‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’-1

0
9

[డా. మంత్రవాది గీతా గాయత్రి గారు 1995లో పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

ప్రకరణం 1 కాకతీయులు – మొదటి భాగం:

[dropcap]సు[/dropcap]మారు మూడువందల సంవత్సరాల పైగా ఆంధ్రదేశంలో పరిపాలన సాగించి ప్రజోపయోగ కార్యాలెన్నో చేసి సంగీత సాహిత్యాది లలిత కళలను ప్రోత్సహించి ఆంధ్రదేశానికీ, సంస్కృతికి ఒక ప్రత్యేకతను కలిగించిన కాకతీయ ప్రభువుల చరిత్ర ఆంధ్రదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ దగింది. క్రీస్తు పూర్వం మూడవ శతాబ్ది నుండి ఆరువందల సంవత్సరాల పాటు ఆంధ్రదేశాన్ని పాలించిన శాతవాహన చక్రవర్తుల తరువాత అంతటి సువిశాల సామ్రాజ్యాన్నేలిన వంశం కాకతీయ వంశమే. ఇప్పుడు ఆంధ్రభాష వ్యవహారంలో ఉన్న ప్రదేశాన్నంతటినీ తమ ఏకచ్ఛత్రాధిపత్యం లోకి తెచ్చి, ఆంధ్ర భావానికి అంకురార్పణ చేసినవారు కాకతీయ చక్రవర్తులు. వీరి పరిపాలన కాలంలోనే మతపరంగానూ సాంఘికంగానూ ఎన్నో పరిణామాలు కలిగాయి. మత సామరస్యంలోగానీ, సంస్కృతాంధ్ర వాఙ్మయ పోషణలోగానీ ప్రజోపయోగ కార్యాల విషయంలోగానీ, కేంద్ర స్థాపక ప్రభుత్వ విధానాల్లో గానీ, గ్రామ పరిపాలనా వ్యవస్ధలో గానీ, లలిత కళా పోషణలోగానీ కాకతీయ చక్రవర్తులు ఈనాటికీ ఆదర్శప్రాయులే. వీరి కాలంలో త్రవ్వించిన తటాకాలు ఇప్పటికీ ప్రజలకు ఎంతో ఉపయోగ పడుతున్నాయి. ఆనాడు కట్టించిన హనుమకొండ, పాలంపేట, రామప్ప పిల్లలమఱ్ఱి ఓరుగల్లు మొదలైన ప్రదేశాలలోని ఆలయాలు ఆంధ్రుల శిల్ప నైపుణ్యాన్ని చాటి చెబుతున్నాయి. ఈ విధంగా ఆంధ్రదేశం సర్వతోముఖాభివృద్ధి చెందిన కాకతీయుల కాలంలోనే వీరశైవ మతం అత్యున్నత దశనందుకున్నది. వీరశైవమతం స్త్రీలను పురుషులతో సమానంగా సంభావించినదని ఆనాటి శైవ సాహిత్యం వల్ల తెలుస్తున్నది. ఆ కాలంలో శక్త్యారాధన కూడా విశేషంగా ఉండేది. ఏకవీర, కాకతమ్మ, మాహురమ్మ, ఎల్లమ్మ, కామవల్లి మొదలైన గ్రామదేవతలను కొలిచేవారు. ఒక స్త్రీ రాజ్యాధికారాన్ని చేపట్టటం ఊహకందని కాలంలో కాకతీయుల ఆడపడుచు విశాల సామ్రాజ్యానికి సామ్రాజ్ఞియై యుద్ధాలలో పాల్గొని శత్రువులను సంహరించి, రాజ్యాన్ని సుస్ధిరంగా పరిపాలించినదంటే ఆకాలంలో స్త్రీలు అన్ని రంగాలలోనూ రాణించి ఉంటారను కోవటానికి ఆస్కారమున్నది.

అసలు అంతరించి పోయే దశలో ఉన్న కాకతి వంశాన్ని తిరిగి నిలబెట్టినది విరియాల కామసాని అన్న స్త్రీ. కాకతీయులు సామంత దశ నుంచి స్వతంత్ర రాజులుగా, సామ్రాజ్యాధినేతలుగా ఎదగడానికి వారికి నతవాటి కోట తూర్పు చాళుక్య వంశాలతో గల వివాహ సంబంధ బాంధవ్యాలు ఎంతో తోడ్పడినాయి. అంటే కాకతీయ సామ్రాజ్య స్ధాపనకు విస్తరణకు ఆ వంశపు స్త్రీలు పరోక్షంగా సహకరించారని, ఆనాటి స్త్రీలు సాంఘికంగా, రాజకీయంగా కూడా ముఖ్యమైన పాత్ర వహించేవారని భావించవచ్చును. కానీ శాతవాహన, ఇక్ష్వాకు వంశపురాజుల కాలంలో వలె స్త్రీలు వేదాధ్యయనం చేయటం, విద్వత్సభలలో పాల్గొనటం జరగలేదు. యజ్ఞయాగాది క్రతువులలో భర్త ప్రక్కన కూర్చోవడమేగాని స్వయంగా యజ్ఞాలు, హోమాలు చేయడానికి అర్హురాలు కాలేక పోయింది. కాకతీయుల కాలంలో వేశ్యాలోలత్వం, దేవదాసీత్వం అంతకు ముందు కన్నా పెచ్చు పెరిగినాయి. అన్నివర్గాలలోనూ, కులాలలోనూ వేశ్యా వృత్తి ప్రబలింది. దీనికి శైవ వైష్ణవ మతాలు మరింత ప్రోత్సాహమిచ్చినాయి. అంతేకాదు, స్త్రీలలో కులస్త్రీలు, వేశ్యలేగాక సానులు భోగస్త్రీలనే వర్గాలు కూడా ఏర్పడినాయని ఆనాటి శాసనాల వలన తెలుస్తున్నది. సానులు దేవాలయాలనాశ్రయించుకొని దేవుని అంగరంగ భోగాదికాలు నిర్వర్తించేవారు.

