‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’ -16

0
7

[డా. మంత్రవాది గీతా గాయత్రి గారు 1995లో పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

ప్రకరణం 4 – కాకతీయులనాటి రాజకీయలు – స్త్రీల పాత్ర:

[dropcap]కా[/dropcap]కతీయుల కాలంలో స్త్రీలు పాలకులుగా రాణించారని సామ్రాజ్ఞి కాకతి రుద్రాంబ, మహామండలేశ్వర కోటగణపాంబ వంటి వారి చరిత్రల వల్ల తెలుస్తున్నది. అయితే పాలకులు కాకపోయినా రాజకీయ వ్యవహారాలలో కీలకమైన పాత్ర వహించేవారు ఆ ఏలికల ఆంతరంగికులు, మంత్రులు, సలహాదార్లు అని చెప్పాలి. రాజ్యాలను పాలించకపోయినా ఆనాటి రాజ, సామంత వంశాలలోని స్త్రీలు రాజనీతి, యుద్ధతంత్రం తెలిసినవారని, సామ్రాజ్యాలు నిలబెట్టడంలోనూ, కూలగొట్టడంలోనూ సమర్థలని ఆ కాలానికి సంబంధించిన సాహిత్యాన్ని బట్టి గ్రహించవచ్చును.

విరియాల కామసాని గరుడబేతరాజును, నాయకురాలు నాగమ్మ నలగామరాజును, శీలమ పలనాటి బ్రహ్మనాయుని రాజులుగా ప్రజానాయకులుగా నిలబెట్టి తమ రాజనీతి ప్రావీణ్యాన్ని నిరూపించుకున్నవారు. పైన చెప్పబడిన స్త్రీలు కాకతీయాకాశంలో ధ్రువతారల వంటివారు. కనుకనే ఈనాటికీ చరిత్రలో మరువరాని స్థానాన్ని పొందారు. స్త్రీలు పాలకులుగా ఏ విధమైన సమస్యల నెదుర్కొనేవారు, ఆనాటి రాజకీయాలలో స్త్రీలు నిర్వహించిన పాత్ర ఏమిటి అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతకవలసి ఉన్నది.

పాలకులుగా స్త్రీల స్థానం:

కాకతీయుల కాలంలో మొదటిసారిగా ఒక స్త్రీ ఆంధ్రరాజ్యానికి చక్రవర్తిగా రాజ్యమేలింది. గణపతిదేవుని పుత్రిక రుద్రమ గణపతిదేవునికి వారసురాలిగా పట్టం గట్టుకొన్నది. అంతకుముందు కాలంలోనూ, తరువాతి కాలంలోనూ స్త్రీలు రాజ్యమేలారు కానీ వారు వారి భర్తలు మరణించాక సింహాసనానికి వారసులు చిన్నవారైతే ఆ బాధ్యత స్వీకరించారు. రాజమాతలుగా, రాజపత్నులుగా రాజ్యమేలారు. కానీ వారసులుగా రాజ్యమేలడం జరగలేదు. కాకతీయ గణపతిదేవుడు రుద్రమను వారసురాలిగా చేయటమే కాక, దాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా చేయటంలో తన రాజనీతిజ్ఞతను ఉపయోగించాడు. గణపతిదేవుడు తన సామంతుల, ప్రజల, అభిమానం చూరగొన్నవాడు కనుక కొద్దిమంది తప్ప తక్కిన సామంతులు ఎవరూ ఆమె వారసత్వాన్ని వ్యతిరేకించలేదు. కానీ ఆ నాటికి ధర్మశాస్త్రాల ప్రకారం స్త్రీ రాజ్యానికి వారసురాలు కాలేదు. స్త్రీని యేలికగా స్వీకరించడం ఆనాటి వారికి అంతగా ఇష్టంలేదు. ఈ విషయం దేవగిరికి ప్రభువైన యాదవరాజు మహాదేవుని కొలువులో ఉన్న హేమాద్రి రచించిన వ్రతఖండాన్ని బట్టి తెలుస్తుంది. వ్రతఖండంలోని రాజప్రశస్తిలో మహదేవుని పరాక్రమాన్ని ప్రశంసించిన సందర్భంలో ఈ విధంగా అన్నాడు.

“అయం శిశుస్త్రీ శరణాగతానాం హంతా మహదేవ నృపోనజాతు
ఇత్థం వినిశ్చిత్య తతోబిభీతైరంధైః పురంధ్రీ నిహితా నృపత్వే”

ఈ మహదేవరాజు శిశువులను, స్త్రీలను, శరణుజొచ్చిన వారిని చంపడు అని నిశ్చయించుకొని భీతులగు ఆంధ్రులు స్త్రీని తమ కేలికగా చేసుకొన్నారు, అంటే మహాదేవుని ప్రతాపానికి భయపడిన ఆంధ్రులు అతడు స్త్రీలపై దయగలిగినవాడని తెలిసిన వారు కనుక తమకు స్త్రీని యేలికగా చేసుకొని మనశ్శాంతితో ఉన్నారు అని పై శ్లోకానికి భావం. అయితే పరోక్షంగా ఇది శ్రీ అధికారం పట్ల నిరసన, చిన్నచూపు వ్యక్తం చేయడమేనని ఊహించవచ్చు. ఎందుకంటే మహాదేవుడు ఆంధ్రులకు స్త్రీ పాలకురాలు కనుక ఆమెపై కరుణించి దండెత్తడం మానలేదు. నిజానికి రాజ్యాధికారి స్త్రీ కనుక ఆమెను ఓడించడం సులభమనుకొని దండెత్తాడు. ఆ యుద్ధ ఫలితం గురించి హేమాద్రి తన రాజప్రశస్తిలో ఈ విధంగా వ్రాశాడు.

