‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’ -17

0
5

[డా. మంత్రవాది గీతా గాయత్రి గారు 1995లో పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

ప్రకరణం 5 – కాకతీయుల కాలంలో స్త్రీలు వివాహాది సంస్కారాలు:

[dropcap]మ[/dropcap]నిషి గర్భంలో ఉన్నప్పటినుంచి మరణించే వరకు ఉన్న దశలో షోడశ సంస్కారాలు జరగాలని వేదాలలో చెప్పబడింది. కాలక్రమేణా ఈ సంస్కారాలు పురుషులకు అందునా ద్విజులకు మాత్రమే నిర్దేశించబడినాయి. స్త్రీలు శూద్రులు ఈ సంస్కారాలకు దూరమైనారు. కొన్ని సంస్కారాలు మాత్రమే స్త్రీలకు నిర్దేశించ బడినాయి. ఇందులో విద్యకు సంబంధించినవి లేకపోవడం గమనార్హం. పూర్వం స్త్రీలకు విద్యార్హత ఉండి తరువాత ఎలా పోయిందో, పరిశీలించాలి.

పూర్వయుగాల్లో స్త్రీలు – వివాహం – ఇతర సంస్కారాలు

మన ప్రాచీన ధర్మశాస్త్రాలు ద్విజులకు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు షోడశ సంస్కారాలు వేదమంత్రాలతో జరగాలని శాసించాయి. స్త్రీలకు వివాహం, పుంసవనం, సీమంతోన్నయనము అనే సంస్కారాలు మాత్రమే నిర్దేశింపబడినాయి. వేదకాలంలో మాత్రం స్త్రీలు విద్యాధికలు ఉండేవారని, వారిలో కొందరు ఋక్కులు రచించిన వారనీ ఋగ్వేదంలోనే నిదర్శనాలున్నాయి.

అత్రి వంశంలోని విశ్వావర ఋగ్వేదం 5వ భాగంలో 28వ ఋక్కు, అపాల- ఋగ్వేదం 8 భాగంలో 91 ఋక్కు – ఘోషాకాక్షావతి ఋగ్వేదంలో 39 వ ఋక్కు రచించారు. యాజ్ఞవల్క్య ఋషి భార్య మైత్రేయి గొప్ప వేదాంతిని, బ్రహ్మజ్ఞానాన్వేషిణి, శాశ్వతమైన జ్ఞానాన్ని ఉపదేశించమని భర్తను కోరినట్లు బ్రహ్మోపనిషత్తులో ఉన్నది. జనకుని సభలో యాజ్ఞవల్క్యుని తన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన గార్గి వాచక్నవి పండితురాలు. ఆ ఆస్థానంలో ప్రముఖస్థానం అలంకరించిన స్త్రీ. వేదోపనిషత్తుల కాలంలో పురుషులకు తీసిపోని విధంగా మేధావులైన స్త్రీలు ఉన్నట్లుగా తరువాత కాలంలో ఉన్నట్లు అంతగా కనిపించదు. పండితురాలైన పుత్రికను కోరుకొనే వారికి ప్రత్యేకమైన క్రతువున్నట్లు బ్రహ్మోపనిషత్తులో ఉన్నది. “అథ య ఇచ్చేద్దుహితా మే పండితా జాయేత్..”. అయితే ఆదిశంకరుని కాలంలో అంటే స్త్రీలకు వేదాధ్యయనం నిషిద్ధమైన కాలంలో ఈ శ్లోకానికి వేరే అర్థం చెప్పబడింది.

ఆదిశంకరులు తమ భాష్యంలో పై శ్లోకానికి అర్థం వివరిస్తూ పండీతా అన్న పదానికి గృహ కృత్యాలలో నైపుణ్యం అని చెప్పారు.

స్మృతి చంద్రిక మొదలైన ధర్మశాస్త్రాలలో హరీత ఋషి చెప్పిన ధర్మ సూత్రం ఈ ప్రకారంగా ఉన్నది. స్త్రీలలో బ్రహ్మవాదినులు, సద్యోవధువులు అని రెండు విధాల వారున్నారు. బ్రహ్మవాదినులు ఉపనయనం చేసుకొని, అగ్నిహోత్రాన్ని ఆరాధిస్తూ, భిక్ష గ్రహించి వేదాధ్యయనం చేయాలి. సద్యోవధువులకు అంటే చదువు కోకుండా వివాహం చేసుకొనే స్త్రీలకు వివాహకాలం సమీపించినప్పుడు ఉపనయనం మాత్రం చేసి ఆ తరువాత పెళ్ళి జరిపించాలి.

మనువు వివాహమొక్కటే స్త్రీలకు వేదమంత్రాలతో జరిపించవలసిన సంస్కారమని, ఉపనయనాదులు మంత్రాలు లేకుండా జరిపించాలనీ అన్నాడు.

సంస్కార ప్రకాశంలో, పూర్వయుగాల్లో స్త్రీలకు ఉపనయనం మౌంజీ బంధనం అంటే యజ్ఞోపవీత ధారణం, వేదాధ్యయనం, సావిత్రి చదవడం, పితృగృహంలోనే భిక్ష స్వీకరించడం ఉండేవని, అయితే వారికి అజినం, నార చీర, జటాధారణం, వర్జనీయమని ఈ క్రింది శ్లోకం ద్వారా చెప్పబడింది.

‘పురా కల్పేషు నారీణాం మౌంజీ బంధన ముచ్యతే
అధ్యాపనం చ వేదానాం సావిత్రీ వచనం తథా
పితాపితృవ్యో భ్రాతావా నైనా మధ్యాపయేత్పరః
స్పగృహే చైవ కన్యాయా బైక్షాచర్యా విధీయతే
వర్జయేదజినం చీరం జటాధారణమేవచ’

ఆంధ్ర దేశంలో కూడా పూర్వకాలంలో విద్యాధికలైన స్త్రీలుండేవారు. శాలివాహనుని పట్టమహిషి అయిన మలయవతి సంస్కృత భాషలో పండితురాలు. శాతవాహనులు, ఇక్ష్వాకుల రాణులయిన గౌతమి బాలశ్రీ, శాంతిశ్రీ మొదలైన వారిని పండిత స్త్రీలు అని శాసనాలలో పేర్కొనేవారు. బౌద్ధ విహారాలకు దానాలు చేయటమే కాక ఆ విహారాలలో జరిగే ప్రసంగాలలో పాల్గొనే వారు. శాతవాహన, ఇక్ష్వాకు వంశాలలో విద్యాధికలైన స్త్రీలు ఉండటం వల్లనే వారి పుత్రులు మాతృభక్తి పరాయణులై తమ నామధేయాలకు ముందు తమ తల్లుల పేర్లు చెప్పుకొనేవారు. వాసిష్ఠీ పుత్ర పులోమావి, గౌతమి పుత్ర శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణి వంటి శాతవాహన చక్రవర్తులు, వాసిష్ఠీ పుత్ర శాంతమూలుడు, మాఢరీ పుత్ర శ్రీ వీర పురుషదత్తుడు వంటి ఇక్ష్వాకు చక్రవర్తులు ఈ కోవకు చెందినవారు. అమరావతి శాసనాలలో అనులక్షి, మాధవి, లోహ, రేవ అనే కవయిత్రుల పేర్లు పేర్కొన బడినాయని డా. అల్లాడి వైదేహి గారు తమ ‘ఆంధ్ర దేశము – స్త్రీలు’ అన్న గ్రంధంలో తెలిపారు.

