కల చెదిరింది…

0
9

[dropcap]తె[/dropcap]లతెలవారుతుండగా సూర్యుడి కిరణాలు కిటికీ అద్దంలో దూరి, మంచం పైన పడుకున్న బ్రెక్ట్ మొహం పైన  పడటంతో  మేలుకున్నవాడు,  అక్టోబర్ మూడవ వారపు లేత చలికి ఉల్లన్ దుప్పటిలోని వెచ్చదనాన్ని అనుసంధానించి, ఒక సారి ఒళ్ళు విరుచుకుని కళ్ళు తెరిచాడు. మాసిపోయిన మొబైల్ స్క్రీన్ పైనున్న టైమ్ చూశాడు. ఏడున్నరయింది. ఆదివారం కాబట్టి హాస్టల్ స్తబ్ధంగా ఉంది. తన రూంమేట్ నరసింహమూర్తి, మిగతా దగ్గరి ఊళ్ళ విద్యార్థులంతా నిన్ననే తమ తమ ఊళ్ళకు తరలి వెళ్ళిపోయారు. కానీ బ్రెక్ట్ ఊరు బెంగళూరు నుండి నూట యాభై కిలోమీటర్లున్నందువల్ల అతడు వారం వారం ఊరికెళ్ళకుండా నెలకోసారి లేదా పండగలకు మాత్రమే ఊరెళ్తాడు. సెలవు రోజుల్లో లైబ్రరీలో సమయం గడుపుతాడు. తన తరగతిలో తనే ఫస్ట్ రావాలనే కాంక్షతో ఆ ప్రయత్నంలోనే ఎల్లప్పుడూ గడుపుతాడు. కానీ క్రితం రెండు సెమిస్టర్లలోనూ బెంగళూరు బాలికలదే పైచేయి అయింది. బ్రెక్ట్‌కు కథలు, కవితలు రాసే అలవాటు. అతడి రచనలు కొన్ని చిన్నచిన్న పత్రికలలో ప్రచురణ పొంది, క్యాంపస్‌లో అప్పుడే యువసాహితిగా పేరు తెచ్చుకున్నాడు. అతడు కథలు కవితలు రాస్తోంది తన రంగు, జాతి న్యూనతా భావాన్ని అధిగమించడానికి అని అతడికి తెలియకుండానే అతడి మెదడులో అంతర్గతమయింది. ఫోన్ రింగవుతుండగా లేచి కూర్చుని “హలో” అన్నాడు. “కంగ్రాట్స్ మిస్టర్ బ్రెక్ట్” మధురమైన ఆడ గొంతు. బ్రెక్ట్ ఉక్కిరిబిక్కిరయ్యాడు. “ఎవరు మేడమ్? ఎందుకు మేడమ్?” అన్నాడు తడబడినట్టుగా. “నేను మీ క్లాస్‌మేట్ అనూహ్య. నిన్న సాయంత్రం దీపావళి ప్రత్యేక సంచిక విద్యార్థి విభాగంలో పురస్కారం పొందిన మీ కథ చదివాను. చాలా బాగుంది. మా అధ్యయన కేంద్రానికి నిజంగా మీరొక గిఫ్ట్ ఉన్నట్టు. పదివేలు బహుమతి వచ్చింది. పార్టీ ఇవ్వాలి. మీ ఫ్రెండ్ సిద్ధార్థ్ వద్ద మీ నంబర్ తీసుకుని చేస్తున్నాను” అనింది. బ్రెక్ట్‌కు ఏం మాట్లాడాలో తోచక “థ్యాంక్యూ మేడమ్. ఓకె మేడమ్” అన్నాడు. “బ్రెక్ట్ గారు! క్లాస్‌మేట్‌ను పట్టుకుని మేడమ్ మేడమ్ అంటారేమిటి! నాకు అనూహ్య అని ఒక పేరుంది. అలానే పిలవండి” అంటూ అతడు మళ్ళీ మాట్లాడేంతలో ఫోన్ పెట్టేసింది. బ్రెక్ట్‌కి తన చెవులను తనే నమ్మబుద్ది కాలేదు. నాలుగు నెలల క్రింద పేరుగాంచిన పత్రిక దీపావళి ప్రత్యేక సంచిక కోసం ఆహ్వానించిన కథల పోటీలోని విద్యార్థి విభాగానికి కథను పంపి, ఆ విషయాన్నే మరచిపోయాడు తను. దాని ఫలితం అనూహ్య గొంతు ద్వారా తన చెవిన పడి బ్రెక్ట్ రోమాంచితుడయ్యాడు. హాస్టల్ బయట దట్టంగా పెరిగిన చెట్లలోని కోకిలలు ప్రసారం చేస్తున్న కుహూ కుహూ గానాన్ని చెవుల్లో నింపుకుని బ్రెక్ట్ శరీరం సంబరంతో వణికింది. అనూహ్య! తన క్లాస్మేట్. అధ్యయన కేంద్రంలోనే కాక క్యాంపస్ లోనే అత్యంత సుందరి అనిపించుకున్న అమ్మాయి. తన క్లాసు అబ్బాయిలందరూ ఆమె వైపు చూసినా ఆమె మాత్రం ఎవరితోనూ కన్ను కలిపి మాట్లాడింది లేదు. బ్రెక్ట్ కూడా దొంగతనంగా ఎన్నోసార్లు ఆమె సౌందర్యాన్ని కళ్ళల్లో నింపుకున్నాడు. ఆమె ఎవరినీ పట్టించుకునేది కాదు. జానపద నిపుణుడు, యువ ప్రాధ్యాపకుడైన చెలువే గౌడగారు తన స్నేహాన్ని కాంక్షించి ఆమెతో మంగళ హారతి పాడించుకున్నది అధ్యయన కేంద్రం గోడలన్నీ గుసగుసలాడి అలిసి పోయాయి. అందరిలా బస్సుల్లో రాకుండా రోజూ ఎరుపు మారుతు 800 కార్లో తానే డ్రైవ్ చేసుకుని వస్తుంది. క్యాంటీన్, లైబ్రరీవైపు ఎప్పుడూ వచ్చేది కాదు. అలాంటి అనూహ్య ఈ రోజు ఫోన్ చేసి అభినందనలు తెలిపింది. బ్రెక్ట్ మొహం కడుక్కుని, తయారయి అడ్మిన్ బిల్డింగ్ వైపు నడిచాడు. గాంధిభవన్ రోడ్డులో ఉన్న క్యాంటీన్‌లో ఒక తట్ట ఇడ్లీ (బెంగళూర్లో ఫేమస్ ఫలహారం) తిని కాఫి త్రాగుతూ దినపత్రికను చూడసాగాడు. రాజకీయ అస్థిరత, వరదల వార్తలతో పాటు మూడో పుటలో కథల పోటీల ఫలితాలు కనిపించాయి. బహుమతి గెలుచుకున్నవారి పేర్లతో పాటు వారి ఫోటోలు కూడా వేశారు. అతడి ఫోటో కూడా కనిపించింది. కానీ ఫోటో అంత స్పష్టంగా లేదు. కథను పంపేటప్పుడు ఏదో ఔపచారికంగా ఎప్పుడో తీయించుకున్న ఫోటోనే పంపాడు తను. అయినా బ్రెక్ట్ మనసు సంబర పడింది. బస్సులో సిటికో లేదా కెంగేరికో వెళ్ళి పత్రిక ప్రత్యేక సంచిక కొనాలని అనుకుని హాస్టల్ వైపు నడిచాడు. క్లాస్‌మేట్ సిద్ధార్థ్ ఎదురయ్యాడు. “కంగ్రాట్స్ బ్రదర్. మంచి వార్త విన్నాను. అనూహ్య పొద్దున్నే ఫోన్ చేసి నీ నంబర్ అడిగింది. కథలు, కవితలు అంటే తనకు ప్రాణం. ఫోన్ చేసిందా? మొత్తానికి తన కళ్ళు నీ మీద పడ్డాయన్నమాట. యు ఆర్ లక్కీ” అంటూ చెయ్యి కలిపి ముందుకు సాగాడు. “థ్యాంక్యూ బ్రదర్” అంటూ బ్రెక్ట్ కూడా హాస్టెల్ వైపు నడిచాడు. అతడి నడకలో చెప్పలేని ఉత్సాహం, తేజస్సు తొణికిసలాడుతూ కనిపించాయి.