ముందు విధంగా విచ్చలవిడి తనం సంఘంలో ప్రబలిన ఆకాలంలోనే స్త్రీలని పవిత్రంగా ఉంచేందుకు కట్టుదిట్టంగా నీతి, ధర్మశాస్త్రాలెన్నో బయలుదేరినాయి. వేదవిద్యకి అనర్హులైన స్త్రీలకోసం పురాణాలు రచింప బడినాయి. పాతివ్రత్య మహిమ గొప్పదని చాటి చెప్పే పురాణాలు, కావ్యాలతో పాటు, వారిని మానసికంగానూ, శారీరకంగానూ పవిత్రంగా ఉంచే ప్రయత్నంలో ఎన్నో వ్రతాలు, పూజలు చేసే విధానాలు చెప్పే గ్రంథాలు అనేకం వెలువడినాయి. శైవుడు కాని భర్తను వదిలివేయాలని, శివునిపై భక్తిని మించినది మరొక ధర్మం లేదని స్త్రీలనుద్బోధిస్తూ వీరశైవమతం ఒకవైపు, భర్తే దైవమని, పాతివ్రత్యాన్ని మించిన ధర్మం స్త్రీకి లేదని మరొకవైపు ధర్మశాస్త్రాలు ఉద్బోధిస్తూ ఉండేవి. ఇక వేశ్యావృత్తి నవలంబించే స్త్రీలు సాంఘికంగానూ, ఆర్ధికంగానూ మంచి దశననుభవించారని ఆనాటి కావ్య శాసన, సాహిత్యం వలన తెలుస్తున్నది. ప్రతాపరుద్ర చరిత్రలో “అగణ్య వస్తు వాహన శోభితంబైన వేశ్యాగృహంబులు 1,27,000” అనడం వల్ల వేశ్యలు ఎంతో వైభవమైన జీవితం గడిపేవారని తెలుస్తుంది. క్రీడాభిరామంలో – మాచల్దేవి అనే వారాంగన వైభవం, ఆమె భవనం, చిత్ర శాలా ప్రవేశం, గృహంలో ఉన్న వస్తువుల వర్ణనను బట్టి కూడా కాకతీయులనాటి వేశ్యల, సాంఘిక, ఆర్ధిక స్థితులు ఎంత గొప్పగా ఉన్నాయో తెలుస్తుంది.

కాకతీయుల కాలంలో రాజకీయంగా స్త్రీలు ప్రముఖ పాత్ర వహించారనటానికి నిదర్శనాలు రాణి రుద్రమ, కోట గణపాంబ, నాయకురాలు నాగమ్మ వంటి వారు. అటువంటి కాలంలో స్త్రీలు సాంఘికంగా, ఆర్థికంగా సామాజికంగా ఎలాంటి స్ధానం వహించారన్నది పరిశీలించవలసిన విషయము. ఏ వంశంవారైనా చిన్న మండలాధీశులుగా ఉన్నపుడు సమాజంపైన వారి ప్రభావం అంతగా ఉండదు. అదే స్వతంత్రులై స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించినపుడు వారు అనుసరించే విధానాలు, తీసుకున్న చర్యలు సంఘానికి మార్గదర్శక మౌతాయి. ‘యథా రాజా తథా ప్రజా’ అన్న నానుడి పై విషయాన్ని బలపరుస్తున్నది. కనుక కాకతీయ యుగము అన్నపుడు నేను వెన్నమరాజు, గుండరాజు, బేతరాజు వంటి ప్రాచీన కాకతీయ సేనానులను, మండలాధీశుల కాలాన్ని పరిగణించలేదు. ప్రఖ్యాతులై, బలవంతులైన తోటి సామంతులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకొని, సామంతరాజుల స్థితినుంచి ఎదిగి స్వతంత్ర రాజ్య స్ధాపనకు, అంకురార్పణ చేసిన రెండవ ప్రోలరాజు కాలంనుండి కాకతీయ వంశంలో ప్రఖ్యాతి చెందిన ఆఖరి చక్రవర్తి రెండవ ప్రతాపరుద్రుడి కాలంవరకు అంటే దాదాపుగా క్రీ.శ.1100 నుండి క్రీ.శ 1320 వరకు ఉన్న కాలాన్ని నేను కాకతీయ యుగంగా పరిగణించుకున్నాను. ఆనాటి స్త్రీల సామాజిక స్థితిగతులను తెలుసుకొనే ముందు కాకతీయుల గూర్చి తెలుసుకోవలసిన అవసరమున్నది.

కాకతీయులు – కులదేవత:

కాకతీయుల కాపేరు ఎలా వచ్చింది? కాకతీయులెవరు? ఎక్కడివారు? అని పరిశోధకులు ఎంతో శోధించి చర్చించారు. ప్రతాపరుద్ర చక్రవర్తికి అంకిత మీయబడిన ప్రతాపరుద్రీయంలో కాకతి అనే దుర్గాశక్తిని ఏకశిలా ప్రభువులైన కాకతీయులు కులదేవతగా ఆరాధించటం వలన వారు కాకతీయులైనారని ఉన్నది. వినుకొండ వల్లభరాయని క్రీడాభిరామమును బట్టి ఓరుగల్లులో కాకతమ్మ గుడి ఉండేదని తెలుస్తున్నది. కాకతి అంటే గుమ్మడి తీగ అని, ఒక రాజాంతఃపురమును శత్రువులు ముట్టడించినపుడు ఒక శిశువు అంతఃపుర గవాక్షం నుండి జారిపడి గుమ్మడి తీగెలో చిక్కుకొని శత్రువుల నుండి తప్పించుకొన్నాడని, అతడు పెరిగి పెద్దవాడై సంస్థానాధీశుడైనాడని, అతని వంశీయులందరు తమ వంశాన్ని రక్షించిన గుమ్మడి తీగను గౌరవించి ఆ పేరు మీద కాకతీయులమని చెప్పుకొనేవారని అని తల్లి కలువ చేరు శాసనం వల్ల తెలుస్తున్నది. కాకతీయులు మొదట జైనులుగా ఉన్నప్పుడు వారు కొలిచిన దేవత కూష్మాండిని అనే జైన దేవత అని, కూష్మాండమనగా గుమ్మడి అని, కాకతి అనే మాటకు గుమ్మడి తీగ అనే అర్థమున్నదనీ, కూష్మాండినియే కాకతీయులు కొలిచే కాకతిదేవత అని, వారి వంశనామము కూష్మాండిని వల్ల కలిగిందని డా. మారేమండ రామారావుగారి అభిప్రాయం. శ్రీ.కె. రాఘవాచార్యులు గారు ఈ విషయాలు చర్చించి ఈ విధంగా తెలిపారు. రెండవ ప్రోలరాజు పద్మాక్షి దేవాలయ శాసనంలోని జినేంద్ర స్తుతిని బట్టి జైన మతావలంబకుడని ఊహించి, జైన గ్రంథాలలో ఇరవై రెండవ తీర్థంకరుని దేవి కూష్మాండిని అని తెలపవడం వల్ల ఒకదానితో ఇంకకటి ముడిపెట్టి కాకతి కూష్మండిని అనే జైనదేవత అని రాస్తున్నారు కానీ కాకతి (కాకిత) అనే దేవత జైనదేవత అని ఎక్కడా తెలపబడలేదు. విద్యానాధుని ప్రతాపరుద్రీయంలో కాకతీయకుల దుర్గాదేవి సమారాధనేన విజయప్రస్థాన మంగళం కృత్వా అని ఉన్నదని, అని తల్లి కలువ చేరు శాసనంలో కూడా ఈమె శక్తి స్వరూపిణి అని ఉన్నది కనుక కాకతి అనే పేరు దుర్గకు మరో నామమనీ, కాకతిని కొలిచేవారు కనుక ఆ వంశీయులు కాకతీయులని వ్యవహరింపబడినారని ఆయన ఊహించారు. ఆయన తమ మిత్రులు బౌద్ధ వాఙ్మయములో కాకతి అనే దేవత ఉన్నదని భావి పరిశోధన విమర్శన వల్ల తెలియవలసిందని రాశారు.

శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారు తాము పరిష్కరించి ప్రకటించిన ‘క్రీడాభిరామం’ గ్రంధంలోని పీఠికానుబంధం “కాకతి” అన్న శీర్షికతో నున్న వ్యాసంలో పై విషయాలను ఉటంకించి చర్చించి, ‘కాకతి’ శక్తి నివాసమును బట్టి కాకతి పురమని పేరు యేర్పడినది కావచ్చునని తెలిపారు. కాకతి తొలుత బౌద్ధదేవత పేరు అయి వుండవచ్చునని, తరువాత హైందవత చెంది శివుని శక్తి పేరయి మార్పుచెంది ఉండవచ్చునని తెలిపారు. మధుర, నాసిక్ బౌద్ధ శాసనాలలో కాకతీయ, కాఖండి నామములు ఉన్నాయని, శక్తి మంత్రాలలో కాది మంత్రమొకటి ఉన్నదని, కాది మంత్రాధి దైవతము శివుని శక్తికి మూర్తిభేదము అని, కనుకనే కాకతి దుర్గ అని ప్రతాపరుద్రీయ వాఖ్యాత చెప్పడం సంగతమేనని తెలిపినారు. కాకతీయ రాజ్యము ప్రధానంగా వ్యాపించిన కృష్ణాతీరం ఒకప్పుడు బౌద్ధ మత ప్రాచుర్యం కలది. నాసిక బౌద్ధ గుహాశాసనాలలో కాకతీయ, కాఖండ పదాలు కూడా ఉండటం వల్ల కాకతీయులు మొదట బౌద్ధులుగా ఉండవచ్చునని, కాకతి కూడా మొదట బౌద్ధదేవత అవడం సంగతమేనని వారు తెలిపారు. వారు ముక్త్యాల జమీందారుగారి మ్యూజియం కొరకు సేకరించిన వానిలో కాకతి విగ్రహమున్నదని దాని ఛాయను తమ గ్రంథంలో ఇచ్చారు. ఆ విగ్రహానికి నాలుగు చేతులున్నాయనీ, తలపై కబాయి కుళాయి ఉన్నదనీ, చెవులకు కమ్మలు, ముందరి కుడిచేత డమరుకము యెడమ చేత కపాలమున్నదని, వెనుక కుడి చేతిలో జింకపిల్ల (?) ఉన్నదనీ, ఎడమ వెనకటి చేతిలో త్రిశూలమున్నదని, మెడలో కంఠహారము, పాదాలకు పాజేబులు ఉన్నాయని, పీఠానికి దిగువ వరాహమున్నదని తెలిపారు. పై వర్ణనను బట్టి కాకతి దుర్గాశక్తి అనిపించవచ్చును. అయితే దీనికి భిన్నంగా ఉన్న కాకతి దేవత విగ్రహం ఒరిస్సాలోని భువనేశ్వర్ కి 65 కిలోమీటర్ల దూరంలో కాకట్‌పూర్ అనే గ్రామంలో ఉన్నది. అక్కడ శ్రీలంక నుంచి తీసుకువచ్చిన మంగళాదేవి దేవతాలయం ఉన్నది. ఆమె బౌద్ధ దేవత అని అక్కడి పండాలు చెప్పారు. ఆ ఆలయానికి ఎడమ చేతివైపు రెండు చిన్నగుడులున్నాయి. అందులో ఒకటి ఈశ్వరునిది, రెండవ ఆలయంలో ఉన్న దేవత కాకతి అని, ఆమె అక్కడి గ్రామదేవత అని అక్కడి పూజారులు చెప్పారు.

ఆ దేవత విగ్రహానికి నాలుగు చేతులున్నాయి. పద్మాసనంవేసి కూర్చున్న ఆ మూర్తి క్రింది కుడిచేతిలో జపమాల, ఎడమ చేతిలో క్రిందకి స్వస్తి ముద్ర చూపినట్లున్నది. పైనున్న ఎడమ చేయి రొమ్ము పై నున్నది. విగ్రహం ముందు భాగం అరిగిపోవడం వల్ల స్పష్టంగా చెప్పటం కష్టం. పైనున్న కుడిచేతిలో పద్మము ఉండి, దాని కాడ క్రింది కుడి చేతిలో ఉన్నట్లు కూడా భావించవచ్చు. అది బౌద్ధ దేవతకు లక్షణమని మంగళాదేవికి కూడా ఆవిధంగానే పై కుడి చేతిలో పద్మము, క్రింది చేతిలో దాని నాళం ఉన్నట్లు అక్కడి పూజారులు చెప్పారు. ఆ మూర్తి ధ్యానంలో ఉన్న దేవతగా తోస్తుంది. దుర్గ లేక శక్తికి సంబంధించిన దేవతా మూర్తి సాధారణంగా త్రిశూలం, ఖడ్గం వంటి ఆయుధాలు ధరించి, అస్థిమాలలు, కపాలం వంటి వాటిని కలిగి ఉండటం కద్దు. కానీ ఈ కాకతి మూర్తి వాటికి భిన్నంగా ధ్యానముద్రలో ఉన్నది. బహుశా ఈ మూర్తి బౌద్ధ దేవత అయి వుంటుంది. ఒరిస్సాలో ఆ ప్రదేశం అంటే ఆనాటి కళింగ ప్రాంతం ఒకప్పుడు బౌద్ధమత ప్రాచుర్యం ఉన్న ప్రదేశమే. ప్రస్తుతం జగన్నాధుడుగా పిలవబడే పురుషోత్తముడు బుద్ధ భగవానుడేనని చారిత్రకులంటారు. వీటన్నింటినీ బట్టి చూస్తే ఈ దేవత కాకతి అన్న బౌద్ధదేవతదయి ఉంటుందని భావించవచ్చును.

కాకతి ఖండి, కాకతి కాస్ అన్న పదాలు శాసనాలలో ప్రసక్తమైనాయి. ఒడ్డాది జయంతి రాజు కొడుకు మత్స్యకుల తిలకుడు అయిన అర్జునుడు దానం చేసిన దిబ్బిడ అగ్రహారం సరిహద్దులలో ఒకటి కాకతి ఖండి అని పేర్కొనబడింది. మధుర బౌద్ధశాసనంలో కాకతిక బౌద్ధసన్యాసుల గురించి పేర్కొన బడింది. ఈ వివరాలు డాసన్ తమ ఏషియాటిక్ సొ సైటీ వారి జర్నల్ ఇస్తూ విహారా ఆఫ్ కాకతికాస్ అన్నదాన్ని గురించి పేర్కొన్నారు. వీటన్నింటిని బట్టి కాకతి బౌద్ధ దేవత అనీ, లేదా కాకతికులు అనే బౌద్ధ భిక్షువులు ఉండే వారని కృష్ణానదీ తీరం నుండి గోదావరీ మండలం, కళింగం వరకు తూర్పు సముద్రతీరంలో వ్యాపించి ఉన్న బౌద్ధమతశాఖకు వారు చెంది ఉండేవారని చెప్పవచ్చు. ఈ కాకతీయులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు చెప్పినట్లు బౌద్ధ మతాన్ని ఆదరించిన శాతవాహన, ఇక్ష్వాకుల సామంతులు అయి వుండవచ్చును. వారు చెప్పిన ఈ విషయాలన్నీ కూర్చి ఈ క్రింది విధంగా సమన్వయించ వచ్చును.