ఈ ప్రాచీన భారత దేశంలో వేదకాలంలోనూ, ఆంధ్ర దేశంలో శాత వాహన ఇక్ష్వాకు చక్రవర్తుల కాలంలోనూ కూడా విద్య నేర్చిన పండిత స్త్రీలుండగా మధ్యయుగంలోనూ, ఆధునిక యుగంలోనూ స్త్రీలు విద్యకు దూరమై అజ్ఞానాంధకారంలో మునిగి పోవడానికి కారణాలైన పరిస్థితుల గురించి, స్త్రీకి విద్యార్హత లేదని శాసించిన ధర్మ శాస్త్రాల గురించి తెలుసుకోవాలి.

మను స్మృతి కాలం నాటికి స్త్రీల స్థానం శూద్రులతో సమమై వేదవిహిత సంస్కారాలకు, వేదాధ్యయనానికి వారు దూరమైనారు.

ధర్మశాస్త్రకారులు స్త్రీలకు అంగీకరించిన సంస్కారాలు: స్త్రీలకు వివాహమొక్కటే మనువు అంగీకరించిన సంస్కారం. ద్విజులలో పురుషులకు ఉపనయన సంస్కారం వంటిదే స్త్రీలకు వివాహం అని మనువు ఈ క్రింది శ్లోకంలో నిర్దేశించాడు.

“వైవాహికో విధిః శ్రీణాం సంస్కారోవైదికః స్మృతః”

ఉపనయనం తర్వాత పురుషుడు గురువు వద్దకు వెళ్ళినట్లు స్త్రీ వివాహం తర్వాత భర్త వద్దకు వెళ్తుంది. శిష్యుడు గురువుకు శుశ్రూష చేసినట్లు ఆమె భర్త సేవలే చేస్తుంది. హోమాగ్ని బదులు గృహంలో నిప్పురాజేసి వంట చేయడం, నీళ్ళు తేవడం, గృహాన్ని శుభ్రం చేయడం వంటిది చేస్తుంది. ఆశ్రమంలో గురువుకు శిష్యుడు చేసే శుశ్రూష వంటిదే భర్తకు స్త్రీ చేసే సేవ కనుక స్త్రీకి వివాహమే ఉపనయనం వంటి సంస్కారమని ధర్మశాస్త్రకారులు ఉపదేశించారు.

ఉపనయనం గర్భాష్టకంలో అంటే ఎనిమిదవ ఏట జరుగుతుంది కనుక ఎనిమిదేళ్ళ వయుసున్న బాలికకు వివాహం చేసేవారు. బ్రాహ్మణ బాలుడికి అయిదవ ఏట ఉపనయనం చేస్తే బ్రాహ్మణ బాలికకి అయిదవ ఏటనే వివాహం జరగడం సమంజసంగా భావించారు, దీన్ని బట్టి ఆనాటి ధర్మశాస్త్రకారులు బాల్యవివాహ సంప్రదాయాన్ని ఏ విధంగా సంఘంలో ప్రవేశపెట్టారో వెల్లడవుతుంది. దీనికి మనువు చెప్పిన ఈ క్రింది శ్లోకం మద్దతునిచ్చింది.

‘పితారక్షతి కౌమారే భర్తారక్షతి యౌవనే
రక్షన్తి స్థవిరే పుత్రా నస్త్రీ స్వాతంత్ర్య మర్హతి’

స్త్రీని బాల్యంలో తండ్రి, యౌవనంలో భర్త, వార్ధక్యంలో పుత్రుడు రక్షించాలని, స్త్రీ స్వాతంత్ర్యానికి అనర్హురాలు అని చెప్పడం వల్ల ఆడపిల్లను కౌమార దశ దాటకుండానే వివాహం చేసి ఆమెను భర్త కప్పగించి ఆమె రక్షణ బాధ్యత నుంచి తండ్రి తప్పుకోవడం సామాన్యమై బాల్యవివాహలు బాగా అమలు జరిగినాయి.

మనువు స్త్రీకి స్వాతంత్ర్యం పనికి రాదు అని శాసించటంలో ఆయనకు స్త్రీ పట్ల గౌరవం లేకపోవడం కారణం కాకపోవచ్చు. ఆ కాలంలో విదేశీయులు, ముఖ్యంగా యవనులు దండయాత్రలు చేసి స్త్రీలను అత్యాచారాలకు గురి చేయడం వల్ల స్త్రీలకు రక్షణ కల్పించవలసిన బాధ్యతను కుటుంబంలోని మగవారిపై పెట్టడమే ముఖ్యోద్దేశం కావచ్చును.

‘యత్ర నార్యస్తు పూజ్యన్తే రమంతే తత్ర దేవతాః
యతై తాస్తు న పూజ్యస్తే సర్వాస్త త్రా ఫలాః క్రియాః’

ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో అక్కడ దేవతలు నివసిస్తారు, ఎక్కడ స్త్రీలు నిరాదరణకు గురి అవుతారో అక్కడ ధర్మకార్యాలు ఫలాన్ని పొందవు అని స్త్రీలను గౌరవించడం నియమంగా చేసిన ధర్మ శాస్త్రకారులు స్త్రీలను బానిసలుగానూ, మగవారిపై ఆధారపడి బ్రతికే వారు గానూ శాసించి ఉండరు.

స్త్రీకి వివాహం ఉపనయనం వంటిది కనుక గోభిల్ల గృహ్య సూత్రంలో వరుడు పెండ్లి సమయంలో వధువుకు యజ్ఞోపవీతం ధరింపజేసి ఈ క్రింది శ్లోకాన్ని మెల్లగా పలకాలని చెప్పారు.

‘ప్రావృతాం యజ్ఞోప వీతినీ మభ్యుదానయన్ జపేత్ సోమో దదద్గంధర్వా యేత్’.