‘యస్తస్యైవ రణే జహార కరిణస్త త్పంచ శబ్దాదికాన్
యస్తత్యాజ వధూ వధా దుపరత స్తద్భూభుజం రుద్రమాం’

అతడు (మహదేవరాజు) త్రిలింగుల నోడించి, వారి ఏనుగులను పంచశబ్దములను హరించి, వారి యేలిక అయిన రుద్రాంబను స్త్రీ కనుక విడిచి పుచ్చాడని పై శ్లోకంలో చెప్పాడు. వాస్తవంలో రుద్రమదేవియే మహాదేవరాజును ఓడించి తరిమి, అతని వద్ద నుండి కప్పంగా బంగారు నాణాలను గ్రహించింది. ఈ వైనం యాదవ ముద్రగల బంగారు నాణాలు తెలుగుదేశంలో దొరకడం వల్లను, బీదరు కోటలోని రుద్రమదేవుని సామంతుడు వేయించిన శాసనం వల్లను వెల్లడి అయింది. కాకతి గణపతిదేవుని సుదీర్ఘ రాజ్యపాలన కాలంలో దండెత్తని యాదవులు రుద్రమాంబ కాలంలో దండెత్తడం గమనించదగ్గ విషయం. దీన్నిబట్టి ఆనాడు స్త్రీ రాజ్యాధిపతి కావడం ఎవరూ సహించలేకపోయారని, ఆమెను ఎలాగైనా తొలగించాలని ప్రయత్నించారని, అందువల్ల ఆమె ఆటంకాలనూ, దురాక్రమణలను, తిరుగుబాట్లను ఎదుర్కొన్నదని మనం గ్రహించవచ్చును.

పలనాటి వీరచరిత్ర కావ్యంలోనూ, దాన్ని రచించిన శ్రీనాథుడు వెల్లడించిన అభిప్రాయాలలోనూ, స్త్రీలు ఏలికలవడం, రాజకార్యాలు నిర్వహించడం పట్ల చులకన భావం ఉన్నట్లు తోస్తుంది. పల్నాటి వీరచరిత్రలో ఎన్నో సందర్భాలలో ఆడది తీర్పరి సలహాదారు అయితే ఎంత నష్టమో చెప్పడమైంది.

‘స్త్రీయని తలపోసి శీలమ బ్రహ్మి
చులకన చేయగా చూచి రోషించి’
‘ఆడుతీర్పరి చేతనాపదరాక
మానునే ప్రజలకు మాటలింకేల
కోడిపోరిట్లే కోరిపెట్టించె’
‘స్త్రీ నాయకంబైన చెడునండ్రుభూమి
అని భూమిలో కాపులందరు బెగడి’

నాయకురాలి శక్తి సామర్ధ్యాలకు మెచ్చక బ్రహ్మనాయుడు ఆమె స్త్రీ అని చులకనగా చూశాడు అని మొదటి పంక్తిని బట్టి చెప్పవచ్చును.

పల్నాటి వీరచరిత్రలో కోడిపోరుకు సంబంధించిన భాగం పరిశీలిస్తే కోడిపోరు పెట్టించమని పట్టుపట్టినవాడు బ్రహ్మనాయుడేనని తెలుస్తుంది. మన్యందారులు కాపులు అందరూ బ్రహ్మనాయుని కోడిపోరుకు సిద్ధపడవద్దని చెప్పినా మలిదేవాదులతో ఈ విషయం చర్చించనైనా చర్చించక నాగమ్మతో కోడిపందెం వేసి మలిదేవాదుల రాజ్యభాగాన్ని పణంగా పెట్టిన బ్రహ్మనాయుడు నాగమ్మ స్త్రీ కనుక ఆమెను ఓడించడం ఆమె అధికారాన్నణచడం చాలా సులువు అనుకునే పూనుకున్నాడు. కానీ ఓడిపోక తప్పలేదు. స్త్రీ నాయకంబైన చెడునండ్రు భూమి అని అనుకున్న ప్రజలనే కోటలోపలికి చేర్చి గవనులు మూసి, తలుపులు బిగించి బ్రహ్మనాయుని సైన్యం నుంచి నలగామరాజును ప్రజలను రక్షించిన నాగమ్మ యుద్ధతంత్రంలో సుశిక్షితురాలు, శివభక్తురాలు. ఆమెకు ఆ పదవినిచ్చి గౌరవించిన అనుగురాజు, నలగామరాజు శైవమతావలంబికులు, స్త్రీని ఏలికగా సహించలేని యాదవరాజు, వ్రతఖండం రాసిన హేమాద్రి, బ్రహ్మనాయకుడు వైష్ణవ మతావలంబకులు కావడం గమనించదగ్గ విషయం. దీన్నిబట్టి వీరశైవమతం స్త్రీలను అన్నివిధాలా ప్రోత్సహించిందనీ, చెప్పవచ్చును. ఆ మతం వర్ధిల్లిన కాకతీయుల కాలంలోనే కాకతి రుద్రమ, కోట గణపాంబ మొదలైన స్త్రీలు రాజ్యమేలారు. శైవమతాన్ని ప్రోత్సహించిన గణపతిదేవుని రాజ్యకాలంలో ఎక్కువమంది స్త్రీలు మండలేశ్వరులు, మహాసామంతులు, అధికార్లుగా ఉన్నారు. రాణీ రుద్రమ చక్రవర్తినిగా రాజ్యమేలింది. కోట గణపాంబ, మన్మపోతక్షితీశుని భార్య రాణీ పండాంబిక భర్తలు చనిపోయిన తరువాత వారి రాజ్యానికధిపతులై రాజ్యమేలారు. విర్యాల నాగసానమ్మ మహాసామంత బిరుదు వహించింది. కోట బయ్యలదేవి, మహామండలేశ్వర చాగిముప్పలదేవి కాకతీయ మైలమ కుమార్తెలు. వీరు భర్తలకున్న బిరుదులను ధరించి రాజ్యాలనేలారు అని వారి శాసనాలను బట్టి చెప్పవచ్చును.