కాకతీయులు తమ కులదేవత అయిన కాకతిని ఆరాధించేవారు. దాన్నిబట్టి వారు కాకతీయులైనారు. శాతవాహన ఇక్ష్వాకు వంశాలవారికి సామంతులుగా ఉన్న కాలంలో బౌద్ధ మతంలో తాంత్రిక విధానం ప్రారంభమైనపుడు కాకతీయుల గ్రామదేవత అయిన కాకతి బౌద్ధదేవతగా పూజింపబడి ఉంటుంది. తరువాత కాకతీయులు రాష్ట్రకూటులకు సామంతులై జైనమతాన్ని సమర్ధించి ఆ తరువాత పశ్చిమ చాళుక్యులకు సామంతులై శైవమతాన్ని అనుసరించారు. గణపతిదేవుని ముందు కాకతీయులు కాలాముఖ శైవ మతాన్ని అనుసరించినవారు. కాలాముఖ శైవమతంలో శక్తి పూజ కూడా ఉన్నది. కాకతీయులు కాలాముఖ శైవాన్ని అవలంబించినపుడు బౌద్ధదేవతగా ఉన్న కాకతి దుర్గాశక్తి గా రూపాంతరం చెంది ఉంటుంది. మధ్యయుగంలో బౌద్ధ జైన మతాలు హిందూ మతంలో లీనమై బుద్ధుడు విష్ణువు దశావతారాల్లో ఒకరుగా జైన తీర్ధంకరులు వీరభద్రాది శైవదేవతలుగా ఆరాధింపబడినపుడు బౌద్ధదేవత కాకతి దుర్గకు ప్రతిరూపంగా భావింపబడి పూజలనందుకున్నది. కాకతీయులు ఏ మతాన్ని అనుసరించినా తమ కుల దేవత కాకతిని ఆరాధించడం మానలేదు. వారు స్వీకరించిన మత ప్రభావం కులదేవత స్వరూపంపై పడి ఉంటుంది. ఒరిస్సాలోని కాకతి దేవత బహుశా ఆదిలో కాకతీయులు ఆరాధించిన దేవతామూర్తి అని భావించవచ్చును.

కాకతీయుల నివాస స్థానం:

కాకతీయుల మూలపురుషుడైన వెన్నమరాజు కాకతిపురాన్ని ఏలినాడు కనుక అతని వంశీయులు కాకతీయులైనారని మైలాంబ వేయించిన బయ్యారం శాసనం వల్ల తెలుస్తుంది. ఈ కాకతిపురం అన్నది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న ప్రదేశంలో లేదు. ఈ పేరుతో రెండు గ్రామాలు ఉన్నాయి. ఒకటి మైసూరు రాష్ట్రమని ఒకప్పుడు చెప్పబడిన కర్నాటక రాష్ట్రం లోని బెల్గాం సమీపంలో ఉన్నది. అది వారి ప్రథమ నివాసస్థానం కావచ్చునని డా. పి.వి. పరబ్రహ్మశాస్త్రిగారు అభిప్రాయపడ్డారు. రెండవది ఒరిస్సాలోని కాకట్‌పూర్ అన్నది. కాకట్ అన్న పదం ఒరియా భాషలో లేదని అది కాకతి అన్న దేవత పేరు మీద వచ్చిన గ్రామనామమనీ సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు డా. రాజగురు గారు చెప్పారు. ఇంతకుముందు చెప్పినట్లు కాకతి అన్న దేవతకు అక్కడ ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. కాకతీయులు రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండి తరువాత కల్యాణీ చాళుక్యుల సామంతులైనపుడు బహుశా వారు బెల్గాం సమీపంలోని కాకతి అన్న గ్రామంలో తమ కులదేవతను ప్రతిష్ఠించి ఉంటారు. అక్కడ ఇప్పటికీ గుడి ఉన్నది. ఆ గ్రామానికి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో పురాతనమైన కోట శిధిలాలు ఉన్నాయి. దీనికి దగ్గరలో సిద్ధేశ్వరాలయమున్నది. కాకతి ఊరులో ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఏప్రిల్లో జాతర జరుగుతుంది, కానీ కాకతి గుడిలో ఇప్పుడు దేవత విగ్రహం లేదు. గుడిని పునరుద్ధరించి శివలింగం ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. బహుశా కాకతీయులు కల్యాణీ చాళుక్యుల సామంతులుగా ఉన్నప్పుడు ఈ కాకతి పురాన్ని ఏలినా, తరువాత తెలుగుదేశానికి చాళుక్యుల ప్రతినిధులుగా వచ్చి ముందు కొరవిలోను ఆ తరువాత అన్మకొండలోనూ, స్థిరపడి ఉంటారు. వారు తెలుగుదేశానికి వచ్చినపుడు తమ కులదేవతను వెంటతెచ్చుకొని స్వతంత్రరాజులై చక్రవర్తులై ఓరుగల్లును రాజధానిగా చేసుకొన్నప్పుడు కాకతికి గుడి కట్టించి తాము తెచ్చుకున్న కాకతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉంటారు.

కాకతీయుల నివాసస్థానం గురించి శ్రీ ఎన్. లక్ష్మీనారాయణ గారు ‘ది కర్నాటిక్ హిస్టారికల్ రివ్యూ’ డైమండ్ జూబిలీ సంవత్సర పత్రికలో వ్యాసం వ్రాశారు.

అందులో వారు కాకతీయులు స్వయంభూదేవుని సేవించే వారే కానీ కాకతమ్మని కాదు అని కాకతి అన్న ప్రదేశంలో ఉండటం వల్ల వారికీ పేరు వచ్చిందని చెప్పి (కాకతీయులకు చెందని) కాకతి ప్రదేశానికి చెందిన ఇతరుల శాసనాలను మూడింటిని ఉదహరించారు.

  1. అందులో ఒకటి శక సం. 1172 (క్రీ.శ 1250) నాటి మందపూరు శాసనం. ఇది కన్నడ శాసనం. చాముండరాజు త్రికూటాలయానికి దానం చేసిన సందర్భంలో వేయించినది. అందులో కాకతి గ్రామ ప్రసక్తి ఉన్నది.

(అ) చాముండరాజ మాడిసిద త్రికూట ప్రాసాదక్క.. (ఆ) కాకతీయ బాదదలి శ్రీ మల్లేశ్వర దేవర నివ్వెద. (ఇ) కె కొత్త గద్దె పన్నెరడు మత్తరు.