ఈనాడు కూడా బ్రాహ్మణులలో వైదిక పద్ధతిలో జరిగే వివాహ సమయంలో వరుడు వధువుకు నడుము చుట్టు యోక్తం కడతాడు. యజ్ఞోపవీతం వంటి దానిని వేస్తాడు. ఆ తరువాతనే మంగళ సూత్ర ధారణ, హోమం చుట్టూ ప్రదక్షిణ జరుగుతాయి. వరుడు వధువుకు కట్టే మంగళ సూత్రం కూడా బహుశా యజ్ఞోపవీతానికి మరో రూపంగా భావించవచ్చునేమో? ద్విజులు, యజ్ఞోపవీతాన్ని, స్త్రీలు పసుపుతాడు (మంగళ సూత్రం) నీ ఎల్లప్పుడూ ధరించాలని నియమం ఉన్నది. పైన చెప్పబడిన వివాహ పద్ధతి ద్విజులనే వారి వంశాలలో ముఖ్యంగా బ్రాహ్మణ వంశాలలోని స్త్రీలకు జరిగేది. ద్విజేతరులకు ఈ సంస్కారాలు జరుగవు. ఇక స్త్రీలకు జరపబడే సంస్కారాలలో పుంసవనము, సీమంతోన్నయము అన్నవి కూడా ఉన్నాయని కేతన విజ్ఞానేశ్వరీయంలో చెప్పాడు.

కాకతీయుల కాలంలో స్త్రీలకు జరుపబడిన సంస్కారాలు:

పుంసవనము:

స్త్రీలకు చేసే సంస్కారాలలో పుంసవనము ఒకటి. పుంసవనము అంటే గర్భచిహ్నము తెలిసిన తోడనే పురుషప్రజ పుట్ట వలెనని చేసెడి యొకానొక శుభకర్మము అని సూర్యరాయాంధ్ర నిఘంటువులో అర్థం ఇవ్వబడింది.

సీమంతము:

గర్భం దాల్చిన ఆరవనెలలో స్త్రీకి జరపబడే సంస్కారం సీమంతము. దీనినే సీమంతోన్నయము అని కూడా అంటారు. గర్భవతులకు నాల్గవ, ఆరవ లేక ఎనిమిదవ నెలలలో పాపట తీయు ఉత్సవము అని సూర్యరాయాంధ్ర నిఘంటువు వివరణ. ఇది గర్భ సంరక్షణార్ధం చేయదగిన కర్మ విశేషము. కేతన రచించిన దశకుమార చరిత్రలో రాజ హంసుడనే రాజు తన భార్య వసుమతీ దేవి గర్భం తాల్చగా అందరు రాజులను పిలిచి సీమంతోత్సవం గొప్పగా జరిపించాడు. ప్రతాపరుద్ర చరిత్రలో ముమ్మమ్మ గర్భం దాల్చినపుడు సీమంతాదికాలు వైభవంగా జరిగినట్లు వర్ణించబడింది.

మధ్యయుగంలోని ధర్మశాస్త్రాలు ఉన్నత వర్గంలోని స్త్రీలను కూడా శూద్రులతో సమానంగా వేద విద్యకూ ఇతర విషయాలకూ అనర్హలుగా భావించారు. కాని కేతన విజ్ఞానేశ్వరాన్ని బట్టి కాకతీయుల కాలంలో స్త్రీలు కూడా సంధ్య వార్చినట్లు తెలుస్తుంది.

ఉపనయనం కాని బ్రాహ్మణుడు, స్త్రీలు, శూద్రులు వీరందరూ సంధ్య వార్చేవారని, అయితే వీరు మంత్రాలతో పనిలేకుండా కేవలం నీటిని పెదవికి సోకిస్తే వారు పవిత్రమై పోతారు అని కేతన ఆచారకాండలో చెప్పాడు.

గీ. అను పనీ తద్విజుండును నా డదియును
శూద్రు డును నీళులొక మాటు సోక బెదవి
యంటునప్పుడే శుద్ధాత్ములగుట నిక్క
మనిరి ధర్మజ్ఞులైన మహాత్ములెల్ల.

ఈ విధంగా స్త్రీలనూ శూద్రులనూ సమానంగా చేసి వారిని ఆచారం వైదిక కర్మకాండలకు దూరంగా ఉంచడానికి కారణం వారిపట్ల హీనభావం ఉండటమే కాకపోవచ్చును. సంఘంలో నిర్మాణాత్మకమైన పనిని చేసే అధిక సంఖ్యాకులు వీరే. స్త్రీలు తమకు స్వతస్సిద్ధంగా ఉన్న మాతృత్వభావన వల్ల కుటుంబశ్రేయస్సుకు పిల్లల రక్షణ పెంపకాలకు బాధ్యత ఎంతో జాగ్రత్తగా నిర్వహిస్తారు. శూద్రులు కర్మప్రధానమైన జీవనం గడిపేవారు. వారివల్ల సంఘానికి ఆహార వస్త్రాది మౌలికమైన సమస్యలు తీరతాయి. కనుక ఈ రెండు వర్గాలవారినీ వారి పనులకు దూరంచేస్తే సంఘం కుంటుపడుతుంది. కనుక వీరికి అధికకాలం వ్యయమయే కర్మకాండలు వేదాధ్యయనం వల్ల లభించవలసిన పుణ్యం సులుపుగా పొందే మార్గాన్ని సూచించే ప్రయత్నంలో ధర్మశాస్త్రకారులు స్త్రీలనూ శూద్రులనూ సమంగా చేశారని భావించవచ్చును. కనుక వారికి వేదవిహిత మంత్రోక్త సంస్కారాలను విధించి ఉండరు. కాలక్రమేణా మేధావి వర్గం, పాలక వర్గం ఆదరణ సంపాదించి స్త్రీలనూ శూద్రులనూ హీనంగా చూడటం, తమ బుద్ధి భుజ బలాలతో వారిని అణగ దొక్కడం చేసి ఉంటారు.

వివాహం – ప్రాముఖ్యం

స్త్రీలకు విహితమైన సంస్కారాలలో వివాహం ప్రధానమైనది. అన్ని ఆశ్రమాలలో గృహస్థాశ్రమము మేలైనదనీ, పురుషార్థాలలోని ధర్మార్థ కామములనే వాటిని సాధించాలంటే వివాహం కంటే ఉత్తమమైన మార్గం లేదు అని మన పూర్వులు భావించేవారు. ఈ మార్గంలో స్త్రీ పురుషులు ఒకరికొకరు తోడునీడగా ఉండి పయనించాలి. ఆ విధంగా సాధించిన పురుషార్థ ఫలంలో భార్యాభర్తలిద్దరూ భాగస్వాములు. స్త్రీ సాహచర్యం లేకుండా పురుషుడు తన ధర్మాన్ని నిర్వర్తించలేడు కనుక వివాహం స్త్రీ పురుషులిద్దరికీ ముఖ్యమే.