సహృదయ చదువరులారా, బ్రెక్ట్ కథను కొనసాగించడానికి ముందుగా అతడి పూర్వాశ్రమం గురించి కథా రూపంలో మీకు పరిచయం గావించక పోతే, మీలో కొంత తికమక చోటు చేసుకోవచ్చునని కథా రచయితనైన నాకు అనుమానం. కథలెప్పుడూ సరళంగానూ, సులలితంగా చదివించుకుని వెళ్ళాలి అని నమ్మేవాణ్ణి నేను. బెంగళూరునుండి సుమారు వందా యాభై కిలోమీటర్ల దూరంగా ఉన్న ద్వారనకుంటె గ్రామవాసి చిక్క మారయ్య కొడుకు భరమణ్ణే బ్రెక్ట్! చిక్కమారయ్య మొత్తం దళితుల వాడలోకెల్లా కొంచెం బుద్ధిమంతుడు. చుట్టుపట్ల జరిగే సంత, జాత్రలలో పశువులను ఇప్పించే లేదా అమ్మి పెట్టే మధ్యవర్తిగా ఉండేవాడు. వారానికి రెండు సంతలలో మధ్యవర్తి పనులు చేసి వెయ్యి రుపాయలైనా సంపాదించేవాడు. దాంతోపాటు ఎప్పుడూ పాలిచ్చే ఒక బర్రెను ఇంట్లో కట్టుంచేవాడు. అలా ఇంట్లో పైసలకు తడుముకునే అవసరం ఉండేది కాదు. కాబట్టే ప్రైమరీ స్కూలునుండే కొడుకు భరమణ్ణను ఏ రకమైన ఇబ్బందీ లేకుండా చదివించేవాడు. భరమణ్ణ ఎస్.ఎస్.సి. పాసై, తుమకూరులో ఇంటర్ కూడా ముగించాడు. తుమకూరు జనరల్ హాస్టల్‌లో చదువుతున్నప్పుడు కాలేజి కార్యక్రమాల్లో దళిత సంఘర్ష సమితి వాళ్ళు జరిపే పోరాట కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. భరమణ్ణ బాగా రాసేవాడు కానీ మాట్లాడేది మాత్రం చాలా తక్కువ. గాంధీ, బుద్ధుడు, బసవణ్ణ, అంబేడ్కర్ లను బాగా చదువడం వల్ల అతడికి పల్లెల్లోని పేదవాళ్ల పట్ల అవగాహన కుదిరింది. అలా ఇంటర్‌లో ఉన్నప్పుడే చిన్న చిన్న కవితలు, వ్యాసాలు రాసి మిత్రుల, ఉపన్యాసకుల శభాష్‌గిరి పొందేవాడు.

ఇంటర్ రెండవ తరగతిలో పాసైన భరమణ్ణకు బెంగళూర్లో చదవాలనే ఆశ పుట్టింది. ఎలాగూ కాలేజి, హాస్టల్ ఉచితమే. తను ఎం.ఎ. చదివి, ఒక మంచి లెక్చరర్ అయ్యి, పల్లెల్లోని దళితులకు అవగాహన కల్పించాలని ఇంటర్ మొదటి సంవత్సరంలోనే కలలు కన్నాడు. తండ్రి చిక్కమారయ్య కూడా “నువ్వెంతవరకైనా చదవరా! నెలకు రెండువేలు ఎంత కష్టపడైనా సరే పంపుతాను” అని ధైర్యం చెప్పాడు. కానీ తన వెంట ఉన్న ఇద్దరు చెల్లెళ్ళ బాధ్యత తండ్రిమీద ఉన్నదని భరమణ్ణకు తెలుసు. కాబట్టి తండ్రికి బరువు కాకుండా చదవాలని నిర్ణయించుకున్నాడు. డిగ్రీకి బెంగళూర్లో చేరిన భరమణ్ణ కష్టపడి చదవసాగాడు. హాస్టల్లో ఇంజనీరింగ్, మెడికల్ చదివే విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళదంతా ఒక గుంపైతే, ఆర్ట్స్ చదివేవాళ్ళది మరో గుంపు. తన రూంమేట్ హనుమంత “భరమణ్ణా! నేను కూడా ఇంజనియరింగో, డాక్టరో చదవాల్సింది. కోర్స్ అయిపోగానే ఏదైనా ఉద్యోగం దొరికేది. ఇక డాక్టరైతే డబ్బులే డబ్బులు. కానీ మా పల్లెటూరివాళ్ళకు ఇవన్నీ ఎవరు తెలియ చెప్పేది? అదీ కాకుండా ఆ ఇంగ్లీషు, లెక్కల తలకాయ నొప్పి ఒకటి. ఎలాగో ఇంతవరకూ వచ్చాం అనేదే పెద్ద పుణ్యం…” అంటూ తన దగ్గర మొరపెట్టుకున్నప్పుడు “నిజమే హనుమంత్ గారూ! పల్లెల్లో పుట్టడమే మనం చేసుకున్నపాపం అనిపిస్తుంది. కానీ పుట్టుక ఎవరి చేతుల్లో ఉంది చెప్పండి?” అంటూ సమాధాన పరిచేవాడు. హస్టల్ లోని చాలా మంది కుర్రాళ్ళు సిగరెట్ తాగడం, బియర్ తాగడం అలవాటు చేసుకున్నా ఒక్క రోజైనా వాటి జోలికి వెళ్ళలేదు భరమణ్ణ.