రెండవ ప్రతాపరుద్రుని కాలంలో స్త్రీలు ఏలికలుగా, సామంతులుగా ఉండటం పూర్తిగా తగ్గిపోయింది. రుద్రమదేవి కూడా తన కుమార్తెలెవరికీ రాజ్యాన్ని అప్పగించలేదు. ఆ రోజుల్లో భారతదేశంలో స్త్రీ శిశుహత్య అన్ని ప్రాంతాలలో రాజకుటుంబాలలో ఉండేది. ఒకవేళ ఆడపిల్ల పుట్టినా రాజకీయ సంబంధాలు గట్టిపడటానికే సాధనంగా వాడుకున్నారు. కానీ సింహాసనాన్ని అప్పగించలేదు. అటువంటి పరిస్థితుల్లో గణపతిదేవుని రాజ్యకాలంలో రుద్రమకు ముగ్గురు కూతుళ్ళు జన్మించారు. కొడుకులు పుట్టలేదని రుద్రమ పూజలూ, నోములు చేసినట్లు సాహిత్యాధారాలు లేవు. కానీ రుద్రమ పాలన చివరికాలానికి కూతురు ముమ్మడమ్మకు కొడుకు పుట్టాలని రుద్రమ ముమ్మడమ్మ చేత ఎడ్లనోము చేయించిందనీ, వడ్డెపల్లిలోని వినాయకుని దర్శించిందని, సిద్ధేశ్వర చరిత్రను బట్టి తెలుస్తున్నది.

దీన్నిబట్టి కాకతీయ గణపతిదేవుని కాలంలో, వీరశైవమత విజృంభణలో స్త్రీలు రాజ్యాధికారాన్ని చేపట్టి, మంత్రి సామంత, దండనాయకాది పదవులు నిర్వహించారని, తరువాత వీరశైవ మతం తగ్గుముఖం పట్టి వైదిక, వైష్ణవ మత ప్రాబల్యం హెచ్చినపుడు పాలనాధికారాన్ని వారసత్వపు హక్కును పోగొట్టుకున్నారని మనం గ్రహించవచ్చును. కాకతీయులకి పూర్వులైన రాష్ట్రకూటులలో స్త్రీలెవ్వరూ రాజ్యానికి వారసులుగా గాని ఏలికలుగా గాని అయినట్లు కనిపించదు. రాజు తర్వాత పెద్దకొడుకు యువరాజు అయేవాడు. అతనే రాజ్యానికి వారసుడు. అతనికంటె చిన్నవారైన రాజకుమారులు చిన్న ప్రదేశాలకు మండలాధీశులుగా (గవర్నర్లుగా) నియుక్తులయేవారు. రాజకుమార్తెలు అధికారాన్ని చేపట్టడం అరుదు. ఇక యాదవులలో స్త్రీలు పాలకులుగా ఉన్న రాజ్యాన్ని చిన్నచూపు చూడటం ఉన్నది. హేమాద్రి వ్రతఖండం అవతారికలో ఈ విషయాన్నే పరోక్షంగా తెలిపాడు.

రాష్ట్రకూటులలో వారసులు చిన్నవారుగా ఉన్నపుడు రాజ్యం రాణులచేతులలో కాక రాజబంధువులైన మగవారి చేతుల్లో ఉండేది. కానీ కాకతీయుల కాలంలో, ముఖ్యంగా కాకతీయ వంశపు స్త్రీలలో వారి బంధువులలోనే రాజ్యాధికారాన్ని చేపట్టటం మనం గమనించవచ్చు.

వీరమాతలు – వీరపత్నులుగా స్త్రీలు

మధ్యయుగంలో ఆంధ్రదేశంలో తరచుగా యుద్ధాలు జరిగేవి. ముఖ్యంగా కాకతీయుల కాలంలో కాకతి ప్రోలరాజు, రుద్రదేవుని కాలాలలో స్వతంత్రరాజ్యం సంపాదించే ప్రయత్నంలో ఆ రాజులు ఎన్నో యుద్ధాలు చేశారు. అన్ని మండలాలలోనూ సామంతులుగా ఉన్నవారు తమ చక్రవర్తులు బలవంతులైతే వారిని సమర్థించి వారి పక్షాన పోరాడేవారు. బలహీనులైతే ఆ చక్రవర్తులను కాదని స్వతంత్రం ప్రకటించుకునేవారు. చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడి పరస్పరం కలహించుకుంటూ ఉండేవారు. వేంగీ చాళుక్యుల పరపతి, రాజరాజనరేంద్రుని మరణానంతరం తగ్గిపోవడంతో వారి సామంతులందరు తమ మండలాలను స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించుకొని ఏలుకుంటూ ఉండడం, వారిలో వారికి ఐక్యత లేకపోవడంతో అరాచకస్థితి ప్రబలమైపోయింది. వారిలో బలవంతులైన రాజులు పొరుగువారిని జయించి కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించే ప్రయత్నం చేసేవారు. ఆ కాలంలో రాజుల మధ్య యుద్ధాలు కూడా చిత్రంగా జరిగేవి. యుద్ధంలో గెలిచిన రాజుకు ఓడిన రాజు యొక్క రాజ్యం మీద దృష్టి ఉండేది కాదు. తాను గెలిచానన్న తృప్తి, కప్పం కట్టించుకొని ఓడిన రాజును సామంతునిగా చేసుకోవడమే ఆ యుద్ధానికి ఫలితంగా ఉండేది. తండ్రిని ఓడించిన రాజు అతని కొడుకును తండ్రి గద్దెపై కూర్చోబెట్టేవాడు. కాకతి రుద్రదేవుడు దొడ్డభీముని ఓడించి అతని కొడుకు రెండవ కేతనను సింహాసనంపై కూర్చోబెట్టాడు. అన్నని చంపి తమ్ముడిని రాజును చేసేవాడు. రుద్రదేవుడు పానుగల్లురాజు భీమచోడుని చంపి అతని తమ్ముడు చోడోదయుని సింహాసనంపై నిలిపాడు. కాకతి గణపతిదేవుడు అయ్యవంశీయుడైన పినచోడిని ఓడించి తిరిగి అతని రాజ్యాన్ని అతనికి ఇచ్చివేశాడు. అతని కుమార్తెలను వివాహమాడి, వారి సోదరుని తన సేనాధిపతిగా చేసుకొన్నాడు.