పురుషుడు జన్మించాక తీర్చుకోవలసిన ఋణాలు మూడు. అవి ఋషి, దేవ పితృరుణాలు అనేవి. బ్రహ్మచర్యం ద్వారా ఋషుల ఋణాన్ని, యజ్ఞయాగాల ద్వారా దేవఋణాన్ని, పుత్రుడు జన్మిస్తే పితృరుణాన్ని పురుషుడు తీర్చుకుంటాడు. ప్రక్కన భార్య లేకపోతే యజ్ఞయాగాదులు చేయటానికి అనర్హునిగా భావిస్తారు. కాబట్టి పైన చెప్పిన ఋణాలు తీర్చుకునేందుకు పురుషుడు తప్పక వివాహమాడి గృహస్థధర్మం నెరవేర్చాలి. కనుక వీటికి సమభాగస్వామిని అయిన స్త్రీకి వివాహం అన్నది ముఖ్యమైన సంస్కారం. భర్తను ఋణవిముక్తుని చేస్తుంది కనుక ప్రాచీనకాలం నుంచి భారతదేశంలో స్త్రీకి అంటే కులసతి లేదా పత్నికి వివాహం, పుత్రసంతానం అన్నవి జీవితధ్యేయాలుగా మారినాయి. ప్రాచీన ధర్మశాస్త్రకారులు పున్నామనరకం అంటే పుత్ అనే నరకం నుంచి పితృదేవతలను తప్పించవలసిన కొడుకును కనవలసిన బాధ్యత స్త్రీపైన, వంశాభివృద్ధి బాధ్యత పురుషుని పైన (ప్రాచీన ధర్మశాస్త్రకారులు) ఉంచారు. కొడుకును కనలేని భార్య బ్రతికి ఉండగానే పుత్రుడి కోసం మరొక పెళ్ళి చేసుకొనే అవకాశం పురుషునికి వారిచ్చారు. అయితే పురుషుడు ఎంతమంది భార్యలను వివాహం చేసుకున్నా కులసతి అంటే పురుషుడి కులానికి చెందిన భార్యకు భర్త చేసే అన్ని యజ్ఞయాగాది ధర్మకార్యాలలో పాలు పంచుకొనే హక్కు ధర్మశాస్త్రకారులు ఇచ్చారు. భార్యాభర్తలిద్దరూ త్రిపురుషార్థాల విషయంలో జీవించినంత కాలం కలిసి సాధించాలి. ఎవరూ దీన్ని అతిక్రమించరాదు. కనుకనే వివాహ సమయంలో వరుడు ‘ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి’ అని ప్రమాణం చేస్తాడు.

పురుషుడు బ్రహ్మచారిగాను, సన్యాసిగాను ఉండేందుకు ధర్మశాస్త్రాలు అడ్డుచెప్పవు కానీ స్త్రీకి మాత్రం వివాహమే తప్పనిసరి ధర్మం. కనుక స్త్రీల గురించి చెప్పాలంటే వారికి జరిగే అతిప్రధాన సంస్కారమైన వివాహం గురించి తప్పక చెప్పాలి.

వివాహం గురించి చెప్పే సమయంలో స్త్రీలను దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతకవలసి ఉన్నది.

  1. వివాహం – పర్యాయ పదాలు, వివాహంలోని వివిధములైన పద్ధతులు
  2. వివాహం చేసుకోబోయే వధూవరులకు ఉండవలసిన అర్హతలు లేదా చూడదగిన లక్షణాలు ఏవి?
  3. వధూవరులకు ఏ వయసులో వివాహం చేయాలి?
  4. వివాహం పెద్దలు నిశ్చయించేవారా? స్వయంవరం అంటే కన్యలు తామే నిశ్చయించుకునేవారా?
  5. బహుభార్యత్వం ఉండేదా?
  6. వివాహ సమయంలో వధూవరుల తల్లిదండ్రులు వరకట్నం, కన్యాశుల్కం, ఉంకువ, అరణం వంటి వాటిని ఇచ్చిపుచ్చుకోవడం ఉండేదా? స్త్రీ ధనం ఉండేదా ?
  7. భార్య భర్తలలో ఋణం తీర్చే బాధ్యత ఎవరిది?

పై ప్రశ్నలకు సమాధానాలు ధర్మశాస్త్రాల నుంచి, కాకతీయుల కాలంనాటి సాహిత్యాన్నించి గ్రహించాలి.

వివాహం – పర్యాయపదాలు – వివిధాంగాలు

స్త్రీలకు చెప్పిన సంస్కారాలలో అతిముఖ్యమైనది, వేదవిహిత మంత్రోక్తమైన సంస్కారమే వివాహం. ఈ పదానికి ఉద్వాహమని, పరిణయం, లేదా పరిణయానము, ఉపయామము, పాణిగ్రహణము అనే వాటిని పర్యాయపదాలుగా వాడడం ఉన్నది. అయితే ఇవన్నీ వివాహమనే ఘట్టంలో అంశాలు అని ఆ పదాలకున్న అర్థాలను బట్టి గ్రహించవచ్చును.

ఉద్వాహము: కన్యను పితృగృహం నుండి బయటకు తీసుకువెళ్ళడం, ఉద్వాహం.

వివాహం: ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ప్రత్యేకమైన ప్రయోజనం కోసం (వంశాభివృద్ధి కోసం) వరుడు కన్యను (భార్యగా చేసుకొనడానికి) తీసుకువెళ్ళడాన్ని వివాహమంటారు.

పరిణయం లేక పరిణయానము: వధూవరులిద్దరూ అగ్నిచుట్టు ప్రదక్షిణం చేయటం, పరిణయం అనిపించుకుంటుంది.

ఉపయామము: ఉపయామము అంటే వరుడు వధువును తనకు సన్నిహితంగా తెచ్చుకొని తన దానినిగా చేసుకోవడం.

పాణిగ్రహణం: కన్య హస్తాన్ని పట్టుకోవడం అంటే వరుడు వధువు చేతిని పట్టుకోవడాన్ని పాణిగ్రహణం అంటారు. ఈ పదాలన్నీ వివాహంలో జరిగే అంశాలను సూచిస్తాయి. పైన చెప్పిన కార్యాలన్నీ జరిగితేనే వివాహమన్నది పరిపూర్ణమౌతుంది.

వివాహం – వివిధ పద్ధతులు:

వివాహం ఎనిమిది పద్ధతులలో జరుగుతుందని ధర్మశాస్త్రాలలో చెప్పారు. కేతన తన విజ్ఞానేశ్వరంలో ఆ ఎనిమిది పద్ధతులకూ నిర్వచనం ఇచ్చాడు. కాకతీయుల కాలంలో ఏ ఏ పద్ధతులలో వివాహాలు అయేవో పరిశీలించవచ్చును.

1. బ్రాహ్మము:

తగిన వరుని పిలిచి కన్యకను తగిన అలంకారంతో ధారాపూర్వకంగా పెండ్లి చేయటాన్ని బ్రాహ్మము అంటారు. బహుశా దీనినే కన్యాదానం అంటారు. ఇందులో కన్యాశుల్కం గానీ, వరకట్నంగానీ ఇచ్చి పుచ్చుకోవడం కానీ ఉండదు. సాధారణంగా శ్రోత్రియులైన బ్రాహ్మణుల ఇళ్ళలో జరిగేది ఈ పద్ధతే.

