‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’ -12

0
7

[డా. మంత్రవాది గీతా గాయత్రి గారు 1995లో పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

ప్రకరణం 3 కాకతీయుల కాలంనాటి సమాజము – స్త్రీలు – నాలుగవ భాగం:

వేశ్యలు:

[dropcap]కా[/dropcap]కతీయుల కాలంలో పురుషుల రసికత శృంగార ప్రియత్వం, భోగలాలసత ఎక్కువగా ఉండేది. పురుషులలో పై గుణాలను కవులు కీర్తించేవారు. సంఘంలో వారిని నాగరికులుగా పరిగణించేవారు. ఈనాడు వేశ్యాలోలుడైన పురుషుని బాహాటంగా గర్హిస్తారు. ఆనాడు అటువంటి వారిని ఘనంగా పొగిడేవారు. వేశ్యలు, రసికజనులు, విటులు, కవులు ఉన్నారన్న ప్రశంస కావ్యాలలో పురవర్ణనలలో తప్పనిసరిగా ఉండేది. మంచెన కేయూర బాహు చరిత్రలో ధనదుపురాన్ని వర్ణిస్తూ

‘చతుర కాంత ప్రసూన వసంతకేళి
రసిక విటజన మధుకరారామలక్ష్మీ
మధురకవి రాజనవ హంస మాన సంబు
నా గ ధనదుపురంబు వర్ణనల దనరు.’

అని ప్రశంసించాడు.

మారన మార్కండేయపురాణంలో కృతిభర్త గన్నయ సేనానిని ప్రశంసించే సందర్భంలో అతనిని రూపవంతుడని, ‘పరాక్రమశాలి’ అని, ప్రభుభక్తి పరాయణుడనే కాక వారస్త్రీలోలుడని కూడా వర్ణించాడు.

‘వార విలాసినీ వదన వారిజ మిత్ర’, ‘భామినీ చిత్త ధామా’ ‘భామినీ పంచబాణా’, ‘మారాస్త్ర దళిత చేతో నారీజన సుప్రసన్న’, ‘ప్రౌఢస్త్రీ మకరాంకా పై విశేషణాలని బట్టి గన్నయ సేనాని వేశ్యాలోలుడని తెలియడమే కాక, ఈ వేశ్యాలోలత్వం పురుషులలో ఎన్నదగ్గ గుణంగా పరిగణించే వారని తెలుస్తున్నది. గన్నయ సేనాని ప్రౌఢస్త్రీ మకరాంకుడే కాదు బాలారతికేళి పాంచాలుడు.

‘కామినీ భద్ర, బాలారతికేళి పాంచాలా’

ఆనాటివారికి వేశ్యలంటే హీనభావం ఉండటానికి వీలులేదు. ఆనాటి సంఘంలో వేశ్యలు అతి ముఖ్యమైన పాత్ర వహించేవారు. అన్ని శుభకార్యాలలో అంటే వివాహం, పట్టాభిషేకం, పండుగలు, పూజలు అన్ని విధాలైన వేడుకలలో వారస్త్రీలు తప్పక పాల్గొనేవారు. కులస్త్రీల కున్నంత గౌరవం వారికి లేకపోయినా ఈనాడు వేశ్యాస్త్రీలంటే ఉండే నీచభావం ఆనాడు లేదు. ఈనాటి సమాజంలో చలనచిత్ర తారలకు ఎటువంటి ఆదరణ, గుర్తింపు ఉన్నదో అదే విధమైన మన్నన గుర్తింపు ఆనాటి వేశ్యలకుండేది. ఆనాటి వేశ్యలు శరీరాన్ని అమ్ముకునే అభాగ్యలు కాదు. సంగీత సాహిత్యచిత్రకళలెన్నో నేర్చి, సౌందర్య సౌభాగ్య చాతుర్యాలలో సురశ్రీలను మించిన వారని ప్రశంసింపబడినవారు.

వారాంగన మాచల్దేవి ‘ప్రతాపరుద్ర ధరణీ శోపాత్త గోష్ఠీ ప్రతిష్ఠా పారీణ’గా ప్రశంసింపబడింది.