ఈ విధంగా రాజులు సామంతులు చిన్న చిన్న మండలాధీశులు కేవలం తమ ఆధిపత్యాన్నీ, అధికారాన్నీ పెంచుకునే ప్రయత్నంలో యుద్ధాలు చేస్తే సామాన్య ప్రజలు ముఖ్యంగా స్త్రీలు చాలా బాధలు పడవలసి వచ్చింది. ఆనాటి పురుషులలో వీరావేశం, పౌరుషం, అభిమానం, అహంకారం అన్న గుణాలు ప్రశంసనీయాలైనట్లే స్త్రీలలో కూడా ధైర్యం, స్థైర్యం, అభిమానం అన్నవి మెచ్చుకోదగిన గుణాలనీ ఆనాటి స్త్రీల ప్రశంసలలో కానవస్తుంది. (చూ. ప్రకరణం. కాకతీయులనాటి సమాజము – స్త్రీలు).

యుద్ధంలో శౌర్య ప్రతాపాలు చూపి విజయం సాధించడం వీరుని ధర్మమైనట్లే, అతనిని నిరుత్సాహపరచక ధైర్యంతో హారతిని ఇచ్చి దీవించి పంపడం వీరపత్నులకు, వీరమాతలకు ధర్మంగా ఎంచేవారు. యుద్ధపరిణామం ఏదైనా, తమకు కష్టనష్టాలు తప్పవని తెలిసినా యుద్ధానికి వెళ్ళే పురుషులను ప్రోత్సహించడం, శత్రువులకు వెన్నుచూపి వస్తే తిరిగి యుద్ధోన్ముఖులను చేయడం తమ కర్తవ్యంగా భావించేవారు. రణతిక్కన తల్లి ప్రోలమాంబ, భార్య జానమ యర్రగడ్డపాటి పోట్లాటలో ఓడిపోయి పారిపోయి వస్తే తమ వ్యంగ్యోక్తులతో రెచ్చగొట్టి తిరిగి యుద్ధానికి సన్నద్ధమయేలా చేశారు.

యుద్ధాలవల్ల వచ్చే నష్టాలు తెలిసినా రాజవంశాల స్త్రీలు వారి పురుషులను వారించడానికి ప్రయత్నించేవారు కాదు. అతడు చేసే యుద్ధం న్యాయసమ్మతం అయినా కాకపోయినా వీరపత్నిగా ఆమె భర్తకు వీరతిలకం దిద్ది హారతి ఇచ్చి పంపవలసిందే. భర్తతో తాను సుఖించక పోయినా, యుద్ధంలో మరణిస్తే తాను సహగమనం చేయవలసి వచ్చినా ధైర్యంగా తన కర్తవ్యాన్ని నెరవేర్చేది. పలనాటి వీరచరిత్రలో మాంచాల పెళ్ళయి ఏడేండ్లయినా ముఖం చూపని బాలచంద్రుడు మొదటిసారిగా తనతో గడపడానికి వచ్చినా, వచ్చిన పని మరచినా భార్యగా తన భర్తకు కర్తవ్యాన్ని గుర్తుచేసి అతనికి హారతినిచ్చి ఈ విధంగా దీవించింది.

శాత్రవ విజయంబు సమకూరు మీకు
కలియుగంబున మీకు ఘన పూజలమరు
ఈ యాయుధము నీకు నిచ్చును జయము
అని యిట్లు ఆ ప్రాణేశు నాశీర్వదించి
యుద్ధరంగానికి పంపింది.

భర్త యుద్ధంలో గెలిచినట్లయితే ఓడిన రాజుల కన్యలను పెళ్ళాడి ఆమెకు సపత్నులను తెచ్చేవాడు. పట్టపుదేవి సోమలదేవి ఉండగానే కాకతీయ గణపతిదేవుడు పినచోడిరాజును ఓడించి నారమ పేరమలను వివాహమాడాడు. ఓడి మరణించినట్లయితే ఆతని శవంతో పాటు చితిలో కాలి వీరస్వర్గం అలంకరించేది. పలనాటి వీరచరిత్రలో పేరిందేవి భర్త అల్లు మల్లరాజు శవంతో సహగమనం చేసింది. బిడ్డలున్న స్త్రీలు దాసీలకో, దాదులకో, దగ్గరి బంధువులతో పిల్లలనప్పగించి సహగనమం చేసేవారు.