భాస్కర రామాయణంలో జనకుడు సీతను రామునికభిముఖంగా తన ముందర కూర్చోబెట్టుకొని ‘రామా! యిక్కన్య మహాగుణశోభిత, నీకుంబర తంత్ర’యని చెప్పి, సువర్ణయుక్తంబుగా ధారవోసి పాణి గ్రహణంబు సేయించి యిచ్చాడు. ఈ పద్ధతిని బ్రాహ్మమని చెప్పవచ్చును. ఇందులో కట్నకానుకలు గానీ, అరణం, ఉంకువలుగానీ ప్రసక్తమవలేదు.

2. దైవవివాహం:

క్రతువునకు ఋత్విజుడై, మంత్రవిధులు సలిపిన వానికి తన కుమార్తె నిచ్చి చేసిన వివాహాన్ని దైవవివాహం అంటారు.

3. ఆర్షము:

గుణవంతుడైవరైనా కన్య తండ్రికి రెండు గోవులను ఉంకువగా ఇచ్చి కన్యను పెండ్లాడితే ఆర్షవివాహం అనిపించుకుంటుంది.

4. ప్రాజాపత్యం:

ధనం తీసుకోకుండా కన్యను అర్థించి వచ్చిన వరునికి ఆమెనిచ్చి పెళ్ళిచేస్తే అది ప్రాజాపత్యం అనబడుతుంది.

5. ఆసురం:

అడిగిన వరుని నుండి ధనం తీసుకొని కన్యనిచ్చి చేస్తే అది ఆసురం అవుతుంది. ఈ ధనాన్ని కన్యాశుల్కం అని అనవచ్చును. పలనాటి వీరచరిత్రలో ఐతాంబ సోదరుడు మాంచాలను బాలచంద్రునికిచ్చి వివాహం చేయటానికి ఓలిమాడలు ఇచ్చి తీరాలని అడిగి ఆ ధనం తీసుకున్న తర్వాతనే తన కన్యను ఇవ్వడానికి ఒప్పుకొన్నాడు. కనుక మాంచాల, బాలచంద్రుల వివాహం ఆసురం అని చెప్పవచ్చును.

6. గాంధర్వం:

వధువు వరుడు తమలోతాము ఒడబడి చేసుకొని తల్లిదండ్రులకు తెలియకుండా వివాహం చేసుకొంటే దాన్ని గాంధర్వమంటారు. పలనాటి వీరచరిత్రలో నందిసోముని కూతురు నాగలాదేవి ఆమె మేనత్త కొడుకు శివశింగు ఒకరినొకరు ప్రేమించుకొని పెద్దలు ఇష్టపడకపోవడంతో వారికి తెలియకుండా వేరొకచోటికి పోయి వివాహం చేసుకున్నారు. పై నిర్వచనాన్ని బట్టి వీరిద్దరి వివాహం గాంధర్వమని చెప్పవచ్చును.

7. రాక్షసం:

వరుడు ప్రేమతో, స్నేహంతో కన్యనడగక, ధనమివ్వక, యుద్ధంచేసి గెలిచి కన్యను వివాహం చేసుకొంటే అది రాక్షసవివాహం అనిపించుకుంటుంది. కాకతీయరుద్రుడు పానుగంటిపై దండెత్తి చోడోదయుని ఓడించి, అతని కుమార్తె పద్మావతిని వివాహమాడాడు. కాకతీయుల కాలంలో రాజకీయ కారణాల వల్ల ఈ పద్ధతి వివాహాలు ఎక్కువగా రాజకుటుంబాల్లో జరుగుతూ ఉండేవి.

8. పైశాచము:

కన్యకు సంబంధించిన పెద్దవారికి తెలియకుండా ఉపాయశూన్యుడై (తొందరపాటుతో) అమెకు తాళిగట్టి పెళ్ళి చేసుకొంటే అది పైశాచము అనిపించుకుంటుంది.

పైన చెప్పిన వివాహ పద్ధతులలో బ్రాహ్మం, ఆర్షం, ప్రాజాపత్యమన్నవి బహుశా బ్రాహ్మణ కుటుంబాలలో ఉండేవి. సాహిత్యంలో ఎక్కడా బ్రాహ్మణులు కన్యలను వివాహమాడే సమయంలో ధనాన్ని ఇవ్వడంగానీ, శుల్కాన్ని చెల్లించడం గానీ చేసినట్లు కనిపించదు. పైగా ఆ కాలం నాటివారు (ధనవంతులు) చేసే ధర్మకార్యాలలో కన్యాదానం చేయడం, పేద విప్రులకు వడుగులు, పెళ్ళిళ్ళు చేయడం వంటివి ఉన్నాయని సాహిత్యంలోని ఆధారాలను బట్టి చెప్పవచ్చు.

దశ విధ మహాదానాలలో కన్యాదానం ఒకటి.

‘కనకాశ్చ తిలానాగా దాసీ రథమహీగృహాః
కన్యా చ కపిలా ధేను ర్మహా దానాని వైదశ’

ఈ కన్యాదానం గురించి ఒక శాసనంలో కూడా ప్రసక్తమైనది.

‘ఆదిం జెప్పంగ బడ్డ ధమ్మువులు ధర్మరంభుణే చేసె విద్యా
దానంబు హిరణ్యదానమును భూదానంబు గోదాన కన్యాదానంబూ
లు నాంగ్గంబూని మహిలోనను పుట్టపుంబట్ట నుత్పాదించ్చెన్మఱి’

ఆ రోజుల్లో బ్రాహ్మణులు అందరూ డబ్బు ఉన్నవారు కాదు. రాజుల ప్రాపకం సంపాదించినవారు, రాజోద్యోగులు తప్ప తక్కినవారిలో ఎక్కువ మంది ప్రజల దానధర్మాల మీద ఆధారపడేవారు. చాలామందికి పెళ్ళిళ్ళు చేసుకొనేందుకు ధనం కూడా ఉండదు. కనుక ఉంకువ ఇచ్చి పెళ్ళి చేసుకోలేని వారికి పెళ్ళిళ్ళు చేయడం కూడా ఒక ధర్మకార్యంగా భావించేవారని పైన చెప్పిన ధర్మశాస్త్ర శ్లోకాలను బట్టి, శాసనభాగాన్ని బట్టి చెప్పవచ్చు.

పలనాటి వీరచరిత్రలో బాలచంద్రుని తల్లి ఐతాంబ తాను కొడుకు కలగడానికి ఏమేమి ధర్మకార్యాలు, నోములు, పూజలు చేసిందో చెప్పే సందర్భంలో పేదవిప్రులకు పెండ్లిండ్లు చేశానని కూడా చెప్పింది. అంటే ఆనాటి విప్రులు వివాహం కూడా చేసుకోలేనంత బీదగా ఉండేవారు.