వేశ్యల జీవన విధానం – వేశ్యావృత్తి కులవృత్తిగా చేపట్టిన వారు తమ కుమారైలను సుపుత్రి కులదీపకురాలు అని సంభావించేవారు. కూతురు పుట్టిన నాటినుంచి ఎంతో శ్రద్ధ చూపుతూ పెంపకంలో తగు జాగ్రత్తలు వహిస్తూ పెంచేవారు. ఈ విషయాన్ని కేతన దశకుమార చరిత్రలో వేశ్యమాత ద్వారా చెప్పించాడు.

వేశ్యమాత విధులు:

వేశ్యమాత కూతురు పుడితే ఆమెను ప్రేమతో ప్రతిదినం జాగ్రత్తగా గమనిస్తూ పెంచి, యౌవనం రాగానే ఆమెకు అందం, ఆరోగ్యం ఇనుమడించే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. పరిమితమైన ఆహారం ఇవ్వడం, రోజూ నలుగు పెట్టి స్నానం చేయించడం, చదురైన మాటలు అంటే చతురోక్తులు, చక్కగా మాట్లాడటం సంజ్ఞలు వంటివి నేర్పి, శృంగారం జరిపే పద్ధతి చెప్పి, మెత్తని విద్యలు చక్కగా తెలపడం, ఉపచారాలు చేసే నేర్పులను, మెళకువలను తెలపడం చేసేది. సౌభాగ్యం కోసం నోములు నోమించేది.

పేరు పెంపు ఉన్నవాడు ప్రేమతో కబురు పంపితే వాని వలపును తెలుసుకొని రేపుమాపని కొంచెం ఆశ చూపించి కావాలని కోర్కె పెంచి ఆ తరువాత పిలిపించేది.

ధనవంతుడైనవాడు, స్వేచ్ఛగలవాడు, దానగుణము కలవాడు అయిన వాడి వద్దకు కూతుర్ని పంపేది. ఒకరు ఇచ్చిన ధనం మరొకరికి ఎరగా చూపి లోభి వద్దనుంచి ధనము వెంటనే రాబట్టేది.

ఇంకొకడిచ్చిన ధనం చూపించి, రెచ్చగొట్టినా ధనమివ్వని వాని వద్దనుండి బలవంతంగా ఉన్నదంతా లాగికొని, ఎగతాళి చేసినా పట్టించుకోని వాడి ధనాన్ని రాజుకు చెప్పి బలప్రయోగం వల్ల సంపాదించేది.

పండుగలు, శోభనములు, బహువిధములైన నోములు మొదలైన వాటిని సమకట్టి తెలివిగా అల్లు తండం చేత అంటే విటుల చేత ఖర్చు పెట్టించి ధనం గ్రహించడం వేశ్యమాతలకు విధి అని వేశ్యమాత చెప్పింది.

వేశ్యల మాతలు చెప్పిన మార్గంలో నడిచే వేశ్యలు ధనం సంపాదించేందుకు ప్రేమ నటించేవారు. అది వారి వృత్తి ధర్మంగా భావించేవారు. కేయూర బాహు చరిత్రలో ఒక వేశ్య గురించిన వృత్తాంతంలో వేశ్యావృత్తి చేపట్టిన స్త్రీ ఎలా విటుల నాకర్షిస్తుందో ధనం ఎలా సంపాదిస్తుందో వర్ణించబడింది.

మిన్నక యొకనిపై కన్నులు వొలయించి
యఱగంట నొకని నెయ్యమున జూచి
చెన్నాఱ నొకనిపై జిఱునవ్వు జిలికించి
యలరుచు నొకనిపై బలుకువైచి
యొకని నీవిటరాక యోర్వరమ్మని పుచ్చి
యొకని గూటంబున నోరు జేర్చి
యొకని గూరిమి ప్రకటించి నమ్మించి
పాటించి యొకనికి బాస చేసి
తన్ను దారందఱును జాలదగిలి యిచ్చ
తమ తక్కిన యదియని తలచుకొనగ
నెవ్వరికి దాను గూర్పక యెల్ల భంగి
ధనమునక కూర్చునది వారవనిత యనగ
(కేయూర బాహుచరిత్ర – 2-58)

పై విధంగా చేయడం వృత్తి ధర్మమైనా, ఈ వృత్తిని కాదనుకొని పెళ్ళి చేసుకోవాలని తలచే స్త్రీలు ఉండేవారు. పండితారాధ్య చరిత్రలో ఒక వేశ్య తన వృత్తి ధర్మాన్ని కాదని, ఎంత మంది చెప్పినా వినక, వేశ్యల చొప్పున పోక, ధనం కుప్పలు పోసేటందుకు సిద్ధంగా ఉన్న వారిని కాదని, రూపగుణాస్పదమైన వ్యక్తిని తాను ప్రేమించి వివాహం చేసుకొంటానని చెప్పి విటులను దరికి రానివ్వలేదు.