యుద్ధాలలో ఓడిపోయిన రాజులతో పాటు వారి స్త్రీలు, వారి నాశ్రయించుకున్న పరివార జనంతో పాటు వారి విలాసినీ జనం కూడా వనవాసం చేయాల్సివచ్చేది. రెండవ ప్రతాపరుద్రుని దాయగజకేసరి ఖండవల్లి శాసనంలోని ‘యస్యారి భూపాల విలా సినీ భ్యఃశ్వాసానిలో ధైర్వనవాసినీభ్యః’ అన్న వాక్యాలు పై విషయాన్ని ఋజువు చేస్తున్నాయి.

ప్రతాపరుద్ర యశోభూషణంలో ప్రతాపరుద్రుని సామంతరాజు భార్య అతనితో “వీరరుద్ర నృపతిని సేవించడం మానివేస్తే మానెయ్యి. వనవాసులు జీవించే పద్ధతిని నేడే నేర్చుకుంటాను.” అని అన్నదని కవి చమత్కరించాడు. బలవంతుడైన చక్రవర్తినెదిరిస్తే కష్టాలపాలు కాక తప్పదని వ్యంగ్యంగా హెచ్చరించింది.

పలనాటి వీరచరిత్రలో కోడిపందెంలో ఓడిపోయిన తరువాత మలిదేవ బ్రహ్మనాదులు మాచర్ల వీడి మండాది వలసపోయినపుడు వారి వెంట వారి అంతఃపుర స్త్రీలు కూడా వెళ్లారు. కేతన రచించిన దశకుమార చరిత్రలో రాజు రాజహంసుడు యుద్ధానికి బయలుదేరే ముందు – ముందు జాగ్రత్తకై, మంత్రుల సలహాననుసరించి అతని రాణి, అంతఃపుర స్త్రీలు పరిచారికలు, దాదులు అందరూ రాజ్యాన్ని వదిలి వనాలకు వెళ్ళారు. కాకతీయ రుద్రదేవుని చేతిలో ఓడిపోయిన భీమరాజు సోదరులు, తల్లి, భార్య మొదలైన తనవారితో కలిసివెళ్ళి అరణ్యాలలో తలదాచుకొన్నాడని రుద్రుని వేయిస్తంభాల గుడి శాసనాన్ని బట్టి తెలుస్తున్నది.

యస్యాక్షి వీక్షణ భయాచ్చకితస్సఖీ
మోదుర్యోధనస్య నృపతేరిన విహ్వలాంగః స్వభ్రాతృ
మాతృవనితా సహిత స్సమగ్రలక్ష్మీం విహాయ వనమేవయ
యౌవిలజ్జః (పంక్తులు 102 104)

ఆ విధంగా వనవాసం చేయని పక్షంలో శత్రురాజులకు లొంగిపోవలసి వచ్చేది. (ఆనాటి రాజుల ప్రశంసలలో రాజవేశ్యాభుజంగ అనే బిరుదుండడం సాహిత్యంలో కానవస్తుంది. ‘విక్రమసింహ నగరంబున కధీశ్వరుండును రాజవేశ్యా భుజంగ నామాంకితును నైన మనుమసిద్ధి వల్లభు’). ఆ విధంగా చెరపట్టబడిన స్త్రీలను అవరుద్ధలంటారు. వారిని ఇంట్లో ఉన్న బానిసలు, ధన కనక వస్తు వాహనాలతో సమానంగా పరిగణించేవారు. యజమాని చనిపోతే అతని కొడుకులు ధన కనక వస్తు వాహనాలు, బానిసలతో పాటు అవరుద్ధలైన స్త్రీలను కూడా పంచుకొనేవారని విజ్ఞానేశ్వరాన్ని బట్టి తెలుస్తుంది.

పొత్తున జనకుండు పుత్రుండు నున్న నా డేర్పడ దమలోన నెవ్వడేని
గట్టిన చీరలు బెట్టిన తొడవులు నెక్కెడి వాహనంబు లింటిలోన
బాయని కొలుచు బానిసలోనుగా నవరుద్ధులైయున్న యంగనలును
మంచంబు పీఠంబు కంచంబు చాపము చెప్పులు గొడుగుల చేటతెడ్డు
పాయకెప్పుడు జెల్లు సంపదలు వరుస
దొల్లిచెల్లిన భంగిని జెల్లనిచ్చి
పెఱధనంబులు తమలోన వేరువేర
నొక్కభంగిగ బాల్కొను టుత్తమంబు

ఈ రకమైన దుస్థితి ఆత్మగౌరవమున్న స్త్రీలు భరించలేక వనవాసం చేయడానికి సిద్ధపడేవారు. అడవిలో కోయలు, ఎఱుకుల వంటి వారివల్ల కూడా ఆపదలుండేవి. ఆ పరిస్థితిలో ప్రాణత్యాగం తప్పనిసరి అయేది. ఈ బాధలకంటె భర్త చనిపోతే సహగమనమే మేలనుకొనేవారు ఆనాటి స్త్రీలు.

కనుకనే భర్తలు యుద్ధానికి తలపడినప్పుడు శత్రువు బలవంతుడైతే ఓటమి తప్పదని గ్రహించినవారు యుద్ధకారణం సమంజసం కాదని తలచినవారు తమ భర్తలను హితోక్తులతో యుద్ధవిముఖుల్ని చేయడానికి ప్రయత్నించేవారు. నన్నెచోడుని కుమారసంభవంలో శివునిపై తన అస్త్రం ప్రయోగించబోయిన మన్మథుడి ప్రయత్నం మాన్చడానికి రతీదేవి ఎన్నో విధాలుగా నీతిబోధ చేసింది.

