమఠనకు శ్రీ
    3. మతు శాశ్వత శివాచా
    4. ర్యుల చేత ధారాపూర్వ
    5. కము సేసి ఇచ్చి మేడిమ
    6. లంకలు ఆచంద్రార్క
    7. స్థాయిగా భావించిరి మ
    8. 0గళ మహా శ్రీశ్రీశ్రీ

    శాపోక్తి శ్లోకం:(8 పంక్తులు)

    1. స్వదత్తా ద్విగుణంపుణ్య
    2. 0 పరదత్తానుపాలనం
    3. పరదత్తాపహారేణ స్వ
    4. దత్తం నిష్ఫలం భవేత్
    5. స్వదత్తం పరదత్తం వా
    6. యో హరేతి వసుంధరాం
    7. షష్టిర్వర్ష సహస్రాణి
    8. విష్టాయాం జాయతే క్రిమిః

    మొత్తం శాసనం 37 పంక్తులు

    (శాసనం ఫోటోల కర్టెసీః వివేక్, తెలంగాణ టుడే, మహబూబ్ నగర్)

                    ఈ శాసనాన్ని చదివి,శాసనపాఠం రాసింది  శ్రీరామోజు హరగోపాల్.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here