వేశ్యలలో తెగలు, కులాలు:

దేవాలయాలలో అంగరంగభోగం చేసే స్త్రీలను భోగస్త్రీలని అనేవారు. వీరు రకారకాల కులాల నుండి వచ్చిన వారు. వేశ్యలు అంటే శరీర సౌందర్యాన్ని, లలిత కళలను ఎరగా చూపి పడుపు వృత్తి సాగించేవారు. వీరిలో కూడా కులాల భేదమున్నదని క్రీడాభిరామాన్ని బట్టి తెలుస్తుంది.

క్రీడాభిరామంలో మేదరకరణ వేశ్య, కర్ణాట వేశ్య అనే వారిని పేర్కొన్నారు. ‘కామవల్లి మధుకైటభారి వలపు పాడుచు వచ్చిన జక్కుల పురంధ్రి’ కూడా వేశ్యాకులానికి సంబంధించిన స్త్రీయేనని ఇ. థర్‌స్టన్ గారి ‘దక్షిణ భారతదేశపు కులాలు- తెగలు’ అన్న వ్యాసాన్ని బట్టి చెప్పవచ్చును. వేశ్యలలో కూడా ఎక్కువ తక్కువలున్నాయి. కనుక ఎక్కువ కులానికి చెందిన వేశ్య తనకంటే తక్కువ కులానికి చెందిన విటుని కలవడానికి ఇష్టపడదని విజ్ఞానేశ్వరంలో కేతన చెప్పాడు.

ఒక్కింత కొలము వారిని
నెక్కువ యగు గొలమువారి నెనయుడు రోలిం
దక్కువ గులజుని గవియన్
వెక్కుదురిచ్చలను గొలది వేశ్యలు జగతిన్

తమకంటే ఎక్కువ కులం వారితోను, తమతో సమానమైన కులం వారితోనూ సంబంధం పెట్టుకొనేందుకు ఇష్టపడి, తక్కువ కులంవారితో ఉండటానికి వేశ్యలు ఇష్టపడేవారు కాదు కనుకనే ఆనాడు అన్నికులాలకు సంబంధించిన వేశ్యలు ఉండేవారు. ఈనాడు వేశ్యావృత్తి నవలంబించే స్త్రీలకు ఈ స్వాతంత్ర్యం హక్కు వంటివి లేవు. వారు ఇంకొకరి ఆధీనంలో ఉంటారు. కనుక ఇష్టానిష్టాలు చెల్లవు.

ఆ కాలంలో ఎంత ధనవంతుడైనా, రసికుడైనా, రూపవంతుడైనా వేశ్యను రోయి అంటే శుల్కమిచ్చి అనుభవించలేడు. ఆమెకు అంగీకారం లేకపోతే ఆ విటుడు మరలిపోవలసిందే. పండితారాధ్య చరిత్రలో గురుభక్తాండారి అనే వాడు ప్రౌఢవతి అనే వేశ్యను చూచి మోహించి తన చెలికాడితో రోయి పంపగా ఆమె దాన్ని స్వీకరించక తిప్పికొట్టింది. అతడు ఎంత బ్రతిమిలాడినా ఎంత వేడుకొన్నా ఆమె అంగీకరించలేదు. దాన్ని బట్టి ఆనాటి వేశ్యలకు ధనమే ప్రధానం కాదని, యిష్టం లేని విటుని ఆమె నిరాకరిస్తుందని తెలుస్తున్నది. వేశ్యాకులంలో పుట్టిన అందరూ ధనం రాబట్టుకోవడం తెలిసినవారు కాదు. చిన్ననాటి నించి స్నేహంగా ఉండి ప్రేమించి, మరొక విటుని చూడటానికి యిష్ట పడనివారు కూడా ఉండేవారు.