స్వర్గంలోని స్త్రీలందరూ మన్మధునిపై మనసు పెట్టడం వల్ల దాన్ని సహించలేని ఇంద్రుడు తన అడ్డు తొలగించుకొనేందుకు ఈ విధంగా మన్మథుని శివుని తపోభంగం చేయడానికి పంపాడు అని పరోక్షంగా భర్త అందాన్ని పొగిడి, ఇంద్రుడి అసూయను తెలిపింది. దేవతలు పంపితే అది గొప్పతనంగా భావించి దేవదేవుని తేలికచేసి మాట్లాడిన మాటలు మీ తల్లిదండ్రులు వింటే నొచ్చుకుంటారు అని బెదిరించింది. “ఇట్టి క్రొవ్విదములు దక్కు అని మీ పలుకు విష్ణుడు లక్ష్మీయు విన్న మెత్తురే”, అగ్ని శిఖలపై ఎగరబోయిన మిడుతలాగా నశించిపోతావు అని భయపెట్టింది. అతని శక్తిని, ఈశ్వరుని శక్తిని అంచనావేసి ‘తమకసాధ్యుల సాధింప దలపనగునె’ అని అతని ప్రయత్నాన్ని వారించబోయింది.

కాకతీయుల నాటి రాజకీయాలలో వైవాహిక సంబంధాల ప్రాముఖ్యం:

కాకతీయుల కాలంలో రెండు రాజ్యాల మధ్య జరిగిన యుద్ధాలలో ఓడిన రాజులు సంధి ప్రయత్నంగా తమ కుమార్తెలను గెలిచిన రాజుకిచ్చి వివాహం చేయడం, తద్వారా ఆ రాజు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందడం జరిగేది. కానీ ఒక్కొక్కపుడు కొందరు రాజులు తమ కుమార్తెలను గెలిచిన రాజుకు ఇవ్వడానికి ఇష్టపడేవారు కాదు. అంతకంటే తమ రాజ్యాన్ని, కీర్తిని పోగొట్టుకొని అడవుల పాలవడానికి సిద్ధపడేవారు.

మేడరాజు కాకతీయ రుద్రుని చేతిలో ఓడిపోయినప్పటికీ, అతనికి తన కుమార్తె నిచ్చి వివాహం చేయడానికి అంగీకరించలేదు. అందుకు అతడు సంపదను, అభిమానాన్ని, కులసంచితమైన కీర్తిని కూడా పోగొట్టుకున్నాడని కాకతి రుద్రుని మంత్రి గంగాధరుడు తన హనుమకొండ శాసనంలో చెప్పాడు.

మేడక్షితి పతి రతి మాత్రం కక్ష్యవాదం వితన్వన్
విభేదసేతుం నగరం దదాహ జహార హస్తిద్వితయం మదాన్ధం
లులావతాళోపవనం హరేనయో మేడరాజం సమరే విజిత్య
అనిచ్ఛన్కన్యకాం దాతుం యన్మై మేడనృపో దధౌ
విభూతిం చాభిమానం చ కీత్తిం చ కులసంచితాం

రాజ్యం కోసం కూతుర్ని ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరించని మేడరాజును శాసనంలో విమర్శించినా అతని అభిమానాన్ని మెచ్చుకోవాల్సిందే. కూతుర్ని సంధికి సాధనంగా వాడుకోకపోవడానికి ఆమెపైన తండ్రికి ప్రేమాభిమానాలు ఉండడమే కారణం కావచ్చును. ఈ ఉదంతాన్ని ఇంకొక కోణం నుంచి కూడా పరిశీలించాలి. సాధారణంగా ఆడపిల్లనిచ్చినవారు వరుని కంటె తక్కువస్థాయిలో ఉన్నట్లు భావించడం కద్దు. ఓడిన రాజులు తమ కుమార్తెలను గెలిచిన రాజుకు ఇచ్చి వివాహం చేసేవారు. ఇందుకు ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.

పలనాటి వీరచరిత్రలో చందవోలు రాజు అనుగురాజుతో యుద్ధంలో ఓడి తన కుమార్తె మైలమాదేవిని ఇచ్చి వివాహం చేశాడని ఉన్నది.

కాకతి రుద్రదేవుడు కోట దొడ్డభీముని ఓడించి అతని కుమార్తెను వివాహమాడి అతని కొడుకు రెండవ కేతరాజును సింహాసనస్థుని చేశాడు. పానుగల్లు రాజు చోడోదయుని ఓడించి అతని కూతురు పద్మావతిని వివాహమాడాడు. కాకతి గణపతిదేవుడు అయ్యవంశీయుడైన పినచోడి రాజును ఓడించి అతని కుమార్తెలు నారమ పేరమలను వివాహమాడాడు.

ఒక విధంగా ఈ వివాహాలు ఎవరు అధికులో, ఎవరు అల్పులో నిర్ణయించేవి అని చెప్పవచ్చును. ఈ విధంగా శత్రువు ఆధిక్యాన్ని ఒప్పుకోక తన అభిమానానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన మేడరాజు తన కూతుర్ని రుద్రదేవునికి ఇవ్వడానికి నిరాకరించి ఆ కారణంగా తన రాజ్యాన్ని కూడా పోగొట్టుకొనేందుకు సిద్ధపడ్డాడని భావించవచ్చును.