“నువ్వెలాంటి దళితుడివయ్యా భరమా? సెకెండ్ ఇయర్ డిగ్రీ చదువుతున్నావు. బ్రాహ్మలు, లింగాయతులే బియర్ తాగుతూ, నాన్ వెజ్ తింటూ, సిగరెట్ తాగుతూ మజా చేస్తున్నారు. పో పోయి హైస్కూలు పిల్లల నుండి నేర్చుకో” అంటూ ఏడిపించినా వాటి జోలికి వెళ్లలేదు. ఆదివారం రోజుల్లో, సెలవు రోజుల్లో దళిత సంఘర్ష సమితి పోరాటాలు కానీ, సెమినార్లు కానీ ఉంటే వెళ్ళేవాడు. నాయకులను, ఉపన్యాసకులను పరిచయం చేసుకునేవాడు. ఒకసారి ఒక డి.ఎస్.ఎస్ నాయకుడు “ఏమిటి భరమణ్ణగారూ! ఏ యుగంలో ఉన్నాం మనం! దళితులు అన్ని క్షేత్రాల్లోనూ పెరగాలి. మీ పేరు మార్చుకోండి ముందు. తాతల పద్ధతులు పట్టుకునే వేలాడాలా ఏమిటి? ఒక్కోసారి మన పేర్లే మనలో ఆత్మన్యూనత కలగజేస్తాయి” అని సలహా ఇచ్చారు. కాకతాళీయంగా అప్పుడే కన్నడ తరగతిలో లెక్చరర్ పాఠం చెపుతూ జర్మన్ కవి, నాటక కారుడు బ్రెక్ట్ కావ్యం, నాటకాల గురించి విమర్శనాత్మక ఉపన్యాసం ఇచ్చారు. నాలుగు పిరియడ్లు బ్రెక్ట్ గురించే చాలా లోతుగా వివరించారు. భరమణ్ణకు ఆసక్తి పుట్టి లైబ్రరీకి వెళ్ళి బ్రెక్ట్ గురించిన పుస్తకాలను తెచ్చుకుని పదిహేను రోజులు చదివాడు. బ్రెక్ట్ ఒక అద్భుతమైన రచయిత అనిపించింది. బ్రెక్ట్ ఇండియాలో పుట్టి ఇక్కడి వ్యవస్థ గురించే వ్రాశాడనిపించింది. మన దేశానికి బ్రెక్ట్ని ఎలా అన్వయించాలి  అనే విషయం గురించి ఒక వ్యాసం రాసి లెక్చరర్ గారికి చూపించాడు. ఆయన చాలా మెచ్చుకుని స్వయంగా క్లాసులో దానిని చదివి భరమణ్ణను పొగిడారు. “ఏంట్రా భరమా! నువ్వే బ్రెక్ట్ అన్నట్టు ఫీలవుతున్నావు” అని ఒక క్లాస్మేట్ తరగతిలో ఉడికించినప్పుడు తాను కూడా నవ్వేసి అందర్నీ నవ్వించాడు. అప్పుడే డి.ఎస్.ఎస్. లీడర్ తన పేరు గురించి చేసిన ప్రస్తావన గుర్తుకు వచ్చి, బుర్రలో ఏమో స్ఫురించి మొహంలో నవ్వు అంకురించింది. భరమణ్ణ తన పేరును మార్చుకోవాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు! కాలేజీ దగ్గరగానే ఉన్న కోర్ట్ కాంప్లెక్స్‌కు వెళ్ళి అక్కడ వరసగా కూర్చున్న నోటరీలలో ఒకాయన ముందు కూర్చుని, తన సమస్యను విప్పాడు. అరగంటలో ఒక అఫిడవిట్ తయారయింది. రెండు వందల రుపాయల స్టాంప్ పేపరు మీద ఇలా ప్రకటించుకోబడింది.

“ద్వారన కుంటె గ్రామస్థుడు చిక్కమారయ్య, నరసమ్మ దంపతుల కుమారుడనైన భరమణ్ణ అనే నేను, స్వయంప్రేరితంగా నా పేరును డి.సి. బ్రెక్ట్ అని మార్చుకుంటున్నాను. ఇకనుండి ప్రతి దాఖలా మరియు వ్యవహారాల్లోనూ నా పేరు డి.సి. బ్రెక్ట్ (ద్వారనకుంటె చిక్కమారయ్య కొడుకు బ్రెక్ట్) అనే ఉంటుంది.” నోటరీ ఆయన తమ సంతకం పెట్టి, సీలు వేసి ‘శుభం’ అని తన ఫీజు తీసుకుని టేబుల్ డ్రాయర్లోకి వేసుకున్నారు. అదే రోజు తమ హాస్టల్ ఉన్న ఎం.జి. రోడ్డులోని ప్రసిద్ధ పత్రిక ఆఫీసుకు వెళ్ళి ప్రకటన ఇచ్చి వచ్చాడు. మరుసటిరోజే భరమణ్ణ పేరు ‘బ్రెక్ట్’ అయ్యింది ఫోటోతో పాటు కనిపించింది. బ్రెక్ట్ ఆరు పత్రికలను కొనుక్కుని వచ్చి, ప్రకటన భాగాన్నికత్తరించి పెట్టుకోవడమే కాక అఫిడవిట్‌ది పది కాపీలు చేయించి పెట్టుకున్నాడు. ప్రకటన, అఫిడవిట్ నాలుగు సెట్లు చేసి కాలేజి, యూనివర్సిటీ, ఇంటర్ బోర్డు, ఎస్సెల్సి బోర్డు వాళ్ళకు ఇచ్చి వచ్చాడు. ఇవన్నీ ముగించి మూడు రోజులకు అటెండెన్స్ పిలిచేటప్పుడు బ్రెక్ట్ అని పిలిచినప్పుడు భరమణ్ణ లేచి ‘ఎస్సార్’ అన్నాడు. తరగతిలోని విద్యార్థులందరూ ఆశ్చర్యపడితే, ఉపన్యాసకులు సంగయ్యగారు మాత్రం “పేరు బాగుందయ్యా మిస్టర్ బ్రెక్ట్” అని, తను కాలేజీ చదివేటప్పుడు తన పేరును ‘షేక్స్‌పియర్’ అని మార్చుకునుంటే బాగుండేది కదా అని బాధపడ్డారు!