పండితారాధ్య చరిత్రలో మల్హణుడనే విటుడు ఒక వేశ్య చిన్ననాటి నుండి స్నేహంతోనూ, ఆ తరువాత ప్రేమతోనూ ఉండేవాడు. ఆ వేశ్య తల్లి అతడు ధనమివ్వకుండా తన కూతురితో ఉంటున్నాడనే కోపంతో అతడిని తన కూతుర్ని వదిలి వెళ్ళి పొమ్మన్నది. ఆమె కూతురు మల్హణుని ధనం మీది మోహంతో వలచలేదు. అతడివ్వకపోయినా తక్కిన వేశ్యలలాగా అతడి నుండి ధనం ఆశించక పండుగలకు, పబ్బాలకూ, నోములకూ, పూజలకు, యాత్రలకు తన నగలమ్మి ఖర్చుపెట్టింది. అయితే దీన్ని ఆ వేశ్యల మాతలు హర్షించేవారు కాదు.

కొందరు వేశ్యలు మధుపాన మత్తులై విటుల చేత మోసగింపబడేవారు. క్రీడాభిరామంలో మధుమావతి ఆ విధంగా మధు మదారంభంలో ఉండగా ఆమె చెల్లెలి ప్రియుడు దొంగ విటుడు అయిన శ్రీధరుడు ఆమెను మోసంతో అనుభవించాడు.

ముకుర వీజోత్సవం – వేశ్యమాతలు ఈడేరిన తమ కుమార్తెలకు ముకుర వీజోత్సవం చేయడం ఆనాటి వేశ్యల కులాచారం. ముకుర వీక్షా విధానం జరుపకుండా వేశ్య విటుని కలవకూడదు, వేశ్యలకు ఈ ముకుర వీక్ష శ్రీ మహలక్ష్మి వంటిదని, ఈ ఉత్సవం గురించి క్రీడాభిరామంలో వివరింపబడింది.

ఒక శుభ ముహూర్తంలో అపరాహ్ణ సమాగమ వేళ పుష్య నక్షత్రంలో గాంధర్వి అనే వేశ్య కూతురు మదన రేఖకు ముకుర వీజోత్సవం జరిగింది, ఈ మదనరేఖ మంచనకు గాంధర్వి యందు జన్మించింది. మంచన శర్మ ఆమెకు తండ్రి కనుక ఆ ఉత్సవం రోజున మదనరేఖను తన తొడపై కూర్చోబెట్టుకొని ఆమెకు అద్దం చూపి శ్రీ వర్ధస్వమనే మంత్రం చెప్పి ఆశర్వదించి ఆమె పసుపున కని ఒక వెండిని టిట్టిభ సెట్టి చేత ఇప్పించాడు.

ఆ విధంగా ముకుర వీజోత్సవం జరిగాక కన్నెరికం అనేది జరుగుతుంది. రసికుడు అనుభవజ్ఞుడైన వాడు, ధనవంతుడు, స్వేచ్ఛ ఉన్నవాడు అయిన విటుడు ఆమెకు కన్నెరికం చేస్తాడు. అటువంటి వారికి బహుశా ఆనాడు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేదేమో. మారన రచించిన మార్కండేయ పురాణానికి కృతి భర్త అయిన గన్నయసేనాని వారవిలాసినీ వదన వారిజ మిత్రుడే కాదు, బాలారతికేళి పాంచాలుడని కీర్తింప బడినవాడు.

ఉంపుడు గత్తెలు – ఈ వేశ్యలలో ఉంపుడు గత్తెలనే వారు ఒక తెగ, వీరు తక్కిన వేశ్యలలాగా విటులను మార్చక ఒకే పురుషునికి అంకితమై కొంతకాలము వఱకు ఉండేవారు. అతడు వదలి పెట్టిన తరువాతనే ఇంకొక పురుషుని గ్రహించేవారు. మంచనకు కామ మంజరి, శ్రీధరునికి మదాలస ఉంపుడు గత్తెలని క్రీడాభిరామాన్ని బట్టి తెలుస్తుంది.