  1. రెండవది ఎపిగ్రాఫికా కర్నాటికా వాల్యూం లోని ఒక శాసనంలో కాకతి గ్రామనివాసి అయిన నాడోజుని ప్రసక్తి ఉన్నది. “కాకత్తియ ఆగతి భైరోజన మగ నాడోజను”. దాని కాలం క్రీ.శ.1378.
  2. మూడవది తాని బెన్నూరు తాలూకాలోని హలగేరి లోని శాసనం. ఇదీ క్రీ.శ.14వ శతాబ్దిలోనిది. అందులో కాకతికి చెందిన నరసనాయని అనేవాని స్థలం దానం చేసిన వివరాలున్నాయి.

దేవియ అమ్రిత పడిగె తిప్పె నాయకన కొమర మాలె వర గావిండ కాకతీయ నరసె నాయకారు బలిగెరెయాలి కొల్తవ్రిత్తి.

పై శాసనాలలో కాకతి అన్న పదం ప్రదేశానికి సంబంధించి ప్రయుక్తమైంది. అందులో మొదటి శిలాశాసనం ఆ గ్రామానికి చెందినది కనుక బెల్గాం జిల్లాలోని మందపూరుకి దగ్గరలో ఉండి ఉంటుందని లక్ష్మణరావుగారు వెదకి చివరకు పూనా బెంగుళూరు హైవేమీద బెల్గాంకి 6 కి.మీ. దూరంలో కాకతి గ్రామం ఉన్నదని, ప్రాచీన కట్టడాలున్న పాత పట్టణం ఆ ఊరు పరిసరాలలో ఉన్నదని తమ వ్యాసంలో తెలియజేశారు. ఈ విషయాన్ని తెలిపి కాకతీయులు కన్నడిగులనీ, కాకతి అన్న గ్రామంలో ఉన్నారు కనుక వారు కాకతీయులైనారని, కల్యాణీ చాళుక్యుల సామంతులుగా ప్రారంభంలో ఉండి, ఆ పదవులలో ఉన్నపుడే వారు హనుమకొండకు చేరుకున్నారని, కన్నడిగులు కనుకనే కాకతీయుల పూర్వీకుల శాసనాలు కన్నడంలో ఉన్నాయని వారు తమ వ్యాసంలో చెప్పారు. శ్రీ లక్ష్మణరావుగారు ఉదహరించిన శాసనాలన్నీ క్రీ.శ.1270 తరువాతవే. కాకతీయులు కల్యాణిచాళుక్యుల కంటె ముందు రాష్ట్రకూటుల సామంతులు. పైగా కాకతి పురంలో ఉండటం వల్లకాక, వారికీ పేరు కాకతి అన్న దేవత వల్ల కలిగిందని ఇంతకు ముందే చెప్పడమైంది. కాకతీయులలో స్వయంభూదేవుని పాదపద్మారాధకులని చెప్పుకోవడం రుద్ర దేవుని నుండే ప్రారంభమైంది. అంతకుముందు వారు పరమమాహేశ్వర, అన్మకొండ పురవరేశ్వర అని చెప్పుకొన్నారు.

కాకతీయులు కన్నడిగులు కనుకనే కన్నడ భాషలో శాసనాలున్నాయని లక్ష్మణరావుగారు చెప్పారు కానీ తరువాత కాకతీయులు సంస్కృత, తెలుగు భాషలు రెండింటిలోనూ శాసనాలను వేయించారు. ఆంధ్రులని చారిత్రకుల చేత పరిగణింప బడిన శాతవాహన చక్రవర్తులు, ఇక్ష్వాకులు, వారి స్త్రీలు వారి శాసనాలను సంస్కృత ప్రాకృత భాషల్లో వేయించారు. కనుక శాసనాలలో భాషను బట్టి శాసనం వేయించిన వారి ప్రాంతీయతను కనుక్కోలేము. శాసనాలను రాజులు, ప్రజలు ఆదరించే రాజభాష, దేశభాషలలో వేయించడం సాంప్రదాయం. దానిననుసరించే కన్నడం దేశభాషగా ఉన్నచోట కాకతీయులు కన్నడభాషలో వేయించి ఉంటారు.

ఆంధ్రదేశంలో కూడా కన్నడ భాషను వ్యవహరించే ప్రాంతాలుండేవి. తెలుగు కంటే ముందు కన్నడ లిపిలో శాసనాలు ప్రారంభమైనాయి. కరీంనగరులోని శనిగరం లోనూ కన్నడ శాసనాలున్నాయి. సాహిత్యం వెలువడింది.

కన్నడ కవిత్రయంగా ప్రసిద్ధికెక్కిన వారిలో పంప, పొన్న కవులు ఆంధ్రులేనని చెప్తారు. కనుక కాకతీయులు వారుపయోగించిన భాషను బట్టి కన్నడిగులనీ, చెప్పడానికి వీలులేదు. వారు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు చెప్పినట్లు శాతవాహన ఇక్ష్వాకు వంశాల చక్రవర్తులకు సామంతులై ఉండవచ్చును. వారి సామర్థ్యం, శూరత్వం ప్రఖ్యాతి చెంది, కాకతీయ వంశం వారంటే ఆంధ్రదేశంలోని సామంతవంశాల వారికీ, ప్రజలకూ అభిమానం ఉండి ఉంటుంది. తరువాత రాజకీయ కారణాల వల్ల వారు ఇక్కడి నుంచి వలస వెళ్ళి రాష్ట్రకూటుల సామంతులుగా ఉండి వేంగి చాళుక్యులపై దండయాత్రలు చేసి ఉంటారు. కనుకనే కాకతి బేతరాజును తిరిగి రాజుగా నిలబెట్టిన విరియాల కామసాని చర్యను “కాకతి నిల్పుట కోటి సేయదే” అని గూడూరు శాసనంలో కీర్తించారు. కాకతీయులు కన్నడరాజులైతే వారి రాజ్యాన్ని స్థాపించడానికి ఇక్కడి సామంతులు అంత పాటు పడవలసిన అవసరం ఉండదు. ఈ విషయాలను పరిశీలించి ఈ విధంగా సమన్వయించవచ్చును.

ఆంధ్రులైన కాకతీయులు శాతవాహన ఇక్ష్వాకు వంశాల వారికి సామంతులై, ఆ రాజవంశాలు అంతరించినాక రాష్ట్రకూటులకు, ఆ తర్వాత కల్యాణీ చాళుక్యులకు సామంతులుగా ఉన్నపుడు వారి దేవత కాకతిని బెల్గాం సమీపంలో ప్రతిష్ఠించి ఆ పురంలో ఉండి వేంగి చాళుక్యుల అంతః కలహాలలో జోక్యం కలిగించుకొని అవకాశం దొరకగానే ముందు కొరవిలోను, ఆ తరువాత అనుమకొండలోనూ రాజ్యస్థాపన చేసి, తమతో తెచ్చుకున్న కులదేవత కాకతిని ఓరుగల్లులో ప్రతిష్ఠించి ఉంటారు.