పేరు మార్చుకున్నందుకు బ్రెక్ట్‌కు బెంగళూర్లో సమస్య ఏం రాలేదు. కానీ ఊళ్ళో మాత్రం ఇబ్బంది ఎదురయ్యింది. బ్రెక్ట్ కాలేజీలోనే ఫైనల్ ఇయర్ లో చదువుతున్న ద్వారనకుంటె పక్క గ్రామం ముద్దయ్యన పాళ్య చంద్రశేఖర్ ఊరెళ్ళినప్పుడు ద్వారనకుంటెకు వెళ్ళి భరమణ్ణ బ్రెక్ట్‌గా మారిన వార్తను అందరికీ బలంగా చేరవేశాడు. బ్రెక్ట్ ఊరికి వెళ్ళినప్పుడు తండ్రి చిక్క మారయ్య “అది కాదురా భరమా! అదేంరా నోరు తిరగని పేరేదో పెట్టుకున్నావట, ఎవర్రా నీకు చెప్పింది?” అని తగులుకుంటే తల్లి నరసమ్మ “కాదురా! మన ఊరు భరమప్ప దేవుడికి, మగ పిల్లాడు పుడితే నీ పేరు పెడతానని మొక్కుకుంటేరా నువ్వు పుట్టింది! అందుకే ఆయన పేరు పెడితే నువ్వు పేరు మార్చుకుంటే ఆ భరమప్ప దేవుడు ఊరుకుంటాడా?” అని కాస్త భయపడింది. ఈ ఇద్దరినీ ఎలాగో సమాధాన పరచాడు. తమ బస్తీలోని కొందరు ‘భరమణ్ణ చర్చి వాళ్ళ నుండి పైసలు జేబులు నింపుకుని కిరిస్తానువాడయ్యాడంట. బెంగళూరుకు పోయి కిలాడీ అయిపోయాడు. వీడి నాన్న ఏం తక్కువవాడా’ అని చెవులు కొరుక్కున్నారు. పక్కింటి బోరయ్య మాత్రం డిసి అంటే గవర్నమెంట్ ఉద్యోగం అనుకుని ఎస్సెస్సి ఫెయిలయిన తన కొడుకుతో “ఆ భరమణ్ణను చూసి బుద్ధి తెచ్చుకోరా. నాలుగు సంవత్సరాలు కష్టపడి చదివి డిసి అయిపోయాడు. ఇక ఈ చిక్కమారయ్య బెంగళూర్లో బంగ్లా కట్టుకుంటాడు. అన్నిటికీ పెట్టి పుట్టాలి” అని వాపోయాడు. బ్రెక్ట్ ఇవన్నిటినీ పట్టించుకోలేదు. పాత, కొత్త తరాల మధ్య నడిచే సంఘర్షణలను అతడు అప్పుడే తెలుసుకున్న వాడయ్యాడు. అదీగాకుండా పల్లెటూళ్ళల్లోని నిరక్షరాస్య  సముదాయాలలో మార్పు తేవాలంటే అనేక సంవత్సరాల పరిశ్రమ అవసరం అని అర్థం చేసుకున్నాడు. కానీ బ్రెక్ట్‌కు నిజమైన సమస్య వచ్చింది కొత్తగా క్యాస్ట్ సర్టిఫికెట్ చేయించాలని తహశీల్దార్ ఆఫీసుకు వెళ్ళినప్పుడు. బ్రెక్ట్‌ను, అతడి అర్జీని చూసిన ఆఫీసు సిబ్బంది అతడిని నేరుగా తహశీల్దార్ గారి దగ్గరికే పంపారు. బ్రెక్ట్ చాలా ధైర్యంగానే తన బ్యాగ్ నుండి కాయితాలు తీసి చూపించి వివరించాడు. తహశీల్దార్ గారు కలెక్టరాఫీసుకు ఫోన్ చేసి కనుక్కుని బ్రెక్ట్ పేరుతో క్యాస్ట్ సర్టిఫికెట్ ఇప్పించారు. ఒక వారంలో అక్కడా ఇక్కడా తిరిగి బ్రెక్ట్ తన ఎస్సెస్సి, ఇంటర్ మార్క్స్ కార్డుల్లో కూడా తన పేరును బ్రెక్ట్‌గా మార్పించాడు.

ప్రియమైన చదువరులారా, ఇప్పుడు మనం వర్తమానానికి వద్దాం. బ్రెక్ట్ హాస్టల్‌కు వచ్చి స్నానం చేసి, టిఫిన్ తినడానికి డైనింగ్ హాలుకు రాగానే అన్ని విభాగాల విద్యార్థులే కాకుండా ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా “ఈ రోజు పేపర్ చదివాము. రియల్లీ యు ఆర్ గ్రేట్. యు డిసర్వ్ ఇట్….”, “బ్రెక్ట్! చాలా ఆనందంగా ఉంది. మన కమ్యునిటీ దేంట్లోనూ తక్కువ కాదు అని నిరూపించారు.”,  “ఇలా మంచి పేరు తెచ్చుకోవడం సులభం కాదు బ్రెక్ట్. ఇంకా ఎక్కువ ఎక్కువ రాసి మరింత పేరు గడించు.”, “మన జాతి సముదాయాల బాధలను ఏ రకమైన సంకోచం లేకుండా, ఆత్మన్యూనత లేకుండా విప్పిచూపాల్సిన సమయం ఇది. అలాంటి పనిని మీలాంటి యువకులు చేస్తున్నది నిజంగా శ్లాఘనీయం” అంటూ అధ్యయన కేంద్రం బ్యాచ్మేటులు, సీనియర్లు చేయి కలుపుతూ మాట్లాడారు. అధ్యయన కేంద్ర సీనియర్ విద్యార్థి నాగరాజ్ “రేపు మన అధ్యయన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ సిద్దేశతో మాట్లాడ్తాను బ్రెక్ట్. ఆయన చాలా సంతోషిస్తారు. ఆయన కూడా మన వాళ్ళే కదా. మీకొక సన్మానం పెట్టుకుని అలాగే ఒక చర్చ కూడా పెట్టుకుందాం. వైస్ ఛాన్సిలర్ గారిని కూడా పిలుద్దాం. వస్తే రానీ” అంటూ సంతోషంగా చెప్పడం బ్రెక్ట్‌లో మరింత చైతన్యం నిండేలా చేసింది. మధ్యాహ్నం లంచ్ ముగించుకుని సిటికి వెళ్ళిన బ్రెక్ట్ అక్కడ ప్రత్యేక సంచిక కొని అక్కడే నుంచుని తీసి చూశాడు. కథ శీర్షిక పక్కన తన ఫోటో, దాని క్రింద తన పేరు చూసుకుని పులకించాడు. నిజంగా ఇలాంటి క్షణం తన జీవితంలో వస్తుందని బ్రెక్ట్ కలలో కూడా భావించలేదు. కథకు వేసిన చిత్రం కూడా చాలా బాగా వచ్చింది. పత్రిక చేతిలోకి తీసుకుని మెట్రో రైలెక్కి హాస్టల్‌కు వచ్చాడు.