వేశ్యలు – వావివరుసలు:

వేశ్యలు కూడా వావి వరసలు పాటించేవారు. క్రీడాభిరామంలో మంచన శర్మ తండ్రి మాధవ శర్మకు అతని ఉంపుడు గత్తెకు జనించిన స్త్రీ మధుమావతి అని, – మంచెన శర్మకు మేనమామ అయిన మీసాలప్పయ కొడుకు శ్రీధరుడు మధుమావతి చెల్లెలు మదాలసను ఉంచుకున్నాడని ఉన్నది. దాన్ని బట్టి మంచెన శర్మకు మధుమావతి మదాలస అక్కచెల్లెళ వరుసనీ, అతనికి బావ అయిన శ్రీధరుడికి వారు వరసైన వారనీ అనుకోవచ్చు. అయితే మదాలస నుంచుకున్న శ్రీధరునికి మధుమావతి వదిన గారి వంటిది. కనుకనే తాము మధుపాన మత్తులై ఉన్నపుడు శ్రీధరుడు వావి వరసలు మరిచి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనకు తోబుట్టువు గనుక, పాడిపంతం తెలిసిన వాడివి కనుక ప్రాయశ్చితం చెప్పమని మధుమావతి గోల చేసింది. మంచెన శర్మ వేశ్యలకు వావి వరుసలు ఉండనక్కర లేదని ఆమెకు బోధ చేస్తాడు. దీన్ని బట్టి వేశ్యలైనా వారు వావివరుసలు చూసేవారిని తెలుస్తున్నది. శీలం లేదని దూషింపబడే వేశ్యలు వావివరసలు పాటించడం, వారిని హేళన చేసే పురుషులు మర్యాద నతిక్రమించడం ఇక్కడ గమనించ దగ్గవిషయం.

వేశ్యల కోసం మగవారు ఎంతో ఖర్చుపెట్టేవారు. ఆస్తులున్న వారు తమకు ప్రత్యేకంగా ఒక వేశ్యను ఉంపుడు గత్తెగా పెట్టుకునేవారు. అలా ఉంచుకున్నవారు ఆ స్త్రీల కోర్కెలు దీర్చడంలో ఆస్తులు కోల్పోయేవారు. కొంతమంది బ్రాహ్మణులు తమ అగ్రహారాలను ఈ విధంగా పోగొట్టుకొనేవారు. క్రీడాభిరామంలో మంచెన శర్మ మేనమామ కొడుకు శ్రీధరుడు మదాలస ముద్దు తీర్చడానికి ఐదువందల రూపాయలకు జొన్నగడ్డ అగ్రహార వృత్తిని తాకట్టు పెట్టాడు. నన్నెచోడుని కుమార సంభవంలో ఈ వేశ్యలను మరిగిన వ్యక్తులు ఎటువంటి నీచానికి దిగేవారో వర్ణించబడింది.

మగలాడు వారికి మరిగి మ్రుచ్చిలి, బంది
వట్టి కన్నంబులు వెట్టి తెరువు
ద్రెక్కొని చని పరదేశంబులుడుగక
త్రిమ్మరి వ్రేళ్ళును ఱొమ్ము బోయి
యాచకులై వేడి నీచుల సేవించి కలమెక్కి చని నిలిచి గయ్యమాడి

మగవారు ఆడవారి కోసం పాట్లు పడతారు గానీ భర్త కొరకు స్త్రీలు తపం చేయటం ఎక్కడా వినలేదు అని పార్వతిని వృద్ధాంగనలు మందలించిన సందర్భంలో పై పద్యం చెప్పబడింది. అయితే పైన చెప్పిన కష్టాలు మగవాళ్ళు భార్యలను సంపాదించడానికి కాక వేశ్యలకోసం పడేవారు అనిపిస్తుంది.

వేశ్యల అలంకారం:

వేశ్యలలో ధనవంతులు పట్టు వస్త్రాలనే ధరించేవారు. కంచుకాలను అంటే రవికలను తొడిగేవారు. పలనాటి వీర చరిత్రలో బాలచంద్రుని వేశ్య సబ్బాయి బంగారు జాళువా పటం ధరించింది. రాజతకుసుమంపు రవిక తొడిగింది. ఈ రవికలు లేక కంచుకాలను కుట్టే దర్జీలు ప్రత్యేకంగా ఉండేవారు. క్రీడాభిరామంలో మోహరి వాడలో కుట్రపు వారు అంటే దర్జీలు వేశ్యలకు రవికలు కుట్టేవారని తెలుస్తుంది. ‘