మాంచాల తండ్రి కులంలో ఓలిమాడలు తీసుకునే ఆచారం ఉన్నది కనుక కొందరు ఆ కులానికి చెందినవారు ఆసురమనే పద్ధతిలో వివాహం చేసుకొనేవారు. రాజకీయ వివాహాలు ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేవని నాటి చరిత్ర వల్ల మనకు తెలుస్తున్నది. యుద్ధంలో గెలిచిన రాజు ఓడిపోయిన రాజు కుమార్తెను ఆమెకు ఇష్టం లేకపోయినా వివాహమాడడం ఎక్కువగా జరిగేది. కనుక రాజ, సామంత కుటుంబాలలో రాక్షస పద్ధతిలో వివాహం అయేది అని చెప్పవచ్చు. గాంధర్వ పద్ధతి కూడా రాజకుటుంబాలలో సకృత్తుగా జరుగుతూ ఉండవచ్చును. సాహిత్యంలో వీనిని సమర్థించే ఆధారాలు తక్కువ.

రాజకీయ వివాహాలు:

సామ్రాజ్యాలు పెంపొందించడానికి, సామంతుల మధ్య, రాజుల మధ్య వైవాహిక సంబంధాలు జరిగేవి. ముఖ్యంగా కాకతీయుల సామ్రాజ్యం స్థిరంగా ఉండటానికి, విస్తరింపజేసుకొనడానికి సామంతులతో వియ్యమందడం, ఇరుగు పొరుగు రాజులతో వివాహ సంబంధాలు పెంపొందించుకోవడం ప్రధాన కారణాలని చెప్పవచ్చును. ఇంతకు ముందు మొదటి ప్రకరణంలో చెప్పినట్లు కాకతీయులు బలవంతులైన తోటి సామంతులు విరియాలవారితో, నతవాడి వంశంవారితో, వివాహ సంబంధము పెట్టుకోవడం వల్ల కాకతీయ సామ్రాజ్య స్థాపనకు అవకాశం కలిగింది.

కాకర్త్య గుండన సోదరి విర్యాల ఎఱ్ఱనకు భార్య అయింది. గుండన కొడుకు గరుడబేతను ఆ బాంధవ్యం వల్లనే విరియాల కామసాని, ఎఱ్ఱన కొరవిలో రాజుగా ప్రతిష్ఠించడానికి సహాయం చెయ్యగలిగాడు. ప్రోలుడు నతవాడి దుర్గభూపతి చెల్లెలు ముప్పమాంబను వివాహమాడడం వల్ల నతవాడి సామంతులు కాకతిప్రోలుని రాజ్యస్థాపనకు చేదోడువాదోడుగా ఉన్నారు. కాకతి మహాదేవుని కుమార్తెలు కుందమాంబ, మేలమాంబలు నతవాటి బుద్ధరాజు కొడుకులు రుద్రభూపతి, ఎక్కడి మల్లరుద్రులనే వారిని వివాహమాడడం వల్ల నతవాటి వంశంనుంచి కాకతీయులకు రాజకీయంగా మద్ధతు లభించింది. కాకతి గణపతిదేవుడి రాజనీతిని తన సామ్రాజ్య విస్తరణకు చాలా బాగా ఉపయోగించాడు. తన కుమార్తె రుద్రమను నిడుదవోలు చాళుక్యుల వంశానికి చెందిన వీరభద్రునికిచ్చి వివాహం చేశాడు. ఇంకొక కుమార్తె గణపాంబను కోటవంశానికి చెందిన బేతరాజుకిచ్చి వివాహం చేశాడు. రుద్రమ కూతురు ముమ్మడమ్మను కాకతి వంశానికి చెందిన మహాదేవుని కిచ్చి వివాహం జరిపించాడు. తాను యాదవరాజు జైతుగి కుమార్తె రుద్రమను వివాహమాడాడు. అయ్యవంశానికి చెందిన పినచోడి కుమార్తెలు నారమ, పేరమలను వివాహం చేసుకున్నాడు. కాకతీయ సామంతులు, పొరుగు రాజులు కూడా ఇదేవిధంగా పరస్పర వివాహ బాంధవ్యాల వల్ల కలసికట్టుగా ఉండి సామ్రాజ్యం స్థిరంగా ఉండడానికి తోడ్పడ్డారు. మల్యాల వంశంవారు విర్యాలవంశం వారు వియ్యమందినవారు. మల్యాల చౌండసేనాపతి విర్యాల అన్నయ కుమార్తె మైలమను వివాహమాడాడు. మల్యాలగుండయ దండాధినాధుడు గోన బుద్ధారెడ్డి కుమార్తె కుప్పాంబికను వివాహమాడాడు. కాకతి రుద్రునికి పూర్వం కోట వంశంవారు వెలనాటి చోడవంశంతో మొదట బంధుత్వం కలుపుకున్నా, తరువాత గణపతి దేవుని కుమార్తె గణపాంబను కోట బేతరాజు వివాహం చేసుకొన్న తరువాత, కోట మన్మకేతరాజు నతవాటి రుద్ర, కాకతి మైలమల కూతురు బయ్యలదేవిని వివాహమాడాడు. మహాసామంత చెఱకు మన్న బొల్లయరెడ్డి మహాసామంత వావిలాల రుద్రయరెడ్డి సోదరి రుద్రసానిని పెళ్ళాడాడు. ఈ విధంగా కాకతీయ సామంతులు కాకతీయ రాజవంశంతోనూ, తమలోతాము వివాహం ద్వారా బంధువులై కాకతీయులకు ఏకచ్ఛత్రాధిపత్యాన్ని సాధించారు. తద్వారా రాజ్యం సుస్థిరంగా సుభిక్షంగా ఉండడానికి తోడ్పడ్డారు.

మేనరికాలు: రక్తసంబంధీకులైన సోదరి, సోదరుల పిల్లల మధ్య జరిగే వివాహాన్ని మేనరికం అంటారు. పురుషుడు తన మేనమామ కూతుర్ని చేసుకొంటే మేనరికమనీ, మేనత్త కూతుర్ని చేసుకొంటే ఎదురు మేనరికమనీ వ్యవహారంలో ఉన్నది. ఆనాడు వారు ఈ రెండు రకాల మేనరికాలు చేసుకొనేవారని; ఉత్తరాదివారిలో సంప్రదాయం లేకపోయినా, దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగుదేశంలో ఇది ఎక్కువ ఉండేదని ఆనాటి సాహిత్యాన్ని బట్టి తెలుస్తుంది. కేతన విజ్ఞానేశ్వరంలో ఆచారాల గురించి వివరిస్తూ

‘మేనమామ కూతు మేనత్త కూతును
ద్వాహమగుట చెల్లు దక్షిణమున’

అని ఆచారకాండలో చెప్పాడు. దీనినిబట్టి ఉత్తరాదిలో ఈ సంప్రదాయం లేదనీ, దక్షిణాదిన ఉన్నదనీ తెలుస్తుంది.