మరుసటి రోజు సోమవారం పది గంటలకు అధ్యయన కేంద్రానికి వెళ్లగానే సుమారు విద్యార్థీ విద్యార్థినులు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందనలు తెలిపారు. అలాగే అనూహ్య కూడా చేయి కలిపి అభినందనలు చెప్పింది. అనూహ్య చేయి సోకినప్పుడు బ్రెక్ట్ రోమాంచితుడయ్యాడు. డైరెక్టర్ పిలవగానే ఛేంబర్లోకి వెళ్ళాడు. అక్కడ నాగరాజ్, మరికొందరు సీనియర్ విద్యార్థులు కూర్చునున్నారు. “అద్భుతం బ్రెక్ట్ అద్భుతం” అంటూ డైరెక్టర్ సిద్ధేశ గారు సంబర పడడమే కాక వచ్చే శుక్రవారం నాలుగు గంటలకు సన్మానం మరియు సంవాద కార్యక్రమాన్ని నిర్ణయించేశారు. క్లాసులో అప్పుడపుడు అనూహ్య బ్రెక్ట్ వైపు చూసి నవ్వేది. అతడూ నవ్వేవాడు. అనూహ్యను క్యాంటీనుకు కాఫీకి పిలుద్దామనుకున్నా ఎందుకో ధైర్యం చాలక పోయింది. బహుమతి మొత్తం చేతికి రాగానే ఏదైనా మంచి హోటల్‌కు తీసుకుపోయి లంచ్ చెయ్యలి అనుకున్నాడు. బ్రెక్ట్ డిగ్రీ చదివేటప్పుడు ఎంజి రోడ్ పైనున్న హాస్టల్ లోనే మూడు సంవత్సరాలు ఉన్నాడు. అక్కడంతా తిరిగినా, భోజనం మాత్రం హాస్టల్ కాకుండా పెద్ద హోటళ్ళలో చెయ్యలేదు. ఫైనల్ ఇయర్‌లో ఎప్పుడో ఒకట్రెండు సార్లు డి.ఎస్.ఎస్. నాయకుల బలవంతానికి ఒక గ్లాస్ బీరు తాగి సగం బిరియాని తిన్నాడు.

శుక్రవారం రానే వచ్చింది. అధ్యయన కేంద్రంలో సంబరం తొణికిసలాడింది. అధ్యయన కేంద్రం విద్యార్థులే కాక హిస్టరి, సోషియాలజి, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ విభాగాల కొందరు విద్యార్థులు కూడా రావడంతో హాలు నిండిపోయింది. బ్రెక్ట్‌కు శాలువా కప్పి, యాలకుల హారం వేసి, బుద్ధుడు, బసవణ్ణ, అంబేడ్కర్ ముగ్గురూ ఉన్న ఒక మెమెంటో ఇచ్చి సన్మానం చెయ్యడం జరిగింది. అనూహ్య ముందు వరసలో కూర్చోవడమే కాదు, తన అందమైన ఐఫోన్ నుండి బ్రెక్ట్ ఫోటోలు తీయసాగింది. ఈ సమయంలో విమర్శకుడు సుందర్ కథను గురించి ఆరేడు నిమిషాలు మాట్లాడారు. కార్యక్రమం అద్యక్షత వహించిన డైరెక్టర్ డా.సిద్దేశ్ ఒక ఇరవై నిమిషాలైనా మాట్లాడాలని బ్రెక్ట్‌కు నిర్దేశించారు. లేచి నుంచున్న బ్రెక్ట్‌కు ఎదురుగా నవ్వుతూ కూర్చున్న అనూహ్యను చూసి మాట్లాడే ఉత్సాహం రెట్టింపయ్యింది. బ్రెక్ట్ మాట్లాడసాగాడు.

“పెద్దలారా! మిత్రులారా!! ఇప్పుడు మనం ఒక విచిత్రమైన సన్నివేశంలో బ్రతుకుతున్నాం. వ్యష్ఠీకరణం ఈ రోజు అన్ని క్షేత్రాల మనుషులనూ పీల్చి పిప్పిచేస్తున్నా, శోషిత సముదాయాలను కొత్త లోకాలకు పరిచయం చేస్తుంది అన్నదానికి సందేహం లేదు. మన దేశం లాంటి బహుళత్వదేశం యొక్క పెద్ద సమస్య అంటే జాతి. ఇది మన దేశం యొక్క అభివృద్ధికి కంటకప్రాయమైంది. అలాగే, ఈ జాతి పద్ధతి యొక్క విచిత్ర గుణం ఏమిటంటే భిన్న జాతులు పరస్పరం కొట్టుకోవడమే కాక స్వజాతిలోని ఆర్థిక అసమానతలు ఆ జాతిలోనే అగాధ కందకాలను సృష్టిస్తూ ఉండడం. అన్ని జాతుల్లోనూ శ్రీమంతులు, సుశిక్షితులు తమ జాతిలోని పేదవాళ్లను, నిరక్షరాస్యులను అంటరానివారిగా చూడడం. మన ముందున్నపెద్ద సవాలు ఇదే. రిజర్వేషన్లు, ఇతర సౌకర్యాలు కూడా ఆయా జాతుల్లోని ఉన్నవాళ్ళకే వెళ్తునాయి తప్ప పేదవారికి, పల్లెలవాళ్ళకు దక్కడం లేదు. భారతదేశం యొక్క నేటి పెద్ద ట్రాజెడీ ఇది. కాబట్టి ఉన్నవాళ్ళు లేనివాళ్లకు అవకాశం ఇవ్వడానికి ముందుకు రావాలి. ఇదే మనం సమాజానికి చేయగలిగిన అతి పెద్ద ఉపకారం, సాధన. జాతి పద్ధతిని నిర్మూలించడం అంత సులభం కాదు. అన్ని జాతుల నడుమ ద్వేషాసూయల స్థానంలో ప్రేమ, విశ్వాసాలను నింపాలి. అంతర్జాతీయ వివాహాలను ప్రోత్సహించడంతోపాటు ఈ తరం ప్రతినిధులమైన మనం మగ ఆడ అనే భేదం లేకుండా అంతర్జాతీయ వివాహాలలో పాల్గొనాలి. నిర్క్షరాస్య  లోకానికి మనం జ్యోతులం కావాలి. మన ఆచరణలల్లో, సాహిత్యంలో, ఆర్థిక విషయాలలో మానవత్వాన్ని తొణికించాలి. ఇవన్నీ నిజం కావాలంటే ప్రతి ఒక్కరూ తమ హృదయాల్లో విశ్వాసపు, సమానత యొక్క లాంతరులను వెలిగించి తిరగాలి…” అనూహ్యతో పాటు చాలా ప్రేక్షకులు జోరుగా చప్పట్లు కొట్టడంతో బ్రెక్ట్ తన మాటల అలలను ఆపేసి “నన్ను సత్కరించిన మీ అందరికీ వందనాలు అర్పిస్తున్నాను ” అని మాటలు ముగించి సభకు నమస్కరించి కూర్చున్నాడు. అద్యక్షుడు స్థానం నుండి డా. సిద్దేశ్ “బ్రెక్ట్ ఇప్పటి మన దేశాన్ని తన మాటల్లో అద్భుతంగా విప్పి చూపారు. అతడు భవిష్యత్తులో మన దేశపు ఒక శ్రేష్ఠ రచయిత అవుతారనడం ఆయన మాటల్లో దృఢపడింది…” అంటూ, సంక్షిప్తంగా పొగిడారు. కాఫీ, టిఫిన్లతో సభ ముగిసింది.