ఈనాటి వారి లాగా ఆనాటి దర్జీలు కూడా శరీరం కొలతలు తీసుకొని దుస్తులు కుట్టేవారు. బహుశా ఉన్నత కుటుంబాలలోని స్త్రీలకు ఈ పనులు దాసీలు చేసే వారేమో క్రింది వర్గంలో స్త్రీలు బహుశా తమకు తామే తయారు చేసుకొనేవారు. వేశ్యలు మాత్రమే దర్జీల వద్దకు వెళ్ళి కొలతలు ఇచ్చి రవికలు కుట్టించుకొనే వారని క్రీడాభిరామాన్ని బట్టి గ్రహించవచ్చు.

రామప్పదేవాలయంలో నర్తకీమణులు రవిక, చల్లడం ధరించి నడుముకు సన్నని నాజూకైన వస్త్రాలు ధరించినట్లు కనబడుతుంది. దాన్ని బట్టి నాట్యం చేసిన వేశ్యలు చల్లడాలు కట్టేవారు అని తెలుస్తుంది. కానీ ఇతర సమయంలో చక్కటి పట్టుబట్టలు, పూర్తి దేహన్ని కప్పే దుస్తులని ధరించేవారు.

వేశ్యలు సిగలు ముడిచి పైకెత్తి ముడివేసేవారు. ముత్యాలు ధరించేవారు. మేనుకు పసుపు పూసేవారు. అప్పుడప్పుడు శిరోజాలకు సవరాలు అమర్చి వానికింద ముత్యాలు వేలాడే విధంగా అలకరించేవారు.

“సవరని ముత్యాల జల్లులు తూల వేశ్య సబ్బాయి బాలచంద్రుని వద్దకు వచ్చింది.”

వేశ్యలకు అలంకారం తప్పనిసరి కనుక శిరోజాలంకరణలో బహుశా ప్రత్యేక శ్రద్ధ తీసుకొనేవారు. అందులో సవరాలు ఒక ముఖ్యమైన వస్తువై ఉంటుంది.

వేశ్యల వైభవం:

కాకతీయుల కాలంలో ముఖ్యంగా వీరశైవ మతం ప్రబలంగా ఉన్న నాటికి వేశ్యలు అతి వైభవంగా ఉండేవారని ఆనాటి సాహిత్యం వల్ల తెలుస్తుంది. పాల్కురికి సోమనాధుని బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, శ్రీనాథుని పలనాటి వీర చరిత్ర క్రీడాభిరామం కావ్యాలలో ఆనాటి వేశ్యల వైభవం వర్ణించబడింది.

కొడుకులు కూతులుం గలిగి
కూడును బాడియు ద్రవ్వి తండమై
విడిముడిలాతుగా గలిగి
వెండియు బైడియు నిండ్లలోపలన్
దడ బడ దారు బంధువులు
దామర తంపరలై సుఖించు వా
రుడుపతి మౌళి మౌళి నొక
యుమ్మెత పూవిడువారు వేడుకన్

వేశ్యల గృహాలు:

వేశ్యల నివాసాలు వారి వారి స్థాయిని బట్టి ఉండేవి. పెద్ద ధనవంతుల, మండలాధీశుల ప్రాపు సంపాదించినవారు, కళలన్నిటిలో ఆరితేరిన సౌందర్యవతులు, అయిన వేశ్యలు బాగా ధనం గడించి తమ గృహాలను అందంగా అలంకరిచుకొనేవారు. ప్రత్యేక సమయాలలో స్పటిక సోపానాలతో బంగారు గోడలతో వెలిగే గృహప్రాంగణాన్ని కస్తూరితో కలయంపి జల్లి, ముక్తా ఫలాలతో ముగ్గులు పెట్టడం చేసేవారు. స్తంభాలకు పూల మాలికలు చుట్టి, రత్న మాలికలు వేలాడదీసేవారు. రత్నదీపాలతో పడక గదిని అలంకరించేవారు. హంసతూలికా తల్పంతో నేలపైన కంబళీలతో, వారి శయ్యాగృహాలు వైభవంగా ఉండేవి.