కాకతీయుల కాలంలో మేనరికాలు ఎక్కువగానే జరిగేవి. ఆనాడు బాల్యవివాహాలు ఎక్కువ జరగడానికి బహుశా ఈ మేనరికాలు కూడా కారణం కావచ్చు. పిల్లలు పసివయసులో ఉండగానే వారి తల్లిదండ్రులు తమ సహోదరుల పిల్లలతో వివాహం చేసి తమ అనుబంధాన్ని ఇంకా గాఢంగా చేసుకొనేవారు.

పలనాటి వీరచరిత్ర కావ్యాన్ని బట్టి బాలచంద్రుని తల్లి ఐతాంబ, మాంచాల తండ్రి అక్కాతమ్ముళ్ళు కనుక మాంచాల బాలచంద్రుల వివాహం మేనరికమని తెలుస్తుంది. తెలుగు కవులు కూడా మేనరికం పట్ల అభిమానం చూపినట్లు కనిపిస్తుంది. రాజశేఖరుని సంస్కృతనాటకం విద్ధసాలభంజికను తెలుగులో కేయూరబాహు చరిత్ర అనే కావ్యంగా మలచిన మంచెన తెనిగించటంలో చేసిన మార్పులలో ఒకటి కథానాయకుడైన మహారాజుకు పెండ్లి చేయించబోయే కన్యక రాణికి మేనమామ కుమార్తె కాక పినతల్లి కూతురు కావడం.

సాధారణంగా మేనరికాలను ఆనాటివారు అంగీకరించినా, అక్కడక్కడా పెద్దలు అంగీకరించని మేనరికాలు కూడా జరిగేవి. పలనాటి వీరచరిత్రలో నందిసోముని కూతురు నాగులాదేవి మేనత్త కొడుకు శివసింగును ఇష్టపడింది గానీ ఆమె తండ్రి వారి వివాహానికి అంగీకరించలేదు.

వధూవరులకు ఉండవలసిన అర్హతలు, లక్షణాలు:

మన ధర్మశాస్త్రాలు వధూవరులకు ఉండవలసిన లక్షణాలు అర్హతల గురించి నిబంధనలు కొన్ని ఏర్పరచాయి.

వరుడు కన్యకు సాటికులం వాడుగానీ అధికుడు గానీ అయివుండాలి. గుణవంతుడై దోషాలేవీ లేనివాడై ఉండాలి.

వధువు కూడా సాటికులానికి చెంది గోత్రం వేరుగా ఉండాలి. శుభలక్షణాలు కలిగి ఉండాలి. ఇష్టపడి చేసుకోవాలి.

‘కులమొక్కటియై గోత్రము
కలయక శుభలక్షణములు గలిగి ప్రియంబు
గలకన్నియలను విప్రులు
వలయు సమంత్రకముగా వివాహంబాడన్’

మంచన రచించిన కేయూరబాహు చరిత్రలో ఒక లక్షణజ్ఞుడైన విప్రుడు సంగతలక్షణాంగి అయిన కన్యను పెళ్ళాడాడని ఉన్నది. కన్యకు ఉండవలసిన లక్షణాలన్నీ నన్నెచోడుడు పార్వతి వర్ణన సందర్భంలో కుమారసంభవంలో ప్రస్తావించాడు.

‘గౌరి నమ్ముని వరులుగని తదుత్తమ స్త్రీ లక్షణ లక్షితంబగు సర్వాంగోపాంగ ప్రత్యేక సముదాయ శోభలుపలక్షించి చూచి’

గౌరి శివునికి అగ్రమహిషి కాదగనది అని సప్తర్షులు నిశ్చయించారు.

వధువు లక్షణాలు బాహ్యము, అభ్యంతరము అని రెండు విధాలు. బాహ్యలక్షణాలు అంటే ఆమె ఆరోగ్యంగా, సౌందర్యవతియై ఉండి సమవిభక్తములైన అంగసౌష్ఠవం కలిగి ఉండాలి. రోమవిహీనకారాదు. అభ్యంతర లక్షణాలలో తెలివి, చుఱుకుదనం, ఋజువర్తనం కలిగి ఉండాలి.

కులాలకు రాజు, గోత్రాలకు పతి, దేవతలకు దేవత, సంపదలకు అధీశుడు, దానానికి అధికారి, త్రిమూర్తులకు ఆదిమూర్తి సమస్తలోకాలకు ఈశ్వరుడు అయిన శివునికి వధువును కోరి హిమవంతుని వద్ద సప్తర్షులు వివాహ ప్రస్తావన చేశారు. హిమవంతుడు వరుని గుణాలు పై విధంగా ఎంచి ప్రశంసించి వివాహ ప్రస్తావనను అంగీకరించాడు.

పై సందర్భాన్ని బట్టి వధూవరుల పెద్దలే వివాహం గురించి, వధూవరుల లక్షణాల గురించి చర్చించి వివాహాలు నిశ్చయించేవారని తెలుస్తున్నది.

మారన రచించిన మార్కండేయ పురాణ కృతిభర్త గన్నయ సేనాని తండ్రి నాగయ అతుల శుభలక్షణ స్ఫురితామలాంగి కాకతి గణపతిదేవుని తలవరి మేచయనాయకుని కూతురు అయిన మల్లమాంబికను కులశీల రూప గుణాలు కలిగిన కన్య అని అన్వయస్థితి కోసం పెళ్ళాడాడు. అంటే ఎంతమంది రూపవతులైన స్త్రీలను వివాహం చేసుకొన్నప్పటికీ, తమ వంశం నిలపడానికి కుల, శీల, రూప, గుణాలు కలిగిన స్త్రీని చేసుకోవాలి అన్నది నియమంగా భావించేవారు. అటువంటి స్త్రీయే ధర్మపత్ని, కులసతి, పట్టమహిషి అన్న అర్హత సంపాదిస్తుంది.

కాకతి రుద్రమదేవి మంత్రి బ్రాహ్మణుడైన ఇందులూరి అన్నయామాత్యుడు రుద్రమదేవి కుమార్తె రుయ్యమను వివాహమాడినా తన కులానికి చెందిన అద్రిజ, లకుమాంబ అనే కులభామినులను కూడా పెళ్ళిచేసుకున్నాడు. దీన్నిబట్టి కులానికి ప్రాధాన్యత ఇచ్చేవారని చెప్పవచ్చును.