మండలాధికారులు తమలో తాము చిన్న చిన్న విషయాల కారణంగా పౌరుషాలకు పట్టింపులకు పోయి యుద్ధాలు చేసుకొనేవారు. ఇరుపక్షాల స్నేహితులు బంధువులు చేరితే అదే మహాయుద్ధమయ్యేది. నలగాముని మంత్రిణి నాగమ్మకు మలిదేవుని మంత్రి బ్రహ్మనాయునికి కోడిపోరుతో ప్రారంభమైన తగవు ఇరుపక్షాల స్నేహితులు, బంధువులు, ఆశ్రితులు చేరడం వల్ల పంతాలెక్కువై పల్నాటియుద్ధంగా పరిణమించి ఎంతోమంది వీరుల మరణానికి, వారి స్త్రీల సహగమనానికి కారణమైంది.

ఈ విధంగా యుద్ధాలు జరుగకుండా వైవాహిక సంబంధాల ద్వారా రెండు రాజ్యాలు సన్నిహితమై ప్రజలకు శాంతిసౌఖ్యాలను కూర్చినట్లు నిదర్శనాలు లేకపోలేదు. ఆ కాలంలోని కొన్ని ప్రసిద్ధ రాజవంశాల స్త్రీలు తమ వివాహ సంబంధాల వల్ల పుట్టినింటికీ, మెట్టినింటికీ వారధులై రెండు రాజ్యాల మధ్య యుద్ధాలు లేకుండా చేశారు.

కాకతీయ గణపతిదేవుడు, యాదవరాజు జైతుగి కుమార్తె రుద్రమదేవిని వివాహం చేసుకోవడం వల్ల అంతకుముందు యాదవులకు కాకతీయులకు ఉన్న వైరం తొలగిపోయింది. కాకతి గణపతిదేవుని కాలంలో యాదవరాజులైవరైనా కాకతీయులపై దండెత్తి వచ్చినట్లు గానీ, కాకతీయ సైన్యం యాదవరాజ్యంపై దండెత్తినట్లు గానీ ఆధారాలు లేవు. గణపతిదేవుని కాలంలో కొన్ని యాదవ రాజకుటుంబాలు అతనికి సామంతులుగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇది తప్పక గణపతిదేవునికి యాదవ రాజకుమారితో వివాహసంబంధం వల్లనే సాధ్యపడిందని ఊహించవచ్చును.

ఈ విధంగా వైవాహిక సంబంధాల ద్వారా రాజకుటుంబాలు దగ్గరవడం మధ్యయుగంలోని రాజకీయాలలో ఉన్నదే. అయితే కాకతీయ చక్రవర్తులు తమ సామ్రాజ్యం స్థిరంగా ఉండడానికి సామంతులతో సంబంధ బాంధవ్యాలు పెంచుకొని వారి సహకారంతో రాజకీయ సుస్థిరతను సాధించారు. కాకర్త్య గుండన సోదరి విర్యాల కామసాని కారణంగానే కాకతి, విర్యాల వంశాల మధ్య సంబంధం పటిష్టమైంది. కాకతీయ మహాదేవుని కుమార్తెలైన కుందమాంబ మైలమాంబల వివాహాల వలన నతవాటి వంశం, రుద్రమదేవి వివాహం వల్ల తూర్పు చాళుక్యవంశం, గణపాంబ వివాహం వల్ల కోట వంశం కాకతి వంశానికి విశ్వాసపాత్రమైన సామంత వంశాలుగా ఉండి కాకతీయ సామ్రాజ్యాన్ని సుస్థిరం చేశారు.

చక్రవర్తులే కాక సామంతులు కూడా తమలో తాము వైవాహిక సంబంధాల ద్వారా దగ్గరై తమ ప్రభువులకు చక్రవర్తులకు బాసటగా నిలిచారు.

విర్యాల వంశంలోని అన్నయ ఐతమల కుమార్తె మల్యాల చౌండసేనానితో వివాహం వల్ల మల్యాల, విర్యాల వంశాలు దగ్గరైనాయని కాటకారు శాసనం వలన తెలుస్తున్నది. నతవాటి రుద్ర, కాకతి మైలమల కుమార్తె బయ్యల మహాదేవి కోటవంశంలోని మన్మకేతరాజును వివాహమాడడం వల్ల నతవాడి, కోటవంశాలు దగ్గరైనాయి. గోన బుద్ధారెడ్డి కూతురు కుప్పాంబిక మల్యాల గుండ దండాధీశుని వివాహం వల్ల గోన, మల్యాల వంశాలు సన్నిహితమైనాయని గ్రహించవచ్చును.

రాజవంశాలు వివాహాల వల్ల సన్నిహితమవుతాయని పైన చెప్పిన విషయాలను బట్టి చెప్పవచ్చును. కానీ దీనికి అపవాదాలు లేకపోలేదు. కోట దొడ్డభీముడు వెలనాటి చోడ రాజకుమార్తె సబ్బాంబికను వివాహమాడాడు.