వీరి మేడలు రకరకములైన చిత్రాలతో అలంకరింపబడేవి. ఈ కాలంలోని వేశ్యలు చిత్ర కళను బాగా అభిమానించినట్లు కనిపిస్తుంది. పలనాటి వీర చరిత్రలో వేశ్య సబ్బాయి ‘వివిధ చిత్తరువుల వెలుగుతున్న తన మేడపై’ నుంచి దిగివచ్చి బాల చంద్రుని చెయ్యిపట్టుకొని మేడపైకి తీసుకువెళ్ళింది.

క్రీడాభిరామాన్ని బట్టి ఆనాటి నర్తకి ప్రతాపరుద్ర ధరణీశోపాత్త గోష్ఠీ ప్రతిష్ఠాపారీణ అయిన మాచల్దేవి భవనం కూడా అత్యంత వైభవంగా ఉన్నది. ప్రత్యేకమైన చిత్రశాలను నిర్మింపజేసి ఆమె సుముహూర్తాన ప్రవేశించింది. ఆ చిత్రాలు శృంగార రసాత్మకమైనవి. తారా చంద్రుల, మేనకావిశ్వామిత్రుల శృంగారము, శివుని దారుకావన విహరము అందులోని ఇతివృత్తాలు.

కాకతీయుల కాలంలో వేశ్యలు ఎక్కువగా ఉండటానికి గల కారణాలు:

మత పరిస్థితులు:

మొదట దేవాలయాలలో దేవుని భోగసేవలకు అంకితమైన స్త్రీలు అనగా మున్నూర్వురు సానులు, సంప్రదాయసానులు, దేవాలయ పరిచారికలు మొదలైన వారు క్రమేణా మతాధికారులు, జంగములు, మండలాధికారులు, మొదలైన వారికి భోగస్త్రీలుగా మారారు. వారికి దేవాలయాల నుంచి లభించే మాన్యాలు కొడుకులకు సంక్రమిస్తే వారి కుమార్తెలు ధనికులకు, మండలాధికారులకు భోగస్త్రీలుగా మారారు. అంగరంగ భోగాలకై మొదట నియోగింపబడి తరువాత పై విధంగా మారిన వారే భోగస్త్రీలుగా వ్యవహరింపబడేవారు. వీరు గతంలో దేవాలయ సేవికలు కనుక సంఘంలో వీరికి వేశ్యలకన్నా గౌరవం ఎక్కువ ఉండేది.

రాజకీయ పరిస్థితులు:

వీరికి ప్రాపునిచ్చిన మండలాధికారులు యుద్ధంలో మరణిస్తే వీరు ఆర్థికంగా నష్టపోవడమే కాదు, శత్రువుల చేతిలో బందీలుగా చిక్కి దాసీలుగా మారేవారు. లేదా గెల్చినవారికి వేశ్యలుగా మారేవారు. గెలు పొందిన రాజును ‘రాయవేశ్యా భుజంగ’ వంటి బిరుదులతో పొగిడేవారు. మండలాధీశులు, అధికారులు మరణిస్తే వారి కులస్త్రీలు వారసత్వంగా వచ్చిన సంపదను అనుభవించేవారు లేదా సహగమనం చేసేవారు. భోగస్త్రీలలో కొందరు బహుశా వేశ్యావృత్తి నవలంబించే వారేమో.

ఆర్థిక పరిస్థితులు:

పురుషులు యుద్ధాల నిమిత్తం, వ్యాపార నిమిత్తం స్వస్థలం వదిలి ఎన్నో ఏళ్ళు పరప్రదేశాలలో ఉండేవారు. కనుక వీరు వేశ్యల నెక్కువ ఆదరించి ధన కనక వస్తు వాహనాలతో వారిని తృప్తి పరచేవారు. కులస్త్రీలను అంటే భార్యలను ఆ విధంగా ఆనంద పరచవలసిన అవసరం పురుషులకు లేదు. బాల చంద్రుడు తల్లి ఐతాంబ అర్ధులకు ఇవ్వమని ఇచ్చిన ధనమంతా వేశ్య సబ్బాయికి ధారపోసి వట్టి చేతులతో భార్య మాంచాల వద్దకు వెళ్ళాడు. ఈ భావంతోనే మాంచాల

‘మేలను భవించెడి మెలతలు వారు
చావనోచిన యట్టి సకియను నేను’ అన్నది.