బ్రెక్ట్ హాస్టల్‌కు వచ్చేటప్పటికి ఆరున్నరయింది. రూంమేట్ నరసింహమూర్తి, ఇతర బ్యాచ్మేటులు “బ్రదర్ రెడీ అవు. కెంగేరికి వెళ్ళివద్దాం. రుక్మిణీ బార్ అన్డ్ రెస్టారెంట్‌లో చిన్న పార్టీ చేసుకుందాం. భోజనానికి హాస్టల్‌కే వద్దాం. నువ్వు విస్కీ తీసుకుంటావో, బీరు తీసుకుంటావో నీ ఇష్టం. మాకయితే ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. సెలెబ్రేట్ చేసుకోవాల్సిందే” అనగానే బ్రెక్ట్‌కు కూడా ఒక బీరు తాగాలనిపించి “ఓకే బ్రదర్” అని చెప్పి ముఖం కడుక్కుని రెడీ అయ్యాడు. సాయంత్రం కార్యక్రమం తరువాత అనూహ్య తనను చూసుకుంటూ కారు ఎక్కి వెళ్ళింది కళ్ళ ముందు వచ్చి థ్రిల్ కలిగింది.

రుక్మిణి బార్ అండ్ రెస్టారెంట్ ఒక మూల టేబుల్ పైన కూర్చుని మిత్రులు మ్యాన్షన్ హౌస్ విస్కీ తాగుతుంటే, బ్రెక్ట్ కింగ్ ఫిషర్ బీరు గుటకరించాడు. బీరు నురుగలో తల్లి,తండ్రి, తన బంధువులు, అనూహ్య అందరూ తన యశస్సును చూసి నవ్వుతున్నట్టు అనిపించింది. నరసింహమూర్తి, ఒక్కొక్క ప్లేట్ తలకాయ మాంసం, బోటి, లివర్ ఫ్రై ఆర్డర్ చేసి, ఒక గుటక విస్కీని దీర్ఘంగా పొట్టలోకి పంపి “బ్రెక్ట్, నువ్వు అనూహ్యను ఎందుకు ట్రై చెయ్యకూడదు? ఆమెకూ నీపైన చాలా ఇంట్రస్ట్ ఉన్నట్టుంది. క్లాసులో ఎంత మంది ఆమె కోసం ట్రై చేశారో తెలుసా? ఎవరినీ పట్టించుకోలేదు. నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నవ్వడం చూస్తే నాకేమో డౌట్ అనిపిస్తుంది. జనరల్ మెరిట్ కోటాలో సీటు తీసుకుంది తను. చాలా ధనవంతులనిపిస్తుంది. ఈ సిటీ అమ్మాయిలు జాతి గీతి పట్టించుకోరు. ఎం.ఎ. అయిపోగానే నీకు ఏదో ఒక కాలేజిలో లెక్చరర్‌గా దొరికి తీరుతుంది. సాహిత్యంలో ఆసక్తి ఉన్నందున పి.హెచ్.డి కూడా ట్రై చెయ్యొచ్చు” అని చెప్పి సప్లైయర్ తెచ్చిన తలకాయ మాంసం తునకను నోట్లో వేసుకున్నాడు. మిగిలిన ఇద్దరూ “అవును బ్రెక్ట్. అనూహ్య బ్రాహ్మల పిల్ల అనిపిస్తుంది. బ్రాహ్మల పిల్లలకు మన దళిత యువకులంటే చాలా ఆకర్షణ. మైసూరు యూనివర్సిటీలో ఎంత మంది మనవాళ్ళు, బ్రాహ్మలని పెళ్ళి చేసుకుని హాయిగా లేరు చెప్పు. జాతి వ్యవస్థను కాల రాయాలంటే నువ్వు ధైర్యంగా అడుగు ముందుకెయ్యి” అంటూ బ్రెక్ట్ ఎదలో ధైర్యపు విత్తనాలను చల్లి మరొక్క పెగ్ చెప్పుకున్నారు. తలకాయ మాంసం, లివర్ ఫ్రై లతో ఒక బాటిల్ బీరును ఖాళీ చేసాడు బ్రెక్ట్. వద్ద వద్దన్నా మరో పింట్ బీరు చెప్పాడు నరసింహ మూర్తి. గ్లాసుకు బీర్ వంపుకుని నోటికి పెట్టుకోబోయేసరికి మొబైల్ రింగ్ అయింది. కథకు బహుమతిగా వస్తున్న మొత్తం నుండి మూడు నాలుగు వేలలో ఒక టచ్ స్క్రీన్ ఫోన్ తీసుకోవాలని అనుకుంటూ “హలో” అన్నాడు. “హలో బ్రెక్ట్, ఎక్కడున్నారు?..” అనూహ్య ఫోన్. “మేడమ్. హాస్టల్ దగ్గర ఉన్నాను” అబద్ధం చెప్పాడు బ్రెక్ట్. “ఆదివారం బెంగళూర్లో ఉంటారా?” అడిగింది. “ఎందుకు మేడం” అని అడుగుతూ టేబుల్ వదిలి తలుపు వద్దకు నడిచాడు, తన స్నేహితులకు తెలియకూడదని. స్నేహితులు తమ లోకంలో మునిగి ఉన్నారు.

“మళ్ళీ మేడం మేడం ఏంటి? ఆదివారం ఉంటున్నారా లేదా చెప్పండి” కొద్ది కోపంలోనూ మాట మధురంగా వినిపించింది. “ఉంటాను అనూహ్య” ఈసారి జాగ్రత్తగా అన్నాడు బ్రెక్ట్. “అలాగయితే ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు బ్రిగేడ్ రోడ్డులోని మై డ్రీమ్ హోటల్‌కు రండి. నేను మీకు పార్టీ ఇస్తాను. గుడ్ నైట్” అంటూ ఫోన్ పెట్టేసింది. బీర్ మత్తు, అనూహ్య మాటలు బ్రెక్ట్‌ను ఆకాశంలోకి నెట్టాయి. టేబుల్ వద్దకు వచ్చిన వాణ్ణి స్నేహితులు “ఎవరిది బ్రదర్ ఫోను?” అని అడిగితే “ఊరునుండి” అని అబద్ధం ఊదేశాడు.