కాకతీయరుద్రుడు వెలనాటి రాజేంద్రచోడునిపై దండెత్తడానికి రెండవ కేతని తీసుకువెళ్ళి అతని సహాయంతో అతని మేనమామను ఓడించాడు. నిజానికి కోట, వెలనాడు రాజవంశాలవారు ఏకమై ఉంటే కాకతి రుద్రునికి జయం లభించేదికాదు. వెలనాటిచోడుని ఇంకొక కుమార్తె మైలమాదేవి నలగామరాజుకు తల్లి. పల్నాటియుద్ధంలో రెండవ కేతరాజు నలగామరాజు పక్షంలో పోరాడాడు. పినతల్లి కొడుకుకు సహాయం చేశాడేకాని తన మేనమామపై దండెత్తడానికి వెనుకాడలేదు. తన సోదరునిపై దండెత్తే కుమారుని తల్లి వారించి ఉండవచ్చు కానీ స్త్రీకి ఆ విషయంలో స్వాతంత్ర్యం ఉండి ఉండదు. లేదా ఆమెకి తన పుట్టింటివారి మీద అంత సానుభూతి, ప్రేమ ఉండకపోవచ్చు. శత్రువుతో రాజీపడడానికి అతనికి చిన్నవయసులో ఉన్న కూతుర్నిచ్చి వివాహం చేసే ఆ తండ్రిపైన ఆ కుటుంబం పైన ఆ కూతురికి స్నేహభావం ఉండకపోవచ్చు. ఆనాడు పొలవాసాధిపతి మేడరాజు వంటి తండ్రులు అరుదుగా ఉండి ఉంటారు. పుట్టిన వెంటనే ఆడపిల్లను పరాయిధనంగా భావించే కుటుంబం పైన, రాజకీయాలలో సాధన సామగ్రిగా కూతుళ్ళను వాడుకొనే తండ్రులపైన ఆ ఆడపిల్లలకు అంత అనుబంధం ఉండకపోవడం వల్ల తమ పుట్టింటివారిపై యుద్ధం ప్రకటించే భర్తలను, కొడుకులను వారు వారించి ఉండకపోవచ్చు.

కోట దొడ్డభీమునికి, వెలనాటి చోడుని కుమార్తె సబ్బాంబికకు కొడుకు అయిన రెండవ కేతరాజు కాకతీయ రుద్రునికి వెలనాటి చోడగొంకని ఓడించడానికి సహాయపడ్డాడు. అంటే తల్లి పుట్టింటివారితో యుద్ధం చేయడానికి అతనికి బంధుత్వం అడ్డురాలేదు. విఱియాల కామసాని కాకర్త్య గుండనకు సోదరి అని మొదటి ప్రకరణంలో చెప్పడమైనది. విఱియాల కామసాని భర్త ఎఱ్ఱన తన బావమరిది కాకర్త్య గుండనను శత్రుపక్షం తరఫున యుద్ధం చేసి ఓడించాడు. నలగామరాజు అల్లుడు అల్లు మల్లరాజు (అలరాజు) అతని తండ్రి కొమ్మరాజు, పలనాటి యుద్ధంలో నలగామరాజును సమర్థించక మలిదేవుని పక్షంలో చేరి పోరాడారన్నది ప్రసిద్ధమైన విషయమే.

దీన్ని బట్టి ఒక్కొక్కప్పుడు చుట్టఱికాలు అంత సహాయపడేవి కావు అని చెప్పవచ్చు. అందుకే కాబోలు ఆ కాలానికి చెందిన సుమతీశతకకారుడు

‘అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున దా
నెక్కిన బాఱని గుఱ్ఱము
గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ’ అన్నాడు.

మాట పట్టింపులకు, కులపగలు తీర్చుకొనేందుకు మగవారు చేసే యుద్ధాల వల్ల వారి స్త్రీలు బాధపడడమే కాక, మామూలు ప్రజలు కూడా బాధలు పడేవారు.

సహజంగా స్త్రీలకు మాతృభావన (మదర్స్ ఇన్‌స్టింక్ట్) కరుణ, దయ ఉండడం వల్ల వారు యుద్ధాల వల్ల సామాన్య ప్రజలు పడే బాధలను గుర్తించేవారు. యుద్ధానికి వెళ్ళే బ్రహ్మనకు శీలమ చేసిన బోధలో అతడు యుద్ధం చేయవలసిన సమయాన్ని గురించి చెప్పడంలో స్త్రీలు, సామాన్య ప్రజలు నష్టపోకూడదన్నదే ఆమె ఉద్దేశం.

జపముకై బ్రాహ్మణుల్ చనియెడువేళ
వేగుజామున పొడువ వేగిరపడకు
పదమని సతులను పాడి ధేనువుల
పాలకై ప్రొద్దున పరగ నురుతాళ్ళు
తలకోలలను బట్టి తనరార పితుక
ఆవేళ కోటపై నార్చినగాని
అగ్నివాయువుచేత నాపట్టణంబు
భస్మమ్ముగా కాలి పసులు సమసినను
అటువంటి దోషమ్ము లణగ వెన్నటికి
పగలెల్ల పొలమున పనిపాటు చేసి
మగడు ధాన్యము కొని మాపట చేరు
నను నాస బిడ్డలు నతని కులసతియు
ఎదురు చూచుచు నుందురిండ్లలో నుండి
అర్ధరాత్రి పోటు అది కాదు వినుము.

యుద్ధాలలో మరణించిన సైనికులకు సంబంధించిన స్త్రీలు ఆ యుద్ధాలకు కారకులైనవారిని నిందించేవారు. సంధి ప్రయత్నం చేయకుండా తమ పంతం కోసం యుద్ధం చేసేవాడు తమ రాజైనా సరే అతడి నాశనాన్నే కోరేవారు. రంగనాథ రామాయణంలో రావణుని నిందించిన రాక్షస స్త్రీలలో ఆనాటి యుద్ధాల వల్ల అప్తులను పోగొట్టుకున్న స్త్రీల ఆర్తి కనిపిస్తుంది.

‘ఇంకనైనను రామునిట శరణన డు, లంక నింటింట విలాపముల్వుట్టె
తమ బంధులీల్దిరి తమ మగల్తెగిరి, తమ సుతుల్మృతులైరి తమ సహోదరులు
హతులైరి రణభూమినని యెల్లవారు, నతి శోకమును బొంది యడలు చున్నారు
………………………………
దశకంఠుడింక నీ దశరథ సుతుని, విశిఖాగ్ని గూలుట వేగంబ యుండు’.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here