ఏ వృత్తి ఆర్థికంగా లాభసాటిగా ఉంటే ఆ వృత్తిని ఎక్కువ మంది అనుసరిస్తారు. ప్రతాపరుద్ర చరిత్రలో ‘అగణ్య వస్తు వాహన శోభితంబెన వేశ్యా గృహంబులు 127000’ అని ఉన్నది. అంటే వేశ్యలు సకల భోగ భాగ్యాలతో తులతూగే వారని తెలుస్తున్నది. కనుక కళలలో ప్రావీణ్యం సంపాదించి, సౌందర్యం కలిగిన స్త్రీలు, శీలం గురించి పట్టింపు లేని వారు వేశ్యావృత్తిని స్వీకరించారు. క్రీడాభిరామాన్ని బట్టి ఆనాడు రకరకాల వేశ్యలుండటం, అన్ని కులాల వృత్తుల వారు, రకరకాల ప్రాంతాలవారు వేశ్యావృత్తి నవలంబించడం గమనించ వచ్చును. ఆనాడు కర్ణాటక రాష్ట్రంలో దేవాలయాలలో సానులుగా నర్తకులుగా ఉన్నవారి వృత్తి పై పన్ను ఉండేది. ఆ పన్ను భారం తప్పించు కొనేందుకు అక్కడి వేశ్యలు బహుశా ఇక్కడికి రావలసివచ్చిందేమో. మొత్తం మీద వేశ్యావృత్తి ఆర్థికంగా లాభసాటి కావడమేనని చెప్పవచ్చును.

సంఘంలో గౌరవం:

వేశ్యలు వారివారి కుల వృత్తులను సాగిస్తూనే ఉండేవారు. పైగా నిత్య సుమంగళులు కనుక అన్ని శుభకార్యాలలోనూ వారే ముఖ్య పాత్ర వహించేవారు. రాజుల, మండలాధీశుల, ఇతర అధికారులకు సంబంధించిన ఉత్సవాలు, కార్యక్రమాలలో వేశ్యలకు ప్రాధాన్యం ఇవ్వబడింది. వీరు పణ్య పుణ్యాంగనలు, లేదా పణ్యాంగనలు అని వ్యవహరింపబడేవారు. రాజప్రాసాదాలలో ధనవంతుల కుటుంబాలలో వీరికి ప్రవేశం ఉండేది. పెద్దకుటుంబాల స్త్రీలకు వీరు సఖులుగా పరిచారికలుగా ఉండి వారి అభిమానానికి, మన్ననకు పాత్రులయేవారు. అన్ని కళలు అభ్యసించిన వారు కనుక వారి కళలను ప్రదర్శించి మెప్పుపొందేవారు.

కులసతికి గానీ, ఇతర భార్యలకు గానీ నామ మాత్రపు గౌరవం ఉండేదే గానీ, సుఖ సంతోషాలు ఉండేవి కావు. సవతుల బాధ, భర్త మరణిస్తే సహగమనం లేదా విధవగా జీవితం గడపవలసి ఉండటంలో ఎక్కువ మంది స్త్రీలకు ఆకర్షణ ఉండి ఉండదు. సంఘంలో గౌరవాన్ని బట్టి, ఆర్థికస్థితిని బట్టి ఎవరైనా తమ వృత్తిని ఎంచుకుంటారు. అలాగే ఆనాటి క్రింద వర్గపు స్త్రీలలో కొందరికి మతపరంగానూ, సంఘపరంగానూ వేశ్యావృత్తి గౌరవంగానే అనిపించి ఉంటుంది. అన్ని వృత్తులలాగే దాన్ని ఒక వృత్తిగా భావించి ఆ వృత్తి ధర్మాన్ననుసరించి విద్య, కళలు నేర్చుకోవడం, మెలకువలు గ్రహించడం చేసేవారు. ఆ కులంలో పుట్టిన స్త్రీని సుపుత్రి కులదీపకురాలు అని ఆ కుటుంబంలోని మగవారు గర్వంగా చెప్పుకొన్నారంటే వేశ్యా వృత్తికి సంఘంలో ఉన్న గౌరవం ఎంతటిదో తెలుస్తుంది. కనుకనే కాకతీయుల కాలంలో వేశ్యలు అధిక సంఖ్యలో ఉండేవారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here