వధువు తెలివిగలిగి ఉండాలని, సమయస్ఫూర్తి ఉండాలని కొన్ని కులాలవారు ముఖ్యంగా వైశ్యులు కోరుకొనేవారు. ఈ విషయం మంచన కేయూరబాహు చరిత్రలోని వైశ్యబాలిక ఉదంతాన్ని బట్టి గ్రహించవచ్చును. కాంచనగుప్తుడనే పెద్ద వర్తకుడు తన కుమారునికి తగిన కన్యను వెదకమని మనుషులను పంపాడు. వాళ్ళు వైశ్యకులంలోని బాలికలను చూస్తుండగా వారికి ఒక వైశ్యబాలిక తటస్థపడింది. ఒకడు మూటెడు బియ్యం తెచ్చి దానికి సమానంగా నూనె ఇవ్వమని అడిగితే అందరూ అతన్ని చూసి నవ్వారు. ఒక వైశ్యబాలిక మాత్రం లోపలికి వచ్చి బియ్యానికి సరియైన తైలమిస్తానని పిలిచి బియ్యం నాణ్యమైనవని గ్రహించింది. బియ్యాన్ని కొలిచిన పాత్రతోనే నూనెను కొలిచి ఇవ్వడానికి అతడినొప్పించి పళ్ళెం నిండా కుప్పగా బియ్యంపోసి తాను తీసుకొని, ఆ పళ్ళెంలో అంచుదాకా నూనెపోసి అతనికిచ్చింది. దీన్ని గమనించిన కాంచనగుప్తుని మనుషులు ఆ బాలిక గురించి చెప్పగా అతడు ఆ బాలిక బుద్ధివిశేషాన్ని మెచ్చుకొని ఆమెను తన కోడలుగా చేసుకొన్నాడు.

తక్కిన కులాలవారు కూడా తమ కులవృత్తులకు సంబంధించిన నైపుణ్యం ఉన్న వధూవరులనే ఎంపిక చేసేవారు. అంటే వధూవరుల తల్లిదండ్రులు, పెద్దవారే వారి అర్హతలను పరీక్షించి నిశ్చయం చేసేవారు. ఈనాటికీ భారతదేశంలో తొంభై తొమ్మిది శాతం ఈ విధమైన పెళ్ళిళ్ళే జరుగుతుంటాయి.

వరుడివికానీ, కన్యవికానీ లక్షణాలను ఇరువైపుల పెద్దలు పరీక్షించేవారు. ఉన్న దోషాలను కప్పిపుచ్చి కన్యనివ్వడం దోషం. దానికి దండుగ విధిస్తారు. లేని దోషాలను కన్యకు అంటగట్టడం అంతకంటే పెద్ద తప్పు. అటువంటి వాడికి నూరు మడుగులు దోషాన్ని బట్టి రాజులు దండన (జరిమానా) విధించాలి అని కేతన నిర్దేశించాడు.

వివాహానికి తగిన వయసు:

వధూవరులకు ఏ వయసులో వివాహం జరగాలి?

ప్రాచీనకాలంలో స్త్రీలు యుక్తవయస్కలైనాక వివాహాలయ్యేవి. బాల్యవివాహాలు జరిగేవి కావు. తల్లిదండ్రులు ఏర్పాటు చేసిన వరుని వివాహమాడే సంప్రదాయం ఉన్నప్పటికీ గాంధర్వ వివాహాలు కూడా అనుసరించేవారు. కానీ మధ్యయుగంలో ఎక్కువగా బాల్యవివాహాలే జరిగేవి. పురుషుడి వయసు గురించి పట్టింపు లేదు గానీ వధువు మాత్రం రజస్వల అయివుండకూడదు అని గౌతముడు ఆదేశించాడు. పురుషుడు జీవితాంతం బ్రహ్మచారిగా ఉండవచ్చుగానీ, స్త్రీలకు వివాహం తప్పనిసరి. పురుషుడు తన విద్య లేదా వేదాధ్యయనం ముగించుకుని, బ్రహ్మచర్యాశ్రమం వదిలి గృహస్థాశ్రమం స్వీకరిస్తాడు. అప్పుడు అతని వయసు అతను పూర్తిచేయగలిగిన వేదాల సంఖ్యను బట్టి ఉంటుంది. అంటే వేదానికి 12 ఏళ్ళు చొప్పున 12, 24, 36, 48 ఏళ్ళ వయసు ఉండవచ్చు?

కాకతీయుల కాలంలో కూడా ఎక్కువగా బాల్యవివాహాలు జరిగేవి. పలనాటి వీరచరిత్రలో మాంచాల మాటలను బట్టి ఈ విషయం తెలుస్తుంది.

“బ్రహ్మకూర్చెను మమ్ము బాలురమపుడు”

ముఖ్యంగా బ్రాహ్మణులలో స్త్రీలకి చాలా చిన్నప్పుడే వివాహాలు జరిగేవి. ఆడపిల్లలకి 8 నుంచి 10 ఏళ్ళ వయసులోనే పెళ్ళి చేయాలన్నది దాదాపు క్రీ. శ. 6, 7 శతాబ్దాల నుండి ఇరవైయవ శతాబ్దం మధ్యదాకా జరుగుతూనే వచ్చింది.

కేతన విజ్ఞానేశ్వరంలో

‘కన్నియ దగు వరునకు నీ
కున్నను నది యెన్నిముట్టులొనరగ నగు దా
నన్నింట భ్రూణహత్యలు
పన్నుగ బ్రాపించు నంత పాపము వచ్చున్’

అని చెప్పినదాన్ని బట్టి ఏదో విధంగా ఆడపిల్లలను రజస్వలలు కాకముందే పెళ్ళి చేసేవారని గ్రహించవచ్చు. బ్రాహ్మణకన్యలు చిన్నవారే కానీ వారి భర్తలు పెద్దవారు కావచ్చు. కొంతమంది వయసు మళ్ళినవారు కూడా చిన్నపిల్లలను చేసుకొనేవారు. మంచెన కేయూరబాహు చరిత్రలో వింతపతివ్రత కథలో ‘ప్రాయమున బెద్ద వాడొక బ్రాహ్మణుండు’ ఒక కన్యను పెండ్లి చేసుకొని ఆమెను పరపురుషులకు దూరంగా ఉంచేందుకు నేలమాళిగలో ఉంచి ఋతుకాలం సమీపించిన తరువాత ఆమెను కలవటానికి వచ్చాడన్న ఉదంతాన్ని బట్టి వృద్ధులైనవారు రజస్వలలు కాని కన్యలను వివాహమాడేవారని చెప్పవచ్చు. ముఖ్యంగా బ్రాహ్మణులలో ఈ సంప్రదాయం ఉండేదేమో. బీద బ్రాహ్మణులు తమ కన్యలను ధనం లేకపోవడం వల్లనో, వరుడు ఇచ్చే ఉంకువ కోసమో, వృద్ధులైన వారికిచ్చి వివాహం చేసేవారేమో. కనుకనే క్రీడాభిరామంలో శ్రీకాకుళేశ్వరుని తిరనాళ్ళలో విప్రవిధవలు, అక్కలవాడలోని విధవల ప్రసక్తిని బట్టి వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు గ్రహించవచ్చును. నాటినుంచి గురజాడ వారి కన్యాశుల్కం రచనాకాలం నాటివరకు బాల్యవివాహాలు జరుగుతూనే వచ్చాయి. బాల వితంతువుల సమస్య రాజారామమోహనరాయ్ ప్రోద్బలంతో విలియం బెంటిక్ ప్రభువు చేసిన చట్టం వల్ల తగ్గిందని చెప్పాలి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here