ఓరుగల్లులో కాకతీయ సామ్రాజ్యం నశించాక ఈ వంశం వారు కళింగ దేశం అంటే ఇప్పటి ఒరిస్సాను చేరుకొని ఉండవచ్చును. క్రీ.శ.1323లో ఓరుగంటి కాకతీయ సామ్రాజ్యము భగ్నమై తెలంగాణాలో ముస్లిం పరిపాలన ఏర్పడిన తరువాత ఉలుగ్ ఖాన్ తీరస్థాంధ్రాన్ని జయించి అక్కడి నుండి కళింగ రాజ్యంలోని జాజ్‌నగర్‌పై దండెత్తాడు. కాని జాజ్‌నగరును స్వాధీనపరచు కోకుండా వెనుతిరిగి పోయాడు. ఆనాటి కళింగ చక్రవర్తి రెండవ వీరభానుదేవుడు ఘియాజుద్దీనును జయించినట్లు అతని పౌత్రుడు నాలుగవ వీర నరసింహదేవుని పూరీ తామ్ర శాసనంలో పేర్కొన్నాడు. “రాజ్ఞోయస్య గయాసదీన సమర ప్రారబ్ధ శౌర్యక్షత ప్రౌఢానేక నరేంద్ర కంధర గలత్కీలాల పూర్ణా వనిః / తత్కాలక్షత వక్షసః కరికులాత్ స్పారోస్థితః శోణితాసారోద్యాపి దిగంతరేస్తి విలసత్ సంధ్యాను రాగచ్ఛతాత్”. బహుశా ఓరుగల్లు పై ముస్లిములు దాడి చేసినప్పుడు కొంతమంది కాకతీయ రాజవంశజులు కళింగం చేరి రెండవ వీరభానుదేవుని ఆశ్రయం పొంది ఉండవచ్చు. లేదా కాకతిపురం నుంచి వచ్చిన కాకతీయులలో రాజ్యార్హత పోగొట్టుకొన్న దాయాదులు కళింగం చేరుకొని గాంగుల ఆశ్రయం పొంది ఉండవచ్చును.

కాకతీయుల వంశ నామం:

క్రీ.శ. 956 నాటి దానార్ణవుని మాంగల్లు శాసనంలో కాకతీయుల పూర్వీకుడు కాకర్త్యగుండ్యన గురించి ప్రస్తావించబడినది. అతని పేరులోని కాకర్త్య, కాకత్య కాకతియ్య, కాకెత, కాకతీయ అని వివిధ రూపాలుగా మారి ఉండవచ్చును. పైన చెప్పబడ్డ కాకర్త్య గుండన తండ్రి ఎఱియ రాష్ట్రకూట, తాత గుండియ రాష్ట్రకూట అయితే గుండ్యన రాష్ట్రకూట అనే నామాంత్య పదాన్ని వదలి కాకర్త్య అనే ఉపసర్గనెందుకు చేర్చాడో ఆలోచింపవలసిన విషయము. రాష్ట్రకూట పదం వలన రాష్ట్రకూట వంశానికి చెందినవారైనా కావచ్చును లేదా రెడ్డి, కరణము వంటి గ్రామోద్యోగి పదవిని గుండ్యన తండ్రి తాతలు నిర్వహించి ఉంటారు. గుండ్యన తన తండ్రి తాతల వలె కేవలం గ్రామాధికారి పదవి చేపట్టక ఒక మండలానికే పరిపాలకుడైనందువలన న్యూనతను స్ఫురింపజేసే రాష్ట్రకూట శబ్దాన్ని విడిచి తన వంశ నామాన్నే సగౌరవంగా ధరించి ఉంటాడని ఒక అభిప్రాయమున్నది.

కాకతీయుల వంశనామం గురించి ఇంకా వాదోపవాదాలున్నాయి. మాంగల్లు శాసనంలో సామంతవొద్ది అనీ, క్రీ.శ.1098 నాటి కాజీపేట దర్గాశాసనంలో సామన్త విష్టి అని వీరి వంశనామం తెలుపబడినది. మొదటి శాసనంలో ఎన్నో తప్పులున్నాయి కనుక సామంత వొద్ది అన్న పదాన్ని సామంత విష్టి అని సరిచేయవచ్చును. విష్టి అన్న పదానికి వెట్టి అన్న పదం తద్భవం. మధ్య యుగంలో రాజులు ప్రజల సౌకర్యం కోసం చెరువులు, నదులకు ఆనకట్టలు వంటివి కట్టించినప్పుడు ఆయా గ్రామాల ప్రజలచేత వంతుల వారీగా పని చేయించుకునేవారు. దీనికి కూలి చెల్లించేవారు కాదు. దీన్ని వెట్టి చాకిరీ అంటారు. బసవ పురాణంలో పిట్టవ అనే స్త్రీ వెట్టికి బయలుదేరినదని వర్షంలో తడిసి ఆమె మోయలేకపోతే శివుడే ఆమె తట్టను మోశాడని ఉన్న కథను బట్టి ఈ వెట్టి అన్నది ఆనాడు ఉన్నదని తెలుస్తున్నది. ఈ విధంగా ప్రజల చేత వెట్టి చేయించే అధికారులను విష్టి అనేవారని కాకతీయులు కూడా విష్టి అనే అధికారులుగా చాలా కాలం పనిచేశారని డాక్టర్ పి.వి. పరబ్రహ్మశాస్త్రిగారు చెప్పారు. బహుశా అందుకే కాకర్త్య గుండన, రెండవబేతరాజు తమది విష్టి వంశమని మాంగల్లు, కాజీపేట దర్గాశాసనాల్లో చెప్పుకొని ఉంటారు. ఇంకవారి చిహ్నాన్ని గురించి చెప్పాలంటే చాళుక్యుల సామంతులుగా వరాహ ముద్ర నుపయోగించుకున్నట్లే కాకతీయులు రాష్ట్రకూటుల సామంతులుగా గరుడ చిహ్నాన్ని ఉపయోగించుకొని ఉంటారు. రాజులుపయోగించే చిహ్నాలను బట్టి వారి వంశాన్ని నిర్ణయించడం కష్టం. కనుక వారు రాష్ట్రకూటుల సామంతులే కాని రాష్ట్రకూటులలో ఒక శాఖవారు కాకపోవచ్చును.

కాకతీయుల వంశక్రమం:

మాంగల్లు శాసనంలో కాకర్త్య గుండన ముత్తాత గుండియ రాష్ట్రకూటుడనీ, తాత ఎఱియ రాష్ట్రకూటుడనీ, తండ్రి బేతయ అని పేర్కొన్నారు.