ఎప్పుడూ ఒక బీర్ కాయకంటే ఎక్కువ తాగని బ్రెక్ట్ ఈ రోజు ఒకటిన్నర బీరు తాగినందుకో, అనూహ్య అనే సతాయిస్తున్న సుందరి తనను ఆదివారం పార్టీకి పిలవడం వల్లనో అతడిలో ఒక రకమైన చెప్పుకోలేని భావనలు పురివిప్పి నర్తించసాగాయి. ఆటోలో హాస్టల్‌కి వచ్చేసిన తరువాత భోంచేసి పడుకున్న బ్రెక్ట్‌కు నిద్ర తొందరగా ఆవరించింది. బ్రెక్ట్ నిద్రలో ఒక అపురూపమైన కల పడింది. మూడవ సెమిస్టర్ పరీక్షలను ముగించి పదిహేను రోజుల సెలవుల్లో మామూలుగానే బ్రెక్ట్ తన పల్లెకు వచ్చాడు. ఎందుకో ఈ సారి బ్రెక్ట్ మనసు తన ఇంటిని, వీధిని, ఊరిని కొత్తగా పరిశీలిస్తోంది. ఈ మొత్తం ఊరినే ఇక్కడినుండి తీసుకుని వెళ్ళి బెంగళూరులోని తన యూనివర్సిటీ పక్కన పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చి, తన ఆలోచనకు తానే నవ్వుకుని గమ్మునయిపోయాడు. ఈ ఆలోచనకు నేపథ్యం అనూహ్య ఉండవచ్చునా? ఇప్పుడు తన తలిదండ్రులతో పాటు ఊరివాళ్ళంతా తనను భరమణ్ణ అని పిలవకుండా బ్రెక్ట్ అనే పిలుస్తున్నారు. ఆ రోజు పదకొండు గంటలకంతా చద్దన్నం తిని బ్రెక్ట్ బర్రెలు మేపడానికి పొలం వైపు వెళదామని ఇంటి ముందు కట్టేసిన బర్రె పగ్గం విప్పుతున్నాడు. అదే సమయానికి ఇంటి ముందు ఒక ఎరుపు మారుతి కారు వచ్చి నుంచుంటుంది. బ్రెక్ట్ చూస్తుండగానే అనూహ్య దిగుతుంది! బ్రెక్ట్ నోట్లోనుండి మాటలే రాకుండా పోతాయి. ఆశ్ఛర్యపడి నిలుచున్న బ్రెక్ట్‌ను చూస్తూ “హాయ్ బ్రెక్ట్! ఎందుకో నిన్ను చూడాలనిపించింది. యూనివర్సిటీకి ఫోన్ చేశాను. అడ్రస్ ఇచ్చారు. నేరుగా కారెక్కి వచ్చేశాను. ఇలాంటి అనిరీక్షితాలు ఎంత సంతోషాన్నిస్తాయో తెలుసా? నాకు పల్లెలంటే ప్రాణం. కాబట్టి నీతో ఒక రోజు గడిపి వెళ్దామని వచ్చాను” అంటూ బ్రెక్ట్ ఇంట్లోకి ప్రవేశించి బ్రెక్ట్ అమ్మ చాప పరచడానికి ముందే నేలపై కూర్చుంది. చీరలో అనూహ్య మరింత అందంగా మెరిసిపోతోంది. వాడ వాళ్ళంతా వచ్చి తొంగి తొంగి చూసి వెళ్తున్నారు. కొందరిని అనూహ్య తానే పరిచయం చేసుకుని మాట్లాడుతోంది. “అమ్మ బాబోయ్! అదెంత రూపవతి ఈ అమ్మాయి! ఇంతవరకూ ఇలాంటి అందగత్తె మన వాడలో అడుగు పెట్టడం చూడనే లేదు…”, “అబ్బబ్బ! ఏ దేశం రాజకుమారో కదా! మన భరమణ్ణ అదేం మాయ చేశాడో….. తనే వెతుక్కుంటూ వచ్చేసింది అంటే…..”, “మన చిక్కమార ఇంటికి బంగారం లాంటి పిల్ల కాలుపెట్టింది. ఇక వాడి ఇల్లు బంగారమే..”, “బ్రాహ్మల పిల్ల మాదిరిగా ఉంది. మనవాళ్ళు బ్రాహ్మలను ముట్టుకోరాదు. భరమణ్ణ కాలి బూడిదవుతాడు చూస్తూండి”, “అదేం అదృష్టం చేసుకున్నాడో భరమణ్ణ.. పాలలో చేయి ముంచి ముట్టుకునేలా ఉంది….” ఇలాగ వాడ ఆడవాళ్ళు మాట్లాడుకోసాగారు. వాడలోని యువకులంతా “ఏ హీరోయిన్‌కు తక్కువ లేదు గురూ! మన భరమ గాడు లాటరీ కొట్టాడు” అంటూ కడుపు మంట వెళ్ళగక్కారు.

అనూహ్య బ్రెక్ట్‌తో కలిసి ఊరు, పొలాలు అంతా తిరిగింది. బ్రెక్ట్ తల్లి నరసమ్మ రెండు కిలోలు కందిపప్పు తెప్పించి, ఏలకులు, కొబ్బరి తురుము వేసి ఘుమఘుమలాడే బొబ్బట్లు చేసింది. బొబ్బట్ల వాసన ఊరంతటినీ అలుముకుని అనూహ్యకు సంబరాల స్వాగతం కోరినట్లు అనిపించింది. వాడలోని చిన్నపిల్లలు అనూహ్య ఎర్ర కారు అద్దాల్లో తమ ముఖాలు చూసుకుని క్రాపులు దిద్దుకోసాగారు. బ్రెక్ట్ చెల్లెళ్ళు తమకు అందమైన వదిన దొరికిందని సంబరపడి పోసాగారు. అనూహ్య బర్రె నేతితో మూడు బొబ్బట్లు తినింది. రాత్రి చీకటి గది మాదిరిగా ఉన్న వంటింట్లో చాప పైన దుప్పటి వేసి అనూహ్యకు పడుకోవడానికి ఏర్పాటు చేసి బ్రెక్ట్ తోపాటు అందరూ మధ్యగదిలో పడుకున్నారు. బ్రెక్ట్ తల్లి “ఒరే! అమ్మాయి ఒక్కతే భయపడుతుందేమో! నువ్వూ అక్కడే వెళ్ళి నిద్రపో” అని పంపింది. బ్రెక్ట్ వెళ్ళి అనూహ్య పక్కన కొంచెం చోటు వదలి పడుకున్నాడు. అంతసేపటికి అనూహ్య నిద్రపోయింది. అతడికీ మగత ఆవరించింది. అప్పుడు అనూహ్య అకస్మాత్తుగా అతణ్ణి కౌగిలించుకుని ముద్దులు పెట్టసాగింది. ఓహ్! బ్రెక్ట్‌కు స్వర్గంలో తేలుతున్న అనుభవం కలిగి అతడు కూడా స్పందించసాగాడు. ఇద్దరూ నగ్నంగా అయ్యి ఒకరికొకరు గట్టిగా పట్టుకున్నారు. అప్పుడు అకస్మాత్తుగా బ్రెక్ట్ దేహం చల్లబడింది. అరే! అనూహ్య బదులుగా ఒక పాము తన దేహాన్ని చుట్టుకుని కనిపించింది. పాముకు అనూహ్య మొహం. దానికి కోరపళ్ళు కూడా. తనను మింగడానికి నోరు తెరిచి బుసకొడ్తోంది. ఆ పాము తన కాళ్ళు చేతులు కట్టేసింది. బ్రెక్ట్ భయంతో బిగ్గరగా కేకపెడ్తూ లేచి కూర్చున్నాడు. లేచి కూర్చున్న వాడికి హాస్టల్ రూము మంచంపైన తానున్నది తెలిసి వస్తుంది. రూం మేట్ నరసింహమూర్తికి కూడా మెలకువ వచ్చి “ఏంటి బ్రదర్! అంత జోరుగా కలవరించావు? ఈ ఎనిమిది నెలలలో నువ్వు ఇలా ఎప్పుడూ నిద్రలో అరవలేదు. బహుశ రుక్మిణి బార్ ఎఫెక్టేమో?” అంటూ ఆవలించి నిద్రలోకి జారుకున్నాడు. కలలో సర్పం కనబడితే అది కామానికి ప్రతీక అని ఎక్కడో చదివింది బ్రెక్ట్‌కు గుర్తుకు వచ్చింది. నరసింహ మూర్తి గురకలు పెడుతున్నాడు. బ్రెక్ట్ బాత్రూమ్‌కు వెళ్ళొచ్చి పడుకున్నాడు. నిద్ర రావడం లేదు. అనూహ్యను తలచుకుంటూ భళ్ళుమన్నాడు. నీరసం వచ్చినట్టై కొద్ది సేపట్లో నిద్రలోకి వెళ్ళిపోయాడు.

ఆదివారం ఒంటి గంటకు కరెక్ట్‌గా బ్రెక్ట్ బ్రిగేడ్ రోడు మైడ్రీమ్ హోటల్ ముందు నిలబడ్డాడు. డిగ్రీ చదివేటప్పుడు ఈ హోటల్ ముందు అదెన్ని సార్లు చుట్టినా లోపలికి వెళ్ళలేదు. ఐదు నిమిషాల్లో అనూహ్య ప్రత్యక్షం అయింది. జీన్స్ ప్యాంట్, టాప్ గౌనులో కన్నుల పండువగా ఉంది. ఆమె పక్కన ఆమె అంతే అందమైన ఒక యువకుడు. “బైదిబై బ్ర్రెక్ట్! ఇతడు నా మేనమామ కొడుకు కార్తీక్” అంటూ అతడ్ని పరిచయం చేసింది. యువకుడు చేయి కలుపుతూ “హలో మిస్టర్ బ్రెక్ట్! మీ గురించి అనూహ్య అంతా చెప్పింది. ప్లెషర్ టు మీట్యూ” అన్నాడు. ముగ్గురూ ఒక టేబుల్ అలంకరించారు. హోటలంతా ఉత్త యువతీ యువకులే కనిపించారు. అబ్బాయిలు, అమ్మాయిలు అనే భేదం లేకుండా బీరు తాగుతూ తమ లోకాల్లో విహరిస్తున్నారు. “బీరు తాగుతారా! ఫ్రెష్ డ్రాట్ బీరు” కళ్ళు విపారుస్తూ అడిగింది. “ఊ” అన్నాడు బ్రెక్ట్. మూడు మగ్గులు బీర్లు వచ్చాయి. జతగా ఫిష్ ఫ్రై. చియర్స్ చెప్పుకుని వాళ్ళిద్దరూ బీరు మొదలుపెట్టిన తరువాత బ్రెక్ట్ కూడా బీర్ తాగసాగాడు. అంత రుచిగా ఉన్నబీర్ బ్రెక్ట్ ఎప్పుడూ త్రాగలేదు. సగం బీరు ఖాళీ చేశాల అనూహ్య “మీ ఒరిజినల్ పేరేమిటి బ్రెక్ట్” అంటూ నవ్వింది. బ్రెక్ట్ ఉలిక్కిపడ్డాడు. ఇలాంటి ప్రశ్న ఎదురవుతుందని తను అనుకోనేలేదు. చిన్నగా చెమటలు రాసాగాయి. “ఇష్టం లేకపోతే చెప్పకండి” అంటూ మళ్ళి నవ్వింది. మగ్ లోని పావుభాగం బీరును ఒక గుక్కలో ఖాళీ చేసిన బ్రెక్ట్ “భరమణ్ణ” అని నవ్వాడు.

“మిస్టర్ భరమణ్ణ ఉరఫ్ బ్రెక్ట్! నేను కూడా ఎస్సీ అండీ. నా అమ్మ బ్రాహ్మిన్. నాన్న ఎస్సీ. సో అయామ్ వెరిమచ్ ఎస్సీ. కానీ నేను ఏ సౌకర్యాలను ఉపయోగించుకోలేదు. ఈ కార్తీక్ నా అమ్మ అన్న కొడుకు. రెండు సంవత్సరాల క్రితం బ్యాచ్ లో యుపిఎస్సి క్లియర్ చేసి, కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌కు సెలెక్ట్ అయ్యాడు. ఒక నెల క్రిందట ట్రైనింగ్ అంతా అయిపోయి ముంబైకి పోస్టింగ్ ఆయింది” అంటూ సప్లయర్‌ను పిలిచి మరో మూడు మగ్గుల బీర్ చెప్పింది. బ్రెక్ట్ తన ఎదురుగా కూర్చున్న కార్తీక్‌కు “కంగ్రాట్స్ సర్” అంటూ షేక్ హ్యాండిచ్చాడు. అనూహ్య కొనసాగిస్తూ “బ్రెక్ట్ ఉరుఫ్ భరమణ్ణ! మేమిద్దరం మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాము. తరువాతి నెలలో పెళ్ళి. ఇతడు ట్రైనింగ్‌కు వెళ్ళాడని టైం పాస్ కోసం ఎం.ఎ. చేరాను. పెళ్లయినాక నేను తనతో ముంబైకి వెళ్ళిపోతాను. ఇంకొక్క ముఖ్యమైన విషయం. నేను ఎస్సీ. కార్తిక్ బ్రాహ్మిన్. సో మా ఇద్దరిది ప్యూర్లీ ఇంటర్ క్యాస్ట్ పెళ్ళి. మీ కథ చదివినప్పుడు మా గురించే అనిపించింది. చాలా థ్రిల్ అనుభవించాను. మీ ఆశయాలన్నీ నేను ఫాలో అవుతున్నాను. మీరొక రకంగా నా గురువులే అయిపోయారు….” అనూహ్య, కార్తీక్ నవ్వారు. ఫిష్ కరీ రైస్ చెప్పారు భోజనానికి. కార్తీక్ కార్డుతో బిల్ ఇచ్చేశాడు. బయటికి వచ్చినప్పుడు అనూహ్య “బ్రెక్ట్. నేను రేపటినుండి తరగతులకు రాను. డైరక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పేశాను. మీకు భాష పైన మంచి పట్టుంది. మనసు పెడ్తే మీరు కూడా సర్వీస్ కమిషన్ పరీక్షలు పాసు కావచ్చును. ఒకసారి ప్రయత్నించండి. పెళ్ళి చాలా సింపుల్‌గా చేసుకుంటున్నాము. ముంబైలో. బై బై….” అంటూ కార్తీక్ చెయ్యి పట్టుకుని నడవసాగింది. కార్తీక్ కూడా బ్రెక్ట్ వైపు చెయ్యూపి నడవసాగాడు. బ్రెక్ట్ తలకాయలోనిదంతా ఖాళీ అయినట్టనిపించి, ఒక నర జంతువు మాదిరిగా మెట్రో రైలు స్టేషన్ వైపు పాకసాగాడు.

సమాప్తం

కన్నడ మూలం: కేశవరెడ్డి హంద్రాళ

తెలుగు అనువాదం: చందకచర్ల రమేశ బాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here