మైలాంబ వేయించిన బయ్యారం చెరువుశాసనంలో గుండ, ఎర్ర, పిండి గుండ అనేవారు ముగ్గురి గురించి ఉన్నది. ఇందులోని ఈ ముగ్గురూ మాంగల్లు శాసనంలోని గుండయ రాష్ట్రకూట, ఎఱియ రాష్ట్రకూట, కాకర్త్యగుండ్యనలు కావచ్చును. అయితే కాకర్త్యగుండ్యన తండ్రి బేతయ గురించి బయ్యారం చెఱువు శాసనంలోని వంశక్రమంలో పేర్కొనక పోవడానికి కారణం బహుశా అతడు అకాల మృత్యువు చెందటమో, రాజ్యాన్ని పాలించడానికి అనర్హుడవడమోనని శ్రీ పరబ్రహ్మ శాస్త్రి గారి అభిప్రాయం. మాంగల్లు, బయ్యారం చెఱువు శాసనాలను బట్టి కాకతీయుల వంశవృక్షం ఈ విధంగా ఉంటుంది.

మైలాంబ శాసనం వేయించిన కాలానికి ఆనాటి రాజులు ఎక్కువ మంది తాము దుర్జయుని సంతతి వారమని చెప్పుకొనే వారు. పైగా మైలమ వేయించిన శాసనంలో ఎఱ్ఱ నృపుడికి పిండిగుండకు తండ్రీకొడుకుల సంబంధం ఉన్నట్లుగా పేర్కొనలేదు. కనుక ఎఱ్ఱన తరువాత పిండిగుండ రాజ్యానికి వచ్చాడని సమన్వయించితే మాంగల్లు శాసనంలోని కాకతీయులు, బయ్యారం చెరువు శాసనంలోని కాకతీయులు ఒకే క్రమంలో చెప్పబడ్డారు అని నిర్ణయించి వీరు కాకతీయుల పూర్వీకులన్నది శ్రీ పరబ్రహ్మశాస్త్రి గారు నిర్ధారణ చేశారు. కాకతీయులు కాకతి పురంనుంచి తెలుగు దేశానికి రాష్ట్రకూట సామంతులుగా వచ్చి ఇక్కడే స్థిర పడిపోయారు అని వారు చెప్పారు.

కాకతీయులది విష్టి వంశమని కాజీపేట దర్గా శాసనంలోనూ, మాంగల్లు శాసనంలోనూ ఉన్నది కాని ఇంకెక్కడా లేదు. గణపతి దేవుని కాలంలోని శాసనాలలో వీరు సూర్య వంశ క్షత్రియులుగా చెప్పబడినారు. ఇక విద్యా నాధుడు ప్రతాపరుద్రీయంలో వీరిది సూర్యచంద్ర వంశాలను మించిన వంశమని చెప్పాడు. అయితే అనేక వంశాలవారు తమది సూర్య చంద్ర వంశాలలో ఒక దానికి చెందినదిగా చెప్పటం ఆనవాయితీ. కవులు ప్రభువులను సంతోషపెట్టటానికి అతిశయోక్తులతో సూర్య చంద్ర వంశజులుగా వర్ణించడం పరిపాటి. కాని కాకతీయులకు మొదట నుంచీ నతవాడి వంశం వారితో వివాహ బాంధవ్యాలుండటాన్ని బట్టి నతవాడి వంశంవారు చతుర్థ కులజులు గనుక కాకతీయులు కూడా చతుర్థ కులానికి, సంబంధించిన వారని చెప్పవచ్చును. కాకతీయ గణపతిదేవుని ప్రముఖ సేనాని మల్యాల గుండా ధీశునిబూదపుర, వర్ధమానపుర శాసనాలలో కాకతీయులు చతుర్థ కులజులని స్పష్టంగా ఉండటం” వలన కూడా కాకతీయులు చతుర్థ కులజులని నిర్ధారించారు.

కాకతీయుల గురించి తెలుసుకోవడానికి ఆనాటి ఆ వంశాల స్త్రీలు వేయించిన శాసనాలు ఎంతో ఉపయోగ పడినాయి. కాకతీయులు సామంత రాజులుగా స్థిరపడేటందుకు, స్వతంత్ర రాజ్యం స్థాపించటానికి, సామ్రాజ్యం విస్తరించటానికి, రాజ్య సుస్థిరతకు, ప్రజా హిత కార్యాలకు ఆనాటి స్త్రీ లెంత వరకు తోడ్పడ్డారో, రాజకీయంగా ఆనాటి స్త్రీల పాత్ర ఎంత ఉన్నదో కాకతీయుల చరిత్రని బట్టి తెలుసు కోగలము.

కాకతీయ వంశంలో పూర్వీకులు, సామంతులు, దండనాయకులు:

కాకతీయులలో అతి ప్రాచీనుడు వెన్నమరాజు. ఇతడు కాకతి నగరంలో ఉండేవాడు కనుక అతడి వంశం వారు కాకతీశులైనారని బయ్యారం చెరువు శాసనం వల్ల తెలుస్తున్నది. అయితే గూడూరు శాసనంలో విరియాల వంశం గురించి చెప్పే సందర్భంలో వారి మూల పురుషుడు వెన్నమరాజనీ, దుర్జయ వంశంలో పుట్టాడనీ ఉన్నది. ఈ రెండు కుటుంబాలకు మూలపురుషుడు ఒకరేనా అన్నది పరిశీలించ వలసిన విషయం. గూడూరు శాసనంలోని విరియాల వంశపు వీరుడు (మూల పురుషుడు) బొరంటి వెన్నమ. సిద్ధేశ్వర చరిత్రలో కాకతి రాజుల పూర్వీకుడు వెన్నమరాజని, అతని కొడుకు పోరంకి వెన్నమరాజని చెప్పడం వల్ల పై శాసనంలోని పొరంటి వెన్నమనే సిద్ధేశ్వర చరిత్ర కవి పోరంకి వెన్నమ అని చెప్పి ఉండవచ్చునని శ్రీలక్ష్మీ రంజనంగారు ఊహించారు. కాకతీయుల పూర్వీకుడైన వెన్నమరాజు వేరొకరు కావచ్చును. వెన్నమ అన్న పేరుతో చాలా మంది వ్యక్తులు సమకాలికులు ఉండడం సంభవమే. వెన్నమరాజు వంశంలో తరువాతి వారు కాకతి నగరాన్ని విడిచి ఎక్కడికి చేరారో తెలియదు గానీ సేనాధిపతులుగా చాలాకాలం రాష్ట్రకూట రాజుల కొలువులో ఉండే వాళ్ళని తెలుస్తున్నది. రాష్ట్రకూటులకి తూర్పు కోస్తాలో ఉన్న వేంగీ చాళుక్యులతో బద్ధవైరం కనుక వారి పైన ఎన్నో దాడులు జరిపారు. ఆ సందర్భంలోనే కాకతీయ వెన్నమరాజు వంశంలోని నాల్గవ తరం వాడైన గుండరాజు వేంగీ దేశం మీద దాడిచేసి వేంగిరాజు చాళుక్య భీముడి కొడుకు ఇరిమర్తి గండడి చేతిలో హతుడైనాడు.

గుండరాజు కొడుకు ఎఱ్ఱన. రాష్ట్రకూట రాజులు కొరవి ప్రాంతాన్నేలే ముదిగొండ చాళుక్యుల్ని తరిమి తమ సైన్యాధిపతియైన కాకతీయ గుండన కొడుకు ఎఱ్ఱనను కొరవికి పాలకుడిగా చేశారు. ఇతడి కొడుకు బేతరాజు.

బేతరాజు కొడుకు గుండరాజు. ఇతణ్ణి పిండిగుండ రాజనే వారు. బయ్యారం చెరువు శాసనంలోని పిండి గుండరాజు, కాకర్త్యగుండన, సిద్ధేశ్వర చరిత్రలోని పెండ్లి గుండమరాజు ఒకరేనని చరిత్రకారుల అభిప్రాయము.

ఈ గుండరాజు తన తండ్రితాతల లాగ రాష్ట్రకూట అను నామాంత్య పదాన్ని వదలి కాకర్త్య అను ఉపసర్గను చేర్చుకొన్న దానికి, ఇతనికి పెండ్లి గుండమరాజు అన్న పేరు కలగడానికి కారణాలను కాకతీయ వంశం రాష్ట్రకూటుల వద్ద చిన్న ఉద్యోగులుగా ఉన్న దశనుండి రాజవంశంగా ఎలా చెలామణీ అయినదో చర్చించిన ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు ఆసక్తిదాయకమైన అంశాలను వెల్లడించారు. రాష్ట్రకూటుల వద్ద సామంతునిగా కొరవిని పాలించిన గుండ్యన హనుమకొండలో ఉన్న ప్రాచీనమైన రాజవంశపు స్త్రీని పెండ్లాడటము వలన అతనికి రాజవంశంతో సంబంధ బాంధవ్యా లేర్పడినాయి. వారికి మగ సంతానము లేకపోవటం వల్ల బహుశా గుండనయే ఆ వంశానికి వారసుడైనాడు. అప్పుడితడు తన వంశపు నామమైన కాకర్త్యను ఆ రాజ వంశ నామంతో జోడించటం వలన అతని కాకతీయ వంశం రాజవంశంగాను, వారి మూల పురుషుడు మాధవ వర్మ గాను, వారిది దుర్జయుని వంశంగానూ ప్రసిద్ధి పొందింది. ఇదంతా గుండ్యన రాజనీతి చతురత వలన, రాజవంశపు స్త్రీతో వివాహం జరగడం వలన సాధ్యమైంది. అందుకే ఇతడు పెండ్లి గుండమ రాజుగా ప్రసిద్ధి చెందాడు. ఇతడు రాష్ట్రకూట చక్రవర్తి అమోఘవర్షుని (814-880 A.D) సామంతుడు. ఆనాడు రాష్ట్రకూటులకు తూర్పు చాళుక్యులకు మధ్య తరచుగా యుద్ధాలు జరిగేవి. అమోఘవర్షుని తండ్రి మూడవ గోవిందుడు (క్రీ.శ. 724-814) తూర్పు చాళుక్యుల అంతఃకలహాలలో జోక్యం చేసుకొని వేంగి రాజైన రెండవ విజయాదిత్యునికి వ్యతిరేకంగా నిలిచిన అతని సోదరుడు భీమునీ, సహాయం చేసిన రాష్ట్ర కూటులనీ ఓడించాడు. కనుక భీముడు రాష్ట్ర కూటుల నాశ్రయించక తప్పలేదు. బహుళ వారు దయతో అతడిని హనుమకొండలో సామంత యువరాజుగా నిలిపి ఉంటారు. ఆ విధంగా శరణార్ధులుగా వచ్చి హనుమకొండనేలే తూర్పుచాళుక్య రాజవంశపు శాఖలోని స్త్రీని గుండ్యన వివాహం చేసుకొని ఉంటాడని శ్రీలక్ష్మీ రంజనంగారు అభిప్రాయం వెలిబుచ్చారు.

కాకర్త్య గుండన వివాహం ద్వారా తన వంశపు హోదాను, గౌరవాన్ని పెంచుకొన్న విధం అతని వంశంలో తర్వాతి తరాలవారికి మార్గదర్శకమైంది. రెండవ కాకతిప్రోలుడు నతవాడి వంశపు ఆడపడుచు ముప్పమాంబను వివాహమాడి ఆనాటి తెలుగుదేశంలోని బలవంతులైన సామంతులను తనకు అండగా చేసుకొన్నాడు. కాకతీయ గణపతి దేవ చక్రవర్తి ఈ రాజనీతిని అందరికంటే ఎక్కువగా ఉపయోగించి తన సువిశాల సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకొన్నాడు. సిద్ధేశ్వర చరిత్రలోని కుంతలదేవి కాకర్త్య గుండనకు సోదరి, గరుడ బేత లేక ఎఱుక దేవరాజుకు మేనత్త. కాకర్త్యగుండన తన సోదరి వివాహం విరియాల వంశంలోని ఎఱ్ఱనతో జరిపించడంవల్ల అర్వాచీన కాకతీయులు తమశాసనంలో విర్యాల వంశపు మూలపురుషుడు వెన్నమరాజును తమ వంశపు మూలపురుషునిగా చెప్పుకోగలిగారు. సిద్ధేశ్వర చరిత్రలో ఎన్ని కల్పనలు, అవాస్తవిక కథనాలు ఉన్నప్పటికీ ఎఱుక దేవరాజు మేనత్త కుంతలదేవి అతడు బాలుడుగా ఉన్నపుడు ఆమె అతనికి అండగా ఉన్నదన్న విషయం గూడూరు శాసనంలోని అంశాల ద్వారా చారిత్రకంగా సత్యమని వెల్లడి అయింది. గూడూరు శాసనంలో “వాడ ప్రతిముడు వాని దా మొగడు పర్శియు పండ్రడు నెఱ్ఱడాప్తుడై” అన్నవాక్యాల్లో భావం స్పష్టంగా అర్ధం కాకున్నా “ఎఱ్ఱడాప్తుడై” అన్న పదాల్లో ఎఱ్ఱన ఆప్తుడై ఏదో చేయవలసింది చెయ్యలేక పోయాడు అని అర్థం స్ఫురిస్తున్నది. ఆప్తుడు అనగా బంధువు లేక సన్నిహితుడు అంటే విరియాల వారికి కాకతీయులకి సన్నిహిత సంబంధమున్నదని ఆ పదం వల్ల తెలుస్తున్నది. ఈ సంబంధం బహుశా సిద్ధేశ్వర చరిత్రలో పేర్కొన్నట్టు వివాహం ద్వారా బంధుత్వం కావచ్చును. గుండన సోదరి విరియాల ఎఱ్ఱనకు భార్య అయింది. ఎఱ్ఱన పశ్చిమ చాళుక్యుల తరపున గుండనతో యుద్ధం చేసి సంహరించినప్పటికీ, ఆ వంశంతో తనకున్న బాంధవ్యం వల్ల గుండన కొడుకు గరుడ బేతని చేరదీసి ఉండవచ్చు. ఏదో కారణం చేత ఎర్రన మరణించడం వలన భార్య కామసాని తాను మేనల్లుడికి అండగా నిలిచింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here